Wednesday 12 June 2024

T-205. రాతిఁ బతిమ సేసిన రామచంద్ర

 అన్నమాచార్యులు

205. రాతిఁ బతిమ సేసిన రామచంద్ర

రామభక్తి.

 

కీర్తన సంగ్రహ భావము: 

పల్లవి: "రాతిని నాతిగా చేయగలిగినటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రా నన్ను నీ చేతిలో సమర్పించు కుంటున్నాను. నువ్వేం చేద్దామనుకుంటే అది చేయి" అని అన్నమాచార్యులవారు తన స్వతంత్రమంతటినీ రామచంద్రునికి అప్పచెప్పారు. 

చరణము 1: రామచంద్ర మీకు అపకీర్తి కలిగేటట్టుగా నింద వచ్చేటట్టుగా యథార్థముగా నన్ను దూరంగా పెట్టి మసలుకోకు. నీపై ఎంతో ప్రేమతో ఉన్నాను. నన్ను ఈ ప్రపంచపు దుఃఖంలో ముంచివేయకు రామచంద్ర. 

చరణము 2: విన్నపాలు వేలకొద్ది ఎలా రామచంద్ర? నా కన్నులకు నీవేకదా గురి! (నిన్ను కాక వేరెవరినీ ఆశ్రయించడం లేదు అని అర్ధం.) నన్ను వదిలిపెట్టకుండా ఉండు రామచంద్ర. నన్నే ఎంచుకొని ఉండరాదా రామచంద్ర. 

చరణము 3: రామచంద్రా నా మర్మాలు అన్నింటినీ దాచుకోకుండా నీకు చెప్పేసాను. అపరిమిత బలముగల రామచంద్రా ఇక్కడ (ఈ లోకములో) మనిద్దరినీ కలిపేది ఒక్క సమయమే కదా! ఆ వైపు అనగా నేను మరణించిన తర్వాత మీ ఇంటి ముందటి సుగంధం ముక్కలాగా నేను నిల్చుంటాను. నీవు స్వయముగా వెంకటాద్రికి చెందినవాడివి రామచంద్రా.                  

ఉపోద్ఘాతం: అన్నమాచార్యుల వారు తనను తాను ఒక స్త్రీగా ఊహించుకుని రామచంద్రునికి చేసుకున్న విన్నపం. 

 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు 262-5  సంపుటము: 3-359

 

రాతిఁ బతిమ సేసిన రామచంద్ర నీ-
చేతిలోనిదాన నింతే శ్రీరామచంద్ర  ॥పల్లవి॥
 
వట్టిరట్టు సేయ కిఁక వద్దు రామచంద్ర
నెట్టన నే దూరనోప నిను రామచంద్ర
వొట్టితిఁ బ్రేమము నీపై వో రామచంద్ర మమ్ము
వట్టిజాలిఁ బెట్ట కిఁక వద్దు రామచంద్ర         ॥రాతిఁ॥

విన్నపాలు వేయునేల విను రామచంద్ర మా-
కన్నులకు నీవె గురి ఘనరామచంద్ర
యెన్నిక నన్నుఁ బాయకు మిఁక రామచంద్ర
నిన్ను నన్ను నెంచుకొమ్మీ నీవు రామచంద్ర         ॥రాతిఁ॥
 
ఆయము లంటితివి నెయ్యపురామచంద్ర వొక్క-
పాయమే ఇద్దరికిని బలురామచంద్ర
ఆయెడ వావిలిపాటి హరిరామచంద్ర
చేయార శ్రీ వేంకటాద్రిఁ జెందితి రామచంద్ర          ॥రాతిఁ॥ 

 

Details and explanations:

రాతిఁ బతిమ సేసిన రామచంద్ర నీ-
చేతిలోనిదాన నింతే శ్రీరామచంద్ర        ॥పల్లవి॥ 

భావము: "రాతిని నాతిగా చేయగలిగినటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రా నన్ను నీ చేతిలో సమర్పించు కుంటున్నాను. నువ్వేం చేద్దామనుకుంటే అది చేయి" అని అన్నమాచార్యులవారు తన స్వతంత్రమంతటినీ రామచంద్రునికి అప్పచెప్పారు. 

వట్టిరట్టు సేయ కిఁక వద్దు రామచంద్ర
నెట్టన నే దూరనోప నిను రామచంద్ర
వొట్టితిఁ బ్రేమము నీపై వో రామచంద్ర మమ్ము
వట్టిజాలిఁ బెట్ట కిఁక వద్దు రామచంద్ర    ॥రాతిఁ॥ 

ముఖ్యపదములకు అర్ధములు: రట్టు = అపకీర్తి, నింద​; నెట్టన = అనివార్యముగా, నిజముగా, యథార్థముగా; వొట్టితిఁ = పట్టితిఁ; వట్టిజాలిఁ బెట్ట =  వట్టి దుఃఖపడునట్లు. 

భావము: రామచంద్ర మీకు అపకీర్తి కలిగేటట్టుగా నింద వచ్చేటట్టుగా యథార్థముగా నన్ను దూరంగా పెట్టి మసలుకోకు. నీపై ఎంతో ప్రేమతో ఉన్నాను. నన్ను ఈ ప్రపంచపు దుఃఖంలో ముంచివేయకు రామచంద్ర. 

