Thursday, 1 January 2026

T-297 పారితెంచి యెత్తివేసి పారవెళ్లితివి

 తాళ్లపాక అన్నమాచార్యులు
297 పారితెంచి యెత్తివేసి పారవెళ్లితివి
For English version press here
ఉపోద్ఘాతము
అన్నమాచార్యులు ఇక్కడ మరింత లోతుగా తనను తానే పరీక్షించుకొనుచున్నారు. “జీవితం ఎలా అలవాటుగా విన్నవి, కన్నవి, స్పృశించినవాని ప్రకారమే సాగుతుందో తనలోనే గమనిస్తున్న” మనిషి మాటలివి. ఆ నిశితమగు పరిశీలనలో పరీక్షించునది, పరీక్షకుల మధ్య బేధములు దాదాపు సమసిపోయిన స్థితి కనబడుతుంది. ఆ స్థితినుండి వ్రాసిన కీర్తన ఇది. అందువల్ల, ముఖ్యంగా ఈ కీర్తనలో ‘నా (నేను)’ మరియు ‘నీ (ఆ తెలియలేని వాడు)’ల మధ్య అంతరములు ఒకదానిపైనొకటి పరస్పరంగా వ్యాపించి, కొంత భావలోపము కూడా చోటు చేసుకున్నది. అందుచేత ఈ కీర్తనను విశ్లేషించుట కొంత గందరగోళముగాను, మరింత జటిలముగాను అనిపిస్తుంది.
 
జీవితం ఎలా అలవాటుగా విన్నవి, కన్నవి, స్పృశించినవాని ప్రకారమే సాగుతుందో తనలోనే గమనిస్తున్న” మనిషి మాటలివి. చైతన్యావస్థలో మనకు తెలిసినవి కొన్నయితే, మనలోనే వున్నా, మనము ఎప్పుడూ గమనించని స్పృశించినవి కూడా వున్నాయని గ్రహించవలె. ఆ రెంటినీ కలిపి ‘అలవాటుగా విన్నవి, కన్నవి, స్పృశించినవానివి’ అని చెప్పడమైనది.

అటువంటి నిరపేక్ష వీక్షణము జరగాలంటే, అనుభవములోనికి రావాలని అనుకునే ఘట్టము, మదిలో నిక్షిప్తమై ఉన్న భావనలు దానిని ప్రభావితం చేయకముందే కనిపించవలె. అనగా ఆ దృశ్యము మనస్సు తెరపై ప్రత్యక్షమయ్యే మునుపే తెలిసే చూపు. ఇందుకు అత్యంత నిశితమైన, సూక్ష్మానుభవానికి మనము సిద్ధపడవలెను. అది సాధన కాదు; అప్రమత్తత యొక్క పరాకాష్ఠ.”

అటువంటి అప్రమత్తతకు మనకు అనుభవములను అందించు ముతక గ్రాహ్యత అక్కరకురాదు. ముతక నుండి సూక్ష్మ గ్రహణమునకు ప్రయాణం అభ్యాసము ద్వారా లేదు. అది మనలో ఉండి ఆటంకములు కలిగించు పూర్వానుభవముల జాడలు  పూర్తిగా సమసినను కాని సాధ్యము కాక పోవచ్చును. ఎవరూ వాటిని ఉద్దేశపూర్వకముగా చెరుపలేరు. అట్లని చెరుపుటకు మార్గములూ లేవు.  అది సత్య దర్శనము పిమ్మటి మాట. సత్య దర్శనము జరిగినవారు ఇతరులకు మార్గ దర్శనము ఇచ్చుటకు సాహసించరు. అందుకే ఈ సాధన ఇతరుల మార్గ దర్శనములో చక్కగానిది. మునుపటి కీర్తన "ఎవ్వారు లేరూ హితవు చెప్పఁగ" యొక్క బోధను అంతరంగములో తెలియవలెను..

