అన్నమాచార్యులు
203. ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక
శరణాగతియే మార్గము
కీర్తన సంగ్రహ భావము:
పల్లవి: అన్నమాచార్యుల
వారు శరణాగతి ఒక్క మారే అని చెబుతున్నారు. ఆ శరణాగతి చేసి దైవమునకే తన
బాధ్యత వదలి ఉండవలెను అని అంటున్నారు. అంతేగాని మనము ఉన్నట్లుగా
అనేక విధములుగా పెనుగుతూ జీవనము సాగించుట సరికాదు అని అన్నమయ్య అంతరార్థం.
చరణము 1: దేవుడా! నాకున్న చిన్న నాలికతో అనంతమైన నీ నామములు ఏరకంగా
పలికెదనయ్యా? నీయొక్క
హద్దులే లేనటువంటి క్రమమును చూచుటకు నా కన్నులేలా సరిపోతవి?
చరణము 2: నీ కున్నవి అనంతమైన
పాదములు. నా చేతులేమో రెండే ఆయే! నీ పాదములన్నింటికి
పూజ చేయుటకు నా శక్తి చాలదు. చూస్తే నా చెవులేమో చిన్నవి. నీ కథలేమో చాంతాడంత పొడుగు.
వీటన్నింటిని తెలుసుకుని నిన్ను ఏ రకముగా భజించగలనయ్యా?
చరణము 3: ఓ వేంకటేశ్వరా! నీ శ్రీచక్రం నా ఒంటి మీద ప్రేమగా ముద్రించుకొని నీవే గతి అని
జీవనం సాగిస్తున్నాను. నువ్వు దేనికి చిక్కవు, ఉపాయాలకు దొరకవు
అని తెలిసి కూడా నీకై ఈ వైపు వేచి ఉన్నాను. నీవే నన్ను కావగలవు. నా దగ్గర వేరే ఏ ఉపాయములూ లేవు. నాకు తెలిసినది ఒక్కటే "నీకు శరణాగతి
అనడమే."
ఉపోద్ఘాతం: అన్నమాచార్యుల వారు ఎంతో ఆర్థ్రతతో కీర్తించారు శ్రీ వారిని. శరణాగతి చేయు అసాధారణమైన విషయమును ఇందులో చెప్పారు.
అధ్యాత్మ కీర్తన:
రాగిరేకు 279-3 సంపుటము:
3-455 |
ఒక్కమాటు శరణుని
వుండేనింతే కాక
పెక్కు విధముల
నెట్టు పెనఁగేనయ్యా ॥పల్లవి॥ నాలికె వొక్కటే నీ
నామము లనంతము
పోలించి నే
నిన్నెట్టు పొగడేదయ్యా
వోలి నాకన్నులు
రెండే వొగి నీ మూర్తులు పెక్కు
సోలి నే
నిన్నెటువలెఁ జూచెదనయ్యా ॥ఒక్క॥ వట్ట నా చేతులు
రెండే పదములు నీకుఁ బెక్కు
వొట్టి నిన్నుఁ
బూజించ నోపికేదయ్యా
గట్టి నాచెవు
లిసుమంత కథలు నీకవియెన్నో
పట్టపు నేనెట్టు
విని భజియించేనయ్యా ॥ఒక్క॥ యేమిటాఁ జిక్కవు
నీవు యింత దేవుఁడవుగాన
కామించి నీడాగు మోచి
గతిగ నేను
యీ మేర శ్రీవేంకటేశ
నీవే నన్నుఁ గావు
దీమసాన నిఁక
వేరేతెరువు లేదయ్యా ॥ఒక్క॥
|
Details and explanations:
భావము: అన్నమాచార్యుల
వారు శరణాగతి ఒక్క మారే అని చెబుతున్నారు. ఆ శరణాగతి
చేసి దైవమునకే తన బాధ్యత వదలి ఉండవలెను అని అంటున్నారు. అంతేగాని
మనము ఉన్నట్లుగా అనేక విధములుగా పెనుగుతూ జీవనము సాగించుట సరికాదు అని అన్నమయ్య అంతరార్థం.
వివరణ: మనము నిజమైన శరణాగతి చేస్తామా? ఏదో చిత్త చాంచల్యం కొద్దీ శరణాగతి అనేస్తాము కానీ. మాటిమాటికి చేసేది శరణాగతి కాదు.
