Tuesday, 19 August 2025

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

 తాళ్ళపాక అన్నమాచార్యులు

253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

For English version press here 

ఉపోద్ఘాతము 

ఈ అటవీక ప్రపంచములోని అరుదైన క్రమమును అన్నమాచార్యులు సహజముగా దర్శించిన విషయమును కళ్ళకు కట్టినట్లు చూపారు. భగవదనుగ్రహము కంటే మానవులు కార్యములను ప్రతికూల పరిస్థితులలోను అంకిత బుద్ధితో కొనసాగించుట యొక్క ఆవశ్యకతను ఎత్తి చూపారు.


కృతిరస విశ్లేషణ​: ఈ కీర్తనని ప్రధానముగా ‘ధ్వని కావ్యం’గా భావించవచ్చును. ఎందుకంటే ఇందులో ఏ విషయము కూడా సూటిగా చెప్పకుండా ధ్వనించ బడినది. కృతి నిడివి అంతా ఏదో తెలియని కలకలధ్వని వినబడుతుంది. 

దీనిలోని స్థాయీ భావమును ‘వైరాగ్యం’గా భావిస్తే కృతిలోని ముఖ్య రసము ‘శాంత రసము’ అని మనకు తెలుస్తుంది. ఇందులోని శృంగారము ‘అంగిరసమై’ సౌందర్యమును,   కొంత ఆశ్చర్యమును, సంభ్రమమును కలిగిస్తుంది. 

సాహిత్యమును అర్ధము చేసుకొనుట మిక్కిలి క్లిష్టము కావున ఇది ‘నారికేళ పాకము’గా భావించ వలెను. 

శృంగార సంకీర్తన

రేకు: 1021-1 సంపుటము: 20-121

తానేడో మనసేడో తత్తరము లవి యేడో
పానిపట్టి ఇటువంటి భ్రమ యింత గలదా  ॥పల్లవి॥
 
సుదతి విభునిమోము చూచె పరాకున
అదనఁ గప్రపుభర ణద్దమంటాఁ జూచీనే
పదకము నడుమఁ బైపైఁ బెట్టి మొలనూలు
కదిసి హారమంటాఁ గటుకొనెఁ జూడవే        ॥తానే॥

యేఁటవెట్టి పతితోడ మాటలాడి వేగిరాన
గాఁటపుటందెలు తనకరములఁ బెట్టీనే
పాటియైనవుంగరాలు పాదపువేళ్ళఁ బెట్టి
యీటుగా మట్టెలు వేళ్ళ నిదియేల పెట్టీనే ॥తానే॥
 
కామిని శ్రీవేంకటేశుఁ గదిసేటి వేడుకను
వేమరు మాణిక్యములు విడెమంటా నిచ్చీనే
ఆమని రతిఁ దనిసి అంతలో నన్నీఁదెలిసి
సామజగమన ఇన్నీఁ జక్కఁ జేసుకొనెనే     ॥తానే॥ 

Details and Explanations:

          తానేడో మనసేడో తత్తరము లవి యేడో
పానిపట్టి ఇటువంటి భ్రమ యింత గలదా ॥పల్లవి॥ 

Telugu Phrase

Meaning

తానేడో

తానేక్కడ? (తనకే తెలియని స్థితి)

మనసేడో

మనసు ఎక్కడెక్కడ తిరుగుతోందో?

తత్తరము లవి యేడో

ఈ గందరగోళం, తడబాటు ఎక్కడి నుంచి వచ్చాయో?

పానిపట్టి

పూనుకొని చేసిన పనులవలన​ (తన  స్వకృత్యాల వలన)

ఇటువంటి

ఈ విధమైన

భ్రమ

మాయ, కల్పిత గందరగోళం

యింత గలదా

ఇంత విపరీతంగా ఉంటుందా?

సూటి భావము:

ఇది చూస్తే ఒక యువతి తన ప్రియుడి రాక కోసం ఆత్రుతతో సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన మొదటిసారి వస్తున్నట్లుంది – ఇప్పుడే అకస్మాత్తుగా ఆయన వస్తున్నాడని వార్త విన్నట్లుంది. ఆమె తొందరపడి ఆదరాబాదరాగా అలంకరించుకుంటోంది. 

అక్కడే నిలబడి ఉన్న పరిశీలకుడు ఆశ్చర్యపోతూ అడుగుతున్నాడు. ఆయనను చూస్తే ఆమె మనసులోని మాటలు కూడ అర్ధమౌతున్నట్లనిపిస్తోంది. 

