తాళ్లపాక అన్నమాచార్యులు
153 దిమ్మరిమాట
లాడీనే తిమ్మరాయఁడు
Synopsis: ప్రకాశము, తేజస్సు, కళల ద్వారా ప్రభువు మనలను మంత్రముగ్ధులను చేసి అయోమయములో పెట్టును.
Summary
of this Poem:
పల్లవి: తీసుకోమని వరములను గుప్పించుచునే భ్రమను, మత్తును కలిగించు మాటలతో కలవరపెడతాడు తిమ్మరాయఁడు అన్వయార్ధము: భగవంతుడు కోరికలను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ
సిద్ధంగా ఉన్నప్పటికీ, ఏమి కోరుకోవాలో తెలియని అవివేకులము.
చరణము 1: చెలులారా! అదిగో సింహాసనము మీద నల్లవాఁడే (శ్రీకృష్ణుడే) కూర్చొని వున్నాడు. పొద్దొక సింగారాలను అనుభవించుచున్న ఆ భోగరాయఁడు మీకు అగపడుతున్నాడా? విలాసముగా ఇద్దరు సతులమీఁదా జేతులు చాఁచి తీయని మధురపు మాటలు చెబుతున్నాడే ఆ సుగుడరాయఁడు. అన్వయార్ధము: ఓ మానవుడా, నీ ముందున్న సత్యాన్ని కనుగొంటున్నావా?
లేక తీపి మాటల భ్రమల లోకంలో నిమగ్నమవుతున్నావా?
చరణము 2: చక్కని మోవి నవ్వుల జాణరాయఁని మునివేళ్ళపై నిలబడి నిక్కిచూచెదరెందుకో వన్నెల నెలఁతలు?
సొగసైన విభుడు, చెక్కులమీద చెమటతోడ చెలువరాయఁడు రాచరికపు గర్వంతో విఱ్ఱవీఁగుతూ అలరించేనే.
చరణము 3: కోనేటిరాయఁడు మెండగు కళల వైభవాలను వ్యాపింపజేస్తాడు. ఉల్లాసకరమైన, ఆహ్లాదకరమైన
శృంగారకరమైన మండలములను సృష్టిస్తాడు. దండిగా
నురము మీఁది తరుణి కౌగిలింతలో వాఁడే. మళ్ళీ, బంగారు భవనంలో, అతడే మా వెంకటేశ్వరుడు. అన్వయార్ధము: ప్రకాశము, బలము, తేజస్సు, కళల నైపుణ్యముతోను వల్లభుడు మనలను మంత్రముగ్ధులను చేస్తాడు. తన ద్వంద్వత్వంతో పరీక్ష పెడతాడు. విశ్వాన్ని చుట్టుముట్టిన ఏకత్వాన్ని గమనించారా?
విపులాత్మక వివరణము
ఉపోద్ఘాతము: ఈ కీర్తనలో గోపికలు యశోదకు చిన్ని కృష్ణుని ఆగడాలను చేప్పినట్లనిపిస్తుంది. కొంత చిరుకోపం, కొంచెం ఆదుర్దా, కుసింత అసహనాన్ని సూచిస్తూ అన్నమాచార్యులు స్వామిని ముద్దుగా ‘తిమ్మరాయఁడు’ అని సంబోధిస్తాడు.
"గద్దెమీద నల్లవాడే కంటిరటే?” అంటూ అమాయక పదాల మాటున {అతడి నల్లని రూపము నేపధ్యములో కలిసిపోయి గుర్తించుట అసాధ్యము} అనే పెద్ద విషయాన్ని దాచి వుంచుతాడు. దురదృష్టవశాత్తు, మనిషి తన బుద్ధి గ్రహించగల ఆకర్షణలకు లొంగిపోతాడు. మన ఇప్పటి నిశ్చల నిశ్చితాలు, గ్రహణశక్తులు అజ్ఞానం కంటే పెద్ద అవరోధాలను సృష్టిస్తాయి.
