Saturday, 15 July 2023

T-172 పాడైన యెరుకతో బంధమోక్షము

 అన్నమాచార్యులు

172 పాడైన యెరుకతో బంధమోక్షము

Press here for Commentary in English

Synopsis: సమస్త విభజనలకు మరియు విచ్ఛిత్తికి మనస్తత్వంలోని వ్యతిరేకతల లేదా చీలికల కారణంగా ప్రపంచమును చుట్టియున్న చైతన్యమును స్పృశించలేకున్నామని తెలిస్తే, మనకు ఎక్కడ ప్రారంభించాలో తెలియును. విశ్వవిఖ్యాత మనస్తత్వవేత్త కార్ల్ జంగ్ (The Essential Jung: Selected Writings" అను పుస్తకంలో) ​​

 

Summary of this Poem: 

పల్లవి: దైవమా! ఒకించుక కూడా తెలివిలేని మేము బంధమోక్షములను ఒకే బండిలోని ప్రయాణము అని భావింతుము. అన్వయార్ధముస్వామీ!  బంధమోక్షములను వూహాత్మక ద్వందములతో నిరంతరము పోరాటము జేయు మా అజ్ఞానమును క్షమించవా!

చరణము 1: అవ్యక్తమా! వేదములు నిన్ను పరబ్రహ్మమని  వేలాది విధములుగా  ఘోషించినా కూడా నిన్ను మేము మా అజ్ఞానముతో  నిర్మించుకున్న 'దైవము' అని భావించి కొలుచు వానితో నిన్ను కలిపి సేవించుట తప్పు కాదా? అన్వయార్ధముమానవుడా! దైవంగా భావించే వివిధ అస్తిత్వాలకు తక్షణమే లొంగిపోతావు కానీ, ఆ ప్రయత్నములన్నీ సత్యము వైపు కాదని గ్రహించలేవు.

చరణము 2: అసమానుడా! ఉపనిషత్తులు నీవే పరాత్పరుఁడవని నలుదిక్కులా చాటింౘగా వేగిరపాటుతో నిన్ను మేము దైవముగా సేవించు అనేక రూపములతో, వూహలతో కలగలిపి పూజించ తగునా? అన్వయార్ధముఓ వివేక​ సామర్థ్యము లేని మానవుడా! నీవు సత్యాన్ని మర్త్యులతో జతకట్టి గుడ్డిగా జీవన యానము సాగిస్తున్నావు. 

చరణము 3: వేంకటగిరి స్వామి! పురాణములు, ఇతిహాసములు  నీ కన్నా గొప్పది కాని ఉన్నతమైనదిగానీ, అందమైనదిగానీ లేవని వెల్లడించుతున్నవి.  మాలో అహమును, గర్వమును పురికొల్పేవాడా! నీ సామీప్యాన్ని గుర్తించకపోవడం మా మూర్ఖత్వమే. అన్వయార్ధము: మానవా! కళ్ళు తెరిచి నిన్ను ఆవరించిన వున్న సత్యాన్ని చూడు. ఆ అద్భుతముతో సరిపోలు విషయము ఈ దృశ్య ప్రపంచంలో లేనే లేదు. 

విపులాత్మక వివరణము

ఉపోద్ఘాతము: జీవనపర్యంతము సత్యసాధనలో గడిపిన అన్నమాచార్యులు, మానవులు తనను తాను మలచుకొను శిలలా అనుక్షణము మెరుగు పరచుకొంటూనే వుండవలెననిరి. ఈ పరిశ్రమలో సరియగు 'ఉలి'ని ఎంచుకొనుట ముఖ్యము. సత్యమను కొలిమిలో తీక్షణతను పొందిన 'ఉలి'యే వివేకము. ఙ్ఞప్తిలోనున్న వాటినుండి ఈ 'ఉలి'కి తీక్షణత ఆపాదించలేమనిరి.

