Monday, 28 April 2025

T-220. గట్టిగాఁ దెలుసుకొంటే కన్నదే కంటి కురుమ

 అన్నమాచార్యులు

220. గట్టిగాఁ దెలుసుకొంటే కన్నదే కంటి కురుమ

 For English Version Press here

చూచే చూపులు కల్పనలు: నమ్మలేము.

ఉపోద్ఘాతము:

ఈ కవిత్వం ప్రమాణాల హద్దులను చెరిపివేస్తూ  సత్యం యొక్క తీరును, చూపుల యొక్క లోతులను వెల్లడిస్తుంది. ఇది అక్షరాల గుండెల్లో లిఖించిన కావ్యం. ఈ కీర్తన రాగి రేకుల మీద కాదు, సాహిత్యం యొక్క ఆత్మపైనే చెక్కబడింది. ​

కీర్తన సారాంశం 

పల్లవి:

నిజమైన జ్ఞానం లోపలే ఉంది, కానీ దానిని గొప్ప తీవ్రతతో, భ్రమలు లేకుండా చూడాలి. మన దృష్టిని కప్పివేసేవి మన స్వంత కళ్లే.
అవి మాయను అల్లుకొని తమకు తామే అడ్డుతెర అవుతాయి. 

మొదటి చరణం:

మనం బయట చూసేదంతా — సారవంతమైన పొలాలు, ఆచారాలు, ప్రపంచపు హడావిడి — తప్పుదారి పట్టించేది. ఈ మొత్తం బాహ్య ప్రపంచం భ్రమకు వేదికైన ఒక రంగస్థలం. మనం సత్యమని భావించేది తరచుగా కేవలం ఒక ఉత్సవము, మన గందరగోళము యొక్క విక్షేపము. 

రెండవ చరణం:

ఆకాశం — దానికి స్వంత రూపం లేదు — అన్ని రూపాలకు రంగుల తెర​గా మారుతుంది. కనిపించనిది కనిపించేదానికి జన్మనిస్తుంది. ఈ కనిపించని శూన్యం నుండి, మొత్తం ఇంద్రియ ప్రపంచం మరియు దివ్య అవతారాలు కూడా కనిపిస్తాయి. అత్యంత నిరాకారమైన, స్పర్శించని కోణం మనకు లోతైన చిక్కులకు మూలమౌతుంది.

అంతా వర్చ్యుయల్ ఐతే రియల్ ఏది? 

మూడవ చరణం:

అంతర్ముఖులైనప్పుడే నిజమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. అన్ని అనుభవాలు — లౌకిక ఆనందం, ఆధ్యాత్మిక క్రమశిక్షణ — అంతరంగములో వేళ్ళూనుకుని ఉంటాయి. ఇంకా ఆ నిశ్శబ్ద నివాసంలోనే శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. దూరంగా లేడు. విముక్తి మరెక్కడా లేదు. అత్యున్నతమైనది తక్షణం చేకొనదగినది ఇప్పటికే నీలో ఉంది. గమనించి, మనసు తలుపులు తెరువుము.

 

అధ్యాత్మ కీర్తన

రేకు: 158-2 సంపుటము: 2-276

గట్టిగాఁ దెలుసుకొంటే కన్నదే కంటి కురుమ
దట్టమైన సుజ్ఞానము తనలోనే వున్నది పల్లవి
 
బయలే పంటలు వండె బయలే పాఁడి విదికె
బయలు ప్రపంచమై భ్రమయించెను
బయటనే ప్రకృతియు బయటనే జీవులు
బయటనే బ్రహ్మము పరిపూర్ణమాయె గట్టి
 
ఆకసము చూలాయ నాకసము రూపులాయ-
నాకసము సంసారమై యలవడెను
ఆకసాన దివియును నాకసాన లోకములు
ఆకసాన శ్రీహరి యవతారమందెను గట్టి
 
అంతరంగమే భోగము అంతరంగమే యోగము
అంతరంగమే అన్నిటి కావాసమయ్యే
అంతరంగాన శ్రీవేంకటాధిపుఁ డున్నవాఁడు
అంతరంగాన మోక్షము అతఁడే యొసఁగెను గట్టి

 Details and Explanation: 

గట్టిగాఁ దెలుసుకొంటే కన్నదే కంటి కురుమ
దట్టమైన సుజ్ఞానము తనలోనే వున్నది
పల్లవి 

కురుమ = పొడవైన ఉన్ని దారం, Long wool;


భావము: 

గట్టిగా తెలుసుకుంటే - తిరస్కరించలేని స్పష్టతతో, దృఢమైన మనోబలంతో, అంతిమ సత్యాన్ని పూర్తిగా తెలుసుకుంటే, 

కన్నదే కంటి కురుమ  - మనసులోని తెరలే చూసే దృశ్యానికి అడ్డు. అది ప్రపంచపు లోపం కాదు.  మన చూపులే వంకర.  