కీర్తన: రాగిరేకు: 1031-6 సంపుటము: 20-186 |
దిమ్మరిమాట లాడీనే తిమ్మరాయఁడు కొమ్మని వరము లిచ్చీఁ గొండలరాయఁడు॥పల్లవి॥ గద్దెమీఁద నల్లవాఁడే కంటిరటే చెలులాల పొద్దొక సింగారాల భోగరాయఁడు యిద్దరు సతులమీఁదా నిమ్ములఁ జేతులు చాఁచి సుద్దులు చెప్పీఁగదే సుగుడరాయఁడు ॥దిమ్మ॥ నిక్కిచూచీ నేఁటికో నెలఁత లదేమనరే చక్కనిమోవినవ్వులజాణరాయఁడు వెక్కసపు రాజసాన విఱ్ఱవీఁగీఁ గొలువులో చెక్కుల చెమటతోడ చెలువరాయఁడు ॥దిమ్మ॥ మెండగు కళల మేని మెఱుఁగులు చల్లీని నిండు సరసముల కోనేటిరాయఁడు దండిగా నురము మీఁది తరుణికాఁగిట వాఁడే వెండి పైఁడి మేడలో శ్రీవేంకటరాయఁడు ॥దిమ్మ॥
|
Details and Explanations:
ముఖ్య పదములకు అర్ధములు: దిమ్మరిమాటలు = భ్రమను, మత్తును కలిగించు మాటలు; తిమ్మరాయఁడు = తింగరి వాడు = శ్రీవేంకటరాయఁడు; కొమ్మని
= తీసుకోమని
భావము: తీసుకోమని వరములను గుప్పించుచునే భ్రమను, మత్తును కలిగించు మాటలతో కలవరపెడతాడు తిమ్మరాయఁడు.
వివరణము: “కొమ్మని వరము లిచ్చీఁ” విచిత్రంగాను, నమ్మశక్యం కానిదిగాను అనిపించవచ్చు. అయితే, చరిత్రను పరిశీలిస్తే అనేక శతాబ్దాలుగా జీవన సౌకర్యాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల ఆకాంక్షలు దైవము నెరవేర్చకపోతే, ఇది నిజంగా జరిగేది కాదు. ఇప్పుడు ఈ క్రింది భగవద్గీత శ్లోకాన్ని చూడండి.
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః
।
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్
॥3-10॥
భావము:
సృష్టి ప్రారంభంలో, బ్రహ్మ దేవుడు, మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు, "ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వృద్ది చెందండి. ఇవే మీ సమస్త కోరికలను తీరుస్తాయి."
అనేకానేక మంది యజ్ఞముల వలె విజ్ఞన, వైద్య,
సామాజిక శాస్త్రములందు చేసిన కృషివల్లనే ఇది సాధ్యమైనదని సులభముగా గుర్తించవచ్చు.
"దిమ్మరిమాట లాడీనే' ద్వారా అన్నమాచార్యులు యేమి చెప్పదలిచారో
ఆలోచింతము. భ్రమను, మత్తును కలిగించు మాటలు అని అన్నమాచార్యులు మనము దైవాజ్ఞను స్పష్టంగా
అర్థం చేసుకోలేమని సూచించారు, ఎందుకంటే దైవము మానవుడు తనకుగల వనరులన్నింటినీ సమాయుత్తము
చేసి ఆయన చెప్పేది వినాలని ఆశిస్తాడు. మనం బాహ్య ప్రపంచం పట్ల ఆకర్షితులమై భగవంతుని
సూచనలను సరిగ్గా పట్టించుకోము. ఫలితంగా, ప్రపంచంలోని గందరగోళాన్ని వ్యాపించువారమైతిమి.
అర్జునుడు కూడా జనార్ధనా "వ్యామిశ్రేణేవ వాక్యేన
బుద్ధిం మోహయసీవ మే" (నీ అస్పష్టమైన ఉపదేశంతో నా మనస్సు అయోమయం లో పడిపోయింది,
3-2) అని భగవద్గీతలో వాపోతాడు.
అన్వయార్ధము: భగవంతుడు కోరికలను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ
సిద్ధంగా ఉన్నప్పటికీ, ఏమి కోరుకోవాలో తెలియని అవివేకులము.
ముఖ్య పదములకు అర్ధములు: గద్దెమీఁద = ఎత్తు ప్రదేశములో, ఆసనము మీద; నల్లవాఁడే = నల్లని దేహము కలవాడు, శ్రీకృష్ణుడు; కంటిరటే= చూచితిరా? కనపడుచున్నాడా? సుద్దులు చెప్పీఁగదే = తీయని మధురపు మాటలు చెప్పీఁగదే; సుగుడరాయఁడు = సరసుల్లో శ్రేష్టుడు;
భావము: చెలులారా! అదిగో సింహాసనము మీద నల్లవాఁడే (శ్రీకృష్ణుడే) కూర్చొని వున్నాడు. పొద్దొక సింగారాలను అనుభవించుచున్న ఆ భోగరాయఁడు మీకు అగపడుతున్నాడా? విలాసముగా ఇద్దరు సతులమీఁదా జేతులు చాఁచి తీయని మధురపు మాటలు చెబుతున్నాడే ఆ సుగుడరాయఁడు.
