Tuesday 3 October 2023

T-185 వననిధిఁ గురిసిన వానలివి

 అన్నమాచార్యులు

185 వననిధిఁ గురిసిన వానలివి


క్లుప్తముగా: "మనము ఆలోచనలకు బందీలము"  సామ్ హారీస్

 

కీర్తన సారాంశం:

పల్లవి:   సముద్రములో కురిసిన  వాన వ్యవసాయమునకు పనికిరానట్లు, మానవులు వివేకములేని పనుల భారములతో జీవితమును నిష్ప్రయోజనము చేసుకొనుచున్నారు.  

చరణం 1: అడవులలొ గాచిన వెన్నెల వృథా అయిపోవునట్లు, భాధలతోనూ, అపవాదముల తాకులతోనూ గడచిపోవును మన బ్రతుకులు. ఈ శరీరమును ప్రసాదించిన హరిని అలసత్వముతో విడిచి యితరులను ఎంతో దీనముగా వేడుకొని అటునిటు బంధముల సమస్యలతో తిరుగాడు బతుకు మనది.

చరణం 2: దూరపు కొండలు నునుపుగా కనబడినట్లు మమతలు ఆ రకముగా వూరించి తమవైపు త్రిప్పుకొని కలతలకు, దుఃఖములకు కారణమౌతున్నవి. చక్కగా పంటకు వచ్చిన పైరు లాంటి పరమాత్ముని విడిచి కొండలపైనుంచి జారుతున్న బండరాళ్ళ వలె దారిలోని శిలలతో  అటునిటు తాకుతూ అగమ్యముగా చరించు నట్లుండును మన బ్రతుకులు.

చరణం 3: దాచబడి, కప్పఁబడి యున్న దానిని బంగారములతోనూ, సంపదలతోనూ తూచి బేరీజు వేసుకొను మన ఈ జన్మములు చచ్చియుఁ జావని స్థితికి నిదర్శనములు. నిశ్చయములగు వేంకటరమణునిఁ రక్షణయే అసలగు నెయ్యములు.    

 

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: మానవులుగా చేపట్టు పనులలో  ముఖ్యమైనది మనలను మనము సమాజము, కుటుంబముల ఎదుట దానిలో ఒక భాగము అని నిరూపించుకొనుటకు చేయు ప్రయత్నము. మన ప్రమేయం లేకనే మనము సమాజములో, కుటుంబములో  భాగమైతిమి. వేరుగా ఋజువు చేయుటకు ఏమియు లేదు. అట్టి కార్యములను "మతి-పనిలేని పనుల భారములు" అన్నారు అన్నమాచార్యులు.

 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు:  4-4 సంపుటము: 1-24

వననిధిఁ గురిసిన వానలివి మతి-
పనిలేని పనుల భారములు ॥వననిధి॥
 
అడవుల వెన్నెల లారిడిబదుకులు
తడతాఁకుల పరితాపములు
వొడలొసఁగిన హరి నొల్లక యితరుల
బడిబడిఁ దిరిగిన బంధములు        ॥వననిధి॥ 

కొండల నునుపులు కొనకొన మమతలు
అండలఁ కేగిన నదవదలు
పండిన పంటలు పరమాత్ము విడిచి
బండయి తిరిగిన బడలికలు           ॥వననిధి॥ 

బచ్చన రూపులు పచ్చల కొలపులు
నిచ్చల నిచ్చల నెయ్యములు
రచ్చల వేంకటరమణునిఁ గొలువక
చచ్చియుఁ జావని జన్మములు        ॥వననిధి॥ 

 Details and Explanations: 

వననిధిఁ గురిసిన వానలివి మతి-
పనిలేని పనుల భారములు          ॥వననిధి॥

ముఖ్య పదములకు అర్ధములు: వననిధిఁ = అడవులు, మతి-పనిలేని = వివేకములేని. 

భావముసముద్రములో కురిసిన వాన వ్యవసాయమునకు పనికిరానట్లు, మానవులు వివేకములేని పనుల భారములతో జీవితమును నిష్ప్రయోజనము చేసుకొనుచున్నారు.  

వివరణము: మానవునికి తాను కొత్తగ​, ఎవరూ అనుసరించని నవ్య పథమున జీవితము గడపవలెనని ఎన్నో వూహలు వుంటాయి. కాని ఆచరణ అనేది దగ్గరగా వచ్చేంత వరకు ఆ విలువలను, ఆ ఆదర్శాలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఒక్కసారి జీవితమనే సుడిలో చిక్కుకుని అప్పటివరకు కన్న కలలను గాలికి వదిలి; “పాటించతగ్గ ఆచరణ​” అని సర్ది చెప్పుకుని; ఎప్పటికప్పుడు ఆచరణాత్మకములను సడలిస్తూ అధోగతి పాలు కావడం విదితమే.

