కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
For Commentary in English please press here:
అన్నమాచార్యులు ఈ కీర్తనలను ఒకటొకటిగా మనకు బోధించుట కొరకు వ్రాయలేదు. వారు తమలో తాము అనుభవించిన ప్రత్యక్ష విషయమును లోక హితముకై వెల్లడించారు. అన్నమాచార్యులు తాదాత్మ్య స్థితి చేరుకొని అనుభవించి వ్రాసిన ఈ కీర్తనలు శ్రద్ధతో పరీక్షగా చదివిన/వినిన వారికి పరమపద సోపానముల నిపించును.
ఆచార్యులవారు అతి లాఘవంగా ఈ కీర్తన ముఖ్య సందేశమును శృంగార వర్ణనలు అనిపించు పదముల వెనుక దాచి మనకు సవాలు విసురుతారు. అత్యంత సులభమైన పదముల అల్లికతో అనంతమగు గంభీరమైన సందేశమును చెప్పించవచ్చును అనుటకు ఈ కీర్తన ఆద్యంతము ఉదాహరణీయము. ఆసాంతము రమణీయము.
ఆ పదములు తేనెలో ముంచి తీసిన అక్షరములతో కూర్చినవో తెలియదు. ఆమె మేలి ముసుగు జారగా తళుక్కుమన్న మేలిముత్యములో నిర్ణయించ లేము.ఈ కీర్తన లావణ్యమునకు స్వర్గములో మేటి నృత్యమణుల విన్యాసమూ సరిపోలనిది. మేఘావృతమైన ఆకాశంలో ఇదమిత్థముగా లేని వ్యక్తం చేయలేని విద్యుల్లత లాంటిదనీ చెప్పలేము.
ఇంత సున్నితమైన పదాలకు విరుద్ధంగా అన్నమాచార్యులు మన మీద కురిపిస్తున్న విమర్శలు అనే సమ్మెటపోట్లు హృదయంలోకి చొచ్చుకుపోతే, క్షణిక కాలానికైన అవి కల్పించు స్థితిని అనుభవించ గలిగితే, మనసుకు తగులుకొన్న ముసుగులు తొలగిపోతే, ఒక్కసారిగా ఈ ప్రపంచమును దాని నగ్న నృత్యమును, తనను తన నిజ రూపంలో చూచు కోగలిగితే, జన్మ ధన్యమైనట్లే.
కీర్తన
కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు ॥పల్లవి॥
ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని రెప్ప
ముయ్యనేరక మహ మురిపెమునను
కయ్యంపుఁ గూటమికిఁ గాలుదువ్వుచు నెంతె
కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥
పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు-
తాపమవునని చెలులు దలఁకగానే
తోపు సేయుచుఁ గెంపు దొలఁకుఁ గన్నుల కొనల
కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥
ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలుములు
ఒప్పదని చెలి గోర నొత్తఁగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిఁట గూడి
కొప్పుగులుకుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥
Details and explanation:
కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు ॥పల్లవి॥
టీకా: కొమ్మ = ఈమె; తన= తన; ముత్యాల కొంగు = ముత్యాల కొంగు; జారఁగఁ = జారిపోగా; బగటు = కనబఱచుచు, త్రవ్వుచు, పైవెట్టుచు, పొడమించుచు, బహిర్గతముచేయుచు; కుమ్మరింపుచుఁ = కుమ్మరించుచు; దెచ్చుకొన్నదీ = కొని తెచ్చుకోన్నదీ; వలపు = ప్రేమ, వలపు, ఆప్యాయత.
భావము: తన ముత్యాల కొంగు జారిపోగా (సిగ్గు లేక) తెచ్చిపెట్టుకున్నఆప్యాయతలన్నీ ఆమెకు అవగతమైనవి.
వివరణము: ఇక్కడ ఈమె అనగా అన్నమాచార్యులు తనను తానే ఒక స్త్రీగా వర్ణించుకున్నారు.
"ముత్యాల కొంగు జారఁగఁ"తో అప్పటి వరకు తనను కబళించిన తెరలు (సిగ్గు) తొలగి పోవుటను సూచించారు.
బగటు కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు = వృథా ప్రయాసలకోర్చి తెచ్చిపెట్టుకున్నదీ (మనము) చూపించు మోహము.
అంతరార్థము: మానవులారా మనము కనబరచు ప్రేమ, మోహము, ఆప్యాయత వృథా ప్రయాసలకోర్చి తెచ్చిపెట్టుకున్నది. దీనిని సిగ్గు విడిచి వదిలిన కానీ, భగవానుని అవ్యాజమైన ప్రేమను అనుభవించలేము.
