Saturday 28 January 2023

T-158 నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని

 అన్నమాచార్యులు

158 నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని


for English Version press here

 

అగోచరమైన సంకేతము

సారాంశం: తనకేమైపోయినా, దాని కంటే ఇతరులతో తనతో ఎలా ప్రవర్తిస్తారన్నది మనిషికి అత్యంత భయాందోళనలు కలిగించు విషయము”.

Summary of this Poem:

పల్లవి: నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని వున్నవాఁడను.  ఇక వేరే వుపాయ మేల? అన్వయార్ధము:  దేవుడా! నా మనస్సులో నీవే అంటే నీవు మాత్రమే వున్నావు.

చరణం 1: ఓ దైవమా! నువ్వు నన్ను రక్షింతువో కాక రక్షించవో అను సంశయములన్నీ వదలి నీ వెంబడి వస్తాను. భవిష్యత్తులో యితరులు నాపట్ల ఎలా ప్రవర్తించుదురోనన్న ఆందోళనను వదలి నీపై విశ్వాసము  నిలుపుకొంటిని.

చరణం 2: స్థిరమైన నీ మహిమ తెలుసుకున్న వాడనను గర్వమునకు చేయూతనివ్వక; ఏ ఉపాయముల చేతనూ నిన్ను వెదకి చూడలేమని, అటువంటి నా ప్రయాసలో అలసటకు గురియై నీవు లేవను నాస్తికత్వమును విడిచి నీపై విశ్వాసము  నిలుపుకొంటిని.

చరణం 3: దైవమా! ఎప్పటికీ ఆచరించదగ్గ ఆ చర్యలకు ఇతరులను తోడు దెచ్చు కొనే అవసరం లేదని అర్థం చేసుకున్నాను. ఆవలి వైపు నీతో ఉండటానికి ఇతరులతో సంబంధాలను తెంచుకున్నాను. ఓ అలమేలుమంగపతి శ్రీవేంకటేశుడా నా పుణ్యమంతటినీ అవతలి వైపు వదిలేశాను.

 

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: మానవాళిలో వ్యాపించి ఉన్న అశాంతికి, అనుమానములకు కీర్తన అద్దం పడుతుంది. ఒక యోగి అంతరంగములో అంతరంగములో  అనుభూతి చెందు మానసిక స్థితిని గురించి అన్నమాచార్యులు మాట్లాడుతున్నారు. అన్నమాచార్యులు లేవనెత్తిన అంశాలు ఆధునిక మానవుని, ముఖ్యంగా చేపట్టుటకు గల సర్వోత్కృష్టమైన కార్యముపై దృష్టి సారించు మానవుల మనసులో మొలకెత్తు సంశయములను  నిర్దిష్టంగా ప్రతిబింబిస్తాయి. మన ప్రక్కన నిలబడి, మన అంతరంగములో దొర్లు ఆలోచనలను అద్భుతమగు కీర్తనగా మలచిరా అనిపింపజేసిన అన్నమాచార్యులు చిరస్మరణీయులు.


కీర్తన:

రాగిరేకు:  312-2  సంపుటము: 4-68

నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని
వున్నవాఁడ నిఁక వేరే వుపాయ మేమిటికి పల్లవి॥
 
గతియై రక్షింతువో కాక రక్షించవో యని
మతిలోని సంశయము మఱి విడిచి
యితరులచే ముందర నిఁక నెట్టౌదునో యని
వెతతోడఁ దలఁచేటి వెఱ పెల్లా విడిచి నిన్ను॥
 
తిరమైన నీ మహిమ తెలిసేవాఁడ ననే
గరువముతోడి వుద్యోగము విడిచి
వెరవున నీ రూపము వెదకి కాన లే ననే
గరిమ నలపు నాస్తికత్వమును విడిచి నిన్ను॥
 
ధ్రువమైన చేఁతలకు తోడు దెచ్చు కొనే ననే
అవల నన్యుల మీఁది యాస విడిచి
వివరించి యలమేల్మంగవిభుఁడ శ్రీవేంకటేశ
తవిలి నా పుణ్యమంతయు నీకు విడిచి నిన్ను॥

Details and Explanations: 

నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని
వున్నవాఁడ నిఁక వేరే వుపాయ మేమిటికి పల్లవి॥

భావము: నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని వున్నవాఁడను.  ఇక వేరే వుపాయ మేల?

