Wednesday, 16 September 2026

T-147R అదివో కనుఁగొను మది యొకతె

 తాళ్లపాక అన్నమాచార్యులు
147R అదివో కనుఁగొను మది యొకతె
For English Version Press Here 

ఉపోద్ఘాతము
 
ఈ కీర్తనలో అన్నమాచార్యులు మనిషి బయట ప్రపంచాన్ని ఎలా చూస్తాడో మాత్రమే కాదు, ఆ ప్రపంచంలోనే అతని మనస్సు ఎలా పనిచేస్తుందో చూపిస్తారు. మనం ఏదో ఒక ఆకర్షణకు స్పందిస్తున్నామని అనుకుంటాము. కానీ మన ఆలోచనలు, కోరికలు, అనుబంధాలు, ఊహలు కూడా అదే సమయంలో కదులుతుంటాయి. మనం చూస్తున్నది వాస్తవ​ ప్రపంచమా, లేక మనస్సు నిర్మించుకున్న ప్రపంచమా అన్న ప్రశ్న ఇక్కడ సహజంగానే ఎదురవుతుంది.

ఇది ఒక వ్యక్తి అనుభవానికి పరిమితమైన విషయం కాదు. మనమందరం ఒక ప్రభావితమైన క్షేత్రంలోనే జీవిస్తూ, ఆ క్షేత్రంలోనే ఆలోచిస్తూ, నిర్ణయిస్తూ, కార్యములు చేస్తుంటాము. ఆ క్షేత్రం నుండి వెలువడే మన చర్యలకు సహజంగానే పరిమితులు ఉంటాయి. ఒక చర్య ఒక సమస్యను కొంతవరకు పరిష్కరించినా, ఏదో ఒకటి మిగులుతుంది. ఆ మిగిలినదానికి మరొక ఆలోచన, మరొక పరిష్కారం అవసరమవుతుంది. ఈ క్రమం మనిషి జీవితంలో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.

ఈ కీర్తన అందుకే ముఖ్యమైనది. ఇది సమస్యలకు మూలమైన మనిషి ఉన్న ఆవేశిత క్షేత్రాన్ని మన ముందుంచుతుంది. వ్యక్తిగత సంబంధాల నుండి మనిషి నిర్మించుకున్న జ్ఞానం, పద్ధతులు, వ్యవస్థల వరకు ఈ క్షేత్రము నుండే  వెలువడుచున్నవి.

అన్నమాచార్యులు దీనిని సిద్ధాంతంగా చెప్పరు. ఒక చిత్తరువును మన ముందుంచుతారు. దానిని చూసిన తరువాత, మనమే మనలో జరుగుతున్నదాన్ని గమనించాలి.

ఇది శృంగార కీర్తన అయినప్పటికీ భావప్రాధాన్యము క్షేత్రమునదే. అందుకే అన్నమాచార్యులు  'ఒకతె, యొకతె' అను పదములతో మనిషిని పరీక్షించుచున్న ఆలోచనలనకు రూపముగా వాడారు. 
శృంగార​ సంకీర్తన
రాగి రేకు: 1412-2  సంపుటము - సంకీర్తన: 24-68
అదివో కనుఁగొను మది యొకతె
యెదుటనే నెలకొనె నిది యొకతె       ॥పల్లవి॥

తేటలమాటలఁ దెర లదె కట్టీఁ
గాటుకకన్నులకలి కొకతె
జూటరిచూపులఁ జొక్కులు చల్లీ
నీటుగర్వములనెలఁ తొకతె  ॥అది॥

ముసిముసినవ్వులు మోపులుగట్టీ
రసికుఁడ నీపై రమణొకతె
కొసరులఁ గుచములఁ గోటలు వెట్టీ
మిసమిసమెఱుఁగుల మెలుఁతొకతె     ॥అది॥