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 14-5   సంపుటము: 1-87
పారితెంచి యెత్తివేసి పారవెళ్లితిని(వి?)
నీరసపు టెద్దవైన నీకు నే ముద్దా        ॥పారి॥

ఎద్దవై నన్నేల తొక్కి యేమి గట్టుకొంటివి
వొద్దనైన వచ్చి వూరకుండవైతివి
వొద్దిక భూమెత్తిన యాయెద్దుకు నే ముద్దుగాక
నిద్దురచిత్తముతోడినీకు నే ముద్దా      ॥పారి॥

కాఁపురపుఁ బాపపు నా కర్మమును ధరించి
వీఁపు వగులఁగ దాకి విఱ్ఱవీఁగితి
ఆఁపఁగ నెద్దేమెఱుంగు నడుకుల చవి మూట-
మోపరివి నీకు నాముదము ముద్దా      ॥పారి॥

మచ్చరించి అల్లనాఁడు మాలవాఁడు కాలఁదన్ని
తెచ్చినయప్పటి ధర్మదేవతవు
యెచ్చరించి తిరువేంకటేశుదాసుఁడని నన్ను
మెచ్చి తాఁకితివి నా మేను నీకు ముద్దా             ॥పారి॥
Details and Explanations:
పల్లవి
పారితెంచి యెత్తివేసి పారవెళ్లితిని(వి?)
నీరసపు టెద్దవైన నీకు నే ముద్దా ॥పారి॥ 
              Telugu Phrase
Meaning
పారితెంచి యెత్తివేసి పారవెళ్లితిని(వి?)
(పారితెంచు = పరుగునవచ్చి, ప్రవహించు, వ్యాపించు) పరుగుపరుగునవచ్చి ఒక ప్రవాహములో తెచ్చి ఇక్కడ నన్ను వదలి వెళ్ళావు
నీరసపు టెద్దవైన నీకు నే ముద్దా
(నీరసపు టెద్దవైన = రసములేని దాని అంచులలో వుండు వాడా = మరణపు అంచులలో సంచరించువాడా= అనుభవమునకు రాని వాడా) దైవమా నేను నీకు ముద్దా? (లేదే?)

భావము:
ఈ జీవప్రవాహములో కొట్టుకుపోతూ, ప్రాణాలను పట్టుకుని ఉన్నాను. అనుభవమునకు రాని వాడా! నీకు నేను  ముద్దా? (లేదే?)

గూఢార్థవివరణము: 
ఇది మమూలు ఆత్మ పరీక్ష కాదు. తనను తాను తునకలు తునకలుగా ఛేదించి పరిశోధించుట. వాడి మాటల విసుర్లు ఎద్దు లాంటి పదములు ఈ పరిశోధనకు మరింత కఠోరతను పెంచినవి. ఈ మాటల వెనుక "దినముఁ బారుచునుండు దిగువకు వెళ్లలేదు" ఐతే అది లోతుకు వెళ్లలేదు. పైపైనే తిరుగును" అన్న భావము ప్రత్యక్షము.

అలా లోతుకు వెళ్ళలేని అశక్త  స్థితిలో నిష్కర్షగా తనను తాను చూచుకొని అణు మాత్రము క్లేశమునకు లోనుకాక నిర్వికార స్థితిలో చెప్పిన కీర్తన ఇది. మనమంతా జీవన ప్రవాహములో అవశులమై కొట్టుకొనిపోవుచున్నామను నిజము ప్రమాణముగ ఈ కీర్తన మొదలౌతుంది.

అన్నమాచార్యులు తనను తానే విమర్శించుకుంటూన్నారు. అప్రమత్తతలే అనవసరపు శ్రమతో, జీవప్రవాహములో భాగమవకుండా ప్రాణాలను పట్టుకుని ఉన్నాను. (జీవ) ప్రవాహపు సత్యమును స్వీకరించలేని నేను నీకు ముద్దుఎలాగౌతాను.

ఇక్కడ "నేను నీకు ముద్దుఎలాగౌతాను?" అన్నది దైవముతో చెప్పిన మాటలు కావు. "నీ లోనిసమ్మతము" లేక వేరెవరిదో సమ్మతమున్నను, లేకున్నను ఏమి ప్రయోజనము?

పారవెళ్లితిని
ఈ జీవప్రవాహములో  కొట్టుకుపోతూ ఇక్కడ తననేవరో వదలి వెళ్ళారని అనబోతారు, అన్నమాచార్యులు. అంతలోనే సవరించుకొని, ప్రవాహమును పిరికిగా వదలి వెళ్ళిన తన వైనమును తప్పు పడుతున్నారు.

