Wednesday, 19 November 2025

T-286 సంగరహితుఁడైనఁ కాక శాంత మాత్మ కేల కలుగు

 తాళ్లపాక పెదతిరుమలాచార్యులు

286 సంగరహితుఁడైనఁ కాక శాంత మాత్మ కేల కలుగు

For English version press here 

ఉపోద్ఘాతము 

పెదతిరుమలాచార్యులు
అనుభవ సిద్ధమైన దృష్టాంతములతో చాకచక్యముగా
మనసుని కలవరపెట్టే సంగము (=మిళితము, కలసిపోవు)
ఎంత పదునుగా, ఎంత లోతుగా పనిచేస్తుందో వెల్లడిస్తారు.

వెన్న కరుగుట, చవుటనేల నుంచి ఉప్పు జలాలు వెల్లువడటం,
మట్టి కడవ పగలటం వంటి సాధారణ గ్రామీణ చిత్రాలతో
మన అంతరంగం ఎంత నాజూకుగా,
ప్రతీ చిన్న​ప్రభావానికే ఎలా ప్రతిస్పందిస్తుందో చూపుతారు.

మనలోని అశాంతి బయటి ప్రపంచం వల్ల కాదని,
మన అంతర్గత మలినాలు వల్లనే వస్తుందని నిరూపిస్తారు.

అనుభవాలు మనపై పడ్డవి కావని —
మనసు వాటికి తగిన వాతావరణం కల్పించడంతో
అవి మనకు కలుగుతున్నాయని చెబుతారు.

దుర్బలతలతో నిండిన మనసు
ప్రపంచపు ఆటుపోట్లకు తట్టుకోలేదని కవి చెబుతారు.

చివరికి, ఈ మలిన కలయికలన్నింటినీ
అధిగమించే ఏకైక మార్గం —
శ్రీ వెంకటేశ్వర మరియు అలమేలుమంగ సేవలో మనసును సమర్పించుట అని సూచించబడింది. 

అలా ఈ కీర్తన మనసు బలహీనతల నుంచి భగవద్భక్తి లోతులకు తీసుకువెళ్లే అత్యుత్తమ సాధనముల​ శ్రేణిలో నిలుస్తుంది.

 

కీర్తన సంక్షిప్త చిత్రం

పల్లవి: సంగరహితము లేక శాంతి లేదు.

చరణం 1: లోకం చేత మలచబడి, ఆధారపడి జీవించటమే మనస్సు ధర్మము.
చరణం 2: తానే తగిన వాతావరణం సృష్టించి, అనుభవమును అహ్వానిస్తుంది.
చరణం 3: మనసు ద్వారా “తెలుసుకున్నది” మొదటి నుంచి కలుషితమైనదే.

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 76-4 సంపుటము: 15-438
సంగరహితుఁడైనఁ కాక శాంత మాత్మ కేల కలుగు
సంగతెఱుగనట్టివారి జాడ లూరకుండునా ॥పల్లవి॥

వెలయ నగ్ని పొంతనున్న వెన్న గరఁగ కేల మాను
పెలుచఁ జల్లతోడిపాలు పేరకుండునా
అలరి యరడు వద్ధి తీగె అంటఁబావ కేలమాను
చెలులసరస నున్నవారిచిత్త మూరకుండునా ॥సంగ॥

బెరసి యినుముతోడియగ్ని పెట్టువడక యేలమాను
విరులతేనె చూచి తేఁటి విడువ నేర్చునా
వొరసి యుల్లిఁ గూడి కప్ర ముగ్రగంధ మేల మాను
సిరులతోడ మెలఁగువారు చింత లేక వుందురా॥సంగ

వూరిచవుటనేల జలము లుప్ప నుండ కేల మాను
వూరుగాయకడవ బేఁట్లు వురుల కుండునా
కోరి శ్రీవేంకటేకొమ్మ యలమేలుమంగఁ
జేరకున్నవారికతలు చెప్ప నెట్టువచ్చును ॥సంగ॥

Details and Explanations:

పల్లవి
సంగరహితుఁడైనఁ కాక శాంత మాత్మ కేల కలుగు
సంగతెఱుగనట్టివారి జాడ లూరకుండునా ॥పల్లవి॥ 
              Telugu Phrase
Meaning
సంగరహితుఁడైనఁ కాక శాంత మాత్మ కేల కలుగు
అనుభవాలు విడుచు స్పర్శలు, చిహ్నములు, సంజ్ఞలు, గాయములు వదలకుండా అంతరంగ శాంతి కలగదు.
సంగతెఱుగనట్టివారి జాడ లూరకుండునా 
ఈ నియమాన్ని గ్రహించని వారిని ఆ సంసర్గాలు వదిలే (సూక్ష్మ)జాడలు ఊరకనే వదులుతాయా?

