Sunday, 23 March 2025

T-214 మఱచితిమంటే మరి లేదు

 అన్నమాచార్యులు

214. మఱచితిమంటే మరి లేదు 

ఉపోద్ఘాతము:

ఈ కీర్తన వింటూనే బోధపడింది. చాలా సులభముగా అర్థమయిపోయింది ఇందులో అన్నమాచార్యుల వారు చెప్పినది నాకు బాగా తెలిసిపోయింది. దానికి ఇంత పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు చదవడం అనవసరం. ఈ వ్రాసేవాళ్లు పని లేక కోడిగుడ్డుకి వెంట్రుకలు పీకినట్లు ఏదో ఏదో వ్రాస్తూ మమ్మల్ని చదవమని బలవంతం చేస్తుంటారు. ఎందుకండీ ఇలా చేస్తారు? అలా ఆలోచించడం నిజంగా తప్పు కాదు.

అయితే ఇక్కడ ఆచార్యులు వారు మఱచితిమంటే అన్న చిన్న పదము తోటి ఏం చెప్ప దలిచారు? ఆలోచించండి! అంత సులభంగా తట్టదండి. ఇక మరి లేదు అంటే—మానవునికి ఈ జీవితమే ఒకే ఒక అవకాశం. ఈ అవకాశం మరల లభిస్తుందా? ఎవ్వరూ చెప్పలేరు! అది మన ఆధీనంలో లేదు. అలాంటప్పుడు, మనకు దొరికిన ఈ మానవ జన్మ అనే అపూర్వ అవకాశాన్ని వృధా చేసుకోకూడదని ఆచార్యులు హెచ్చరిస్తున్నారు.

దైవము లేదా ప్రకృతి అణువులో అమిత శక్తిని  దాచి ఉంచినట్లు అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలలో సరళంగా కనపడే ఈ మాటల వెనుక ఊహల కందని విషయములనే నిక్షిప్తం చేసి ఉంచారు. అందుకని లంబాచౌడా వివరణలు అవసరం అవుతున్నాయి.

గాలి కంటే నీటి సాంద్రత ఎక్కువ. దానికంటే భూమి, దానికంటే బంగారం ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఈ కీర్తనల సాంద్రత కొలిచే సాధనం మన దగ్గర లేదు. ఒకవేళ అలాంటి సాధనాన్ని తయారు చేస్తే ఒక్కొక్క కీర్తనకు ఈ భూమి కూడా  తూగదు. ఆకాశమును, భూమిని, సమస్త విశ్వమును ఒక పొట్లములో చుట్టి దానిని  కుదించుతూ కుదించుతూ పోతే  లభించే దట్టమైన  ప్రసాదములే ఈ కీర్తనలు.

ఎంత పెద్ద రోగానికైనా మందు చిటికెడే ఉంటుంది. వైద్యులు వైద్యరంగము మనకోసం చేస్తున్న సేవ మనందరకు స్పష్టము. అయితే మనిషికి పట్టుకున్న జాడ్యం వదిలించటానికి విదల్చటానికి సాధారణంగా మందులు దొరకవు. ఆచార్యులవారు చిన్నగా సూక్ష్మముగా మనకు ప్రసాదించిన ఈ కీర్తనలు మందులే. రామదాసు గారు రామ జోగి మందు కొనరే అని ఊరకనే అనలేదు.

పట్టపు జీవుల” అంటే తోలుకలిగిన జీవులు. మహా మందమైన చర్మము కలిగినవారము. అంటే దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎలాంటి ప్రభావమూ వుండదో, మనమీద ఎలాంటి మందులు పనిచేయవు అన్న విషయాన్ని సూచిస్తున్నారు. కానీ వారు మనల్ని తిట్టడానికి ఈ కీర్తనలు వ్రాయలేదు మనలను తట్టి లేపడానికి మాత్రమే వ్రాశారు.

 

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: మఱిచిపోతే మరియొక దారిలేదు. మనసుతో చిలికించి  దైవమును తలచుము. అంటున్నారు అన్నమాచార్యులు.  ​ అంతరార్థము: (భగవద్)  కార్యాచరణములో నేర్పును బ్రదర్శించుచు జీవితమును కొనసాగించుము. 

