అన్నమాచార్యులు
219.
ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి
ఉపోద్ఘాతము:
ఇది అన్నమాచార్యుల స్వగతం. ఆయన్నుంచి వచ్చిన కవిత్వం వ్యక్తిగత ఆకాంక్షలకు కానీ, సహజమగు సాంస్కృతిక పరంపరలకు (cultural conditioning) కానీ లోనవ్వదు. ఆయన భాషను కవిత్వం, భక్తి,, తత్త్వాలు కూడా తాకని ప్రదేశాలకు తీసుకెళ్ళారు - ఆయా అర్థాలూ, భాషలూ కరిగి సమ్మిళితమై పోయే ఆ మృదువైన, పట్టరాని అంచున నిలిపారు. ఆ అసమాన్య అనుభవాన్ని పట్టివుంచాలని కాదు; ఆ అనుభవంలోనిలబడి, అది మాట్లాడేదాకా తానే ఓ శ్రోతగా నిలిచి మనకు వినిపిస్తారు.
దైవ కృప మన ఈ జీవితపు అభిప్రాయాలకు అతీతం. అందుకే అన్నమాచార్యులు మన స్థితిని, ప్రవర్తనను బేరీజు వేసుకోకుండా – ఈ యాత్రలోకి రావాలని మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ కవితలో వినేవారికి, చదవేవారికి ఒక అద్భుతమైన రూపాంతరము తమ కన్నుల ముందు ఆవిష్కరింపచేస్తారు.
పల్లవి: కోరిక, అంతఃకలహాలకు సూచిక.
మొదటి చరణం: సమస్య - మాయలో చిక్కుకోవడం, ఇంద్రియసుఖాలలో స్థిరపడిపోవడం.
రెండవ చరణం: పరివర్తనకు నాంది – పరమాత్ముని కృపతో ఆత్మ ప్రశాంతతకు, కోర్కెలు దాటి వెళ్ళడానికి సిద్ధమవటం.
మూడవ చరణం: భావనలో సత్యము, స్పష్టత కానవచ్చుట. పరమానందము పొందుట.
ఈ కీర్తన
చూస్తూనే అర్థం కాకపోవచ్చు. కానీ అంత అస్పష్టమూ కాదు. చాలా నిజమైనది. విలువైనది. మనం
మనస్సుతో చూడలేని దృక్పథాన్ని అందుకోగలిగితే ఇంకా సులభమౌతుంది. ఇదే అన్నమాచార్యుల గొప్పతనము.
భాషలో నిప్పును రగిలిస్తారు. మన హృదయములో నిలిచి కనిపింపచేస్తారు.
కీర్తన సంగ్రహ భావము:
మొదటి చరణం: ఇక్కడ
చందముఖి అని సంభోధించి -సున్నితత్వానికి, కాంతికి ప్రతీకగా
చూపారు. ఆమె అంతులేని నిరీక్షణలో ఉంది. ఎదురు చూపులలో - నిద్ర వుండదు. విశ్రాంతి కలుగదు.
ఏమిచేసినా ఆత్మకు శాంతి లభించదు. నిశ్శబ్దంగా ఎదురు చూస్తూనే ఉంది — చీకటి తొలగి వెలుగు
రావాలని. "ఏమి సేతమే?" చుట్టూ సుగంధ వాతావరణం, చందనపుటిల్లు, పరిమళభరిత గదులు ఉన్నా — ఆమెకు నిద్ర లేదు. మెలకువ లేదు. ఎందుకంటే ఆ బాహ్యంగా
ఎన్ని సౌకర్యాలు వున్నా మనసులో తృప్తిలేకుంటే శాంతి లేదు. ఆ మెలకువ అయోమయం. అది స్పష్టత లేని కలకలం. అది అంతర్గత
శాంతి కోసం జరిగిన యమ యాతన.