కాయజకేలికిఁ గందువ చెప్పీ
చాయలసన్నల సతి యొకతె
యీయెడ శ్రీవేంకటేశ కూడి నిను
వోయని మెచ్చీ నొకతొకతె     ॥అది॥
Details and Explanations:
పల్లవి:
అదివో కనుఁగొను మది యొకతె
యెదుటనే నెలకొనె నిది యొకతె          ॥పల్లవి॥ 
భావము:
కీర్తన పాదము
సహజ తెలుగు భావం
అంతరార్థము - మనస్సు కదలిక
అదివో కనుఁగొను మది యొకతె
అదిగో  కనుఁగొనుము అది ఒకతె
అదిగో తెలుసుకో — అది ఒకటి.
యెదుటనే నెలకొనె నిది యొకతె
కనుల ఎదుటనే నెలకొనె ఇంకొకతె
గమనించావా? కనిపించినదే మనస్సులో మరొక రూపంగా నెలకొంటుంది.
గూఢార్థవివరణము:

మొదటి చూపులో ఈ పల్లవి ఒక స్త్రీని చూపిస్తున్నట్టే అనిపిస్తుంది. యొకతె” అనే పదం ఆ భావాన్ని మరింత బలపరుస్తుంది. అయితే రెండు పాదాలను కలిపి గమనిస్తే, అన్నమాచార్యులు ఒక స్త్రీని వర్ణించడం కంటే మనస్సులో జరిగే ఒక  మోహపు (శృంగార) గమనమును చూపిస్తున్నారు.

మొదటి పాదంలో కనుఁగొను ఉంది — ఏదో ఒకటి గోచరించింది. రెండవ పాదంలో నెలకొనె ఉంది — అదే ఎదుటనే ఒక కొత్త రూపంగా నెలకొంది. ఇక్కడ గమనించవలసిన సూక్ష్మమైన మార్పు: కనిపించినది ఒకటి; మనస్సులో నెలకొన్నది మరొకటి.

నెలకొను అంటే కేవలం ఉండటం కాదు; పుట్టటం, కలగటం, నిలవటం అనే అర్థాలూ ఉన్నాయి. అందువల్ల ఎదుట కనిపించినదానితో మనస్సు అక్కడికక్కడే ఏదో కలిపి, దానికి తనదైన రూపాన్ని ఇస్తుంది.

మనము సాధారణంగా ఈ రెండింటినీ వేరు చేసి చూడము. మనం వ్యక్తిని లేదా వస్తువును చూస్తున్నామని అనుకుంటాము. కానీ మనకు కనిపించేది, ఆ వ్యక్తి లేదా వస్తువు మాత్రమే కాదు; దానితో మనస్సు కలిపిన జ్ఞాపకం, ఊహ, ఆకర్షణ, అభిప్రాయం కూడా అందులో భాగమై ఉంటుంది.

అన్నమాచార్యులు ఇక్కడ మనస్సు గురించి ఒక సిద్ధాంతాన్ని చెప్పడం లేదు. మనస్సు పనిచేయడం మొదలయ్యే క్షణాలను పట్టుకుంటున్నారు.

ఈ చలనమును గట్టిగాఁ దెలుసుకొంటే కన్నదే కంటి కురుమ” అనే కీర్తనలో ఆయన మరో బింబంతో మరింత స్పష్టంగా చూపించారు. అక్కడ చూపుకు అడ్డుగా నిలిచేది బయటిది కాదు; చూచే ప్రక్రియలోనే ఏర్పడినది. ఇక్కడ కూడా ఎదుట కనిపించినదానితో పాటు మనస్సు తనదైన రూపాన్ని నెలకొల్పుతుంది.

 

ఈ కదలిక యొక్క వేగం
ఇక్కడ మరొక విషయాన్ని గమనించాలి. ఈ ప్రక్రియ నెమ్మదిగా, సమయమిచ్చి జరిగేది కాదు. చూసినదానిలో మనస్సు తన రూపాన్ని కలిపే పని. దాదాపు మెరుపు వేగంతో జరుగుతుంది. అందుకే కనుఁగొను” వెనువెంటనే నెలకొనె” వస్తుంది.