మొదటి చరణం:
ఎద్దవై నన్నేల తొక్కి యేమి గట్టుకొంటివి
వొద్దనైన వచ్చి వూరకుండవైతివి
వొద్దిక భూమెత్తిన యాయెద్దుకు నే ముద్దుగాక
నిద్దురచిత్తముతోడినీకు నే ముద్దా              ॥పారి॥ 
Telugu Phrase
Meaning
ఎద్దవై నన్నేల తొక్కి యేమి గట్టుకొంటివి
"నన్ను లేదా నేను"ను పశుబలంతో అణిచి ఏమికట్టుకున్నావు?
వొద్దనైన వచ్చి వూరకుండవైతివి
ఆ సత్యానికి దాపులదాకా వచ్చి వుండగలిగావా?
వొద్దిక భూమెత్తిన యాయెద్దుకు నే ముద్దుగాక
అనుకూలపరచు భూమిని జన్మమెత్తిన ఆ మృగమునకు (పశుప్రవృత్తికి) నేను సులభముగా లొంగిపోతాను కానీ (=ఈ భూమిలో పశుప్రవృత్తిని అవలంభించుట సులభము)
నిద్దురచిత్తముతోడినీకు నే ముద్దా
నా అప్రమత్తతలేని మనసు నీకు ముద్దా? (కాజాలదు)

భావము: 
(అన్నమాచార్యులు ఆత్మ పరిశీలన చేసుకొనుచున్నారు). “ఎద్దవై” అంటే — జ్ఞానములేని బలంతో ‘నేను’ అనే భావాన్ని అణిచివేస్తూ, ఏమి సాధించాను? సత్యానికి దాపులలో నిలబడలేకపోతివి. ఈ భూమిని (కాయమును) మోయుటకు, పనికివచ్చుటకు పశుబలం సరిపోతుంది — కాని అప్రమత్తతలేని, నిద్రచిత్తంతో ఉన్న నేను సత్యానికి ఎలా ముద్దు అవుతాను? కాజాలను.

గూఢార్థవివరణము:
ఎద్దవై నన్నేల తొక్కి యేమి గట్టుకొంటివి
అన్నమాచార్యులు పశుబలంతో, భౌతికమైన సంకల్పముతోను సత్యమును చూడలేమని నిష్కర్షగా చెబుతున్నారు. "నిద్దురచిత్తము" అనునది మన ఇప్పటి స్థితి. దానిని ఒప్పుకొనుటకు మనస్సు అంగీకరించదు. గౌరవము అడ్డువచ్చును. అహంకారము బుసలు కొట్టును. అంతే.

రెండవ​ చరణం:
కాఁపురపుఁ బాపపు నా కర్మమును ధరించి
వీఁపు వగులఁగ దాకి విఱ్ఱవీఁగితి
ఆఁపఁగ నెద్దేమెఱుంగు నడుకుల చవి మూట-
మోపరివి నీకు నాముదము ముద్దా              ॥పారి॥
Telugu Phrase
Meaning
కాఁపురపుఁ బాపపు నా కర్మమును ధరించి
(అన్నమాచార్యులు ఇక్కడ మరింత లోతుగా తనను తానే పరీక్షించుకొనుచున్నారు. ఆ క్షణంలో వారికి కనబడుతున్న తన శరీరము ఎవరిదో గుర్తించలేకున్నారు. దానిని ఉద్దేశించి ఇలా అంటున్నారు) ఈ సంసారములో పాపమను  కర్మము గడియించి
వీఁపు వగులఁగ దాకి విఱ్ఱవీఁగితి
నేను మోయలేననే వరకు విఱ్ఱవీఁగుతు తిరిగాను (ఇంతకు మునుపే చేసి ఉండాల్సిదన్న భావము)
ఆఁపఁగ నెద్దేమెఱుంగు నడుకుల చవి మూట-
(ఆఁపఁగ=నదీ ప్రవాహము)
ఈ (జీవన) ప్రవాహమును గ్రహించుటకు ఎద్దులాంటి నాకు మంచి అటుకుల రుచి ఎలా తెలుస్తుంది? (తెలియదే!)
మోపరివి నీకు నాముదము ముద్దా
(అన్నమాచార్యులు తనను తాను పూర్తిగా మరచిపోయారు, అక్కడ కనబడుతున్న తన ఆకారముతోనే ఇలా అంటున్నారు) ఈ భారమును మోయువాడివినీవే. ఐతే నా సంతోషం నీకు ముద్దా? (అలా అనిపించడంలేదే అన్న ధ్వని విన బడుతోంది)
సూటి భావము:
(అన్నమాచార్యులు ఇక్కడ మరింత లోతుగా తనను తానే పరీక్షించుకొనుచున్నారు. “జీవితం ఎలా అలవాటుగా విన్నవి, కన్నవి, స్పృశించినవాని ప్రకారమే సాగుతుందో తనలోనే గమనిస్తున్న” మనిషి మాటలివి. ఆ నిశితమగు పరిశీలనలో పరీక్షించునది, పరీక్షకుల మధ్య బేధములు దాదాపు సమసిపోయిన స్థితి కనబడుతుంది. ఆ స్థితినుండి వ్రాసిన కీర్తన ఇది.