వివరణమునిజానికి ‘వేరే వుపాయము’ గురించి ఆలోచన మనసులో చొరబడడమే ఏమూలనో దాక్కున్న సందేహాన్ని యెత్తిచూపుతుంది.

ఈ కీర్తన కొంతవరకు క్రింది భగవద్గీత శ్లోకం ఆధారంగా రూపొందించబడిందని భావించవచ్చు. శ్లో|| వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన!| బహుశాఖా హ్యనంతా బుద్ధయో೭వ్యవసాయినామ్|| (2-41) భావము: ఓ అర్జునా! నిశ్చయించి అందిపుచ్చుకొనుటకు మనస్సుకు ఒకే ఒక మార్గము కలదు. చంచలమైన మనస్సు మాత్రమే అసంఖ్యాకమైన ఎంపికలను అంచనా వేస్తూ తడబడిపోతుంది.

పల్లవిని సమగ్రముగా జీర్ణించుకోవడానికి, ప్రసిద్ధ అధివాస్తవిక కళాకారుడు రెనె మాగ్రిట్టే వేసినఅగోచరమైన సంకేతము’{"ది గ్లాస్ కీ", French: La clef de verre, 1959} అనే పెయింటింగ్’ను పరిశీలిద్దాం. కొండ వెనుక వున్న కొండ శిఖరంపై ఒక పెద్ద బండరాయి వింతగా, కొండచరియ చివరి కొన మీద అటుగానీ ఇటుగానీ పడిపోవునను భయము పుట్టించునట్లు నిలబడి వున్నట్లు చూపించారు. రెండు పర్వతముల వాలులపై వెలుగు, నీడల వ్యత్యాసంతో బండరాయి ఎట్లా నిలబడిందో తెలుకోవాలన్న ఆసక్తిని చిత్రకారుడు రేకెక్తిస్తాడురాయి యొక్క స్థానమే విచిత్రమనుకుంటే అంతకంటే ఎక్కువ చిత్రమునకు  ‘అగోచరమైన సంకేతము’ "ది గ్లాస్ కీ" అని శీర్షిక​ పెట్టి నాటకీయత మరింత పెంచారు. “ఇటువంటి పరస్పర విరుద్ధ సంజ్ఞలను ప్రక్కప్రక్క వుంచి తద్వారా, సృష్టి యొక్క రహస్యం తెలియరాదని మాగ్రిట్ అభిప్రాయపడి వుంటారు” అని విజ్ఞుల అభిప్రాయము. 


పెయింటింగ్’లో ఒక కొండపై అతిసున్నితముగా సరితూగుతున్నట్లు చూపిన బండరాయిలా మానవుని మనసు తనలో తాను, ప్రపంచముతోనూ సమతూకములో సామరస్యంగా పనిచేయాలి. ఎంత కష్టపడినా దాదాపు అసాధ్యమైన పనిని దైవ సహాయం లేకుండా, పూర్తి చేయలేము. మద్దతును మాగ్రిట్  అగోచరమైన సంకేతము  'ది గ్లాస్ కీ'గా అభివర్ణించారు సిద్ధాంతాలపైన కానీ, పునాదులపైన కానీ మానసికంగా ఆధారపడని స్థితిలో, మనస్సు కేవలము ప్రతిస్పందించడం లేదా ఆదేశాలను అమలు చేయడం కంటే తన స్వంత నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. మనిషి స్థితిలో స్వేచ్ఛను కనుగొని అనంతం అనే భావనను అర్థం చేసుకుంటాడు. 

భగవద్గీత శ్లోకంలో కూడా ఇదే వ్యక్తమవుతుంది. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన । న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ॥ 3-18 ॥ భావము: విశ్వంలో దేనిపైనా ఆధారపడనివానికి పని (కర్మ) చేయడం వలన ప్రయోజనము కానీ లేదా పనిని (కర్మను) మానివేయడము వలన హాని కానీ కలుగవు. 