భగవద్గీతలోని “కామక్రోధోద్భవం వేగం” (5-23) అనే మాట ఈ వేగాన్ని; “తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ” (3-41) లోని "ఆదౌ — మొదట్లోనే" అనే సూచనలతో కలిపి అన్నమాచార్యులు చెప్పిన దానిని  చూస్తే సులభంగా తెలియవచ్చును. ఇక్కడ ముఖ్యంగా గమనించ వలసినది చూసిన దానిని నియంత్రించడం కాదు, పరిశీలించడం. నియంత్రణలో చూసిన దానిని మర్చుట జరగ వచ్చును. పరిశీలనలో కేవలం పరిశీలన మాత్రమే ఉంటుంది.

అందువల్ల పల్లవి లోని పరిశీలనను ఇలా కుదించవచ్చు: గోచరమైనది మనస్సు దానిలో కలిసింది అది మరొక రూపంగా నెలకొంది. తరువాతి చరణాలలో అన్నమాచార్యులు ఈ చిన్న కదలిక ఎలా మయికముగా, మత్తుగా, మిసమిసమెఱుఁగులుగా, సంజ్ఞల మాయగా చివరకు మనోవికారంగా విస్తరిస్తుందో చూపిస్తారు.

 Bottom of Form


మొదటి చరణం:
తేటలమాటలఁ దెర లదె కట్టీఁ
గాటుకకన్నులకలి కొకతె
జూటరిచూపులఁ జొక్కులు చల్లీ
నీటుగర్వములనెలఁ తొకతె ॥అది॥
భావము:
కీర్తన పాదము
సహజ తెలుగు భావం
అంతరార్థము - మనస్సు కదలిక
తేటలమాటలఁ దెర లదె కట్టీఁ
తేటగా, స్పష్టంగా మాటలాడుతూ, కనబడని తెరలు అదె కడుతున్నది.
గోచరమైన తేటల మాటల వెనుక కనబడని తెరలు లేవు అనుకోరాదు.
గాటుకకన్నులకలి కొకతె
కాటుకకన్నుల చక్కని చెలి ఒకతె.
చక్కగా ముస్తాబైన ఆలోచన గమనమును చూడు
జూటరిచూపులఁ జొక్కులు చల్లీ
(జూటరిచూపులఁ = ఆనవాలు పట్టలేని మోసపు చూపులఁ; జొక్కులు = చొక్కులు = మయికము, మత్తు. పరవశత
ఆనవాలు పట్టలేని మోసపు చూపులతో మయికం, మత్తు చల్లుతుంది.

ఆ ఆలోచన తనకు తానే మత్తును, పరవశమును చల్లుతూ వస్తుంది.

నీటుగర్వములనెలఁ తొకతె
(నీటు = శృంగారగర్వము, మురిపము; నెలఁ తొకతె = ఆఁడుది)
మురిపముతోను గర్వంతో (నీవపు వస్తున్న) ఆడుది ఒకతెను  కనుగొనుము.

నీలోని సున్నితత్వమును ఊహలను ఊతముగా ఒక రూపాన్ని సంతరించుకొని గర్వముగా కసలుతున్నదొక ఆలోచన

గూఢార్థవివరణము:

ఇక్కడ అన్నమాచార్యులు ఆలోచనను బయట నుంచి మనలోకి వచ్చిన వస్తువుగా కాక, మన ముందే తన రూపాన్ని మార్చుకుంటూ పుట్టే కదలికగా చూపిస్తున్నారు.

