తాళ్ళపాక అన్నమాచార్యులు
267 అనాది జీవుఁ డన్నియుఁ గన్నవే
For English version press here
ఉపోద్ఘాతము
నిరంతర అవగాహన
అన్నమాచార్యులవారి ఏ ఒక్క కీర్తననైనా మనం నిజంగా వింటే — మొదట నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆయన మనల్ని సంప్రదాయానికి అనుగుణంగా నడవమని కోరరు. మన చూపు శతాబ్దాలుగా, ప్రతికూలమో అనుకూలమో అయిన అనుకరణకే అలవాటు పడిపోయింది. ఈ ఆట యుగయుగాలుగా సాగుతోంది. అన్నమాచార్యులు దానిని విచ్ఛిన్నం చేయాలనుకున్నారు. అందుకే సహజమైన ప్రతిస్పందన — ఆయనకు వ్యతిరేకతయే.
ఆయన కీర్తనలు శతాబ్దాల పాటు తొక్కివేయబడినా, ఇప్పటికీ అనేకుల మనసులను కదిలిస్తూనే ఉన్నాయి. సంప్రదాయపు వెన్ను విరిచిన ఈ మహనీయుడు దేవునికి వ్యతిరేకుడు కాడు — దైవమును చేరుకునే పద్ధతులనే ఆయన ప్రశ్నించాడు.
ఈ కీర్తనలో చెప్పిన వాస్తవాలను గమనించడం ప్రారంభిస్తే, మనకు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది — సంప్రదాయం మనలోని తాజాదనాన్ని, కొత్తదనాన్ని దోచుకుందని. సంప్రదాయం అంటే ఏమిటి? అది సమాజం, చరిత్ర, భాష, భౌగోళిక పరిస్థితులు, మరియు “వివేకం లేకుండానే అంగీకరించే మనసు” — వీటన్నింటి కదలిక మాత్రమే.
ఒకసారి మనిషి దీనిని గుర్తిస్తే, అందులో భాగమవడం మానేస్తాడు.
అతడే స్వేచ్ఛగా నడవగలడు — అదే నిరంతర అవగాహనను మేల్కొల్పడం..
అధ్యాత్మ కీర్తన |
రేకు: 302-4 సంపుటము: 4-10 |
అనాది జీవుఁ డన్నియుఁ గన్నవే వినోదమిందలి విరతే వలయు ॥పల్లవి॥ వెలిఁ దోఁచిన యీ విశ్వంబెల్లా కలసిన మనోగతములివి పలు విషయేంద్రియ భావములెల్లా వెలయుఁదా ననుభవించినవే ॥అనా॥ సహజపు వర్ణాశ్రమము లివెల్లా యిహమునఁ దాధరియించినవే బహువేదశాస్త్రపఠన లివెల్లా వహి కెక్కఁగఁదా వచియించినవే ॥అనా॥ దినదిన సంసార తిమిరం బెల్లా ఘనముగఁ దను మున్ను గప్పినవే అనయము శ్రీవేంకటాధిపుఁ డాత్మకు ననిచి తొల్లి కల నాయకుఁడే ॥అనా॥
|
Details
and Explanations:
పదబంధం
|
అర్థం
|
అనాది జీవుఁ డన్నియుఁ గన్నవే
|
శరీరంలోని జీవుడు సమస్తమును చూచివున్నాడు.
|
వినోదమిందలి విరతే వలయు
|
ఇంద్రియ వినోదాలనుంచి విరతి చెందినప్పుడు మాత్రమే నిజమైన ఆనందం
లభిస్తుంది.
|
సూటి భావము:
ఈ శరీరంలో
బంధింపబడిన జీవి ఇప్పటికే సమస్త అనుభవాల ఎరుక గలిగివున్నాడు. కానీ నిజమైన ఆనందం అతడు
ఈ భౌతిక వినోదాల నుండి దూరమయ్యె విరతిలోనే బయటపడుతుంది.
గూఢార్థవివరణము:
ఇక్కడ అన్నమాచార్యులు
లోతైన అంతరజ్ఞాన స్థితి నుండి మాటలాడుతున్నారు. ఇది పారంపరంగా ప్రామాణికంగా వస్తున్న
గ్రంథ శాస్త్రబద్ధతల మీద ఆధారపడి వచ్చినది కాదు; నేరుగా జీవజ్ఞానానుభూతి
నుండి ఉద్భవించింది.
వినోదమిందలి విరతే వలయు: కవిలో వ్యంగ్యం ఉంది: “ఆనందం కావాలా? అయితే ఇప్పుడు నీవనుభవిస్తున్న వినోదం విడువాలి!”