అన్నమాచార్యులు క్రింది చరణాలలో అటువంటి మార్గమును అనుసరించడానికి మనస్సులో తలెత్తే సంశయములను వివరిస్తారు.

అన్వయార్ధము:  దేవుడా! నా మనస్సులో నీవే అంటే నీవు మాత్రమే వున్నావు. 

గతియై రక్షింతువో కాక రక్షించవో యని
మతిలోని సంశయము మఱి విడిచి
యితరులచే ముందర నిఁక నెట్టౌదునో యని
వెతతోడఁ దలఁచేటి వెఱ పెల్లా విడిచి నిన్ను

ముఖ్య పదములకు అర్ధములు: వెతతోడఁ = వ్యథతో, శోకముతో; వెఱ పెల్లా = భయమంతా.

భావము: ఓ దైవమా! నువ్వు నన్ను రక్షింతువో కాక రక్షించవో అను సంశయములన్నీ వదలి నీ  వెంబడి వస్తాను. భవిష్యత్తులో యితరులు నాపట్ల ఎలా ప్రవర్తించుదురోనన్న ఆందోళనను వదలి నీపై విశ్వాసము  నిలుపుకొంటిని.

వివరణము: గతియై రక్షింతువో కాక రక్షించవో = ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు, అవగాహనకు సంబంధించిన విషయం. ప్రతి మనిషి స్థానం, సవాళ్లు ప్రత్యేకమైనవి. పై చిత్రములో చూపినట్లుగా, జీవితం అసురక్షితంగా ఉంచిన బండరాయి వంటిది. సత్వర చర్య తీసుకోకుంటే, తికమక పడుతూ వాయిదాలు వేస్తూ కూచుంటే బండరాయి చూపించిన విధంగానే ఎప్పటికీ ఉంటుందన్న గ్యారంటీ లేదు. అందువలన, మానవునికి దేవునిలో నిమగ్నం కావడం తప్ప వేరే మార్గం లేదు.

జీవితమను బండరాయిని ఇన్సూరెన్స్ ద్వారా భద్రపరుద్దామని, లేదా నా వాళ్ళతో వుంటే రాయి కదలినా ఎదుర్కొనే బలమొస్తుందని ప్రయత్నాలు చేస్తాడు మానవుడు. మన జీవితమంతా పనుల్లోనే గడుపుతాం. మీరు ఏమి చేసినా బౌల్డర్ (లేదా జీవితం) ప్రమాదకరంగా అస్థిరంగానే ఉంటుంది. జీవితం ఒక రాయి అయితే, మనం దానిని ఇతర వస్తువులతో సిమెంట్ ద్వారానో, మరే సాధనము ద్వారానో అతకవచ్చు. దురదృష్టవశాత్తూ అలా చేయలేం.  

మతిలోని సంశయము మఱి విడిచి = 'జీవితం' అని పిలువబడేది దేనిలోను కరగని, దేనితోను కలవని విషయం. మనలో ప్రతి ఒక్కరికీ అతిపెద్ద సవాలు. అన్నమాచార్యులు చెబుతున్నదేమిటంటే, మనకు సందేహం వచ్చినప్పుడు, మన మనస్సులో రెండు విషయాలు ఉంటాయి - సందేహం మరియు దేవుడు. పల్లవి ప్రకారం ఇది ఆమోదయోగ్యం కాదు, కాబట్టి, అన్వేషణలో సందేహాన్ని విడిచిపెట్టాలి. 

యితరులచే ముందర నిఁక నెట్టౌదునో = పదిహేనవ శతాబ్దపు ఋషికి, నిస్సందేహంగా మన మనస్సు వెనుక ఏమి దాగి ఉందో తెలుసు. తనకేమైపోయినా దాని కంటే ఇతరులతో తనతో ఎలా ప్రవర్తిస్తారన్నది మనిషికి అత్యంత భయాందోళనలు కలిగించు విషయము. కానీ, పరిశీలనకు పునాదులున్నవా? లేదా భయం యొక్క ఒక రూపం మాత్రమేనా? ఇది కేవలం ఊహాత్మకమా?