దట్టమైన సుజ్ఞానం తనలోనే ఉన్నది — లోతైన, ఘనమైన నిజమైన జ్ఞానం మనలోనే ముందే నాటివుంది.


తాత్త్విక చర్చ: 

ఈ పల్లవి చాలా సరళమే కానీ అది మనిషి స్థితిని గురించిన గొప్ప అంతర్దృష్టిని వెల్లడిస్తుంది. 

చూపు (దృష్టి లేదా గ్రహణశక్తిని సూచిస్తూ) తానే తనను మోసం చేసుకుంటుందని  అన్నమాచార్యులు తెలిపారు. ఈ అడ్డంకి బాహ్యమైనది కాదు. దాన్ని చూసేవాడే స్వయంగా నేస్తాడు — ఒక సాలీడు తానే నేసుకున్న జాలంలో చిక్కుకున్నట్టు. 

ఎక్కడా వెతుకనవసరం లేదు. నిజమైన జ్ఞానం మనలోనే ఉంది, మన స్వంత భ్రమల ధూళితో మాత్రమే కప్పబడివుంది. 

తరువాత, దట్టమైన సుజ్ఞానము - అంటే బలమైన, సాంద్రతర జ్ఞానసంపద కాదు  అప్పటికే తనలో వుందనే నిజం  తెలియజేయ బడుతుంది. గీతలో పేర్కొన్న స్వధర్మం. అది వ్యక్తిగతమైన ఒక ప్రకాశం - ఆ వ్యక్తికి మాత్రమే తెలిసిన తన జీవితం యొక్క అంతరార్థం.


పోలికలు మరియు సమానాంతర పరిశీలనలు

ముందుగా భగవద్గీత శ్లోకం:


ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా

కామరూపేణ కౌన్తేయ దుశ్పూరేణానలేన చ
(3-39) 

ఎంతటి జ్ఞానికైనా, అతని జ్ఞానం కోరికల వలయంలో చిక్కుకొని మొద్దుబారుతుంది. అన్ని రూపాలలోను వ్యాపించి, ఆర్పలేని తాపమై మండించే కోరిక — జ్ఞానానికి నిత్య శత్రువు.

ఇక్కడ కోరిక అనేది శారీరక, వస్తుసంబంధమైన కోరికలకే పరిమితం కాదుతెలుసుకోవాలనే ఆతురత, నిర్ధారణ కావాలనే తపన, ఇతరులకంటే తాను మెరుగు అని చూపించుకునే ప్రయత్నం, తనకు ఒక గుర్తింపును ముద్రించుకోవాలనే ఆవేదన — ఇవన్నీ మన దృష్టిని కప్పివేస్తాయి.


జిడ్డు కృష్ణమూర్తి పరిశీలనలు:


"ప్రతి మనిషికీ, తాను ఏమిటో, జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నాడోఅని ముందుగానే రూపొందించుకున్న ఒక ఊహా చిత్రం వుంటుంది. ఆ చిత్రమే మనల్ని మనలాగా చూడకుండా ఒక అడ్డుగోడలా మారుతుంది." 

అన్నమాచార్యులు పేర్కొన్న "కంటి కురుమ" లాగే, ఈ స్వయంకల్పిత చిత్రము మనల్ని అన్ని కోణాలలో ప్రభావితం చేస్తుంది - తెలిసి కానీ తెలియక కానీ. దీని ఫలితంగా, మనకు ప్రత్యక్షమయ్యేది నిజమైన జగత్తు కాదు; మన ఆశలు, భయాలు, అభిలాషలు మాత్రమే కనిపిస్తాయి.


చిత్ర సారూప్యత – మాగ్రిట్ యొక్క అధివాస్తవిక చిత్రం " సంతోషానికి సూత్రము The Pleasure Principle" (1937) 



ఒక చక్కగా ముస్తాబైన పురుషుడి బొమ్మ చూపించబడింది. కాని అతని ముఖం తెల్లని కాంతి విస్ఫోటముతో పూర్తిగా అదృశ్యమైపోయింది. 

