Saturday, 25 May 2024

T-203. ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక

 అన్నమాచార్యులు

203. ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక 

శరణాగతియే మార్గము

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: అన్నమాచార్యుల వారు శరణాగతి ఒక్క మారే అని చెబుతున్నారు. ఆ శరణాగతి చేసి దైవమునకే తన​ బాధ్యత వదలి ఉండవలెను అని అంటున్నారు. అంతేగాని మనము ఉన్నట్లుగా అనేక విధములుగా పెనుగుతూ జీవనము సాగించుట సరికాదు అని అన్నమయ్య అంతరార్థం. 

చరణము 1: దేవుడా! నాకున్న చిన్న నాలికతో అనంతమైన నీ నామములు ఏరకంగా పలికెదనయ్యా? నీయొక్క హద్దులే లేనటువంటి క్రమమును చూచుటకు నా కన్నులేలా సరిపోతవి? 

చరణము 2: నీ కున్నవి అనంతమైన పాదములు. నా చేతులేమో రెండే ఆయే!  నీ పాదములన్నింటికి పూజ చేయుటకు నా శక్తి చాలదు. చూస్తే నా చెవులేమో చిన్నవి. నీ కథలేమో చాంతాడంత పొడుగు. వీటన్నింటిని తెలుసుకుని నిన్ను ఏ రకముగా భజించగలనయ్యా? 

చరణము 3: ఓ వేంకటేశ్వరా! నీ శ్రీచక్రం నా ఒంటి మీద ప్రేమగా ముద్రించుకొని నీవే గతి అని జీవనం సాగిస్తున్నాను. నువ్వు దేనికి చిక్కవు, ఉపాయాలకు దొరకవు అని తెలిసి కూడా నీకై ఈ వైపు వేచి ఉన్నాను. నీవే నన్ను కావగలవు. నా దగ్గర వేరే ఏ ఉపాయములూ లేవు. నాకు తెలిసినది ఒక్కటే "నీకు శరణాగతి అనడమే."

                  

ఉపోద్ఘాతం: అన్నమాచార్యుల వారు ఎంతో ఆర్థ్రతతో కీర్తించారు శ్రీ వారిని. శరణాగతి  చేయు అసాధారణమైన విషయమును ఇందులో చెప్పారు. 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు 279-3  సంపుటము: 3-455 

ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక
పెక్కు విధముల నెట్టు పెనఁగేనయ్యా       ॥పల్లవి॥
 
నాలికె వొక్కటే నీ నామము లనంతము
పోలించి నే నిన్నెట్టు పొగడేదయ్యా
వోలి నాకన్నులు రెండే వొగి నీ మూర్తులు పెక్కు
సోలి నే నిన్నెటువలెఁ జూచెదనయ్యా       ॥ఒక్క॥
 
వట్ట నా చేతులు రెండే పదములు నీకుఁ బెక్కు
వొట్టి నిన్నుఁ బూజించ నోపికేదయ్యా
గట్టి నాచెవు లిసుమంత కథలు నీకవియెన్నో
పట్టపు నేనెట్టు విని భజియించేనయ్యా      ॥ఒక్క॥
 
యేమిటాఁ జిక్కవు నీవు యింత దేవుఁడవుగాన
కామించి నీడాగు మోచి గతిగ నేను
యీ మేర శ్రీవేంకటేశ నీవే నన్నుఁ గావు
దీమసాన నిఁక వేరేతెరువు లేదయ్యా ॥ఒక్క॥ 

 

Details and explanations:

ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక
పెక్కు విధముల నెట్టు పెనఁగేనయ్యా ॥పల్లవి॥ 

భావము: అన్నమాచార్యుల వారు శరణాగతి ఒక్క మారే అని చెబుతున్నారు. ఆ శరణాగతి చేసి దైవమునకే తన​ బాధ్యత వదలి ఉండవలెను అని అంటున్నారు. అంతేగాని మనము ఉన్నట్లుగా అనేక విధములుగా పెనుగుతూ జీవనము సాగించుట సరికాదు అని అన్నమయ్య అంతరార్థం. 

వివరణ​: మనము నిజమైన శరణాగతి చేస్తామా?  ఏదో చిత్త చాంచల్యం కొద్దీ శరణాగతి అనేస్తాము కానీ. మాటిమాటికి చేసేది శరణాగతి కాదు. 

