అన్నమాచార్యులు
165 నిత్య పూజలివివో నేరిచిన నోహో
for English
Version press here
సారాంశం: నువ్వే సత్యాన్ని ప్రతిబింబించే అద్దంలా స్వచ్ఛంగా
ఉండు.
కీర్తన సారాంశం:
పల్లవి: ఏ ప్రకరంగా నిత్య పూజలీవచ్చునో నేరిచిన, ప్రత్యక్షమైనట్టి పరమాత్ముని “ఓహో ఓహో” అని కాక ఏమని కీర్తించగలము? అన్వయార్ధము: అపూర్వము, అత్యద్భుతమునగు
పరమాత్ముని సన్నిధి చేరుటకు మార్గమును మనస్సును పూర్తిగా కేంద్రీకరించి కనుగొనుము.
చరణం 1: తనలోపలి యంతర్యామికి తనువును
గుడిగాను తలను అందుకు శిఖరముగాను హృదయమే హరిపీఠముగాను, కనుఁగొను చూపులే దీపములుగాను అర్పించుట ధ్యానమందలి
అంర్భాగము.
చరణం 2: పిడిఘంటలా కలకల మనక పలుకులను
మంత్రముచ్ఛరించినట్లు నేర్చి పలుకవలెను. తలఁపులోపలనున్న దైవమునకు ఒప్పిదమైన రుచులే
నైవేద్యములు.
చరణం 3: జీవమున్నంత వరకే నడచు దేవాలయమిది. మక్కువ, శ్రద్ధ గలవారే స్వామి దాసుఁలు. జీవుని ఉచ్ఛ్వాసనిశ్వాసలే అంతరంగనాధునికి విసనకఱ్ఱలు. జీవుడా ఊహకు అందని దివ్య క్రమమే శ్రీవేంకటరాయని ఉనికి నిదర్శనము.
విపులాత్మక వివరణము.
ఉపోద్ఘాతము: విప్లవాత్మకము, సరికొత్త పంథాను చూపించు విధముగా ఈ కీర్తనను అల్లిరి. ఇక్కడ గుడి అనగా అనూహ్యమైన దానిని ప్రతిబింబించుటకు నిష్కల్మషమైన, దైనందిక వత్తిళ్ళు లేని అంతరంగమును, దానికి దీటైన అకళంకమగు చూపులను, వానికి సరిపోలు ఆచితూచి పలికెడు మాటలను ధ్యాన మార్గముగా ఆచార్యులు ప్రస్తావించిరి.
సత్యమునకు తనకు గల మధ్య దూరమును భరింపలేని తమియే ధ్యానము. ఆ దూరమును గ్రహించి అనుసంధానించునది జ్ణానము. కావున ధ్యానమును, జ్ణానమును క్రియాశీల రాసులని, మనఃఫలకముపై వ్రాసియుంచుకొను కదలికలేని, స్థిర రాసులు కావని తెల్పిరనుకోవచ్చును.
కీర్తన:
రాగిరేకు: 114-4 సంపుటము: 2-82
|
నిత్య పూజలివివో నేరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి ॥పల్లవి॥ తనువే గుడియట తలయే శిఖరమట
పెనుహృదయమే హరిపీఠమటా
కనుఁగొను చూపులే ఘనదీపము లట
తనలోపలి యంతర్యామికిని ॥నిత్య॥ పలుకే మంత్రమట పాదైన నాలికే
కలకలమను పిడిఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలఁపులోపలనున్న దైవమునకు ॥నిత్య॥ గమనచేష్టలే యంగరంగగతియట
తమిగల జీవుఁడే దాసుఁడట
అమరిన వూర్పులే యాలవట్టములట
క్రమముతో శ్రీవేంకటరాయనికిని ॥నిత్య॥
|
Details and Explanations:
భావము: ఏ ప్రకరంగా
నిత్య పూజలీవచ్చునో నేరిచిన, ప్రత్యక్షమైనట్టి పరమాత్ముని “ఓహో ఓహో” అని కాక ఏమని కీర్తించగలము?
వివరణము: "ఓహో"తో చెప్పలేనంతటి ఆశ్చర్యమును ప్రకటించిరి. "నేరిచిన"తో మనము నేర్చిన పూజ పూజయే కాదని ఆచార్యులనిరి. అందుమూలమున "నిత్య పూజలివివో నేరిచిన"తో మునుపెన్నడు ఎరుగని, నిర్వచనములేని ధ్యానమను స్థితిని సూచించిరి. ప్రత్యక్షమైన పరమాత్ముని 'ఓహో' అని తెలిపి ఆ స్వామి రూపురేఖలు తెలుపలేని అసమర్ధతను వ్యక్తీకరించిరి.
