Friday 5 May 2023

T-164 పాపపుణ్యముల రూపము దేహ మిది

 

అన్నమాచార్యులు

164 పాపపుణ్యముల రూపము దేహ మిది

 

for English Version press here

 

సారాంశం: "కీడో మేలో యేకాలమందేది రావలెనో యది రాకమానదు" అని తెగించి జీవనమను మహారణ్యమును దాటవలెను.

కీర్తన సారాంశం:

పల్లవి: ఇది పాపపుణ్యముల రూపమగు దేహము.  దీని చాపల్యమును అణచుటకు ఉపాయమేలేదు కదా స్వామీ?

చరణం 1: విపరీతమైన దేహభిమానము తీరినకానీ పుణ్యమును బొందలేము. మతిలోని దేహభిమానంబు విడువక అనురాగము, ఆసక్తి, సంగమములపై పెడమొగము పెట్టక ఘనత పొందలేము.

చరణం 2: హద్దుల్లేని మమకారజలధిని దాఁటిఁనఁ గాని అరుదైన నిజసౌఖ్య మది పొందరాదు. తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁ గాని  ప్రసిద్ధమగు బ్రహ్మానందపరుఁడుఁ తాను గాలేడు.

విపులాత్మక వివరణము

 

ఉపోద్ఘాతము: మునుపటి రెండు కీర్తనలకు తరువాయి భాగముగా యీ కీర్తనను  భావించవచ్చును. అన్నమాచార్యులు  "దీని దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు" (= దేహధ్యాసను అధిగమించుటకు సాధనములు లేవు) అని కష్టసాధ్యమగు యోగమును ప్రస్తావించిరి. దీనిని "తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్" (=వాయువును నియంత్రి చడమంత కష్టమైనది) అన్న గీతా వాక్యముతో పోల్చ వచ్చును.

 

 

కీర్తన:

రాగిరేకు:  4-8 సంపుటము: 1-28

పాపపుణ్యముల రూపము దేహ మిది దీని-
దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు       ॥పాప॥
 
అతిశయంబైన దేహభిమానము దీర
గతిఁగాని పుణ్యసంగతిఁ బొందరాదు
మతిలోని దేహభిమానంబు విడుచుటకు
రతి పరాఙ్ముఖుఁడు గాక రపణంబు లేదు  ॥పాప॥
 
సరిలేని మమకారజలధి దాఁటిఁనఁ గాని
అరుదైన నిజసౌఖ్య మది వొందరాదు
తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁ గాని
పరగు బ్రహ్మానందపరుఁడుఁ దాఁ గాఁడు     ॥పాప॥ 

Details and Explanations: 

పాపపుణ్యముల రూపము దేహ మిది దీని-
దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు  ॥పాప॥

 

ముఖ్య పదములకు అర్ధములు: దీపనము = ఆఁకలి, జీర్ణశక్తి (చాపల్యం లేదా తీట అనే అర్ధములోనే వాడారు); అణఁగింప = అణచుటకు; తెరువు = మార్గము, విధానము.

భావము: ఇది పాపపుణ్యముల రూపమగు దేహము.  దీని చాపల్యమును అణచుటకు ఉపాయమేలేదు కదా స్వామీ?

వివరణము: వినివినివున్న ఈపాపపుణ్యముల పేరు చెప్పి, విసుగుచెంది, మనము దీని నుంచి వైదొలగరాదు. వీటిని తెలియక వేరు దారిలేదు.   ఇంతకు ముందరి (162, 163) కీర్తనలలో దేహము (లేదా జీవి) అనునది బాహ్యము నందలి వస్తువులతోనూ, వాతావరణముతోనూ, ప్రభావితమై అవియే అంతరంగముగా రూపాంతరము చెంది; అవి కల్పించు అనుభవములు  జ్ఞాపకములుగానూ మారి ఒక చక్రవ్యూహములో బంధించునని తెలిసితిమి. ఇలా బయట నుండి లోనికి, లోని నుండి బయటకు నిరంతరము మాఱురూపులు పొందుతూ మానవుని ఆశ్చర్యములో ముంచెత్తుతూ కాలాయాపన చేయించునని సులభముగా తెలియవచ్చును. 

