Friday, 1 November 2024

T-209. సకల భూతదయ చాఁలఁగ గలుగుట

 అన్నమాచార్యులు

T-209. సకల భూతదయ చాఁలఁగ గలుగుట

 

మంచికీ చెడ్డకీ నుడుమ కంచుగోడలున్నాయి మీకు. : శ్రీశ్రీ

 

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: అవ్వారిలో దైవము ప్రకటమైనప్పుడు సమస్తప్రాణుల పట్ల మిక్కిలి భూతదయ గలుగుట సముచితమైన ఫలము”

చరణము 1: ఎప్పుడూ మదిలో కదలాడే ఫలవాంఛఁలకు తగులకుండా మనసును సిద్ధపఱచుటయే కర్మియైన ఫలము. అన్నికర్మములలో బ్రహ్మార్పణము చేయు బుద్ధి కలుగుట హరికృప గలిగినదనుటకు  నిదర్శనము.

చరణము 2: ఎప్పుడు తిరువేంకటేశు సేవకుఁడౌట జరుగునో అపుడే మానవ జన్మము నెత్తినందుకు సాఫల్య మగును. ఎప్పుడు ముంచుకొస్తున్న సుఖదుఃఖములను సమముగా చూడ నేర్చునో అపుడే విజ్ఞాన మొందె ననుటకు నిరూపణ మగును.

 

 

 

ఉపోద్ఘాతము:

 

అన్నమాచార్యుల కీర్తనలు పరమపద సోపానములు: అన్నమాచార్యుల కీర్తనలను అర్ధం చేసుకోవడనికి కేవలము భాషా జ్ఞానం సరిపోదు.  మనము వారి అడుగు జాడలలో నిలబడి వారి మనస్సులోని మర్మము తెలియుటకు ప్రయత్నము చేయ వలెను.  ఆచార్యుల వారు మానవాతీత తలమున నిల్చి కీర్తనలను వ్రాసినారన్నది విదితమే. వారు ఆ అవ్యక్త స్థితిలో చెప్పిన ఈ కవిత్వములు పరమపద సోపానములు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొలది వారి రచనలలోని తీయదనమే కాదు, అసంభవమగు విజ్ఞానమునకు తలుపులు తెరుచుకొంటాయి. ఈ కీర్తనలో "కప్పిన సౌఖ్యదుఃకర్మములు సమముగా నొప్పుట విజ్ఞానమొదవిన ఫలము"తో అటువంటి విషయమునే చెప్పిరి.

 

విజ్ఞాన ఖని: "దేహసంభవమైన ఫలము అని మానవులందరికీ ఈ ఫలము లభించునని అన్నమాచార్యులు తెలుపుచున్నారు. అటువంటి సంభవమును నిశ్చయము చేయగల అత్యున్నత స్థాయి గల  కీర్తన ఇది. కాబట్టి స్నేహితులారా, ముఖ్యముగా అన్నమాచార్యుల కీర్తనలను కేవలము హైందవ సంప్రదాయ కీర్తనలుగా కాకుండా, అత్యద్భుత  విజ్ఞాన ఖనులుగా చూచి అధ్యయనము చేయవలెను.

 

అధ్యాత్మ కీర్తన: 

రాగిరేకు 36-4 సంపుటము: 1-223
సకల భూతదయ చాఁలఁగ గలుగుట
ప్రకటించి దేహసంభవమైన ఫలము    ॥సకల॥

తలకొన్న ఫలవాంఛఁ దగులకుండఁగఁ జిత్త-
మలవరించుట కర్మియైన ఫలము
పలుకర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధి
గలుగుట హరికృప గలిగిన ఫలము      ॥సకల॥

యెప్పుడుఁ దిరువేంకటేశు సేవకుఁడౌట
తప్పక జీవుఁడు దానైన ఫలము
కప్పిన సౌఖ్యదుఃకర్మములు సమముగా
నొప్పుట విజ్ఞానమొదవిన ఫలము        ॥సకల॥

 

Details and explanations:

సకల భూతదయ చాఁలఁగ గలుగుట
ప్రకటించి దేహసంభవమైన ఫలము      ॥సకల॥

భావము:  అవ్వారిలో దైవము ప్రకటమైనప్పుడు సమస్తప్రాణుల పట్ల మిక్కిలి భూతదయ గలుగుట సముచితమైన ఫలము

వివరణ​:

దేహసంభవమైన ఫలము: "దేహసంభవమైన ఫలము అని మానవులందరికీ ఈ ఫలము లభించునని అన్నమాచార్యులు తెలుపుచున్నారు. అటువంటి సంభవమును నిశ్చయము చేయగల అత్యున్నత స్థాయి గల  కీర్తన ఇది. ఈ పల్లవిలో చెప్పిన  “సకల భూతదయ చాఁలఁగ గలుగుట”ను క్రింది భగవద్గిత శ్లోకము ద్వారా వివరించుకుందాము.