మరి దైవమునకే (ప్రకృతికే) బాధ్యత వదలి అంటే “తనకేమైనా కూడా సంతోషంగా స్వీకరించడం అంత సులభమైనది కాదు”. మనకు ప్రతి విషయం పైన నిర్దిష్టమైన ఒక ఊహ/ అపేక్ష/ తలంపు ఉంటుంది. అది ఇలా జరగాలి అని కోరుకుంటాము. అలా జరగకపోతే విచారిస్తాం. ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక అని అన్నమాచార్యులు ఆ శరణు చేసిన తర్వాత ‘అది తప్పు’ ‘ఇది ఒప్పు’ అను వివాదములను చిక్కుకొనక ఉండమంటున్నారు. మనం నిజంగానే ఉండగలమాండి?
పెనగుట అనునది మనలో ఏదో ఆ కార్యమును చేయుటలో అవరోధము కల్పించుచున్నదని అర్ధము.
ప్రకృతి విధించు శాసనమునకు మనలో ఏర్పడు విరోధమే అన్నమాచార్యులు పేర్కొన్న "పెక్కు
విధముల నెట్టు పెనఁగేనయ్యా". ఇక ప్రక్క శరణాగతిని చేయుచూనే మనము తెలియ కుండానే
అద్దానికి అడ్డుపడతామని చెబుతున్నారు. ఇదియే అజ్ఞానము. మనను మనము తెలియుట ఏదో ఘన కార్యమును
సాధించుటకు కాదు. మన చేష్టలను విశదముగా తెలియుటకు మాత్రమే.
ముఖ్యపదములకు అర్ధములు: ఓలి = వరుస, క్రమం; సోలి = మైమఱపు, తన్మయత్వము, వింత
భావము: దేవుడా! నాకున్న
చిన్న నాలికతో అనంతమైన నీ నామములు ఏరకంగా పలికెదనయ్యా? నీయొక్క
హద్దులే లేనటువంటి క్రమమును చూచుటకు నా కన్నులేలా సరిపోతవి?
వివరణ: “ఓలి” “సోలి” అనే ఈ రెండు చిన్ని పదములు ఈ కీర్తనకు కేంద్ర బిందువులు. అగపడు ఈ ప్రపంచము, ఈ ఛిన్నాభిన్నములు వెనుక మనసు కానీ, గూగుల్ కానీ, ఊహలు గానీ చేర్చలేని, పొదగలేని అత్యద్భుతమైన క్రమము దాగి ఉన్నదని జిడ్డు కృష్ణమూర్తిగారు అన్నమాచార్యులవారు అనేక మార్లు సోదాహరణముగా వివరించారు. మానవ జీవితము యొక్క లక్ష్యము ఆ అపూర్వ అచిన్త్యానంత వీక్షణమునకు మన దేహమును సిద్ధముగా ఉంచుట అని పేర్కొన్నారు. ఆ అసమాన్య స్థితిని చేరుటకు భక్తి తప్ప వేరు మార్గములు లేవని అన్నమాచార్యులు పదే పదే విన్నవించారు. ఈ కీర్తనలో కూడా అదే పేర్కొన్నారు.
ఫిబ్రవరి 1950లో M C ఎస్చెర్ అను మహానుభావుడు ORDER and CHAOS ను (‘క్రమాక్రమములు’ లేదా ‘ ‘క్రమము మరియు గందరగోళం’) అను శీర్షికతో క్రింద ఇచ్చిన లితోగ్రాఫ్ సృస్టించడం జరిగింది. ఇది స్వీయ-వివరణాత్మకమైనది. ఈ ముద్రణలో ఒక సంపూర్ణ సౌష్టవ పారదర్శక స్టెల్లెటెడ్ డోడెకాహెడ్రాన్ ఒక గాజు గోళంతో విలీనం చేయబడినట్లు కేంద్రములో చూపిరి. దాని చుట్టూ విరిగిన మరియు ఇతరత్రా అస్తవ్యస్తంగా ఉన్న వస్తువులను కలగూరగంపలా అమర్చిరి. ఇది “ఓలి నాకన్నులు రెండే వొగి నీ మూర్తులు పెక్కు / సోలి నే నిన్నెటువలెఁ జూచెదనయ్యా”తో సరిపోలుతుంది. మనకు అగపడు చిందరవందర ప్రపంచమును చూచి మహానుభావుల మాటలను నమ్మినా, అంతస్థము చేసుకోము. అనగా ఎంతో నిశితము, తదేక దీక్షగల ఎశ్చర్ వంటి మహానుభావులు కూడా అన్నమాచార్యులు చెప్పినదే వ్యక్త పరచుట ఆశ్చర్యము గొలుపును.