మొదటి చరణం: తోలుగల జీవుల ఈ ప్రపంచము పుడుతూ, పోతూవున్నదే. అది అలా జరుగుతూనే వుంటుంది. ఈ పరిణామముల మధ్య ధైర్యముగా మర్మముతో నరహరినామము ప్రయత్నం చేసి మరీ మదిలో నిలుపుకొనుము. 

రెండవ చరణం: ఓ మనసా ఈ లోకములలో ఉదయాస్తమయములు ఒక క్రమములో ఏ రీతిగా వచ్చుచు పోవుచునున్నవో, నీలోనే వున్న అద్దములోని ప్రతిబింబము వంటి అంతరాత్ముని క్రమము తప్పక​ వీలుగా, వాటముగా, పొందికగా తలచుము 

మూడవ చరణం: బయలు, లోపల అను వ్యత్యాసములు లేక వశపఱుచుకొని వున్నది శ్రీపతి మహిమలతో గూడిన విచిత్రమైన సృష్టి. అదిగో కనబడుచున్న ఆ ఎత్తైన వేంకటేశ్వరుఁడే సమీపము అని, రక్షణ అని నమ్ముచు మనసున తలచవో.    

కీర్తన: 

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 370-3 సంపుటము: 4-412
 

మఱచితిమంటే మరి లేదు
తఱితోఁ దలఁచవో దైవము మనసా
పల్లవి॥ 

పుట్టుచు నున్నది పోవుచు నున్నది
పట్టపు జీవుల ప్రపంచము
నట్టనడుమనే నరహరినామము
గుట్టున దలఁచవో గొనకొని మనసా  
మఱ॥ 

పొద్దు వొడుచునదె పొద్దు గుంకునదె
తిద్దిన జగముల దినదినము
అద్దపు నీడల యంతర్యామిని
వొద్దనె తలఁచెనొనరవొ మనసా
మఱ॥

Details and explanation: 

మఱచితిమంటే మరి లేదు
తఱితోఁ దలఁచవో దైవము మనసా
పల్లవి॥

టీకా: మఱచితిమంటే = మఱిచిపోతేమరి లేదు = మరియొక దారిలేదు; తఱితోఁ = మథనముతో, చిలికించి ; దలఁచవో = తలచుము; దైవము మనసా = దైవమును మనసా. 

భావము: మఱిచిపోతే మరియొక దారిలేదు. మనసుతో చిలికించి  దైవమును తలచుము. అంటున్నారు అన్నమాచార్యులు.   

వివరణము: 

మొదటి భాగం: భగవద్గీత ఏం చెప్పింది 

ముందుగా అన్నమాచార్యులు మరియొక దారి లేదు అని ఎందుకు అంటున్నారో తెలుసుకుందాం. భగవద్గీతలో ఈ రకంగా చెప్పారు వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన! (2-41) భావము: ఓ అర్జునా! నిశ్చయించి అందిపుచ్చుకొనుటకు మనస్సుకు ఒకే ఒక మార్గము కలదు. చంచలమైన మనస్సు మాత్రమే అసంఖ్యాకమైన ఎంపికలను అంచనా వేస్తూ తడబడిపోతుంది.దైవమును చేరుటకు ఒకే ఒక మార్గము కలదు కాబట్టి ఆ మార్గమును మరువరాదు అన్న ఉద్దేశం తోటి అన్నమాచార్యులు ఇలా చెప్పి ఉంటారు. విచిత్రం ఏమిటంటే ఆ మార్గాన్ని ఎవరూ కూడా చెప్పలేకపోయారు. 

భగవద్గీత కూడా "వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః 6-36" (=”కానీ, స్వాధీనమైన మనస్సు కలిగినవాడు ఏదో ఒక ఉపాయముచేత ఆ మార్గమును కనుగొనగల్గుచున్నాడు.” అని చెప్పి వదిలేసినదే కానీ నిశ్చయముగా చెప్పలేదు. 