భావము:

అనుభవాలు విడుచు స్పర్శలు, చిహ్నములు, సంజ్ఞలు, గాయములు వదలకుండా అంతరంగ శాంతి కలగుతుందా? ఈ నియమాన్ని గ్రహించని వారిని ఆ సంసర్గాలు వదిలే (సూక్ష్మ)జాడలు ఊరకనే వదులుతాయా?


గూఢార్థవివరణము: 

కవి సూచించే సత్యం మౌలికము, నిర్ణయాత్మకము.
మనిషిని బాధించేది బాహ్య సంఘటనలే కాదు;
సంఘటన కేవలం ప్రవేశ ద్వారమైతే, జాడలు కారాగారపు గది వంటివి.”
ఘటన క్షణికమే. కొంత సేపే. స్మృతులు, రుచులు, వేదనలు వదలవే.
అవి మాయమైతే మనసుకి శాంతి లభించాల్సిందే.
కానీ ఆ సంఘటన వదిలిన జాడలు, ముద్రలు, రుచులు
పడిన ఆకులు చేరుతూ చెరువు నిండినట్లు.
మనసును లాగుతాయి, ప్రేరేపిస్తాయి, కలవరపెడతాయి, కల్మషాన్ని రేపుతాయి.
 
నిజమైన శాంతి,
మనసు ఈ అంతర్గత జాడల నుంచి విముక్తి పొందినప్పుడే.
వాటిని అణచడం ద్వారా కాదు,
వాటి సరళిని, తీరుతెన్నులను గ్రహించడం ద్వారా పొందవచ్చు.

మొదటి చరణం: 
వెలయ నగ్ని పొంతనున్న వెన్న గరఁగ కేల మాను
పెలుచఁ జల్లతోడిపాలు పేరకుండునా
అలరి యరడు వద్ధి తీగె అంటఁబావ కేలమాను
చెలులసరస నున్నవారిచిత్త మూరకుండునా ॥సంగ॥ 
Telugu Phrase
Meaning
వెలయ నగ్ని పొంతనున్న వెన్న గరఁగ కేల మాను
చక్కగా మంట చెంతనున్న వెన్న కరగకుండా ఎలా వుంటుంది?
పెలుచఁ జల్లతోడిపాలు పేరకుండునా
చల్ల కలిపితే పాలు పెరుగవ్వకుండునా?
అలరి యరడు వద్ధి తీగె అంటఁబావ కేలమాను
దారిలో వేలాడుతున్నతీగ పల్లకికి తగిలితే తునిగిపోకుండ వుంటుందా?
చెలులసరస నున్నవారిచిత్త మూరకుండునా
చెలులసరసనున్నవారికి చిత్తము ఊరకుండునా? గుబులురేపదా?

భావము:

(పెదతిరుమలాచార్యులు మనోసంగ ప్రభావమును మరింత వివరించుచున్నారు) చక్కటి వెన్న మంట చెంతనున్న కరగకుండా వుంటుందా.? (కరిగిపోవును). చల్ల కలిపితే పాలు పెరుగవ్వకుండునా? (పేరుకొనును). దారిలో వేలాడుతున్నతీగ పల్లకికి తగిలితే తునిగిపోకుండ వుంటుందా? (తునిగిపోవును). చెలులసరసనున్నవారికి చిత్తము ఊరకుండునా? గుబులురేపదా? (గుబులురేపును).


గూఢార్థవివరణము: 

ఈ నాలుగు ఉదాహరణలు కలిపి ఒక సామాన్య సూత్రాన్ని చూపుతున్నాయి:
సంబంధము కలిగిన చోట మార్పు తప్పక జరుగుతుంది;
తరచూ అది తిరిగి మార్చుకోలేని మార్పు.
ఇది దోషము కాదు, పదార్థ ధర్మం.
 
మన మనసు వెన్నలాంటిది. ఈ లోకముతో సంబంధాలు మంటలాంటివి.
వెన్న మంటకు దగ్గరగా వున్నప్పుడు కరిగిపోవుట సహజము;
కరిగిన వెన్న నెయ్యి అవుతుందే తప్ప తిరిగి వెన్నెకాలేదు.
ఇది మనస్సు యొక్క ఎకాంతర (one way) మార్పులకు ప్రతీక.