విన్నపాలు వేయునేల విను రామచంద్ర మా-
కన్నులకు నీవె గురి ఘనరామచంద్ర
యెన్నిక నన్నుఁ బాయకు మిఁక రామచంద్ర
నిన్ను నన్ను నెంచుకొమ్మీ నీవు రామచంద్ర   ॥రాతిఁ॥ 

ముఖ్యపదములకు అర్ధములు: బాయకు మిఁక = వదలిపెట్టవద్దు; నన్ను నెంచుకొమ్మీ  = నన్నే ఎంచుకో. 

భావము: విన్నపాలు వేలకొద్ది ఎలా రామచంద్ర? నా కన్నులకు నీవేకదా గురి! (నిన్ను కాక వేరెవరినీ ఆశ్రయించడం లేదు అని అర్ధం.) నన్ను వదిలిపెట్టకుండా ఉండు రామచంద్ర. నన్నే ఎంచుకొని ఉండరాదా రామచంద్ర. 

వివరణము: నువ్వు ఎంచుకోకపోతే నా అంతటికి నేను  కనుగొనలేను. కాబట్టి నువ్వే నన్ను రక్షించు. 

ఆయము లంటితివి నెయ్యపురామచంద్ర వొక్క-
పాయమే ఇద్దరికిని బలురామచంద్ర
ఆయెడ వావిలిపాటి హరిరామచంద్ర
చేయార శ్రీ వేంకటాద్రిఁ జెందితి రామచంద్ర   ॥రాతిఁ॥ 

ముఖ్యపదములకు అర్ధములు: ఆయము లంటితివి = నా మర్మములన్నీ నీకు చెప్పేసితిని; నెయ్యపు = స్నేహశీలి; పాయమే = వయస్సే, సమయమే; బలు = సమాసమందు బలువు శబ్దమున కేర్పడు రూపము; వావిలిపాటి = ఒక సుగంధపు మొక్కలాగ​; చేయార = చేతులార. 

భావము: రామచంద్రా నా మర్మాలు అన్నింటినీ దాచుకోకుండా నీకు చెప్పేసాను. అపరిమిత బలముగల రామచంద్రా ఇక్కడ (ఈ లోకములో) మనిద్దరినీ కలిపేది ఒక్క సమయమే కదా! ఆ వైపు అనగా నేను మరణించిన తర్వాత మీ ఇంటి ముందటి సుగంధం ముక్కలాగా నేను నిల్చుంటాను. నీవు స్వయముగా వెంకటాద్రికి చెందినవాడివి రామచంద్రా. 

వివరణము: మొదటి పల్లిలో పంక్తిలో తన దగ్గర రహస్యాలేమీ లేవు అని తాను స్వచ్ఛమైన వాడిని అని ప్రకటించుకున్నారు అన్నమాచార్యులు. అనంతమగు ఈ జీవన ప్రయాణంలో మానవులకు స్పృహ కలుగుతున్నది కొద్దిపాటి కాలము మాత్రమే (భగవద్గీత 2-28​).  రెండవ పంక్తిలో తనకు కలిగిన ఈ కొద్దిపాటి సమయంలో కూడా తనను దూరము చేసి వుండవద్దు అని వేడుకొనుచున్నారు.  అంతే కాదు తాను మరణించిన తర్వాత కూడా ఇదే రకంగా ఒక సుగంధ మొక్కలాగ హరి కీర్తనలను సువాసనలను వెదజల్లుతూ వ్యాపింపజేస్తూ ఉంటాను అంటున్నారు.

-x-x-x-

 

Saturday 1 June 2024

T-204. పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు

 అన్నమాచార్యులు

204. పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు

చేయదగు వ్యవసాయమే హరిభక్తి.

కీర్తన సంగ్రహ భావము: 

పల్లవి: ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు బహువిధములైన కార్యములు చేపట్టు మన వంటి వారిని విమర్శిస్తున్నారు ఘనులైనటువంటి వారు తామరాకు మీద నీటి బొట్టులాగా కార్యములందు అంటీ అంటనట్లుగా ఉందురు. 

చరణము 1: రైతులు మొదటగా చిట్టడివితో నిండిన నేలను నరికివేసి, చదునుచేసి, ఆపై  పొలము దున్ని  క్రింది మట్టిని పైకి తెచ్చి పొలమును వ్యవసాయము చేయుటకు సిద్ధము చేసికొన్నట్లు, సాధకులు చిత్తము లేదా మనసు అను  క్షేత్రమును కర్షకుని వలె మూలమూలలా కదిలించి, శుద్ధి చేసి తపస్సు అను సేద్యము చేయుటకు ఏర్పాట్లు చేసుకోవలెను. రైతులు మంచి వాన పడిన అదను చూసి విత్తునట్లు,  వివేకులు అదను చూసి హరిభక్తిని నాటి శాంతము అను మహా సాగరములో తమను తాము మరచునట్లు అంకితమై వ్యవసాయము చేయుదురు. 