సన్నియమ్యేన్డ్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః

తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతాః (12-4)

భావము:- ఎవరు ఇంద్రియములన్నిటిని బాగుగ స్వాధీనపఱచుకొని ఎల్లెడల సమభావము గలవారై నన్నే పొంది సమస్తప్రాణులకును హితమొనర్చుటయం దాసక్తిగలవారై యుందురు.

ఇక్కడ ఆచార్యుల వారు “సకల భూతదయ చాఁలఁగ గలుగుట” సంభవము అని వక్కాణించుచున్నారు. ఇది అత్యంత కీలకము. అట్టివారు మానవజాతికే కాక సమస్త జంతు ప్రపంచమునకు కూడా హితులే. అట్టి అరుదైన జన్మము ఆచార్యుల వారిది.

ఆధారములేని యోగ్యత: మనము "భూతదయ"గలవారమని చెప్పుకొనుటకు ఆధారములే లేవు. మానవుల కార్యకలాపములు వాతావరణమును, భూమిని హీన స్థాయిలకు త్వరితగతిని లాక్కేళ్ళుటకే దోహదములౌతున్నాయి. అంతేకాక మనకు వారసత్వముగా దక్కిన సరీసృపములను  కాపాడుటలో మానవుల నిర్లక్ష్యధోరణి తేటతెల్లమగును. అన్నమాచార్యులు పేర్కొన్న“సకల భూతదయ చాఁలఁగ గలుగుట” సంకల్పముతో సాధించలేని ఒక అసాధారణమైన మానసిక స్థితిని తెలుపుచున్నది.  ఏసుప్రభువు కూడా ఇటువంటి దయాగుణముతోనే జీవనమును సాగించెను. రామానుజులు కూడా అప్పటివరకు బ్రాహ్మాణులకే పరిమితమైన వేదాధ్యయనము, దేవాలయ దర్శనములు సార్వత్రికములు గావించెను.

అధివాస్తవిక చిత్రము: ఇకపోతే ఈ పల్లవి భావమును రెనె మాగ్రిట్‌ గారు వేసిన  ప్రజలు ఆశ్రయించు విహంగదృశ్యం (Popular Panorama)  ద్వారా మరింత విశద పరచుకుందాం. మాగ్రిట్‌ని చిత్రకారునిగా మలుపుతిప్పిన పెయింటింగ్లలో ఇది కూడా ఒకటని చరిత్రకారులు చెబుతారు. ఇది చూస్తే 'క్యూబిజం'కు చెందినదేమో అనే అనుమానం కూడా రావచ్చును. 



విహంగదృశ్యం: మొత్తం మీద ఇక్కడ మూడు భాగాలను (పొరలను) చూడవచ్చును. అన్నింటి కంటే పైభాగములో మేఘావృతమైన సముద్రము, తీరము కనబడుతుంటాయి. మధ్యలో దట్టమైన​ అడవి కనబడుతోంది. అది చూస్తే చెట్లకి వేళ్ళు వేయడం మరిచిపోయారనిపిస్తుంది. సముద్రతీరము అడవికి  మధ్య ఱంపముతో కోసారా అన్నట్లుగా వెడల్పాటి రేఖ విదదీస్తూ కనబడుతుంది. ఆ పట్టణం లోని  మిద్దెల మీద ఆ అరణ్యము కప్పివుందని అనిపిస్తుంది. పట్టణాన్ని అరణ్యాన్ని వేరు పరుస్తూ ఱంపముతో కోసారనిపించు మందమైన​ రేఖ కనబడుతోంది. దీనికి ప్రజలు ఆశ్రయించు​​ విహంగదృశ్యం (Popular Panorama)  అని పేరెందుకు పెట్టారో అనిపిస్తుంది.

