అన్నమాచార్యులు
213.
హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు
For Commentary in English please press here
ఉపోద్ఘాతము:
అన్నమాచార్యులు మానవమాత్రులు చేరలేని అత్యున్నత శిఖరాలను
అధిరోహించి తానుగన్న విషయములను లోకకల్యాణమునకు తోడ్పడునట్లు వ్రాశారన్నది మాత్రము వాస్తవము.
వారు తత్వమును చెప్పలేదు. వారి దృష్టికి కానవచ్చినది వెల్లడించారు. మానవునికి అహము, డంభము, దర్పము,
మదము, అహంకారము, కోపములను
తెరలు తొలగిపోతే కనబడునది సత్యమే. ఆ సత్యమునే వారికి తెలిసిన విధములలో, అనేక రీతులలో, అనేక మార్గములలో, లెక్కించలేనన్ని కీర్తనలలో, వారికి కలిగిన అలౌకికానందమును
వ్యక్తపరిచిరి.
అట్టి విశిష్ట
స్థితికి చేరుకొన్న అన్నమాచార్యుల కీర్తనలకు వ్యాఖ్యానము వ్రాయుట సాహసముతో కూడుకొన్నదే.
నాకు తెలిసినది మీ ముందుకు పెట్టి వీనిని పరిశీలించమని వేడుకుంటున్నాను.
ముఖ్యంగా ఈ పల్లవిని విడగొట్టి చూచినా సులభంగా బోధ పడదు.
కాలగతిలో భాష వాడుకలోను, ప్రయోగములోను చోటు చేసుకున్న
పరిణామములతో ఇది మరింత జటిలమయ్యింది. ఈ కీర్తనలో చెప్పిన విషయములను ఇరవైయ్యవ శతాబ్దపు
తత్వవేత్తల పరిశీలనలతో పోలి వుండడం యాదృచ్ఛకము కాదు.
మానవులంతాా
కండీషనింగ్'కు (స్థితివ్యాజమునకు) గురి యౌదురన్నది నేడు అందరూ ఒప్పుకున్నదే. కానీ అన్నమాచార్యుల కాలములో ఈ విషయమును వెల్లడించుట
విప్లవాత్మకమే.
కీర్తన సంగ్రహ భావము:
పల్లవి: “హరి సమీపంలోనే ఉన్నాడు. అయితే హరి దగ్గరకు (మనసు) పరుగెత్తనివ్వదు. జీవితం పొడవైనదైనా దాన్ని పొట్టిగా మార్చుకుంటాం. ఇది గోవిందుని మాయ” అంటున్నారు అన్నమాచార్యులు. అంతరార్థము: మాయలకు నిలయమౌ ఓ మానవుడా! ఈ చిన్ని జీవితాన్ని పణంపెట్టి మరీ సమీపములోనే ఉన్నహరిని సేవించుటకై వినియోగించుము.
మొదటి చరణం: నిత్యము పంచేంద్రియములను ఐదు చెరువులను అదేపనిగా తట్టుచూ మనసు అను మహా ప్రవాహము పరుగిడుతూనే ఉండును. ఐతే అది లోతుకు వెళ్లలేదు. (పైపైనే తిరుగును). తనలోనే తాను శోషించును. సంతోషించును. ఇదియే దైవమాయ. అదియే కండీషనింగ్ (స్థితివ్యాజము).
రెండవ చరణం: పంచభూతాలనే ఐదు తోఁటల మీదుగా కాలము అనే ఒక్కకాలువ ప్రవహించుచునుండు. ఎంత కాలమైనా ఆ శరీరమునకు మేలు కలుగదు. ఆ కాలమనే ప్రవాహము తోలుఁతిత్తిని (ఈ శరీరాన్ని) ఈడ్చుట ఆపదు. ఈ మాయ ఆ శరీరమునకు తగినదే.
మూడవ చరణం: పంచప్రాణములు అతి సుకుమారమైనవి. వాటిని చుట్టుకొని పుట్టుకలు అను ఏరు అతిశయించుచు పారుతూ ఉండును. ఆ పంచభూతాల తోఁటల మధ్యలో వుండి బలము, పరిమితి (ఇచ్చువాడు) శ్రీవేంకటేశ్వరుఁడు. మానవుని నైజమే లోపలికి పోనివ్వదు. మాయను కనుగొననివ్వదు.
