అన్నమాచార్యులు
T-207.
ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె
పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను: శ్రీశ్రీ
Press here for reading the commentary in English
కీర్తన సంగ్రహ భావము:
పల్లవి:
"ప్రభూ, అన్ని దారులు,
అన్ని భావనలు నీలోనే కలిసిపోతున్నాయి. నాకు అగపడుతున్న నీ అనంతమైన
ప్రతిబింబాలు నాలో క్షణక్షణం ఒక్కొక్క
తలపును రేకెక్తిస్తూ ఇతరులకు అందించడానికి పదాలు కూడా లేకుండా నన్ను మౌనంగా
వుండేలా చేస్తోంది."
చరణము
1: “బంగారంలా మెరిసే ఒక్కక్క
రోమకూపంబులలో దాగి విశ్వంలోని అనంతమైన ప్రపంచాలట. యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో
చెప్పలేను. ఇంత స్పష్టంగా తెలిసినా, ఐనప్పటికీ మతిమాలి ‘మేము పరులమని’
భావించువారిని ఏమనేది?”
చరణము
2: "నీ కొనచూపుతోనే
అసంఖ్యాక సూర్యులు ఏకమై వుదయిస్తారు. మేరలు నిర్ణయించలేనిది నీ విస్తీర్ణము. పైగా అది దాచిన నీ నివాసం నాకు రహస్యంగా మిగిలిపోయింది. అటువంటి నీ ముందు
ఇతరుణ్ణి అని చెప్పగలుగు సాహసం చేయగలమా? నీ కీర్తితోనే ఇతరములన్నీ
ప్రకాశిస్తున్నాయి. నీవే అన్నిటికీ వెలుగు, జీవమూను. మాకు విడిగా
అస్థిత్వమేది?"
చరణము
3: "ఓ వేంకటేశ్వర
స్వామి, నీ చిన్నిమాయతో గుట్టలు గుట్టలుగా కనబడు ఈ అనంతమగు లోకాలు
పుట్టాయట. నీ వైభవం జీవములేని పదాలను అధిగమించి,
నన్ను విస్మయానికి గురిచేస్తోంది. నీ అపరిమితమైన కీర్తి ముందు ఇతర వాదనలన్నీ
అసంపూర్ణంగా మారాయి."
ఉపోద్ఘాతము: "ఈ కీర్తన అన్నమాచార్యుల గొప్పతనానికి ఒక మచ్చుతునక. అలౌకికమైన రచన. ఇటువంటి కీర్తన భవిష్యత్తులోనూ రాబోదు అంటే అతిశయోక్తికాదు. ఇందులో, ఆచార్యుల వారు "సమస్తము భగవంతునిలో ఉద్భవించి, అతడిలోనే సంగమిస్తుంది" అను మహిమను ప్రత్యక్షంగా చూపుతారు. కవి పదేపదే "పరులు" అనే పదాన్ని ఉపయోగించారు. ఇది మనందరిలో లోతుగా వేళ్ళూనుకున్న"నేను ఈ ప్రపంచానికి చెందను. వేరే ఎక్కడినుంచో వచ్చాను" అను తారుమారు చేయు అసంకల్పిత విశ్వవ్యాప్త భావనను ప్రతిధ్వనిస్తుంది.
అంతర్గత వ్యతిరేకత:
ఒకవైపు మానవుడు స్వార్ధం కోసం చేయు ప్రయత్నాలు, ఇంకోవైపు విశ్వంతో సామరస్యముగా మెలగుటకు
చేపట్టు కార్యములు ఒకదానికొకటి వ్యతిరేకములై అతని మదిలో, చేతలలో
సంఘర్షణను రేపును. ఈ కీర్తన ఆ అంతర్యుద్ధమునకు అద్దం పట్టింది.
