Tuesday, 28 March 2023

T-161 ప్రత్యక్షమే మాకుఁ బ్రమాణము

 అన్నమాచార్యులు

161 ప్రత్యక్షమే మాకుఁ బ్రమాణము 

for English Version press here 


సారాంశం: 'స్వీయ జాలి మనకు బద్ధ శత్రువు. దానికి లొంగిపోతూ వుంటే ఈ లోకంలో మనం శ్లాఘించ దగినవేమీ చెయ్యలేం'. -హెలెన్ కెల్లర్. 

కీర్తన సారాంశం:

పల్లవి: దైవమా నీ ప్రత్యక్షానుభవమే మాకుఁ  ప్రమాణము. ఏదేమైనా,   సత్యరూపుడా జ్ఞాపకములను జోలిదవ్వి మాపై మేము జాలిఁ పడిపడి విసిగిపోయాము. అన్వయార్ధము: ఓ దేవుడా! నీ ఆజ్ఞలను పాలించుటకు బదులుగా, మేము నీ ఉనికిని సవాలు చేస్తాము. 

చరణం 1: నీ సేవకులతో సమానముగా నీ మనస్సులోని భావమును లేదా దృక్పథాన్ని అనుభవించనివారికి నిన్ను వాస్తవంగా కన్నుల యెదుట చూచే భాగ్యము ఎలా కలుగుతుంది? అన్నివిధములా వేదజ్ఞులైన ఆచార్యుల ఆనతివలె, నీ మహత్తరమైన అనుజ్ఞలనూ పట్టించుకోము.

చరణం 2: నీ దాసులందరూ అంతులేని నైవేద్యాలను అందిస్తున్నట్లుగా (అందరికీ అందుతున్నట్లుగా), విల్లుపై బాణమును సంధించినట్లు సిద్ధంగా వుండువారికి నీ ప్రసాదము దొరక్కుండునా? నీ పాదతీర్థమును ఎవరైనా తమ కళ్ళతో చూశారా? ముమ్మరముగా భక్తిగల నీ భక్తపాదజలము ఆ పవిత్ర జలానికి సారూప్యతను కలిగి ఉంటాయని గ్రహించము.

చరణం 3: నీ అనుచరులను గుర్తించ లేని వారు నీ ప్రపంచ వైభవాన్ని గ్రహించలేరు. అటువంటివారు నీవు నియంత్రిస్తున్న పరంధామమును వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా చేరుకోలేరు. శ్రీవేంకటేశ్వరా! నీ మహిమను దాసానుదాసుల యందే నిలుపుదువని యెరగక నీ వైపు చేతులుచాచి నిన్ను ప్రసన్నుడిని చేయ పూనుతాము.

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: స్వీయ జాలిపై లోతైన వ్యాఖ్యానము ద్వారా అన్నమాచార్యుల అసాధారణ దృక్పథాలకు నాంది వేశారనుకోవచ్చు. వారు తమ సమకాలీకుల కంటే ఒకడుగు ముందే ఉన్నారనిపిస్తుంది. భారతీయ చరిత్రలో  వైవిధ్యభరితమైన మానవ మేధోన్వేషణలలో ఆయన క్రొంగొత్త ధోరణిని ప్రవేశపెట్టారని భావించవచ్చు. 

అన్నమాచార్యుల చర్చ దేవుని కరుణ/ కృపల​ చుట్టూ తిరుగుతుంది, ఐతే దీనిని మనం విస్మరిస్తాము. దైవికమైన ఆదేశాలను మఱచుతూ ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలను సాధించడానికి మన వంతు ప్రయత్నాలను చేయబోతాము. ఎప్పటిలాగే తన ఆలోచనలను చాలా సున్నితంగా, సొగసైన రీతిలో వ్యక్తపరుస్తాడు.  మన ఆకాంక్షలు గుర్తించదగిన చర్యలుగా వ్యక్తమౌతున్నప్పుడు అవి కలిగించు కంపనములు మన దృష్టిని పాక్షికముగా మరుగు పడటానికి కారణమవుతాయి. కావున మనము సత్యదర్శనమునకు నోచుకోము.