కీర్తన:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 253-2 సంపుటము: 3-303
Details
and explanation:
టీకా: హరి = హరి; దగ్గరనే = సమీపములోనే; వున్నాఁడు = వున్నాఁడు; అందాఁకాఁ = అప్పటి దాకా; బారనీదు = పరుగెత్తనివ్వదు; కురచలోనే = పొట్టిగా వుండగానే; మగుడు = వెనుకకు మరలు; గోవిందు మాయ= గోవిందుని మాయ (ఇక్కడ మనిషి అని తీసుకొనవలెను).
భావము: “హరి సమీపంలోనే ఉన్నాడు. అయితే హరి దగ్గరకు (మనసు) పరుగెత్తనివ్వదు. జీవితం పొడవైనదైనా దాన్ని పొట్టిగా మార్చుకుంటాం. ఇది గోవిందుని మాయ” అంటున్నారు అన్నమాచార్యులు.
వివరణము:
మొదటి భాగం:
మనిషి తన జీవితాన్ని పూర్తిగా అనుభవించక ముందే వెనుకకు వెళ్లిపోతాడని పల్లవి సందేశం. అన్నమాచార్యులు అలా ఎందుకు అన్నారో ఆలోచింతము. మానవుని భౌతిక జీవన కాలము గురించి కాదు ఇక్కడి చర్చ.
భగవద్గీత నాలుగో అధ్యాయంలో ఐదవ శ్లోకం దీన్నే తెలుపుతున్నది. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున (= ఓ అర్జునా మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. నీ వెరుగవు. నే మరువను.) జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ 7-18. దృఢనిశ్చయము కలిగి, బుద్ధి నా యందు ఐక్యమై, మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగిఉన్నవారు, స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను. ఈ రెండు శ్లోకములను క్రోడీకరించిన ఆ స్థితికి చేరిన భక్తుని మనసు భగవంతుని మనసుతో కలసి పయనించును. ఐతే ఇది మానవుడు స్వయముగా సాధించలేడు. తన ప్రయత్నము ద్వారా భగవద్ కృపకు పాత్రుడు కాగలడు.
ఆ సమయములో మానవునికి తనకు ఎదుటి ప్రపంచమునకు గల మానసిక దూరము తొలగి ప్రపంచమునందు తనను, తనలో ప్రపంచమును చూడగలుగును (భగవద్గీత6-29). అట్టి దివ్యము, పావనము అగు జీవితము ఒక్కనాటిదైననూ చాలని అన్నమాచార్యుల అభిప్రాయము.
రెండవ భాగం:
జీవితం వెళ్లినట్లుగా కాక మనం అనుకున్నట్లు జీవితం గడపాలని ఆలోచించుదుము. జాగ్రత్తగా గమనిస్తే, రోజువారి జీవితంలో సత్యమును సమ్మతింపక సంఘర్షణలతో, అవాస్తవికత దృక్పధంతో సహజ శక్తిని కోల్పోతు చివరకు జీవితాన్ని ముగిస్తాము. అన్నమాచార్యులు చెప్పిన ”లోక రంజకము తమలోని సమ్మతము”ను వమ్ము చేస్తూ కాలం గడిపేస్తాం. జీవకళను జీవశక్తిని వృథా చేస్తూ మనము అమర్చుకున్నట్లుగా జీవనము సాగాలని మనల్ని మనమే హింసించుకుంటాము. ఈ రకముగా అనూహ్యమైన పొడవు గల జీవితాన్ని కురచగా చేసుకుంటాం.
మనము నియంత్రణను స్వతంత్రతను ఒకే విధంగా చూస్తాం. అన్నమాచార్యులు చెప్పినట్టుగా మనసును పారనివ్వము. ఎవరో ఒక సినిమా హీరో ఉన్నట్టుగానో, ధనవంతులు ఉన్నట్లుగానో, ఫ్యాషన్ ఐకాన్లు ఉన్నట్లుగానో ఉండటానికి, ఇలా ఎవరికి తోచినట్లుగా వారు మనసును కట్టడి చేస్తారు. దానిని తనలా ఉండనివ్వం. ఈ రకమైన కట్టడిని మనము స్వతంత్రం అని భావిస్తాం. ఇంతకంటే అవివేకం ఏముంటుందండి.
ఇప్పుడు చెప్పండి "హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు" అన్నది ఎంతవరకు నిజమో? మన కండీషనింగ్ (స్థితివ్యాజము) అతి భయంకరము. వున్నవి లేనట్లుగా, లేనివి వున్నట్లుగా చూపిస్తుంది. అందుకే మనిషిని అన్నమాచార్యులు "గోవిందు మాయ" అని సంబోధించారు.
అంతరార్థము: మాయలకు నిలయమౌ ఓ మానవుడా! ఈ చిన్ని జీవితాన్ని పణంపెట్టి మరీ సమీపములోనే ఉన్నహరిని సేవించుటకై వినియోగించుము.
టీకా:
చెనకి = బాదుచూ, మొత్తుచూ; పంచేంద్రియపు = పంచేంద్రియముల;
చెరువు లైదింటికి = చెరువులు ఐదింటికి; మనసనెడి దొకటి = మనసు అన్నది ఒకటి; మహా ప్రవాహము = మహా ప్రవాహము;
దినముఁ = ప్రతిరోజు; బారుచునుండు = అలా పరుగిడుతూనే ఉండును; దిగువకు = లోతుకు; వెళ్లలేదు
= వెళ్లలేదు; తనలోనే తానిగురు = తనలోనే తాను ఇంకి పోవును,
తనలోనే తాను శోషించును, తనలోనే తాను సంతోషించును, దైవమాయ = ఇది దైవమాయ.
భావము: నిత్యము పంచేంద్రియములను ఐదు చెరువులను అదేపనిగా తట్టుచూ మనసు అను మహా ప్రవాహము పరుగిడుతూనే ఉండును. ఐతే అది లోతుకు వెళ్లలేదు. (పైపైనే తిరుగును). తనలోనే తాను శోషించును. సంతోషించును. ఇదియే దైవమాయ. అదియే కండీషనింగ్ (స్థితివ్యాజము).
వివరణము:
మొదటి భాగం:
మనసు అను మహా ప్రవాహము పంచేంద్రియములను చెరువులను తాకి తాకి అవి కల్పించు సుఖములలోనే తేలియాడుచూ తృప్తిని పడయుచుండును. ఇది అందరికీ తెలిసినదే. దీనికి కారణం కూడా భగవద్గీత చెప్పేసింది. "మానవులు పాపములను చేయవలెనని కోరనప్పటికీ దేనిచేత ప్రేరేపింపబడి బలాత్కారముగా పాపములు చేయుచున్నారు?" (అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః – 3-36)..
దీనికి సమాధానంగా కృష్ణుడు: "కోరికలు, కోపము—ఏదో చేయాలనే బలమైన ప్రేరణ నుండి ఉద్భవిస్తాయి" (కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః – 3-37). "ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి" అన్న ఆతృతతో మనం ప్రపంచంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తాం. కానీ, ఇవేవీ సంబంధం లేని, స్థిరమైన మనసుతో—అంటే, మన అంతరగములో అన్ని స్థాయిలలోను మనసు & జ్ఞాపకాల (మెమొరీ) ప్రతిస్పందన అగు ఆలోచనలు ఒకదానితో మరొకటి పోటీ పడకుండా తొలగిపోతే—ఒక కొత్త ప్రపంచం మన ముందు తెరచుకుంటుంది.
రెండవ భాగం: మహా తత్వవేత్తలు ఏమన్నారు?
ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తిగారి ప్రకటన చూడండి. దానికి తెలుగుసేత కూడా ఇచ్చాను.
మీరు ఎప్పుడైనా పూర్తిగా కదలిక లేకుండా చాలా నిశ్శబ్దంగా కూర్చున్నారా? మీరు ప్రయత్నించండి – నిజంగా స్థిరంగా, వెనుకను నిటారుగా ఉంచుకుని కూర్చోండి, మరియు మీ మనసు ఏమి చేస్తుందో గమనించండి. దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించకండి, ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు, ఒక ఆసక్తి నుంచి మరో ఆసక్తికి అది మారిపోకూడదని అనుకోకండి. అదెలా ఎగిరిపోతుందో కేవలం తెలుసుకోండి. దానిని మార్చాలనే ప్రయత్నం చేయకండి, కానీ ఒక నదితీరంపై కూర్చొని నీరు ఎలా ప్రవహిస్తుందో గమనించినట్టు మనసును గమనించండి.