చరణము 2: వ్యవసాయదారులు తమ పొలంలో పైరుతోపాటు మొలకెత్తే కలుపు గడ్డిని తవ్వి తీసివేస్తారు. పంటని నాశనంచేసే పశువులనుంచి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ ముండ్లచెట్లు పెడతారు. చేను బాగా పెరగటానికి ఎరువులు వేస్తారు. ఈ రకంగా వ్యవసాయదారులు పంటలను రక్షించుకొంటారు. ఇదే రకముగా ప్రయత్న శీలులు తమ మనస్సను పొలంలోని కామము, క్రోధము అను కలుపును తీసివేస్తారు. లౌకిక వాంఛలనుంచి తమ జ్ఞానానికి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ వైరాగ్యమను ఆవరణ (వెలుగు) పెడతారు. ఆచారము విధులను మాయలు కపటముల నుండి విముక్తి చెందుటకు భౌతికముగాను, మానసికముగాను పనులను వదలి సన్యాసమను శరణాగతిని ఎరువులుగా వేసి జ్ఞానమను చేనును ఆధ్యాత్మిక వ్యవసాయదారులు రక్షించుకొందురు.   

చరణము 3: ఎక్కడ చూసిన శ్రీ వెంకటేశ్వరుడున్నాడు అని గ్రహించిన వివేకులు యజ్ఞము చేయగా మిగిలిన శిష్టాన్నములు మాత్రం అనుభవించి దానితోనే సంతృప్తిని చెందుదురు.  తమను తాము ఆ సన్నని ఇరుకు మార్గములో ఇడుకొని వుందురు దైవకృప కలిగిన ఆ పుణ్యాత్ములు.                  

ఉపోద్ఘాతం: అన్నమాచార్యుల వారు మనిషి జీవనమును వ్యవసాయంతో పోల్చి ఏ రకంగా అయితే కృషీవలుడు తన పంటను కాపాడుకుంటాడో అదే రకముగా హరిభక్తి సాధకులు చిత్తమను క్షేత్రములో పాపమును కలుపు మొక్కలు, బంధములు అను పాతుకుపోయిన వ్రేళ్ళను పెలికివేసి అజ్ఞానమను మట్టిని పైకి క్రిందికి కలిపి మనసు అను క్షేత్రమును సిద్ధం చేయుదురు అన్నారు. సత్యసాధనకు వివేకులు అవలంభించు మార్గమును అతి నేర్పుగా వివరించారు. 

అధ్యాత్మ కీర్తన:
అన్నమాచార్యులు
రాగిరేకు 262-5  సంపుటము: 3-359 
పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు
అంటిముట్టి యిట్లఁ గాపాడుదురు ఘనులు ॥పల్లవి॥
 
పొత్తుల పాపమనేటి పోడు నఱకివేసి
చిత్తమనియెడు చేను చేనుగా దున్ని
మత్తిలి శాంతమనే మంచివాన వదనున
విత్తుదురు హరిభక్తి వివేకులు  ॥పంట॥ 
 
కామక్రోధాదులనే కలువు దవ్వివేసి
వేమరు వైరాగ్యమనే వెలుఁగు వెట్టి
దోమటి నాచారవిధుల యెరువులువేసి
వోముచున్నారు జ్ఞానపుఁ బై రుద్యోగజనులు ॥పంట॥
 
యెందు చూచిన శ్రీవేంకటేశుఁ డున్నాఁడనియెడి-
అందిన చేని పంట లనుభవించి
సందడించి తమవంటి శరణాగతులుఁ దాము
గొంది నిముడుకొందురు గురుకృప జనులు ॥పంట॥

 

Details and explanations:

పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు
అంటిముట్టి యిట్లఁ గాపాడుదురు ఘనులు ॥పల్లవి॥ 

ముఖ్యపదములకు అర్ధములు: పంటలభాగ్యులు = కర్మఫలములను కోరువారు; వీరా = వీరు కాదు; బహువ్యవసాయులు = అనేకానేక బహువిధములైన కార్యములు చేపట్టువారు. 

భావము: ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు బహువిధములైన కార్యములు చేపట్టు మన వంటి వారిని విమర్శిస్తున్నారు ఘనులైనటువంటి వారు తామరాకు మీద నీటి బొట్టులాగా కార్యములందు అంటీ అంటనట్లుగా ఉందురు. 

వివరణము: ఇది చూస్తే భగవద్గీతలోని క్రింది రెండు వాక్యములపై లోతుగా అన్నమాచార్యులు ఆలోచించమంటున్నారు. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన!।  బహుశాఖా హ్యనంతా బుద్ధయోవ్యవసాయినామ్ (2-41) భావము:  ఓ అర్జునా! నిశ్చయించి అందిపుచ్చుకొనుటకు మనస్సుకు ఒకే ఒక మార్గము కలదు. చంచలమైన మనస్సు మాత్రమే అసంఖ్యాకమైన ఎంపికలను అంచనా వేస్తూ తడబడిపోతుంది. 

ఒక్క క్షణం కింద ఇచ్చిన బ్రూస్ లీగారి మాటలు పరీక్షించండి పరికించండి. 10,000 క్లిక్కులు నేర్చుకున్నవాడికి నేను భయపడను కానీ ఒకే క్లిక్కు పదివేల సార్లు సాధన చేసిన వాడికి జంకుతాను. దైవము విషయంలో కూడా ఇదే నిజము. 


