అన్నమాచార్యులు
T-210.
విజాతులన్నియు వృథా వృథా
సకల
క్రియల సమన్వయమే సుజాతి
కీర్తన సంగ్రహ భావము:
పల్లవి: సత్యమునకు
అనుగుణము కాని వన్నియు వృథా. విడువుము. అజామిళాదు లనుసరించిన దదియే సుజాతి. అన్వయార్థము: కేవలము
శరీర భావనలతో నిర్ధారించి చేయు తీర్మానములను, మానవ
యత్నములను వ్యథా
ప్రయాసలుగా తెలిసి విడిచి అజామిళాదులు యేజాతిని అనుసరించారో తెలియుము.
చరణము 1: “ఇప్పుడు మనం అనుభవిస్తున్న జాతిభేదములు (ఇది నేను, అది
వేరు అను భావములు) శరీరము అను వస్తుసంబంధమైనది. ఇవి మరణముతో అంతమగును. కానీ,
ఆత్మకు ఈ విషయములు అంటవు. అది పరిశుద్ధము, అనాది
యైనది. ఈ లోకములో ఈ విషయ భేదములను మరపించు హరివిజ్ఞానపు దాస్యం (=సత్యమే జీవన మార్గము) ఒక్కటే సుజాతి.”
చరణము 2: “ఆ జీవము, ఆ హరి అందరిలో ఉన్న అంతరాత్ముడు. పరమ
యోగులు ఈ ధరణి సంబంధమైన జాతిభేదములను అష్ట మదములనిరి. అవియే ధరణి జీవులను
సత్యదూరులను గావించు వికారములు, వక్రీకరణలు (distortions).
పరతత్త్వ జ్ఞానమునకు మూలము ధర్మమే. ఆ ధర్మమూలము వరకు చొచ్చుకొనిపోని
ఈ భూతలమున మనము ప్రదర్శించు జ్ఞానమే అజ్ఞానము.”
చరణము 3: ”సార్వత్రికముగా వైదీకము పాటించు వారికి ఇదియే అవశ్య కర్తవ్యం. శ్రీకాంతుండు శ్రీవేంకటపతి కల్పించిన పరిపూర్ణ సిద్ధి ఇదియే. ఇవి హద్దులని మనసులో ఎంచక సర్వసమ్మతము చాటు వారికి, ఓ దేవా! నీ నామమే సుజాతి.”
ఉపోద్ఘాతము:
“నేను పరుడను” అని సార్వత్రికముగా భావించుట సహజము. ‘నేను ఇక్కడివాడను కాను’ అని భావించు గుణమునకు ఆధారములు లేవు అని అన్నమాచార్యులు నొక్కి చెబుతున్నారు.
ధర్మమూలము వరకు చొచ్చుకొనిపోని ప్రజ్ఞయే అవివేకము: “నేను పరుడను” అను ఊహాజనిత భావము నర నరములలో పాకీ మానవుని ఈనాటి స్థితికి కారణమైంది. కర్తృత్వ భావన కానీ, కర్మల స్వభావం కానీ భగవంతునిచే సృష్టించబడవు భగవద్గీత 5-14లో చెప్పినది మనము గుర్తుకు తెచ్చుకోవాలి. (న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః / న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే) ఈ రకముగా చూచినా భూలోకమందలి జీవులను తప్పుదారి పుట్టించుచున్నది తామే సృష్టించుకున్న వికారములు, వక్రీకరణలు (distortions). పరమునకు మూలము ధర్మమే. ఈ భూతలమున మనము ప్రదర్శించు ఆ ధర్మమూలము వరకు చొచ్చుకొనిపోని ప్రజ్ఞయే అవివేకము.”
శ్రీహరి
దాస్యం ఒకటే మార్గం: ఏ ఉపమానములకు సాటిరాని ఈ అలౌకిక కీర్తనలో అత్యంత
ప్రకాశవంతమైన జీవితమునకు శ్రీహరి దాస్యం ఒకటే మార్గం అని సూచించారు. సకల క్రియల సమన్వయమే సుజాతి అన్నారు.