ఆ ప్రవహించే నీటిలో ఎన్ని వస్తువులున్నాయి! చేపలు, ఆకులు, చనిపోయిన జంతువులు—అయితేనేం, నది ఎప్పుడూ జీవంతో నిండిపోయి ప్రవహిస్తూనే ఉంటుంది. మనసు కూడా అంతే. అది నిరంతరం చంచలంగా ఉంటూ, ఒక ఆలోచన నుంచి మరోదానికి, ఒక ఆసక్తి నుంచి మరో ఆసక్తికి ఒక సీతాకోకచిలుకలా ఎగిరిపోతూనే ఉంటుంది. జిడ్డు కృష్ణమూర్తిగారు అన్నమాచార్యులు ఒకేలా ఆలోచించారనితెలుస్తోంది.
మూడవ భాగం: ఎందుకు దిగువకు వెళ్లలేదు
ఇక అన్నమాచార్యులు “దిగువకు వెళ్లలేదు” ద్వారా ఏమి చెప్పదలిచారో ఆలోచింతము. ఇప్పుడు జోసెఫ్ మర్ఫీ గారి ప్రకటన చూడండి. “The first thing to remember is the dual nature of your mind. The subconscious mind is constantly amenable to the power of suggestion; furthermore the subconscious mind has complete control of the functions, conditions, and sensations of your body. Trust the subconscious mind to heal you. It made your body, and it knows all of its processes and functions. It knows much more than your conscious mind about healing and restoring you to perfect balance.” ― Joseph Murphy
(“మొదట గుర్తుంచుకోవలసిన విషయం మీ మనస్సు యొక్క ద్వంద్వ స్వభావం. subconscious mind (ఉపచేతన స్థితిలోని మనస్సు) నిరంతరం బాహ్య సూచనల శక్తికి ప్రభావితమై వాటికి అనుకూలంగా పనిజేస్తుంది; ఐతే ఉపచేతన మనస్సు మీ శరీరం యొక్క విధులు, పరిస్థితులు మరియు అనుభూతులపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. (మిమ్మల్ని బయట శక్తులు బాగు చేయలేవు.) మిమ్మల్ని నయం చేయడానికి ఉపచేతన మనస్సును విశ్వసించండి. ఇదే మీ శరీరాన్ని తయారు చేసింది. మరియు దానికి అన్ని ప్రక్రియలు మరియు విధులు తెలుసు. వైద్యం చేయడం మరియు మిమ్మల్ని సంపూర్ణ సమతుల్యతకు పునరుద్ధరించడం గురించి పైపైన తచ్చాడు, అనుభూతికి వచ్చు మనస్సు కంటే దీనికి చాలా ఎక్కువ తెలుసు.- జోసెఫ్ మర్ఫీ)
అనుభూతికి వచ్చు మనస్సును ఎదో విధముగా పరికించి తెలియవచ్చును. ఈ ఉపచేతన స్థితిలోని మనస్సు కొరకరాని కొయ్య అనుకోవచ్చును. దీనిని వెలికితీయుట కష్టసాధ్యము. జిడ్డు కృష్ణమూర్తిగారు, జోసెఫ్ మర్ఫీ గారు అన్నమాచార్యులు ఒకేలా ఆలోచించారని; ఒకే విషయమును తెలిపారని తెలుస్తోంది.
టీకా: తూలని = చలించని; పంచభూతాల తోఁటలు = పంచభూతాల తోఁటలు; ఐదింటికి = ఐదింటికి; కాలమనియెడి = కాలము అనె; దొక్కకాలువ = ఒక్కకాలువ; వారుచునుండు = పారుచునుండు, ప్రవహించుచునుండు; నేలాఁ దడియదు = ఆ నేల తడిసిపోదు = పంచభూతాలుండు శరీరమునకు మేలు కలుగదు; నీరూఁ = నీరు (= ఇక్కడ కాలము) దివియదు = లాగుట ఆపదు, ఈడ్చుట ఆపదు, ఆకర్షించుట ఆపదు; తోలుఁదిత్తికే = ఈ శరీరానికే; కొలఁది = తగినంత; దొరకొన్న = పొందిన, చెందిన; మాయ = మాయ.