 

కీర్తన:
రాగిరేకు:  29-1 సంపుటము: 4-547
పాడైన యెరుకతో బంధమోక్షము లొక్క-
గాడిఁ గట్టుట తెలివి గానకే కాదా॥పల్లవి॥
 
భావించి నినుఁ బరబ్రహ్మమని వేదములు
వేవేలు విధుల మొరవెట్టఁగాను
కేవలపు నిన్ను దక్కిన దైవములఁ గూర్చి
సేవింపుటిది తప్పు సేయుటేకాదా॥పాడై॥
 
సరిలేని నిను నుపనిషద్వాక్యములె పరా
త్పరుఁడవని నలుగడలఁ బలుకఁగాను
వరుసతోఁ బెక్కు దైవములు సంగడి నిన్ను
తొరలఁ గొలుచుట మహా ద్రోహమేకాదా॥పాడై॥
 
ఎందుఁ జూచిన పురాణేతిహాసములు నీ
చందమే యధికమని చాటఁగాను
చందర్ప జనక వేంకటగిరి స్వామి నీ
కందు వెఱఁగనిది యజ్ఞానమేకాదా॥పాడై॥ 

 Details and explanations:

పాడైన యెరుకతో బంధమోక్షము లొక్క-
గాడిఁ గట్టుట తెలివి గానకే కాదా ॥పల్లవి॥

ముఖ్య పదములకు అర్ధములు: ఒక్క గాడిఁ గట్టుట = ఒకే బండిలోని ప్రయాణము, రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు అను అర్ధములో.

భావము: దైవమా! ఒకించుక కూడా తెలివిలేని మేము బంధమోక్షములను ఒకే బండిలోని ప్రయాణము అని భావింతుము.

వివరణము: మానవుడు తాను తాకినది, విన్నది, చూచునది, ఙ్ఞప్తిలోనున్న వాటిని, వాసన బట్టి గ్రహించినదానిని సత్యముగా భావించి వాటి ఆధారముగా జీవితమను ప్రయాణమునకు న్యాయనిర్ణేతగా వ్యవహరించ బోతాడు. ఒకపరి కొంత విచారణ కూడా చేయుట కద్దు. ఇతరులు, సమాజము, పుస్తకములు, శాస్త్రములు చెప్పుదానిని నమ్మబోతాడు. కానీ ఇవియన్నీ కూడా 'తెలిసిన వాటి" క్రింద జమ కట్టవచ్చును. 

కానీ యీ జీవన ప్రయాణము 'తెలిసిన దానిని నుండి తెలియని దానికి'.  ఐతే, మనము తెలిసిన దానిని నుండి రక్షణ అను కవచమును ధరించి 'ఆవలి'కి చేరబోతాము. 'ఈవలి' దానికి 'ఆవలి' దానితో లేని సంబంధమును యీ రక్షణ అను కవచము ద్వారా కట్టబోతాము. ఇలా యీ ప్రయాణము 'తెలిసిన దానిని నుండి తెలిసిన దానిగా' మార్చివేసి సంతృప్తపడి జెండా ఎగురవేస్తాము. ఛాతీ చరచుకుంటాము.  పుస్తకాలు కూడా వ్రాసేస్తాము. విజయశిఖరాలు అందుకున్నామనుకుంటాం. 

తెలియని దానిపై విచారణ చేయుట​, ఊహాగానములతో సమయమును వృధాపరచుకొనుట కాక మరేమీ కాదు. అన్నమాచార్యులు "పాడైన యెరుకతో" ఇటువంటి అసంబద్ధపు పోకడనే సూచించారు. 

బెల్జియన్ సర్రియలిస్ట్ కళాకారుడు రెనే మాగ్రిట్టె వేసిన "సన్ ఆఫ్ మాన్" అనే   ప్రసిద్ధ పెయింటింగ్ ద్వారా దీన్ని మరింత విపులముగా అర్ధముచేసుకుందాం. . 1964లో రూపొందించబడిన దీనిలో మేఘావృతమైన నీలి ఆకాశం నేపథ్యముగా సూట్ వేసుకున్న ఒకానొక వ్యక్తి ముఖాన్ని ఒక కదులుతున్న ఆకుపచ్చని ఆపిల్‌తో కప్పుతూ కనబడుతుంది.   ఈ పెయింటింగ్ మాగ్రిట్టే గారికి పర్యాయపదమై పోయింది. విభిన్న కోణాలలో వివరణలకు తెరలేపింది. 