"నేరిచిన" అనే పదము అన్నమాచార్యులు
ఎందుకు ఉపయోగించిరో అలోచింతము. ముందుగా "లా పెరేడ్" అను శిర్షిక గల క్రింది
మాగ్రిట్"గారి చిత్రమును పరీక్షగా చూడమని ప్రార్ధన.
దాదాపు వట్టిపోయిన ఒక చెట్టు, వెనుక భాగములో కొంచమే తెరచి వుంచిన ఎర్రని తెర ఉపాధులుగా; అతి క్లుప్తత, సరళత మాధ్యమముగా; ఈ చిత్రం యొక్క కూర్పు శక్తివంతమైన సవాళ్ళను విసురుతుంది. ఆ చెట్టు మనకు స్పష్టమైన అడ్డంకుల్లేని దృశ్యమునకు అవరోధము కల్గించుచున్నది.
క్రింద నుంచి పైకంటా దూసుకుపోతున్న చెట్టు అనంతమైన కాలగమనమునకు, దాని బెరడు యొక్క ఆకృతి మరియు పొరలు అనుభవాల సేకరణను సూచిస్తాయి, ఇది సంక్లిష్టమైన చరిత్రను ఏర్పరుస్తుంది. మనము చూచు ప్రతీ విషయములోనూ ఆ చెట్టు అడ్డంవచ్చి, దృశ్యమును ప్రభావితం చేసి స్పష్టత బదులు అనుమానమును నిలబెడుతుంది. దాని వెనుక నున్న పరదా కూడా అటువంటిదే, ఆలోచనలను రేకెక్తిస్తుందే కాని తేఁటదనము నివ్వదు.
ఆ ఎర్ర తెర చేతన మరియు ఉపచేతన ప్రపంచాల మధ్య అవరోధాన్ని సూచిస్తుంది, ఇది జ్ఞాపకాలను ఆవిష్కరించే సామర్థ్యాన్ని మరియు మనస్సు యొక్క లోతులను అన్వేషించ మంటోంది. క్రొద్దిగా తెరచి వుంచిన తెర బైబిల్‘లొ పేర్కొన్న ఇరుకు ద్వారమును, అన్నమాచార్యులు చెప్పిన 'దిడ్డి తెరవు'#1 (సన్నని ద్వారము) లను సూచిస్తున్నది. మొత్తానికి ఈ చిత్రము మానవుని చింతను హెచ్చించు విషయములను మన ముందుంచుతుంది. ఏరకముగా అంతరంగము మనకు సంపూర్ణంగా తెలియక అయోమయముగా వుంటుందో, సగము సగము అనిపించు ఈ చిత్రరాజము మానవునికి అసంపూర్ణత్వానికి ప్రతీక అనుకోవచ్చును.
ఈ విధంగా, అరకొర జ్ఞానముతో నేర్చిన పూజలేమి పూజలు? అనేక మార్లు ప్రస్తావించినట్లు ఇక్కడ అన్నమాచార్యులు
‘పూజ’తో ధ్యానమును సూచించిరి. ధ్యానమనగా త్రికరణ
శుద్ధిగా మైమరచి చేయు కార్యమును సూచించునే తప్ప విన్నపమును గాదు. ఈ కీర్తన తరువాయి
భాగములో అదే విషయమును మరింత విపులముగా ఆచార్యులవారు విశదీకరించిరి.
అన్వయార్ధము: అపూర్వము, అత్యద్భుతమునగు
పరమాత్ముని సన్నిధి చేరుటకు మార్గమును మనస్సును పూర్తిగా కేంద్రీకరించి కనుగొనుము.
ముఖ్య
పదములకు అర్ధములు: పెను = పెద్ద, గొప్ప, ముఖ్యమైన; పెనుహృదయము = విశాల దృక్పథం
కలిగిన హృదయం.
భావము: తనలోపలి
యంతర్యామికి తనువును గుడిగాను తలను అందుకు శిఖరముగాను హృదయమే హరిపీఠముగాను, కనుఁగొను
చూపులే దీపములుగాను అర్పించుట ధ్యానమందలి అంర్భాగము.