మన ఊహలు పాలవంటివి.
అనుభవాల జాడలు ‘చల్ల’ వంటివి.
ఆ ఊహల పాలలో అనుభవాల జాడల ‘చల్ల’‘
కలిస్తే పాలు పేరుకొనినట్లు మనసులో
ఆ అనుభవముల జాడలు పేరుకుపోతాయి.
ఇది కూడా ఎకాంతర మార్పు(one way).

తీగ ఉదాహరణలో మరొక గూఢార్థం ఉంది.
తీగ అనేది స్వతంత్ర బలం లేని జీవి;
అది తగు ఆశ్రయం ఆలంబనతో పెరుగుతుంది.
మనసూ అంతే—అది ఎల్లప్పుడూ ఏదో ఒక ఆశ్రయం ఉండాలి.
గాలికి కొట్టుకొంటూ వేలాడే తీగ పల్లకికి తగిలితే తునిగిపోవడం తథ్యం​;
అది దుర్బలత కాదు—తీగ ధర్మం.
మనస్సు ఆ తీగ లాంటిదే.
“ఆధారపడి జీవించటమే మనస్సు ధర్మము.”

చెలుల సరస నున్నవారి ఉదాహరణలో
కవి చివరికి అత్యంత సూక్ష్మమైన విషయానికి వస్తారు:
మనసు ఎంత స్పందనాశీలమో తెలియజేస్తుంది.
బయట​, సమీపములోని విషయములు
మనసులో రేపు  ఆస్వాదన, ఆకర్షణ, అలజడి దాని సహజ స్వభావం

ఈ చరణం మనసు ఎకాంతర మార్పులకు లోనగుటను సూచిస్తుంది.
అది ఎలా సంసర్గ ధర్మాలకు లోబడుతుందో అర్థం చేసుకోవాలన్నది కవి ఉద్దేశము.
ఆ అవగాహనలో ఆ జాడలతోనే మన ఇప్పటి జీవనము అన్నది స్పష్టం. 
పెదతిరుమలాచార్యులు
జీవించుటలోని సవాళ్ళను మనముందుంచుతున్నారు.

రెండవ​ చరణం: 
బెరసి యినుముతోడియగ్ని పెట్టువడక యేలమాను
విరులతేనె చూచి తేఁటి విడువ నేర్చునా
వొరసి యుల్లిఁ గూడి కప్ర ముగ్రగంధ మేల మాను
సిరులతోడ మెలఁగువారు చింత లేక వుందురా॥సంగ॥
Telugu Phrase
Meaning
బెరసి యినుముతోడియగ్ని పెట్టువడక యేలమాను
(బెరసి= పౌరుషమైన కోడిపుంజు; పెట్టువడక దెబ్బతినక​) వేడిచేసిన ఇనుమును దెబ్బలు కొట్టిగా వంచునది. ఊరకనే ఎవరూ దానిని కాల్చరుగా?
విరులతేనె చూచి తేఁటి విడువ నేర్చునా
తేఁటి = తుమ్మెద, తేనెటీగ) విచ్చుకున్న పూలను చూచి తుమ్మెద, తేనెటీగలు వదలుతాయా? (వదలవు)
వొరసి యుల్లిఁ గూడి కప్ర ముగ్రగంధ మేల మాను
(కప్రము = కప్పురము) కప్పురమును ఉల్లితో రాసినంత మాత్రమున దాని ఘాటైన వాసన పోతుందా? (పోదు)
సిరులతోడ మెలఁగువారు చింత లేక వుందురా
ధనముతో మెలగువారు దానిపై చింత లేక వుందురా? (ఉండరు).

సూటి భావము: 

వేడిచేసిన ఇనుమును దెబ్బలు కొట్టిగా వంచునది. ఊరకనే ఎవరూ దానిని కాల్చరుగా?  విచ్చుకున్న పూలను చూచి తుమ్మెద, తేనెటీగలు వదలుతాయా? (వదలవు). కప్పురమును ఉల్లితో రాసినంత మాత్రమున దాని ఘాటైన వాసన పోతుందా? (పోదు). ధనముతో మెలగువారు దానిపై చింత లేక వుందురా? (ఉండరు).