పంటలభాగ్యులు: బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ||(2-49)||   కర్మ ఫలమును గోరువారు అల్పులు. పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు = సామాన్యులందరూ ఈ రకంగా కాని కార్యములలో నిమగ్నులై తమసమయమును వృథా చేసుకుంటున్నారు అని అన్నమాచార్యుల భావము. 

పొత్తుల పాపమనేటి పోడు నఱకివేసి
చిత్తమనియెడు చేను చేనుగా దున్ని
మత్తిలి శాంతమనే మంచివాన వదనున
విత్తుదురు హరిభక్తి వివేకులు     ॥పంట॥

ముఖ్యపదములకు అర్ధములు: పొత్తుల = ఉమ్మడిగా; పోడు= తుప్పలు మున్నగునవి పెరిఁగియున్న యడవినేల, పొదలు నిండిన చిట్టడవి; మత్తిలి = మత్తుగొను ( అనగా చేయుచున్న​ దానిలో మత్తుగొన్నట్లు అంకితమైపోవు); మంచివాన = పుణ్యము; వదనున = నేలయందు తడి చొచ్చునంతటి వర్షము పడినపుడు, అదను చూచి; 

భావము: రైతులు మొదటగా చిట్టడివితో నిండిన నేలను నరికివేసి, చదునుచేసి, ఆపై  పొలము దున్ని  క్రింది మట్టిని పైకి తెచ్చి పొలమును వ్యవసాయము చేయుటకు సిద్ధము చేసికొన్నట్లు, సాధకులు చిత్తము లేదా మనసు అను  క్షేత్రమును కర్షకుని వలె మూలమూలలా కదిలించి, శుద్ధి చేసి తపస్సు అను సేద్యము చేయుటకు ఏర్పాట్లు చేసుకోవలెను. రైతులు మంచి వాన పడిన అదను చూసి విత్తునట్లు,  వివేకులు అదను చూసి హరిభక్తిని నాటి శాంతము అను మహా సాగరములో తమను తాము మరచునట్లు అంకితమై వ్యవసాయము చేయుదురు. 

వివరణము: ఇక్కడ అన్నమాచార్యులవారు  రైతులకు సాధకులకు కృషి ఒక్కటే అన్నారు.  రైతులు నిజమగు పోలములోను దుక్కి దున్ని వ్యవసాయం చేయదురు. హరిభక్తి సాధకులు చిత్తమను క్షేత్రములో పాపమును కలుపు మొక్కలు, బంధములు అను పాతుకుపోయిన వ్రేళ్ళను పెలికివేసి అజ్ఞానమను మట్టిని పైకి క్రిందికి కలిపి మనసు అను క్షేత్రమును సిద్ధం చేయుదురు. పైన పేర్కొన్న వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన అన్న దానికి వివరణాత్మకముగా ఈ కీర్తనను వ్రాసారు అనిపిస్తుంది. 

శాంతమనే మంచివాన వదనున విత్తుదురు హరిభక్తి వివేకులు’ = ఇక్కడ శాంతము అనగా ఆలోచనలు అను తరంగములు అను కుదుపులు లేని స్థితి హరిభక్తి అనే మంచి విత్తనాలు నాటుటకు అనుకూలమైన సమయం. మనం ప్రస్తుతము వున్న స్థితిలో క్షణక్షణం ఆలోచనలు అను కెరటములు మన మనసులను నిలకడ లేకుండా చేయుచున్నవి ఆచార్యుల వుద్దేశం. 

మత్తిలి = మత్తుగొను అనగా చేయుచున్న​ దానిలో మత్తుగొన్నట్లు అంకితమైపోవు అన్నది ఆచార్యులవారు మానవుడు తానున్న ఇప్పటి స్థితిలో హరిభక్తిని చేకొనలేడు అన్న ఉద్దేశ్యంతో చెప్పారు. అనగా తాను చేయుచున్న సత్ప్రవర్తన అను యాగములో పూర్తిగా నిమగ్నుడై ఈ భౌతిక లోకంతో సంబంధం తెంచుకుని మనసను క్షేత్రంలో హరిభక్తిని నాటగలడు. ఇక్కడ ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక / కమ్మి హరి దాసుఁడు గావచ్చునా అన్న మాటలు గుర్తు తెచ్చుకొనుట సందర్భోచితముగా ఉండును. 

కామక్రోధాదులనే కలువు దవ్వివేసి
వేమరు వైరాగ్యమనే వెలుఁగు వెట్టి
దోమటి నాచారవిధుల యెరువులువేసి
వోముచున్నారు జ్ఞానపుఁ బై రుద్యోగజనులు    ॥పంట॥ 

ముఖ్యపదములకు అర్ధములు : వేమరు = పలుమాఱు; వెలుగు= పశువులు లోనగునవి రాకుండా చేను చుట్టూ ముండ్లచెట్లు పెట్టి పెంచు ఆవరణము; దోమటి = అన్నము, ఆహారము, కపటము, మాయ​; ఓము = కాపాడు, పోషించు; బైరుద్యోగజనులు = (భౌతికముగా/మానసికముగా) పనిలేనివారు =శరణాగతి చేయువారు. 