రెండవ భాగం: అన్నమాచార్యుల అంతరంగము 

తఱితోఁ దలఁచవో దైవము మనసా ఈ వాక్యమును జాగ్రత్తగా పరిశీలించవలెను. మనసును ఏ రకంగా చిలికించవచ్చును? ఒక విద్యార్థి పరీక్షకుఁ వెళ్లినప్పుడు సంవత్సరమంతా చదివిన పాఠములు ఏ రకముగా గుర్తుపెట్టు గుర్తు పెట్టుకోనునో అదే రకముగా నీవు చేయవలసిన పనిని అతి భద్రముగా సునిశ్చితముగా పాటించవలెను అన్న విషయాన్ని తెలుపుతున్నారు. 

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమిటి? నిజంగా ఏమి లేవు. కానీ చేయకూడని పనులు తనను బద్ధునిచేయు పనుల నుండి ఎవరినీ నొప్పింపక​, తానొవ్వక తప్పించుకొను మథనము చేయుము. అది యజ్ఞముఅని అనుజ్ఞ ఇస్తున్నారు ఆచార్యులవారు. మనమంతా ఇక్కడి రోజువారీ పనులలో చిక్కుకొని దైవమును ఒక పార్ట్ టైమ్ కార్యము కింద భావించి కాలం గడిపేస్తున్నాము. 

మొత్తానికి మరచిపోకుండా నీవు చేయవలసిన పనులలో చిక్కుకుపోకుండా అతి లాఘవముగా మార్గము కనుగొనువాడు యోగిఅని ఈ పల్లవి తాత్పర్యం వెల్లడి అవుతుంది. ఈ సందర్భంగా భగవద్గీతలోని క్రింది శ్లోకమును కూడా మనం చేసుకోవడం ఉచితంగా ఉంటుంది. 

శ్లో|| బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే । తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ||(2-50)||  భావముకర్మము చేయుటయందు నేర్పరితనమే యోగము అనబడునుజ్ఞానముతో ఈ ఫలాసక్తిరహిత కర్మ శాస్త్రమును నైపుణ్యంతో ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించ గలుగును.  

అంతరార్థము: (భగవద్)  కార్యాచరణములో నేర్పును బ్రదర్శించుచు జీవితమును కొనసాగించుము. 

మొదటి చరణం:

పుట్టుచు నున్నది పోవుచు నున్నది
పట్టపు జీవుల ప్రపంచము
నట్టనడుమనే నరహరినామము
గుట్టున దలఁచవో గొనకొని మనసా
 మఱ॥ 

టీకా: పుట్టుచు నున్నది = పుట్టుచున్నది; పోవుచు నున్నది = పోవుచున్నది; పట్టపు జీవుల = తోలుగల ఈ జీవుల​;  ప్రపంచము = ప్రపంచము; నట్టనడుమనే = నట్టనడుముననే; నరహరినామము = నరహరినామము; గుట్టున = ధైర్యముగా, మర్మముగా; దలఁచవో = తలఁచవో; గొనకొని= యత్నించి; మనసా = ఓ మనసా . 

భావము: తోలుగల జీవుల ఈ ప్రపంచము పుడుతూ, పోతూవున్నదే. అది అలా జరుగుతూనే వుంటుంది. ఈ పరిణామముల మధ్య ధైర్యముగా మర్మముతో నరహరినామము ప్రయత్నం చేసి మరీ మదిలో నిలుపుకొనుము. 

వివరణము:

మొదటి భాగం: భగవద్గీతతో సంబంధం 

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత (2-28) భావము: అర్జునా! ప్రాణులన్నియు పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు (అవ్యక్తములు). మరణానంతరం కూడా అవ్యక్తములే. ఈ జనన మరణాల మధ్య మాత్రమే అవి ప్రకటితములు (ఇంద్రియ గోచరములు) అగుచున్నవి. నట్టనడుమనే నరహరినామము: ఇట్టి అస్థిరమైన నట్టనడుమ జనియించిన ఈ స్మృతి, చైతన్యములు ఉన్నంత వరకు హరినామముతో సద్వినియోగము చేసుకొనుము.  