తేటలమాటలఁ దెర లదె కట్టీఁ”తెర అనేది కేవలం అజ్ఞానం కాదు. స్పష్టత కూడా ఒక తెరగా మారవచ్చు. భగవద్గీత 14-6లో సత్త్వగుణాన్ని నిర్మలమైనదిగా, ప్రకాశమానమైనదిగా చెప్పిన వెంటనే, అది సుఖము మరియు జ్ఞానముపై ఆసక్తి ద్వారా బంధిస్తుంది అని చెబుతుంది. అంటే సత్త్వగుణము కూడా బంధనము కాగలదు.

దీపానికి నిర్మలమైన చిమ్మీ కూడా ఒక ఆవరణయే. అలాగే మనిషి సంపాదించుకున్న జ్ఞానం, సుఖం, తనపై తనకున్న మంచి అభిప్రాయం కూడా మనస్సుకు తెరలుగా మారవచ్చు. జ్ఞానాభిలాష మనిషిని ఎదగనిస్తుంది; కానీ అదే “నేను ఇతరులకన్నా ఎక్కువ తెలుసుకున్నాను” అనే గర్వానికి దారితీయవచ్చు. అలాగే ఒక్కొక్కరు తాము సమాజానికో, వూరుకో ఎక్కువ సేవ చేసాననో లేక ఎక్కువ శ్రమించాననే భావనతో వారికి తాము ఇతరులకంటే 'ఎక్కువ​' అనే   అహమును కలిగించవచ్చును.

ఇక్కడ అన్నమాచార్యుల పరిశీలన మరింత సూక్ష్మమైనది. మనస్సు మురికిగా, వికృతంగా కనిపిస్తూ మనలను ఆకర్షించదు. చక్కగా ముస్తాబై వస్తుంది. తేటమైన మాటలతో, అందమైన రూపంతో, మురిపించే చూపులతో తనకు తానే ఒక ఆకర్షణను సృష్టించుకుంటుంది. ఆ ఆకర్షణలోకి మనమే ప్రవేశిస్తాము.

అందుకే ఒకతె” అనే పదం ముఖ్యమైనది. మొదట మన ముందున్నది ఒకటి. మనస్సు దానిని పట్టుకున్న వెంటనే అది మరొక రూపంగా నెలకొంటుంది. అక్కడినుంచి ఆలోచన తన స్వంత కదలికను ప్రారంభిస్తుంది.

అన్నమాచార్యులు ఇక్కడ ఆ ఆలోచనను తప్పు అని చెప్పడం లేదు. దానిని అడ్డుకోవడం లేదు. అది పుట్టిన క్షణాన్ని చూపిస్తున్నారు. ఇదే ఆయన ప్రత్యేకత —మనస్సు గురించి చెప్పడం కాదు; మనస్సు పనిచేస్తున్న క్షణాన్ని మన ముందుంచుతున్నారు

రెండవ చరణం:
ముసిముసినవ్వులు మోపులుగట్టీ
రసికుఁడ నీపై రమణొకతె
కొసరులఁ గుచములఁ గోటలు వెట్టీ
మిసమిసమెఱుఁగుల మెలుఁతొకతె ॥అది॥
భావము:
కీర్తన పాదము
సహజ తెలుగు భావం
అంతరార్థము - మనస్సు కదలిక
ముసిముసినవ్వులు మోపులుగట్టీ
మోపులు మోపులుగా చిరునవ్వులు అలంకారములుగా
హెచ్చగు నగవుల కుచ్చులు గట్టి
రసికుఁడ నీపై రమణొకతె
ఓ రసికుడా, రమింపజేయు జాణ ఒకతె
నిన్ను శృంగారమనే ఆలోచనలో ముంచి.
కొసరులఁ గుచములఁ గోటలు వెట్టీ
ఇంకా కొంచెము అని కొసరి కొసరి వక్షోజములను కోటలతో నిన్ను కప్పి వేస్తూ
ఆ కుచములే ఆకర్షణగా మనస్సు కోటల వంటి  హద్దులు, స్థిరమైన రూపాలు, ఉక్కుచట్రము వంటి ఊహలు నిర్మించుకుంటుంది.
మిసమిసమెఱుఁగుల మెలుఁతొకతె
అలా మిసమిసలాడే మెరుపుల అందాలతో ఒక స్త్రీ
ఆ అందాల కోటలు,  పరిస్తంభించిన రూపాలు, ఊబివంటి ఊహలు తన లోకమై కనిపించగా వాటి రక్షణకు స్వయంగా ఉద్యమిస్తాడు
గూఢార్థవివరణము:

మొదటి చరణంలో అన్నమాచార్యులు “తెరల” *ను చూపించారు. ఇక్కడ “కోటల” ను చూపిస్తున్నారు. ఈ రెండింటి మధ్య చాలా ముఖ్యమైన తేడా ఉంది. తెర మనకు కనిపించకుండా చేస్తుంది. అయితే దానిని ఛేదించుటకు అవకాశం ఉంటుంది. మరి కోటలో మనం బందీలైపోతాం.

మొదట ఒక దృశ్యం మనస్సును ఆకర్షిస్తుంది. మిసమిసమెఱుఁగుల మెలుఁతొకతె ముసిముసినవ్వులు మోపులుగట్టీమెరుస్తూ కనిపించే ఒక స్త్రీ. అంతే. అన్నమాచార్యులు ఇక్కడ మనస్సు గురించి ఏ సిద్ధాంతమూ చెప్పరు. ఆ బింబాన్ని మన ముందుంచుతారు.

కానీ ఆ ఆకర్షణ అక్కడితో ఆగదు. కొసరులఁ గుచములఁ గోటలు వెట్టీ”ఇంకా కొంచెం, ఇంకా కొంచెం అంటూ ఆ ఆకర్షణ చుట్టూ కోటలు కడుతుంది. ఈ కోట ఎంతో ముఖ్యమైన బింబం. కోట కడుతూ కడుతూ మనకు దానితో  సంబంధం ఏర్పడుతుంది. మనదైన తరువాత దానిని కాపాడవలసి వస్తుంది. అలా ఆకర్షణ క్రమంగా అనుబంధంగా, తృష్ణగా, చర్యగా మారుతుంది.

ఇదే భగవద్గీత 14-7లో చెప్పిన రజోగుణ కదలిక: రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ । తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ॥” రజోగుణము రాగము, తృష్ణ, సంగము నుండి ఉద్భవించి, కర్మతో మనిషిని బంధిస్తుంది.

అన్నమాచార్యులు దానిని నిర్వచించరు; ఆ దృశ్యములో మనస్సును వదలి వేస్తారు. అది మనిషిని ఎలా కదిలించి, దాని చుట్టూ ఒక కోటను నిర్మించి, చివరకు అతడినే దాని రక్షణకు ఉద్యమింపజేస్తుందో చూపిస్తారు.

అందుకే ఇక్కడ శృంగారము ప్రధాన విషయం కాదు. అది మనస్సు పనిచేసే విధానాన్ని చూపించడానికి ఎంచుకున్న దృశ్య మాధ్యమము. స్త్రీని చూస్తున్నట్లు కనిపిస్తున్నా, అన్నమాచార్యుల దృష్టి ఆమెను చూస్తున్న మనిషి మనస్సుపైనే ఉంది. మరియు ఆయన మళ్లీ మనకు ఒక చిత్రాన్ని మాత్రమే వదిలేస్తారు. కోటను చూపిస్తారు; కోటలో మనం ఎలా చిక్కుకున్నామో మనమే అర్ధం చేసుకోవాలి.