భావము: వ్యవసాయదారులు తమ పొలంలో పైరుతోపాటు మొలకెత్తే కలుపు గడ్డిని తవ్వి తీసివేస్తారు. పంటని నాశనంచేసే పశువులనుంచి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ ముండ్లచెట్లు పెడతారు. చేను బాగా పెరగటానికి ఎరువులు వేస్తారు. ఈ రకంగా వ్యవసాయదారులు పంటలను రక్షించుకొంటారు. ఇదే రకముగా ప్రయత్న శీలులు తమ మనస్సను పొలంలోని కామము, క్రోధము అను కలుపును తీసివేస్తారు. లౌకిక వాంఛలనుంచి తమ జ్ఞానానికి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ వైరాగ్యమను ఆవరణ (వెలుగు) పెడతారు. ఆచారము విధులను మాయలు కపటముల నుండి విముక్తి చెందుటకు భౌతికముగాను, మానసికముగాను పనులను వదలి సన్యాసమను శరణాగతిని ఎరువులుగా వేసి జ్ఞానమను చేనును ఆధ్యాత్మిక వ్యవసాయదారులు రక్షించుకొందురు. 

 

యెందు చూచిన శ్రీవేంకటేశుఁ డున్నాఁడనియెడి-
అందిన చేని పంట లనుభవించి
సందడించి తమవంటి శరణాగతులుఁ దాము
గొంది నిముడుకొందురు గురుకృప జనులు ॥పంట॥ 

ముఖ్యపదములకు అర్ధములు: అందిన చేని పంటలు= తాము కోరకుండా అందినవి, తమకు ప్రకృతి అందించిన పంటలు = యజ్ఞము చేయగా మిగిలిన శిష్టాన్నములు (యజ్ఞశిష్టాశినః సంతో, భగవద్గీత 3-13); అనుభవించి = తీసుకొని;  సందడించి = అతిశయించి (= దానికే ఎక్కువ సంతోషించి); గొంది = మూల, చిన్న సందు, సన్నటి ఇరుకైన వీధి; గొంది నిముడుకొందురు  = ఆ సన్నని (ఇరుకు) మార్గములో ప్రవేశించుదురు. 

భావము ఎక్కడ చూసిన శ్రీ వెంకటేశ్వరుడున్నాడు అని గ్రహించిన వివేకులు యజ్ఞము చేయగా మిగిలిన శిష్టాన్నములు మాత్రం అనుభవించి దానితోనే సంతృప్తిని చెందుదురు.  తమను తాము ఆ సన్నని ఇరుకు మార్గములో ఇడుకొని వుందురు దైవకృప కలిగిన ఆ పుణ్యాత్ములు. 

వివరణము: ధర్మము అతి సూక్ష్మమైనది. అతి సున్నితమైనది. ఇది అని చెప్పుటకు అలవికానిది. ధర్మమును వెంబడించు వారు ఆ ధర్మము ఏ ఏ సన్నని ఇరుకు మార్గముల ద్వారా ఏ విషయములలో ప్రవేశించునో సామాన్యులమైన మనకు అవగాహన ఉండదు. ధర్మమునే సత్యమునే నమ్ముకుని జీవించువారు దానిలోనే తదేకముగా ఐక్యమై వేరు దాని ప్రస్తావన లేక వుందురు. 

దీనిని రీనె మాగ్రిట్ గారు (Rene Magritte) వేసిన 1926 నాటి పెయింటింగు La Chambre du Devin (the Seer's chamber, జ్ఞానులుండు గది) అను పేరు గల​ సంబోధనాత్మక చిత్రం ద్వారా విశద పరచుకుందాము. ఈచిత్రంలో ఒక తెల్లని తెర లేదా పలుచని ఒక గోడ కనబడుతుంది.  దాని వెనుక చీకటితో కూడిన నేపథ్యము మనకు తెలియని దానిని (పరము) సూచిస్తున్నది.

 


రెండు చెక్క మేనిక్విన్లు  ఒకదానితో ఒకటి కలుపబడి ఉన్నాయి.  ఆ మేనిక్విన్లు ఆ గోడ లోంచి బయటకు దూసుకు వచ్చినట్లు చిత్రం చూపుతుంది.  ఆ తెల్లనితెర లేదా గోడ ఈ మేనిక్విన్ ఆకారానికి అనుగుణముగా కాకుండా వేరే విధంగా విరిగిపోయి వుంది. ఆ మేనిక్విన్లు తెల్లని తెరను ఛేదించుకుంటూ సూటిగా బయటికి రావడానికి అనేక అడ్డంకులు కనపడుతుంటాయి. ఈ అడ్డంకులన్నీ మానవ నిర్మితములు అని స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. 

ఒకదానితో ఒకటి కలిసి ఉన్న మేనిక్విన్లు మనిషి చేయి పనులకు ఉదాహరణలు.   ఏదైనా కార్యము చేయుటకు ముందు ఒక అవగాహనతో ఒక ప్లాన్‌ వేసుకుంటాము. తదుపరి అది  చేయబోతాము. ఈ మేనిక్విన్లలో ఒకటి ఆలోచనకు ఇంకొకటి దాన్ని అనుసరించు యత్నమునకు సంకేతములు.  పైన చూపిన బొమ్మలో మాదిరి మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కావలసిన దానికంటే ఎక్కువ మొత్తం గోడను పగులగొట్టుకుంటూ బయటపడతాము. 