ఇక్కడ అన్నమాచార్యులు వారు ధైర్యము అన్న పదం ఎందుకు వాడారో ఆలోచింతము. భగవద్గీత (2-13) ఈ విషయాన్ని తెలుపుతుంది తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతిభావము: జీవునకు ఈ దేహమునందు కౌమారముయవ్వనమువార్థక్యము ఉన్నట్లే మరియొక దేహప్రాప్తియు కలుగును. ధీరులైన వారు ఈ విషయమును గ్రహించివ్యధ చెందరు.  

రెండవ భాగం: అన్నమాచార్యుల భావన 

మీకు అనేకసార్లు విన్నవించుకున్నట్లు అన్నమాచార్యులు, శ్రీకృష్ణులవారు చెప్పిన భక్తిని జీవుడు దేహసుఖమును చివరకు ప్రాణమును కూడా వదిలి సాధించతగిన విషయం. మన పురాణాలలో చెప్పబడిన వైతరణిని దాటడం కూడా ఇదే అని మననం చేసుకోవడం సందర్భోచితంగా ఉంటుంది. ఆ ధైర్యం చేయలేనివారు ఈ మార్గమున విజయం సాధించుటకు అనేక కష్టాలు పడవలసివచ్చును. అన్నమాచార్యులు చెప్పిన వేదాంతంతో మేళవించిన పాటలు బాగున్నాయి కదా అని సినిమా పాటలలగా పాడుకొని కొన్నాళ్ల తర్వాత వదిలేసే వినియోగదారుని మనస్తత్వంతో (consumer attitude) చూడరాదు. అనేక విషయములను చిన్న పదములలో చొప్పించి ఉంచారు. 

గుట్టున దలఁచవో గొనకొని మనసా : సాహసోపేతమైన మానవ ప్రయత్నం లేకుండా అన్నమాచార్యులు చేరిన ఉత్కృష్టమైన స్థితికి మానవుడు ఇప్పుడు తాను ఉన్నట్లుగా ఉంటూ ఉంటే చేరలేడు. ఈ కీర్తనలో ఆస్థితికి చేరుటకు మానవుడు చేయవలసిన యత్నం మన కళ్లముందుంచారు ఆచార్యులవారు. 

అన్నమాచార్యులు చెప్పిన పుడుతూ, పోతూవున్న ప్రపంచమును వాస్తవముగా కన్నుల ఎదుటగా చూడగలుగుతున్నామా? చూస్తే మనం తగులుకున్న విషయంలో విషయములలో ఇంకా చిక్కుకునే ఉంటామా? వెలికి వచ్చు ప్రయత్నము చేయమా? మానవుడా ఇహము పరము అను రెంటిలోనూ చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నావు. గొనకొని= యత్నించి అనగా వీనిలో ఏదో ఒక దానిని ఎంచుకొని అందుకై చేయగలిగినదంతా నీ శక్తి కొలది ప్రయత్నించవా? ఇందులో వేదాంతం లేదండి. కనుల ముందర ఉన్న కార్యమును కనుక్కోమని చెబుతున్నారు. ఆపై మీ ఇష్టం.  

రెండవ చరణం 

పొద్దు వొడుచునదె పొద్దు గుంకునదె
తిద్దిన జగముల దినదినము
అద్దపు నీడల యంతర్యామిని
వొద్దనె తలఁచెనొనరవొ మనసా
మఱ॥

 

టీకా: పొద్దు వొడుచునదె =దానంతట అదే ఉదయమగును;  పొద్దు గుంకునదె = అలాగే సాయంత్రముకూడా వచ్చును. తిద్దిన = క్రమశిక్షణలో పెట్టబడిన;  జగముల = లోకములలో; దినదినము = ప్రతిదినము; అద్దపు నీడల = అద్దంలో కనబడు నటువంటి ప్రతిబింబము లాంటి; యంతర్యామిని = అంతర్యామిని; వొద్దనె = నీలోనే వున్న; తలఁచె = తలచి; నొనరవొ = వీలుగా, వాటముగా, పొందికగా; మనసా = ఓ మనసా. 