తానేక్కడ? మనసు ఎక్కడ పోయింది?” 

ఈ తత్తరపాటు ఎక్కడి నుంచి వచ్చిందో?” 

పానిపట్టి అన్న పదం ఆమెను ఈ ఆతృత మొత్తం చుట్టేసిందని సూచిస్తుంది. ప్రేమలో మునిగిన హృదయాలంతే.


తాత్విక భావము:

ఈ రూపకంలో నిజానికి అన్నమాచార్యుల  ముఖ్యోద్దేశ్యం దాగి ఉంది. ఆ యువతి - స్వయంగా కవే. (3వ చరణంలో అలమేలుమంగ రూపంలో చూసుకుంటారు) తనను యువతిగా ఊహించుకుంటూ శ్రీ వెంకటేశ్వరుని రాక కోసం కలవరపడుతున్నారు. ఆచార్యుల వారు ఆ  యువతిని పరిశీలకునిగా చూచి ఆశ్చర్యపోతున్నారు: 

ఏమైంది ఆమెకు? మనసుపై అదుపు కోల్పోయింది. ఆందోళన, అశాంతి తప్ప మరేమీ లేదు.” 

తనకు తాను పూనుకొని చేసిన పనులవలన ఎంతటి విపరీతమైన భ్రమలు పుడుతున్నాయో చూడండి. దైవం రాక కొరకు సిద్ధపడిన కొద్దీ మాయ మరింత పెరుగుతోంది.” 

ఇక్కడ భ్రమ అంటే దేవుణ్ణి మనం ఆహ్వానించాలన్న భావన. శరీరాన్ని గృహమని భావించి, అంతా సిద్ధం చేసుకోవాలని అనుకుంటాం. కానీ అన్నమాచార్యులు ప్రశ్నిస్తారు:

దేవుణ్ణి తెలుసుకోడానికి మన వద్ద ఏ సాధనం ఉంది? మనమే రకముగా సిద్ధ పడగలం? నిజానికి శుద్ధమైన అంతరంగం సిద్ధం చేసుకొనుట తప్ప మరొక యుక్తి లేదు. 

పాత పాపాలను మనం ఏ విధంగా తొలగించగలము? లేము.

అయితే ఈ తొందర ఎందుకు? ఈ తత్తరపాటు ఎందుకు?

అన్నమాచార్యులు స్పష్టం చేస్తున్నది ఏదో చేయమని కాదు. 'పానిపట్టి' పూనుకొని చేసిన పనులవలన భ్రమలు కలుగుతున్నాయని. ఏదో చేయాలనే ఉబలాటమే మాయ​.


సారాంశం

ఈ పల్లవి కవిత్వమంతటికీ ఆధారమైన భావాన్ని ఉంచుతుంది — ప్రేమలోనైనా, భక్తిలోనైనా, ప్రియుడి రాక కోసం కలిగే ఆత్రత. బయటకి ఇది రసభరితమైన శృంగార దృశ్యమే. లోపల మాత్రం ఇది ఒక హెచ్చరిక: దేవుణ్ణి ఆహ్వానించాలన్న తొందరే మాయ. 

మనమే తయారు చేసుకున్న భ్రమల వలలో ఇరుక్కుంటే సత్యం దూరమవుతుంది. అంతరంగాన్ని శుభ్రం చేసుకొని, అశాంతిని విడిచిపెట్టి, నిశ్శబ్దంలో నిలబడడమే నిజమైన ఆత్మసిద్ధి.

 


మొదటి చరణం:

సుదతి విభునిమోము చూచె పరాకున
అదనఁ గప్రపుభర ణద్దమంటాఁ జూచీనే
పదకము నడుమఁ బైపైఁ బెట్టి మొలనూలు
కదిసి హారమంటాఁ గటుకొనెఁ జూడవే     ॥తానే॥ 

Telugu Phrase

Meaning in English

సుదతి విభునిమోము చూచె పరాకున

ఆమెకు ప్రియుని మోము తటుక్కున మెరసి నట్లు అనిపించింది.

అదనఁ గప్రపుభర ణద్దమంటాఁ జూచీనే

(కవి ఆమెను "కప్రపుభరణ” అని సంబోధించి - ఆమె చొప్పున భగ్గుమను గుణమును వ్యక్తం చేశారు.)