ఆ తెరను లేదా గోడను చేధించడం అంటే సత్యమునకు భంగము కలిగించుట (లేదా పాటించకుండుట) అని అర్థం. కాబట్టి మనం ముందు ప్రణాళిక ఆ తర్వాత కార్యాచరణ అని సిద్ధమై చేయు పనులన్నీ ధర్మవిరుద్ధములు అని  ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చును.  ఆ తెరను ఏమాత్రము వికారమొందించకుండా దాటుటకు అతి సూక్ష్మాతి సూక్ష్మ రూపము అవసరము. అది మనమున్న స్థితిలో సాధ్యము కాదు. 

సత్యము వికారము కాకుండా, ధర్మమును భగ్నం చేయకుండా  నడుచుకొనుటకు గల  ఒకే ఒక ఉపాయము ఆ ఆలోచనలు అను తెరువులు  ప్రణాళికలు లేకుండా కేవలం కార్యాచరణము చేయుట మాత్రమే. ఆ స్థితిలో కార్యాచరణ, ధర్మము సత్యము ఎటువంటి అవరోధం లేకుండా  అన్నీ సమ్మిళితమైపోవును. ఆ స్థితిని  చేరుటకు శరణాగతులుఁ దాము / గొంది నిముడుకొందురు గురుకృప జనులు అన్నారు అన్నమాచార్యులు.   అనగా వారు తాము అను దానిని పూర్తిగా భగ్నము చేసి దానికి అస్తిత్వము లేకుండా చేయుదురని భావము.  

బైబిల్ లో పేర్కొన్న క్రింది వాక్యము, అన్నమయ్య చెప్పినది ఒకటే అవ్వడం కాకతాళీయము కాదు.  (బైబిలు, మత్తయి సువార్త 7: 13) 13ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. 14జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. 

-X-X-The End-X-X-

 

Saturday 25 May 2024

T-203. ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక

 అన్నమాచార్యులు

203. ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక 

శరణాగతియే మార్గము

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: అన్నమాచార్యుల వారు శరణాగతి ఒక్క మారే అని చెబుతున్నారు. ఆ శరణాగతి చేసి దైవమునకే తన​ బాధ్యత వదలి ఉండవలెను అని అంటున్నారు. అంతేగాని మనము ఉన్నట్లుగా అనేక విధములుగా పెనుగుతూ జీవనము సాగించుట సరికాదు అని అన్నమయ్య అంతరార్థం. 

చరణము 1: దేవుడా! నాకున్న చిన్న నాలికతో అనంతమైన నీ నామములు ఏరకంగా పలికెదనయ్యా? నీయొక్క హద్దులే లేనటువంటి క్రమమును చూచుటకు నా కన్నులేలా సరిపోతవి? 

చరణము 2: నీ కున్నవి అనంతమైన పాదములు. నా చేతులేమో రెండే ఆయే!  నీ పాదములన్నింటికి పూజ చేయుటకు నా శక్తి చాలదు. చూస్తే నా చెవులేమో చిన్నవి. నీ కథలేమో చాంతాడంత పొడుగు. వీటన్నింటిని తెలుసుకుని నిన్ను ఏ రకముగా భజించగలనయ్యా? 

చరణము 3: ఓ వేంకటేశ్వరా! నీ శ్రీచక్రం నా ఒంటి మీద ప్రేమగా ముద్రించుకొని నీవే గతి అని జీవనం సాగిస్తున్నాను. నువ్వు దేనికి చిక్కవు, ఉపాయాలకు దొరకవు అని తెలిసి కూడా నీకై ఈ వైపు వేచి ఉన్నాను. నీవే నన్ను కావగలవు. నా దగ్గర వేరే ఏ ఉపాయములూ లేవు. నాకు తెలిసినది ఒక్కటే "నీకు శరణాగతి అనడమే."

                  

ఉపోద్ఘాతం: అన్నమాచార్యుల వారు ఎంతో ఆర్థ్రతతో కీర్తించారు శ్రీ వారిని. శరణాగతి  చేయు అసాధారణమైన విషయమును ఇందులో చెప్పారు. 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు 279-3  సంపుటము: 3-455 

ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక
పెక్కు విధముల నెట్టు పెనఁగేనయ్యా       ॥పల్లవి॥
 
నాలికె వొక్కటే నీ నామము లనంతము
పోలించి నే నిన్నెట్టు పొగడేదయ్యా
వోలి నాకన్నులు రెండే వొగి నీ మూర్తులు పెక్కు
సోలి నే నిన్నెటువలెఁ జూచెదనయ్యా       ॥ఒక్క॥
 
వట్ట నా చేతులు రెండే పదములు నీకుఁ బెక్కు
వొట్టి నిన్నుఁ బూజించ నోపికేదయ్యా
గట్టి నాచెవు లిసుమంత కథలు నీకవియెన్నో
పట్టపు నేనెట్టు విని భజియించేనయ్యా      ॥ఒక్క॥
 
యేమిటాఁ జిక్కవు నీవు యింత దేవుఁడవుగాన
కామించి నీడాగు మోచి గతిగ నేను
యీ మేర శ్రీవేంకటేశ నీవే నన్నుఁ గావు
దీమసాన నిఁక వేరేతెరువు లేదయ్యా ॥ఒక్క॥ 

 

Details and explanations:

ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక
పెక్కు విధముల నెట్టు పెనఁగేనయ్యా ॥పల్లవి॥ 

భావము: అన్నమాచార్యుల వారు శరణాగతి ఒక్క మారే అని చెబుతున్నారు. ఆ శరణాగతి చేసి దైవమునకే తన​ బాధ్యత వదలి ఉండవలెను అని అంటున్నారు. అంతేగాని మనము ఉన్నట్లుగా అనేక విధములుగా పెనుగుతూ జీవనము సాగించుట సరికాదు అని అన్నమయ్య అంతరార్థం. 