మరి దైవమునకే (ప్రకృతికే) బాధ్యత వదలి అంటే తనకేమైనా కూడా సంతోషంగా స్వీకరించడం అంత సులభమైనది కాదు. మనకు ప్రతి విషయం పైన నిర్దిష్టమైన ఒక ఊహ/ అపేక్ష/ తలంపు ఉంటుంది. అది ఇలా జరగాలి అని కోరుకుంటాము. అలా జరగకపోతే విచారిస్తాం. ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక  అని అన్నమాచార్యులు ఆ శరణు చేసిన తర్వాత అది తప్పు ఇది ఒప్పు అను వివాదములను చిక్కుకొనక ఉండమంటున్నారు. మనం నిజంగానే ఉండగలమాండి? 

పెనగుట అనునది మనలో ఏదో ఆ కార్యమును చేయుటలో అవరోధము కల్పించుచున్నదని అర్ధము. ప్రకృతి విధించు శాసనమునకు మనలో ఏర్పడు విరోధమే అన్నమాచార్యులు పేర్కొన్న "పెక్కు విధముల నెట్టు పెనఁగేనయ్యా". ఇక ప్రక్క శరణాగతిని చేయుచూనే మనము తెలియ కుండానే అద్దానికి అడ్డుపడతామని చెబుతున్నారు. ఇదియే అజ్ఞానము. మనను మనము తెలియుట ఏదో ఘన కార్యమును సాధించుట​కు కాదు. మన చేష్టలను విశదముగా తెలియుట​కు మాత్రమే​.

 

నాలికె వొక్కటే నీ నామము లనంతము
పోలించి నే నిన్నెట్టు పొగడేదయ్యా
వోలి నాకన్నులు రెండే వొగి నీ మూర్తులు పెక్కు
సోలి నే నిన్నెటువలెఁ జూచెదనయ్యా  ॥ఒక్క॥ 

ముఖ్యపదములకు అర్ధములు: ఓలి = వరుస, క్రమం; సోలి = మైమఱపు, తన్మయత్వము, వింత 

భావము: దేవుడా! నాకున్న చిన్న నాలికతో అనంతమైన నీ నామములు ఏరకంగా పలికెదనయ్యా? నీయొక్క హద్దులే లేనటువంటి క్రమమును చూచుటకు నా కన్నులేలా సరిపోతవి? 

వివరణ​: ఓలి సోలి అనే ఈ రెండు చిన్ని పదములు ఈ కీర్తనకు కేంద్ర బిందువులు. అగపడు ఈ ప్రపంచము, ఈ ఛిన్నాభిన్నములు వెనుక మనసు కానీ, గూగుల్ కానీ, ఊహలు గానీ చేర్చలేని, పొదగలేని అత్యద్భుతమైన క్రమము దాగి ఉన్నదని జిడ్డు కృష్ణమూర్తిగారు అన్నమాచార్యులవారు  అనేక మార్లు సోదాహరణముగా వివరించారు. మానవ జీవితము యొక్క లక్ష్యము ఆ అపూర్వ అచిన్త్యానంత వీక్షణమునకు మన దేహమును సిద్ధముగా ఉంచుట అని పేర్కొన్నారు. ఆ అసమాన్య స్థితిని చేరుటకు భక్తి తప్ప వేరు మార్గములు లేవని అన్నమాచార్యులు పదే పదే విన్నవించారు. ఈ కీర్తనలో కూడా అదే పేర్కొన్నారు. 

ఫిబ్రవరి 1950లో M C ఎస్చెర్ అను మహానుభావుడు ORDER and CHAOS ను (‘క్రమాక్రమములులేదా ‘ ‘క్రమము మరియు గందరగోళం’)​ అను శీర్షికతో క్రింద ఇచ్చిన లితోగ్రాఫ్‌ సృస్టించడం జరిగింది. ఇది స్వీయ-వివరణాత్మకమైనది. ఈ ముద్రణలో ఒక సంపూర్ణ సౌష్టవ పారదర్శక స్టెల్లెటెడ్ డోడెకాహెడ్రాన్ ఒక గాజు గోళంతో విలీనం చేయబడినట్లు  కేంద్రములో చూపిరి. దాని చుట్టూ విరిగిన మరియు ఇతరత్రా అస్తవ్యస్తంగా ఉన్న వస్తువులను కలగూరగంపలా అమర్చిరి. ఇది ఓలి నాకన్నులు రెండే వొగి నీ మూర్తులు పెక్కు / సోలి నే నిన్నెటువలెఁ జూచెదనయ్యాతో సరిపోలుతుంది. మనకు అగపడు చిందరవందర ప్రపంచమును చూచి మహానుభావుల మాటలను నమ్మినా, అంతస్థము చేసుకోము. అనగా ఎంతో నిశితము, తదేక దీక్షగల ఎశ్చర్ వంటి మహానుభావులు కూడా అన్నమాచార్యులు చెప్పినదే వ్యక్త పరచుట ఆశ్చర్యము గొలుపును. 