“వినోదాన్ని విడువక అసలు వినోదం లేదు.” మనం ఆరాటాన్ని వదలనంతవరకు ఆనందం తాత్కాలికం మాత్రమే — కాసేపు సంతోషం, కాసేపు బాధ, కాసేపు మమకారం, కాసేపు నిరాశ. సమాచారం, సంఘటనల తాకుళ్ళతో మనసు నిరంతరం మార్పులలో చిక్కుకొని పోతుంది.
ఈ హాస్యం
వెనుక దాగిన కఠోర సత్యం ఈ పల్లవి చూపిస్తుంది: ఈ చక్రంనుండి బయటకు వచ్చి లోనికి తిరిగినప్పుడే
శాశ్వతానందం ప్రత్యక్షమౌతుంది.
సాల్వడోర్
Dali చిత్రంతో పోలిక
సాల్వడోర్
Dali వేసిన Figure with Drawers for a
Four-part Screen (1934) అనే
చిత్రంతో ఈ పల్లవిని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు.
డ్రాయర్లు — జ్ఞాపకాల నిధులు: ఆ శరీరరూపం లోపల దాచుకున్న అనేక రహస్యాలు, జ్ఞాపకాలు, అనుభవాలు — ఇవన్నీ సొరుగుల (డ్రాయర్ల) రూపంలో చూపబడ్డాయి. అవి బయట కనిపించవు. లోలోపలే దాగి ఉన్నాయి.
వాటిలో ప్రవేశించుటకు మన ప్రస్తుత దృష్టితో సాధ్యం కాదు. ఎందుకంటే సొరుగులు లోపల వున్నాయి. కానీ మన దృష్టి ఎప్పుడూ లోపలి నుండి బయటకు ఉంటుంది. దానితో మనము వాటిని స్పృశించలేక పోతాం. అంటే డ్రాయర్లు తెరవాడానికి దృష్టి బయట నుండి లోపలికి మారాలి. అయితే ఈ మార్పు ఎలా జరుగుతుంది?
“ఇతరుల డ్రాయర్లు చూసి ప్రయోజనం లేదు. ప్రతి మనిషి తన లోపల దాగి ఉన్న సొరుగులను తానే తెరవాలి.” దీనిని మానవుడు స్వయంగా సాధించలేడు. కానీ అతడు లోపలి నుండి బయటకు దృష్టి ఆపి మౌనంగా నిలబడగలిగితే చాలు.
అధివాస్తవిక
వ్యంగ్యం → ఆధ్యాత్మిక సత్యం
దాలీ రూపం
చెబుతున్నది: సంపూర్ణత బాహ్యరూపంలో లేనే లేదు, అసలు విషయమంతా
లోలోపలే దాగి ఉంది.
“అన్నమాచార్యుల దృష్టిలోనూ జీవితం బాహ్య వినోదంలో లేదు; అది మనలోపల, నిశ్శబ్ద సమర్పణలో వికసిస్తుంది.”
మొదటి చరణం:
తెలుగు పదబంధం
|
భావము
|
వెలిఁ
దోఁచిన యీ విశ్వంబెల్లా
|
మనం అనుభవమునకు వచ్చు విశ్వం మొత్తమూ
|
కలసిన
మనోగతములివి
|
గతంలో రికార్డ్ అయిన (మనసున ఉల్లేఖితమైన) అనుభవాలు, జ్ఞాపకాలు, భావాల మేళవింపు
|
పలు విషయేంద్రియ
భావములెల్లా
|
మన ఇంద్రియాలు అందించిన అనేక భావజాలం
|
వెలయుఁదా ననుభవించినవే
|
ఇవన్నీ గతానుభవాల నుండి సేకరణ మాత్రమే
|
భావము:
“మానవుడా! నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న విశ్వం అంతా నిజానికి నీ గతస్మృతుల,
అనుభవాల మిశ్రమమే (నీవు వర్తమానము అనుకుంటున్నది నిజానికి ఉల్లేఖిచబడిన
గత స్మృతులే). నీకు అనుభవమునకు వచ్చినది నీవే ఏర్పరచుకున్న బంధముల ఫలమే..
గూఢార్థవివరణము:
అన్నమాచార్యులు
ఇక్కడ ఒక అత్యంత లోతైన మానసిక సత్యం చెప్పారు. మనం అనుకుంటున్న వర్తమానం కూడా వాస్తవానికి
వర్తమానం కాదు. అది గతానుభవాల పొడిగింపే. పాత అనుభవాల ఆధారంగానే మనం కొత్త అనుభవాలకు
వంతెన కట్టుతాం. దాంతో మనం ఎప్పుడూ గతపు బంధనంలోనే జీవిస్తున్నాము.
ఈ ఆలోచనకుపైన ఇచ్చిన Dr. Joe Dispenza యొక్క డయాగ్రామ్ మరింత స్పష్టత ఇస్తుంది.