అధ్యాత్మ కీర్తన: రాగిరేకు 177-3 సంపుటము: 2-383
|
విజాతులన్నియు
వృథా వృథా
అజామిళా దుల కది యేజాతి ॥పల్లవి॥ జాతిభేదములు
శరీరగుణములు
జాతి
శరీరము సరిఁ దోడనె చెడు
ఆతుమ
పరిశుద్ధంబెప్పుడును అది నిర్దోషం బనాది
యీతల
హరివిజ్ఞానపు దాస్యంబిది యొక్కటెపో సుజాతి ॥విజా॥ హరి
యిందరిలో నంతరాత్ముఁడిదె
ధరణి
జాతిభేదము లెంచిన
పరమయోగులీ
భావ మష్టమదము భవవికారమని మానిరి
ధరణిలోనఁ
బరతత్త్వజ్ఞానము ధర్మమూలమే సుజాతి ॥విజా॥ లౌకిక
వైదిక లంపటులకు నివి
కైకొను
నవశ్యకర్తవ్యంబులు
శ్రీకాంతుండు
శ్రీవేంకటపతి సేసిన సంపాదమిందరికి
మేకొని
యిన్నియు మీరినవారికి మీనామమే సుజాతి ॥విజా॥
|
భావము: "సత్యమునకు అనుగుణము కాని వన్నియు వృథా. విడువుము. అజామిళాదు లనుసరించిన దదియే సుజాతి."
వివరణ:
విజాతి: ఇక్కడ విజాతి అనగా తనకు సంబంధించనిది, తనలో సహజముగా ఇమడనిది అను భావనతో చెప్పారు. అజామిళుడు వేశ్యాలోలుడై, చివరి క్షణాలలో నారాయణ నామము జపించి యమదూతల బారి నుండి బయటపడతాడు. శ్రీహరి మార్గమును ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో చేపట్టినా అది వృథా కాదు అని ఇక్కడ ఆచార్యులవారు చెప్పారు.
నిశ్చల నిశ్చతాలు మనవి: మానవులుగా మనమెన్నో ఉద్రిక్తతలకు ఉద్వేగాలకు లోనౌతుంటాం. జాగ్రత్తగా గమనిస్తే వీటికి కారణాలు ఆయా పరిస్థితుల్లో మనము సహజముగా ఇమడలేక పోవడమే. దీనికి మూలం మనమే ఏర్పాటు చేసుకున్న భావనలు.ఈ భావనలు అంతకు మునుపటి అనుభవములు మిగిల్చిన ఆనవాళ్లు. అలాంటి అనేక ఆనవాళ్లు కలిపి "నేను" అనునది ఏర్పడుతుంది. మనమంతా, అసంకల్పితంగా ఈ ప్రక్రియలో భాగమౌతాము. కొన్ని అనుభవాలు సుఖము, ఆహ్లాదము, ఆనందము ఇస్తాయి. వీటిని సహజమని అంగీకరిస్తాం. వీటికి భిన్నంగా వున్న వాటిని వ్యతిరేకిస్తాం. ఆ వ్యతిరేకతయే ఉద్రిక్తతలకు ఉద్వేగాలకు కారణాలు. ఇదే విషయాన్ని ప్రఖ్యాత అధివాస్తవిక చిత్రకారుడు రెనె మాగ్రిట్ గారి క్రింది కళాఖండం నుండి కూడా గమనించవచ్చును.
లెస్ మజిల్స్ సెలెస్టెస్ (అపరిమిత శక్తి ఆకాశం): ఇక్కడ ఆకాశం పాయలుగా విడిపోయి ఎక్కడో దిగువన పైకి వున్న బల్లచెక్కను తాకుతున్నట్లు కనబడుతోంది. అక్కడ ఆకాశానికి బల్లచెక్కకు మధ్య గల దూరమును నలుపు రంగులో చూపి, అది పరిమితం నుండి అపరిమితం వరకు ఏదైనా కావచ్చునని సూచించారు. అది మనము ఊహించ లేనిది. ఆ నల్లని చీకటి ప్రదేశమును ఆకాశం వింతలుగా ఛేదించు కుంటూ ఆ బల్ల మీదకు వచ్చినట్లు కనబడుతోంది. నిర్దిష్ట ఆకృతి లేని ఆ వికృత ఆకారములు కొంత భీతిని కల్పించడానికి చేర్చినవేమో!