అంతకన్ననూ ఆశ్చర్యము కలిగించు  హిల్మా యాఫ్ క్లింట్ తనకు తానుగా తెలియని దైవీయ శక్తి నడిపించగా గీసిన  (ఇరవైనాల్గవ​) హంస చిత్రలేఖనము ద్వారా  మీకు తెలుప ఉద్యమింతును. తెలుపు హంస భౌతిక దేహమునకు, నల్ల హంస మనకు తెలియని రహస్య ప్రపంచమునకు ప్రతీకలను కోవచ్చును. దేహమును రహస్య ప్రపంచపు పెద్దరికము పట్టి యుంచుటకు గల పెనుగులాట అనేక పొరలలో వ్యాపించినట్లు (ఇరవైనాల్గవ) హంస చిత్రములో స్పష్టంగా  కనిపిస్తుంది.


 

హంసల మెలితిప్పిన మెడలు ఒకదానికొకటి ముడిపడి వాటి ముక్కుల వద్ద కలుస్తాయి. దివ్యజ్ఞాన సమాజము, వారి ఆలోచనలు యేమైనప్పటికీ, మానవునిలో పరస్పరము సంఘర్షించు మంచి చెడులను, ద్వంద్వవాదమును ఇది చక్కగా చూపుతోంది. ఎక్కడో స్వీడన్'లో ఒక మారుమూల గదిలో కూర్చుని క్లింట్ వేసిన చిత్రము అన్నమాచార్యులు అన్న పాపపుణ్యముల రూపమును, వాటి మధ్య నిరంతర పోరాటమును చక్కగా సూచించుచున్నది. 

 

అతిశయంబైన దేహభిమానము దీర
గతిఁగాని పుణ్యసంగతిఁ బొందరాదు
మతిలోని దేహభిమానంబు విడుచుటకు
రతి పరాఙ్ముఖుఁడు గాక రపణంబు లేదు         ॥పాప॥

ముఖ్య పదములకు అర్ధములు: అతిశయంబైన = విపరీతమైన; పరాఙ్ముఖుఁడు = పెడమొగము పెట్టినవాడు, రపణము = ఘనత​, గొప్పతనము.

భావము: విపరీతమైన దేహభిమానము తీరినకానీ పుణ్యమును బొందలేము. మతిలోని దేహభిమానంబు విడువక అనురాగము, ఆసక్తి, సంగమములపై పెడమొగము పెట్టక ఘనత పొందలేము.

వివరణము: ఇది మన భారతీయులందరికి దాదాపుగా తెలిసిన విషయమే. ఐనప్పటికీ కొంత వివరణ క్రింద ఇచ్చిన​ మాగ్రిట్ గారు వేసిన 'ది స్పిరిట్ ఆఫ్ జామెట్రి' సహాయముతో చెప్పదలచు కొంటిని.



పై బొమ్మలో ఒక తల్లి బిడ్దనెత్తుకున్నట్లు చూపిరి.  అయితే తల్లీ బిడ్డల ముఖములు ఒకరివొకరికి మార్చి కొంత హాస్యము పండించిరి.

తల్లీ బిడ్డల ముఖములు మార్చి ఏమి చెప్పదలచితిరో విచారింతుము. తల్లిని ప్రకృతిగా ఊహింతము. వయస్సు పెరిగిన మానవుడు పెంకి పిల్లవానివలె తల్లిపై (ప్రకృతిపై) మానసికముగా ఆధాపడి వుంటాడని, తన స్వంత అభిప్రాయములను కలిగి వుండడని చెబుతున్నారు. ఇటువంటి మానసిక రుగ్మతలు గలవారు కోకొల్లలు. 

పై చిత్రము, నిజము చెప్పాలంటే మానవుని వేధించు సమస్తమునూ పరిగణలోనికి తీసుకుంటే ఒకటి కాకపోతే ఇంకొక విషయములో  దాదాపు ప్రపంచములోని ప్రజలనందరికీ ప్రతీక అనుకోవచ్చును. మన కాళ్ళపై నిలువలేని మనము జ్ఞానము, తెలివి, చైతన్యము, ముక్తి  వంటి వాటి గురించి మాట్లాడుట హస్యాస్పదమే.