రెండవ చరణం: ఆమె మన్మథుని పుష్పబాణమే — సున్నితమైనది, ఆకర్షణీయమైనది, కానీ అచిరమైనది. అయితే ఇక్కడ ఈ "పుష్పబాణం" అనేది ప్రేమకు చిహ్నం కాదు; అది ఇంద్రియల మాయలో బందీ. అన్నమయ్య ఈ చిహ్నాన్ని తిప్పి చూపిస్తున్నారు - ఇది కేవలం కోరిక కాదు, ప్రకృతి వేసిన వలలో పడ్డామనటానికి సంకేతం. ఆమె మంచంపై నిశ్చలంగా పడుకొని, మాటలాడదు. ఆ బాణం ప్రయాణించ గలిగి కూడా ఇప్పుడు అచేతనము. అందంతోనూ నిండినప్పటికీ, అది సంకెళ్లలో చిక్కుకొని, మాటలే లేని స్థితిలో ఉండిపోతుంది. మదిలో వెలుగు లేక తికమక పడే మౌనం. ఆత్మలోని కలవరమును చెప్పజాలని భావము. భావముల కందని భాష. రెప్పలు నిద్రకు ఒరుగుతున్నాయి - నిద్ర రాకున్నా, నిద్రించాలనే తపన. ఈ రెప్పల కదలికలు లోపలి తపనకు సంకేతం. మౌనములోనే అంతర్యుద్ధం. ప్రశాంతత లేని నిర్లిప్తత. - నిద్రపోవాలనుకుంటోంది. శాంతి కావానుకుంటోంది. కానీ తత్తఱపాటు నుండి తప్పించుకోలేకపోతోంది. ఈ పాదం ఒక్కసారిగా ఒక విస్ఫోటంలా విచ్చుకొంటుంది. రెప్పలు కాస్త తెరచిన వేళ - పూర్తిగా కన్ను తెరిచీతెరవక మునుపే -సత్యం లోపలికి ఇంకిపోతుంది. జీవితం పట్ల మనం తమో గుణములో ఉన్నామన్న నిజం, ఆనందానికి బదులు పట్ల మౌఢ్యంలో మునిగిపోయామన్న బాధ స్పష్టమవుతుంది. ఆ మెలకువకే ఆ కన్నీళ్లు. అది కేవలం దుఃఖం కాదు. అది పోగొట్టుకున్న సమయానికి చెల్లించాల్సిన మూల్యం. అది మెలకువ తీసుకొచ్చే రోదన.
శృంగార కీర్తన |
రేకు:
30-6 సంపుటము: 5-172 |
ఉయ్యాల
మంచముమీఁద నూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు
రెప్ప మూసినాఁ దెరచును ॥పల్లవి॥ చందమామ
పాదమాన సతికి వేఁగినదాఁకా
యెందును
నిద్రలేదేమి సేతమే
గందపుటోవరిలోనఁ
గప్పురంపుటింటిలోన
యిందుముఖి
పవ్వళించు నింతలోనే లేచును ॥ఉయ్యాల॥ పంచసాయకుని
పుష్పబాణమాన యిందాఁక
మంచముపై
బవ్వళించి మాటలాడదు
నించిన
వాలుగన్నుల నిద్దురంటానుండితిమి
వంచిన
రెప్పలవెంట వడిసీఁ గన్నీరు ॥ఉయ్యాల॥ వెన్నెలల
వేంకటాద్రివిభుని లేనవ్వులాన
నన్నుఁ
జూచియైనాఁ జెలి నవ్వదాయను
ఇన్నిటాను
సంతసిల్లి యీ దేవదేవుని గూడి
మన్ననల
యింత లోన మలసీని జెలియ ॥ఉయ్యాల॥
|
Details and explanations:
భావము:
వ్యాఖ్యానము మరియు పోలికలు:
మొదటి భాగం: అంతరిక్షపు ఊయల
ఆత్మ ఒక శాశ్వతమైన ఊయలలో చిక్కుకొని ఉంది - ఇది సుఖానుభవం కాదు, శాంతి లేని అనియంత్రిత కదలిక.
విశ్రాంతి దగ్గరలో ఉన్నట్టే అనిపిస్తుంది — కానీ దరి చేరదు.
నిద్ర (మరణం) వస్తుంది - కానీ అది ప్రశాంతత కాదు, ఒక తాత్కాలిక విరామం మాత్రమే. కళ్ళు మూసుకున్నా- ఆ నిశ్చలత లేదు. అవి మరొక జన్మలో, మరొక లోకంలో తెరుచుకుంటాయి.
భగవద్గీత 4-18లో చెప్పినట్టు — మనం 'నిష్క్రియ'గా భావించే క్షణాలూ - ఈ యాత్రలో భాగమే. కార్యముకాదు అనిపించే స్థితీ, మరో క్రియాపథానికి ద్వారమే. అందుకే - ఊయల ఆగదు. శాశ్వతంగా ఆటమటించుతూనే వుంటాం.
