Thursday, 6 March 2025

T-212. ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య

 అన్నమాచార్యులు

212. ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య

ఉపోద్ఘాతము: సామాన్యముగా కనబడు ఈ కీర్తనలో అన్నమాచార్యులు అసాధారణమైన అర్థాలను చొప్పించారు


కీర్తన 

రేకు: 267-3 సంపుటము: 3-385 

ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య
గాఁటపుహరి యొక్కఁడే గతి మా కిఁకనయ్య
పల్లవి॥ 

మరుగుచు శ్రీహరి మాయలోఁ జిక్కినయట్టు
గరిమలఁ గులకాంతకాఁగిటఁ జిక్కితిమయ్య
తిరముగఁ గాలములు దిగమింగినయట్టు
సొరిది చవులు మింగుచు నున్నారమయ్య
ఏఁటి॥ 

జననిగర్భములోన చక్కఁగా మునిఁగినట్టు
మునుకొని నిద్దురల మునిఁగి వున్నారమయ్య
చనవునఁ గర్మమనే జలధిలో నున్నట్టు
ధనధాన్యాల నడుమఁ దగిలి వున్నారమయ్య
ఏఁటి॥

పేదవాఁడు నిధిగని పెక్కువ బతికినట్టు
గాదిలి శ్రీవేంకటేశుఁ గని చెలఁగితిమయ్య
యీదెస మొక్కే దైవ మెదురుగావచ్చినట్టు
ఆ దేవుఁడే మాకు నంతరాత్ముఁ డాయనయ్య ఏఁటి॥ 

Details and explanation: 

Details and explanation: 

ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య
గాఁటపుహరి యొక్కఁడే గతి మా కిఁకనయ్య
     పల్లవి 

టీకా: ఏఁటి పరిణామము= “తర్వాత ఏమవుతుంది (అన్న ఆత్రుతని అన్నమాచార్యులు చూపుతున్నారు); మమ్మేల = ఏల మమ్ము; యడిగేరయ్య = అడుగుదురయ్య​; గాఁటపుహరి = అతి కష్టమైన హరి, దుర్లభమైన హరి;  యొక్కఁడే =ఒక్కడే; గతి = శరణము; మా కిఁకనయ్య = ఇక మీదట​. 

భావము: శ్రీహరికి శరణము చేసిన తర్వాత ఏమవుతుంది?’ అని పదెపదే మమ్మల్ని ఎందుకు అడుగుతారయ్యా? ‘అతి దుర్లభమైన శ్రీహరి ఒక్కడే శరణముఅన్నది తెలియకుండా ఈ ప్రశ్నలతో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దయ్యా అంటున్నారు అన్నమాచార్యులు. 

వివరణము: 

మొదటి భాగం: తర్వాత ఏమవుతుంది?’ అన్న ప్రశ్న ఉదయించడం సామాన్యము. అయితే ఈ ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్పగలరా? వాస్తవానికి ఎవరికీ తెలియదు. అయితే ఈ ప్రశ్నకి సమాధానం లేకపోయినా, మనల్ని మనము సంతృప్తి పరచుకునేందుకు అనేక సమాధానాలు వెతుక్కుంటూ కాలం గడిపేస్తాం. “శ్రీహరి శరణముచేయకుండా ఈ ప్రశ్నలు మనల్ని వేధిస్తున్నాయి అని తెలుసుకోం. 

అంతే  శరణాగతి చేస్తే 'తనకు ముక్తి లభిస్తుందా?’ బంగారు మేడలు వస్తాయ?’ అను సందేహాలు వేధిస్తుంటే శరణాగతి చేయలేము. భాగవతం లోని క్రింది ఉదాహరణ చూడండి. 

ఏ విధంగా ముక్తి శ్రీ లభిస్తుందో తెలియ చేయుమని తన తల్లి దేవహూతి ప్రశ్నింపగా కపిలుని రూపములోని విష్ణువు - “ముక్తి, మోక్షం ఇవి ఒక కోరికను తెలిపే విషయాలు కాని మహాత్ములైన వారు ఏ కోరికా లేకుండా నన్ను స్మరిస్తూ నా మహిమలను పరస్పరం చర్చించుకుంటూ తమ సర్వస్వాన్నీ నాకే సమర్పించి సంతోషంతో ఉంటారు. ఇది అమలిన భక్తి...!" అని వివరిస్తాడు.