 

కీర్తన:
రాగిరేకు:  321-5 సంపుటము: 4-122
ప్రత్యక్షమే మాకుఁ బ్రమాణము
సత్యరూప జోలిదవ్వి జాలిఁబడ నోపము ॥పల్లవి॥ 

కన్న వారెవ్వరు నిన్ను కన్నుల యెదుటను
పన్ని నీదాసులు చూచే భావమువలె
విన్న వారెవ్వరు నీవిభవపు మాటలు
అన్నిటా నాచార్యుని యానతివలె ॥ప్రత్యక్షమే॥
 
తొడఁగి నీ ప్రసాదము దొరకని వారెవ్వరు
జడియు నీ దాసుల ప్రసాదమువలె
కడు నీ పాదతీర్థము కడగన్నవారెవ్వరు
బడిబడి నీ భక్తపాదజలమువలె ॥ప్రత్యక్షమే॥
 
యేచి పరంధామమున కేఁగిన వారెవ్వరు
చాచిన నీ దాసుల సన్నిధివలె
చాచితి శ్రీవేంకటేశ సొంపుల నీ మహిమెల్ల
తాచిన నీ దాసానుదాసులయందే ॥ప్రత్యక్షమే॥

Details and Explanations: 

ప్రత్యక్షమే మాకుఁ బ్రమాణము
సత్యరూప జోలిదవ్వి జాలిఁబడ నోపము ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: జోలిదవ్వి = సంచిని తవ్వడం (ఇక్కడ దీని అర్థం నిల్వ చేసిన జ్ఞాపకాలను తవ్వడం); నోపము = ఓపలేము, సహించలేము. 

భావము: దైవమా నీ ప్రత్యక్షానుభవమే మాకుఁ  ప్రమాణము. ఏదేమైనా,   సత్యరూపుడా జ్ఞాపకములను జోలిదవ్వి మాపై మేము జాలిఁ పడిపడి విసిగిపోయాము.

వివరణము: జోలిదవ్వి జాలిఁబడ నోపము అన్నమాచార్యులు మన జ్ఞాపకాలను తవ్విన కొలదీ ఆత్మన్యూనత కలిగి, అది నిరాశకు దారితీస్తుందని చెప్తున్నారు. 

స్వీయ జాలి గురించి ఆయన చేసిన గాఢమైన ప్రకటన నుండి  అన్నమాచార్యులు అసాధారణమైన అంతర్దృష్టులు అని స్పష్టంగా తెలుస్తుంది. ఆయన తన సమకాలీనుల కంటే చాలా ముందున్నారని గమనించ వచ్చు. వాస్తవానికి, మానవ ప్రయత్నముపై వారి బహుముఖ పరిజ్ఞానము అనన్యసామాన్యము. ఇరవైయ్యో శతాబ్ధములో హెలెన్ కెల్లర్ చెప్పినదే అనేక శతాబ్ధముల పూర్వమే అన్నమాచార్యులు సెలవిచ్చిరి. 

దేవుని ఉనికికి రుజువు కావాలన్న తపన మానవులలో సర్వసాధారణ౦. అయితే దేవుని గురి౦చి ఆలోచి౦చే తమ సామర్థ్య౦ దేవుని కృపకు నిదర్శనమని వారు గుర్తి౦చరు. 

ఈ కీర్తనలో భగవద్గీత శ్లోకం 7-18 గురించి బలమైన అంతర్లీన ప్రస్తావన ఉంది. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ । ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ।। (భావము: అర్జునా! నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే. కానీ, జ్ఞానముతో, ధృడ నిశ్చయముతో ఉండి, బుద్ధి నా యందు ఐక్యమై, కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగివున్నవారివి స్వయంగా నా భావనలే  అని నేను పరిగణిస్తాను.) కానీ ఈ చాలా అరుదైన విషయము చాలా సులభంగా అనిపించవచ్చు. కీర్తనలోని  చరణములను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 

అన్వయార్ధము: ఓ దేవుడా! నీ ఆజ్ఞలను పాలించుటకు బదులుగా, మేము నీ ఉనికిని సవాలు చేస్తాము.

కన్న వారెవ్వరు నిన్ను కన్నుల యెదుటను
పన్ని నీదాసులు చూచే భావమువలె
విన్న వారెవ్వరు నీవిభవపు మాటలు
అన్నిటా నాచార్యుని యానతివలె ॥ప్రత్యక్షమే॥ 

ముఖ్య పదములకు అర్ధములు: పన్ని = ఒక పథకం, ఒక ప్రణాళిక; చూచే = అనుభవించు; నీవిభవపు మాటలు =  నీవు ఒసగు అద్బుతమైన ఆదేశము; 

భావము: నీ సేవకులతో సమానముగా నీ మనస్సులోని భావమును లేదా దృక్పథాన్ని అనుభవించనివారికి నిన్ను వాస్తవంగా కన్నుల యెదుట చూచే భాగ్యము ఎలా కలుగుతుంది? అన్నివిధములా వేదజ్ఞులైన ఆచార్యుల ఆనతివలె, నీ మహత్తరమైన అనుజ్ఞలనూ పట్టించుకోము. 