కవి, పరిశీలకులు: అన్నమాచార్యుల వారు కేవలం కవి మాత్రమే కాదు - నిశితమైన
పరిశీలకులు మరియు అసమాన విశ్లేషకులు. వారి రచనలు మానవుని మానసిక స్థితిపై అలౌకికమైన
అంతర్దృష్టులను అందిస్తాయి. ముఖ్యంగా, అన్నమాచార్యులు కీర్తనలను
వినోదం కోసం వ్రాయలేదు. మానవుల మనస్తత్వాన్ని అన్వేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి
ఒక సాధనంగా ఈ కీర్తన ఒక అద్భుతంగా ద్యోతకమౌతుంది."
అధ్యాత్మ కీర్తన: రాగిరేకు 215-3 సంపుటము: 3-87
|
ఇన్నియు
ముగిసెను ఇటు నీలోననె
పన్ని
పరులఁ జెప్పఁగఁ జోటేది ॥పల్లవి॥ కుందని
నీరోమకూపంబులలో
గొందుల
బ్రహ్మాండకోట్లట
యెందరు
బ్రహ్మలో యెంత ప్రపంచమో
యిందుఁ
బరులమని యెంచఁగనేది ॥ఇన్ని॥ నీ కొనచూపున
నెఱిఁ గోటిసూర్యు-
లేకమగుచు
నుదయింతురటా
నీ కాయమెంతో
నీ వునికేదో
నీకంటెఁ
బరులని నిక్కఁగనేది ॥ఇన్ని॥ జీవకోటి
నీ చిన్నిమాయలో
ప్రోవులగుచు
నటు పొడమెనటా
శ్రీవేంకటేశ్వర
చెప్పఁగ నీవెంతో
ఆవలఁ బరులకు నాధిక్యమేది ॥ఇన్ని॥
|
Details and
explanations:
భావము: "ప్రభూ,
అన్ని దారులు, అన్ని భావనలు నీలోనే
కలిసిపోతున్నాయి. నాకు అగపడుతున్న నీ అనంతమైన ప్రతిబింబాలు నాలో క్షణక్షణం ఒక్కొక్క తలపును రేకెక్తిస్తూ
ఇతరులకు అందించడానికి పదాలు కూడా లేకుండా నన్ను మౌనంగా వుండేలా చేస్తోంది."
వివరణ: అన్నమాచార్యులు
ఈ పల్లవి ద్వారా సత్యం తప్ప మరేమీ నిలిచి వుండదని
చెప్పారు. దానిని 'దేవుడు'
అని కొందరు 'సర్వశక్తిమంతుడు' అని కొందరు 'తెలియనివాడు' అని
కొందరు 'పరము' అని కొందరు పిలిచినా,
ఇవన్నీ ఒకే విషయాన్ని సూచిస్తాయి. ఆ వర్ణనాతీతమైన ధ్యాన స్థితిలో
అన్నమాచార్యులు సత్యమును దర్శించారు. వారి
పరిస్థితి శ్రీమహావిష్ణువు యొక్క విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుడి స్థితిని
పోలి ఉంటుంది. క్రింది భగవద్గీత శ్లోకం చూడండి.
ద్యావాపృథివ్యోరిదమంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః ।
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ।। 11-20 ।।
భావము: భూమ్యాకాశముల మధ్యగల ప్రదేశమంతా అన్ని ప్రధాన దిశలను చుట్టుముట్టి, రవ్వంత
ఖాళీని కూడా వీడకుండా సర్వవ్యాప్తుడవై ఉన్నావు. ఓ మహత్మా, నీ
సర్వోన్నత సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ, నీ యొక్క అద్భుతమైన
మరియు భయంకరమైన స్వరూపమును దర్శిస్తూ, ముల్లోకములూ భయంతో కంపించిపోవటం
నేను గమనిస్తున్నాను.