భావము: ఓ మనసా ఈ లోకములలో ఉదయాస్తమయములు ఒక క్రమములో ఏ రీతిగా వచ్చుచు పోవుచునున్నవో, నీలోనే వున్న అద్దములోని ప్రతిబింబము వంటి అంతరాత్ముని క్రమము తప్పక​ వీలుగా, వాటముగా, పొందికగా తలచుము. 

వివరణము:

వాళ్ళకి ఎలా కనబడుతోందండి? ఈ అన్నమాచార్యులు ఎవరండి? నీలో ఉన్న అద్దము అందులోని ప్రతిబింబం ఉన్నాయంటారు? ఉంటే ఎక్కడ ఉన్నాయండి? పైగా ఈ తత్వవేత్తల అందరూ ప్రపంచం ఒక ప్రతిబింబము అని అంటూనే ఉంటారు! నాకైతే ఒక్క ముక్క అర్థం కావట్లేదు. శ్రీశ్రీ గారైతే ప్రపంచమొక పద్మవ్యూహమన్నారు. అలా అయితే మనకు కనపడట్లేదేం? మరి వీళ్ళకి ఎలా కనబడుతోందండి? ఇదేనండి మనం తెలుసుకోవాల్సింది. 

జీవాత్మ పరమాత్మతో కలిసిపోతే అదే మోక్షము అన్నారు. అయితే ఇది చెప్పినంత సులభమా? కాదే! ఆ విషయం తెలుసుకోవడానికే ఈ వివరణ అండి. ముందుగా René Magritte వేసిన Love Disarmed (1935) అను పేరుగల క్రింది తైలవర్ణచిత్రమును  చూడండి. 



అక్కడ ఒక అద్దము దానికి బాగా దిగువన ఒక చక్కగా పాలిష్ చేయబడిన షూస్ (బూట్లు) కనబడుతుంటాయి. విచిత్రంగా ఆ బూట్లకీ ఒత్తుగా ఉన్న పొడవైన వెంట్రుకలు మనలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. వంకరటింకరగా కాకుండా నేరుగా చూస్తే ఆ అద్దములో అ బూట్లు కనపడవు. ఇంకా విచిత్రంగా ఆ అద్దపు క్రింది భాగంలో ఆ జుట్టు కొంచం కనబడుతూ ఉంటుంది. 

విశ్లేషణ:  ఆ కనబడుతున్న అద్దము అన్నమాచార్యులు పేర్కొన్న ప్రపంచము అను అద్దము.  ప్రస్తుతానికి దానిలో ఆ జుట్టు కూడా కనబడకూడదు.  ఆ కనబడుతున్న జుట్టు మనము ప్రయత్నముతో సాధించినది. అది అసహజము. ఆ జుట్టు మన గాలి అలలకు అంటే ఏ అన్నమాచార్యులో జిడ్డు కృష్ణమూర్తి గారో చెప్పినది విని ఆవేశములో రేగిన ఆలోచనలకు ప్రమాణము.  

చక్కటి పాలిష్ చేసిన బూట్లు  మనలను మనము పరిశుభ్రముగా వుంచుకొను నైజమును తెలుపుతున్నాయి. కానీ ఆ బూట్లు మనలను ఈ భూమికి ఆనించి వుంచుతున్నాయి. మనము జాగ్రత్తగా, అతి లాఘవంగా ఈ ప్రపంచమను కార్యాలయంలో కార్యములకు తగులకుండా విడిపోయినప్పుడు మన కన్నులు ఆ అద్దమును సమాంతరముగా చూచి వీక్షించుటకు సాధ్యపడును. ఎక్కడో పుట్టిన René Magritte గారు మన భారతీయ తత్వశాస్త్రముతో సంబంధం కానీ, దాని ఆచూకీ కూడా తెలియని వారు. ఐనప్పటికీ అన్నమాచార్యులు చెప్పినదే ఈ చిత్రము ద్వారా తెలపడం విచిత్రమా? కాదా? మీరే నిర్ణయించండి! 

