తాళ్లపాక
అన్నమాచార్యులు
304 తగు మునులు ఋషులు
తపములు సేయఁ
For English version press here
ఉపోద్ఘాతము
అన్నమాచార్యులు అపరిష్కృతంగా మానవుని అసలు
సమస్యను మన ముందుంచి పరీక్షించమంటారు. మనమంతా తడబడేది అక్కడే. అదే సంసార వృక్షము యొక్క నైజము. ఏమి చేసినా పెరుగుతూనే ఉంటుంది ఈ
సంసార వృక్షము. ఇదే గమనించవలసిన ప్రధాన విషయం. సంసార వృక్షమును ఏ రకముగా
స్పృశించినా సమస్య మరింత తీవ్రమగును. ఈ అస్పృశ్య, అచింత్య
సంసార వృక్షమునకు ఏదైనా ఉపాయం వెదకుటే సమస్య యొక్క కొనసాగింపని అన్నమాచార్యులు
స్పష్టంగా చెబుతారు.
ఇది బోధ కాదు.
ఇది ఆశ్వాసము కాదు.
తప్పించుకోలేని
స్థితిలో ఉన్న మన అసలు పరిస్థితిని
ప్రతిబింబించే
ప్రవేశిక మాత్రమే.
ఈ కీర్తనలో
అన్నమాచార్యులు పరిష్కారమును చూపుటకు యత్నించరు. సంసార వృక్షము ఎలా పెరుగుతున్నదో, ఏ
మూలమునుంచి దాని జీవశక్తి వస్తున్నదో గమనించమని మాత్రమే మనల్ని నిలిపివేస్తారు. చూడకుండా
గమనించుట సాధ్యమా? అసాధ్యము. ఈ అసాధ్యతనే ఆయన మన ముందుంచారు.
ఏమీ పాలుపోని
ఆ స్థితిలో, అటునిటు
కదలక ఉండుటయే ధ్యానం. తక్కినవన్నీ కదలికలే. సన్యాసము, తపస్సు, పుణ్యకర్మలు—చివరకు మునిత్వము, ఋషిత్వము —ఈ
వృక్షములోని చలనాలే. అవి మూలాన్ని తాకలేవు.
ఏమీ చేయక
ఉండుటయే మానవుని కర్తవ్యం. అక్కడే మన నియంత్రణ తప్పుతుంది. “సమాధానము
కొరకు ఎదురు చూడకుండా సమస్యలో నిలబడగలవా?” అన్న జిడ్డు
కృష్ణమూర్తి మాటల అంతరార్థమూ ఇదే.
కావున ఈ
కీర్తన భక్తిని పెంపొందించుటకు కాదు; చర్యకు
ప్రేరేపించుటకూ కాదు. సంసార వృక్షమును ఉన్నది ఉన్నట్లుగా చూడమని మాత్రమే మనల్ని
నిలిపివేస్తుంది. ఇక్కడ “చూచుట”
అనేది చర్య కాదు. అది సమస్యను పరిష్కరించాలనే కదలిక కూడా కాదు; కదలకుండానే
వెలిగే స్పష్టత.
చూడటమే ఇక్కడ అంతిమ విషయం. అంతే!
|
అధ్యాత్మ సంకీర్తన
|
|
రేకు: 255-2 సంపుటము: 3-315
|
|
తగు మునులు ఋషులు తపములు సేయఁ గగగనము మోచియుఁ గర్మము దెగదా ॥పల్లవి॥ ధరణీధర మందరధర నగధర చిరకౌస్తుభధర శ్రీధరాకరిఁగాచితి కాకముఁ గాచితి నీ- కరుణకుఁ బాత్రము గలదిదియా ॥తగు॥ భవహర మురహర భక్తపాపహర భువనభారహర పురహరా కవిసిన వురుతను గద్దను మెచ్చితి- వివల నీదయకు నివియా గురుతు ॥తగు॥ శ్రీవేంకటపతి శేషగరుడపతి భూవనితాపతి భూతపతి గోవుల నేలితి కోఁతుల నేలితి పావనపుఁ గృపకుఁ బాత్రము లివియా ॥తగు॥
|
Details and Explanations:
పల్లవి
తగు
మునులు ఋషులు తపములు సేయఁ
గగగనము
మోచియుఁ గర్మము దెగదా ॥పల్లవి॥
|
Telugu
Phrase
|
Meaning
|
|
తగు మునులు ఋషులు తపములు సేయఁ
|
యోగ్యత, పాత్రత వుండీ
తపసాదులు చేసినా మునులు ఋషులు
|
|
గగగనము మోచియుఁ గర్మము దెగదా
|
విశ్వప్రయత్నము
చేసినా కూడా కర్మపు తాళ్ళను తెంచుకొనలేక పోయిరి
|
సూటి భావము:
యోగ్యత, పాత్రత వుండీ తపసాదులు చేసినా మునులును
ఋషులును విశ్వప్రయత్నము చేసినా కూడా కర్మపు తాళ్ళను తెంచుకొనలేక పోయిరి. (ఎంత తపస్సు చేసినా, ఎంత ఎత్తుకు ఎదిగినా — కర్మ బంధం
తొలగదు).