పన్ని పరులఁ జెప్పఁగఁ జోటేది : "నా అవగాహన కూడా నీ తేజస్సులో కొట్టుకుపోయింది.” ఇటువంటి అత్యద్భుతమైన దృశ్యాన్ని చూసినవారు మాటలు చేష్టలు ఉడిగి మౌనులై పోతారు. వారు చూచిన దానిని తిరిగి చెప్పలేకపోతారు. అదే విషయాన్ని అన్నమాచార్యుల వారు ప్రస్తావించారు.
భావము: బంగారంలా మెరిసే ఒక్కక్క
రోమకూపంబులలో దాగి విశ్వంలోని అనంతమైన ప్రపంచాలట. యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో
చెప్పలేను. ఇంత స్పష్టంగా తెలిసినా, ఐనప్పటికీ
మతిమాలి ‘మేము పరులమని’ భావించువారిని ఏమనేది?
వివరణ:
“యిందుఁ బరులమని యెంచఁగనేది” వివిధ
వార్తాపత్రికల కథనాలు, పుస్తకాలు మరియు సాహిత్యంలోను 'Men are from
Mars, Women are from Venus” (=ఆడవాళ్ళు శుక్ర గ్రహము నుంచి
మగవాళ్ళు అంగారక గ్రహం నుంచి)' ‘మేము గ్రహాంతరవాసులం’
‘తాత్కాలికంగా ఈ భూమిని సందర్శిస్తున్నాం’ అనే ఆస్కారము లేని భావనలు, మాటలు దొర్లడం గమనించవచ్చు. విశ్వవ్యాప్తమైన ఈ భావనకు ఎలాంటి ఆధారం లేదని
అన్నమాచార్యులు స్పష్టంగా తెలియజేస్తున్నారు.
పరస్పరం సంఘర్షించిన శక్తులలో
చరిత్ర పుట్టెను: ఈ కీర్తనలో అన్నమాచార్యుల సందేశం యొక్క ప్రాముఖ్యతను పరిశీలిద్దాం.
వ్యక్తులు తమ అహంబావాన్ని, కుటిలత్వాన్ని విడిచిపెట్టినప్పుడు
వారు అంతిమంగా ద్వంద్వతను ఎదుర్కొంటారు: స్వీయము మరియు దానికి పరిపూరకరమైన మరొకటి.
ఈ ద్వంద్వత్వం జీవనము మరియు మరణం యొక్క సామరస్య కలయికను సూచిస్తుంది. రెండు పరస్పర
వ్యతిరేకములు మనకు తెలియని రీతిలో అనుసంధానించబడిన అంశాలు. అవి రెండు చేరి పూర్ణమును
ఏర్పరుస్తాయి. ఈ పరస్పర విరుద్ధ భావాలను గుర్తించడం పైపైకి సూటిగా అనిపించవచ్చు. కానీ
ఏ సంప్రదాయ హీరో కూడా సాహసించని మరణాన్ని ఆలింగనం చేసుకోకుండా వానిని ప్రత్యక్షముగా
దర్శించలేము. అందుకు అసాధారణమైన ధైర్యం చాలా కీలకం.
తెలుపు నలుపు హంసలు: ఈ ఆలోచనను లోతుగా పరిశోధించడానికి, హిల్మా ఆఫ్ క్లింట్ యొక్క చతురత్వతో కూడిన కళాకృతి "స్వాన్ నం. 1"ని (1915) విశ్లేషిద్దాం. రెండు హంసల పెయింటింగ్‌తో 24 వరుస బొమ్మల శృంఖల మొదలౌవుతుంది. నలుపు నేపథ్యంలో ఒకటి గుడ్డు పెంకు తెలుపు. మరొకటి తెలుపు రంగులో బొగ్గు నలుపు. పెయింటింగ్‌ను విభజించే క్షితిజ సమాంతర రేఖతో అవి వేరు చేయబడ్డాయి. కానీ అవి మధ్యలో ముక్కుతో ముక్కు, రెక్కకొనతో రెక్కకొన కలుస్తాయి.