ఎక్కడ మన దృష్టి ఉంటే, అక్కడే మన శక్తి వెళ్తుంది. ఖర్చవుతుంది.
మనం గతంలోని జ్ఞాపకాలు, భావాల మీద దృష్టి పెట్టినప్పుడు, ఆ క్షణమే మన శక్తి వర్తమానం నుంచి తోడబడి(సైఫన్ అయి) గతంలోకి జారుకుంటుంది.
అదే విధంగా, భవిష్యత్తులో జరగబోయే పనులు, కలవబోయే వ్యక్తులు, చేయాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించినప్పుడు, మన శక్తి మళ్లీ వర్తమానం నుంచి తోడబడి(సైఫన్ అయి) ఊహించిన భవిష్యత్తులోకి పరుగెడుతుంది.
దీంతో పై
బొమ్మలో చూపిన మాదిరిగా మనం ఎప్పుడూ వర్తమానంలో ఉండము. గతం లేదా భవిష్యత్తుల్లోనే విహరిస్తూ
శక్తిని వృథా చేస్తూ ఉంటాము.
అన్నమాచార్యుని
సత్యం ↔ Joe
Dispenza డయాగ్రామ్:
అన్నమాచార్యులు → “మనమిప్పుడు అనుభవిస్తున్న విశ్వం అంతా గతపు మానసిక గాథలే” అన్నారు.
Dispenza → “మీ శక్తి వర్తమానం నుండి తోడబడి (సైఫన్ అయి) గతములోకో భవిష్యత్తులోకో జారిపోతుంది” అన్నారు.
ఇద్దరూ ఒకే విషయాన్ని వేర్వేరు భాషల్లో చెబుతున్నారు.
జిడ్డు
కృష్ణమూర్తి దృష్టిలో:
కృష్ణమూర్తి
పదే పదే ఇలా చెప్పారు: “మొత్తం శక్తిని ఒక్క క్షణంలోనికి, ఒక్క విషయంపైకి తీసుకురాగలిగితే — కళ్ళతో, హృదయంతో,
మనస్సుతో సంపూర్ణ దృష్టితో చూచినప్పుడు — నువ్వు ప్రేమ ఏమిటో,
మరణం ఏమిటో, జీవించడం ఏమిటో తెలుసుకుంటావు.” అంటే,
శక్తి గతం, భవిష్యత్తులోకి చెల్లాచెదురుగాకుండా,
వర్తమానం అనే ఒక్క క్షణంలో కేంద్రీకరించబడాలి. ఇదే అన్నమాచార్యుని మొదటి
చరణం అసలు రహస్యం.
Telugu
Phrase
|
Meaning
|
సహజపు
వర్ణాశ్రమము లివెల్లా
|
జీవనంలోని
సహజ దశలు అన్నీ
|
యిహమునఁ
దాధరియించినవే
|
నీవు ఈ భూమిలో ఎన్నోసార్లు అనుభవించావు
|
బహువేదశాస్త్రపఠన
లివెల్లా
|
ఎన్నోమార్లు
వేదాలు, శాస్త్రాలు చదివావు, పారాయణం చేశావు
|
వహి కెక్కఁగఁదా
వచియించినవే
|
లెక్కకు
మిక్కిలిగా చేశావే ఆ పారాయణములు
|
సూటి భావము:
ఓ
మానవుడా! నీవు ఈ భౌతిక లోకంలో ఎన్నోసార్లు వర్ణాశ్రమ ధర్మాలలో పాలుపంచుకున్నావు.
వేదాద్యయనం చేశావు. శాస్త్రాలు చదివావు. ఈ కర్మకాండలు,
పఠనాలు నీకు కొత్తవి కావు. లెక్కకు మిక్కిలిగా
చేశావే ఆ పారాయణములు (ఐనా నీవు మారలేదు. ఈ లోకంలోనే తిరుగుతున్నావు. )
గూఢార్థవివరణము:
మొదటి చరణంలో
మనం ప్రస్తుతంలో జీవించకుండా, భూత కాలపు స్మృతులతోనో; భవిష్యత్తు కాలపు ఊహలతోనో' పరిగెత్తడం గురించి ప్రస్తావించారు.
అన్నమాచార్యులు చెబుతున్నారు. అక్కడి నుండి తార్కికంగా ముందుకు తీసుకెళ్తూ,
“నీవు గతంలోనూ ఇదే చేసావు, మళ్లీ అదే చేయడంలో కొత్త
ఏముంది. ” అని రెండవ చరణంలో ప్రశ్నిస్తున్నారు.
“యిహమునఁ దాధరియించినవే” అన్న మాట అన్నమాచార్యుడి
లోతైన పరిశీలనకు సంకేతం. ఇది నిస్పృహా భావం కాదు, వాస్తవాన్ని
సూచించడం.ఈ విధంగా ఆయన ప్రధానంగా చూపిస్తున్నది వేదపఠనం, వర్ణాశ్రమ
జీవనం—all these are occupations only. అవి మనసును దేవుని వైపు
నడిపించవు. కాబట్టి కొత్తగా ఆ తెలియలేని దైవం
వైపు తడబడుతున్నా తప్పైనా సరే, ఆ వైపు అడుగులు పడితే కింద కదా అసలంటూ మొదలయ్యేది- అసలైన ప్రయాణం. నేరుగా దేవుని
శరణు పొందడంలోనే కొత్తదనం ఉంది.
Telugu
Phrase
|
Meaning |
దినదిన
సంసార తిమిరం బెల్లా
|
ప్రతిరోజు
పునరావృతమవుతున్న సంసారమనే చీకటి అంతా
|
ఘనముగఁ
దను మున్ను గప్పినవే
|
దట్టముగా
ముందటి కాలమంతా నిన్ను కప్పివుంచలేదా?
|
అనయము
శ్రీవేంకటాధిపుఁ డాత్మకు
|
చిరకాలముగా శ్రీవేంకటాధిపుడు ఆత్మకు
|
ననిచి
తొల్లి కల నాయకుఁడే
|
ఆ అనాది
నుంచి శ్రీ వెంకటాధిపుడు ఒకడే ఇష్టమైన నాయకుడు
|
సూటి భావము:
మొదటి రెండు చరణాల్లో అన్నమాచార్యులు మనిషి గతం–భవిష్యత్తుల ఊహల్లో చిక్కుకొని, ప్రస్తుతాన్ని కోల్పోతున్న స్థితిని వివరించారు. ఇప్పుడు ఆలోచన సహజంగా మూడవ చరణంలోకి ప్రవహిస్తుంది. అన్నమాచార్యులవారు తనను తాను పోల్చుకోలేక అక్కడున్న దేహిని చూచి “అయితే ఇప్పటివరకు ఈ దేహి ఎక్కడ ఉన్నాడో?”—“అయ్యో ఈ దేహియే కదా ముందటి కాలమంతా గాఢమైన చీకటిలో మునిగి ఉన్నది” ఈ వాక్యాలు నిస్పృహలో కాదు — అవగాహనలో పుట్టిన ఆశ్చర్యం. ఇది ఒక మేల్కొలుపు క్షణం.
తనను కప్పుకున్న
ఆ చీకటిని గుర్తించిన వెంటనే ఆయన గమనిస్తారు: ఆత్మలో ఎప్పటినుంచో సుస్థిరంగా ఉన్న
ఏకైక నాయకుడు — శ్రీ వెంకటేశ్వరుడే. ఈ జ్ఞానం వచ్చినప్పుడు “ఆయన తనను నడిపిస్తున్నాడు”
అనేది కేవలం సిస్శ్వాసం కాదు — ప్రత్యక్ష అనుభవం.
గూఢార్థవివరణము:
ముఖ్యంగా గమనించవలసిన విషయం అన్నమాచార్యులు గారు ఆ క్షణంలో ఒక వైపు చీకటి, ఇంకోవైపు వెలుగు, వాటి సంధిలో నిలబడి ఉన్నారు. ఈ విషయం ఇంతకు ముందు ఈ విషయమై అనేకమార్లు చెప్పుకున్నాం. కానీ ఈ చరణంలో అది మరింత స్పష్టంగా కనబడుతోంది.
ఈ చరణము
కపటములేని స్వచ్ఛమైన అజరామరమైన స్థితికి అన్నమాచార్యులు చేరుకున్న వాస్తవాన్ని; అంతకు ముందు వారి సామాన్య స్థితిని చూపుతోంది. ముఖ్యంగా ఈ చరణం నుంచి మానవులందరికీ
ఆ పరమాత్మ కృప లభించునని తెలియజేస్తున్నారు. వారు చేయవలసినదంతా 'సర్వం విడిచి ఆ భగవంతుని యందు తమ సర్వస్వం అర్పించి మౌనంగా నిలబడటమే.
ఈ
కీర్తన ముఖ్య సందేశం
అన్నమాచార్యులవారు మానవుని మనసు పట్టి లాగే సంప్రదాయం అతి లోతుగా పాతుకుని
ఉన్నదని, దాని ప్రభావం గ్రహించుటయే తెలివియని స్పష్టం చేశారు
X-X-The
END-X-X
ఈ వ్యాసము చాలా బాగున్నది.అన్నమయ్య కీర్తనలో ఇంత లోతైన భావాన్ని చాలా చక్కగా వివరించారు.
ReplyDelete🙏🙏🙏🙏🙏🙏🙏🙏