గూఢార్థవివరణము:
గగగనము మోచియుఁ గర్మము దెగదా
సమర్థత, పాత్రత కలిగిన మునులును ఋషులును
ప్రయత్నము చేసినా కూడా కర్మపు తాళ్ళను ఏల తెంచుకొనలేక పోయిరో ఆలోచించుదుము.
కోరికయనెడి రెండంచుల కత్తి, చేయుట అను ప్రయత్నముతో ఒక ప్రక్క,
విరమించుట అను అప్రయత్నముతో రెండవ ప్రక్కకు సంసార వృక్షమును వృద్ధి చేయును.
చేయుట అను ప్రయత్నములోనూ, విరమించుట అను అప్రయత్నములోనూ ఒకే
విషయం స్పష్టమగుచున్నది. ఆ రెండింటినీ నిర్ణయించునది మన ఇప్పటి సామర్థ్యముపై ఉన్న
నమ్మకమే. ఆ సామర్థ్యం పనిచేయుచున్నంతవరకు, మనలో ఉన్న
మూలసత్యమును మనం చూడలేము.
ఎంతటి మహానుభావులైనను, తమకు ఉన్న శక్తిపై
విశ్వాసముంచి సాగుదురు గాని, ఆ శక్తి పనిచేయని స్థితిని స్వయంగా అంగీకరించి, ఆ ప్రయత్నమునుండి విడివడి తమకు తాముగా నిలుచుట అరుదు. అందుచేతనే భగవద్గీత13–32లో చెప్పబడినట్లుగా సత్యము శరీరములో యుండియును కర్తకాక, జీవుని కర్మలందు అంటక నిలిచి వుండును. మానవ ప్రయత్నానికి అందనిదిగా నిలుచుచున్నది.
మొదటి చరణం:
ధరణీధర మందరధర నగధర
చిరకౌస్తుభధర
శ్రీధరాకరిఁగాచితి కాకముఁ గాచితి నీ-
కరుణకుఁ బాత్రము గలదిదియా ॥తగు॥
|
Telugu Phrase
|
Meaning
|
|
ధరణీధర
మందరధర నగధర
|
భూమిని ధరించినవాడా
మందరగిరిని ఎత్తినవాడా పర్వతాలను మోసినవాడా
|
|
చిరకౌస్తుభధర
|
శాశ్వతముగా కౌస్తుభమణిని
ధరించినవాడా
|
|
శ్రీధరాకరిఁగాచితి
కాకముఁ గాచితి నీ-
|
శ్రీధరా మదమెక్కి
వనమున సంచరించిన గజేంద్రుని (ఏనుగు)ను రక్షించినవాడా! శిక్షకు పాత్రుడైన కాకిని (కాకాసురుని) రక్షించినవాడా
|
|
కరుణకుఁ
బాత్రము గలదిదియా ॥తగు॥
|
నీ కరుణకుఁ పాత్రము ఇదియని (మానవులు) నిర్ణయింపలేరు
|
సూటి భావము:
భూమిని
ధరించినవాడా మందరగిరిని ఎత్తినవాడా పర్వతాలను మోసినవాడా! శాశ్వతముగా కౌస్తుభమణిని ధరించినవాడా!
శ్రీధరా! మదమెక్కి వనమున సంచరించిన గజేంద్రుని (ఏనుగు)ను రక్షించినవాడా! శిక్షకు పాత్రుడైన కాకిని (కాకాసురుని) రక్షించినవాడా!
నీ కరుణకుఁ పాత్రము ఇదియని (మానవులు) నిర్ణయింపలేరు.
గూఢార్థవివరణము:
అన్నమాచార్యుల
వారు అనేకవిధములుగా భగవంతుని కృపకు పాత్రులగుటకు
మనము చేయు ప్రయత్నములు, ప్రార్ధనలు నిర్ణయింపరానివని సూటిగా
చెబుతున్నారు. ఇందులో ముఖ్యముగా, కాని పనులకు పూనుకొన్నవారికి
లభించిన రక్షణ అర్హులైన మునులకు దక్కపోవుటతో కలిపిచూడవలెను.
కావున
ప్రయత్నము కాదు, లోని చైతన్యము కాని పనులకు,
పుణ్యములకు (ప్రార్ధనలు వగైరా వగైరా) నిరంతరముగా ఉవ్విళ్ళూరుతూ చేతులు
చాపు మనోరధమును చూడమంటున్నారు. భగవంతుని కరుణను కూడా అర్హత–అనర్హతల పట్టికతో
కొలిచే అహంకారమును ఆయన ఇక్కడ ఎత్తి చూపుతున్నారు. ఆయన కరుణలేని వారు జీవించి
యుండగలరా? ఇక్కడ “తగు” అన్న అర్హతా భావమే పూర్తిగా ఉపసంహరింపబడినది.
రెండవ చరణం:
భవహర మురహర భక్తపాపహర
భువనభారహర పురహరా
కవిసిన వురుతను గద్దను మెచ్చితి-
వివల నీదయకు నివియా గురుతు ॥తగు॥
|
Telugu Phrase
|
Meaning
|
|
భవహర మురహర
భక్తపాపహర
|
భవహర మురహర భక్తపాపహర
|
|
భువనభారహర
పురహరా
|
లోకభారమును మోసేవాడా!
|
|
కవిసిన వురుతను గద్దను మెచ్చితి-
|
సుకుమారమైన ఉడుతను, బలమైన గద్దను (జటాయువును)
మెచ్చితివి
|
|
వివల నీదయకు
నివియా గురుతు
|
ఈ లోకములో, నీ కరుణకు గుర్తులు ఇవియని (మానవులు) నిర్ణయింపలేరు
|
సూటి భావము:
సంసారాన్ని
తొలగించువాడా, భక్తుల పాపములను కడిగేవాడా,
లోకభారమును మోసేవాడా!
అయినా సుకుమారమైన ఉడుతను, బలమైన గద్దను
(జటాయువును) సమానముగా మెచ్చితివి. ఈ లోకములో, నీ కరుణకు గుర్తులు
ఇవియని (మానవులు) నిర్ణయింపలేరు?
గూఢార్థవివరణము:
మొదట అన్నమాచార్యులు “భవహర, మురహర, భక్తపాపహర” అంటూ మనకు అలవాటైన దేవుణ్ణి నిలబెడతారు
—సమస్యలను తొలగించే దేవుడు, పాపాలను కడిగే దేవుడు. ఇది మన ఆశల
దేవుడు. అకస్మాత్తుగా దృష్టి మారుతుంది. సుకుమారమైన ఉడుత —చిన్నది, బలహీనమైనది. చేయగలిగింది చాలా స్వల్పం. బలమైన గద్ద —వీరుడు, శక్తిమంతుడు, ప్రాణం పెట్టి పోరాడినవాడు. ఇద్దరిలోనూ
ఫలితం ఒకటి కాదు. కానీ ఇద్దరిలోనూ దేవుని స్పందన ఒకటే —మెచ్చుకొనుట.
ఇక్కడ అన్నమాచార్యులు “ఎక్కువ చేసినవాడికే విలువ” అన్న లెక్క మూల భావాన్ని మన
ముందుంచి నిలిపి ప్రశ్నిస్తున్నారు. నిజాయితీతో నిలబడడమే గొప్ప. కరుణకు ప్రమాణం చిన్నా,
పెద్దా, విజయమూ కాదు. “తగు” అన్న అర్హతా భావము
పనిచేయదు.
మూడవ చరణం:
శ్రీవేంకటపతి శేషగరుడపతి
భూవనితాపతి భూతపతి
గోవుల నేలితి కోఁతుల నేలితి
పావనపుఁ గృపకుఁ బాత్రము లివియా ॥తగు॥
|
Telugu Phrase
|
Meaning
|
|
శ్రీవేంకటపతి
శేషగరుడపతి
|
శ్రీవేంకటపతి శేషగరుడపతి
|
|
భూవనితాపతి
భూతపతి
|
భూవనితాపతి భూతపతి
|
|
గోవుల నేలితి కోఁతుల నేలితి
|
గోవుల నేలితి కోఁతుల నేలితి
|
|
పావనపుఁ
గృపకుఁ బాత్రము లివియా
|
పావనపుఁ గృపకుఁ బాత్రము లివియా
|
సూటి భావము:
శ్రీవేంకటపతి శేషగరుడపతి భూవనితాపతి భూతపతి, గోవుల నేలితి కోఁతుల నేలితివి పావనపుఁ గృపకుఁ బాత్రము లివియా?
గూఢార్థవివరణము:
అన్నమాచార్యులు ఈ చరణంలో పక్షులు, చిన్న–పెద్ద జంతువులు అన్న భేదము లేకుండా దృష్టి నిలిపారు. దైవమునకు అర్హత,
అధికారం, స్థాయి అనే లెక్కలు లేవన్న విషయమే ఇక్కడ
వెలుగులోనికి వస్తుంది.
ఈ సర్వ సమానత్వాన్ని మనసారా అంగీకరించలేకపోవడమే మానవుని
స్థితి. దేవుణ్ణి కూడా మన వర్గీకరణలతో, యజమానిత్వ భావంతో కొలవాలనుకునే అలవాటు
అదే.
అందుకే అన్నమాచార్యులు సాధారణ
మానవులను కాదు, ఆనాటి సమాజంలో శిఖరస్థానంలో ఉన్న “తగు
మునులు ఋషులు”ని సూచించారు. వారు కూడా, “చేయుట” అను ఊబిలోనే నిలిచినపుడు,
ఈ సమానత్వాన్ని చూడలేని స్థితినే ఆయన ఇక్కడ మన ముందుంచారు.
X-X-The
END-X-X
No comments:
Post a Comment