కానీ తరచుగా అస్తవ్యస్తంగా భావించేది బహుశా అంత యాదృచ్ఛికం కాదు. ఉదాహరణకు, ఈ పారవేసిన వస్తువులలో ఒకదాన్ని తీసుకొని శక్తివంతమైన సూక్ష్మదర్శిని క్రింద పరిశీలిస్తే, పరిపూర్ణమైన చిన్న ఇంటర్లాకింగ్ స్ఫటికాలు మరియు అణువులను చూస్తాము. ఈ క్రమబద్ధమైన నమూనాలు మనకు అగపడవు.... వాటి ప్రస్తుత రూపము మనలను ప్రభావితము చేసి మనస్సును గందరగోళం వైపు లాక్కేళ్ళును. 

ఎస్చెర్ గారు స్వయంగా ఒక అరుదైన తాత్విక వ్యాఖ్యతో దీనిని వివరించారు: "మనము ఒక అందమైన మరియు క్రమబద్ధమైన ప్రపంచంలో నివసిస్తున్నామని; మరియు కొన్నిసార్లు కనిపించే విధంగా రూపం లేని గందరగోళంలో లేమని సాక్ష్యం ఇవ్వడానికి నేను నా ముద్రణలలో ప్రయత్నిస్తాను." అన్నారు. 

వట్ట నా చేతులు రెండే పదములు నీకుఁ బెక్కు
వొట్టి నిన్నుఁ బూజించ నోపికేదయ్యా
గట్టి నాచెవు లిసుమంత కథలు నీకవియెన్నో
పట్టపు నేనెట్టు విని భజియించేనయ్యా ॥ఒక్క॥ 

ముఖ్యపదములకు అర్ధములు: వొట్టి = పొట్టి (అని తీసుకుంటే = నాకు సామర్థ్యము చాలదు అని) లేదా ఏమీలేదు ​(అని తీసుకుంటే కనబడని నిన్ను అని తీసుకోవలె) 

భావము: మీకున్నవి అనంతమైన పాదములు. నా చేతులేమో రెండే ఆయే!  నీ పాదములన్నింటికి పూజ చేయుటకు నా శక్తి చాలదు. చూస్తే నా చెవులేమో చిన్నవి. నీ కథలేమో చాంతాడంత పొడుగు. వీటన్నింటిని తెలుసుకుని నిన్ను ఏ రకముగా భజించగలనయ్యా? 

వివరణ​: అన్నమాచార్యులవారు నాకు ఒకటే నాలిక లేక ఉన్నది; రెండు కళ్ళు మాత్రమే ఉన్నవి; రెండు చెవులు మాత్రమే ఉన్నవి; రెండు చేతులు మాత్రమే ఉన్నవి అని చెప్పి, మానవుడు దైవముతో పోల్చితే అతి సూక్ష్మాతి సూక్ష్మమైన వాడని సూచించారు.  మనము ఎంత చేసినా దైవమునకు కృతజ్ఞతలు చెల్లించుకోలేమని; మానవుడు చేయగలిగింది కేవలం కృతజ్ఞతా భావముతో ఒదిగి వుండడము మాత్రమే అని చెబుతున్నారు. 

యేమిటాఁ జిక్కవు నీవు యింత దేవుఁడవుగాన
కామించి నీడాగు మోచి గతిగ నేను
యీ మేర శ్రీవేంకటేశ నీవే నన్నుఁ గావు
దీమసాన నిఁక వేరేతెరువు లేదయ్యా    ॥ఒక్క॥ 

ముఖ్యపదములకు అర్ధములు: కామించి = ప్రేమించి, మనస్పూర్తిగా;  నీడాగు = నీ ముద్ర​; మేర = ఎల్ల, హద్దు, మితి మట్టు, ఎడము, limit, boundary; యీ మే = this side; దీమసము (dImasamu) = ఉపాయము,  నేర్పు, Cleverness; a contrivance, a stratagem,; తెరువు = దారి. 