కానీ తరచుగా అస్తవ్యస్తంగా భావించేది బహుశా అంత యాదృచ్ఛికం కాదు. ఉదాహరణకు, ఈ పారవేసిన వస్తువులలో ఒకదాన్ని తీసుకొని శక్తివంతమైన సూక్ష్మదర్శిని క్రింద పరిశీలిస్తే, పరిపూర్ణమైన చిన్న ఇంటర్లాకింగ్ స్ఫటికాలు మరియు అణువులను చూస్తాము. ఈ క్రమబద్ధమైన నమూనాలు మనకు అగపడవు.... వాటి ప్రస్తుత రూపము మనలను ప్రభావితము చేసి మనస్సును గందరగోళం వైపు లాక్కేళ్ళును.
ఎస్చెర్ గారు స్వయంగా ఒక అరుదైన తాత్విక వ్యాఖ్యతో దీనిని వివరించారు: "మనము ఒక అందమైన మరియు క్రమబద్ధమైన ప్రపంచంలో నివసిస్తున్నామని; మరియు కొన్నిసార్లు కనిపించే విధంగా రూపం లేని గందరగోళంలో లేమని సాక్ష్యం ఇవ్వడానికి నేను నా ముద్రణలలో ప్రయత్నిస్తాను." అన్నారు.
ముఖ్యపదములకు అర్ధములు: వొట్టి = పొట్టి (అని తీసుకుంటే = నాకు సామర్థ్యము చాలదు అని) లేదా ఏమీలేదు (అని తీసుకుంటే కనబడని నిన్ను అని తీసుకోవలె)
భావము: మీకున్నవి అనంతమైన పాదములు. నా చేతులేమో రెండే ఆయే! నీ పాదములన్నింటికి పూజ చేయుటకు నా శక్తి చాలదు. చూస్తే నా చెవులేమో చిన్నవి. నీ కథలేమో చాంతాడంత పొడుగు. వీటన్నింటిని తెలుసుకుని నిన్ను ఏ రకముగా భజించగలనయ్యా?
వివరణ: అన్నమాచార్యులవారు నాకు ఒకటే నాలిక లేక ఉన్నది; రెండు కళ్ళు మాత్రమే ఉన్నవి; రెండు చెవులు మాత్రమే ఉన్నవి; రెండు చేతులు మాత్రమే ఉన్నవి అని చెప్పి, మానవుడు దైవముతో పోల్చితే అతి సూక్ష్మాతి సూక్ష్మమైన వాడని సూచించారు. మనము ఎంత చేసినా దైవమునకు కృతజ్ఞతలు చెల్లించుకోలేమని; మానవుడు చేయగలిగింది కేవలం కృతజ్ఞతా భావముతో ఒదిగి వుండడము మాత్రమే అని చెబుతున్నారు.
ముఖ్యపదములకు అర్ధములు: కామించి = ప్రేమించి, మనస్పూర్తిగా; నీడాగు = నీ ముద్ర; మేర = ఎల్ల, హద్దు, మితి మట్టు, ఎడము, limit, boundary; యీ మేర = this side; దీమసము (dImasamu) = ఉపాయము, నేర్పు, Cleverness; a contrivance, a stratagem,; తెరువు = దారి.
భావము: ఓ వేంకటేశ్వరా! నీ శ్రీచక్రం
నా ఒంటి మీద ప్రేమగా ముద్రించుకొని నీవే గతి అని జీవనం సాగిస్తున్నాను. నువ్వు దేనికి
చిక్కవు, ఉపాయాలకు దొరకవు అని తెలిసి కూడా నీకై ఈ వైపు వేచి ఉన్నాను.
నీవే నన్ను కావగలవు. నా దగ్గర వేరే ఏ ఉపాయములూ లేవు. నాకు తెలిసినది
ఒక్కటే "నీకు శరణాగతి అనడమే."
-x-x-x సమాప్తము x-x-x-
ఆర్ద్రమైన అన్నమయ్య కీర్తనకు చక్కని విశ్లేషణ, వ్యాఖ్యానాన్ని
ReplyDeleteఅందించారు శ్రీనివాస్ గారు.
ఎశ్చర్ గారి లిథోగ్రాఫ్ అన్నమయ్య కీర్తన యందలి "ఓలి నాకన్నులు..." చరణపాదానికి సరియైన వ్యక్తీకరణ.
అభినందనలు మీకు.
నమస్సులతో
👏🏻👏🏻👌🏻👌🏻💐💐🙏🏻🙏🏻🙏🏻
కృష్ణమోహన్