వివరణ​: మనము నిజమైన శరణాగతి చేస్తామా?  ఏదో చిత్త చాంచల్యం కొద్దీ శరణాగతి అనేస్తాము కానీ. మాటిమాటికి చేసేది శరణాగతి కాదు. 

మరి దైవమునకే (ప్రకృతికే) బాధ్యత వదలి అంటే తనకేమైనా కూడా సంతోషంగా స్వీకరించడం అంత సులభమైనది కాదు. మనకు ప్రతి విషయం పైన నిర్దిష్టమైన ఒక ఊహ/ అపేక్ష/ తలంపు ఉంటుంది. అది ఇలా జరగాలి అని కోరుకుంటాము. అలా జరగకపోతే విచారిస్తాం. ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక  అని అన్నమాచార్యులు ఆ శరణు చేసిన తర్వాత అది తప్పు ఇది ఒప్పు అను వివాదములను చిక్కుకొనక ఉండమంటున్నారు. మనం నిజంగానే ఉండగలమాండి? 

పెనగుట అనునది మనలో ఏదో ఆ కార్యమును చేయుటలో అవరోధము కల్పించుచున్నదని అర్ధము. ప్రకృతి విధించు శాసనమునకు మనలో ఏర్పడు విరోధమే అన్నమాచార్యులు పేర్కొన్న "పెక్కు విధముల నెట్టు పెనఁగేనయ్యా". ఇక ప్రక్క శరణాగతిని చేయుచూనే మనము తెలియ కుండానే అద్దానికి అడ్డుపడతామని చెబుతున్నారు. ఇదియే అజ్ఞానము. మనను మనము తెలియుట ఏదో ఘన కార్యమును సాధించుట​కు కాదు. మన చేష్టలను విశదముగా తెలియుట​కు మాత్రమే​.

 

నాలికె వొక్కటే నీ నామము లనంతము
పోలించి నే నిన్నెట్టు పొగడేదయ్యా
వోలి నాకన్నులు రెండే వొగి నీ మూర్తులు పెక్కు
సోలి నే నిన్నెటువలెఁ జూచెదనయ్యా  ॥ఒక్క॥ 

ముఖ్యపదములకు అర్ధములు: ఓలి = వరుస, క్రమం; సోలి = మైమఱపు, తన్మయత్వము, వింత 

భావము: దేవుడా! నాకున్న చిన్న నాలికతో అనంతమైన నీ నామములు ఏరకంగా పలికెదనయ్యా? నీయొక్క హద్దులే లేనటువంటి క్రమమును చూచుటకు నా కన్నులేలా సరిపోతవి? 

వివరణ​: ఓలి సోలి అనే ఈ రెండు చిన్ని పదములు ఈ కీర్తనకు కేంద్ర బిందువులు. అగపడు ఈ ప్రపంచము, ఈ ఛిన్నాభిన్నములు వెనుక మనసు కానీ, గూగుల్ కానీ, ఊహలు గానీ చేర్చలేని, పొదగలేని అత్యద్భుతమైన క్రమము దాగి ఉన్నదని జిడ్డు కృష్ణమూర్తిగారు అన్నమాచార్యులవారు  అనేక మార్లు సోదాహరణముగా వివరించారు. మానవ జీవితము యొక్క లక్ష్యము ఆ అపూర్వ అచిన్త్యానంత వీక్షణమునకు మన దేహమును సిద్ధముగా ఉంచుట అని పేర్కొన్నారు. ఆ అసమాన్య స్థితిని చేరుటకు భక్తి తప్ప వేరు మార్గములు లేవని అన్నమాచార్యులు పదే పదే విన్నవించారు. ఈ కీర్తనలో కూడా అదే పేర్కొన్నారు. 

ఫిబ్రవరి 1950లో M C ఎస్చెర్ అను మహానుభావుడు ORDER and CHAOS ను (‘క్రమాక్రమములులేదా ‘ ‘క్రమము మరియు గందరగోళం’)​ అను శీర్షికతో క్రింద ఇచ్చిన లితోగ్రాఫ్‌ సృస్టించడం జరిగింది. ఇది స్వీయ-వివరణాత్మకమైనది. ఈ ముద్రణలో ఒక సంపూర్ణ సౌష్టవ పారదర్శక స్టెల్లెటెడ్ డోడెకాహెడ్రాన్ ఒక గాజు గోళంతో విలీనం చేయబడినట్లు  కేంద్రములో చూపిరి. దాని చుట్టూ విరిగిన మరియు ఇతరత్రా అస్తవ్యస్తంగా ఉన్న వస్తువులను కలగూరగంపలా అమర్చిరి. ఇది ఓలి నాకన్నులు రెండే వొగి నీ మూర్తులు పెక్కు / సోలి నే నిన్నెటువలెఁ జూచెదనయ్యాతో సరిపోలుతుంది. మనకు అగపడు చిందరవందర ప్రపంచమును చూచి మహానుభావుల మాటలను నమ్మినా, అంతస్థము చేసుకోము. అనగా ఎంతో నిశితము, తదేక దీక్షగల ఎశ్చర్ వంటి మహానుభావులు కూడా అన్నమాచార్యులు చెప్పినదే వ్యక్త పరచుట ఆశ్చర్యము గొలుపును. 