అందువల్ల, ముఖ్యంగా ఈ కీర్తనలో ‘నా (నేను)’ మరియు ‘నీ (ఆ తెలియలేని వాడు)’ల మధ్య అంతరములు ఒకదానిపైనొకటి పరస్పరంగా వ్యాపించి, కొంత భావలోపము కూడా చోటు చేసుకున్నది. అందుచేత ఈ కీర్తనను విశ్లేషించుట కొంత గందరగోళముగాను, మరింత జటిలముగాను అనిపిస్తుంది.)

(అన్నమాచార్యులు తనలో తాను ఇలా అనుకొంటున్నారు) ఈ సంసారములో పాపమను కర్మమును గడియించి, నేను ఇక మోయలేననే వరకు విఱ్ఱవీఁగుతు తిరిగాను. ఇదేమి  ప్రవాహము. నన్ను తనలో కలుపుకు పోతున్నదే. ఇక నేను (అన్నమాచార్యులు) ఉండనా? ఆ జీవ ప్రవాహమును నిర్ద్వందముగా స్వీకరించుటకు మునుపు అలోచనలివి. (వారు  తానెవరో పూర్తిగా మరచిపోయారు, అక్కడ కనబడుతున్న తన ఆకారముతోనే ఇలా అంటున్నారు) ఈ భారమును మోయువాడివినీవే. ఐతే నా సంతోషం నీకు ముద్దా?  (కాదు)

గూఢార్థవివరణము: 
వీఁపు వగులఁగ దాకి విఱ్ఱవీఁగితి
మానవుడు తన అసలు స్థితిని గమనించలేడు. ఎల్లవేళలా తనకు "సేదతీర్చు" విషయములను పట్టుకొని వేలాడుతూ, "ఎదో ఒకరోజున నేను 'సత్యము'ను కనుగొంటాను. అప్పటిలోపల ఎవడో ఒకడు మంచి పుస్తకం వ్రాయక పోతాడా?. అప్పుడు అరగంటలో సత్యాన్ని పట్టేస్తా!"అనుకుంటాడు.
ఎద్దేమెఱుంగు నడుకుల చవి మూట
అటుకులు  వరి ధాన్యాన్ని నానబెట్టి, ఉడికించి, ఆపై చదునుగా చేసి ఎండబెట్టడం ద్వారా తయారుచేస్తారు. ఇక్కడ చదును చేయడం ముఖ్యంగా గమనించ వలసిన విషయం. 'అహముతో వూరి'వున్నవానికి అటుకులు అల్ప విషయములు. కావున వానిని గమనించడు. ​
నీకు నాముదము ముద్దా ?
ఆచార్యులవారు తననే మూడవ వ్యక్తిలాగ చూచుచున్నారు. నీకు నాముదము ముద్దా? కాదు. వారిది అటునిటు తొలకని సమస్థితి. ఆ స్థితిలో వ్యక్తిగత భావనలకు అవకాశమేలేదు.