ఆ కాంతి తేటపరచదు; అది దారితప్పిస్తుంది. 

ఈ ప్రకాశం అజ్ఞానానికి సంకేతం కాదు. ఇది మేధావితనము, ప్రతిభలపై  ఆధార భావానికి - "తెలుసుకోవాలి", "తెలివిగా కనిపించాలి", "దృఢంగా నిలవాలి" అనే మానసిక దహనానికి ప్రతీక. 

ఈ ఒక సాధారణమైన కానీ లోతైన బింబం ద్వారా మాగ్రిట్, మానవుని మౌలిక లోపాన్ని హెచ్చరిస్తాడు. అతడు నిజంగా తత్వవేత్తే. ఛాయాచిత్రంలా నిమ్మళంగా, సూటిగా, కానీ వీక్షకులకు అందీఅందనంత లోతుగా మాట్లాడతాడు. 

అన్నమాచార్యుల మాదిరిగా — కన్నదే కంటి కురుమ చూపు తానే తనను మోసం చేసుకుంటే, ఇక్కడ ముఖం తానే తన వెలుగు ద్వారా తనను కప్పుకుంది. ఆ వ్యక్తికి కనబడేది తనను కప్పిన వెలుగు మాత్రమే. ఆ కాంతి - కంటి కురుమ లాగే - నిజమైన దృష్టిని నిరోధిస్తుంది.


బయలే పంటలు వండె బయలే పాఁడి విదికె
బయలు ప్రపంచమై భ్రమయించెను
బయటనే ప్రకృతియు బయటనే జీవులు
బయటనే బ్రహ్మము పరిపూర్ణమాయె గట్టి 

భావము: బయటనే వుండు పంటలు పాఁడి మొదలగు జీవనాధరములను చూచి అదియే ప్రపంచము, సత్యమను భ్రమ కలుగును. ప్రకృతియు, జీవులును బయటనే కాన్పట్టుదురు. ముందు మనిషి తనను పుట్టించినది బ్రహ్మమని, తనకన్నాబలమైన శక్తులకు, అతీత శక్తులకు భయపడి వాటిని కొలిచి అవి తమకు  పరిపూర్ణ రక్షణగా నిలుస్తాయని నమ్ముతాడు. అన్నమాచార్యుల వారు బయట కనపడు, వాస్తవముగా మనిషి అనుభూతి చెందగల విషయములను ప్రస్తావించి అవి మాత్రమే ప్రపంచమని భ్రమ పడవలదని సూటిగా చెబుతున్నారు.


 పోలికలు మరియు సమానాంతర పరిశీలనలు: 

కళ్లకు కనబడునది సంపూర్ణముగాదని అది పాక్షికమేనని ఈ కీర్తన పల్లవి తెలుపుచున్నది.  కొంత వాస్తవము, కొంత స్వంత అనుభూతులను కలిపిన సమ్మిళితములను మనము చూచెదము. ఇది అనేక ప్రయోగములద్వారా కూడా నిర్ధారించబడినది. ఇప్పుడు క్రింది ఇంకొక​ కీర్తన పల్లవిని జాగ్రత్తగా పరిశీలించండి. 

వెలుపల మఱవక లోపల లేదు వెలుపలఁ గలిగిన లోపల మఱచు
చలమున నిదియే ఘడియ ఘడియకును సాధించిన సుఖమటు దోఁచుపల్లవి॥

బయటనున్నది మరవక లోపలిది (అంతరంగము) కానరాదు; ఒకవేళ బయటనే వుందని భావిస్తే లోపల మఱచును. పట్టుదలతో మొండిగా సాధించబోతే  గంట గంటకు నేనింత ముందుకెళ్ళాను అన్న అనుభూతి తప్ప వాస్తవముగా సాధించునది శూన్యము. కాబట్టి పెంకితనమున కాదు, సరిగా చూచుట ద్వారానే ఆ బ్రహ్మమును తెలియవలెను.

"బాహ్య ప్రపంచం జీవుల మనుగడ కోసం సృష్టించబడిన సంక్లిష్టమైన అనుసంధాన జాలము. అయినప్పటికీ, అన్నమాచార్యులవారు అది స్వతంత్ర ఉనికి కోసం అవసరమైన అంతర్గత స్వాభావిక మెరుపును, శక్తిని కలిగి ఉండదని అంటున్నారు. అందువల్ల, ఇది కేవలం అంతర్గత ధ్యానముల, మననముల పరిణామము మాత్రమే."


