Sunday 30 October 2022

T-147 అదివో కనుఁగొను మది యొకతె

తాళ్లపాక అన్నమాచార్యులు

147 అదివో కనుఁగొను మది యొకతె

for English version Press Here 

అజ్ఞానమే తప్ప అంధకారము లేదు

" విలియం షేక్స్పియర్ ".

 

for English Version press here

కీర్తన:

రాగిరేకు:  1412-2  సంపుటము: 24-68 

 

అదివో కనుఁగొను మది యొకతె
యెదుటనే నెలకొనె నిది యొకతె పల్లవి॥
 
తేటలమాటలఁ దెర లదె కట్టీఁ
గాటుకకన్నులకలి కొకతె
జూటరిచూపులఁ జొక్కులు చల్లీ
నీటుగర్వములనెలఁ తొకతె అది॥
 
ముసిముసినవ్వులు మోపులుగట్టీ
రసికుఁడ నీపై రమణొకతె
కొసరులఁ గుచములఁ గోటలు వెట్టీ
మిసమిసమెఱుఁగుల మెలుఁతొకతె అది॥
 
కాయజకేలికిఁ గందువ చెప్పీ
చాయలసన్నల సతి యొకతె
యీయెడ శ్రీవేంకటేశ కూడి నిను
వోయని మెచ్చీ నొకతొకతె అది॥

 

 

క్లుప్తముగా:  మానవునిలో మనస్సులో కలుగు మనోవికారములను, పోకడలను స్త్రీ శబ్దములతో సెలవిచ్చిరి.

కీర్తన సంగ్రహ సారం:

పల్లవి: అదిగో కనుఁగొనుము అది ఒక ఆలోచన. యెదుటనే పుట్టినది ఇది ఒక ఆలోచన. అన్వయార్ధము: కుతూహలము ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రలోభపెడుతూనే ఉంటుంది. 

చరణం 1: మనసు తేటతేట మాటలఁ తెరలు కట్టు గాటుకకన్నుల చెలిలా మురిపించునొక ఆలోచన. ఆనవాలు పట్టలేని మోసపు చూపులఁతో మయికము, మత్తులలో పడవేయునొక ఊహ​. అన్వయార్ధము:  నరుడా! నీ కన్నుల ముందే తేట మాటలఁ తెరలు కట్టు ఆలోచనల కదలికను ఆదిలోనే కనుగొన్నావా? నిన్ను మత్తులలో పడవేయుచునున్న నొక ఊహ పూనికను గుర్తించితివా? 

చరణం 2: అధికముగా చిఱునగవులు దొరలించుచూ నీలో శృంగారమను ఆలోచనలను ఉసికొలిపి, ఆ మిసమిసమెఱుఁగులే లోకమనిపించు నదొక మనోవికారము. 

చరణం 3: మన్మథకేళికి దారులు చూపే చీకటి సంజ్ఞల మాయొకటి. ఈ వైపు శ్రీవేంకటేశ సత్యముగా నిను మెచ్చి నీలో కలసిపోయినదొక భావము.

 

 

విపులాత్మక వివరణ

 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల కీర్తన “అదివో కనుఁగొను మది యొకతె” ఒక స్కెచ్ లాంటిది. ఈ బహు చక్కని, కీర్తనలో ‘ఒకతె, యొకతె’ అని పలు మార్లు ప్రస్తావించడంతో దీనిని పొరపాటుగా శృంగార కీర్తన అని వర్గీకరించారనుకొంటాను. 

వాస్తవానికి 'ఒకతె, యొకతె' వంటి స్త్రీ శబ్దములతో మానవునిలో మనస్సులో రేపు భావములను సూచించిరి. యథార్థముగా 'ఒకతె'తో ఒక ఆలోచనను, ఒక భావమును, ఒక మనోవికారమును, ఒక పోకడను సెలవిచ్చిరి. ఏదియేమయినప్పటికీ, ఈ కీర్తనలో అన్నమాచార్యులు మనిషిని విదిలించి కదిలించు భ్రమను సూచిస్తున్నారు.  