గూఢార్థవివరణము: 

మొదటి చరణంలో ఉపమానము చెప్పారు. రెండవ చరణంలో మానవుడు ఆ అనుభవములు అవి కలుగచేయు అడుగుజాడలు, తలంపులు, అవశేషములు కారణములేక వెంబడించవని, అవి కొని తెచ్చుకొనునవే యని చెబుతున్నారు.


ఎలాగైతే వేడిచేసిన ఇనుముకు దెబ్బలు పడకుండ వుండవో, మనము ఆ  వేడి ఇనుములాగానే మన అంతరంగమును అనుభవములకు ఆహ్వానము పలుకునట్లు చేస్తాము.


ఈ చుట్టూ వున్న ప్రపంచము తేనెటీగ లాంటిదైతే  మనసు విచ్చుకున్న పూలలాగ తేనెలొలుకుతూ రారమ్మనమని పిలుస్తుంటుంది. ఆ రకంగా ప్రపంచముతో సంబంధాన్ని పిలిచి మరీ రమ్మంటాం.


ఒకవేళ కప్పురమును ఉల్లితో రాపాడించినట్లుగా పైపైకి తెలియనీకుండా చేసినా, మనసు తన వంకర బుద్ధిని మార్చుకోదు.  ఆ అసలు వాసన త్వరలోనే బయటపడుతుంది. కుక్కతోక వంకరయే.


 తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము
చెప్పి నీ దాసుల మన సిగ్గుగాదా మాకు!

అని అన్నమాచార్యులు అననే అన్నారు. సిరులతోడ మెలఁగువారు చింత లేక వుందురా?”  ఇంకేం. రాజు (లాంటి మనసు) తలచుకుంటే దెబ్బలకు (చింతలకు) కొదువా?


ఒకటి  అనుభవములు. ఇంకోటి జాడలు.
ఇవే కాక చిత్తచాంచల్యం ఇంకొకటి.
గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీవే దిక్కు అని ప్రయోజనమేమి?
చిత్త వైకల్యము ఈ అనుభవాలను
అహ్వానిస్తున్నట్లు వుంటే వాటిలో ఇరుక్కుపోమా?

పైగా మనసు మళ్లించు ప్రయత్నములు
(వొరసి యుల్లిఁ గూడి కప్ర ముగ్రగంధ మేల మాను)
కూడా పనిజేయవని చెప్పారు.
ఈ చరణంలో ప్రతిస్పందనకు అనువైన వాతావరణములోకి
మనసు తెలియకుండానే మనను నెట్టి వేయడం చూస్తాం.

కాబట్టి పెదతిరుమలాచార్యులు
అసలు సిసలు సమస్యను
మనముందుంచుతున్నారు.
తప్పించుకోలేని పరిస్థితి.
ఇలాచూస్తే జీవితంలోని చాలా సమస్యలకు మూలము మనమే.
మనం గమనించ దలచుకోమంతే

మూడవ​ ​ చరణం:
వూరిచవుటనేల జలము లుప్ప నుండ కేల మాను
వూరుగాయకడవ బేఁట్లు వురుల కుండునా
కోరి శ్రీవేంకటేకొమ్మ యలమేలుమంగఁ
జేరకున్నవారికతలు చెప్ప నెట్టువచ్చును ॥సంగ॥
Telugu Phrase
Meaning
వూరిచవుటనేల జలము లుప్ప నుండ కేల మాను
చవుటనేలను వూరిన జలము ఉప్పగా కాక ఇంకెలా వుండునేమి?
వూరుగాయకడవ బేఁట్లు వురుల కుండునా
(వూరుగాయకడవ= ఆవకాయ  పెట్టి వుంచిన మట్టి కుండ, బేఁట్లు = వేట్లు, వురుల కుండునా = పగలకుండా ఉండునా?​) ఊరుగాయ కుండ (జీవిత ప్రయాణములోని) ఆటుపోట్లుకు పగలకుండ వుండునా?
కోరి శ్రీవేంకటేకొమ్మ యలమేలుమంగఁ
కోరి కోరి శ్రీవేంకటేశు యలమేలుమంగఁలను
జేరకున్నవారికతలు చెప్ప నెట్టువచ్చును
చేరనటువంటివారి కధలు ఎలా చెప్పగలను?

సూటి భావము:

చవుటనేలను వూరిన జలము ఉప్పగా కాక ఇంకెలా వుండునేమి? ఊరుగాయ కుండ (జీవిత ప్రయాణములోని) ఆటుపోట్లుకు పగలకుండ వుండునా? కోరి కోరి శ్రీవేంకటేశు యలమేలుమంగఁలను చేరనటువంటివారి కధలు ఎలా చెప్పగలను?