ఆకసము చూలాయ నాకసము రూపులాయ-
నాకసము సంసారమై యలవడెను
ఆకసాన దివియును నాకసాన లోకములు
ఆకసాన శ్రీహరి యవతారమందెను గట్టి 

ఆకసము = కంటికి కనబడని దానిని, తెలియని దానిని సూచిస్తుంది. 

అక్షరార్థం:

ఆకసము చూలాయ - (కంటికి కనబడనిది, ఊహ) ఆకాశం గర్భం ధరించింది. లెక్కలేనన్ని ఊహలకు పురుడు పోసుకుంది.

నాకసము రూపులాయ - అది అడ్డు అదుపు లేకుండా ఎన్నైనా ఆకారాలు సృష్టించగలదు.

నాకసము సంసారమై యలవడెను - ఆ మానసిక లోకం మనుషులకు ప్రపంచంగా మారింది. అలవాటైంది. (మనం ఎంత బలహీనమైన పునాదిపై నిలబడి ఉన్నామో కదా!).

ఆకసాన దివియును - మనిషి స్వర్గాన్ని ఊహించాడు (అదొక కల్పిత లోకం, అక్కడికి ఎవరూ వెళ్లలేరు. వెళ్లకుండా ఎన్ని అడ్డంకులైనా సృష్టించగలడు, ఎన్ని కట్టుకథలైనా చెప్పగలడు).

నాకసాన లోకములు - ఒకదానితో ఎందుకు ఆగిపోవాలి? (మనం ఊహల మీదే బతుకుతున్నాం. అలాంటి కల్పనలకు పూర్తిగా బానిసలయ్యాం).

ఆకసాన శ్రీహరి యవతారమందెను - శ్రీహరి అవతారం కూడా ఆ కనిపించని ప్రపంచంలో ఊహించబడింది. 

 అంతా వర్చ్యుయల్ ఐతే రియల్ ఏది? 


 వివరణము: ఈ చరణం ఊహా శక్తి ద్వారా కలుగు ప్రమాదాలను వివరిస్తుంది. 

అన్నమాచార్యులు విశ్వాసాన్ని ఎగతాళి చేయడం లేదు - మనం ఊహించిన చిత్రాలను వాస్తవమని నమ్మడమే భ్రమ. 

కనిపించనిది మానసిక రూపాలకు ఒక ఖాళీ తెరలా మారుతుంది. 

అది ప్రపంచాలుగా, స్వర్గాలుగా, తత్వాలుగా, దేవుళ్ళుగా కూడా రూపాంతరం చెందుతుంది కూడా. 

మరియు చివరికి, అవి మన జగముగా మారతాయి ( ఇప్పడు కొందరు మొబైలే లోకంగా బతుకుతున్నట్లు) - అదే మనం నివసించే ఈ భ్రమపూరిత వాతావరణం. 

విశ్వాసాలు, సిద్ధాంతాలు, భయాల ప్రపంచం తరచుగా నేరుగా చూడలేని, నిర్ధారణలేని​ దానిపై నిర్మించబడ్డాయి. అందుకే అది అసంపూర్ణమైనది. అన్నమాచార్యులు హెచ్చరిస్తున్నారు: 

ఆకాశం ఖాళీగా ఉంది, కానీ మనం దానిని కథలతో నింపుతాము.


అన్నమాచార్యులు శ్రీహరి లేడనడం లేదు.

శ్రీహరి వాస్తవమైనవాడేనని ఆయన ధృవీకరిస్తున్నారు, కానీ శ్రీహరి గురించిన మన ఊహలు మాత్రం నిజం కాదు.

సమస్యకు మూలం అదే:

నిజమైన శ్రీహరిని వెతకడానికి లేదా అనుభూతి చెందడానికి బదులుగామనం మన కోరికలు, భయాలు లేదా సిద్ధాంతాల ద్వారా రూపొందించబడిన ఒక మానసిక చిత్రంతో సంతృప్తి చెందుతాము.

ఈ చరణం ఒక సున్నితమైన కానీ దృఢమైన హెచ్చరిక:

దైవం ఊహించిన స్వర్గాలలో కానీ మానసిక చిత్రాలలో కానీ లేడు.