మూడవ​​ చరణం:
మచ్చరించి అల్లనాఁడు మాలవాఁడు కాలఁదన్ని
తెచ్చినయప్పటి ధర్మదేవతవు
యెచ్చరించి తిరువేంకటేశుదాసుఁడని నన్ను
మెచ్చి తాఁకితివి నా మేను నీకు ముద్దా
Telugu Phrase
Meaning
మచ్చరించి అల్లనాఁడు మాలవాఁడు కాలఁదన్ని
 మత్సరమున ఆనాడు ఆ అంటరానితనమును తిరస్కరించ లేని అశక్తత = సత్యమును అంగీకరించలేని స్థితి ​
తెచ్చినయప్పటి ధర్మదేవతవు
ఆ విషయమును గుర్తు తెచ్చిన ఈనాటి ధర్మదేవతవు (ఆ ధర్మము కాలముతోను, పరిస్థితులతోను మార్పు చెందనిదని చెబుతున్నారు)
యెచ్చరించి తిరువేంకటేశుదాసుఁడని నన్ను
ఆ రకముగ నాకు జ్ఞాపకము చేసి నన్ను తిరువేంకటేశుదాసుఁడని
మెచ్చి తాఁకితివి నా మేను నీకు ముద్దా
మెచ్చి నన్ను తాకితివి. ఐనా, నా యీ జన్మము నీకు ముద్దా? (లేదే).
సూటి భావము:
దైవమా — మత్సరంతో, సంకుచిత దృష్టితో, నాలోనే ఉన్న ఒక అసత్యాన్ని గట్టిగా తిరస్కరించలేక పోతిని. ఈనాటి ధర్మమే మళ్లీ నాలోని లోపాన్ని చూపింది. ఆ హెచ్చరిక తరువాత తిరువేంకటేశుదాసుఁడని నాకు పవిత్రమైన గుర్తింపు ఇచ్చినప్పటికీ, నా యీ జన్మము నీకు ముద్దా? (లేదే!).

గూఢార్థవివరణము:
మచ్చరించి అల్లనాఁడు మాలవాఁడు కాలఁదన్ని
మానవుడు  మనస్పూర్తిగా ఎటువంటి సందేహములకు తావివ్వక తననుతానుగా అంగికరించుటయే అత్యున్నత స్థితి. అన్నమాచార్యులవారు ఈ చరణంలో పూర్వము మత్సరము ఆవహించగా తానే బేధభావములను చూపిన సంగతి బయట పెడుతున్నారు.
మెచ్చి తాఁకితివి
ఆ రకముగా ధర్మమును ప్రత్యక్షముగా వీక్షించినవారి హృదయము అత్యంతము నిర్మలమై అలౌకిక విషయములను ఈక్షించుటకు సన్నద్ధమగును. మనవి రెండవ తరగతి అనుభవములు. అంతా కృత్రిమమే. వారిది అంత సహజమే. కృత్రిమ రికార్డింగ్ బదులు అసలు గాయకుని వినుటకు వందలాది డాలర్లు ఖర్చుపెట్టు మనము కృత్రిమ జీవితంతో సరిపెట్టుకుంటాము.
నా మేను నీకు ముద్దా?
ముద్దు కాదు. ఆ ధర్మము కాలముతోను, పరిస్థితులతోను మార్పు చెందదు. దాని ముందు అంతా సమానులే. కేవలము ఒకరు భగవత్తత్వము తెలుసుకున్నంత మాత్రమున వారికి ఈ జన్మములో ఎటువంటి మినహాయింపులు వుండవు. వారంత తక్కిన జీవుల లాగే వ్యాధులు, జీవన సమస్యలకు, మరణములకు లోనగుదురు. తమకై ప్రత్యేక గుర్తింపు కోసము దైవమును ఆశ్రయించువారి సంగతిని మీరే అర్ధము చేసుకోగలరు.

X-X-The END-X-X

No comments:

Post a Comment

T-297 పారితెంచి యెత్తివేసి పారవెళ్లితివి

  తాళ్లపాక అన్నమాచార్యులు 297 పారితెంచి యెత్తివేసి పారవెళ్లితివి For English version press here ఉపోద్ఘాతము అన్నమాచార్యులు ఇక్కడ మరింత లోతుగా...