పై పెయింటింగ్‌లోని ప్రధాన వ్యక్తి సూట్‌లో ఉన్న వ్యక్తి, యొక్క అస్పష్టమైన ముఖం ఊహాగానాలు మరియు ఆలోచనలను రేకెక్తిస్తుంది. ఈరకంగా ఇది వ్యక్తిగతముగా మానవుడుతనను తాను తెలుకొనుటలోని అస్పష్టతను, ఛేదించలేని రహస్యమును సూచిస్తుంది.  ఆకుపచ్చని ఆపిల్ ఒక అధివాస్తవిక మరియు సమస్యాత్మక మూలకం వలె పనిచేస్తుంది. కనిపించు మరియు కనిపించని వాటి మధ్య వ్యత్యాసముపై దృష్టిని సారిస్తుంది. మాగ్రిట్ యాపిల్ వంటి సాధారణ వస్తువుతో మనిషి ముఖాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి సాధారణమైన చిత్రపటములో లోతైన అసాధారణమైన అర్థాలను అన్వేషించడానికి వీక్షకులను ఆహ్వానిస్తాడు. 

"సన్ ఆఫ్ మాన్” తరచుగా వ్యక్తిత్వం, గుర్తింపు మరియు పర్యాలోచనల ఇతివృత్తాలతో అనుబంధించబడుతుంది. ఇతరుల గురించి మరియు మన గురించి మన అవగాహనలో కనబడు, కనబడని వాని పాత్రను ప్రశ్నించడానికి ఇది వీక్షకులను ప్రేరేపిస్తుంది. వేసుకున్న దుస్తులు (సూట్) మరియు అస్పష్టమైన ముఖముల సమ్మేళనం వ్యక్తిగత గుర్తింపు మరియు సామాజిక హోదాల మధ్య పరస్పర అంచనాలపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. 

"సన్ ఆఫ్ మాన్” అనేది అధివాస్తవికతకు ప్రత్యక్ష రూపమై శక్తివంతమైన మరియు ఆలోచింపజేసే కళాఖండముగా పరిగణించబడుతుంది. ప్రత్యేక గుర్తింపుకై మానవుల ఆరాటము, దృక్కోణములలోని వ్యత్యాసములు మరియు నిత్య జీవితంలో మనం ధరించే ముసుగుల గురించి దృశ్య సంభాషణలో పాల్గొనడానికి వీక్షకులను ఆహ్వానిస్తుంది. ఇది ప్రేక్షకులను మానవుని ఉనికిలోని సంక్లిష్టతలను గురించి చర్చలకు దారి తీస్తుంది. ఈ రకంగా "సన్ ఆఫ్ మాన్" అనేది మన గురించి మనకు గల అస్పష్టమైన అవగాహనను ముందుంచుతుంది. 

ఒక చిన్న మార్పు అనేక క్రొంగొత్త విషయములకు తెరలేపుతుందనేందుకు ఈ చిత్రరాజము ఉదాహరణ​. పై పటమును అర్ధము చేసుకునేందుకు సమయము పట్టును కొంత వివరణ కూడా జోడించినప్పటికీ. అనేకానేక విషయములలో తగులుకున్న మన మనస్సులు ఆయా విషయములను వున్నవి వున్నట్లుగా ఒక్కసారిగా, వున్నపళంగా గ్రహించలేవు. మన కళ్ళముందటి వస్తువుల​, మనుషుల అసలు రూపములు తెలియకే మనము వ్యవహరించుదుమని తెలియవలె. ఈవిధంగా అన్నమాచార్యులు వుపయోగించిన "పాడైన యెరుకతో" అనునది అతి నిర్దుష్టము. 

-x-x-x- 

ఇకపోతే, కబడుదానిని మనము స్పష్టముగా గ్రహించలేమని చెప్పుటకు మరో వుదాహరణను సచిత్రముగా పంచుకుంటాను. కాన్వెక్స్ & కాన్'కేవ్ అను లిథోగ్రాఫ్'లో ఎస్చెర్'గారు మనము చూచుచున్నది కుంభాకారమో, పుటాకారమో నిర్ణయించలేమని తెలియజెప్పారు. అటులనే ఆ చిత్రములో ఒకే తలమును ఇంటి పైకప్పో లేద క్రింది నేలయో అని కూడా తెలియుట సందిగ్ధమే.


పై బొమ్మలో చూపిన విధముగా మానవులు ఒక్కొక్కరూ ఒక్కొక్క దృక్కోణములో సత్యమును దర్శింపుటకు ఉద్యమింతురు. కళ్ళమందటే వున్నదానిని కనుగొనలేని దానిని అశక్తులము. అల్పులము. చూపులలో సత్యము లేదా దైవమును పరికించు  స్పష్టత లేనివారమని గ్రహించక వెంపర్లాడుదుమని భావము. 