విరుద్ధముల కలయిక: చెక్క యొక్క లక్షణాలు: అవి స్పష్టమైన, దృఢమైన, వర్ణనకు ఆస్కార మిచ్చు , రూపురేఖలను కలిగి ఉంటాయి. అవి నీడలను కల్పిస్తాయి. వేస్తాయి. మరియు అన్ని విధాలుగా, తలమును (ప్లేన్'ని), మరీ పరిమితమైన స్పేస్'ను సూచిస్తుంది. కానీ, ఆకాశం అలాగా కాక స్పష్టమైన, దృఢమైన, రూపురేఖలను కలిగి ఉండదు. అవి కొంత మేర వరకు నీడలను కల్పించును. అయితే. ఇదే ఆకాశం అని చెప్పుటకు వీలులేక అపరిమితమైన స్పేస్ 'కు ఆలవాలమై వుంటుంది. ఎంత వర్ణించినా అస్పష్టమే.
సమ్మతము అనగా సంపూర్ణ విలినీకరణము: ఆకాశంలో కొంత భాగం విడిపోయి, మధ్యనున్న నలుపు దూరాన్ని దాటుకుంటూ బల్లచెక్కను రెండు వేర్వేరు ప్రాంతాల్లో తాకుతోంది . ఆకారం లేని ఆకాశం, గట్టి బల్లచెక్కను తాకిన చోట విధిలేక ఆకారం తీసుకోవాలి. ఆ రెంటి మధ్య ఘర్షణయే మబ్బు తాకిన చోట కరిగినట్లు చూపారు. ఆ చోట కరిగినదేదో (చెక్క లేక ఆకాశం) అన్నది అస్పష్టం. అయినప్పటికీ, అవి రెండు అతుక్కుపోయాయి అని చెప్పవచ్చును. లెస్ మజిల్స్ సెలెస్టెస్ (అపరిమిత శక్తి ఆకాశం) విరుద్ధమైన బల్లపరుపు భాగాన్ని అపరిమితముతో జతచేయబడిన ఏకీకృత 'అవయవం'గా ప్రదర్శిస్తుంది.
దైవము, మానవుడు: ఇప్పుడు ఈ చిత్రమును ఈ విధంగా అన్వయించుకోవచ్చును. ఆకాశమును దైవము, సత్యము, అనంతములు గాను, బల్లపరుపు చెక్కను మానవునిగాను తీసుకొంటే ఆ రెంటి మధ్య సంబంధం చూపుతోంది. ఆకాశం (దైవము) మానవునికి మధ్య దూరాన్ని ఛేదించి రాగలదు కానీ బల్ల ఆకాశానికి ఎగురలేదు అన్నది స్పష్టం. ఇది వన్ వే ట్రాఫిక్ లాంటిది. అక్కడి వికృత ఆకారములు చూసి భయపడిన, ఆ అవకాశం వుండదు. విజాతియైన మానవుడు సుజాతి (పవిత్రుడు) అగుటకు తన ఇప్పటి లక్షణములను వదిలి మన చుట్టూ ఆవరించుకొని వున్న ఆ ఆకాశ (ఆ పరమాత్మ) తత్త్వంలో కలసిపోవుట ధ్యానము. లేదా తపస్సు. ఈ కీర్తనలో ఆ పరమాత్మ తత్త్వంలో కలవలేని అశక్తతను 'వృథా'తో తెలియపరిచిరి.
అన్వయార్థము: కేవలము శరీర భావనలతో నిర్ధారించి చేయు తీర్మానములను, మానవ యత్నములను వ్యథా ప్రయాసలుగా తెలిసి విడిచి అజామిళాదులు యేజాతిని అనుసరించారో తెలియుము.