వివరణము: “గద్దెమీఁద నల్లవాఁడే కంటిరటే?” అని అన్నమాచార్యులు “నేస్తములారా సింహాసనం మీద నేపథ్యంతో కలిసి కనిపించీ కనిపించని ఆ నల్లనివానిని చూడగలుగుతున్నారా? మీకు సత్యము అగపడుచున్నదా లేక ఇతరములా” అని ప్రశ్నిస్తున్నాడు.
ఈ చరణం సరళంగా కనిపించినప్పటికీ, అన్నమాచార్యులు పల్లవిలోని గూఢార్ధమును కొనసాగిస్తున్నారు. కావున అన్వయార్ధమును కొంత విశదముగా పరిశీలించవలసి ఉంటుంది. వాస్తవానికి మానవుల మనస్సులోని సందిగ్ధతను సూచించుతూ దైవము ఇద్దరు భార్యల మీద చేతులు చాపినట్లు కనిపిస్తుందన్నారు.
ఆలోచనల కదలికలకు సంబంధించి ఇంతకు ముందు ఇచ్చిన వివరణలలోని చర్చలను మననము చేసుకోండి. ప్రతీ కదలిక దాని స్వంత ప్రతిబింబాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు, ప్రపంచములో ఇంకా తగిన గుర్తింపులేని చిత్రకారిణి హిల్మా ఆఫ్ క్లింట్ యొక్క ఒక గొప్ప పెయింటింగ్'ను పరిశీలిద్దాం. ఆమె హంసలపై (1914-1915) అనేక చిత్రాలను రూపొందించింది. అన్నమాచార్యులు తన కవిత్వంలో హంసల గురించి దాదాపు 20 కీర్తనలలో ప్రస్తావించారు. వారు "గుదికొన్న బ్రహ్మాండాల గుడ్లఁ బెట్టే హంస" అని అన్నప్పుడు, ఖచ్చితంగా అది సాధారణ హంస కాదని, దైవికమైనదనీ తెలియవచ్చు.
తొమ్మిదవ హంస చిత్రాన్ని క్రింద ఇస్తున్నాను. ఈ చిత్రంలో స్పష్టంగా లేని సన్నని రేఖ ఉంది. పెయింటింగ్ ఈ రేఖకు ఇరువైపులా సౌష్టవంగా ఉంటుంది. పెయింటింగ్ యొక్క కుడి వైపున అక్షానికి అటూయిటూ పెద్ద స్ఫటికాలు కనిపిస్తాయి, ఇది మన ప్రస్తుత జీవితాన్ని సూచిస్తుంది. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీ లేదని మనం అర్థం చేసుకున్నప్పటికీ, స్ఫటికం యొక్క పెద్దదనం మనకు రుజువు కావాలి, సాక్ష్యం కావాలి, ‘నాకు తెలిసినదే సత్యము, ఇతరములు కావు’ వంటి మూర్ఖత్వానికి, ఘనీభవించిన, మార్పును స్వాగతించలేని నైజమునకు ప్రమాణము. మనము సమత్వ అక్షానికి, సత్యమునకు చాలా దూరంగా ఉన్నాం. ఇది మరొక సమతలంపై సమాన ప్రతిచర్యను సృష్టిస్తుంది. చర్య, ప్రతిచర్యలను గమనించుటలో కాలము వెళ్ళబుచ్చి మనము నిస్సారమైన అవగాహనతో జీవితాన్ని గడుపుతాము.
మనం చిత్రములో కుడి నుండి ఎడమ వైపుకు వెళ్తున్నప్పుడు స్ఫటికాల పరిమాణం తగ్గుతుంది మరియు అక్షం నుండి వాటి దూరం తగ్గుతుంది. ఆలోచనను అనుభవించే అన్ని జీవరాశులు, ఎల్లప్పుడూ సరిపోయే ప్రతిబింబాన్ని కలిగి ఉంటాయి, అందువల్ల గందరగోళానికి, సందిగ్ధతకు లోనవుతాయి. మనస్సులో ప్రశాంతతను సాధించడానికి ధ్యానం, తపస్సు వంటివి చేపట్టి ఆచరించిననూ స్వాతంత్రము సంభవించదు, ఎందుకంటే అక్షానికి ఇరువైపులా వున్న విభిన్న స్ఫటికాలు పరిమాణములో చిన్నవైననూ, వాని నైజము అట్లేవుండును. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు "రేఖ కవతలి వారంతా నేఱగాళ్ళు". రేఖకు ఎటు వైపునున్నా ఇదే వర్తిస్తుంది. అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తిలు చెప్పినట్లు సత్య దర్శనము ఒక మార్గముననుసరించి పోవుటకు సాధ్యపడనిదే.