 

తిరమైన నీ మహిమ తెలిసేవాఁడ ననే
గరువముతోడి వుద్యోగము విడిచి
వెరవున నీ రూపము వెదకి కాన లే ననే
గరిమ నలపు నాస్తికత్వమును విడిచి నిన్ను

ముఖ్య పదములకు అర్ధములు: తిరమైన = స్థిరమైన; గరిమ = బరువు, భారము;

భావము: స్థిరమైన నీ మహిమ తెలుసుకున్న వాడనను గర్వమునకు చేయూతనివ్వక; ఏ ఉపాయముల చేతనూ నిన్ను వెదకి చూడలేమని, అటువంటి నా ప్రయాసలో అలసటకు గురియై నీవు లేవను నాస్తికత్వమును విడిచి నీపై విశ్వాసము  నిలుపుకొంటిని.

వివరణము: గరువముతోడి వుద్యోగము విడిచి = గర్వమునకు తోడగు యత్నములన్నీ విడనాడుతున్నాను. మనిషి అహంకారము విడనాడిననాడు భువి స్వర్గము కాదా?

 

తిరమైన నీ మహిమ తెలిసేవాఁడ ననే / గరువముతోడి వుద్యోగము విడిచి = "స్థిరమైన నీ ఉనికిని గ్రహించి అటు తరువాత, అవగాహన కలిగించు అహంకారము విడనాడుతున్నాను" అన్నది అన్నమాచార్యుని డంబములేనితనమును, వినమ్రతను సూచిస్తుంది. నిజానికి దైవముతో ఏకత్వాన్ని సాధించడం చాలా అరుదైన విషయము. వేళ్ళతో లెక్కించ గల కొద్ది మంది మాత్రమే విశిష్టమైన స్థానమును సాధించారు. ఇదే అభిప్రాయాన్ని జిడ్డు కృష్ణమూర్తి కూడా వ్యక్తం చేశారు. 

 

వెరవున నీ రూపము వెదకి కాన లే ననే భగవంతుడిని శోధన ద్వారానో, ఉపాయాల ద్వారానో, క్రమబద్ధమైన పని ద్వారానో కనుగొనలేము. విధంగా భగవంతుని కోసం అన్వేషించేవారు తమతమ ప్రయత్నాలలో అలసిపోతారు. 'దేవుడు లేడు' అని వారు చెప్పే అవకాశం ఉంది. అట్టి సన్నాహము లన్నింటినీ వదలివేయ వలెనని అన్నమాచార్యులు సెలవిచ్చారు. ఇక్కడే రెనె మాగ్రిట్టే కనరాని సత్యముతో "ది గ్లాస్ కీ"తో కనెక్ట్ అవుతాడు.

 

మీ దగ్గర తాళం ఉందో లేదో తెలియదు. అటువంటి గందరగోళ స్థితిలో మానవుడు ఏకాకి ఐపోతాడు. ఒంటరి ప్రయాణాన్ని గురించి దిగులు చెందని అన్నమాచార్యులు తర్వాతి చరణంలో తాను సిద్ధమని ఉద్ఘాటించారు. అయితే మనలో చాలా మంది ఒంటరి ప్రయాణాన్ని ఎదుర్కోలేక 'రక్షణ​' అని పిలువబడే స్వర్గం కోసం చూస్తారు. తెలుసుకోవడానికీ, తెలియకపోవడానికీ ఉన్న తేడా అదే. 

ధ్రువమైన చేఁతలకు తోడు దెచ్చు కొనే ననే
అవల నన్యుల మీఁది యాస విడిచి
వివరించి యలమేల్మంగవిభుఁడ శ్రీవేంకటేశ
తవిలి నా పుణ్యమంతయు నీకు విడిచి నిన్ను

ముఖ్య పదములకు అర్ధములు: ధ్రువమైన = స్థిరమైన​, మారని; తవిలి = దైవమును అంటిపెట్టుకొని వుండాలనే ఉద్దేశ్యంతో;

భావము: దైవమా! ఎప్పటికీ ఆచరించదగ్గ ఆ చర్యలకు ఇతరులను తోడు దెచ్చు కొనే అవసరం లేదని అర్థం చేసుకున్నాను. ఆవలి వైపు నీతో ఉండటానికి ఇతరులతో సంబంధాలను తెంచుకున్నాను. ఓ అలమేలుమంగపతి శ్రీవేంకటేశుడా నా పుణ్యమంతటినీ అవతలి వైపు వదిలేశాను.