ఆయన నిజమైన వాడు — మరియు ఆ నిజమైన దానిని మాత్రమే అనుభూతి చెందండి, ఊహల వుయ్యాల ఎక్కకండి.


గీతా శ్లోకంతొ అన్వయం: 

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ ….. జ్ఞానే పరిసమాప్యతే4-౩౩ ॥ శ్లోకాన్ని పరిశీలిస్తే, జ్ఞానంతో చేసే యజ్ఞం అంటే అనుభూతి ద్వారాను, అనుభవము ద్వారాను సంక్రమించిన జ్ఞానాన్ని విడువమని ఆదేశం. ఐతే, ఎవరూ స్వచ్ఛందంగా మరచిపోలేరు! ఖచ్చితంగా, అది అసాధ్యం కదా! అయితే ఈ గీతా శ్లోకం యొక్క అర్థం ఏమిటి? మనస్సు నిశ్చలంగా ఉంటే (= అంటే ఒక విధమైన అపస్మారక లేదా స్మృతి రహితమైన, unconscious స్థితిని చేరుకున్నప్పుడు) ఈ అవకాశం ఉండవచ్చు. మనస్సు నిరంతరం అర్థంలేని మాటలు మాటలల్లో మునిగి వుంటే ఇది ఎప్పటికీ జరగదు. 

ఈ గీతా శ్లోకం నొక్కి చెప్పేది ఏమిటంటే, మానసిక లేదా మేధోపరమైన ఊహాగానాలు లేదా పరోక్ష జ్ఞానం (అంటే విన్నదాని నుంచి & తాను స్వయముగా తెలుచుకొన్నవి కాక) కూడా కరిగిపోవాలి. అప్పుడే అది యజ్ఞం  అవుతుంది.


ఏమిటికి ఈ ఊహా లోకాలు? 

అధివాస్తవిక చిత్రలేఖనం 'ది ఫిలాసఫర్స్ లాంప్' ద్వారా వివరించబడిన ఒక ఆసక్తికరమైన కథ​. 


"ఎటువైపు" (Philosopher's Lamp) అనే చిత్రంలో, మాగ్రిట్ ఒక గంభీరమైన దృష్టిని సారించిన మనిషిని, పక్కనే కరుగుతున్న కొవ్వొత్తిని ప్రదర్శించాడు. ఆ మనిషి పొడవాటి ముక్కు నెమ్మదిగా ఒక పైపుగా మారుతుండగా, అతడు నేరుగా వీక్షకుని తిలకిస్తున్నాడు. అతడి ఎడమవైపు ఉన్న కొవ్వొత్తి ఒక సర్పంలా వంకర వంకరగా క్రింద ఎక్కడినుంచో ఆ బల్ల మీదకి వస్తున్నట్లు అనిపిస్తుంది. టీల్ (ఆకుపచ్చ-నీలం) రంగు నేపథ్యం ఆ చిత్రానికి విచిత్రమైన, కలలంలాంటి ముసురుదనాన్ని చేకూర్చుతుంది. 

ఈ పొడవాటి ముక్కు పైపుగా మారడమంటే, మన ఆలోచనలు తిరిగి తిరిగి మనలోనే చుట్టుముడుతున్నట్లు సూచిస్తుంది. ఆ ఆలోచనలు బయట ప్రపంచానికి మార్గం చూపవు; అవి లోపలే తిరుగుతూ, మాయాదర్పణంలా పరస్పరం ప్రతిబింబించుకుంటాయి.


కరుగుతున్న కొవ్వొత్తి - తన అంతరాగ్నిలో తానే తపిస్తూ కాలిపోతూనే - ఇతరులకు వెలుగు ప్రసరింపజేసే వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. పైగా, కొవ్వొత్తి పొడవుగా సాగిన సర్పాకృతితో కనిపించడం, అల్పమైన ఇంధనంతోనూ నిరంతర శక్తినిచ్చు సామర్థ్యాన్ని సూచిస్తుంది. 