ఈ ఆలోచనల కదలికలు నిలిపివేయడంతో మనస్సు సత్యంతో అనుసంధానం కావడం ప్రారంభమవుతుంది. ఇంకా ఎడమ వైపుకు ముందుకు వెళితే, రెండు చిన్నవే కానీ గుర్తించగల చుక్కలు కనిపిస్తాయి. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి తనను వుద్యుక్త పరచు ఆలోచనలను కోల్పోతాడు. స్ఫటికములు కరిగి తనను తాను మరచును. వీనినే అన్నమాచార్యులు దిడ్డితెరువు (చిన్న ద్వారము) అని పిలిచి "గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక / దొడ్డతెరువువంక తొలఁగుమీ#1" అన్నారు. దీనిని బైబిల్ (మత్తయి సువార్త 7: 13) లోను ప్రస్తావించిరి. అదే ముక్తికి ప్రారంభ బిందువు. వెనుదీయుటకు రాని మార్గము. చిత్రకారిణి హిల్మా మానవుడు సత్యంతో తనను తాను ఏకీకృతం చేయుట యందలి వైభవాలను రంగులలో చిత్రీకరించి మరింత స్పష్టం చేసింది.
ఇప్పుడు ‘కంటిరటే’ అనే పదాన్ని ఇంకొంచెం విశ్లేషిద్దాం. అది చర్య, చూచుట, అర్థం చేసుకోనుట స్పేస్, మరియు సమయముల ఏకీకృతమైన స్థితిని సూచిస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి పేర్కొన్న సంపూర్ణమైన చర్య కూడా ఇదే. చర్య యొక్క భౌతిక పార్శ్వాన్ని దాని ప్రతిస్పందనతో ఏకీకృతం చేసి పెయింటింగ్ ఎడమ భాగంలో చూపబడింది. భగవద్గీతలో అనేకమార్లు చెప్పబడిన "యః పశ్యతి స పశ్యతి" (=ఆ విధముగా చూచువాడే ద్రష్ట) భావము కూడా యిదియే.
జిడ్డు కృష్ణమూర్తి ఇలా అన్నారు: "బాహ్యంగానూ, అంతర్గతంగానూ అన్ని విభజనలు విరోధమును పెంపొందిస్తాయి. కాబట్టి సమస్య తలెత్తుతుంది. దేనినైనా "నేను" సొంతం చేసుకున్న మరుక్షణం ఘర్షణ సృష్టించ బడుతుంది. యాజమాన్య భావన (కర్తృత్వ భావన) లేని చోట పూర్తిగా వేరే దృష్టి కోణం ఉండదా? అందువల్ల స్వేచ్ఛ ఉంటుంది."
"..అంటే మెదడును పూర్తి నిశ్శబ్దం ఆవరించినప్పుడు, దాని ప్రతిస్పందనలు, దాని ప్రతిచర్యలు అతి వేగంగా ఉంటాయి. ఆ స్థితిలో మాత్రమే అది తనను, తన ప్రతిబింబమును ఏక కాలములో గ్రహించి ఏకీకృత చర్యకు మార్గము సుగమము చేయును. సంభవించును. ఇదికాక వేరు చర్యలన్నియు ఘర్షణకు దారులు తీయును" (You are the World, a talk at Brandeis University, 18th October 1968).
ఈ విధంగా, ఈ చరణంలో అన్నమాచార్యులు శ్రోతలను సత్యాన్ని చూసే చాతుర్యాన్ని కనుగొనమని అడుగుతున్నారు, లేకపోతే వారు “దిమ్మరిమాటల” మత్తులో పడి పోగలరని హెచ్చరించారు.