చ. అమలినభక్తిఁ గొందఱు మహాత్ములు మచ్చరణారవింద యు
గ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై యితరేత రానులా
పముల మదీయ దివ్యతనుపౌరుషముల్ కొనియాడుచుండి మో
క్షము మదిఁ గోర నొల్ల రనిశంబు మదర్పిత సర్వకర్ములై. (భాగవతం 3-878)

 

రెండవ భాగం: మానవునికి గల అవస్థలు రెండే. ఒకటి మనం ఉన్నట్లు ఉండడం. రెండవది హరిభక్తిని మునిగి ఉండటం. ఈ స్థితులు ఒకదానికి ఒకటి సంబంధం లేనివి. మనమున్న స్థితిలో ఎంత కాలం ఉన్నా కూడా, కాలానుగమనముగా క్రమముగా అన్నమాచార్యులు చెబుతున్నటువంటి భక్తిని చేరుకోలేం. అటువంటి భక్తి శరణాగతి చేయకుండా దొరకదు. అందుకనే ఆచార్యులవారు మహి నుద్యోగి గావలె మనుజుఁడైనవాఁడుఅన్నారు. 

కాబట్టి మనం ఉన్న స్థితినుండి అన్నమాచార్యులు పేర్కొన్న పైనస్థితికి చేరుటకు మెట్లు లేవు. అట్లని అది అసాధ్యమైన స్థితి కాదు. మానవులందరికీ 'శరణాగతి చేసేశాను ఇక పైన భారం అంతా ఆయనది"  అని ఊరక ఉండడానికి చంచలమైన మనసు అడ్డుపడు తుంది. ఈ అడ్డును తొలగించుకోవడానికి మనము చేయు ప్రయత్నము వ్యర్థము. పూర్తి విశ్వాసంతో శ్రీహరిని నమ్ముకొని ఉండుట ఒక్కటియే మానవుడు చేయగలిగిన కర్మ. ఆ పనిలోనే సమస్త మానవజాతి తడబడుతున్నది. 

అంతరార్థము: సందేహము కానీ శరణాగతి కానీ రెండింటిలో ఒకటే సాధ్యం. మానవులారా మీరు ఎక్కడ ఉన్నారో మీరే నిర్ణయించుకోండి.

 

మొదటి చరణం 

మరుగుచు శ్రీహరి మాయలోఁ జిక్కినయట్టు
గరిమలఁ గులకాంతకాఁగిటఁ జిక్కితిమయ్య
తిరముగఁ గాలములు దిగమింగినయట్టు
సొరిది చవులు మింగుచు నున్నారమయ్య
ఏఁటి॥ 

టీకా: మరుగుచు = అలవాటుపడుచు ము;  శ్రీహరి మాయలోఁ = శ్రీహరి మాయలలో;  జిక్కినయట్టు = చిక్కినట్లు; గరిమలఁ = గురుత్వాకర్షణ శక్తి లాంటి; గులకాంతకాఁగిటఁ= కులకాంతకాఁగిట్లలో; జిక్కితిమయ్య = చిక్కితిమయ్య; తిరముగఁ= స్థిరముగా; గాలములు = సమయము (మన జీవితమును); దిగమింగినయట్టు = దిగమింగినట్లు; సొరిది = క్రమము, వరుస; చవులు = రుచులు; చవులు మింగుచు నున్నారమయ్య =  ఈ ప్రపంచములోని రుచులను మింగుచు కాలము గడుపుతున్నామయ్యా. 

భావము: మనమందరం అలవాటులో పొరపాటుగా శ్రీహరిమాయలో చిక్కుకొని కాలం వృథా చేసుకుంటాం. ఎలాగైతే గురుత్వాకర్షణకు మనమంతా భూమికి అతుక్కుని ఉన్నట్లు కులకాంత కౌగిలి అనే ఆకర్షణలో మనమంతా చిక్కుకొని ఉంటాము. కాలము ఎప్పటిలాగే స్థిరముగా జీవితములను దిగమింగుచున్నట్లు ప్రపంచంలోని రుచులను మింగుచు క్రమముగా మనం కాలమును గడిపి వేస్తున్నాం. (వృథా చేసుకుంటాం) 

వివరణము: 

మరుగుచు శ్రీహరి మాయలోఁ జిక్కినయట్టు: మనసు చిక్కపట్టుకుని నేనీసారి తప్పు చేయను, తప్పటడుగు వేయను అని సంకల్పం చేసిన తర్వాత కూడా మనం తిరిగి పప్పులో కాలు వేస్తాం. 

తిరముగఁ గాలములు దిగమింగినయట్టు: చాలా మంది దేవుడు ఏదో మాయ చేస్తున్నాడు, కనపడకుండా దాక్కున్నాడు అని భావిస్తూ ఉంటారు నిజానికి దైవము, కాలము మన కళ్ల ముందు కనబడుతూనే మనలను మురిపిస్తూనే క్రమముగా జారుకుంటాయి. వానిని పట్టుటకు దేవతల చేతను, మునుల చేతను, మానవులచేతను సాధ్యము కాలేదు.