పరవస్తు చిన్నయ సూరి రచించిన మిత్రభేదములో దమనకునితో కరటకుడు, పింగళకుని గురించి మాట్లాడుతూ, "ఈతఁ డెత్తువారి చేతి బిడ్డగాని యొక తెన్నునఁ బోవువాఁడు గాడు. ఇట్టివాని కొలువు మిక్కిలి కష్టము." అంటాడు. ఇది నెల్లూరు జిల్లా మాండలీకము. వీరు సాధారణముగా తమ స్వంత వర్తనము లేక చెప్పుడు మాటలకు లోనై, అటుపోవుటయో, ఇటువెళ్లుటయో నిశ్చయింపలేక వుందురు. ఇటువంటి వ్యక్తులను మన నిజ జీవితంలో చాలా మందిని చూస్తూ వుంటాము. మొత్తము మిత్రభేదము కధ ఇదే విషయాన్ని సోదహరణగా చూపుతుంది.

అన్నమాచార్యులు "పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము"#1 అను కీర్తనలో మనము వయస్సుతో పెద్దలమయ్యాము కానీ జీవించడములో ఎదగలేదు అన్నది గుర్తు చేసుకొనుట వుచితము.

మతిలోని దేహభిమానంబు విడుచుటకు / రతి పరాఙ్ముఖుఁడు గాక రపణంబు లేదు స్వతంత్ర ప్రతిపత్తి లేనివారు 'దేహభిమానంబు విడుచుటకు' విడుచుటకు  సిద్ధపడగలరా? ఎదో వదలవలె గాబట్టి విడుచువారు తిరిగి పాత పద్ధతి పట్టరని ఋజువేమి?

రతి పరాఙ్ముఖుఁడు గాక అని అన్నమాచార్యులు ఎందుకు పేర్కొన్నారు? మనిషి ఏమి సాధించినా, సాధించకున్నా రతి విషయములో ముందుంటాడు.  తక్కిన విషయములలో చూపని పరిపక్వత ఈ విషయంలో వయస్సు కన్నా ముందుండి, వయస్సు తీరినా ఆరాటము వదలడు. ఈ రకముగా చూచిన మాగ్రిట్ గారి బొమ్మ ఈ కీర్తనకు సరియైనదనిపించును. 

సరిలేని మమకారజలధి దాఁటిఁనఁ గాని
అరుదైన నిజసౌఖ్య మది వొందరాదు
తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁ గాని
పరగు బ్రహ్మానందపరుఁడుఁ దాఁ గాఁడు            ॥పాప॥

ముఖ్య పదములకు అర్ధములు: సరిలేని = హద్దుల్లేని; పరగు= ప్రయుక్తమగు, ప్రసిద్ధమగు

భావము: హద్దుల్లేని మమకారజలధిని దాఁటిఁనఁ గాని అరుదైన నిజసౌఖ్య మది పొందరాదు. తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁ గాని  ప్రసిద్ధమగు బ్రహ్మానందపరుఁడుఁ తాను గాలేడు.

వివరణము: సరిలేని మమకారజలధితో వైతరణి నది వంటిదానిని సూచించారు. నీతిమంతులు "ఆ నదిని అమృతం వంటి నీటితో నిండినట్లు", పాపులు "చీము, యెముకలు & రక్తంతో" నిండినట్లు చూస్తారని పెద్దలు చెప్పుదురు.  పరిశుద్ధ హృదయపుటవసరము దీని కంటే ఎక్కువ ప్రస్తావించ నవసరము లేదు. 

మానవుడు పరమును జీవించి యుండగానే సాధించవలెనని అనేక మార్లు చెప్పుకొన్నాము. మరణించి సాధించునదేమీ లేదు. కాబట్టి ఈ వైతరణి నదిలో పేర్కొన్న చీము, నెత్తురు, బొమికెలు ఈ శరీరము లోనివే. 

