అన్నమాచార్యులు
T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ
కీర్తన సంగ్రహ భావము:
పల్లవి: నేను ఇంత కాలము ఆ సొమ్ములు, ఈ బాంధవ్యాలు, ఆ ముక్తి, ఆ పుణ్యము కావాలి అనుకుంటూ ఎన్నో గడిచుకున్నాను.
వాటన్నిటిని ఇప్పుడు దిగవిడవమంటే న్యాయమా నీకు? విడిచానే అనుకో. అప్పుడు నేను ఏమైపోయినా నీవే రక్షించుకో ఓ అంతర్యామి.
చరణము 1: మనం ఏదైనా సొమ్ము పోగొట్టుకుంటే అది పోగొట్టుకున్నచోట తచ్చాడుతూ
తిరుగుతూ అక్కడ పడేవేసితినా ఇక్కడ పడేవేసితినా అని గుర్తు చేసుకుంటూ, మన శక్తులన్నీ
కూడగట్టుకుని వీధులన్నీ తిరిగి వాటిని తిరిగి పొందేవరకు మనం ఎంత క్లేశము చెందుతాము? నాకు
తెలుసును అనే నమ్మకంతో తనను తాను చిక్కించుకొని
ఏమి చేయకుండా భగవంతుడిపై భారం వేసి ఉండగలుగుతాడా మానవుడు?
చరణము 2: ఓడ కొనుక్కునేవాడు దాన్ని ఒక తీరమునకు చేర్చి, పరిశీలించి దానికి తగిన డబ్బు ఇవ్వడానికి సిద్ధమై తన సొంతం చేసుకుంటాడు. ఇక్కడనే
ఈ ప్రపంచం లోనే నాకు అటువంటి గట్టు కానీ,
తీరము కానీ కనబడుటలేదు. నువ్వే ఎలాగైనా నన్ను
కాపాడాలి ఓ అంతర్యామి.
చరణము 3: ఉప్పు అమ్మేవాడు దానిపై నీటి చిట్లు పడకుండా ఎంత జాగ్రత్తగా ఉంటాడో, శ్రీ వేంకటేశ అంతే అప్రమత్తముగా, వోపికగా నీకై వేచి ఉన్నాను. నన్ను పుట్టించావు కాబట్టి నా భారం కూడా నువ్వే మొయ్యాలయ్యా ఓఅంతర్యామి!
ఉపోద్ఘాతం: చాలా అద్భుతమైన కీర్తన. అన్నమాచార్యులు ఎంత వేదన చెంది భగవంతుని ప్రార్థిస్తున్నారో తెలుస్తుంది. భగవద్గీతలో చెప్పిన ప్రకారం అన్ని విడిచి ఆ స్వామినే దిక్కు అనుకునే వారికి భగవంతుడి పట్ల ఉండే ఆర్తి ఈ కీర్తనలో చెప్పినట్లు ఉంటుంది. అట్టివారి మనఃస్థితిని వర్ణిస్తున్నారు. మనకు దైవ పట్ల వున్న నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నారు అన్నమాచార్యులు.