"పాడైన యెరుకతో బంధమోక్షము లొక్క-గాడిఁ గట్టుట తెలివి గానకే కాదా" అని అన్నమాచార్యులు బంధమోక్షములను ఒకే దృష్టితో చూచుటయే అవివేకమని అన్నారు. మునుపు ప్రస్తావించుకున్నట్లు సత్యము మన ఎరుకలో లేని విషయము. దానికై ఉబలాట పడుట వృధా ప్రయత్నమని తెలియవలె. బంధములను త్రెంచుకొనుట మాత్రమే మానవుని చేతిలోనున్న కార్యము. 

అన్వయార్ధము:  స్వామీ!  బంధమోక్షములను వూహాత్మక ద్వందములతో నిరంతరము పోరాటము జేయు మా అజ్ఞానమును క్షమించవా!

వివరణము: అన్వయార్ధములో ప్రతిపాదించిన భావమునే క్రింది చరణమలలోనూ అన్నమాచార్యులు విస్తారముగా వివరించి చెప్పిరి. 

భావించి నినుఁ బరబ్రహ్మమని వేదములు
వేవేలు విధుల మొరవెట్టఁగాను
కేవలపు నిన్ను దక్కిన దైవములఁ గూర్చి
సేవింపుటిది తప్పు సేయుటేకాదా ॥పాడై॥ 

ముఖ్య పదములకు అర్ధములు: పరబ్రహ్మము = ఈ దృశ్యాదృశ్య ప్రపంచమున దేనితోనూ సంబంధములేని సత్యము.

భావము: అవ్యక్తమా! వేదములు నిన్ను పరబ్రహ్మమని  వేలాది విధములుగా  ఘోషించినా కూడా నిన్ను మేము మా అజ్ఞానముతో  నిర్మించుకున్న 'దైవము' అని భావించి కొలుచు వానితో నిన్ను కలిపి సేవించుట తప్పు కాదా?

వివరణము: కొందరు శివుణ్ణి, కొందరు విష్ణువును, కొందరు దుర్గను, కొందరు లక్ష్మిని, కొందరు బుద్ధుని, కొందరు ఏసుక్రీస్తుని, మరి కొందరు అల్లాను, 'దైవము'గా కొలుచుదురు. ఏ రకముగా చూచినను దైవము అను శబ్దమునకు ఏకాభిప్రాయము కానరాదు. పారంపర్యముగా వచ్చు దానిని అనుసరించుట ఆనవాయితీగా మారినది. ఇలా ఎవరికివారు తమకు నచ్చిన దానిని దైవమని పూజించి, అద్దానిని సత్యముతో ముడిపెట్టుదురు. ఈ లక్షణమును అన్నమచార్యులు ఖండించిరి.

దాదాపు ప్రతీ వివరణలోనూ చెప్పుకున్నట్లు, "వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన" (భగవద్గీత 2-41) దైవమునొక్కదానినే అనుసరించవలెను. కానరాని  దైవమును అనుసరించలేము. ఇది సాధ్యమైన పనికాదు. మనలోని అజ్ఞానమును విడుచుటొక్కటియే సాధ్యము. కానీ అధిక శాతము మానవాళి 'దైవము'ను కొలుచుటలో నిమగ్నమైనదే కానీ అసలు విషయమును ప్రక్కకు పెట్టినదని అన్నమచార్యుల భావము.

అన్వయార్ధము:  మానవుడా! దైవంగా భావించే వివిధ అస్తిత్వాలకు తక్షణమే లొంగిపోతావు కానీ, ఆ ప్రయత్నములన్నీ సత్యము వైపు కాదని గ్రహించలేవు. ​

సరిలేని నిను నుపనిషద్వాక్యములె పరా
త్పరుఁడవని నలుగడలఁ బలుకఁగాను
వరుసతోఁ బెక్కు దైవములు సంగడి నిన్ను
తొరలఁ గొలుచుట మహా ద్రోహమేకాదా ॥పాడై॥ 

ముఖ్య పదములకు అర్ధములు: నలుగడలఁ = నలుదిక్కులా; సంగడి = జత చేర్చు; తొరలఁ = వేగిరపాటు, మార్కొను

భావము: అసమానుడా! ఉపనిషత్తులు నీవే పరాత్పరుఁడవని నలుదిక్కులా చాటింౘగా వేగిరపాటుతో నిన్ను మేము దైవముగా సేవించు అనేక రూపములతో, వూహలతో కలగలిపి పూజించ తగునా?