తిరిగి మాగ్రిట్ గారి బొమ్మను చూడండి. వయస్సు వచ్చిననూ జ్ఞానమురాని మానవులు, ఆ చంకలోని మొండి బాలుని వలె తాము నమ్మినదానినే పట్టుకొని వేలాడు తుంటారు. జ్ఞానము అనగా తెలిసినదానిని వదలివేయడమే. కానీ ఆ చంకలోని పిల్లవాడు ససేమిరా దిగిరాడే. స్వేచ్ఛ వేరెవరో వచ్చి ప్రసాదించేది కాదు. మనిషి తనంతట తాను నడువవలసిన బాట​. గీతలోని "ఉద్ధరేదాత్మనాత్మానం" అన్నా కూడా అర్ధమిదే.  గమనించండి జ్ఞానము, స్వేచ్ఛ, ధ్యానము, ముక్తి అనునవి ఒక కార్యము నందు నిమగ్నమై చేయుటను సూచించుచున్నవే కానీ కాగితములలో వ్రాసి చప్పరించుటకు కాదు. 

అంతటి నమ్మకముతో తాను పట్టుకొనియున్న దేహాభిమానము, విశ్వాసముగా నమ్మిన ప్రతీదానిని విడిచి, ధ్యానమయ స్థితిలొనికి వెళ్ళుటకు మనవైపునుండి ప్రయత్నముంటేగా దైవ సహాయము  లభించునది. సౌకర్యవంతమగు చంక దిగి రావడమే మానవుడు చేయవలసినది. 

References and Recommendations for further reading:

#1 35. పెఱుగఁగఁ బెఱుగఁగఁ (pe~rugaga be~rugaga)

 

-x-x-x-

1 comment:

  1. ఈ దేహము పాపపుణ్యకర్మలకు రూపము.దేహేంద్రియమనముల చాపల్యకారణంగా కర్మలనాచరించి సంసారజలధిలో ఈదుతూ కొట్టుమిట్టాడుతూ,జననమరణచక్ర బంధంలో చిక్కుకొని ముక్తిని పొందలేకున్నాము.ఇట్టి చాపల్యమునుండి బయటపడే మార్గము లేదు కదా ఆని అంటున్నారు అన్నమయ్య. ఈ కీర్తన యొక్క పల్లవిలో.

    హిల్మా యాఫ్ క్లింట్ గీచిన చిత్రంలో ఈ పాపపుణ్యములు కలయికను అద్భుతంగా చిత్రీకరించాడు.

    దేహాభిమానం లేదా దేహభ్రాంతి అజ్ఞానజన్యం.దేహాభిమాన మున్నవారికి నిర్గుణబ్రహ్మము లేక మోక్షం దుర్లభం.విషయాసక్తి, మమతానురాగములు ముక్తికి అవరోధములని అంటున్నారు అన్నమయ్య.వీటిని సంపూర్ణముగా వదలినగాని ముక్తిని బడయుట అసాధ్యం.
    శ్రీ అదిశంకర ప్రణీతమైన భజగోవిందంలోని శ్లోకంలో ఇలా చెప్పబడింది ::
    :
    *నలినీదళగత జలమతి తరళం*
    *తద్వజ్జీవితమతిశయచపలం |*
    *విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం*
    *లోకం శోకహతం చ సమస్తం ||*

    తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి, జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము.

    అలాగే భగవద్గీతలో పరమాత్మ విషయానురక్తి, విషయాసక్తి అనిత్యములని,వాటిని తితిక్షతో జయించాలని బోధించాడు::

    *మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ।*
    *ఆగమాపాయినోఽనిత్యాః తాంస్తితిక్షస్వ భారత ।।*
    (భగవద్గీత 2-14)

    ఇంద్రియ-విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన, అనిత్యమైన సుఖ-దుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి, చలికాలములలా వచ్చిపోతుంటాయి. ఓ భరత వంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి.

    రినే మాగ్రిట్టే గీచిన చిత్రంలో మనుష్యులులో మమతానురాగములు, ఆసక్తిని చక్కగా విశదీకరించాడు.
    మమకార మనే సముద్రాన్ని తరించినగాని దుర్లభమైనది,అరుదైనది అయిన నిజసౌఖ్యమును, పరమానందమును పొందజాలమని,
    శ్రీ వేంకటేశ్వరుని భక్తితో కొలిచినగాని పరమపదము అలభ్యమని అన్నమయ్య మోక్షమార్గమును తెలియజేస్తున్నారు.

    *యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ ।*
    *నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।।*
    (గీత 2-57)

    "ఎవరైతే అన్నీ పరిస్థితులలో మమకారం/ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు క్రుంగిపోకుండా ఉంటాడో, అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని."

    ఓం తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...