భావము: ”ఇప్పుడు మనం అనుభవిస్తున్న జాతిభేదములు (ఇది నేను, అది వేరు అను భావములు) శరీరము
అను వస్తుసంబంధమైనది. ఇవి మరణముతో అంతమగును. కానీ, ఆత్మకు ఈ విషయములు అంటవు. అది పరిశుద్ధము, అనాది యైనది. ఈ లోకములో ఈ విషయ
భేదములను మరపించు హరివిజ్ఞానపు దాస్యం (=సత్యమే జీవన
మార్గము) ఒక్కటే సుజాతి.”
వివరణ: పై బొమ్మలో ఆకాశం చెక్కను తాకిన చోట సంయోగం చెంది ఒకే వస్తువుగా ఏర్పడడం గమనించవలెను. అనగా సత్యం తప్పించి వేరు లేదను భావము నరనరములలో వ్యాపించి అందులో ఐక్యం కావడమే సుజాతి. అది కానివన్నియు విజాతులే.
భావము: ”ఆ జీవము, ఆ హరి అందరిలో ఉన్న అంతరాత్ముడు. పరమ యోగులు ఈ ధరణి సంబంధమైన జాతిభేదములను అష్ట మదములనిరి. అవియే ధరణి జీవులను సత్యదూరులను గావించు వికారములు, వక్రీకరణలు (distortions). పరతత్త్వ జ్ఞానమునకు మూలము ధర్మమే. ఆ ధర్మమూలము వరకు చొచ్చుకొనిపోని ఈ భూతలమున మనము ప్రదర్శించు జ్ఞానమే అజ్ఞానము.”
ముఖ్య పదములకు అర్థములు: మేకొని = సమ్మతించి; సంపాద = పూర్తి, సిద్ధి
భావము: ”సార్వత్రికముగా వైదీకము పాటించు వారికి ఇదియే అవశ్య కర్తవ్యం. శ్రీకాంతుండు శ్రీవేంకటపతి కల్పించిన పరిపూర్ణ సిద్ధి ఇదియే. ఇవి హద్దులని మనసులో ఎంచక సర్వసమ్మతము చాటు వారికి ఓ దేవా నీ నామమే సుజాతి.”
వివరణ:
మేకొని యిన్నియు మీరినవారికి మీనామమే సుజాతి:
“లోకరంజకము తమలోనిసమ్మతము” అని అన్నమాచార్యులు ముందే పేర్కొని ఉన్నారు.
మానవుడు అనుభవించు సర్వావస్థలను శ్రీహరి ప్రసాదము
అని స్వీకరించలేని అశక్తతను విజాతి అన్నారు. సర్వ సమ్మతిని తెలుపు ఆ స్థితిలో మానవుడు
తానెవరో మరిచి పరలోక ద్వారము తట్టుటకు సమర్థుడగును. అయినా శ్రీహరిదాస్యము తప్ప మిగిలినవేమీ
కోరని ఆ మహానుభావులకు జీవము నిర్జీవము ఒకటై కనిపించగా, అట్టిస్థితిలో
వారు చేపట్టునది శ్రీహరినామమే.
x-x
సమాప్తంx-x
అద్భుతం. లౌకిక వైదిక లంపటులు అన్నప్పుడు, అటు లౌకికం లోనూ, ఇటు వైదిక వృత్తిలోనూ, ఎందులో మగ్నులు అయిన వారికి అయినా అని అర్థం.
ReplyDelete"విజాతులన్నియు వృథావృథా "
ReplyDeleteఒక్కమాటలో ఆచార్యులవారు సత్యము కానివన్నియును విజాతులే యని సుజాతి అనగా నేమో చక్కగా చెప్పారు. మీ వ్యాఖ్యనమద్భుతం.
ఆత్మ(పరమాత్మ),అనాత్మ(శరీరం) రెంటికీ భేదమును, సత్యమే జీవనమార్గము కావాలని మొదటి చరణంలో చక్కగా చెప్పారు అన్నమయ్య.
వికారములు,వక్రీకరణలు ధర్మమార్గము చక్కగా వివరించితిరి.
*కృష్ణమోహన్*