గాఢమైన సత్యం: ఈ చిత్రంలో మనిషిని, కొవ్వొత్తిని, వీక్షకుణ్ని తిలకించే దృశ్యాన్ని కలిపి, మాగ్రిట్ "మనిషి స్వేచ్ఛను కోరుకుంటాడు, కాని తన ఊహలలో సృష్టించుకున్న స్వేచ్ఛ రూపాలనే ఎక్కువగా ప్రేమిస్తాడు" అనే గాఢమైన సత్యాన్ని వ్యక్తీకరిస్తాడు. అతడు విముక్తి గీతాలను ఆలపిస్తూ తనను తాను మాయలో ముంచుకుంటాడు; కాని నిజమైన స్వేచ్ఛ కోసం కావలసిన కఠినమైన సాధనను తప్పించుకుందామనుకొంటాడు. ఈ విధంగా మాగ్రిట్, మనిషి సహజమైన అంతర్గత వ్యతిరేకతను మౌనంగా వీక్షకుని ముందు ఉంచుతాడు. 

ఈ చిత్రంలో, మాగ్రిట్ మనిషి తాను సృష్టించుకున్న మాయలో తానే మునిగి పోతూ, తాను కోరుకునే నిజమైన స్వేచ్ఛను కోల్పోతాడని సంకేతాత్మకంగా హెచ్చరిస్తాడు. మనిషి తనలోని "స్వేచ్ఛ" మరియు "మాయా స్వేచ్ఛ" మధ్య అంతరమును గుర్తించకపోతే, అతడు తానే రగిలించిన అగ్ని దగ్గర​ పెట్టిన​ వెన్నలా కరిగిపోతాడని నిశ్శబ్దంగా తెలియజేస్తాడు.


 

అంతరంగమే భోగము అంతరంగమే యోగము
అంతరంగమే అన్నిటి కావాసమయ్యే
అంతరంగాన శ్రీవేంకటాధిపుఁ డున్నవాఁడు
అంతరంగాన మోక్షము అతఁడే యొసఁగెను గట్టి 

యోగము = ప్రాప్తించినది; 

అర్థం: అంతరంగమే ఆనందం, అంతరంగమే మనకున్న సర్వస్వం. అంతరంగమే అన్నిటికీ నివాసమైంది. శ్రీ వేంకటేశ్వరుడు ఆ అంతరంగంలోనే ఉన్నాడు. ఆయనే నాకు బంధనాల నుండి విడిపించి స్వేచ్ఛను ప్రసాదించాడు.


వివరణము: 

అంతరంగం

అంతరంగం అంటే ఏమిటి? అది హృదయం యొక్క లోతుల్లో దాగి ఉందా? ముల్లు గుచ్చుకున్నప్పుడు దేనికి నొప్పి కలుగుతుంది? ఒక తీపి పదార్థం తిన్నప్పుడు ఏమి సంతృప్తి చెందుతుంది? భయాన్ని అనుభవించేది ఏమిటి? అంతరంగం కేవలం ఆలోచనల సమాహారం కాదు. అది నిజమైన, జీవమున్న అంశం. అన్నమాచార్యులు అన్నారు, "దానిని కేవలం మేధాశక్తితో కూడుకున్నదిగా పరిగణించవద్దు." 

తాను చనిపోయినప్పుడు తనను తెలియనిది, తనను తాను వెతుక్కునేది అజ్ఞానం. 

ఈ రెండు వాక్యాలను కలిపి చూస్తే, అంతరంగాన్ని బయటి మరియు లోపలి వాటిని కలిపే ఒక యంత్రాంగంగా పరిగణిస్తే, దానిని సాఫ్ట్‌వేర్ ద్వారా నియంత్రించవచ్చు. మానవ చరిత్రలో ఈ నియంత్రణ అనేక విధాలుగా ప్రయత్నించబడింది. వేల సంవత్సరాలుగా అది కనుగొనబడలేదు. బహుశా దానిని కనుగొనే సామర్థ్యం గల మేధావులు లేరేమో. మనం దానిని మెలకువగా ఉన్న వేళలలో తాకలేము. అలాగని దానిని రాత్రీ చూడలేము. ఈ విధంగా, అంతరంగం అంటే ఏమిటో మనం స్థూలంగా అర్థం చేసుకున్నాము. ఆ అంతరంగాన్ని చేరుకున్నవాడు అంతరంగనాథుడే. 


చైతన్యం: మన ప్రస్తుత చైతన్యం ఒక తెరలాంటిది, విషయాలను అస్పష్టంగా చూపిస్తోంది. నిజమైన జ్ఞానానికి ఈ అజ్ఞానపు తెర తొలగినప్పుడే ద్యోతకమగును. మనం చైతన్యమని భావిస్తున్నది కేవలం బయటి నుండి వచ్చిన రెండవ తరగతి అభిప్రాయాలు మరియు అపోహలతో నిండి ఉంది. అది వాస్తవమైన అంతరంగం కాదు - ఒక బాహ్య పొర మాత్రమే.