వివరణము: ప్రపంచ ప్రఖ్యాత సర్రియలిస్ట్ కళాకారుడు రెనె మాగ్రిట్టే వేసిన పెయింటింగ్ను ఉపయోగించి నేను ఈ చరణాన్ని వివరించాలనుకుంటున్నాను. దయచేసి క్రింద ఇచ్చిన "జీవించడమను కళ (ది ఆర్ట్ ఆఫ్ లివింగ్)" అనే కళాఖండాన్ని చూడండి. ఈ  కాన్వాస్ మధ్యలో ఉన్న మనిషి బొమ్మను రెండు వేర్వేరు భాగాలుగా విభజించారు. శరీరం మాగ్రిట్ యొక్క క్లాసిక్ పాత్రకు చెందినది - బౌలర్ టోపీ ధరించిన వ్యక్తి, ఎరుపు టై మరియు ఫార్మల్ సూట్ నుండి స్పష్టమవుతుంది. అయితే, శరీరం పైన గాలిలో తేలియాడే తల పూర్తిగా భిన్నమైన రూపంలో దర్శనమిస్తుంది. ​

 


తన జీవితపు చివరి చిత్ర రచనల్లో ఒకటైనదానిలో, మాగ్రిట్ సాధారణ ప్రజలపై చేసిన ఘాటు విమర్శ కనబడుతుంది. చూస్తూనే అతకని, అసంబద్ధంగా పెద్ద గులాబీ రంగు తల​, దానిలో చిన్నచిన్న కళ్ళు, ముక్కు, నోరు చూపారు. గులాబీ రంగు సౌకర్యవంతమైన జీవితానికి ప్రతీకగా ఉంటుంది. అయినప్పటికీ సారములేని మరియు  (ఉపరితలమునకే పరిమితమైన) పైపై సంతృప్తి ఆ మనిషి ముఖములో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 

మనమందరం జీవించే కళలో ప్రావీణ్యం సంపాదించడానికి ప్రయత్నిస్తాము. మనిషి జీవించడమంటే ఏమిటో విస్మరించి జీవించే కళను అనుకరింప ప్రయత్నిస్తాడు. ఇది "వ్యాపారంలోని కొన్ని కొన్ని మెలకువలు నేర్చుకోకు, మొత్తం వ్యాపారము చేయు విధానము నేర్చుకోండి" అనే ప్రసిద్ధ సామెత లాంటిది. కానీ మన ప్రయత్నాలన్నీ మరింత మేధోవాదమునకు చెందినవి, వీనికి జీవనంతో సంబంధం లేదు. పై చిత్రంలో తల శరీరం నుండి వేరు చేసి చూపి మరియు దాని అన్వయము కూడని పరిమాణము  మనం సహజ ప్రపంచానికి దూరంగా జీవితాన్ని గడుపుతున్నామని సూచిస్తుంది. 

ఇంతటి సహజమునకు దూరమైన జీవితంలో సత్యాన్ని తాకగలను అనుకొనుట భ్రమయే కదా? అన్నమాచార్యులు చెబుతున్నదేమిటంటే, నారదుడు, సనకసనందాది ఋషుల వంటి ప్రసిద్ధ సేవకుల వలె భగవంతుని పట్ల ఏకాగ్రతతో కూడిన భక్తి మనకు లేదు. భగవంతుడు అడ్డుకోకపోయినా, మనిషి మూర్ఖత్వమే అతనికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. మాగ్రిట్ యొక్క పూర్తిగా అసహజ చిత్రం అదే సూచిస్తుంది. మనం సత్యాన్ని గ్రహించనప్పుడు, ఆచార్యుల  గొప్ప జ్ఞానబోధలను పట్టించుకోనప్పుడు, మనం ఇంకెటువంటి ఫలితాన్ని ఆశించగలము? 

తొడఁగి నీ ప్రసాదము దొరకని వారెవ్వరు
జడియు నీ దాసుల ప్రసాదమువలె
కడు నీ పాదతీర్థము కడగన్నవారెవ్వరు
బడిబడి నీ భక్తపాదజలమువలె ॥ప్రత్యక్షమే॥ 

ముఖ్య పదములకు అర్ధములు: తొడఁగి = విల్లుపై బాణము సంధించి వుంచడం, సిద్ధంగా  వుండడం (ఇక్కడ దైవమును తెలియ ప్రయత్నించే వారిని సూచిస్తుంది); జడియు = స్థిరమైన, నిరంతరము; కడగన్నవారెవ్వరు = సమకూరిన వారవ్వరు? (వారి కళ్ళ ద్వారా చూసిన వారు? అనే అర్ధములో); బడిబడి = అధికముగా. 