వివరణము: రోజూ వినేదేగా, దీనికి ఇంత సుదీర్ఘ ఉపన్యాస మెందు కనుకోవచ్చు? అన్నమాచార్యులు అలవాటైన విషయమును ప్రస్తావించుటలేదు. మనము చూపులను దీపములను ఇతరులలోని లోపములను గుర్తించుటకు, మనకు అనుగుణముగా మార్చుకొనుటకు ఉపయోగిస్తాము. ఇటువంటి వైఖరితో కలుషితమైన మనకు అత్మసాక్షాత్కారమా? జోకులేయకండి సార్.
ఇకపోతే హృదయమంతా అనుభవములు
నేర్పిన పాఠములతో నింపి, మూలెక్కడో దైవమును
కూర్చోపెట్టి, నీకు నా హృదయంలో
చోటిచ్చాను అని చెప్పుకో గలిగిన మేటులము.
మనలను సత్యము నుండి దూరము
చెయుచున్నది, మనలోని కాలుష్యములే.
ఈనాడు పెదవులతో వాతావరణ కాలుష్య నివారణ గురించి కూస్తున్న ప్రపంచవాసులలో ఒక్కరైననూ
తమలోని కాలుష్యము తొలగించుకో లేనివారైరి. లోపలిది
బయటకు#3, బయటది లోపలకు రూపాంతరము చెందుతున్నట్లు#2 అనేక దృష్టాంతములతో వాస్తవమని
ముందు తెలిసికొంటిమి. ఈ రకముగా చూచిన కాలుష్య నివారణకు ఉద్యమించవలసినది అందరూనూ. మొదలు
పెట్టవలసినది తమతోనే. ఈ సందర్భముగా హెన్రీ డేవిడ్ తోరే గారి క్రింది మాటలు జ్ఞప్తికి
తెచ్చుకుందాం.
“తమను తాము (బానిసత్వపు)
నిర్మూలనవాదులుగా చెప్పుకునే వారు మసాచుసెట్స్ ప్రభుత్వం నుండి వ్యక్తిగతంగాను
మరియు వస్తుపరంగాను తమ మద్దతును, పరపతిని ఈ క్షణమే
ఉపసంహరించుకోవాలి. మరియు వారు అధిక పక్షము తమవైపు మొగ్గే వరకు వేచి ఉండకూడదని నేను
చెప్పడానికి వెనుకాడను. ఇంకొకరి మద్దతు కోసం ఎదురుచూడకుండా సత్యము తమ పక్షాన ఉంటే సరిపోతుందని
నా అభిప్రాయం. అంతేకాకుండా, తన పొరుగువారి
కంటే, సత్యము వైపు నిలచిన వ్యక్తి ఇప్పటికే మెజారిటీని కలిగి ఉంటాడు” హెన్రీ
డేవిడ్ తోరే.
ఇలా అనేకానేక సమస్యలతో
అటునిటు ఊగిసలాడు మానవుడు తాను విత్తినదే (అజ్ఞానమునే) తిరిగి పొందుతాడు.
కావున, తాను నిష్క్రమించవలసిన
దానిని కనుగొనుట వివేకము. తక్కిన వన్ని వ్యర్థములే.
ముఖ్య
పదములకు అర్ధములు: పాదైన = నిలుకడ కలిగిన; నలువైన = ఒప్పిదమైనది
భావము: పిడిఘంటలా
కలకల మనక పలుకులను మంత్రముచ్ఛరించినట్లు నేర్చి పలుకవలెను. తలఁపులోపలనున్న దైవమునకు
ఒప్పిదమైన రుచులే నైవేద్యములు.
వివరణము: గడగడమని వాగకుండా మితముగా మాట్లాడుట సద్వర్తనము.
ముఖ్య
పదములకు అర్ధములు: గమనచేష్టలే = జీవన యానములే; అంగరంగగతి = {అంగం
= విగ్రహము; రంగం = దేవాలయము) నడచుచున్నదేవాలయము మాదిరి; ఆలవట్టములు = వస్త్రముతో గుండ్రముగాఁజేసిన
విసనకఱ్ఱలు.
భావము: జీవమున్నంత
వరకే నడచు దేవాలయమిది. మక్కువ, శ్రద్ధ గలవారే స్వామి దాసుఁలు. జీవుని ఉచ్ఛ్వాసనిశ్వాసలే
అంతరంగనాధునికి విసనకఱ్ఱలు. జీవుడా ఊహకు అందని దివ్య క్రమమే శ్రీవేంకటరాయని ఉనికికి
నిదర్శనము.