ప్రాథమిక క్రియాశీల శక్తి: స్కెచ్ లాంటి
అవుట్‌లైన్‌లు మరియు వ్యక్తీకరణ కుంచె విసురలలోని యుక్తుల (బ్రష్‌స్ట్రోక్‌ల) ద్వారా
వర్గీకరించబడిన ఈ భాగం బొమ్మ యొక్క పరిధులు అధిగమించి వాస్తవికత వైపు పరుగిడుతుంది.
హంసల రెక్కల నుంచి వెలువడే క్రియాశీల శక్తి (డైనమిక్ ఎనర్జీ) స్పష్టంగా కనిపిస్తుంది.
ఎగువ హంస దిగువ హంస రెక్కలతో కలయికను ప్రతిష్టాత్మకమైన మైఖేలాంజెలో గారి "క్రియేషన్
ఆఫ్ ఆడమ్" నుంచి ప్రేరేపించ బడినదా అన్నట్లు
కనబడుతుంది. ఒక వాడియైన సంజ్ఞ, రహస్యము చిత్రీకరించబడింది.
ఈ పెయింటింగ్ దృశ్యమాధ్యము కంటే అది తెలుపు సందేశమునకే ప్రాధాన్యమిచ్చి సృష్టి రహస్యాన్ని
వెలికితీసేందుకు అఫ్ క్లింట్ గారు మనను ఆహ్వానిస్తారు.
యిన్ మరియు యాంగ్: అఫ్ క్లింట్
యొక్క పెయింటింగ్ అలంకారిక విధానంలో లోతైన ఆధ్యాత్మిక వృత్తాంతముతో సమతుల్యం చేస్తుంది. కళాకృతిని హుషారయిన,
మరోప్రపంచపు సంజ్ఞలతో నింపుతుంది. రెండు హంసలు ముక్కులు మరియు రెక్కల
సున్నితమైన బ్రష్‌లో కలుస్తాయి, వాటి విరుద్ధమైన రంగులు,
నేపథ్యము వాని మధ్య వ్యతిరేకతను మరింత పెంచుతాయి. దృశ్యమానంగా అద్భుతమైన
కలయికను సృష్టిస్తాయి. అయినప్పటికీ, ఆ హంసల మధ్య చెప్పలేని ఉద్వేగము
స్పష్టం. కానీ విచిత్రంగా ఆ రెండు హంసలు ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నట్లు కనబడతాయి.
యిన్ మరియు యాంగ్'లు విరుద్ధములైనా కూడా వాటి శాశ్వతమైన సామరస్యాన్ని
ప్రతిబింబిస్తాయి.
ప్రాథమికమైన ద్వంద్వత్వం: ఇక్కడ చూపినట్లుగా,
అన్నమాచార్యులు మానవ ఉనికికి అతి ప్రాథమికమైన ద్వంద్వత్వంతో తలపడినట్లు
తెలుస్తోంది. అయితే, వారు తమ స్వీయతను (ఆత్మతత్వమును) అధిగమించి,
అంతిమ సత్యంతో కలిసిపోయే అసాధారణ ధైర్యాన్ని కలిగి ఉన్నావారు. ఆ స్థితిలో,
వారు తమ మానవ రూపాన్ని అధిగమించారు మరియు మానవులకు శక్యమగు అత్యున్నత
స్థాయిని దర్శించారు. వారు వదిలివెళ్ళిన కీర్తనలు మానవాళికి అమూల్యమైన వారసత్వం. అన్నమాచార్యులు
అనితరసాధ్యమైన భక్తి మరియు ధ్యాన మార్గములో
మునుపెన్నడూ ఎరగని అంతర్దృష్టిని ప్రదర్శిస్తాయి. ఆధ్యాత్మిక అవగాహనలో ఇంత లోతైన ఎత్తులను
ఎవరూ సాధించలేదు. లేరు. అన్నమాచార్యులు భక్తులందరిలో మహోన్నతులుగా నిలుస్తారు. వారి
జీవితమే అసమానమైన ఆధ్యాత్మిక తార్కాణము.