సంక్షిప్త చీటీ: హిల్మా క్లింట్ ఒక స్వీడిష్ కళాకారిణి మరియు ఆధ్యాత్మికవేత్త. ఆమె చిత్రాలు పాశ్చాత్య కళా చరిత్రలో మొట్టమొదటి నైరూప్య లేఖనములుగా పరిగణించబడతాయి. ఆమె ఈ పెయింటింగ్స్ చేసింది, కానీ ఆమె జీవితంలో వాటిని ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఆమె మరణించిన 20 సంవత్సరాల తరువాత ఆమె విల్లులో వ్రాసిన విధముగా బయటకు తీసుకువచ్చారు. హిల్మా ఆఫ్ క్లింట్ తన చేయి ఒక అదృశ్య శక్తిచే మార్గనిర్దేశం చేయబడినదని భావించింది. ఆమె తన నోట్ బుక్'లో ఇలా వ్రాసి౦ది: "ఆ చిత్రాలు నేరుగా నా ద్వారా, ఏ ప్రాథమిక ఉజ్జాయింపు చిత్రాలు లేకుండా, గొప్ప శక్తి సహాయముతో చిత్రి౦చబడ్డాయి. పెయింటింగ్స్ ఎలా వర్ణించాలో; దేనికోసమో కూడా నాకు తెలియదు. అయినప్పటికీ నేను ఒక్క బ్రష్ స్ట్రోక్ కూడా మార్చకుండా వేగంగా మరియు నిర్దిష్టంగా పనిచేశాను." క్లింట్ యొక్క పలు చిత్రలేఖనములు జిడ్డు కృష్ణమూర్తి ప్రసిద్ధ
ప్రకటనలకు చాలా మునుపే వేయబడ్డాయి. |
ముఖ్య పదములకు అర్ధములు: నిక్కిచూచీ = మునివేళ్ళపై నిలబడి;
భావము: చక్కని మోవి నవ్వుల జాణరాయఁని మునివేళ్ళపై నిలబడి నిక్కిచూచెదరెందుకో
వన్నెల నెలఁతలు? సొగసైన విభుడు, చెక్కులమీద చెమటతోడ చెలువరాయఁడు రాచరికపు గర్వంతో విఱ్ఱవీఁగుతూ అలరించేనే.
వివరణము: భౌతిక ప్రకృతి స్వభావము మనలో ఆసక్తిని సృష్టించి దాని అనంత రూపాల్లో మనల్ని నిమగ్నం చేయడం అతి సమర్థవంతంగా చేస్తుంది.
మన మనస్సులలో నాటిన ఆకర్షణ భ్రమను సత్యంగా భావించేలా చేస్తుంది. (నేర్చినదానిని) మఱచిపోవుట అనేది విభిన్న (లేదా తెలియని) మైండ్ ఫ్రేమ్ లతో పనిచేయడం కాదు, అలా౦టి నిర్మాణాలకు వెలుపలకు రావడమే. అటువంటి ఆకృతులను కూలదోయడమే ధ్యానము లేదా తపస్సు.
ముఖ్య పదములకు అర్ధములు: మెండగు = ఆధిక్యము, అతిశయము;
భావము:: కోనేటిరాయఁడు మెండగు కళల వైభవాలను వ్యాపింపజేస్తాడు. ఉల్లాసకరమైన, ఆహ్లాదకరమైన శృంగారకరమైన మండలములను సృష్టిస్తాడు. దండిగా నురము మీఁది తరుణి కౌగిలింతలో వాఁడే. మళ్ళీ, బంగారు భవనంలో, అతడే మా వెంకటేశ్వరుడు.
వివరణము: మళ్ళీ అన్నమాచార్యులు ఏ బంగారు కట్టడాన్ని ప్రస్తావించడం లేదు. అలాంటి భవనాలను మనమే మన మనస్సుల్లో నిర్మిస్తాం. అన్నమాచార్యుడు సూచించిన దైవము ఇంద్రియ జ్ఞానానికి అతీతుడు. ఆయన బహుశా ఒక దండను కలుపు దారం వలె మొత్తం ప్రపంచాన్ని ఏకం చేసే సత్యాన్ని సూచిస్తున్నాడు అనుకోవచ్చు.
విభుని తేజస్సు గొప్ప కళల కూటము. మనము వానితో ఐక్యం కావడానికి అతను విశ్వవ్యాప్తంగా వెదచల్లిరి. కానీ, మనం ఏమి చేస్తాము? ఆయా కళలలో నిష్ణాతులమిని నిరూపించు కొనుటకు స్పర్ధలు పెంచుకుంటాము. అడ్డదారులూ ఎంచుకొంటాము.
కళలకు గుత్తాధిపత్యము వహింప జూస్తాము.
మనకు ప్రృకతి ఇచ్చిన కళతో వ్యాపారం చేయాలనుకుంటాము.
అన్వయార్ధము: ప్రకాశము, బలము, తేజస్సు, కళల నైపుణ్యముతోను వల్లభుడు మనలను మంత్రముగ్ధులను చేస్తాడు. తన ద్వంద్వత్వంతో పరీక్ష పెడతాడు. విశ్వాన్ని చుట్టుముట్టిన ఏకత్వాన్ని గమనించారా?
References
and Recommendations for further reading: