Wednesday 12 June 2024

T-206. అప్పడుండే కొండలోన ఇప్పపూలు ఏరబోతే

 

అన్నమాచార్యులు

206. అప్పడుండే కొండలోన ఇప్పపూలు ఏరబోతే


అధ్యాత్మ కీర్తన:

అన్నమాచార్యులు

రాగిరేకు ???? సంపుటము: 27-???

 

1.అప్పడుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే –
ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ
అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ
 
2. ఆకాశాన పొయ్యే కాకి మూకజూచి కేకవేశే –
మూక మూడు విధములాయరా - ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ
 
3. అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదక పోతే –
వొల్వలెల్ల మల్ల్యెయాయే - ఓ వేంకటేశ
దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
 
4. అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే –
కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా
శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా
 
5. పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే –
పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా
అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా
 
6. చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడు మేశే –
కాళ్ళు లేని వాడు నడచే ఓ వేంకటేశా
పెదవిలేని వాడు చిలుక తినేరా ఓ వేంకటేశా!
 
7. గుంటయెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే –
కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
 
8. సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయ –
 తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ
 
9. ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ –
ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా
 
10. ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె –
దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
 
11. ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె –
పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
 
12. ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని –
మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
 
13. పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి –
కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
 
14. అర్థరాత్రి వేళలోని రుద్రవీణ నెత్తుకొని –
నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

 

Details and explanations:

అప్పడుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే –
ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ
అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ

ముఖ్యపదములకు అర్ధములు:  అప్పడుండే కొండలోన = భగవంతుని చేరుటకు మానవులు చేయు పుణ్యములు, పురుషార్థముల వంటి రచనలు; ఇప్పపూలు = మత్తు కలిగించే ఆకర్షణ; కప్ప = సుదీర్ఘ కాలం అంటే మనస్సు ఊహించలేనంత దీర్ఘ కాలమని చెప్పడానికి బౌద్ధంలోనూ, కొన్ని ఇతర మతాలలోనూ వుపయోగిస్తారు. (లేదా కప్పల్లాగా అటు ఇటు గెంతు మనసు అన్ని కూడా తీసుకో వచ్చు); ​అప్పలుగల వాడు = బంధములలో చిక్కుకున్నవాడు.

భావము: ఇక్కడ అన్నమాచార్యులు వేంకటేశుడు (భగవంతుడు) ఒక గొప్ప ఆకర్షణ శక్తి అని అతనిని చేరుటకు మానవులు చేయి పుణ్యములు పురుషార్థములవంటి వాటి మత్తులో సుదీర్ఘకాలం ఇరుక్కుపోయి బంధంలో చిక్కుకుంటారు అని అంటున్నారు.

 

ఆకాశాన పొయ్యే కాకి మూకజూచి కేకవేశే –

మూక మూడు విధములాయరా - ఓ వేంకటేశ

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ

ముఖ్యపదములకు అర్ధములు: ఆకాశాన పొయ్యే = విశాలమైన ప్రపంచంలో పయనించు; కాకి = ఒకానొకడు; మూకజూచి కేకవేశే = అక్కడున్న జనుల గుంపులను చూసి వారిని అడిగాడు (remember group think problems); మూక మూడు విధములాయరా = ఆ గుంపులన్నీ తాము చెప్పినవే సరియని వేరేవన్నీ తప్పని కాకుల్లాగ పోట్లాడుతూ వుంటే; కేకవేశే =  వారిని అటుల సమయము వ్యర్థము చేయవలదని  కేకవేసెను;

భావము: ఓ వెంకటేశుడా!  ఈ విశాలమైన ప్రపంచంలో పయనించు ఒకానొకడు అక్కడున్న సమూహములు తమలో తామే ఘర్షణ పొందుతూ నిర్వీర్యం అవుతుంటే చూచి ఒకానొకడు (అన్నమాచార్యులు) ఆ రకంగా చేయవలదని కేకలు వేశారు.

 

అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదక పోతే –

వొల్వలెల్ల మల్ల్యెయాయే - ఓ వేంకటేశ

దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

ముఖ్యపదములకు అర్ధములు: అహోబిలయ్య గుంటలోన = అహోబిలంలోవున్న  కోనేరులో;  వొల్వలు ఉదక పోతే = తమను తాము శుద్ధపరచుకోబోతే;- వొల్వలెల్ల = ఆ శరీరాలన్నీ; మల్ల్యెయాయే = మాలిన్యములాయె; 

 

భావము:  ఓ వేంకటేశా! అహోబిలంలోవున్న  కోనేరులో ప్రజలు తమను తాము శుద్ధపరచుకోబోతే ఆ శరీరాలన్నీ మరింత మాలిన్యములాయె.

వివరణము: మహాభారతములో భీష్ముణ్ణి ధర్మరాజు ఏ తీర్థములలో మునిగిన శాంతి లభించును అని అడుగుతాడు. దానికి భీష్ముడు "నాయనా మనస్సు శుభ్రము కాకుండా ఏ తీర్థములలో మునిగినా ప్రయోజనము లేదు" అంటాడు.

 

అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే –

కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా

శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా

ముఖ్యపదములకు అర్ధములు: అహోబిలాన చెట్టు బుట్టే = ఒకానొక ఆలోచన, ఒక సిద్ధాంతము, ఒక ప్రతిపాదన, ఒక విధము;  భూమి యెల్ల తీగపారే = భూమియంతా తీగలా పాకినది; కంచిలోన కాయ కాచేరా = దానిని ఆ సిద్ధాంతమునకు, ఆ ప్రతిపాదనకు రూపము కల్పించెను;   శ్రీరంగాన పండు పండేరా = కానీ దాని ఫలములు వేరోకచోట (వేరోకరికి) లభించినవి.

భావము:  ఓ వేంకటేశా  ఆలోచనలు, సిద్ధాంతములు, ప్రతిపాదనలు, పని విధములు భూమియంతా తీగలా పాకినవి. వానికి వేరొక చోట కష్టపడి రూపము కల్పించారు. కానీ ఫలితములు వేరోకరు అందుకుంటున్నారు.

వివరణము: సొమ్మొకడిది. సోకొకడిది అన్నది ముందునుంచీ పరిపాటిగా వస్తున్నదే. అదే విషయము ఇక్కడ సూక్ష్మంగా చెప్పారు. ఈ చరణము అన్నమాచార్యుల పరిశీలనా శక్తికి నిదర్శనము. (ఉదాహరణకు ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం ఆసియా ఖండంలో మానవులంతా శక్తికి మించి పని చేయుచున్నాను వారికి విశ్రాంతి, మనశాంతి ఆహ్లాదకరమైన వాతావరణం, తగిన వేతనం కూడా కరువయ్యాయి. ఈరోజున వున్న వాణిజ్య ఒప్పందాల ప్రకారము ఒక చోటి సరకు వేరొక చోటుకి వెళుతున్నది విదితమే. సామ్యవాదం అంటూ ఎన్నో నినాదాలు వున్నా మానవులలో ముఖ్యంగా విశ్రాంతిలోను, మనశాంతిలోను ఆహ్లాదకరమైన వాతావరణంలోను  ఎక్కువ తక్కువలు ప్రపంచమంతా కనబడుతూనే వున్నవి).

 

పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే –

పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా

అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా

 

ముఖ్యపదములకు అర్ధములు: పుట్టామీద చెట్టు బుట్టే = మనమూహించని చోట ఔషధము పుట్టెను;   భూమియెల్ల తీగపారే = ఆ విషయము భూమియంతా తీగలా పాకినది;  పర్వతాన పండు పండేరా = చాలా ఎత్తులో ఆ పండు పండినట్లు కనబడుతుంది; అందవచ్చు = భగవంతుని కృపతో మహా ప్రసాదములా దానిని అందుకోవచ్చును; కోయరాదురా = దానిని ఆశించి పొందలేము;

భావము:  ఓ వేంకటేశా మేమూహించని చోట ఔషధము పుట్టిస్తావు. ఆ విషయము భూమియంతా తీగలా పాకిస్తావు. ఆ పండు (మోక్షము) అందరాని ఎత్తులో వుంది. భగవంతుని కృపతో మహా ప్రసాదములా దానిని అందుకోవచ్చును కానీ దానిని ఆశించి పొందలేము.

 

చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడు మేశే –

కాళ్ళు లేని వాడు నడచే ఓ వేంకటేశా

పెదవిలేని వాడు చిలుక తినేరా ఓ వేంకటేశా!

ముఖ్యపదములకు అర్ధములు: చేయిలేనివాడు = మనసు;  నెత్తిలేని వాడు= అహంకారము​; కాళ్ళు లేని వాడు= ఆశ; పెదవిలేని వాడు = మౌనములో వున్న వాడు; చిలుక = జ్ఞానమునకు గుర్తు;

భావము:  మనసు అహంకారము ఆశ మానవులను నడుపుతూ వుంటే ప్రపంచము పరుగిడును. సంపూర్ణమైన మౌనములో వున్నవాడు జ్ఞానము పొందుటకు అర్హుడగును.

గుంటయెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే –

కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

ముఖ్యపదములకు అర్ధములు:

భావము:  మనస్సను గుంటయెండి నిష్కామ కర్మమను పండు పండే. దానితో నా కర్మములన్నీ కుప్పవేసితిని. ఆ కుప్పకాలి నా అప్పు అను భారము తీరిపోయెరా ఓ వేంకటేశా.

సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయ –

తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ

ముఖ్యపదములకు అర్ధములు: సందెకాడ = దీపాలవేళ, సాయంకాలం; తలవ్రాలు = మన తలవ్రాతలు, లలాట లిఖితము, విధి;  సంధిదీరి = కూడిక తీరి (మమకారములతో, అభిమానములతో కూడిక తీరి); తెల్లవారనాయనీడరా = సత్యము అనుకున్నది వొట్టి నీడ అని తెలిసినది;

భావము:  మేము రాత్రి అని భావించు (మాకు తెలియనిది) మా తలవ్రాతలు, విధి నిర్ణయములు మమకారములతో, అభిమానములతో నా కూడిక తీరిపోగా సత్యము అనుకున్నది వొట్టి నీడ అని తెలిసినది. నాకు తెలిసినది నీ ఒక్కనికే తెలుసు. దీని భావమిదే ఓ వేంకటేశ.

వివరణము: భగవద్గీతలోని 2-69 శ్లోకమును మననము చేసుకోవలెను.

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ।। 69

భావము: సమస్త ప్రాణులకు (అనగా సామాన్య జనులకు) ఏది రాత్రియై దృష్టికి గోచారము కాక ఉన్నదో, దానియందు (ఆ పరమార్ధ తత్వమునందు) ఇంద్రియనిగ్రహపరుడగు యోగి మేలుకొని ఉండును. (ఆత్మావలోకనం చేయు చుండును). దేనియందు (అనగా ఏ శబ్దాది విషయములందు, అశాశ్వతమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తికై ప్రాకులాడుచూ) ప్రాణులు మేలుకొని ఉందురో (ఆసక్తితో ప్రవర్తించుచుందురో) ఆ విషయ జాలము పరమార్ధ తత్వమును దర్శించు మునీంద్రులకు రాత్రితో సమానమై ఉండును (అనగా ఆసక్తి ప్రదర్శించరు).

 

ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ –

ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా

దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా

 

ముఖ్యపదములకు అర్ధములు: ముత్యాల పందిటిలోన = రాత్రివేళ​

భావము:  ఆ రాత్రిలోన నక్షత్రములు ముత్యాల లాగ అగపడుతూవుంటే, ఆ ముగ్గురు – నా దేహము, భావములు, అంతరాత్మ ఒక్కటై పోగా నేను ఆ పరమేశ్వరుని చూచాను. నాకు తెలిసినది నీ ఒక్కనికే తెలుసు. దీని భావమిదే ఓ వేంకటేశ.

వివరణము: ముత్యాల పందిటిలోన అనగా ఆ రాత్రిలోన నక్షత్రములు ముత్యాల లాగ అగపడుతూవుంటే అనునది కేవలము అసలు విషయమునకు సూచికగా చెప్పబడినది. అచార్యుల ఆంతర్యము ఇది  వారు స్పృహలోలేని స్థితిలో జరిగినదని సూచించారు.

 

ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె –
దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

ముఖ్యపదములకు అర్ధములు: ఏటిలోన వలవేశే = ఏదో రకంగా చిక్కకపోతుందా అని ప్రయత్నము చేయడము;  తాటిమాను నీడ = తాటిచెట్టు ఎత్తుగా ఉన్న అది చక్కటి నీడనివ్వ లేదు "తాటిమాను నీడ" అంటే నీడ లేని చోట నీడ వెతుకుతున్నాం అని అర్థం; దూరపోతే చోటులేదురా = ఏదోరకంగా ఇందులో (మోక్షమార్గములో) దూరిపోతాము అంటే మనిషికి ఎక్కడా దూరడానికి సందు దొరకదు అన్న విషయాన్ని తెలియచేస్తున్నారు.

భావము:  ఆ మోక్షమన్నది ఏదో రకంగా చిక్కకపోతుందా, అందులో దూరడానికి సందు దొరకక పోతుందా అని ప్రయత్నము చేయడము తాటిమాను నీడను (నీడ లేని చోట నీడను) వెతకడం వంటిది. వృథాప్రయత్నము.

 

ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె –

పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

భావము:  కూతురు, ఆలు, పెండ్లాము అను బంధములు మానవులుగా మనం ఏర్పాటు చేసుకున్నవి. మానవకి మానవునికి ఉన్నది ఒకే ఒక్క అనుబంధం అది అదియే  దైవం. తక్కినవన్నీ క్షరములు (అనగా క్షీణించునవి అని అన్నమాచార్యుల ఉద్దేశం

వివరణము: నీవు ఒకరికి కూతురు కింద, ఇంకొకరికి పెండ్లాము కింద అన్నీ  నీవై పుడుతూ ఉంటావు. నీవు ఇదని, నీతో నాకు సంబంధం ఇదని చెప్పగలనా? (భగవంతునికి ఒక నిర్వచనమివ్వలేనని అన్నమాచార్యులు అంటున్నారు).

 

ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని –

మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

ముఖ్యపదములకు అర్ధములు: ఆకులేని అడవి = మానవుని మనస్సు; మూడుతోకల పెద్దపులి= పెద్దపులి వంటి భయంకరమైన త్రిగుణములను; మేక = సత్వ గుణము;  మేక యొకటి = సత్వ గుణమునే నమ్ముకుని వున్న వాడు​; యెత్తి మింగేరా = అవలీలగా హరించి వేసినది.

భావము:  మానవుని మనస్సు అను అడవిలో త్రిగుణములను పులి వర్తించుచున్నది. సత్వ గుణమునే నమ్ముకుని వున్న మేక వంటి వాడు ఆ పెద్దపులిని అమాంతముగా మ్రింగి వేసెను.

వివరణము: మనమంతా ఈ త్రిగుణములకు లోనై వుందుము. ఈ త్రిగుణములలో ఒక్కొక్క సమయములో ఒక్కో గుణముది పైచేయిగా ఉంటుంది. ఈ గుణములే నాశములేని నిత్యమగు జీవాత్మను అశాశ్వతమగు దేహమునకు బంధించును. సత్వ గుణమునే నమ్ముకుని వున్న మాహానుభావులు కొందరు భగవంతుని కృపవలన త్రిగుణములను హరించి వేసుకొందురు. అదే మోక్షమన్నది.

పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి –

కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

 

భావము:  మనము తప్పఈ ప్రపంచమంతా  పున్నమ వెన్నెలలో విహరించుచున్నారు అనిపించును. మమల్ని ఇలా వదిలేసి వన్నెలాడితోను గూడి కిన్నెర మీటుచు పొయ్యేవా ఓ వేంకటేశా?

 

అర్థరాత్రి వేళలోని రుద్రవీణ నెత్తుకొని –

నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

ముఖ్యపదములకు అర్ధములు: అర్థరాత్రి వేళలో = ఆచార్యులవారు ఈ లోకము యొక్క స్పృహలోలేని సమయములో;  రుద్రవీణ నెత్తుకొని = తనను తాను మరచి ఆ దైవమునకు సమర్పించు కొనగా; నిద్రించిన నిన్ను పాడగ = ఆ సమయములో తానేమి చేయుచున్నది ఆచార్యులవారికి తెలియదని ఏ దైవమును చూచిరో తెలుపలేనని అంటున్నారు.

భావము:  దైవమా! నిన్ను కలిసే సమయంలో నా కన్నులకు అగోచరమైనా, ఆ స్థితిలో నేనే వీణనై రాగములు పలికించి నిన్ను కీర్తించి పాడినట్లు లీలగా గుర్తు.

-X-X-The End-X-X-

 

 

No comments:

Post a Comment

207. inniyu mugisenu iTu nIlOnane (ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె)

  అన్నమాచార్యులు 207. ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె (inniyu mugisenu iTu nIlOnane)   Introduction: "This poem is a masterpiece amo...