కానీ తరచుగా అస్తవ్యస్తంగా భావించేది బహుశా అంత యాదృచ్ఛికం కాదు. ఉదాహరణకు, ఈ పారవేసిన వస్తువులలో ఒకదాన్ని తీసుకొని శక్తివంతమైన సూక్ష్మదర్శిని క్రింద పరిశీలిస్తే, పరిపూర్ణమైన చిన్న ఇంటర్లాకింగ్ స్ఫటికాలు మరియు అణువులను చూస్తాము. ఈ క్రమబద్ధమైన నమూనాలు మనకు అగపడవు.... వాటి ప్రస్తుత రూపము మనలను ప్రభావితము చేసి మనస్సును గందరగోళం వైపు లాక్కేళ్ళును. 

ఎస్చెర్ గారు స్వయంగా ఒక అరుదైన తాత్విక వ్యాఖ్యతో దీనిని వివరించారు: "మనము ఒక అందమైన మరియు క్రమబద్ధమైన ప్రపంచంలో నివసిస్తున్నామని; మరియు కొన్నిసార్లు కనిపించే విధంగా రూపం లేని గందరగోళంలో లేమని సాక్ష్యం ఇవ్వడానికి నేను నా ముద్రణలలో ప్రయత్నిస్తాను." అన్నారు. 

వట్ట నా చేతులు రెండే పదములు నీకుఁ బెక్కు
వొట్టి నిన్నుఁ బూజించ నోపికేదయ్యా
గట్టి నాచెవు లిసుమంత కథలు నీకవియెన్నో
పట్టపు నేనెట్టు విని భజియించేనయ్యా ॥ఒక్క॥ 

ముఖ్యపదములకు అర్ధములు: వొట్టి = పొట్టి (అని తీసుకుంటే = నాకు సామర్థ్యము చాలదు అని) లేదా ఏమీలేదు ​(అని తీసుకుంటే కనబడని నిన్ను అని తీసుకోవలె) 

భావము: మీకున్నవి అనంతమైన పాదములు. నా చేతులేమో రెండే ఆయే!  నీ పాదములన్నింటికి పూజ చేయుటకు నా శక్తి చాలదు. చూస్తే నా చెవులేమో చిన్నవి. నీ కథలేమో చాంతాడంత పొడుగు. వీటన్నింటిని తెలుసుకుని నిన్ను ఏ రకముగా భజించగలనయ్యా? 

వివరణ​: అన్నమాచార్యులవారు నాకు ఒకటే నాలిక లేక ఉన్నది; రెండు కళ్ళు మాత్రమే ఉన్నవి; రెండు చెవులు మాత్రమే ఉన్నవి; రెండు చేతులు మాత్రమే ఉన్నవి అని చెప్పి, మానవుడు దైవముతో పోల్చితే అతి సూక్ష్మాతి సూక్ష్మమైన వాడని సూచించారు.  మనము ఎంత చేసినా దైవమునకు కృతజ్ఞతలు చెల్లించుకోలేమని; మానవుడు చేయగలిగింది కేవలం కృతజ్ఞతా భావముతో ఒదిగి వుండడము మాత్రమే అని చెబుతున్నారు. 

యేమిటాఁ జిక్కవు నీవు యింత దేవుఁడవుగాన
కామించి నీడాగు మోచి గతిగ నేను
యీ మేర శ్రీవేంకటేశ నీవే నన్నుఁ గావు
దీమసాన నిఁక వేరేతెరువు లేదయ్యా    ॥ఒక్క॥ 

ముఖ్యపదములకు అర్ధములు: కామించి = ప్రేమించి, మనస్పూర్తిగా;  నీడాగు = నీ ముద్ర​; మేర = ఎల్ల, హద్దు, మితి మట్టు, ఎడము, limit, boundary; యీ మే = this side; దీమసము (dImasamu) = ఉపాయము,  నేర్పు, Cleverness; a contrivance, a stratagem,; తెరువు = దారి. 

భావము: ఓ వేంకటేశ్వరా! నీ శ్రీచక్రం నా ఒంటి మీద ప్రేమగా ముద్రించుకొని నీవే గతి అని జీవనం సాగిస్తున్నాను. నువ్వు దేనికి చిక్కవు, ఉపాయాలకు దొరకవు అని తెలిసి కూడా నీకై ఈ వైపు వేచి ఉన్నాను. నీవే నన్ను కావగలవు. నా దగ్గర వేరే ఏ ఉపాయములూ లేవు. నాకు తెలిసినది ఒక్కటే "నీకు శరణాగతి అనడమే."

 

-x-x-x సమాప్తము x-x-x-

207. inniyu mugisenu iTu nIlOnane (ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె)

  అన్నమాచార్యులు 207. ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె (inniyu mugisenu iTu nIlOnane)   Introduction: "This poem is a masterpiece amo...