క్రింద ఇచ్చిన రెనే మాగ్రిట్టే గీసిన "ది గ్రేడేషన్ ఆఫ్ ఫైర్" అనే పెయింటింగ్‌ ద్వారా ఈ కీర్తనను వివరిస్తాను.  పెయింటింగ్’లో చెక్క బల్లపై మూడు వస్తువులు కాగితం ముక్క, గుడ్డు మరియు ఒక తాళం చెవులను చూపారు. అవన్నీ మండుతున్నాయి. ఇక్కడ చెక్క బల్ల ఆ మూడింటికి ఆధారమైన భూమికి (ప్రకృతికి) చిహ్నము. మానవుని పుట్టుకకు ఆస్థిత్వానికి మూలాధారమైన భూమి నుండే ఆ మూడు వస్తువులు తయారైనవి. 


 

‘పేపర్’ జ్ఞానం, సాహిత్యం, కవిత్వం మొదలైన వాటిని సూచిస్తుంది. ‘గుడ్డు’ ఒక ఆలోచన, ఒక సమస్య, ఒక భావన వంటివాట్లకు గుర్తు. మరియు ‘కీ’ అనేది సాధ్యమయ్యే పరిష్కారాన్ని, వ్యవస్థను, ఒక పద్ధతిని చూపుతుంది. అవన్నీ కాలుతూవుండడం ప్రపంచంలోని ఏ సమస్యలకూ శాశ్వత పరిష్కారం కనుగొనబడలేదని సూచిస్తుంది. 

‘ఆకలి’ (implying egg) అనే సమస్యతో పెయింటింగ్‌ని తేటపఱచు కుందాం. జీవుల పుట్టుక నుంచి ఇప్పటి దాకా, వేలాది సంవత్సరాలుగా వివిధ రాజకీయ, సామాజిక, స్వచ్ఛంద సేవా వ్యవస్థలు, వ్యక్తుల ​ ద్వారా అనేక పరిష్కారాలు (indicated by key) ప్రతిపాదించబడినప్పటికీ; దానిపై యెంతో సాహిత్యం వెలువడినప్పటికీ (implied by paper); ఇప్పటికీ, కాదనలేని వాస్తవం, 'ఆకలి' ఇంకా ప్రపంచాన్ని మండిస్తూనే వుంది. 

పెయింటింగ్‌లో ఆకలికి బదులు జ్ఞానమును (wisdom) కాని, భద్రతను (security) కానీ, పెట్టి చూచిననూ ఆ ప్రయత్నములన్నీ శుష్కములేనని, కేవలము భ్రమగా మంటలు రేచినట్లు చూపినట్లుగా, మనలను ఉత్తేజితులను చేసి కాలాయాపన చేసెదవని గ్రహించుట పెద్ద పనికాదు. 

ఈ కీర్తనలోని మూడు చరణాలు ఆ పెయింటింగ్‌లో మండుతున్న వస్తువులకు చిహ్నాలు. మంటలు రేపునది ఆలోచనలే. గతస్మృతులను భస్మముల నుండి పుట్టునవి ఆలోచనలు. అందుకే అన్నమాచార్యుల వాటిని 'ఒకతె, యొకతె' అని వ్యవహరించి తృణీకార భావములో వాడివుందురని నా అభిప్రాయము. 

ఈ పెయింటింగ్ నుండి, 'ముక్తి'ని గుర్తించడానికి, మార్గము ప్రతిపాదించడానికి లేదా సిద్ధాంతీకరించడానికి చేసే ప్రయత్నమే దానిని వమ్ముచేసి, దృష్టిని మరలిస్తుందని తెలియవచ్చు. కావున ఈ విషయంలో ప్రపంచము, అది కల్పించు భ్రమల నిర్మాణములను పూర్తిగా గమనించి, వదలిపెట్టి దూరంగా బయటవానిగా ఉండటమే ముఖ్యము. 

“మానవుడా పురికొల్పునవన్నీ నిన్ను సత్యానికి దూరంగా లాక్కెళుతున్నాయి. ప్రతిచర్యలకు మూలము పదార్థసమ్మిళితమగు దేహమని గుర్తించి నీ చర్యలు సవరించుకో” అని సందేశము. 