రెండవ చరణం

జననిగర్భములోన చక్కఁగా మునిఁగినట్టు
మునుకొని నిద్దురల మునిఁగి వున్నారమయ్య
చనవునఁ గర్మమనే జలధిలో నున్నట్టు
ధనధాన్యాల నడుమఁ దగిలి వున్నారమయ్య ఏఁటి॥ 

టీకా: జననిగర్భములోన = తల్లి గర్భములోన;  చక్కఁగా మునిఁగినట్టు = నిండుగా శిశువు మునిఁగివున్నట్టు; మునుకొని = ముందునకు పోతూ కూడా;  నిద్దురల = ఆ శిశువు లాగనే నిద్దురలో; మునిఁగి వున్నారమయ్య = మునిఁగి వున్నారమయ్య; చనవునఁ =కోరికల; గర్మమనే = (చిక్కి) కర్మమనే;  జలధిలో నున్నట్టు = సముద్రములో మునిగివున్నామయ్య; ధనధాన్యాల నడుమఁ దగిలి వున్నారమయ్య = ధనధాన్యాల లెక్కలలో నలుగుతున్నామయ్యా. 

భావము: తల్లి గర్భంలో మునిగి ఉన్న శిశువు బయటకు వచ్చికూడా ఆ నిద్రావస్థనుండి బయటకు రావటం లేదు. కోరికల చిక్కి సముద్రములో మునిగివున్నామయ్య. ధనధాన్యాల లెక్కలలో నలుగుతున్నామయ్యా. 

వివరణము:

జననిగర్భములోన చక్కఁగా మునిఁగినట్టు: అన్నమాచార్యుల క్రింది కీర్తనను ఇక్కడ మననం చేసుకోవడం సబబుగా ఉంటుంది. 

దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో |
ఉబ్బు నీటిపై నొక హంస ||పల్లవి|| 

ఈ పల్లవి యొక్క అర్థం: ఎన్నో ఒడిదుడుకులను కష్టాలను అధిగమిస్తూ పుట్టిన ప్రతీ జీవి జీవితము అత్యంత విలువైనది ఆ విషయమును విస్మరిస్తూ జీవులు ఇక్కడి ధనము సంపాదించడం పేరు సంపాదించడం అను కర్మములలో మునిగితేలుతున్నారు అని చెబుతున్నారు. 

ఈ సందర్భంగా క్రింది భగవద్గీత శ్లోకము మననం చేసుకుందాం మననం చేసుకుందాం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ।।14-8 ।। అర్థం: ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది. 

మూడవ చరణం:

పేదవాఁడు నిధిగని పెక్కువ బతికినట్టు
గాదిలి శ్రీవేంకటేశుఁ గని చెలఁగితిమయ్య
యీదెస మొక్కే దైవ మెదురుగావచ్చినట్టు
ఆ దేవుఁడే మాకు నంతరాత్ముఁ డాయనయ్య
ఏఁటి॥ 

టీకా: పేదవాఁడు = పేదవాఁడు; నిధిగని = ధనమును చూసి;  పెక్కువ = వర్ధనము, అధిక్యము;  బతికినట్టు = బతికినట్టు; గాదిలి = ప్రేమము, కరుణ;  శ్రీవేంకటేశుఁ గని =   శ్రీవేంకటేశుఁ చూసి; చెలఁగితిమయ్య = ఉత్సహముతో వున్నమయ్యా; యీదెస = ఈ వైపు; మొక్కే దైవ మెదురుగావచ్చినట్టు = తలచిన దైవమే ఎదురుగావచ్చినట్టు; ఆ దేవుఁడే మాకు నంతరాత్ముఁ డాయనయ్య = ఆ దేవుఁడే మాకు నంతరాత్ముఁ డాయనయ్య. 

భావము: పేదవాడు నిధి వస్తుందన్న ఆశతో జీవితం వెళ్లబుచ్చినట్లు, వెంకటేశ్వరుని కరుణతో సామాన్యులమైన మేము ఉత్సహముతో వున్నమయ్యా. ఇలా మొక్కామో లేదో ఆయనే ఎదురుగా వచ్చి మా అంతరాత్మడే నిలిచాడు. 

వివరణము: మనము ఈ సంసారంలో పడి అది ఇచ్చు ధనము బంధములే జీవితమనుకుని గడిపేస్తాం. కానీ అన్నమాచార్యులు ఈ సామాన్య జీవితమునకు మించి దైవమిచ్చిన ప్రేమ సాగరంలో ఉత్సాహముగా గడుపు జీవితం ఒకటిన్నదని మనకు చెబుతున్నారు. ఆ దేవదేవుడే అంతరాత్మడైనవానికి ఏమీ కొదువ?

x-x-x-x

 

 


No comments:

Post a Comment

T-212. ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య

  అన్నమాచార్యులు 212. ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య ఉపోద్ఘాతము: సామాన్యముగా కనబడు ఈ కీర్తనలో అన్నమాచార్యులు అసాధారణమైన అర్థాలను చొప్పిం...