భావము: పంచభూతాలనే ఐదు తోఁటల మీదుగా కాలము అనే ఒక్కకాలువ ప్రవహించుచునుండు. ఎంత కాలమైనా ఆ శరీరమునకు మేలు కలుగదు. ఆ కాలమనే ప్రవాహము తోలుఁతిత్తిని (ఈ శరీరాన్ని) ఈడ్చుట ఆపదు. ఈ మాయ ఆ శరీరమునకు తగినదే.
వివరణము:
మనం జాగ్రత్తగా గమనిస్తే కాలమును మనసును అన్నమాచార్యులు ప్రవాహం తోటి పోల్చారు. ప్రవాహం అంటే పరుగిడుచున్నదని. అంటే డైనమిక్ (గతి) అనగా దానికి ప్రమాణముగా పరిమాణము మరియు దిశ రెండూ వుంటేనే దానిని నిర్వచించ గలము. మన స్పందన జ్ఞాపకముల నుండి వచ్చును. జ్ఞాపకము అనునది కదలికలేని, స్థిరంగా ఉండునది. దానికి పరిమాణము మాత్రము చెప్పిన సరిపోవును. కాబట్టి డైనమిక్ (గతిగల) విషయమును స్థిరంగా వుండు జ్ఞాపకముల నుండి వచ్చు మనసుతో చేరలేము.
టీకా: ముట్టి = తాకి, చుట్టుకొని; పంచప్రాణముల = పంచప్రాణములను; మొలకలు = అంకురము, లేత; ఐదింటికి = ఐదింటికి; పుట్టుగులనియేటి = పుట్టుకలు అను; యేరు = ఏరు; పొదలి = అతిశయించుచు, వ్యాపించుచు; పారుచునుండు = పారుతునుండు; చెట్టుచెట్టుకే = ఆ పంచభూతాల తోఁటలకు; కొలఁది = బలము, పరిమితి; శ్రీవేంకటేశ్వరుఁడు = శ్రీవేంకటేశ్వరుఁడు; నట్టనడుమ నున్నాఁడు = వీటికి మధ్యలో నున్నాఁడు; నాననీదు మాయ = మానవుడే లోపలికి ఇంక నివ్వడు, పోనివ్వడు.
భావము: పంచప్రాణములు అతి సుకుమారమైనవి. వాటిని చుట్టుకొని పుట్టుకలు అను ఏరు అతిశయించుచు పారుతూ ఉండును. ఆ పంచభూతాల తోఁటల మధ్యలో వుండి బలము, పరిమితి (ఇచ్చువాడు) శ్రీవేంకటేశ్వరుఁడు. మానవుని నైజమే లోపలికి పోనివ్వదు. మాయను కనుగొననివ్వదు.
వివరణము:
జంబూద్వీపమును మహాభారతములో కూడా పేర్కొన్నారు. సృష్టి అంతా చెట్టునుంచి వచ్చినట్లు తెలుస్తొంది. వాటిని ప్రత్యక్షముగా చూచినవారు అన్నమాచార్యులు. జిడ్డు కృష్ణమూర్తిగారు కూడా దాదాపు అటువంటివాటినే దర్శించారని Jiddu Krishnamurti: Years of Awakening అను పుస్తకం ద్వారా తెలియ వచ్చును. మొత్తం మీద మానవునికి అడ్డు మానవుడే (అతడే) అని అన్నమాచార్యులు చెప్పారు.
మరణము లేని జీవనము లేదు. ఏదైనా నిరంతరంగా కొనసాగాలి అంటే, అది నిరంతర పునరుజ్జీవనంతో (జీవనము-మరణము-జీవనము) అను చక్ర క్రమములో తిరుగుతుండవలెను. ఇదే ఈ చరణానికి ఆంతర్యము.
x-x-x-xx-x-x-x
No comments:
Post a Comment