వివరణము: మొత్తము మీద ఈ చరణంలో భూమిపై జీవనమునకు భువిలోని నిరంతర జీవవాహినికి
అనుసంధానము చేయునవి కేవలము భక్తి, మక్కువ శ్రద్ధలేనని సూటిగా తెలిపిరి. గమనించ వలసినదేమంటే జీవుడు తనశరీరమును
ఒక అద్దమువలె ప్రతిబింబించ వలెను. మలినమైన అద్దము పనికిరాదు. "యథాదర్శో మలేన చ"
అన్న గీతా వాక్యము కూడా పునర్దర్శనము చేయవలె. ఈ అద్దమునకు మెరుగు దిద్దుటకు భూమిలోని
దేని చేతనూ సాధించలేము. హిల్మా యాఫ్ క్లింట్ హంస బొమ్మలలోని ఇహ పరములను వేరు చేయుచూ
కనిపించి కనిపించని సన్నని అక్షాంశమును మననము చేసుకొనుట ఉచితము.
దివియందుఁ బుట్టిన భూమికి ఎటువంటి సంబంధము లేని క్రమమును (సొరిది, ఒగి, వావిరిఁ, సరవి, పొరి, లలిఁ, వంతు, బడి, వైనము అని) అన్నమాచార్యులు అనేక పర్యాయములు ప్రస్తావించిరి. జిడ్డు కృష్ణమూర్తి కూడా ఆ క్రమమును ప్రతి ప్రసంగములోను పేర్కొనిరి. వీరివురూ చెప్పినవాటినుంచి, "మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ" అన్న గీత నుంచి మనము సృష్టియొక్క క్రమము నందు అంతర్భాగమై, జీవములన్నింటికీ ఆధారమై వెలుగొందు అనిర్వచనీయమైన శక్తిని కృష్ణమూర్తి మరియు అన్నమాచార్యులు దర్శించిరనుకోవచ్చును.
References
and Recommendations for further reading:
#1 93. ఊరికిఁ బోయెడి వోతఁడ (Uriki
bOyeDi vOtaDa)
#2 162 వాదమేల సారెసారె వడి
ముక్తి లేదంటా
#3 163 ఏమిసేతు దైవమా
యెన్నఁడు గరుణించేవో
-x-x-x-
Just lovely
ReplyDeleteఆత్మశుద్ధిలేని యాచార మదియేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? విశ్వదాభిరామ వినురవేమ"
ReplyDeleteచిత్తశుద్ధి లేకుండా చేసే పూజలు పూజలా? అన్నాడు వేమన. అంటే అపనమ్మకంతో చేసే శివపూజ ఎందుకు? ఆని అర్ధం. ఈ కీర్తన పల్లవిలో కూడా అన్నమయ్య త్రికరణ శుద్ధి అంటే మనస్సు,వాక్కు ,కర్మల సమన్వయముతో చేసే పూజ పరమాత్మ సన్నిధిని చేరుస్తుందని అన్నారు.
అంతర్యామి: అంతర్ అంటే అంతర్గతం,లోపల, లేదా లోపలికి అనీ, అయామి అంటే నిగ్రహించబడినది. అంటే అంతర్గత సాక్షిగా ఆత్మయందు స్థితమై యున్న పరమాత్మ యొక్క అంశ. పరిశుద్ధమైన మనోవాక్కాయములనే త్రికరణముల చేత శరీరమును దేవాలయము గాను,తల అంటే శిరస్సును ఆ దేవాలయం యొక్క శిఖరం గాను,హృదయమును భగవంతుని యొక్క పీఠము గాను, దృష్టియే దీపముగా అంతర్యామిని దర్శించునదే ధ్యానం యొక్క అంతర్భాగమని అన్నమయ్య అంటున్నారు.
అట్టి ఏకాగ్రతతో కూడి దైవమునకు రుచించే పలుకులను మంత్రమువలె ఉచ్చరించినచో అవియే ఆ దేవుడికి నైవేద్యములగునని ఆచార్యులవారు
అంటున్నారు.
ఈ దేవాలయమనే శరీరం జీవమున్నంత వరకే ఉంటుంది.దేవుని మీద అత్యంత భక్తివిశ్వాసములున్న వారే హరిభక్తులు.భక్తుల ఉచ్వాసనిశ్వాసములే అంతర్యామికి విసనకర్రలు. అచింత్యుడైన ఆ శ్రీవెంకటేశ్వరుని సన్నిధిని చేరుట కివియే నిశ్చయక్రమమని అన్నమయ్య చివరి చరణంలో శ్రీవారిని సాక్షాత్కరించుకొనుటకు మార్గము నుపదేశించుచున్నారు.
ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
కృష్ణ మోహన్