Saturday 7 October 2023

T-4 ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల

 అన్నమాచార్యులు

4 ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల

Synopsis: నీకేమీ తెలియదని తెలియడమే నిజమైన జ్ఞానం -సోక్రటీస్

(The only true wisdom is in knowing that you know nothing – Socrates)


కీర్తన సారాంశం:

పల్లవి: (ఈ శాస్త్రములు / వేదములు) ఇన్నియుఁ జదువనేల? (దైవమును) యింతా వెదకనేల? కనులు తెరచుటలోను కనులు మూయుటలోను బేధమున్నదా? (లేదు)

అన్వయార్ధము 1: జననం, మరణం రెండే రెండు పరమ వాస్తవాలు. అనివార్యమైన ఈ  అవధుల మధ్య కాలమును సిద్ధాంతాలతోను, వెదుకుటలోనూ వృథా చేయవద్దు.

అన్వయార్ధము 2: మానవులారా! మీ ఇప్పటి అవగాహనలను ప్రక్కన బెట్టి, ఎదురుగా వున్న ఈ ప్రపంచమును కనుగొనుడీ!

చరణం 1: 'వలెను', 'వలదు' అనే వ్యతిరేకతల మధ్య మనసు నలిగిపోతుంది. 'వలెను' బంధమునకు, ‘వలదు' మోక్షానికి దారితీస్తుందని తెలియు జ్ఞానులకు మార్గ మిదే.

చరణం 2: పుట్టుట​, పోవుట ఒకటే. వీని రాకపోకల​​ సూచనగా దేహము మర్పులనోందును. మరణము ఖాయమే కానీ పునర్జన్మ కాకపోవచ్చు. ఈ సత్యాన్ని స్పష్టంగా చూచు విజ్ఞానులకు గల దారి యిదే.

చరణం 3: పరము, ఈ ప్రపంచము ఒక్కటే. జాతర్ల మాదిరి కన్పట్టు వీనికై జీవుడు భ్రమ పడును. స్థిరముగా శ్రీవేంకటేశుఁడు ఇహపరములకు కర్త. శరణాగతులకు సత్యముగా వున్నది ఇతడొక్కడే. అన్వయార్ధము: పరము అనునది వున్నదో లేదో అను అనుమానములను విడిచి, వాటిని సృజించు శ్రీవేంకటేశుఁని శరణాగతిచేసి శాశ్వతమైన సత్యమును తెలియుము.

విపులాత్మక వివరణము

ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు మాటలతో మాయాజాలాన్ని అల్లి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. ఇంత కంటే సులభమనిపించు కీర్తన కానీ, అర్ధము చేసికొనుటకు ఇంత కంటే కఠినమైన కీర్తన కానీ లేదు.  ఈ కీర్తనలో వారు ముక్తి కోసం ఏక మనస్సుతో కూడిన భక్తి  యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

సరళమైననూ, గణింపదగ్గ ఈ సమర్పణలో, మానవాళి భగవంతుడిని సాక్షాత్కరించుకోవడానికి సిద్ధాంతాలు మరియు పుస్తకాల అన్వేషణలో ఎందుకు నిమగ్నమైందని ఆయన ఆశ్చర్యపోతారు. ముక్తికి మొదటి, చివరి మెట్టు మానవుడే తప్ప వెలుపలి శక్తులు కావని ఆయన పేర్కొన్నారు.

ఇందులో, అవును (ప్రాపంచిక సుఖాలు) మరియు కాదు (మోక్షమార్గం) యొక్క పరస్పర వ్యతిరేక శక్తుల మధ్య మానవుడు ఎలా నలిగిపోతాడో వర్ణించాడు. మనలో చాలా మంది ఈ రెండింటినీ అనుసరించ ప్రయత్నిస్తారు. అందువలన, మానవుడు అయోమయంలో పడి చేపట్టవలసిన కార్యమును నిర్ణయించుకోలేడు.

చివరగా, ఆయన రెండు ఈ ప్రపంచాలు లేవని, వున్నది ఒకటే అని నొక్కి చెబుతారు. అంతేకాక మరొక ప్రపంచం అనేది మానవుల భావనాత్మక భ్రమల అయోమయమే నని అంటారు.

 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు:  311-4 సంపుటము: 4-64

ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల
కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే       ॥పల్లవి॥
 
వలెననే దొకమాఁట వలదనే దొకమాఁట
సిలుగులీ రెంటికిని చిత్తమే గురి
వలెనంటే బంధము వలదంటే మోక్షము
తెలిసే విజ్ఞానులకు తెరువిది యొకటే ॥ఇన్ని॥
 
పుట్టెడిదొకటే పోయెడిదొకటే
తిట్టమై యీ రెంటికిని దేహమే గురి
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము
వొట్టిన విజ్ఞానులకు నుపమిది యొకటే ॥ఇన్ని॥

 పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే

సిరుల నీ రెంటికిని జీవుఁడే గురి
యిరవై శ్రీవేంకటేశుఁ డిహపరములకర్త
శరణాగతులకెల్ల సతవిూతఁ డొకఁడే     ॥ఇన్ని॥

 Details and Explanations: 

ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల

కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే      ॥పల్లవి॥

భావము: (ఈ శాస్త్రములు / వేదములు) ఇన్నియుఁ జదువనేల? (దైవమును) యింతా వెదకనేల? కనులు తెరచుటలోను కనులు మూయుటలోను బేధమున్నదా? (లేదు)

వివరణముకబీరుదాస్ గారి ఈ దోహాను చూడండి. पोथी पढ़ि पढ़ि जग मुआ, पंडित भया न कोय, ढाई आखर प्रेम का, पढ़े सो पंडित होय। పుస్తకాలు చదివి చదివి జగము అలసిపోయినది కానీ, వారెవ్వరూ పండితులు కాననైరి. రెండున్నర అక్షరాల (=ప్రేమను) సరిగ్గా అర్థం చేసుకోండి నిజమైన పండితులగుటకు.

అన్నమాచార్యులు కబీరుదాస్ గారి వలెనె  ఈ శాస్త్రములను  వేదములను చదువుతూదైవమును వెదుకుతూ కాలము వ్యర్థము చేసుకొనకు అంటున్నారు.

మనకు ప్రతీ దానిపై ఒక అంచనా వుంటుంది. మన ఆలోచనలకు సరిపోయే విషయాలు తారస పడినప్పుడు అది సత్యమని భావించుట కద్దు. భగవద్గీతలో సర్వస్య ధాతారమచింత్యరూపమ్” (8-9)  అని పేర్కొన్నట్లు భగవంతుణ్ణి వూహించలేని రూపము గలవానిగా తీసుకొనవలెను.

కాబట్టి ఉజ్జాయింపులకు అతీతముగా వున్న భగవంతుణ్ణి మన ఇప్పటి జ్ఞానముతో వెదుకుకుట అవివేకమని అన్నమాచార్యుల అభిప్రాయము.  భగవంతుడు ఊహకు అందనివాడు కాబట్టి ఈ అన్వేషణల్లో నిమగ్నం కావొద్దని అన్నమాచార్యులు చెప్పారు.

"కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే"అను దానిపై విపులమైన వివరణ రెండవ చరణములో ఇవ్వ బడినది. 

అన్వయార్ధము 1: జననం, మరణం రెండే రెండు పరమ వాస్తవాలు. అనివార్యమైన ఈ  అవధుల మధ్య కాలమును సిద్ధాంతాలతోను, వెదుకుటలోనూ వృథా చేయవద్దు.

అన్వయార్ధము 2: మానవులారా! మీ ఇప్పటి అవగాహనలను ప్రక్కన బెట్టి, ఎదురుగా వున్న ఈ ప్రపంచమును కనుగొనుడీ!

వలెననే దొకమాఁట వలదనే దొకమాఁట

సిలుగులీ రెంటికిని చిత్తమే గురి

వలెనంటే బంధము వలదంటే మోక్షము

తెలిసే విజ్ఞానులకు తెరువిది యొకటే ||ఇన్ని||  

ముఖ్య పదములకు అర్ధములు:  సిలుగు = ఆపద, చెరువు, సంకటము, తొందర, ఉపద్రవము.

భావము: 'వలెను', 'వలదు' అనే వ్యతిరేకతల మధ్య మనసు నలిగిపోతుంది. 'వలెను' బంధమునకు, ‘వలదు' మోక్షానికి దారితీస్తుందని తెలియు జ్ఞానులకు మార్గ మిదే.

వివరణముఅన్నమాచార్యుల మొట్టమొదటి కీర్తన “వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు” నుండి కూడా 'వలెను', 'వలదు'ల మీమాంసకు లోనుకాని స్థితినే ఆయన వర్ణించిరి. ఇక్కడ కూడా అదియే పునరావృత్తము చేసిరి.

"తెరువిది యొకటే" అని, అయితే అన్నమాచార్యులు దానిని స్పష్టం చేయలేదని అనిపిస్తుంది. ఇది ఎంత వరకు నిజము? ఆలోచింతము.   మన మనస్సును గమనించినట్లయితే, అది ఒక ద్రవము లేదా వాయువు లాంటిదని సులభంగా గ్రహించవచ్చు. అన్నమాచార్యులు మనస్సును గురించి ఇలా అన్నారు.

పట్టఁ బసలేదు చూడ బయలుగాదీమనసు

నెట్టనఁ బారుచునుండు నీరూఁ గాదీమనసు

చుట్టిచుట్టి పాయకుండుఁ జుట్టమూఁ గాదీమనసు

యెట్టనెదుటనే వుండు నేఁటిదో యీమనసు

 

అలాగే, భగవద్గీతలో చెప్పినట్లు మనసును తెలియుట వాయువును బంధించుట కంటే కష్టతరము. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ।। 6-34 ।। భావము: ఓ కృష్ణా, ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది, మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది.

పల్లవిలో చెప్పిన​ చదవకుండా, వెతకకుండా మనసు చేయగల పని యేమి? ఏమియూ లేదు. అంటే అన్నమాచార్యులు చరణాలలో కూడా ఏమీ చేయక వూరక వుండమని బోధించుచున్నారు. తిరిగి “వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు”ను స్మరించుకొనెదము. అనగా కావాలని పైన వేసుకొనరాదు. పైన పడిన వానిని నుండి (యాదృచ్ఛికముగ తగులుకొన్నవి) వలదని తొలఁగరాదు.

ధ్యానము ప్రక్షాళన అని మహానుభావులు తరచూ చెప్తారు, కాని దాని చర్యను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు అనిపించదు. అన్నమాచార్యుల వారి, జిడ్డు కృష్ణమూర్తిగారి ప్రకటనలలోని దగ్గరి పోలికలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ కవితలోని విషయాలు చూడగానే నాకు జిడ్డు గారు అన్న ఈ మాట గుర్తుకు వచ్చింది “here is my secret: I don’t mind what happens”."ఇదే నా రహస్యం: నాకు ఏం జరిగినా  నిరోధించను".

దీనికి పూర్తిగా వ్యతిరేకముగా ఏం జరిగినా నియంత్రించమని (కంట్రోల్ చేయమని) చిన్నప్పటి నుంచే మనకు నూరి పోస్తారు. రహస్యాలను దాచేందుకు నాలుకను అదుపులో పెట్టుకుంటాం. మన భావోద్వేగాలను నియంత్రించి విజయాన్ని అందుకోబోతాం. ప్రణాళిక వేసుకోవడం ద్వారా మన భవిష్యత్తును నియంత్రిస్తాం.

అయినప్పటికీ, మన హృదయాలలో నిగూఢముగా, ప్రేమగా దాచుకున్న సిగ్గుమాలిన, అసభ్యకరమైన ఆలోచనలను ప్రపంచాన్నుంచి మరుగున వుంచ చూస్తాము.  అయినాఅయినాధ్యానము గురించి చర్చించాలనుకుంటాము! దీనితో "వలెననే దొకమాఁట వలదనే దొకమాఁట /  సిలుగులీ రెంటికిని చిత్తమే గురి" సత్యమై కూర్చుంటుంది. మనిషి ఎటుపోవుటయో నిర్ణయించు కోలేకపోతాడు.  "బోధించిన సన్మార్గ వచనముల బొంకు జేసి తాఁ బట్టినపట్టు సాధించెనే ఓ మనసా" అన్న త్యాగరాజు గారి పలుకులను కూడా మననము చేసుకుందాము.

అన్వయార్ధము:

పుట్టెడిదొకటే పోయెడిదొకటే

తిట్టమై రెంటికిని దేహమే గురి

పుట్టుట సంశయము పోవుట నిశ్చయము

వొట్టిన విజ్ఞానులకు వుపమిది వొకటే ||ఇన్ని||

 

ముఖ్య పదములకు అర్ధములు: తిట్టము = చిత్రము వేసే ముందర రేఖలతో వేసుకొనే స్థూలాకారము, basic plan, ఇక్కడ నమూనాగా తీసుకోవచ్చును; వొట్టిన = ఏమీలేని; వొట్టిన విజ్ఞానులకు = జ్ఞానము తప్పించి వేరేమీ లేని వారికి;

 

భావము: పుట్టుట​, పోవుట ఒకటే. వీని రాకపోకల​​ సూచనగా దేహము మర్పులనోందును. మరణము ఖాయమే కానీ పునర్జన్మ కాకపోవచ్చు. ఈ సత్యాన్ని స్పష్టంగా చూచు విజ్ఞానులకు గల దారి యిదే.

వివరణముఇవి సులభముగా అనిపించ వచ్చును. మనకు తెలిసినదంతా పరోక్ష జ్ఞానమే. ఇది నేను, ఇది ప్రపంచమని తెలియుటయూ చైతన్యములోని భాగమే. అటువంటి ఏ సిద్ధాంతాలు, వూహలు, జ్ఞప్తుల మీద అధార పడక మనకై మనము తెలియు విషయమే జ్ఞానము.

శబ్దాలంకారాలకు​ఆకృతుల అందాలకుభావనా దర్శనములకు ఆకర్షితులవుతాం. అవగతమగు పదముల కూర్పుతో సమకూరు తలపులుఆ తలపులకు మూలమగు జ్ఞప్తులు ఒకదానికొకటి పరిపూరకములని (complementary) అర్థం చేసుకోవడం ద్వారా సత్యంతో మమేకం కావాలని ఈ కీర్తన పదేపదే సందేశమిస్తుంది. 

'(పుట్టితిని అనే) తెలిసిన దాని' నుండి 'అది యేమిటో తెలియనిది (=మరణము)' వైపు జరుపు ఊహాజనిత ప్రయాణమే జీవితము. ఈ ప్రయాణము అగమ్యము. విపత్కరము. పెను సవాళ్లతో కూడినది. దీనికి మార్గ నిర్దేశము చేయగలిగిన వారు లేరు. భగవద్గీత కూడా ఇలా చెప్పింది, తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః (15-5) అప్పుడు దేనిని ఆశ్రయించిన తిరిగి ఈ లోకములోనికి తిరిగి రామో, దానిని వెతక వలెను.

కానీ పుట్టుట, పోవుట ఒకటే అంటున్నారు అన్నమాచార్యులు. దీనిని నమ్ముటెట్లు? చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి? / మాలుగలపి దొరతనంబు మాన్పు టింత చాలదా?” అను కీర్తనలో వృథా ప్రయాసలతో కూడిన మన ఇప్పటి జీవితమునకు మరణమునకు పెద్ద వ్యత్యాసము లేదంటున్నారు. రెండవ తరగతి ఆలోచనలతో మనము మరణమును తెలియలేము. ప్రత్యక్ష జ్ఞానముతో అవి తెలిసిన వారి మాటలను ఖండించలేము. పొతే మనది అప్రత్యక్ష జ్ఞానమని (అజ్ఞానమని) తెలియుట ముఖ్యము.

భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని పరిశీలించండి. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః । స బుద్దిమాన్మనుశ్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ॥4-18॥ భావము:  ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనేవున్నా, వారు యోగులు మరియు వారి సమస్త కర్మలను చేయువారు. దీనిని ఈ రకముగా అన్వయించుకోవచ్చును. "ఎవరైతే మరణము నందు జీవనమును మరియు  జీవనము నందు మరణమును దర్శించుదురో వారు మానవులలో బుద్ధిశాలురు".

అసంబద్ధంగా కనిపించినప్పటికీ, ఈ బైబిలు ప్రకటనను పరిగణనలోకి తీసుకోండి:  అప్పుడు యేసు తన శిష్యులను చూచి “ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడలతన్నుతాను ఉపేక్షించుకొనితన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనునునా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించు కొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును (ఆత్మను) పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ఆత్మకు ప్రతిగా నేమి యియ్యగలడు?” (ముత్తయి 16:24-26).

ఈ రకముగా అత్యంత కఠినమైన విషయము “పుట్టెడిదొకటే పోయెడిదొకటే”ను అన్నమాచార్యులు సులభముగా బోధపడునట్లు చెప్పిరనుకోవచ్చును. పల్లవిలోని "కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే" అర్ధము కూడా ఇదే.  కానీ అట్టి దర్శనము ఎవరికి కలుగును? దానిని 4వ పంక్తిలో చెప్పిరి.

 

అన్నమాచార్యులు స్వచ్ఛమైన, కల్తీలేని, నిరాసక్తమైన పరిశీలకుడిని సూచించడానికి ఒట్టిన విజ్ఞానులు  అని ప్రయోగించారు. వాస్తవానికి, అటువంటి వ్యక్తులు చాలా అరుదు. జిడ్డు కృష్ణమూర్తి గారు తన ప్రసంగములలోను, పుస్తకాలలోను స్వచ్ఛమైన, గతముతో కలుషితముగాని పరిశీలనకే ఎక్కువ సమయం కేటాయించిన  సంగతి మీకు విదితమే.

 

పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే

సిరుల నీ రెంటికిని జీవుఁడే గురి

యిరవై శ్రీవేంకటేశుఁ డిహపరములకర్త

శరణాగతులకెల్ల సతవిూతఁ డొకఁడే ||ఇన్ని||

 

ముఖ్య పదములకు అర్ధములు: సిరులు = జాతరులు; సతము=సత్యము, ఎప్పటికీ​​.

భావము: పరము, ఈ ప్రపంచము ఒక్కటే. జాతర్ల మాదిరి కన్పట్టు వీనికై జీవుడు భ్రమ పడును. స్థిరముగా శ్రీవేంకటేశుఁడు ఇహపరములను కలిగించును. శరణాగతులకు సత్యముగా వున్నది ఇతడొక్కడే.

వివరణముఇప్పుడు రెనే మాగ్రిట్‌ వేసిన దిగువన ఉన్న key to the fields (La clef des champs క్షేత్రమునకు మార్గము పేరుతో ఉన్న పెయింటింగ్‌ను శ్రద్ధగా చూడమని పాఠకులకు అభ్యర్థన.

ఈ బొమ్మలో మనవైపుకుఆవలి వైపుకు (బాహ్య ప్రపంచమునకు) మధ్య ఒక విరిగిపోయిన గాజు కిటికి వుంది.   

విరిగిన ముక్కలు మనవైపు పడి వున్నాయి. అనగా ఆ గాజుని బయటనుండి ఎవరో పగలకొట్టారన్నమాట.

ఆ ముక్కలను గమనించినగాజు పగలక ముందుమనం క్షేత్రము యొక్క పెయింట్ చేసిన చిత్రాన్ని మాత్రమే చూస్తున్నాము అని తెలియ వచ్చు.

గాజు పగిలిన తర్వాత​మనం నిజమైన ‘క్షేత్రము'ను చుడగలుగుతున్నాము.

 క్షేత్రము యొక్క పెయింట్ చేసిన చిత్రాన్ని మాత్రమే గమనిస్తున్నామునిజమైన ‘క్షేత్రము'ను కాదు అని యిట్టే తెలియును.

అంటేఆ గాజు తెర మన అంతఃకరణము అన్నమాటా.  అందుకే అన్ని మత గ్రంథములలో అంతఃకరణ శుద్ధికి అంత ప్రాముఖ్యతనిచ్చారు.

మనిషి తాను చూచునది సత్యమని భావిస్తాడు. కానీ తన చూపులను ప్రభావితము చేయుచున్న వాటిని గ్రహించుట దుష్కరము.

ప్రతీ అనుభవము మన మనస్సులో ఏదోవొక జాడను వదులుతుంది. ఇటువంటివి అనేకము కలసి బుద్ధిలోనికి వచ్చు సమాచారమును ‘వాతావరణములోని ధూళికణములు సూర్యుకాంతిని చెదిరి పోయేటట్లు చేయునట్లు’ సవరించును. కావున మనకు అనుభవములోనికి వచ్చు దర్శనము (picture) సత్యమునకు దూరముగా ఉండును. దీనినే పెయింట్ చేసిన చిత్రాన్ని మాత్రమే చూచుదుమని మాగ్రిట్టె గారు తెలిపిరి.

జిడ్డు కృష్ణమూర్తి గారి ఈ ప్రకటనను పరిశీలించండి. "మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమేఏ విషయాన్ని ఆశించడమోగ్రహించడమో లేదా ప్రతిఘటించడమో లేనప్పుడేఏది నిజమో చూడడం సాధ్యమవుతుంది. విముక్తి కలిగించేది సత్యమేగానిస్వేచ్ఛగా ఉండటానికి మీ ప్రయత్నం కాదు." 

ఇహము పరము కలిగించు వాడు శ్రీవేంకటేశుఁడు.

అనగా తనకున్నవన్నీ విడిచి శరణాగతి చేయుటయే మానవునికి గల ఏకైక వుపాయము.

శరణాగతులకు సత్యముగా వుండు వాడితడొకడే శ్రీవేంకటేశుఁడు.

గాజును పగలగొట్టినవాడు చేస్తున్న పనిలో లీనమై గాజు ఎలా పగిలిదీ గమనించలేదని తెలుస్తోంది

అతనికి త్వరిత గతిని గాజును ఛేదించుకు పోవాలన్న తపన ప్రస్ఫుటం.

ఈవల నిలబడి వున్న మనిషిని రక్షించడమే అతని ఆసక్తి ​.

సత్యానికి క్రమబద్ధమైన మార్గం లేదు.

అనియమిత మరియు ప్రమాదయుక్తమైన మార్గం చిందరవందర ప్రపంచంయొక్క నైజమును చూపుతోంది. గాయాలకు భయపడి మనం గాజు గోడను దాటకపోతే అంతకంటే పిరికితనముండదు. 

-x-x-x-

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...