గంభీరమగు సమతుల్య స్థితి: ఇది అధివాస్తవిక చిత్రమని మరచిపోకండి. ఆక్కడ కనబడుతున్న పట్టణం లోని  మిద్దెలు మనలో దాగివున్న జ్ఞాపకములకు ప్రతీక అనుకోండి. ఆ దట్టమైన అడవి మనలో రూపు దిద్దుకొను ఆలోచనలు అనుకోండి. గజిబిజిగా క్రమ్ముకున్న అడవులు మనలోని అస్తవ్యస్త ఆలోచనలను సూచిస్తాయి. పైని సముద్రము  దూరముగా ప్రశాంతముగా వున్న స్థితిని చూపుతుంది. ఒక్కోక్క జ్ఞాపకము ఒక్కో రకముగా అడవిలోని చెట్లకు (ఆలోచనలకు) వూతమిస్తుంది. మూడు తలములను విడదీస్తూ వున్నరేఖలు మానవుడు నిర్ణయింపలేని విషయమును చూపుతున్నవి. అనగా ఏ జ్ఞాపకము ఏ రకమైన ఆలోచనలకు తావిచ్చునో తెలియలేము. ఆలోచనా తరంగములతో సతమతమగు మనకు ఆ  పైన చూపిన సముద్రము  (గంభీరమగు సమతుల్య స్థితి) చేరలేని తీరమే.

అనంతమునకు దారి: ఇంకోరకముగా చూస్తే సముద్రము విశాలమైనది. లోతైనది. దాదాపు అనంతమైనది. అడవి సముద్రము కంటే చిన్నది, చిన్న పట్టణం కంటే పెద్దది. ఈ రకముగా అలోచిస్తే అనంతమునకు దారి ఆ అడవి ద్వారా కాదు. అనంతమును మనలోకి ఆహ్వానించడమే. ఆ సముద్రము ఆడవిని ఆ పట్టణమును ముంచివేసి తనలో కలుపుకోగలదు. కానీ మనము మన ఇప్పటి ఆలోచనలను భద్రముగా వుంచుకోవాలని చూస్తాము. అటువంటి స్థితిలో జ్ఞాపకములు ఆలోచనలు అంతంకావు. అవి పుంఖానుపుంఖముగా పుడుతూనే వుంటాయి. శ్రీశ్రీగారి వ్యత్యాసం అనే కవితలోని చిన్న భాగమును చూడండి. 

మంచికీ చెడ్డకీ నుడుమ
కంచుగోడలున్నాయి మీకు.
మంచి గదిలోనే
సంచరిస్తాయి మీ ఊహలు.
ఇదివరకే ఏర్పడిందా గది.
అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం.
నిశ్చల నిశ్చితాలు మీవి. 

క్రమక్రమముగా చేరగలిగిన స్థితి కాదు:  ఇప్పుడు అర్ధమౌతుంది ఈ బొమ్మ పేరు  ప్రజలు ఆశ్రయించు విహంగదృశ్యం (Popular Panorama)  అన్నదెందుకో. ఇంకొంచెం అలోచిస్తే  ఆత్మసర్పణ అనునది కొద్దికొద్దిగా చేయుచూ క్రమక్రమముగా చేరగలిగిన స్థితి కాదని,   సముద్రము అమాంతముగా  ఆలోచనలను, జ్ఞాపకములను తుడిచిపెట్టెయ్యాలే తప్ప చూస్తూచూస్తూ మనము అందులో, ఆ ప్రవాహములో చేరలేము. ఇప్పుడు  కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు / కడలేని మనసునకుఁ గడమ యెక్కడిదిఅను కీర్తన అర్ధము కూడా అవగాహన అవుతుంది.

ఈ రకముగా మానవుడు తన అస్తిత్వము వదలలేక ఆత్మసమర్పణకు ఉద్యుక్తుడు కాలేక అట్లని దానిని వీడలేక సతమమౌతాడు.

తలకొన్న ఫలవాంఛఁ దగులకుండఁగఁ జిత్త-
మలవరించుట కర్మియైన ఫలము
పలుకర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధి
గలుగుట హరికృప గలిగిన ఫలము        ॥సకల॥

భావము:  ఎప్పుడూ మదిలో కదలాడే ఫలవాంఛఁలకు తగులకుండా మనసును సిద్ధపఱచుటయే కర్మియైన ఫలము. అన్నికర్మములలో బ్రహ్మార్పణము చేయు బుద్ధి కలుగుట హరికృప గలిగినదనుటకు  నిదర్శనము.

వివరణ​: ఈ చరణము పూర్తిగా భగవద్గీతలోని క్రింది శ్లోకాల నుండి గ్రహించ బడినది. ఈ చరణములోని మొదటి రెండు పంక్తులు  భగవద్గీతలోని "అత్యేతి తత్సర్వమిదం విదిత్వా / యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ 8-28"  (= యోగియైనవాడు యజ్ఞము, దానము, తపస్సు మొదలగు వాని ఫలములు గ్రహింపక అనాదియగు బ్రహ్మస్థానమును పొందును)  శ్లోకము నుండి గ్రహించ బడినవి.