అధ్యాత్మ కీర్తన: అన్నమాచార్యులు
రాగిరేకు 107-3
సంపుటము: 2-39 తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
రాగిరేకు 3-1
సంపుటము: 15-14
|
నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ
అన్నిటా రక్షించుకోవె అంతర్యామీ ॥పల్లవి॥ సొమ్ము వోవేసినవాఁడు చుట్టి చుట్టి వీధులెల్లా
కమ్మర వెదకీనట కన్న దాఁకాను
నమ్మిన ఆజ్ఞానములో నన్నుఁ బడ వేసికొని
అమ్మరో వూరకుందురా అంతర్యామీ ॥నన్ను॥ వోడబేరమాడేవాఁడు వొక్కదరి చేరిచి
కూడిన యర్థము గాచికొనీనట
యీడనే ప్రపంచములో యిట్టే నన్ను దరి చేర్చి
వోడక కావఁగరాదా వోయంతర్యామీ ॥నన్ను॥ చేరి వుప్పమ్మేవాఁడు చిట్లు వేఁ గనఁడట
వూరకే శ్రీ వేంకటేశ వోపికతోడ
ఆరయ నన్నుఁ బుట్టించినట్టివాఁడవు నా
భార మేరీతినైన మోవు మింక నంతర్యామీ ॥నన్ను॥
|
Details and explanations:
ముఖ్యపదములకు అర్ధములు: గడించి = సంపాదించుకున్నవి; నాయమా = న్యాయమా?; దిగవిడువ = ఒక్కపళంగా వదిలిపెట్టు;
భావము: నేను ఇంత కాలము ఆ సొమ్ములు, ఈ బాంధవ్యాలు, ఆ ముక్తి, ఆ పుణ్యము కావాలి అనుకుంటూ ఎన్నో గడిచుకున్నాను. వాటన్నిటిని ఇప్పుడు దిగవిడవమంటే న్యాయమా నీకు? విడిచానే అనుకో. అప్పుడు నేను ఏమైపోయినా నీవే రక్షించుకో ఓ అంతర్యామి.
వివరణ: "నన్ను నింతగా గడించి" అంటే నేను అనుదానిని ఇంతకాలమూ పెంచి పోషించాను. ఇప్పుడు దాన్ని ఎలా విడవమంటావు అని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యపదములకు అర్ధములు: సొమ్ము = material acquisition; వోవేసినవాఁడు =పోగొట్టుకున్నవాడు; నమ్మిన ఆజ్ఞానము= belief that I know, నాకు తెలుసు అనే నమ్మకం; పడ వేసికొని= తనను తాను చిక్కించుకొని, entrenching oneself; అమ్మరో = exclamation, నివ్వెరపోతున్నాడు; వూరకుందురా = ఏమీ చేయకుండా ఊరకుందురా?
భావము: మనం ఏదైనా సొమ్ము పోగొట్టుకుంటే అది పోగొట్టుకున్నచోట తచ్చాడుతూ తిరుగుతూ అక్కడ పడేవేసితినా ఇక్కడ పడేవేసితినా అని గుర్తు చేసుకుంటూ, మన శక్తులన్నీ కూడగట్టుకుని వీధులన్నీ తిరిగి వాటిని తిరిగి పొందేవరకు మనం ఎంత క్లేశము చెందుతాము? నాకు తెలుసును అనే నమ్మకంతో తనను తాను చిక్కించుకొని ఏమి చేయకుండా భగవంతుడిపై భారం వేసి ఉండగలుగుతాడా మానవుడు?
వివరణ: మొదటి రెండు పంక్తులలో మనము ఏ విధంగా వ్యవహరించేది చెబుతున్నారు. తర్వాతి రెండు పంక్తులలో ఏది మనము ఆవిధంగా చేయునట్లు చేయునో దానిని వివరించుచున్నారు.
మనము ఏదో పోగొట్టుకున్నాము అన్న భ్రమలో ఆ సొమ్ములు, ఆ డబ్బు, ఆ బాంధవ్యాలు, ఆ ముక్తి, ఆ పుణ్యము కావాలి అనుకుంటూ ఆయా వాటికై వెదకుచు వెంపర్లాడుతూ జీవిస్తాం అని చెబుతున్నారు. మనం ప్రస్తుతం వున్న అజ్ఞాన స్థితిలో రజో గుణ ప్రభావితులమై మొదటి రెండు పంక్తులలో చెప్పినట్లు ఏదోవొకటి చేయబోతాము. కాలు కాలిన పిల్లిలా తిరుగుతాము.
సర్వము భగవంతునిపై వదిలి ఏమి చేయకుండా ఉండగలమా? మనకు భగవంతుని మీద అంత నమ్మకం ఉందా? అలాకాకుండా ఒక్క క్షణం కాదు, ఒక్క గడియ కాదు, ఒక రోజు కాదు, జీవితమంతా భగవంతునిపై పూర్తి భారం వేసి మనుగడ సాగించగలమా? అకర్తారం స పశ్యతి (భగవద్గీత 13-30) గుర్తుకు తెచ్చుకోండి.
ఓ మానవుడా ఆలోచించుకో! కానీ మనకున్నది ప్రస్తుతం మన మెదడులో, మనసులో నిక్షిప్తం చేయబడిన జ్ఞానం మాత్రమే. దీనినుండి ఈ పరమార్థం వైపు చేరు స్థితి లేదు అని కూడా చెబుతున్నారు.
ముఖ్యపదములకు అర్ధములు:
దరి= గట్టు;
అర్థము = డబ్బు; గాచి = సిద్ధమై, యీడనే = ఇక్కడనే.
భావము: ఓడ కొనుక్కునేవాడు దాన్ని ఒక తీరమునకు చేర్చి, పరిశీలించి దానికి తగిన డబ్బు ఇవ్వడానికి సిద్ధమై తన సొంతం చేసుకుంటాడు. ఇక్కడనే ఈ ప్రపంచం లోనే నాకు అటువంటి గట్టు కానీ, తీరము కానీ కనబడుటలేదు. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి ఓ అంతర్యామి.
వివరణ: జీవనము అంతులేనిది. దరులూ లేనిదే. ఓడ కొనుక్కునే వాడికి ఒక తీరము కనపడినట్లుగా నాకు ఈ జీవితంలో అటువంటి తీరం కానీ గట్టు కానీ కనబడుటలేదు అంటున్నారు అన్నమాచార్యులవారు.
ఇంతకు మునుపు మీకు ఎన్నోసార్లు విన్నవించుకున్నట్లుగా ఈ విశ్వమునందు భూమి అని, స్వర్గం అని, నరకమని, పాతాళమని వేరే వేరే ప్రపంచాలు లేవు అన్నది అన్నమాచార్యుల వాదము. ఉన్నది ఒక్కటే మనముందున్న ప్రపంచం. అందుకనే ఈ ప్రపంచంలో ఉన్న నన్ను కాపాడు స్వామి అంటున్నారు అన్నమాచార్యులవారు.
ముఖ్యపదములకు అర్ధములు: చిట్లు = నీటి తుంపర; వేఁగనఁడట = ఆరాటపడుట.
భావము: ఉప్పు అమ్మేవాడు దానిపై నీటి చిట్లు పడకుండా ఎంత జాగ్రత్తగా ఉంటాడో, శ్రీ వేంకటేశ అంతే అప్రమత్తముగా, వోపికగా నీకై వేచి ఉన్నాను. నన్ను పుట్టించావు
కాబట్టి నా భారం కూడా నువ్వే మొయ్యాలయ్యా ఓఅంతర్యామి!
-x-x-x సమాప్తము x-x-x-
I wonder to the depth of this poem
ReplyDeleteReally so thankful to you sir 🙏🏼🙏🏼
మనం జీవితకాలంలో అజ్ఞానములో ఉండి ఇహము
ReplyDeleteగురించిన ఎన్నో కోరికలతో కాలం గడిపేస్తున్నాము.
ఈ అజ్ఞానంతో జ్ఞానం వైపు పయనించటం అసాధ్యం.
సర్వస్య శరణాగతి అని ఆ దేవదేవుని శరణు వేడి,
సమర్పణభావంతో బ్రోచువాడవు నీవే యని వేడుకొని
భక్తిమార్గం ద్వారా జ్ఞానమార్గం అనుసరించి
తరించవచ్చునని అన్నమయ్య భావనగా ఈ కీర్తనను
అర్థం చేసికొన వచ్చును.
🙏🏻🙏🏻🙏🏻
కృష్ణ మోహన్