మూడవ చరణం:
కాయజకేలికిఁ గందువ చెప్పీ
చాయలసన్నల సతి యొకతె
యీయెడ శ్రీవేంకటేశ కూడి నిను
వోయని మెచ్చీ నొకతొకతె ॥అది॥
భావము:
కీర్తన పాదము
సహజ తెలుగు భావం
అంతరార్థము - మనస్సు కదలిక

కాయజకేలికిఁ గందువ చెప్పీ

{కందువ : (బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు1 త్రోవ​, దారి 2 ప్రదేశము 3  ఋతువు. వానకందువ (వర్ష ఋతువు). 4  విధము, ఫ్యాషన్, ప్రత్యేకత​ 5 మాయ; చమత్కారము, నేర్పు. 6 చలోక్తి; గర్భితనింద 7  ౙాడ, సంకేతస్థలము, ఏకాంతము}

మన్మథకేళికి జాడ, రహస్యము చూపి
మన్మథకేళి ఆకర్షణను ఒక ఋతువు లాగ కప్పి మనస్సుకు ఒక రహస్యపు దారిలోకి లాగుతుంది చూపుతుంది.
 
మొదటి చరణం: తెరలు (వ్యక్తిగతం); రెండవ చరణం: కోటలు (పరిథి పెరిగింది); మూడవ చరణం: ఋతువు (విస్తృత స్థాయి)
చాయలసన్నల సతి యొకతె
చీకటి సంజ్ఞలతో ఒక స్త్రీ
స్పష్టంగా తెలియని సంజ్ఞలతో మోహముతో లోబరచుకునే  ఆలోచన మనస్సును కప్పివేస్తుంది.
యీయెడ శ్రీవేంకటేశ కూడి నిను
శ్రీవేంకటేశా  ఈ వైపు శ్రీ నిన్ను కూడి
 శ్రీవేంకటేశా ఈ వైపు నీ మనస్సుతో  కలిసి ఐక్యమై కూడినది ఒకతె
వోయని మెచ్చీ నొకతొకతె
సత్యముగా నిను మెచ్చినది ఒకానొకతె
అరుదుగా కలిగే ఒక నిజమైన భావము — శ్రీవేంకటేశా నిన్ను సత్యముగా మెచ్చి నీలో కలిసిన అనుభవము.
గూఢార్థవివరణము:

మొదటి చరణంలో అన్నమాచార్యులు తెరల” ను చూపించారు. రెండవ చరణంలో కోటల” ను చూపించారు. ఇప్పుడు మూడవ చరణంలో కందువ” వస్తుంది. ఈ మూడు బింబాలలో మనస్సు కదలిక యొక్క పరిధి క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తుంది. సులభంగా బోధ పడుటకు వీటిని క్రింది పట్టికలో ఇచ్చాను.
 
స్థాయి
అన్నమాచార్యులు చూపిన చిత్తరువు
భగవద్గీతలో పేర్కొన్నది
మనస్సుపై ప్రభావం
బయటపడే (తప్పించుకొనే) అవకాశం
మొదటి చరణం
తెరలు
సత్వ గుణము
వ్యక్తిగతంగా తెరలు మన దృష్టిని కప్పుతాయి
ఉంది  అతి లాఘవముగా గమనిస్తే తెరను గుర్తించవచ్చును
రెండవ చరణం
కోటలు
రజో గుణము
ఆ ఆకర్షణ చుట్టూ మనమే ఒక పరిధిని నిర్మించుకుంటాము
ఉంది, కానీ కష్టంఇప్పుడు మనమే నిర్మించిన దానిలో చిక్కుకున్నాము
మూడవ చరణం
ఋతువు
తమో గుణము
అది ఇక ఒక వస్తువు లేదా పరిధి కాదు; మనం ఉన్న పరిసరాన్నే ప్రభావితం చేస్తుంది
దాదాపు లేదుమనం దాని లోపలే ఉన్నాము

కందువ కు ఋతువు అనే అర్థసంభావనను తీసుకుంటే, అది ఒక వస్తువు గాని, ఒక గోడ గాని కాదు — మనం మునిగి ఉన్న పరిసర స్థితి. అప్పుడు తప్పించుకోవడం మరింత కష్టమవుతుంది. ఎందుకంటే మనము చేసేదంతా దాని అంతర్గతమే అయి ఉంటుంది. (ఈ చిత్తరువులు కేవలం మనకు మనము బోధ పరచుకొనుటకు మాత్రమే. వాటిని వాస్తవముగా భావించరాదు).