కాబట్టి మానవునికి ఆచరణాత్మకమగు ఆదర్శము అందుబాటులో లేక అసలు సమస్య మొదలౌతుంది. మానవుడు సంఘజీవి. సంఘములో జీవించుటకు ఇతరులతో జరుపు లావాదేవీలలో తన స్వచ్ఛతను ప్రకటించుటకు గల భాషలో తన మదిలోని మాటలను బయలు చేయడంలో విఫలమౌతాడు.

దీనిని మరింత విపులంగా Les Enfants Trouvés (The Foundlings) - 'విడిచిపెట్ట బిడ్డలు' అను పేరు గల రెనె మాగ్రిట్ గీసిన చిత్రము ద్వారా తెలుసుకుందాం. ఇందులో అరణ్యము వంటి దానిలో ముగ్గురు మనుషులు చెట్లు కాండములలోని భాగములుగా కనబడుదురు. వారిలో వారు ఏదో విషయము దూరముగానే నిలబడి చర్చించు కొనుచున్నట్లుండును.



ఈ బొమ్మలో కనబడుతున్న చెట్లవలె మానవులు తమ తమ మనసులలో కలుగు భావములలో కూరుకుపోయి, తమ వాదనలను వదలలేక, మొండిగా ఒకే భావజాలమునకు బద్ధులై ఆ చెట్ల మాదిరిగా విడివిడిగా వుందురు.  అనగా వారు ఒకరినొకరు చూడగలరు కానీ ఒకరికినొకరు మానసికంగా దూరంగా వుంటారని తెలియ వచ్చు.

అనేక ప్రేమ గీతములలో, ప్రణయ కవిత్వాలలో వర్ణించిన "మనసున మనసై" అను భావము ప్రేమికుల విషయంలో కొంత కాలము పనివేయవచ్చును (అదీ అనుమానమే)​ కానీ అది కల కాలము పని జేయునని చెప్పలేము. చివరకు భార్యభర్తలమధ్య కూడా అది నిలువదని అనేకానేక సంఘటనలు ఋజువుచెస్తున్నాయి.

ఈ రకముగా మానవుడు ఎన్ని రంగములలో ప్రవేశించినప్పటికీ తన అంతరంగమును బయటపెట్టలేకపోవుట పెద్ద సమస్యగా అవతరిస్తుంది.  ఈ విధముగా తనను తాను ఋజువుచేసుకోను ప్రయత్నమును అన్నమాచార్యులు  మతి-పనిలేని పనుల భారములు అన్నారు. వననిధిఁ గురిసిన వానలివి”తో ఆ భగీరథ యత్నమును సూచించిరి.

అడవుల వెన్నెల లారిడిబదుకులు
తడతాఁకుల పరితాపములు
వొడలొసఁగిన హరి నొల్లక యితరుల
బడిబడిఁ దిరిగిన బంధములు     ॥వననిధి॥

ముఖ్య పదములకు అర్ధములు: ఆరిడిబదుకులు = భాధలతోనూ, అపవాదములతోనూ గడచిపోవు బ్రతుకులు; తడతాఁకు = తాకులు + తాకులు = మిక్కిలి బాధలు​, కష్టములు; బడిబడిఁ= ఎంతో దీనముగా వేడుకొని; దవదలు = కలతలు, దుఃఖములు, వ్యాకులములు

భావము: అడవులలొ గాచిన వెన్నెల వృథా అయిపోవునట్లు, భాధలతోనూ, అపవాదముల తాకులతోనూ గడచిపోవును మన బ్రతుకులు. ఈ శరీరమును ప్రసాదించిన హరిని అలసత్వముతో విడిచి యితరులను ఎంతో దీనముగా వేడుకొని అటునిటు బంధముల సమస్యలతో తిరుగాడు బతుకు మనది.

వివరణము: తిరిగి రెనె మాగ్రిట్ వెసిన బొమ్మను చూద్దాం. ఆ బొమ్మలో చూపెట్టిన ముగ్గురికీ అధారమైన భూమితో తగు సంబంధము (ఏకత్వమును) ఏర్పరఛుకోకనే (తమ తమ ప్రవృత్తిని తెలియకయే)  మానవులు కార్యములను సాధించబోదురు. ఇది నేలవిడిచి సాము కాదా? అందరూ ప్రకృతితో ఏకమైతే అసలు సమస్యలే వుండవని అన్నమాచార్యుల భావన కూడా​. 

మానవుడు యత్నముతో యితరులకు తన స్వచ్ఛతను ప్రకటించుకోలేడని తెలుస్తుంది. ఈ పని మహామహులైన​ ఏసుక్రీస్తు, కృష్ణుడు కూడా చేయలేకపోయినారు! ఇక మనమెంత​? 

ఈ సందర్భముగా "మనిషి ప్రపంచమును తన కంటే వేరుగా చూచును. తనను ఈ లోకము నుండి వేరు చేయు విభజనయే అతని అన్ని సమస్యలకు మూలము" అన్న జిడ్డు కృష్ణమూర్తి గారి మాటలను మననము చేసుకోనుట ఉచితము. 