Details and Explanations: 

అదివో కనుఁగొను మది యొకతె
యెదుటనే నెలకొనె నిది యొకతె పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఒకతె= ఒక ఆలోచన; నెలకొనె = నిలుచుండు, పుట్టు, కలుగు,

భావము: అదిగో కనుఁగొనుము అది ఒక ఆలోచన. యెదుటనే పుట్టినది ఇది ఒక ఆలోచన. 

వివరణము: మానవుణ్ణి ఆలోచనల పరంపరలు చుట్టి ఉక్కిబిక్కిరి చేస్తాయి. 

అన్వయార్ధము: కుతూహలము ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రలోభపెడుతూనే ఉంటుంది.

 

తేటలమాటలఁ దెర లదె కట్టీఁ
గాటుకకన్నులకలి కొకతె
జూటరిచూపులఁ జొక్కులు చల్లీ
నీటుగర్వములనెలఁ తొకతె అది॥

ముఖ్య పదములకు అర్ధములు: కలి కొకతె = చక్కని ఆడుది (ఇక్కడ మురిపించు ఆలోచన​); జూటరిచూపులఁ = ఆనవాలు పట్టలేని మోసపు చూపులఁ; జొక్కులు = చొక్కులు = మయికము, మత్తు. పరవశత; నెలఁ తొకతె = ఆఁడుది ఒకతె, వనిత ఒకతె (ఇక్కడ ఆలోచన​, ఊహ​)

భావము: తేటతేట మాటలఁ తెరలు కట్టు గాటుకకన్నుల చెలిలా మురిపించునొక ఆలోచన. ఆనవాలు పట్టలేని మోసపు చూపులఁతో మయికము, మత్తులలో పడవేయునొక ఊహ​. 

వివరణముఈ చరణంలో భగవద్గీతలోని 14-6వ శ్లోకాన్ని యధాతంగా చెప్పిరి. శ్లో||   తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్  సుఖ-సంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ।।  భావముపాపరహితుడైన అర్జునా! గుణములలో సత్త్వగుణం నిర్మలమైనది. కనుక ప్రకాశవంతమైనది మరియు ఉపద్రవము లేనిదిఅయినప్పటికీ అది సుఖ సాంగత్యము వలన, జ్ఞానాభిమానము వలన మానవుని బంధిస్తుంది. 

దీపమునకు నిర్మలమైన చిమ్మీ కూడా ఒకానొక ఆవరణయే యగును‌. అటులనే, గుణములు చిమ్మీ మాదిరిగా  చైతన్యమునకు ఆవరణ ఏర్పరచి పరిమితము చేయుటకు ప్రయత్నించును.

జ్ఞానాభిలాషసంపద లాగే మనిషి సంపాదింౘుకొనునదే. జాగ్రత్తగా గమనిస్తే, చదువుకున్న వారు చదువులేనివారి కన్నా (ఆధారం లేకపోయినా) అధికులమని భావించడం సాధారణంగా చూస్తుంటాం. ఇది పూర్తిగా నిరాధారం. రకంగా జ్ఞానాభిలాష కూడా గర్వకారణ మౌతుంది.

తాను ఇతరుల కన్నా సమాజానికో, వూరుకో ఎక్కువ సేవ చేసాననో లేక ఎక్కువ శ్రమించాననో నెపం మీద తనని తాను ఉన్నత స్థాయిలో వూహించుకొని సుఖము పొందుటకు యోగ్యత కలదనుకొంటాడు మానవుడు. రకంగా సుఖాభిలాష కూడా మనిషిలో అహమును పెంచుతుంది.

అన్వయార్ధము:  నరుడా! నీ కన్నుల ముందే తేట మాటలఁ తెరలు కట్టు ఆలోచనల కదలికను ఆదిలోనే కనుగొన్నావా? నిన్ను మత్తులలో పడవేయుచునున్న నొక ఊహ పూనికను గుర్తించితివా?