అన్నమాచార్యుల ఆంతర్యము: చైతన్యాన్ని నేరుగా అనుభవించలేని మన అసమర్థతను తెలియమంటున్నారు. అంతరంగం అనేది — దైవం ప్రత్యక్షం కాగల స్థలమని ఆయన నొక్కి చెబుతున్నారు. మరి ఆ విముక్తి బాహ్య ప్రయత్నాల నుండి కాదు, అంతర్గతంగా ఉన్న వాస్తవమును గుర్తించడం ద్వారా వస్తుంది. మనం ఆ విముక్తిని లేదా శ్రీహరిని ఈ అంతరంగంలోనే కనుగొనాలి. ఏ ఇతర ప్రపంచాలకు వెళ్లనవసరం లేదు. మరెక్కడా కాదు. ఆధునిక తత్వవేత్తల వలె అన్నమాచార్యులు ఇతర ప్రపంచాల ఉనికిని స్పష్టంగా తిరస్కరిస్తున్నారు.


హంస నం. 9 చిత్రం: ఆధ్యాత్మిక ప్రయాణం:

 


హిల్మా ఆఫ్ క్లింట్ యొక్క "స్వాన్ నెం. 9" సంకేతాల ద్వారా ద్వంద్వత్వం నుండి ఏకత్వం వైపు సాగే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరిస్తుంది. మధ్యలో ఉన్న ఒక రేఖకు ఒక వైపు (మన ప్రస్తుత) జీవితమును, మరో వైపు మరణమును చూపుతుంది. ఆ రేఖ పారదర్శక పారదర్శకమైంది కాదు. కుడి వైపు పెద్ద స్ఫటికాకారాలు, శాశ్వతం కాని వాటిపై మనకున్న అనురాగాన్ని తెలిపుతాయి. బొమ్మ మధ్యలోని చిన్న స్ఫటికాలు తీవ్రమైన ఆలోచనల నుండి దూరమవుతున్నట్లు సూచిస్తాయి. ఇంకా ఎడమ పోతే, ఈ స్ఫటికాలు చుక్కలుగా మారిపోతాయి - ఇది అహం పూర్తిగా తగ్గిన సూచన. ఆ చుక్కల నుంచి కాంతి పుంజాలు వెలువడి మధ్యలో కలుస్తాయి, అవి కలిసే చోట ఒక ప్రకాశవంతమైన పుష్పం కనిపిస్తుంది. ఇలా రెండు వైపులా కలవడం విముక్తిని మరియు సమతుల్యతను సూచిస్తుంది. అట్టివానికి జీవన్మరణములకు బేధముండదు. మొత్తానికి, ఈ చిత్రం పైకి కనిపించే విభజనలను దాటి మనిషి నిజంగా ఏకత్వం వైపు ప్రయాణించగలడని చూపిస్తుంది. ప్రతి మనిషికి తనలోని నిజమైన చైతన్యాన్ని స్పృశించే శక్తి ఉందని ఇది వివరిస్తుంది. (పూర్తి వివరణకు ఈ లింక్ హిల్మా ఆఫ్ క్లింట్ యొక్క "స్వాన్ నెం. 9" నొక్కండి). 

చిత్రంపై చర్చ:

మన ప్రస్తుత జీవనము ఆ కనిపించే ఏదో ఒక తలములలో ఉంటుంది, మరొకటి అక్కడ చూపిన రేఖకు అటువైపున, అస్పష్టంగా ఉంటుంది. ఆ రేఖ మన స్వంతంగా నిర్మించుకున్న జ్ఞానం, ఇది ఒక దుర్భేద్యమైన అడ్డంకి. అటువైపు ఏముందో తెలియక మనం జీవిత మంతా తహతహలతో వెంపర్లాడతాం. 

ఈ అడ్డంకి తొలగినప్పుడు, నిజమైన అవగాహన కలుగుతుంది. మనిషి తిరుగులేని సత్యాన్ని చూస్తాడు. స్పష్టత అంతా ప్రకాశిస్తుంది. నిష్కళంకమైన పరిశీలన స్వయంగా సత్యాన్ని వెలికి తెస్తుంది. అటువంటి వ్యక్తి, నటన లేని నిజమైన జీవితాన్ని అనుభవిస్తాడు. 