మొదటి చరణం
ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని రెప్ప
ముయ్యనేరక మహ మురిపెమునను
కయ్యంపుఁ గూటమికిఁ గాలుదువ్వుచు నెంతె
కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥
టీకా: ఒయ్యారమున = సౌందర్యగర్వముతో; విభుని= తన మగని, దైవము; వొరపు = ఉపాయము, స్థిరము, సుందరమైన, గొప్ప, యోగ్యము; గనుఁగొని = కనుగొని, తెలుసుకుని; రెప్పముయ్యనేరక = కనురెప్ప మూయడం కూడా మరిచి; మహ మురిపెమునను = అతిశయమైన శృంగార గర్వముతో; కయ్యంపుఁ గూటమికిఁ = యుద్ధము లాంటి సమాగమమునకు; గాలుదువ్వుచును = కాలుదువ్వుచును; ఇంతె = ఆ స్త్రీ; కొయ్యతనమునఁ = మొండితనమున; దెచ్చుకొన్నదీవలపు = తెచ్చిపెట్టుకున్నదీ కనబఱచు మోహము;
భావము: సౌందర్యగర్వముతో, ఆ దైవమును కనుగొనగలనను ఊహలతో, కనురెప్ప మూయడం కూడా మరిచి అతిశయించిన శృంగార గర్వముతో యుద్ధము లాంటి (దైవ) సమాగమమునకు ఆ స్త్రీ కాలుదువ్వుచు మొండితనమున తెచ్చిపెట్టుకున్నదీ కనబఱచు వలపు.
వివరణము: "కయ్యంపుఁ గూటమికిఁ" అను పద బంధమును"సమత్వం యోగ ఉచ్యతే (2-48)" అన్న గీతా వాక్యాన్ని కలిపి పరిశీలిద్దాము. ఇక్కడ సమత్వం అన్నది తాను అన్నమాచార్యులు అను ఊహగల ఈ దేహము, ఆవల దాని పరిపూరకమగు (కాంప్లిమెంటరీ గా) ఇంకొకటి. పరస్పరము ఇమడని రెండు వ్యతిరేక శక్తుల గురించి తెలుపుచున్నారు.ఆ శక్తులను ఒకచోట చేర్చి ఉంచడమే యోగము. ఇది ఆచార్యులవారు మానవులెవరూ దర్శించని ఆ సమస్థితిని చేరుకొని చెప్పిన విషయం. దీనిని భగవద్గీతలోని క్రింది శ్లోకము నుండి గ్రహించవచ్చు.
ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ । ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।। 15-1 ।। భావము: వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న అవ్యయమైన అశ్వత్థ వృక్షము యొక్క రూపమును కనుగొనుము. దాని యొక్క ఆకులు వేద మంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు (సమస్త) వేదములను గ్రహించినట్లే. ఈ రకముగా ఈ శ్లోకము విలోమ ప్రతిబింబమును సూచిస్తొంది.
ఈ విలోమ ప్రతిబింబమే (inverse mirror) ప్రధాన ఇతివృత్తంగా హిల్మా క్లింటన్ వేసిన హంసల (the swan) శృంఖలలో గమనించ వచ్చును. ఉదాహరణకు Swan No 24లో (పై బొమ్మ చూడండి) ఆ హంసలు ఒక దానిలోకి ఒకటి చొచ్చుకొని పోయి, భౌతికంగా అసాధ్యమనిపించినా కాని, ఆ కష్టమును విస్మరించి అలౌకిక (యోగ) స్థితిలో సాధారణ మానవుల కనులు కాంచలేని ఈ లోకములోని అంతర్లీన అత్యద్భుతమైన క్రమమును కనుగొనునని చూపుతున్నవి. దీనిపై మరింత వివరణ కొరకు ఈ లింక్
Swan No. 24 ద్వారా తెలియవచ్చును.
అతి జాగ్రత్తగా పరిశీలించిన, పైన ఉదాహరించిన భగవద్గీత శ్లోకము కూడా అన్నమాచార్యులు చెప్పిన "కయ్యంపుఁ గూటమికిఁ" ఊతమిస్తున్నది. ఎలాగంటే బురద నీరు కదిలించ కుండా వదలేస్తే బురద అడుక్కి వెళ్లి, తేట నీరు నిలిచి స్పష్టంగా చూచుటకు అవకాశం కలుగుతుంది. అయితే, ఏమాత్రం అలజడి కలిగినా (= ప్రయత్నం చేసినా) బురద పైకి లేచి చూడనివ్వదు. కావున ఆ నిశ్చలమైన స్థితిలో అలజడి కలుగజేయట మంటే సమత్వం నుంచి వెడలటమే. కావున దానిని "కయ్యంపుఁ గూటమికిఁ" అని అన్నమాచార్యులు వ్యవహరించారు.
"కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు" = 'నాకు తప్పొప్పులు నిర్ణయించే శక్తి కలదని' మానవుడు విశ్వసించి దాని నుండి వచ్చు మొండితనమున తెచ్పిపెట్టుకున్నదీ కనబఱచు మోహము. (అయితే, మానవుల జ్ఞానము ఇప్పటి స్థితిలో అజ్ఞానముతో కప్పబడినదని భగవద్గీత శ్లోకము "ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ । యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।। 3-38 ।।" నుండి తెలియవచ్చును.