మనం ఈ ప్రపంచమను ఊబిలో నుండి బయటపడినప్పుడు మనకు ప్రపంచమునకు మధ్య గల తెరలు అన్నీ తొలగిపోతాయి. అప్పుడు ప్రపంచమునకు మనకు మధ్య దూరం సమసిపోయి  ఒకదానికి మరొకటి ప్రతిబింబములుగా మారతాయి. ఇదే భగవద్గీతలో చెప్పిన "తనను సర్వ భూతములలో, తనలో సర్వ భూతములను  మానవుడు కనుగొనగలుగుతాడు" (6-29). ప్రపంచమున ఇది ఒక్కటే భక్తి.. చేయగలిగిన కార్యం. తక్కినవన్నీ ఈ ప్రపంచమున మనను సంకెళ్లతో ఉంచుతున్నవే. 

తిద్దిన జగముల దినదినము: ఈ లోకములోని క్రమము సాధారణమైన కంటికి అగుపడదు. మనకంతా అస్తవ్యస్తముగా, చిందవందరగా అనిపించును. ఇక్కడ అన్నమాచార్యులు ఆ అద్భుతమైన​, కానరాని క్రమమును ప్రస్తావిస్తున్నారు. దివారాత్రముల గురించి కాదు. 

అన్నమాచార్యులు ఎన్నడూ తన స్వస్థలాలను విడిచి బయటకు వెళ్లలేదు. ఐనా వారు ప్రపంచములో అంతర్లీనముగా దాగియున్న స్వాభావికమైన క్రమమును  (న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ ది యూనివర్స్, Natural Order of the universe) ప్రస్తావించిరి. ఇదియే ఆలోచించవలసిన విషయం. ప్రపంచమునంతా ఏకత్రాటిపై సమన్వయముచేయు వ్యూహము యొక్క ప్రసక్తి విస్మయము కలిగించునదే కాక అసాధారణమనీ భావించవచ్చు.  

మూడవ చరణం:

లోపల వెలుపల లోఁగొనివున్నది
శ్రీపతి మహిమల సృష్టియిదే
యేపున శ్రీ వేంకటేశ్వరుఁ డితఁడే
దాపని నమ్ముచుఁ దలఁచవో మనసా
మఱ॥ 

టీకా: లోపల వెలుపల = బయలు, లోపల అను వ్యత్యాసములు లేని; లోఁగొనివున్నది = వశపఱుచుకొని వున్నది; శ్రీపతి మహిమల = శ్రీపతి మహిమల; సృష్టియిదే = విచిత్రమైన సృష్టియిదే; యేపున = ఎత్తైన; శ్రీ వేంకటేశ్వరుఁ డితఁడే = ఇతడే శ్రీ వేంకటేశ్వరుఁడు; దాపని = సమీపము అని, దాపు అని;  నమ్ముచుఁ =  నమ్ముచు; దలఁచవో మనసా = తలచవో మనసా! 

భావము: బయలు, లోపల అను వ్యత్యాసములు లేక వశపఱుచుకొని వున్నది శ్రీపతి మహిమలతో గూడిన విచిత్రమైన సృష్టి. అదిగో కనబడుచున్న ఆ ఎత్తైన వేంకటేశ్వరుఁడే సమీపము అని, రక్షణ అని నమ్ముచు మనసున తలచవో.  

వివరణము:

ఇంతకుముందు  చరణములో ప్రపంచమునకు మానవునికి మధ్య దూరం సమసిపోవడం గురించి మాట్లాడుకున్నాం. ఆ స్థితిలో మానవుని మనసు దైవం యొక్క మనస్సుతో లేదా ఆలోచనలతో సరిసమానము అగును. ఇది జిడ్డు కృష్ణమూర్తి జీవిత చరిత్రలో పేర్కొన్నారు. 

లోపల వెలుపల లోఁగొనివున్నది /  శ్రీపతి మహిమల సృష్టియిదే: విచిత్రం అనేది పరము అను లోకం ఇహ లోకం రెండు కూడా మన కన్నులముందరనే ఉన్నవి అంటారు.  అన్నమాచార్యులు “పరమమనేదొక్కటే  ప్రపంచమొక్కటే  / సిరుల నీ రెంటికిని జీవుఁడే గురి” = రెండు ప్రపంచాలు లేవని, వున్నది ఒకటే అని నొక్కి చెబుతారు. అంతేకాక మరొక ప్రపంచం అనేది మానవుల భావనాత్మక భ్రమల అయోమయమే నని అంటారు. అందుకనే అన్నమాచార్యులు కూడా బయట లోపల అని మాత్రమే వ్యవహరించారు. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం. 