కావున మానవులుగా మనము చేయ గల కార్యము భగవద్గీతలో చెప్పిన  బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే / తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ।।2-50।। {భావము: వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి, నైపుణ్యంతో (సరియైన దృక్పథంతో) పని చేయటం అనే, యోగ అభ్యాసము చేయుము} ఎంతయును విచారింపతగ్గది. 

కొండల నునుపులు కొనకొన మమతలు
అండలఁ కేగిన నదవదలు
పండిన పంటలు పరమాత్ము విడిచి
బండయి తిరిగిన బడలికలు        ॥వననిధి॥ 

ముఖ్య పదములకు అర్ధములు:దవదలు = కలతలు, దుఃఖములు, వ్యాకులములు; 

భావము:  దూరపు కొండలు నునుపుగా కనబడినట్లు మమతలు ఆ రకముగా వూరించి తమవైపు త్రిప్పుకొని కలతలకు, దుఃఖములకు కారణమౌతున్నవి. చక్కగా పంటకు వచ్చిన పైరు లాంటి పరమాత్ముని విడిచి కొండలపైనుంచి జారుతున్న బండరాళ్ళ వలె దారిలోని శిలలతో  అటునిటు తాకుతూ అగమ్యముగా చరించు నట్లుండును మన బ్రతుకులు. 

బచ్చన రూపులు పచ్చల కొలపులు
నిచ్చల నిచ్చల నెయ్యములు
రచ్చల వేంకటరమణునిఁ గొలువక
చచ్చియుఁ జావని జన్మములు    ॥వననిధి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: బచ్చన = ప్రచ్ఛన్న, దాచబడినది, కప్పఁబడినది; పచ్చల = బంగారము, సంపద, ధనముల​; కొలపులు = తూకములు, బేరీజు వేసుకొను; నిచ్చల = నిశ్చయముగా; రచ్చ = మామూలుగా కోలాహలము, సందడి అయినా, ఇక్కడ రక్షణ రూపాంతరము ‘రచ్చ' 

భావము: దాచబడి, కప్పఁబడి యున్న దానిని బంగారములతోనూ, సంపదలతోనూ తూచి బేరీజు వేసుకొను మన ఈ జన్మములు చచ్చియుఁ జావని స్థితికి నిదర్శనములు. నిశ్చయములగు వేంకటరమణునిఁ రక్షణయే అసలగు నెయ్యములు.  

వివరణము: కప్పఁబడి కనుమరుగై యున్న సత్యము చేకొనుటకు మానవుని వద్ద సాధనములు లేవు. సంపదలతోనూ బంగారపు బరువులతోనూ దానిని చేరలేడు. అతడు చేయగల దొక్కటే. మనస్సులోని శంకలను వదలి శరణాగతి చేయుట. 

“చచ్చియుఁ జావని జన్మములు” అని చెప్పి దుఖఃమయమగు ఈ ప్రపంచమునుండి బయలు పడని స్థితిని సూచించారు. దీనిని బైబిల్ లోని ఈ వాక్యములతో పోల్చి చూడండి. (హెబ్రీయులకు 13:3) మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములలోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. 

వీనిని విశ్లేషించి చూచిన “వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే= ‘నిర్మలమగు జ్ఞానమే జీవనము అను  స్థితి ఒక్కటే సత్యమైనదని తక్కిన ఏ దశ కూడా నానా అవస్థలకు దారితీయునని తెలియుచున్నది.  (Action of Pure Knowledge is the only avail). అన్నమాచార్యులు ఈ విధముగా అతి గుహ్యమైన జీవనమను దానిని సరళ పదములలో అవిష్కరించిరి.

-x-x-x-

1 comment:

  1. వనములో వర్షించిన మేఘము వలె, అజ్ఞానముతో కూడుకున్న కర్మలతో జీవితమును వృథా చేసికొనుచున్నారు అవివేకులు.
    మోక్షమునకు సాధనమైన మానవజన్మను ప్రసాదించిన భగవంతుడిని నిర్లక్ష్యము జేసి, అడవిని కాచిన వెన్నెల వలె రాగద్వేషాదులకు లోనై, సంసారకడలలో చిక్కుకొని కడలేని యాతనలు,బాధలు అనుభవించి జననమరణ చక్రములో తిరుగాడుచున్నారీ అజ్ఞానులు.

    దుఃఖకారణములైన పైపైని మెరుగులు,ఆకర్షణలకు లోబడి, మమతానురాగములలో చిక్కుకొని, చేతికి అందివచ్చిన పంటవలె నున్న పరమాత్మను విస్మరించి బండరాళ్ల వలె బ్రదుకును వ్యర్థం చేసుకొంటున్నారు అవివేకులు. శ్రీ వెంకటేశ్వరుడిని శరణు వేడికొని సమర్పణ భావముతో కొలిచి మోక్షము నొందుమని అజ్ఞానమానవులను ఆధ్యాత్మికముగా చైతన్యపరచు చున్నాడు అన్నమయ్య.

    ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...