భావము: "నీ కొనచూపుతోనే అసంఖ్యాక సూర్యులు ఏకమై
వుదయిస్తారు. మేరలు నిర్ణయించలేనిది నీ విస్తీర్ణము. పైగా అది
దాచిన నీ నివాసం నాకు రహస్యంగా మిగిలిపోయింది. అటువంటి నీ ముందు
ఇతరుణ్ణి అని చెప్పగలుగు సాహసం చేయగలమా? నీ కీర్తితోనే ఇతరములన్నీ
ప్రకాశిస్తున్నాయి. నీవే అన్నిటికీ వెలుగు, జీవమూను. మాకు విడిగా
అస్థిత్వమేది?"
వివరణ:
నీకంటెఁ బరులని నిక్కఁగనేది: మానవుడు
అవ్వా కావాలి బువ్వా కావాలి అనే యుక్తి తోటి జీవించబోతాడు. కానీ రెండు సాధ్యం కాదు
ఏదో ఒకటే. మనం పదే పదే స్మరించుకునే భగవద్గీత వాక్యం "వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ
కురునందన" (= నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే ఉంది 2-41) కూడా
ఇదే చెప్తున్నది. దీనిని, ముందు చెప్పుకున్న వివరణను కలిపి చూస్తే ఈ ప్రపంచంలో దైవం ఒక్కటే ఉన్నది మిగిలినవన్నీ
ఆయా సమయముల ప్రకారం ఉద్భవించి తిరిగి ఆ పరమాత్మునిలోని ఏకమవుతున్నాయి. అనగా “పరులము
అని భావించుటకు ఆస్కారమే లేదు” అని అన్నమాచార్యులు చెబుతున్నారు.
భావము: "ఓ వేంకటేశ్వర
స్వామి, నీ చిన్నిమాయతో గుట్టలు గుట్టలుగా కనబడు ఈ అనంతమగు లోకాలు
పుట్టాయట. నీ వైభవం జీవములేని పదాలను అధిగమించి,
నన్ను విస్మయానికి గురిచేస్తోంది. నీ అపరిమితమైన కీర్తి ముందు ఇతర వాదనలన్నీ
అసంపూర్ణంగా మారాయి."
వివరణ:
ఆవల బరులకు నాధిక్యమేది: దీనితో అన్నమాచార్యులు ఏమి చెబుతున్నారో ఆలోచింతము.
ముందుగా భగవంతునికి తనను తాను సమర్పించుకున్న వానికి తనకంటూనికి ప్రత్యేకముగా ఏమీ ఉండదు.
వారు దైవము అనండి, సత్యము అనండి, దానితో ఐక్యమై
తమకంటూ విడిగా అస్తిత్వం కల్పించుకుని ఉండరు. ముందు చెప్పుకున్న దాని ప్రకారం కూడా
ఇదే వర్తిస్తుంది.
అన్నమాచార్యుల అసాధారణ ప్రజ్ఞ: ఈ సంక్షిప్త
కీర్తన అన్నమాచార్యుల అసాధారణమైన కళాత్మకతకు నిదర్శనము. లోకానుభవమునకు చెందని ఆలోచనలను
గొప్ప క్లుప్తతతో తెలియజేయడంలో వారి అసమానమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. టూకిగా
అనిపించు పదాలతో మనల్ని ఇంతకు మునుపు మానవులు అన్వేషించని తీరాలకు తీసుకెళ్లుటలో వారి
ప్రతిభ సాటిలేనిది. వారు రాత్రిని పోలు మనసు అను ఆకాశంలో సూర్యునిలా వెలుగును ప్రకాశింపజేస్తారు. తన అసాధారణ మేధతో మానవ అనుభవాలకు కొత్తపుంతలు తొక్కుతారు. .
x-x
సమాప్తంx-x