వివరణము: 'తొరలఁ గొలుచుట మహా ద్రోహమేకాదా ' (= వేగిరపాటుతొ అలోచనలకు తావివ్వక కొలుచుట = మంచిచెడుగులను విభజించి తెలిసికొను సామర్థ్యములేమిని సూచించిరి​) అంటూ అన్నమచార్యులు మానవుల ప్రవృత్తిని ఎత్తి చూపిరి.

ధనమును, పేరును ప్రతిష్ఠను దైవముగా  కొలుచువారెందరో! ఇకపోతే క్రికెట్, ఫుట్'బాల్ దైవములు, చలనచిత్ర రంగములోను  దైవములు, వారిలో కొందరికి గుళ్ళున్న విషయములను మరచిపోకండి. చివరికి గోదావరి జిల్లాలకు నీళ్ళు తెచ్చిన సర్ ఆర్థర్ కాటన్ దొరగారికి కూడా గుడి కట్టిరి. నిజానికి మానవుడు దైవమును కొలువడు. దైవము నుండి రక్షణను అభయమును కోరుకుంటాడు. దానికి భక్తి అని ముసుగు వేస్తాడుఅని ఈ చరణము యొక్క ఆంతర్యము.

అన్వయార్ధము:  ఓ వివేక​ సామర్థ్యము లేని మానవుడా! నీవు సత్యాన్ని మర్త్యులతో జతకట్టి గుడ్డిగా జీవన యానము సాగిస్తున్నావు.

ఎందుఁ జూచిన పురాణేతిహాసములు నీ
చందమే యధికమని చాటఁగాను
చందర్ప జనక వేంకటగిరి స్వామి నీ
కందు వెఱఁగనిది యజ్ఞానమేకాదా ॥పాడై॥ 

ముఖ్య పదములకు అర్ధములు: చందర్ప జనక = మాలో అహంకారమును గర్వమును మోహమును కలుగజేయువాడా; కందువ = జాడ; ఏకాంతము; చమత్కారము.

భావము: వేంకటగిరి స్వామి! పురాణములు, ఇతిహాసములు  నీ కన్నా గొప్పది కాని ఉన్నతమైనదిగానీ, అందమైనదిగానీ లేవని వెల్లడించుతున్నవి.  మాలో అహమును, గర్వమును పురికొల్పేవాడా! నీ సామీప్యాన్ని గుర్తించకపోవడం మా మూర్ఖత్వమే.

వివరణము: "సమస్త విభజనలకు మరియు విచ్ఛిత్తికి మనస్తత్వంలోని వ్యతిరేకతల లేదా చీలికల కారణంగా ప్రపంచమును చుట్టియున్న చైతన్యమును స్పృశించలేకున్నామని తెలిస్తే, మనకు ఎక్కడ ప్రారంభించాలో తెలియును" అన్నారు విశ్వవిఖ్యాత మనస్తత్వవేత్త కార్ల్ జంగ్. జంగ్'గారి ప్రకటనకు అన్నమాచార్యుల కీర్తనకు గల దగ్గర సంబంధమును పరిశీలించండి. అన్నమచార్యులు అలుపెరగని సత్యాన్వేషి అని చెప్పుట ఉట్టిమాటలు కావు.

"మానవుడు మరణించి పరలోకము చేరునని నమ్మవద్దు. ఈ లోకముననే, ఇక్కడే, ఈక్షణమే ముక్తికి మార్గము కలదని" అన్నమాచార్యులు అనేక సందర్భములలో ఉద్ఘాటించిరి. కానీ కళ్ళ ముందటి సత్యమును కనుగొను బాధ్యత మానవునిదే. మానవాళి ఆ దిసగా అడుగులువెయ్యటం లేదనేది నిర్ద్వందము.

అన్వయార్ధము: మానవా! కళ్ళు తెరిచి నిన్ను ఆవరించిన వున్న సత్యాన్ని చూడు. ఆ అద్భుతముతో సరిపోలు విషయము ఈ దృశ్య ప్రపంచంలో లేనే లేదు.

-x-x-x-

 


T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...