అంతరార్థము: మానవులు అనేక సౌందర్య సాధనములు ధరించి, తాము తలచిన భగవానునికి రూపు కల్పించి, అలంకరించి తమ తమ కళలతో విభుని మెప్పించుటతోను, సంగీతముతో పారవశ్యము చెందిన స్థితిలో ఆ విభుని చేరుటకు మార్గము కనుగొనెదమని మురిసిపోతూ ఆ అందమైన దేవదేవుని చూచుటకై కనురెప్పలు మూయకుండా వేచి సమస్థితిలో తాను చేయగల కార్యములు లేకపోయిననూ ఉబలాటము కొలది మొండితనము కొలది ఏదో ఒకటి చేయవలెను ఆతృతతో జీవనము అను అద్భుతమైన అవకాశం పోగొట్టుకుంటాము అన్న విషయం చెబుతున్నారు.
రెండవ చరణం
పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు-
తాపమవునని చెలులు దలఁకగానే
తోపు సేయుచుఁ గెంపు దొలఁకుఁ గన్నుల కొనల
కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥
టీకా: పైపైనె = మీదిమీదనే; ఆరగింపకుము = తినవద్దు , (=విహరించవద్దు); పన్నీరు = పరిమళపు నీరు; గడు-తాపమవునని = ఎక్కువ విరహ తాపము కలుగునని; చెలులు దలఁకగానే =చెలులు కంపించినా (వద్దని వారించినా); తోపు సేయుచుఁ= కోపగించుచు; గెంపు దొలఁకుఁ గన్నుల కొనల= ఎర్రని కన్నుల కొనలు కంపించగా; కోపగింపుచుఁ =కోపగింపుచుఁ; దెచ్చుకొన్నదీవలపు = స్వయంకృతముగా బయటపడిన కోరిక.
భావము: ఆమె ప్రస్తుతం గడుపుతున్న జీవితం పన్నీరు లాంటిది. పైకి సువాసన వెదజల్లుతూ వున్నా దానిని లోపలికి తీసుకొనవడం ఆరోగ్యానికి హానికరం. అది గమనించి చెలులు కంపించి (వద్దని వారించినా) వినక ఎర్రని కన్నుల కొనలు కంపించగా కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు.
వివరణము: విషయములలో తిరుగు మనసు కోపమునకు గురి అవునని ఈ భగవద్గీత శ్లోకము ద్వారా తెలియును. శ్లో|| ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే । సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ||(2-62)|| భావము: ఇంద్రియ విషయములను పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా వాటి మీద ఆసక్తి మమకారమూ పెరుగుతుంది. ఆసక్తి వలన కోరికలు; దాని నుండి క్రోధము సంభవిస్తాయి.
చెలులు: ఇక్కడ అన్నమాచార్యులు చెలులు అన్న పదంతో పక్క వారు, స్నేహితులు తల్లిదండ్రులు సఖులు అన్న అర్థాలను చూపించారు.
మూడవ చరణం
ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలుములు
ఒప్పదని చెలి గోర నొత్తఁగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిఁట గూడి
కొప్పుగులుకుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥
టీకా: ఎప్పుడునుఁ = ఎప్పుడునుఁ; బతితోడ = పతి (దైవము) తోడ; నింతేసి = ఇంత ఎక్కువ; మేలుములు = ముసుగులు; ఒప్పదని చెల్లవని ; చెలి = హితులు(దైవదాస్యులు); గోర నొత్తఁగానే = గోరుతో నొక్కి చెప్పగా; యెప్పుడో = యెప్పుడో; తిరువేంకటేశు = తిరువేంకటేశుని; కౌఁగిఁట గూడి = ఐక్యమై; కొప్పుగులుకుచుఁ= తలతో కులకడం (అంటే ఆనందించడం. కులుకు అంటే తనలో తాను ముచ్చటపడుతూ ఆనందిస్తూ ఉండడం); దెచ్చుకొన్నదీ వలపు= తనపై తాను వేసుకున్నది ఈ అనురాగము.
భావము: శ్రీ వేంకటేసు దాసులు ఆ దైవము దగ్గర (మానవులుగా మనం) తెచ్చి పెట్టుకున్న ముసుగులు చెల్లవని గిల్లి చెప్పగా, తనలో తానే ముచ్చటపడుతూ ఆనందిస్తూ, తనపై తాను కురిపిస్తున్న ఈ అనురాగము, ఆప్యాయత కేవలము బాహ్య ఆచ్ఛాదనలని (క్షణికానందములని) తెలిసి వదలివేయగా ఆ వేంకటేశ్వరుని భావనలో ఐక్యమై ఆమెకు (అన్నమాచార్యులకు) వెనుకటి ఎప్పటి నుండో తామిరువురు ఒకటను భావము ప్రత్యక్షంగా కలిగెను.
వివరణము: యెప్పుడో అను పదముతో, కాలగమనముతో సంబంధము లేని స్థితిని తెలిపారు.
x-x-x-x