భావము: ఓ వేంకటేశ్వరా! నీ శ్రీచక్రం నా ఒంటి మీద ప్రేమగా ముద్రించుకొని నీవే గతి అని జీవనం సాగిస్తున్నాను. నువ్వు దేనికి చిక్కవు, ఉపాయాలకు దొరకవు అని తెలిసి కూడా నీకై ఈ వైపు వేచి ఉన్నాను. నీవే నన్ను కావగలవు. నా దగ్గర వేరే ఏ ఉపాయములూ లేవు. నాకు తెలిసినది ఒక్కటే "నీకు శరణాగతి అనడమే."

 

-x-x-x సమాప్తము x-x-x-

Saturday, 11 May 2024

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

 అన్నమాచార్యులు

T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ 

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: నేను ఇంత కాలము ఆ సొమ్ములు, ఈ బాంధవ్యాలు, ఆ ముక్తి, ఆ పుణ్యము కావాలి అనుకుంటూ ఎన్నో గడిచుకున్నాను. వాటన్నిటిని ఇప్పుడు  దిగవిడవమంటే న్యాయమా నీకు? విడిచానే అనుకో. అప్పుడు నేను ఏమైపోయినా నీవే రక్షించుకో ఓ అంతర్యామి. 

చరణము 1: మనం ఏదైనా  సొమ్ము పోగొట్టుకుంటే అది పోగొట్టుకున్నచోట తచ్చాడుతూ తిరుగుతూ అక్కడ పడేవేసితినా ఇక్కడ పడేవేసితినా అని గుర్తు చేసుకుంటూ, మన శక్తులన్నీ కూడగట్టుకుని వీధులన్నీ తిరిగి వాటిని తిరిగి పొందేవరకు మనం ఎంత క్లేశము చెందుతాము? నాకు తెలుసును అనే నమ్మకంతో  తనను తాను చిక్కించుకొని ఏమి చేయకుండా భగవంతుడిపై భారం వేసి ఉండగలుగుతాడా మానవుడు? 

చరణము 2: ఓడ కొనుక్కునేవాడు దాన్ని ఒక తీరమునకు చేర్చి, పరిశీలించి దానికి తగిన డబ్బు ఇవ్వడానికి సిద్ధమై తన సొంతం చేసుకుంటాడు. ఇక్కడనే ఈ ప్రపంచం లోనే నాకు అటువంటి గట్టు కానీ,  తీరము కానీ కనబడుటలేదు. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి ఓ అంతర్యామి. 

చరణము 3: ఉప్పు అమ్మేవాడు దానిపై నీటి చిట్లు పడకుండా ఎంత జాగ్రత్తగా ఉంటాడో,  శ్రీ వేంకటేశ అంతే అప్రమత్తముగా, వోపికగా  నీకై వేచి ఉన్నాను. నన్ను పుట్టించావు కాబట్టి నా భారం కూడా నువ్వే మొయ్యాలయ్యా ఓఅంతర్యామి!                  

ఉపోద్ఘాతం: చాలా అద్భుతమైన కీర్తన. అన్నమాచార్యులు ఎంత వేదన చెంది భగవంతుని ప్రార్థిస్తున్నారో తెలుస్తుంది. భగవద్గీతలో చెప్పిన ప్రకారం అన్ని విడిచి ఆ స్వామినే దిక్కు అనుకునే వారికి భగవంతుడి పట్ల ఉండే ఆర్తి ఈ కీర్తనలో చెప్పినట్లు ఉంటుంది. అట్టివారి మనఃస్థితిని వర్ణిస్తున్నారు. మనకు దైవ పట్ల వున్న నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నారు అన్నమాచార్యులు. 