 

ముసిముసినవ్వులు మోపులుగట్టీ
రసికుఁడ నీపై రమణొకతె
కొసరులఁ గుచములఁ గోటలు వెట్టీ
మిసమిసమెఱుఁగుల మెలుఁతొకతె అది॥

           

ముఖ్య పదములకు అర్ధములు: ముసిముసినవ్వులు = చిఱునగవు, దరహాసము; మోపులు = అధికము; కొసరులఁ = విజృంభణల​;

భావము: అధికముగా చిఱునగవులు దొరలించుచూ నీలో శృంగారమను ఆలోచనలను ఉసికొలిపి, ఆ మిసమిసమెఱుఁగులే లోకమనిపించు నదొక మనోవికారము. 

వివరణముఇక్కడ రజో గుణమును భగవద్గీతలోని 14-7వ శ్లోకాన్నుంచి ఉటంకించారు. శ్లో|| రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ । తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ।।(14-7)।।భావము: ఓ అర్జునా, రజో గుణము దృశ్యవిషయముల పట్ల ప్రీతిని, ఆసక్తిని కలుగజేయునని తెలుసుకొనుము. అది ఆత్మను (చైతన్యమును) చర్యల/కర్మల పట్ల ఆసక్తిని కలిగించి బంధించివేస్తుంది. 

రజో గుణము ఎంత అనుభవించినప్పటికిని తృప్తిని బొందనిదై, కర్మకేంద్రిత చర్యల పద్మవ్యూహమునకు కారణభూతమై యున్నది. కావున దీనిని మోక్షమార్గమున శత్రువుగా నెఱుఁగుము_. అందుకే రజో గుణమును మానవునికి పరమ శత్రువని హెచ్చరించారు. 

మన దుఃఖానికి అనాలోచిత చర్యలే చాలా వరకు కారణము. దాని మూలంగా కలిగే మంచి లేక చెడుల విచక్షణ లేకుండా, యేదో వొక చర్యకు, వుసి గొల్పునదే రజోగుణము. రజోగుణము కేవలం చర్య కేంద్రితం 

రజోగుణము వలననే సహజంగా మంచివాడైన మేకబెత్, రాజు డంకన్'ని చంపి, అన్యాయంగా రాజ్యం సంపాదించి, తన సహజ నైజమును వీడి, చాలా మనో వ్యధను, చివరకు చావును తెచ్చి పెట్టుకుంటాడు. శాంతమూర్తి, విజ్ఞుడైన ధర్మరాజు తాత్కాలికంగా యుక్తాయుక్త జ్ఞానము కోలుపోయి, జూదమాడి రాజ్యము పోగొట్టుకున్నాడు. ఇంతకు ముందు ఢిల్లీలో రోడ్ రేజ్ (road rage) గురించి కూడా చెప్పుకున్నాం.
 
కాయజకేలికిఁ గందువ చెప్పీ
చాయలసన్నల సతి యొకతె
యీయెడ శ్రీవేంకటేశ కూడి నిను
వోయని మెచ్చీ నొకతొకతె అది॥

ముఖ్య పదములకు అర్ధములు: కాయజకేలి =మన్మథకేళి; కందువ = దారి, జాడ; చాయల = నీడల​, చీకట్ల​, అంధకారముల​, సన్నల = సంజ్ఞల; వోయని = సత్యముగా, నిజంగా; 

భావము: మన్మథకేళికి దారులు చూపే చీకటి సంజ్ఞల మాయొకటి. ఈ వైపు శ్రీవేంకటేశ సత్యముగా నిను మెచ్చి నీలో కలసిపోయినదొక భావము. 

వివరణముచాయలసన్నల సతి యొకతె = చీకటి సంజ్ఞల మాయొకటి భగవద్గీతలోని 14-8వ శ్లోకాన్ని తెలుపుతోంది.  శ్లో|| తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్  ప్రమాదాలస్యనిద్రాభిః  తన్నిబధ్నాతి భారత  ।।(14-8)।। భావము: అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, సమస్త జీవరాశుల మోహభ్రాంతికి కారణము. అది నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రలచే భ్రమకు గురిచేసి బంధించివేస్తుంది.

*the end*

201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు. (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu)

  ANNAMACHARYULU 201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu) Introduction : A nnamacharya is t...