ఆమె అద్ద ములో అతని ప్రతిబింబము చూచి

పదకము నడుమఁ బైపైఁ బెట్టి మొలనూలు

పతకము నడుముపైన వుంచుకొని మొలనూలు (ఆడువారు అలంకారార్థము ధరించెడు నడుము దగ్గర తాళ్ళతో కూడిన  ఆభరణము)

కదిసి హారమంటాఁ గటుకొనెఁ జూడవే

దగ్గరకు తీసుకొని హారములాగ వేసుకొనెను చూడవే

 సూటి భావము:

ఒక యువతి అద్దం ముందు అలంకారములు చేసుకుంటూ నిలిచి ఉండగా, ఒక్కసారిగా ప్రియుని ప్రతిబింబాన్ని చూసినట్లనిపించింది. ఆ క్షణంలో ఉత్సాహం, ఆవేశం కలగలసి తాను ఏం చేస్తోందో మరచిపోయింది. ఆ  అయోమయంలో నడుముపై ధరించవలసిన బంగారు మొలనూలును పొరపాటున మెడలో వేసుకొని హారమని భావించింది. 

(ఇక్కడ “కప్రపుభరణ” అనే పదంతో  — కవి ఆ కన్య మనస్సును కర్పూరభరిత పాత్రగా చూపారు. అంటే ఒక్కసారిగా అమాంతంగా అంటుకునే, సులువుగా ప్రతిక్రియలు చూపే తత్వమును చూపిరి). 


 తాత్విక భావము:

ఈ దృశ్యం కేవలం రసమయమైన వర్ణన మాత్రమే కాదు, భక్తుని మనస్సు ఎంత గందరగోళంలో ఉంటుందో చూపించే రూపకం. 

భక్తుడు స్వామి దర్శనానికై తహతహలాడుతాడు. ఆ తపనలో, ఏ ప్రతిబింబాన్నయినా స్వామి రూపమని ఎంచుకోబోతాడు. ఆ తొందరలో వాస్తవాన్ని మరచి, భ్రమల్లో పడతాడు. 

నడుముపై ఉండవలసిన మొలనూలు మెడపైకి ఎక్కినట్లే, భక్తుడు కూడా తన ఆధ్యాత్మిక సాధనలో అపభ్రంశానికి లోనవుతాడు. 

కప్రపుభరణ” అనే ఉపమానం భక్తుని మనస్సు అస్థిరతను సూచిస్తుంది – కర్పూరంలా ఒక్కసారిగా మండిపడే మనసు, ఆతృతతో తానే తాను గందరగోళంలోకి నెడుతుంది. 

అన్నమాచార్యుల సందేశం: దేవుని దర్శనం ఉత్సుకతలో లభించదు. ఆతృత, ఆవేశం "ఫలితం" అనే దానిపై కన్నువేసి ఉంటాయి. ఫలితము అన్నది చేరగల గమ్యము. కాని దైవము అటుల చేరగల గమ్యము గాదు.  అస్థిరతలోను  ఆతృతలోను దైవము ప్రత్యక్షము కాదు. ప్రశాంతమైన మనసులో హృత్యక్షమవుతుంది.

Interpretative notes: 

మిల్టన్ Paradise Lostలో వాడిన “darkness visible (తిమిర కాంతి)” అనే విరుద్ధోక్తి పాఠకుడిని కలవరపెట్టి వాస్తవాన్ని కొత్త కోణంలో చూచుటకు ఉద్యుక్తుని చేస్తుంది. 

అలాగే అన్నమాచార్యులు కూడా ఇక్కడ విరుద్ధరూపకాన్ని వాడుతున్నారు. ఇక్కడ "కప్రపుభర ణద్దమంటాఁ జూచీనే" అన్నది అటువంటి పదప్రయోగమే. కప్రపుభరణ  తిమిరమునకు సూచిక​. "అద్దమంటాఁ జూచీనే" = ఆ తిమిరము చూపు వెలుగునకు సూచిక​. 

నిజమైన దైవ దర్శనం “చూడాలనే ఉబలాటంలో కాదు” కాదు, “చూడవలెనను తలంపులేక తనంతట తానుగా వుండిపోవుటలోనే కలుగుటకు ఆస్కారమున్నది.


రెండవ​ చరణం:

యేఁటవెట్టి పతితోడ మాటలాడి వేగిరాన
గాఁటపుటందెలు తనకరములఁ బెట్టీనే
పాటియైనవుంగరాలు పాదపువేళ్ళఁ బెట్టి
యీటుగా మట్టెలు వేళ్ళ నిదియేల పెట్టీనే ॥తానే॥ 

పదబంధం (Phrase)

అర్థం (Telugu)

యేఁటవెట్టి పతితోడ మాటలాడి వేగిరాన

(యేఁట = goat, sheep; యేఁటవెట్టి = move like goat / sheep)

ప్రియుడితో మాటాడాలనే తపనతో మేకలా తొందర పడింది.