ఇక్కడే చాయలసన్నల” వస్తాయి. స్పష్టమైన దారి లేదు; నీడల వంటి సంజ్ఞలు మాత్రమే. అయినా అవే మనస్సుకు దారులవుతాయి. గీతలోని తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ (14-8) అనే మాటతో ఇది దగ్గరగా నిలుస్తుంది. తమస్సు కేవలం తెలియకపోవడం కాదు; మోహింపజేసి మనిషి అనుభవించే లోకాన్నే వేరుగా కనిపింపజేయడం.

కానీ ఈ చరణం అక్కడితో ఆగదు. యీయెడ శ్రీవేంకటేశ కూడి నిను ఇక్కడ కూడి” అత్యంత ముఖ్యమైన పదం. అన్నమాచార్యులు శ్రీవేంకటేశుని చేరాడని, తానే ఏదో సాధించాడని చెప్పడం లేదు.  శ్రీవేంకటేశుడు తనంతట తాను కూడినాడు. ఇది భగవద్గీతలోని జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ అనే భావానికి ఒక కొత్త వెలుగు ఇస్తుంది — భేదం తగ్గి, కలయికగా నిలిచే స్థితి.

మరియు వోయని మెచ్చీ అనే మాటను కూడా కర్తృత్వపు విజయంగా చూడకూడదు. గీతలోని ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః । అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే (3-27)న్న పరిశీలన ఇక్కడ గుర్తుకు వస్తుంది. నేనే చేశాను, నేనే సాధించాను” అనే భావం ఈ చరణంలో లేదు. అందుకే చివరలో: నొకతొకతె ఒకానొక, అరుదైన సంభవంలా నిలుస్తుంది.

మొదటి రెండు చరణాలలో మనస్సు ఆకర్షించబడుతుంది, తన చుట్టూ నిర్మించుకుంటుంది, ఆ నిర్మాణంలో చిక్కుకుంటుంది. మూడవ చరణంలో ఆ మోహితమైన క్షేత్రానికి అవతల, అరుదుగా, కూడి జరిగే మరొక అనుభవాన్ని అన్నమాచార్యులు చూపిస్తున్నారు. అతను దానికి పేరు పెట్టి నిర్వచించడు. ఒక దృశ్యాన్ని మాత్రమే మన ముందుంచుతారు. 

అనుబంధ వ్యాఖ్యానం

 

మాగ్రిట్‌ యొక్క The Gradation of Fire

మాగ్రిట్‌ గారు వేసిన ఈ అధివాస్తవిక​ చిత్రంలో ఒక సాధారణ చెక్క బల్ల కనిపిస్తుంది. దాని మీద ఒక కాగితం, ఒక గుడ్డు, ఒక తాళంచెవి ఉన్నాయి. ఇది సాధారణమే. కానీ ఆ వస్తువులన్నీ మండుతూ ఉన్నాయి. అయితే మంటలు ఉన్నా ఆ వస్తువులు వాటి సహజ రూపంలోనే ఉన్నాయి. మంటలు వాటన్నింటినీ ఆవరించి ఉన్నాయి.