వివరణము: ధ్రువమైన చేఁతలకు తోడు దెచ్చు కొనే ననే: అవగాహన దృఢంగా ఉన్నప్పుడు, అంతఃకరణము స్పష్టంగా ఉన్నప్పుడు సిద్ధాంతాలకు లేదా మార్గదర్శులకు తావుంటుందా? మన అతుకులబొంత అగు జీవితములో ప్రతీ విషయమునకు ఇతరులపై ఆధారపడడము నేర్చితిమి. ఇది కాదనలేని వాస్తవం. 

ధ్రువమైన చేఁతలకు: అనగా ప్రాథమికమైన పనుల​ (కొంత శరీర పోషణ కోసం మరియు ఎక్కువ పాళ్ళు మానసిక శ్రేయస్సు) కోసం వ్యక్తి బయటి ప్రపంచంపై ఆధారపడడు అని.  ఆహారము, దుస్తులు, ఆశ్రయం నుంచి ఎవరికీ మినహాయింపు లేదు. కానీ వాటిలోనే నిమగ్నమైనప్పుడు, అవి అందించు ఆనందమను భావన కోసం మనము సత్యమగు జీవితాన్ని త్యాగం చేస్తున్నాము.  కానీ వ్యక్తి దానిని భగవంతుడికి (లేదా ప్రకృతికి) వదిలేశాడు. అటువంటి స్థితిలో, అతడు (శారీరకంగా మరియు మానసికంగా) బయటి నుండి మద్దతు కోసం ఎదురు చూడనప్పుడు, అగోచరమైన సంకేతము, (గ్లాస్ కీ) ద్యోతకమగును. ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి ఏమన్నారో చూడండి. 

"మీలోనే ప్రపంచమంతా దాగివుంది. మరి, ఎలా చూడాలో తెలిస్తే అక్కడ తలుపు ఉంది, తాళంచెవి మీ చేతిలో ఉంది. మీ కోసం భూమ్మీద తాళం చెవిని గానీ, తలుపును గానీ మీరు తప్ప మరెవరూ తెరవలేరు" 

అన్నమాచార్యులు ఉపయోగించిన మరొక ఆసక్తికరమైన పదం తవిలి = దైవమును అంటిపెట్టుకొని వుండాలనే ఉద్దేశ్యంతో. చాలామంది ఇది కోరుకున్నప్పటికీ, అగ్ని పరీక్షలో, పలువురు వెనక్కు తగ్గి, మామూలు జీవితానికి తిరిగి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తవిలి అనే పదం ద్వారా అన్నమాచార్యులు అగ్నిగుండంలో దాగివున్న సత్యాన్ని భయపడకుండా పట్టుకోవాలని సూచిస్తున్నారు.

ఇప్పుడు భగవద్గీత శ్లోకం యొక్క ఔచిత్యాన్ని క్రింద చూడండి: ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్ / ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః । ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి / శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ॥ 2-29 ॥ Purport: కేవలం చూడటం, వర్ణించడం, వినడం ద్వారా మెచ్చుకోవడం ద్వారా ఆత్మను ఎవరూ అర్థం చేసుకోలేరు.  కాబట్టి ఇది ఒక వ్యక్తి తన ఆత్మతో తనను తాను విలీనం చేసుకోవాలని సూచిస్తుంది, అందువలన ఇది సైద్ధాంతిక అన్వేషణ కానే కాదు. ఒకే సమయంలో చేయడము, నేర్చుకోవడము జరగవలెను. అందువలన అన్నమాచార్యులుతవిలి’ అనే పదాన్ని ఉపయోగించారు.

 

-X-The End-X-

201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు. (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu)

  ANNAMACHARYULU 201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu) Introduction : A nnamacharya is t...