రెండవ
భాగం:
ఇప్పుడు ఈ పల్లవిని
సాల్వడోర్ డాలీ వేసిన నిద్ర (స్లీప్) (1937)తో పోల్చి చూద్దాం.
డాలీ
చిత్రించిన ఈ భయముగొల్పు సర్రియలిస్ట్ (అధివాస్తవిక) చిత్రంలో, గాలిలో తేలియాడుతున్నట్టుగా
ఉన్న, ముడతలు పడిన, ఒదిగిపోతున్న తలను కర్రల
వూతములు పెట్టి నిలబెట్టినట్లు మనం చూస్తాం - అది విశ్రాంతికి
సంకేతం కాదు - అస్థిరతకి, బలహీనతకి సంకేతం.
ఊయ్యాల, డాలీ వేసిన ప్రాపులు — రెండూ మన అస్థిర స్థితిని తెలుపుతున్నాయిగానీ,
నిశ్చలతని చూపుటలేదు.
ఒదిగిన ముఖం - మన ఆత్మ నిద్రలో ఉందని
భావించినా, అది వాస్తవానికి శాంతి కాదు.
పల్లవిలో రెప్పలు మూసుకుంటే మళ్ళీ తెరుచుకుపోతాయి అన్నారు; అలాగే
డాలీ బొమ్మలో అక్కడ చూపిన ఆ ఆకారం కర్రలు గాలికి వూగినా, పడిపోయినా
నిద్ర చెడి లేచి తిరిగి ఆ స్థితిలోనే పడుకునే ప్రయత్నాన్ని సూచిస్తుంది- ప్రశాంతత కానరాదు.
రెంటిలోనూ చూపిన నిద్ర అనేది
విశ్రాంతి కాదు. నిశ్చలత వెనుక చలనమే దాగి ఉంది.
అన్నమాచార్యులు వేదనతో వర్ణించిన ప్రపంచ మనే ఊయ్యాలో ఊగుతూ ఉన్న మన
స్థితికి డాలీ వేసిన నిద్ర అద్భుత దృశ్య రూపకం.
(ప్రపంచమనే ఊయ్యాల: ప్రముఖ ఆంగ్ల రచయిత, తత్వవేత్త అలాన్ విల్సన్ వాట్స్ ఇలా అన్నారు. "మనము ఎక్కడినుంచో ఈ ప్రపంచంలోకి
"వచ్చి పడలేదు"; మనము ఒక చెట్టు నుండి ఆకులు వలె బయటకు
వస్తాము. సముద్రం నుంచి "అలలు" వచ్చినట్లుగా, విశ్వము
నుండి "మనుషులు" వస్తున్నారు.)
మొదటి చరణం:
భావము:
చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా / యెందును నిద్రలేదేమి సేతమే: ఇక్కడ చందముఖి అని సంభోధించి -సున్నితత్వానికి, కాంతికి ప్రతీకగా చూపారు. ఆమె అంతులేని నిరీక్షణలో ఉంది. ఎదురు చూపులలో - నిద్ర వుండదు. విశ్రాంతి కలుగదు. ఏమిచేసినా ఆత్మకు శాంతి లభించదు. నిశ్శబ్దంగా ఎదురు చూస్తూనే ఉంది — చీకటి తొలగి వెలుగు రావాలని. "ఏమి సేతమే?" - చెరసాల అధికారి తలుపు తీసిన కదా బందీ బయటకు వచ్చేది. ఇక్కడ "ఏమి సేతమే" ఒక విలక్షణమైన ప్రయోగము. విశ్వమంత భావాన్ని చూపారు. బందీ ఏమీ చేయకూడదని భావము. ఏమీ చేయకుండా వుండడమే మానవుని సమస్య.
గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన / యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును: చుట్టూ సుగంధ వాతావరణం, చందనపుటిల్లు, పరిమళభరిత గదులు ఉన్నా — ఆమెకు నిద్ర లేదు. మెలకువ లేదు. ఎందుకంటే ఆ బాహ్యంగా ఎన్ని సౌకర్యాలు వున్నా మనసులో తృప్తిలేకుంటే శాంతి లేదు. ఆ మెలకువ అయోమయం. అది స్పష్టత లేని కలకలం. అది అంతర్గత శాంతి కోసం జరిగిన యమ యాతన.