ఆకాశ పాకాశ మరుదైన కూటంబు: ఈ అసహ్యమైన, అస్తవ్యస్త ప్రపంచమొక అసాధారణమైన సమూహము. ఈ లోకంలో ఎన్నో సమస్యలు కనబడుతవి. దోపిడీలు, అసమానతలు, దౌర్జన్యములు, అల్లకల్లోలములు, బాధలు. ఈ అకటవికటముల వెనుక దాగి ఒక అరుదైన క్రమం ఉంది. అది ఎంత తీక్షణమైన ఆలోచనలతోనూ చేరగలిగినది కాదు, ఊహింపదగినది కాదు. అదే శ్రీపతి మహిమల సృష్టి. 

లోకరంజకము తమలోనిసమ్మతము: అనగా  నిర్మలమైన అంతరంగముతో, స్థిరుడై (అటునిటు చూడక), సమస్త కార్య కలాపములు నిగ్రహించువాడై, మౌనియై నిర్వర్తించువానికి మాత్రమే సాధ్యము. భగవద్గీతలో “అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః । సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ।। 12-16 ।।“ అని పేర్కొన్నది యిదియే. అటు వంటి సూక్ష్మబుద్ధిగల ద్రష్టలు లోకరంజకము కాక మరేమి 

ఈ చరణమునకు పల్లవికి గల సంబంధం: ఈ ప్రపంచమును వీడి చేయునది ఒంటరి ప్రయాణము. అద్దానికి ఈ వైపు ప్రపంచముతో ఎటువంటి సంబంధము లేదు. ఈ రెంటిని కలుపుచున్నది వేంకటేశ్వరుఁడే. ఆ ప్రయాణమునకు చుక్కాని వంటిది వేంకటేశ్వరుని నామము.

x-x-x-x


 

2 comments:

  1. ఓంశ్రీసాయినాధాయనమః
    రచయిత చెప్పినటుల అద్దములో కనిపించే ప్రతిబింబానికి ఆహారము పెట్టి పోషించలేనటులే భగవంతుని నామస్మరణ మనమున భగవంతుని ఉనికిని ఊహలుయను ఉయ్యాలలో నుంచుమని, లేకున్న నామస్మరణ ఒక నామమాత్రపుప్రతిబిబాచరణ .

    ReplyDelete
  2. మనసును మథించి, భగవచ్చింతనలో జీవితమును సార్థకము చేసికోవాలి. జీవిత పరమార్థమునకు వేరొక మార్గము లేదని అంటున్నారు అన్నమయ్య. పుట్టుట, గిట్టుట మధ్యలో జీవి ప్రయత్నపూర్వకముగా హరినామస్మరణ చేయవలెనని బోధించుచున్నారు ఆచార్యవర్యులు. గీతావాక్యముతో ఈ చరణము నన్వయించటం సమయోచితము.ఉదయాస్తమానము లెట్లు క్రమబద్ధముగా జరుగుచున్నవో, అట్లే బింబప్రతిబింబములుగా నున్న ఆత్మ - పరమాత్మలను అనవరతము తలచుము. రినే మాగ్రిట్టే యొక్క చిత్రము దీనికి అద్దం పడుచున్నది. కంటికి కనిపించే విశ్వంలోను, మనస్సులోను ఉన్నది ఒకటే పరమాత్మ అంటున్నారు అన్నమయ్య.
    🙏🏻

    ReplyDelete

217. niddiriMchi bAlajalanidhivalenE (నిద్దిరించీఁ బాలజలనిధి వలెనే)

  ANNAMACHARYA 217. నిద్దిరించీఁ బాలజలనిధి వలెనే niddiriMchi bAlajalanidhivalenE   Introduction : At first glance, this keerthana app...