ఆ కనబడే బల్లమనం ఆధారపడే ప్రకృతి లేదా భౌతిక జీవితం. కాగితంమనం సంపాదించుకున్న జ్ఞానం, సాహిత్యం, ఆలోచనలు మొదలైనవి. గుడ్డుమనలో పుట్టే సమస్య, కోరిక లేదా ఆలోచనలు వగైరా. తాళంచెవి ఆ సమస్యకు మానవులు కనుగొన్న పరిష్కారం, పద్ధతి లేదా వ్యవస్థ. ఇవన్నీ వేరువేరు వస్తువులైనా, అవన్నీ ఒకే మంటలో ఉన్నాయి. ఇక్కడ మంటలు ఆయా సమస్యలు, ఆలోచనలు, వ్యవస్థలు పూర్తి పరిష్కారాలుగా నిలవక, అవి పుట్టిన అదే క్షేత్రంలోనే ఇంకా కొనసాగుతున్నాయని సూచిస్తున్నట్లు కనిపిస్తాయి.

మనిషి ఒక సమస్యను పరిష్కరించడానికి జ్ఞానాన్ని, ఆలోచనను, పద్ధతిని ఉపయోగిస్తాడు. పరిష్కారం కొంత పని చేస్తుంది; కానీ ఏదో మిగులుతుంది. ఆ మిగిలినదానికి మరొక పరిష్కారం అవసరమవుతుంది. అలా సమస్య పరిష్కారం మిగిలిన సమస్య మరో పరిష్కారం అనే క్రమం కొనసాగుతుంది. మాగ్రిట్‌ చిత్రంలోని కాగితం, గుడ్డు, తాళంచెవి అన్నీ ఒకే మంటలో ఉండటం — పరిష్కారాలను సృష్టించే మనిషి కూడా అదే సమస్యాత్మక క్షేత్రంలో ఉన్నాడనే విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది.

ఇప్పుడు అన్నమాచార్యుల కీర్తనను మరోసారి చూద్దాం. వారు పేర్కొన్న ఆ మోహితమైన క్షేత్రానికి పేరులేదు. కానీ మనమంతా దానిలోనే ఉండి కార్యములు నిర్వర్తిస్తాము. అందువలననే మానవులుగా మనము నిర్మించుకొను వ్యవస్థలు తాత్కాలికములు.

ఈ పరిశీలనను మనిషి నిర్మించుకున్న పరిష్కారాల దగ్గర కూడా చూడవచ్చు. ఒక సమస్యకు ఒక ఆలోచన మొదట చాలా స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సామ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, మార్క్సిజం వంటి అనేక వ్యవస్థలు తమ కాలంలో కొన్ని మానవ సమస్యలకు పరిష్కారాలుగా ప్రతిపాదించబడ్డాయి. ఆచరణలోకి వచ్చిన కొద్దీ వాటి ద్వారా పరిష్కరించబడిన సమస్యలతో పాటు, కొత్త సమస్యలు మరియు కొత్త ప్రశ్నలు కూడా ముందుకు వచ్చాయి. అప్పుడు వాటికి మళ్లీ కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు, కొత్త వ్యవస్థలు అవసరమవుతాయి.

అన్నమాచార్యులు చూపిస్తున్నది ఒక్కో పరిష్కారాల  లోపాలను కాదు. పరిష్కారాలను నిరంతరం సృష్టింపజేసే ఆ మోహితమైన క్షేత్రంలో మనిషి మనసు ఎలా పనిచేస్తున్నదో చూపుతున్నారు. 

(ఇక్కడ సామ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, మార్క్సిజం మొదలైన ఉదాహరణలను ఆయా వ్యవస్థల సామర్థ్యాన్ని గాని, అసమర్థతను గాని నిర్ణయించడానికి పేర్కొనడం లేదు. అన్నమాచార్యుల కీర్తనలోని పరిశీలనను మనకు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి మాత్రమే ఈ ఉదాహరణలను తీసుకుంటున్నాము.)


 X-X-X THE END X-X-X

T-147R అదివో కనుఁగొను మది యొకతె

  తాళ్లపాక అన్నమాచార్యులు 147R అదివో కనుఁగొను మది యొకతె For English Version Press Here   ఉపోద్ఘాతము   ఈ కీర్తనలో అన్నమాచార్యులు మనిషి బయ...