వ్యాఖ్యానము
మరియు పోలికలు:
భగవద్గీత
2-28లో శ్రీకృష్ణుడు అర్జునునితో "జీవులు మధ్యలో కలిగిన
వ్యక్త సంసారము పుట్టుకకు పూర్వము, మరణమునకు పిమ్మట అవ్యక్తము
అని గ్రహించ లేక పోవుట వలన దుఃఖమునకు లోనౌతున్నా" రంటాడు. అన్నమాచార్యుల చందముఖి
— తాత్కాలిక ప్రపంచపు ఆకర్షణలలో చిక్కుకుని, వాటిని శాశ్వతంగా
భావిస్తూ మానసిక కలవరపడుతుంది. మనిషి నిజ జీవితంలో ఇవే - తాత్కాలికమైన
భావాలే శాశ్వతమైనవి అనుకొని ఆశలలో చిక్కుకుంటాడు. ఆమె మెలకువ కూడా, మన మనస్సుల వలెనే - స్పష్టత లేని కలతతో నిండి ఉంటుంది.
ఇప్పుడు ఈ స్థితిని రినే మాగ్రిట్ చిత్రించిన " కోరుకున్న
బందిఖానా (ఎలెక్టివ్ అఫినిటీస్)" అనే చిత్రంతో పోల్చి చూద్దాం: ఈ చిత్రంలో - ఒక గుడ్డును
పంజరంలో పెట్టినట్లు చూపారు. అది బహుళార్థాల గర్భం. గుడ్డు అనేది పక్షిగా మారే సంభావ్యతకు
చిహ్నం - విముక్తికి సూచన. కానీ అది పరిణామము చెందు అవకాశము
లేని స్థితిలో చిక్కివుంది. మన మనసులకు మాయని మసి - కసి. తోందర. ఇప్పుడే అన్నీ అయిపోవాలి.
భద్రతా
పంజరం
రెండవ చరణం:
పంచసాయకుని
పుష్పబాణమాన = మనధుని పుష్పబాణము వంటి
భావము:
ఈ చరణంలో అన్నమాచార్యులు — ఆత్మ యొక్క అశాంత స్థితిని మరింత లోతుగా, శక్తివంతంగా, హృదయాన్ని తాకే ఉపమానాల ద్వారా చిత్రిస్తున్నారు.
పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక: ఆమె మన్మథుని పుష్పబాణమే — సున్నితమైనది, ఆకర్షణీయమైనది, కానీ అచిరమైనది. అయితే ఇక్కడ ఈ "పుష్పబాణం" అనేది ప్రేమకు చిహ్నం కాదు; అది ఇంద్రియల మాయలో బందీ. అన్నమయ్య ఈ చిహ్నాన్ని తిప్పి చూపిస్తున్నారు - ఇది కేవలం కోరిక కాదు, ప్రకృతి వేసిన వలలో పడ్డామనటానికి సంకేతం.
మంచముపై బవ్వళించి మాటలాడదు: ఆమె మంచంపై నిశ్చలంగా పడుకొని, మాటలాడదు. ఆ బాణం ప్రయాణించ గలిగి కూడా ఇప్పుడు అచేతనము. అందంతోనూ నిండినప్పటికీ, అది సంకెళ్లలో చిక్కుకొని, మాటలే లేని స్థితిలో ఉండిపోతుంది. మదిలో వెలుగు లేక తికమక పడే మౌనం. ఆత్మలోని కలవరమును చెప్పజాలని భావము. భావముల కందని భాష.
నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి: రెప్పలు నిద్రకు ఒరుగుతున్నాయి - నిద్ర రాకున్నా, నిద్రించాలనే తపన. ఈ రెప్పల కదలికలు లోపలి తపనకు సంకేతం. మౌనములోనే అంతర్యుద్ధం. ప్రశాంతత లేని నిర్లిప్తత. నిద్రపోవాలనుకుంటోంది. శాంతి కావానుకుంటోంది. కానీ తత్తఱపాటు నుండి తప్పించుకోలేకపోతోంది.
వంచిన
రెప్పలవెంట వడిసీఁ గన్నీరు: ఈ పాదం ఒక్కసారిగా ఒక విస్ఫోటంలా విచ్చుకొంటుంది.
రెప్పలు కాస్త తెరచిన వేళ - పూర్తిగా కన్ను తెరిచీతెరవక మునుపే -సత్యం లోపలికి ఇంకిపోతుంది.
జీవితం పట్ల మనం తమో గుణములో ఉన్నామన్న నిజం, ఆనందానికి
బదులు పట్ల మౌఢ్యంలో మునిగిపోయామన్న బాధ స్పష్టమవుతుంది. ఆ మెలకువకే ఆ కన్నీళ్లు. అది
కేవలం దుఃఖం కాదు. అది పోగొట్టుకున్న సమయానికి చెల్లించాల్సిన మూల్యం. అది మెలకువ తీసుకొచ్చే
రోదన.
వ్యాఖ్యానము మరియు పోలికలు:
ఈ పద్యం గీతా శ్లోకం 11.33 ("నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్")తో సారూప్యాన్ని కలిగి ఉంది. ప్రకృతి-ధర్మం ముందే నడుస్తోంది - కానీ ఆ తత్వానికి సేవచేసేందుకు ఆత్మ సిద్ధమవ్వాలి.
ఈ చరణంలో ఉన్న యువతి - అర్జునుడిలాగే - కోరికలతో, కలవరంతో చిక్కుకుపోయినవారికి ప్రతిరూపం. ఆమె రెప్పల తళతళలు, కన్నీళ్లు — వీటిని బలహీనతగా చూడకూడదు. ఆమె మేళము చేయని, శృతి పరచని సంగీత వాద్యం. ఆమె మన్మథబాణమైనా — ప్రేమకు, దయకు నీడనిచ్చే సాధనాన్నని తెలుసుకోలేని చెరలో బందీగా ఉంది.
ఇంత మనో వ్యథ, కలవరము లేకుండా ఆమె మాయలోంచి బయట పడలేదు. కోరికలను దాటి, ఓ మహత్తర ప్రయోజనం దిశగా అమెను నడిపిస్తుంది. అర్జునుడు తన దుఃఖాన్ని అధిగమించినట్టు, ఆమె కూడా తన స్థితిని తెలుసుకొని మేలుకొవల్సిందే.
కాబట్టి, ఈ చరణం
దుఃఖాన్ని కాదు - మార్పుకు ఆరంభాన్ని వ్యక్తం
చేస్తుంది. అది ఒక ఆత్మ పరమ సత్యాన్ని సేవించేందుకు సిద్ధమవుతున్న ఘడియ.
జిడ్డు
కృష్ణమూర్తి తన సోదరుడు నిత్య మరణించినప్పుడు అపారమైన దుఃఖంలో మునిగిపోతాడు.
దాదాపు పది రోజులపాటు అదుపు తప్పిన కన్నీళ్లలోనే గడుపుతాడు. ఆ బాధనుంచి బయటపడిన
తర్వాత ఆయన పలికిన మాటలు విచిత్రంగా, కానీ లోతుగా అనిపిస్తాయి — “నాకు
ఏడవడం తెలుసు, అది మానవుల చిహ్నం. ఇప్పుడు నాకు మరింత
స్పష్టంగా తెలిసింది — జీవితంలో నిజమైన అందం ఉందని, నిజమైన
ఆనందం ఉన్నదని...” ఈ మాటలు అన్నమాచార్యుల రెండవ చరణానికి
బాగా నప్పేలా అనిపిస్తాయి.
మూడవ చరణం:
భావము:
వెన్నెలల వేంకటాద్రి విభుని
లేనవ్వులాన /
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను:
వ్యాఖ్యానము:
ఈ చరణంలో అన్నమాచార్యులు ఒక అద్భుతమైన ఆత్మీయ పరివర్తనను, అలౌకిక పరవశాన్ని వ్యక్తీకరిస్తారు - అంతర్గత యాత్రకు ఇది సమాప్తి బిందువు.
ఈ నిరీక్షణ సామాన్యమైనది కాదు. ఇది పరమార్పణ స్థితి. ప్రశ్నలు లేవు. ప్రతిఫలాల కోరిక లేదు. ఏమౌతుందో తెలియదు.
మిల్టన్ చెప్పినట్టు —
అతని వెంబడి మౌనంగా నిలబడి వేచి ఉన్నవారు కూడా సేవ చేస్తున్నట్లే.
-జాన్ మిల్టన్ (“They also
serve who only stand and wait.”)
దీని సారాంశం ఏమిటంటే — క్రియలతో కాక, సమర్పణతో నిండిన మౌనతలోనూ భక్తి తళుకుతుంది.
ఆ మౌనమే
సాధన. ఆత్మ తన వ్యక్తిత్వాన్ని విడిచిన చోటే, దైవికమైన ఆనుభవంతో నిండిపోతుంది..
-X-X- సమాప్తం -X-X-