ఇది అన్నమాచార్యుల అంతర్దృష్టిని ప్రతిధ్వనిస్తుంది: 'అంతరంగం బంధానికి మరియు విముక్తికి రెండింటికీ నిలయం, ఎందుకంటే ద్వంద్వత్వం ఎప్పుడూ నిజం కాదు.'" 

జీవితం, ఒక విలువైన బహుమతి. దాని పరిపూర్ణంగా స్వీకరించాలి మరియు అనుభవించాలి. మనను స్వేచ్ఛ వైపు నడిపించే కార్యమే జీవిత ధ్యేయం. ఇతరములన్నీ జీవితం యొక్క ఉద్దేశ్యాన్ని తిరస్కరించడమే.


అన్నమాచార్యుల అంతరంగం: 

ఆకాశ పాకాశ మరుదైన కూటంబు/ లోకరంజకము తమలోనిసమ్మతము: మనం జీవిస్తున్న ఈ ప్రపంచం - వింతైనది, అస్తవ్యస్తమైనది, సున్నితమైనది, క్రూరమైనది - ఇదే విముక్తి యొక్క స్థలమని ఆయన నొక్కి చెబుతున్నారు. దీనిని వునది వున్నట్లు స్వీకరించడమే మానవుని చేతిలోని కర్తవ్యం. 

ఈ సత్యాన్ని వ్యక్తి అర్థం చేసుకున్న తర్వాత, చూసేవాడు మరియు చూడబడేది ఒకటైపోతారు. చేసేవాడు మరియు చేసే పని ఏకమైపోవును. మనసు నిశ్చలంగా వుంటే ఆ అవగాహనను పుట్టించు వాడే దేవుడు. 

మోక్షం ఒక భావన కాదు, ఒక ఊహ కాదు, చేరుకోవలసిన గమ్యం కాదు. అది మరణానంతరం పొందేది కాదు; బదులుగా, అది ఇప్పుడే , ఇక్కడే నిజంగా జీవించడం. ప్రస్తుతం, మనం లెక్కలేనన్ని కార్యకలాపాలలో చిక్కుకుంటున్నాము, అది మరింత పరధ్యానానికి మాత్రమే దారితీస్తుంది. ఊహలను విచ్ఛిన్నం చేయడం మాత్రమే ప్రభావవంతమైన చర్య. భగవద్గీత 4.33 యొక్క ముఖ్య సందేశం ఇదే. గీతలో వివరించబడిన యజ్ఞం ఒక త్యాగం, ప్రోగుచేయుట కానే కాదు.


 

-X-X- సమాప్తం -X-X-


3 comments:

  1. అద్భుతమైన విశ్లేషణ! ఓం నమో వేంకటేశాయ!🙏🏼

    ReplyDelete
  2. Ravi Kumar R K3 May 2025 at 04:14

    Exploring the Truth Within – A Path Shown by the Buddha
    If Divamu (దైవము) is understood as the Ultimate Truth, the Lord Buddha offers a profound way to realize it—not through blind belief, but through direct personal experience. In the Mahā Satipaṭṭhāna Sutta, he compassionately outlined how each individual can explore this Truth within themselves and uncover the Ultimate Reality.
    One powerful way to begin this inner journey is through Vipassana meditation, a practical method that trains the mind to observe reality as it is, with clarity and equanimity. This experiential path, rooted in awareness and insight, is open to all who are sincerely interested.
    The Mahā Satipaṭṭhāna Sutta and its deep meaning are widely available online for those who wish to study further.
    To learn and practice Vipassana meditation, you may explore:
    • www.imc-hyd.com
    • www.internationalmeditationcentre.org

    ReplyDelete
  3. సుజ్ఞానం మనయందే కలదు. అజ్ఞానము చేత కప్పబడియున్నది. భగవద్గీత శ్లోకం, జిడ్డు కృష్ణమూర్తి పరిశీలనలు పల్లవికి అర్థం చెప్పుతూ ఉంటే మాగ్రిట్ చిత్రం వాటికీ ఊతమిస్తున్నది.
    చరణములు కొంచెం గహనమైనవి. వ్యాఖ్యానం చాలా బాగుంది శ్రీనివాస్ గారు.
    🙏🏻

    ReplyDelete

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...