గూఢార్థవివరణము: 

వూరిచవుటనేల జలము లుప్ప నుండ కేల మాను
చవుటనేల నుంచి వచ్చేవి ఉప్పే జలాలే.
అలాగే, మనలో పుడుతున్న ఆలోచనలు
తగని, కూడని, అనుచితమైన ఆధారాల నుంచే వస్తున్నాయి.
 


వూరుగాయకడవ బేఁట్లు వురుల కుండునా

మన అంతరంగ నిర్మాణం
ఒక మట్టి కడవలా నాజూకుగా ఉంటుంది.
జీవితపు తెగింపు, స్థైర్యము  వంటి పరీక్షలకు
తట్టుకోలేక చిట్లిపోతుంది కూలిపోతుంది. 

“‘వూరగాయ’, ‘వూరుట’ అనే పదములను తీసుకుంటే —
మన అనుభవాలు, వాటి వల్ల ఏర్పడిన స్మృతుల గదులనుండి,
భావములు ఒక వూటలాగ నెమ్మదిగా వూరుతూ

మన ఎదుట ఉన్న ఈ క్షణపు అనుభవంతో
తెలియకుండానే కలిసిపోయి
కలుషితం చేస్తాయనే భావం కలుగుతుంది.”


పెద్ద తిరుమలాచార్యుడు వ్యాఖ్యానాన్ని ఇక్కడ మరింత పదును పెడతారు.

ఇప్పుడు ఆయన మనసు కదలికల నుండి
మనసు స్వరూపానికి దృష్టి తిప్పుతున్నారు.
అనుభవాల్లో సమస్య లేదు—
ఆ అనుభవములను పుట్టిస్తున్న నేలలో ఉంది.
చిత్తపు అంతర్భాగాల్లో నిలిచిపోయిన స్మృతులు
తమ తమ భావములను వూటలాగ స్రవిస్తూ వుంటాయి.
అనేకానే అనుభవాల నేపథ్యములో
ఈ వూటలన్ని కలిసిపోయి
ఏది ప్రభావము చేయుచున్నదో
తెలియనీకుండా చేస్తాయి. 

సమస్య ఆలోచన పుడుతున్న మూలప్రకృతిలో ఉంది.
ఆలోచనలకు ఆలవాలమైన మనసు పూర్తిగా మలినమై ఉంది.
అక్కడినుంచి పుట్టేది ఎలా పవిత్రంగా ఉంటుంది?
నిరాధారమైన దానినుంచి దైవమును గానీ, లోకమును గానీ
సరిగా గ్రహించలేం. 

కోరి శ్రీవేంకటేకొమ్మ యలమేలుమంగఁ
జేరకున్నవారికతలు చెప్ప నెట్టువచ్చును

ఇలాంటి అపవిత్రమైన మనస్సుతో
వెంకటేశ్వర–అలమేలుమంగ సేవను కోరలేము.
చేయగలిగినదంతా వారికి శరణాగతి చేయడమే.

అలా చేయనివారి జీవితం ఎలా ఉండబోతుందో ఏమి చెప్పగలం?
వారి అంతరంగం నిరంతరము దుఃఖమే ఉత్పత్తి చేస్తుంది.
ఇందులో, ఈ భూమిలో ఎన్నికకు వేరేమి కలదు? శరణాగతి తప్ప​

ఈ కీర్తన ముఖ్య సందేశం

 

“ఆధారపడి జీవించటమే మనస్సు ధర్మము.”
సమస్య ఆలోచన పుడుతున్న మూలప్రకృతిలో ఉంది.
ఆలోచనలకు ఆలవాలమైన మనసు పూర్తిగా మలినమై ఉంటుంది.
అక్కడినుంచి పుట్టేది ఎలా పవిత్రంగా ఉంటుంది?
నిరాధారమైన దానినుంచి దైవమును గానీ, లోకమును గానీ
సరిగా గ్రహించలేం. 

X-X-The END-X-X

No comments:

Post a Comment

T-286 సంగరహితుఁడైనఁ కాక శాంత మాత్మ కేల కలుగు

  తాళ్లపాక పెదతిరుమలాచార్యులు 286 సంగరహితుఁడైనఁ కాక శాంత మాత్మ కేల కలుగు For English version press here   ఉపోద్ఘాతము   పెదతిరుమలాచార...