మిగిలిన రెండు పంక్తులు బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ .....బ్రహ్మకర్మసమాధినా ( = సంపూర్ణ  ధ్యానములోనే  నిమగ్నమై హోమ సాధనములు,  హోమద్రవ్యములు, యజ్ఞ కర్మ, యజ్ఞాగ్ని అన్నీ కూడా  బ్రహ్మమే అను ఏకాగ్ర భావముతో యజ్ఞమును చేయువారు ఆ బ్రహ్మమును సునాయాసంగా పొందుతారు) భగవద్గీతలోని 4-24ను సూచిస్తున్నవి.

యజ్ఞము అనగా త్యజించుట​. వదలివేయుట​. పైన చెప్పిన విషయములు సులభ మనిపించు చున్నను మానవుని వద్ద  మదిలో నాటుకున్న విషయములను వెలికితీయు లేదా త్యజించు విధానమే లేదు. జాగ్రత్తగా గమనించిన ఇవన్నియూ ప్రవాహములో కొట్టుకు పోవడం లాంటి వాటిని సూచిస్తున్నాయి. మానవుడు సాహసము చేయుటకు కూడా  అస్కారములేని, పైన పేర్కొన్న విధముగా అకస్మాత్తుగా తుడిచిపెట్టు చర్యలని తెలియవలెను. వీనిని చేపట్టుటకు ప్రపంచములోని ఏ హీరో కూడా చేయలేని సాహసము, ధైర్యము కావలెను. ఆ స్థితి మరణమును సైతం లక్ష్య పెట్టకుండా పరమ సత్యమును వెంబడించునది. 

 

యెప్పుడుఁ దిరువేంకటేశు సేవకుఁడౌట
తప్పక జీవుఁడు దానైన ఫలము
కప్పిన సౌఖ్యదుఃకర్మములు సమముగా
నొప్పుట విజ్ఞానమొదవిన ఫలము          ॥సకల॥

భావము:  ఎప్పుడు తిరువేంకటేశు సేవకుఁడౌట జరుగునో అపుడే మానవ జన్మము నెత్తినందుకు సాఫల్య మగును. ఎప్పుడు ముంచుకొస్తున్న సుఖదుఃఖములను సమముగా చూడ నేర్చునో అపుడే విజ్ఞాన మొందె ననుటకు నిరూపణ మగును.”

 

వివరణ:

తిరువేంకటేశు సేవకుఁడౌట:  అన్నమాచార్యులు మానవ జన్మము యొక్క ఉత్కృష్టస్థానము తిరువేంకటేశు సేవకుఁడౌట అని పలుమార్లు పేర్కొనిరి. "ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక / కమ్మి హరి దాసుఁడు గావచ్చునా" (పెద్ద పెద్ద పుణ్యకార్యములు చేసి చక్రవర్తియై భూమిని పరిపాలించుటైన సులభమే కాని  యే విధముగా భక్తిని పెంచుకొని  హరిదాసుడు కాగలడు? (హరికి దాసుడౌట  సులభసాధ్యమేనా? ఎవరూ కోరి భక్తులుకాలేరని, భక్తి తప్ప వేరు మార్గము లేదని గ్రహించినవారు తప్పించి అని అర్ధము).

సుఖదుఃఖములు సమముగా నొప్పుటయే విజ్ఞానము:  భగవద్గీతలోని 2-48వ శ్లోకము సమత్వమును నిర్వచించినది. సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే (=జయాపజయములు ద్వంద్వములు. వాని పట్ల ఆసక్తి విడిచిపెట్టి, ఓ అర్జునా, నీ కర్తవ్య నిర్వహణలో నిమగ్నుడవై ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును).

పైన పేర్కొన్న రెండు విషయములు కూడా మనవులకు దాదాపు అసంభవమైనవే. ఐననూ అన్నమాచార్యుల వారు వాటిని "ప్రకటించి దేహసంభవమైన ఫలము" అని చెప్పిరి. అనగా మానవులుగా మన ఇప్పటి ధోరణిని నూటికి నూరు శాతము వదలి వుండవలెనని అర్ధము. ఈ సవాలుకు సవాలు విసరగల ధైర్యము లేదు. మనముత్త కాగితపు పులులము మాత్రమే.

 

x-x సమాప్తంx-x

2 comments:

  1. అన్నమయ్య కీర్తనకూ, రినీ మాగ్రిట్ చిత్రానికీ అద్భుతమైన అన్వయం కుదిర్చారు మీరు... 👍

    ReplyDelete
  2. అన్నమయ్య కీర్తనను భగవద్గీత శ్లోకములతో అన్వయ
    పరచి రినే మాగ్రిట్టే చిత్రముతో అనుసంధానము చేసి
    చక్కని వ్యాఖ్యానము చేశారు శ్రీనివాస్ గారు. 🙏🏻
    కృష్ణమోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...