గాఁటపుటందెలు తనకరములఁ బెట్టీనే

(గాఁటపు = కాఁటపు = తుంటరియైన)

ఆ తబ్బిబ్బులలో  మనసు తుంటరియై గజ్జెలను చేతులపై వేసుకుంది.

పాటియైనవుంగరాలు పాదపువేళ్ళఁ బెట్టి

ఇంకా చేతులకు వేసుకోవలసిన ఉంగరాలను పాదవేళ్లలో వేసుకుంది.

యీటుగా మట్టెలు వేళ్ళ నిదియేల పెట్టీనే

(యీటు = useless; మట్టెలు = normally a silver ring worn on the toes)

మరింత అప్రయోజకముగా పాదాలకు వేసుకోవలసిన మట్టెలను చేతివేళ్లపై వేసుకోంది.

సూటి భావము:

(భూమిక: అన్నమాచార్యులు మరింత పదునుగా ఆ యువతి అంతరంగములోని గందరగోళమును కన్నులకు కట్టినట్లు చూపుతున్నారు. ఇది కేవలం ఒక యువతి తొందరలో చేసిన పొరపాటు కాదు; మనిషి మనసు ఉత్సాహములోనూ, ఆత్రుతలోనూ పడు గందరగోళానికి రూపం.) 

ప్రియుడితో మాటలాడాలనే తొందరలో ఆ యువతి గందరగోళానికి లోనయింది. చేతులకు వేసుకోవలసిన ఆభరణాలు పాదాలలోకీ, పాదాలకోసమని ఉద్దేశించిన మట్టెలు చేతివేళ్లపైకీ వెళ్లాయి. తొందరలో క్రమం మరిచి, అన్నీ కలగలసిపోయాయి. 

తాత్విక భావము: 

ఆభరణాల తారుమారు ఇక్కడ కేవలం యాదృచ్ఛికమైన పొరపాటు కాదు; అది ఆధ్యాత్మిక సాధకుని గందరగోళమును, ఎంచుకొను ప్రాధాన్యతలలో తడబాటును చూపు దృశ్యం.

ఆ యువతియే కాదు — ఈ ప్రపంచమంతా తమ తమ కోరికలు నెరవేరవలెనని ఎదురుచూపులలో, ఉత్కంఠలో కాలం గడుపుతూ అస్తవ్యస్తమునకు లోనవుతుంది. 

అన్నమాచార్యులు  ఆ యువతి అలంకార వైఫల్యములోనే పెద్ద తాత్త్విక బోధను ప్రతిబింబిస్తున్నారు. మనము అనుభవించే ప్రపంచపు రీతి, విలువల గందరగోళం, తప్పు ప్రాధాన్యతలు — ఇవన్నిటినీ ఈ చరణములో చూపించారు. 

ఆ యువతి ఆతృతలో ఎలాగైతే కాళ్లలో వేసుకోవలసిన గజ్జెలను చేతులపై వేసుకొని, ఉంగరాలను పాదలవేళ్లలో వేసుకున్నదో, అలాగే సాధకుడు కూడా సాధనలో మార్గాన్ని లక్ష్యంగా, చిహ్నాన్ని సారంగా, నీడను నిజస్వరూపముగా భ్రమిస్తాడు.

ఇది కేవలం ఒక వ్యక్తిగత తప్పిదం కాదు; మానవజాతి అంతటికీ వర్తించు సత్యం. ప్రపంచమే తన అస్థిరతలో విలువల తారతమ్యాన్ని కలిపేసుకుంటుంది. కొందరికి అత్యంత అవసరమైన ఆహారము, నిత్యావసరాలు  కూడా అందకపోగా, అధికభాగము మానవ శ్రమ, మేధా శక్తి వ్యర్థమైన, అలంకారమైన విషయాలపైనే కేంద్రీకరించబడింది. 

అయితే, సత్యరహస్యం ఈ గందరగోళానికి అవతల ఉంది. అది చంచలమైన ఆలోచనలతో పట్టుబడదు, ఉబలాటమైన శ్రమతో పొందబడదు. కలత ఆగినప్పుడు మాత్రమే అది తనంతట తాను ప్రత్యక్షమవుతుంది. 