భావము: నీ దాసులందరూ అంతులేని నైవేద్యాలను అందిస్తున్నట్లుగా (అందరికీ అందుతున్నట్లుగా), విల్లుపై బాణమును సంధించినట్లు సిద్ధంగా వుండువారికి నీ ప్రసాదము దొరక్కుండునా? నీ పాదతీర్థమును ఎవరైనా తమ కళ్ళతో చూశారా? ముమ్మరముగా భక్తిగల నీ భక్తపాదజలము ఆ పవిత్ర జలానికి సారూప్యతను కలిగి ఉంటాయని గ్రహించము.

వివరణము: బాహాటము తెఱచియుండు భగవంతుని కృపను ఈ చరణంలో వర్ణించారు. మనం 'చూడటానికి' సిద్ధంగా వుంటే భగవంతుడిని చూడవచ్చు. వినడానికి సిద్ధంగా ఉంటే గొప్ప జ్ఞానము పొందవచ్చు. దైవమునకు ఆత్మసమర్పణ పూర్తిగా వ్యక్తిగతమైన ఎన్నిక. ఇందులో ఎక్కువ తక్కువను భావనలే లేవు. కానీ దైవమును మనస్పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటేనే ఇవి సాధ్యము.   సమస్య యేమిటంటే మన తరపు నుండి సంసిద్ధత కొరవడినది.  అందువల్ల, మరొకరిని (మన ప్రస్తుత పరిస్థితికి) నిందించడం కేవలం అవివేకమే. 

యేచి పరంధామమున కేఁగిన వారెవ్వరు
చాచిన నీ దాసుల సన్నిధివలె
చాచితి శ్రీవేంకటేశ సొంపుల నీ మహిమెల్ల
తాచిన నీ దాసానుదాసులయందే ॥ప్రత్యక్షమే॥ 

ముఖ్య పదములకు అర్ధములు: యేచి = వేధించుకుని, తమ్ముతాము హింసించుకుని (ఇక్కడ అతి కష్టమైన ప్రయత్నముతో అని అర్ధము తీసుకొనవలె); చాచితి = చాచిన చేతులతో = దైవమును పొందు ప్రయత్నాలను సూచిస్తాయి; తాచిన = దాచిన; 

భావము: నీ అనుచరులను గుర్తించ లేని వారు నీ ప్రపంచ వైభవాన్ని గ్రహించలేరు. అటువంటివారు నీవు నియంత్రిస్తున్న పరంధామమును వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా చేరుకోలేరు. శ్రీవేంకటేశ్వరా! నీ మహిమను దాసానుదాసుల యందే నిలుపుదువని యెరగక నీ వైపు చేతులుచాచి నిన్ను ప్రసన్నుడిని చేయ పూనుతాము. 

వివరణము: మన అసహజ వాంఛలను విడిచిపెట్టకుండా మనం ఎక్కడికీ వెళ్ళలేమని అన్నమాచార్యులు ఈ మహత్తరమైన కీర్తనలో నొక్కి చెప్పారు. కానీ మన భక్తి చాలా వరకు పరిపూర్ణము కాదు. మనకు మనము కోరుకునేది ముఖ్యము.  అందువలన, మనిషి అరకొర నమ్మకంతో, అంతకంటే తక్కువ భక్తితో జీవితాన్ని గడుపుతాడు. చివరికి మన జీవితములోని  ప్రతి దశలోనూ కొంత అసంతృప్తిని మిగులుస్తుంది.  ఐన్నపటికీ మానవుడు తనలోని అస్పష్టతకు ప్రాధాన్యత ఇస్తూ, భగవంతుడు ప్రసాదించిన వైభవాన్ని దర్శించుటలో విఫలమవుతాడు. 

అందువల్ల అన్నమాచార్యులు  "ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు?"#1అన్నారు {="ఓ మానవా! ఎంత అజ్ఞానివి!  మనుగడ అనే సాగరాన్ని దాటడానికి ఎండిన సొరకాయ బూరను నమ్ముకుని ఓడను విడిచిపెట్టేటంత మూర్ఖుడివి"} ఈ విధంగా, మనము నిస్సారమైన జీవితాన్ని గడుపుతాము. 

భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనం చేసే అనేకానేక ప్రయత్నాలు మన ప్రాపంచిక ఆలోచనకు ప్రతిబింబాలు మాత్రమే. అందువల్ల, సహజంగా ఉండటం అంటే అసహజాన్ని పూర్తిగా విడిచిపెట్టడమే.

References and Recommendations for further reading:

#1 97. ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు? (ODaviDichi vadara vUrakEla paTTEvu?)

 

-x-x-x-

 

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...