అధ్యాత్మ కీర్తన:

అన్నమాచార్యులు
రాగిరేకు 107-3  సంపుటము: 2-39
 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
రాగిరేకు 3-1  సంపుటము: 15-14 
నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ
అన్నిటా రక్షించుకోవె అంతర్యామీ ॥పల్లవి॥
 
సొమ్ము వోవేసినవాఁడు చుట్టి చుట్టి వీధులెల్లా
కమ్మర వెదకీనట కన్న దాఁకాను
నమ్మిన ఆజ్ఞానములో నన్నుఁ బడ వేసికొని
అమ్మరో వూరకుందురా అంతర్యామీ          ॥నన్ను॥
 
వోడబేరమాడేవాఁడు వొక్కదరి చేరిచి
కూడిన యర్థము గాచికొనీనట
యీడనే ప్రపంచములో యిట్టే నన్ను దరి చేర్చి
వోడక కావఁగరాదా వోయంతర్యామీ  ॥నన్ను॥
 
చేరి వుప్పమ్మేవాఁడు చిట్లు వేఁ గనఁడట
వూరకే శ్రీ వేంకటేశ వోపికతోడ
ఆరయ నన్నుఁ బుట్టించినట్టివాఁడవు నా
భార మేరీతినైన మోవు మింక నంతర్యామీ  ॥నన్ను॥

 

Details and explanations:

నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ
అన్నిటా రక్షించుకోవె అంతర్యామీ ॥పల్లవి॥ 

ముఖ్యపదములకు అర్ధములు: గడించి = సంపాదించుకున్నవి; నాయమా = న్యాయమా?; దిగవిడువ = ఒక్కపళంగా వదిలిపెట్టు; 

భావము: నేను ఇంత కాలము ఆ సొమ్ములు, ఈ బాంధవ్యాలు, ఆ ముక్తి, ఆ పుణ్యము కావాలి అనుకుంటూ ఎన్నో గడిచుకున్నాను. వాటన్నిటిని ఇప్పుడు  దిగవిడవమంటే న్యాయమా నీకు? విడిచానే అనుకో. అప్పుడు నేను ఏమైపోయినా నీవే రక్షించుకో ఓ అంతర్యామి.  

వివరణ​: "నన్ను నింతగా గడించి" అంటే నేను అనుదానిని ఇంతకాలమూ పెంచి పోషించాను. ఇప్పుడు దాన్ని ఎలా  విడవమంటావు అని ప్రశ్నిస్తున్నారు. 

సొమ్ము వోవేసినవాఁడు చుట్టి చుట్టి వీధులెల్లా
కమ్మర వెదకీనట కన్న దాఁకాను
నమ్మిన ఆజ్ఞానములో నన్నుఁ బడ వేసికొని
అమ్మరో వూరకుందురా అంతర్యామీ    ॥నన్ను॥ 

ముఖ్యపదములకు అర్ధములు: సొమ్ము = material acquisition; వోవేసినవాఁడు =పోగొట్టుకున్నవాడు; నమ్మిన ఆజ్ఞానము= belief that I know, నాకు తెలుసు అనే నమ్మకం; పడ వేసికొని= తనను తాను చిక్కించుకొని, entrenching oneself;  అమ్మరో = exclamation, నివ్వెరపోతున్నాడు; వూరకుందురా = ఏమీ చేయకుండా ఊరకుందురా? 

భావము: మనం ఏదైనా  సొమ్ము పోగొట్టుకుంటే అది పోగొట్టుకున్నచోట తచ్చాడుతూ తిరుగుతూ అక్కడ పడేవేసితినా ఇక్కడ పడేవేసితినా అని గుర్తు చేసుకుంటూ, మన శక్తులన్నీ కూడగట్టుకుని వీధులన్నీ తిరిగి వాటిని తిరిగి పొందేవరకు మనం ఎంత క్లేశము చెందుతాము? నాకు తెలుసును అనే నమ్మకంతో  తనను తాను చిక్కించుకొని ఏమి చేయకుండా భగవంతుడిపై భారం వేసి ఉండగలుగుతాడా మానవుడు? 

వివరణ​: మొదటి రెండు పంక్తులలో మనము ఏ విధంగా వ్యవహరించేది చెబుతున్నారు. తర్వాతి రెండు పంక్తులలో ఏది మనము ఆవిధంగా చేయునట్లు చేయునో దానిని వివరించుచున్నారు. 

మనము ఏదో పోగొట్టుకున్నాము అన్న భ్రమలో ఆ సొమ్ములు, ఆ డబ్బు, ఆ బాంధవ్యాలు, ఆ ముక్తి, ఆ పుణ్యము కావాలి అనుకుంటూ ఆయా వాటికై వెదకుచు వెంపర్లాడుతూ జీవిస్తాం అని చెబుతున్నారు. మనం ప్రస్తుతం వున్న అజ్ఞాన స్థితిలో రజో గుణ ప్రభావితులమై  మొదటి రెండు పంక్తులలో చెప్పినట్లు ఏదోవొకటి చేయబోతాము. కాలు కాలిన పిల్లిలా తిరుగుతాము. 

సర్వము భగవంతునిపై వదిలి ఏమి చేయకుండా ఉండగలమా?   మనకు భగవంతుని మీద అంత నమ్మకం ఉందా? అలాకాకుండా ఒక్క క్షణం కాదు, ఒక్క గడియ కాదు, ఒక రోజు కాదు, జీవితమంతా భగవంతునిపై పూర్తి భారం వేసి మనుగడ సాగించగలమా? అకర్తారం స పశ్యతి (భగవద్గీత 13-30) గుర్తుకు తెచ్చుకోండి. 

ఓ మానవుడా ఆలోచించుకో! కానీ మనకున్నది ప్రస్తుతం మన మెదడులో, మనసులో నిక్షిప్తం చేయబడిన జ్ఞానం మాత్రమే. దీనినుండి ఈ పరమార్థం వైపు చేరు స్థితి లేదు అని కూడా చెబుతున్నారు. 

వోడబేరమాడేవాఁడు వొక్కదరి చేరిచి
కూడిన యర్థము గాచికొనీనట
యీడనే ప్రపంచములో యిట్టే నన్ను దరి చేర్చి
వోడక కావఁగరాదా వోయంతర్యామీ      ॥నన్ను॥ 

ముఖ్యపదములకు అర్ధములు: దరి= గట్టు; అర్థము = డబ్బు; గాచి = సిద్ధమై, యీడనే = ఇక్కడనే.

 

భావము: ఓడ కొనుక్కునేవాడు దాన్ని ఒక తీరమునకు చేర్చి, పరిశీలించి దానికి తగిన డబ్బు ఇవ్వడానికి సిద్ధమై తన సొంతం చేసుకుంటాడు. ఇక్కడనే ఈ ప్రపంచం లోనే నాకు అటువంటి గట్టు కానీ,  తీరము కానీ కనబడుటలేదు. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి ఓ అంతర్యామి. 

వివరణ​: జీవనము అంతులేనిది. దరులూ లేనిదే. ఓడ కొనుక్కునే వాడికి ఒక తీరము కనపడినట్లుగా నాకు ఈ జీవితంలో అటువంటి తీరం కానీ గట్టు కానీ కనబడుటలేదు అంటున్నారు అన్నమాచార్యులవారు. 

ఇంతకు మునుపు మీకు ఎన్నోసార్లు విన్నవించుకున్నట్లుగా ఈ విశ్వమునందు భూమి అని, స్వర్గం అని, నరకమని, పాతాళమని వేరే వేరే ప్రపంచాలు లేవు అన్నది అన్నమాచార్యుల వాదము. ఉన్నది ఒక్కటే మనముందున్న ప్రపంచం. అందుకనే ఈ ప్రపంచంలో ఉన్న నన్ను కాపాడు స్వామి అంటున్నారు అన్నమాచార్యులవారు. 

చేరి వుప్పమ్మేవాఁడు చిట్లు వేఁ గనఁడట
వూరకే శ్రీ వేంకటేశ వోపికతోడ
ఆరయ నన్నుఁ బుట్టించినట్టివాఁడవు నా
భార మేరీతినైన మోవు మింక నంతర్యామీ      ॥నన్ను॥ 

ముఖ్యపదములకు అర్ధములు: చిట్లు = నీటి తుంపర​; వేఁగనఁడట = ఆరాటపడుట​. 

భావము: ఉప్పు అమ్మేవాడు దానిపై నీటి చిట్లు పడకుండా ఎంత జాగ్రత్తగా ఉంటాడో,  శ్రీ వేంకటేశ అంతే అప్రమత్తముగా, వోపికగా  నీకై వేచి ఉన్నాను. నన్ను పుట్టించావు కాబట్టి నా భారం కూడా నువ్వే మొయ్యాలయ్యా ఓఅంతర్యామి!

-x-x-x సమాప్తము x-x-x-

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...