అన్నమాచార్యులు ఇక్కడ, ఈ చిన్న అలంకార గందరగోళంలోనే మానవుల మనసులలోని అంతరంగ చిత్రపటాన్ని చిత్రిస్తున్నారు. 

భగవద్గీత (2-52): “యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి । తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చఅంటే, మోహమనే చిత్తదోషపు దళసరి దాటినప్పుడే నిజమైన జ్ఞానం, నిజమైన దృష్టి ఉద్భవిస్తుంది. 

దావో తత్వం (దావో దే జింగ్, 64): “Rushing into action, you fail. Trying to grasp, you lose.” ఆత్రుతతో చేసేది విఫలమవుతుంది. పట్టుకోవాలనే కాంక్షతో పరిగెత్తితే అది చేజారిపోతుంది.” — ఆతురత, ఆశ మనల్ని చిక్కుల్లో పెడతాయి. 

కాబట్టి, యువతి గందరగోళం ద్వారా అన్నమాచార్యులు మొహం వాచేటట్లు చీవాట్లు పెడుతున్నారు. అశాంతి తప్పులను పుట్టిస్తుంది; ప్రశాంతత మాత్రమే సత్యానికి ద్వారం తెరుస్తుంది


మూడవ​ ​ చరణం:

కామిని శ్రీవేంకటేశుఁ గదిసేటి వేడుకను
వేమరు మాణిక్యములు విడెమంటా నిచ్చీనే
ఆమని రతిఁ దనిసి అంతలో నన్నీఁదెలిసి
సామజగమన ఇన్నీఁ జక్కఁ జేసుకొనెనే ॥తానే॥ 

Telugu Phrase

Meaning

కామిని శ్రీవేంకటేశుఁ గదిసేటి వేడుకను

ఆ జవ్వని శ్రీవేంకటేశుని కలవబోతున్నననే వేడుకతో మైమరచి

వేమరు మాణిక్యములు విడెమంటా నిచ్చీనే

అనేకమార్లు మాణిక్యములను తాంబూలమనుకొంటూ సమర్పించింది

ఆమని రతిఁ దనిసి అంతలో నన్నీఁదెలిసి

అప్పుడు శ్రీవేంకటేశునితో కూడి ఆ తరువాత  తన తప్పులన్ని తెలుసుకొనెను

సామజగమన ఇన్నీఁ జక్కఁ జేసుకొనెనే

ఆ సామజగమన అవన్నీ (తప్పులన్ని) చక్కఁ జేసుకొనెను

సూటి భావము:

ఆ యువతి ఇంకా భక్తి ఉత్సాహములో మునిగిపోవగా, శ్రీ వేంకటేశునితో కలయిక అనే మహోత్సవాన్ని ఊహించుకొంటుంది.

ఆ ఊహల గజిబిగిలో, తానేమి చేస్తున్నదో మైమరచి, తాంబూలానికి బదులు మాణిక్యములను సమర్పిస్తుంది.  

కానీ, భగవంతుడు ఆమె స్థితిని గ్రహించి ఆ తప్పును అంగీకరిస్తాడు.

ఆ కలయికలో ఆమెకున్న అసంతృప్తి, అయోమయం అంతరించి పోతాయి.

ఆ క్షణంలోనే ఆమె మనస్సు జక్క జేసుకొనెనే — అంటే సహజంగానే క్రమబద్ధమై, ప్రశాంతమైపోతుంది.​. 

తాత్విక భావము:

ఆమె మనసులో కక్కరిబిక్కరి శిఖర  స్థాయి చేరింది. తాంబూలం అనే సాధారణమైన దానికి మారుగా  మాణిక్యం ఇచ్చింది —అనేక మార్లు —ఇది కేవలం అపశృతి కాదు. కఠోర వాస్తవం. 

సాధారణం స్థానంలో ఆర్భాటం, అవసరమైనదాని స్థానంలో మోసం, నిజం స్థానంలో నీడను పెట్టడం — ఇదే మనస్థితి. మనందరి స్థితి. మనలోని మౌలిక తర్జనభర్జనకు ప్రతీక. 

యినా, భగవంతుడు తిరస్కరించలేదు. ఎందుకంటే భక్తిలో అన్నింటి కంటే హృదయ స్వచ్ఛతయే  ప్రధానము.  భగవంతునితో కలిసిన క్షణంలో, ఆమె గందరగోళమంతా అంతరించి పోయింది. 

సామజగమన ఇన్నీఁ జక్కఁ జేసుకొనెనే” ముందర అన్ని తప్పులు చేసిన ఆ మనస్సే తనకు తానే ఒక్కసారిగా సహజమైన క్రమబద్ధతను ఏర్పరచు కొనగలిగెను. అనగా ఆ మనస్సు తనను తాను చక్కబరచు స్థాయికి చేరుకొనెను. మానవ చరిత్రలో అటువంటి ఎత్తులకు చేరిన వారు బహు కొద్దిమంది మాత్రమే. ఇది అన్నమాచార్యుల ప్రాథమిక సత్య దర్శనమునకు చేవ్రాలు. 

ఇందులో ముఖ్యంగా గమనించవలసినది ఈ పరిణామము అతి శీఘ్రముగా, తృటిలో జరిగిపోయినది. గందరగోళం నుంచి శాంత స్థితికి చేరుకుంది. ఆ యువతి మనస్సు దేవుని మనస్సుకు మారుగా అయిపోయింది (భగవద్గీత 7-18​). ఆమె మనస్సు వ్యక్తిగత స్థితి నుండి విశ్వమనస్సుగా పరిణమించింది” అని చెప్పవచ్చును. ఆ స్థితిలో మాతమే తనను తాను మార్చుకోగల శక్తి కలుగును. తక్కిన ఏ స్థితిలోను అది మనలాంటి సాధారణ స్థాయిలో అవశముగా విషయముల చిక్కుకుని విల విలలాడుతూ సమయము గడుపును. 

హిందూ తాత్త్వికతలో మనసు గందరగోళం నుండి సహజ క్రమబద్ధతకు చేరుట” అనే అంతఃస్థితి గురించి స్పష్టమైన వచనములు అరుదు. కానీ ఇక్కడ అన్నమాచార్యులు ఆ విషయాన్ని చాలా సహజంగా చెప్పారు. కానీ అత్యంత స్వతంత్రమైన దృక్పథం. 

ఇదే భావాన్ని 20వ శతాబ్దంలో జిడ్డు కృష్ణమూర్తి తిరిగి చాటి చెప్పారు — నిజమైన క్రమం అనేది నియమం వల్ల రాదు, గందరగోళం తీరినపుడు సహజంగానే పుడుతుంది.


వ్యాఖ్యానము:

మాణిక్యం తాంబూలం స్థానంలో ఇవ్వడం అనేది మనిషి మానసిక గందరగోళానికి బింబం. అయినప్పటికి భగవంతుడు ఆమెను అంగీకరించాడు. ఇది భగవంతుని కరుణకు ఉదాహరణ​. 

అయోమయం నుండి సహజ క్రమానికి తక్షణ పరివర్తన — ఈ కీర్తనకు గుండె వంటిది.  చిరస్థాయిగా ఉత్తేజపరచుచు, ఉత్సాహపరచును. 

ముందు ఆ యువతిది వ్యక్తిగత పాత్ర. కానీ ఆమె సార్వత్రిక మానవ మనస్సుగా మారును​. ఈ అపూర్వ​ కీర్తనను మనకు అందించిన అన్నమాచార్యులు చిరస్మరణీయులు. 


ఈ కీర్తన ముఖ్య సందేశం 

ఈ కీర్తన భక్తి (మెడిటేషన్-ధ్యానం, భగవదారాధన) శూన్య విషయాలు కావని లోతుగా నిరూపిస్తుంది. ధ్యాన మార్గంలో ఆచారాలు, కర్మకాండలలో చిక్కుకుంటే భక్తి గందరగోళం ఖాయం. కానీ, ఈ కీర్తనలోని యువతిలాగే, బాహ్య విషయాలను పక్కన పెట్టి, సంపూర్ణ హృదయంతో భక్తిని అనుసరిస్తే, అది మానవాళి శ్రేయస్సుకు దారితీస్తుంది. 

అన్నమాచార్యుల కవితలు మానవ మనస్సులోని అపారమైన అవకాశాలను చాటి చెబుతాయి. క్రమబద్ధమైన మనస్సు అనేది సాధించుకోవలసిన లక్ష్యం కాదు, అది మన సహజ స్థితి. అసహజమును పారద్రోలడమే భక్తి (లేదా ధ్యానం). ఆ నిజాన్ని గ్రహిస్తే అనంతమైన అవకాశాలు తెరుచుకుంటాయి. మిగిలినదంతా మన స్వంత సృష్టి అయిన ప్రపంచంలో, దాని పర్యవసానాలను చూస్తూ గడిపే కాలం మాత్రమే.


X-X-The END-X-X

No comments:

Post a Comment

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...