Saturday, 11 July 2026

T-338 తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా

 తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
338 తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా
For English Version Press Here

 

పరిచయం 
"తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా" అనే పల్లవి ఈ కీర్తనకు హృదయము. తల్లి ప్రేమను దాది (పెంపుడుతల్లి) అనుకరించగలదు గాని, ఆ స్థానమును భర్తీ చేయలేదు. ఈ విశ్వమంతటికి తల్లి ప్రకృతి. అది భగవానుని భౌతిక శక్తి. (భగవద్గీత 7-4: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మరియు అహంకారము - ఇవి భగవానుని భౌతిక ప్రాకృతిక శక్తి).

అయితే కొంచెం సావధానముగా పరిశీలించినచో, మానవుడు ప్రకృతి యొక్క సహజ కార్యక్రమములో అనవసరముగా జోక్యం చేసుకొనుచున్న విధానమును పెదతిరుమలాచార్యులు అత్యంత సరళమైన ఉపమానములతో తెలియజేయుచున్నారని తెలుస్తుంది. ఈ జగత్తును అనగా ప్రకృతి నడిపించు సహజ క్రమమును మనిషి తన ప్రయత్నములతో స్వాధీనపరచుకొనలేడు. మనము ఈ సృష్టికి యజమానులమని భావించరాదు (భగవద్గీత​ 3-33).

ఈ కీర్తనలో పెదతిరుమలాచార్యులు మానవుని ప్రయత్నములను ఖండించుటలేదు. ప్రకృతి తన పని తాను చేసుకొనుచుండగా, “మనిషి తన పాత్రను తెలుసుకొని, అనవసరమైన జోక్యమును విడిచిపెట్టగలడా?” అనే ప్రశ్నను మాత్రమే మన ముందుంచుచున్నారు.

అందుచేత ఈ కీర్తన భక్తిని మించిన ఒక జీవ పరిశీలనగా నిలుస్తుంది. మనము కర్తలమని భావించుచున్న చోట, మనము వేయు తప్పుటడుగును ఇది సున్నితముగా సూచించుచున్నది.

పెదతిరుమలాచార్యుల ప్రతిభ అసమాన్యము. సూర్యుని ప్రకాశం వంటి అన్నమాచార్యుల వెలుగులోను దీటుగా నిలిచింది. తండ్రికి తగ్గ తనయుడు అని మనము అనేక మార్లు చెప్పుకున్నాము. ఈ కీర్తన మరొక ఉదాహరణ అంతే.

అధ్యాత్మ సంకీర్తన
రాగి రేకు: 17-6  సంపుటము - సంకీర్తన: 15-98
తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా
చిల్లరప్రియము లేలో చెప్పేము గాకా ॥పల్లవి॥

బహు విశ్వకుటుంబవి ప్రాణులెల్ల నీ వారు
యిహ మిచ్చి రక్షింప నీ కిదే పని
నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా
బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా ॥తల్లికి॥

సర్వవిధ బంధుఁడవు సకల కృత్యాలు నీవి
నిర్వహించ నన్నిటాను నీ కిదే పని
వుర్విపై నీకార్యములు వుద్దరించక మానేవా
చర్వితచర్వణాల వేసరించేము గాకా  ॥తల్లికి॥

నీవు లోకేశ్వరుఁడవు నేమెల్లా నీ బంట్లము
యీవలఁ గాచుటకు నీ కిదే పని
శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా
దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా ॥తల్లికి॥
Details and Explanations:
పల్లవి:
తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా
చిల్లరప్రియము లేలో చెప్పేము గాకా ॥పల్లవి॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా
తల్లికి బిడ్డపై ఉండే మమత దాదికి (పెంపుడుతల్లికి) ఎక్కడ ఉంటుంది?
దేవా!  నీవు జగత్తుకు తల్లివంటి వాడవు. మేము ఈ శరీరమును, మనస్సును తాత్కాలికముగా పోషించు దాదివంటివారము. కాబట్టి ఈ జగత్తు పట్ల నీకున్న సహజ బాధ్యతను, ప్రేమను, రక్షణను మేము మాకుగా చేసుకొనలేము.
చిల్లరప్రియము లేలో చెప్పేము గాకా
ఊరకనే "మాకు నీ వంటే ఎంతో ఇష్టం" అని మాటలలో చెప్పుకుంటాము.
"నా శరీరం", "నా పని", "నా బాధ్యత", "నా ప్రపంచం" అని చెప్పుకొను మా ప్రేమ చాలామటుకు మాటలకే పరిమితం. మాకు వీనిపై యజమానిత్వ భావమే ఎక్కువ; ప్రకృతి సహజ ప్రేమ తక్కువ.
గూఢార్థవివరణము:

తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా” ఈ కీర్తనకు హృదయము. తల్లి ప్రేమను దాది (పెంపుడుతల్లి) అనుకరించగలదు గాని, ఆ స్థానమును భర్తీ చేయలేదు. ఈ విశ్వమంతటికి తల్లి ప్రకృతి. పెదతిరుమలాచార్యులవారు ఇక్కడ ఒక నిశ్శబ్దమైన పునరాహ్వానము చేస్తున్నారు.

భగవద్గీత 3-33 ఇలా చెప్పింది  వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం?” అనగా ప్రకృతి సహజ ప్రేమను వదలి కృత్రిమముగా జీవిస్తున్నామని అన్నట్లు. 

చిల్లరప్రియము లేలో చెప్పేము గాకా ఈ సందర్భంగా అన్నమాచార్యుల మాట "కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు" స్మరణీయము. మనము చెప్పే ప్రియములు అల్పములు. 

Bottom of Form


మొదటి చరణం:

బహు విశ్వకుటుంబవి ప్రాణులెల్ల నీ వారు
యిహ మిచ్చి రక్షింప నీ కిదే పని
నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా
బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా ॥తల్లికి॥ 

భావము:
కీర్తన పాదము
సాధారణ భావము

అంతరార్థము

బహు విశ్వకుటుంబవి ప్రాణులెల్ల నీ వారు
సమస్త జీవులు నీ (విశ్వ) కుటుంబానికి చెందినవారు.
ఈ జగత్తులోని జీవులపై అసలు బాధ్యత ప్రకృతిదే (దైవముదే). మనిషి ఆ వ్యవస్థలో ఒక భాగము మాత్రమే.
యిహ మిచ్చి రక్షింప నీ కిదే పని
వారికి ఈ లోకములో జీవనమిచ్చి రక్షించుట నీ పని.
జీవనమును సృష్టించుట, పోషించుట, నడిపించుట అనే బృహత్తర క్రమము ప్రకృతిలో  సహజముగా జరుగుచున్నది. దానిని మనిషి స్వాధీనపరచుకొనలేడు. (3వ చరణం వివరణ చూడండి)
నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా
వారంతా నీ సొమ్ము. వారు క్షీణించుతుంటే నీవు ఊరుకుంటావా?
జీవులలో నిహితమైనది (= ఉంచఁబడినది, దాఁచఁబడినది) నీ ఆధీనములోనున్నప్పుడు, వారి సంక్షేమము సహజంగానే ఆ వ్యవస్థలో అంతర్భాగము. మనిషి ఆందోళనకు బదులు ఆ క్రమము తెలియవలెను.
బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా
మేము ఊరకనే ఎన్నో విన్నపాలు చేసుకుంటూ ఉంటాము.
మేము ఈ ప్రాణులను మాతో కలుపుకుని నీకు చేయు విన్నపాలు ఊరకనే పైపైకి చెప్పు మాటలే కానీ వాస్తవముగా తారతమ్యములను వదిలినవారము కాము. అంతే.
గూఢార్థవివరణము: 

నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా” జాగ్రత్తగా గమనించండి ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నది స్పురించుచున్నది.

బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా” అనగా వసుధైవ కుటుంబకం మాకు నినాదం మాత్రమే. వాస్తవముకాదు.

రెండవ చరణం:

సర్వవిధ బంధుఁడవు సకల కృత్యాలు నీవి
నిర్వహించ నన్నిటాను నీ కిదే పని
వుర్విపై నీకార్యములు వుద్దరించక మానేవా
చర్వితచర్వణాల వేసరించేము గాకా ॥తల్లికి॥

భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
సర్వవిధ బంధుఁడవు సకల కృత్యాలు నీవి
అందరికీ నీవే బంధువు. సమస్త కార్యములు నీవే నిర్వహించువాడవు.
ఈ విశ్వములోని సమస్త పరస్పర సంబంధములకు మూలమైనది ఒకే సహజ క్రమము. మానవుడు దానిలో ఒక భాగము మాత్రమే.
నిర్వహించ నన్నిటాను నీ కిదే పని
ఆ సమస్తమును నిర్వహించుట నీ విధి.
జీవన ప్రవాహమును నడిపించు బృహత్తర వ్యవస్థ స్వయంగా పనిచేయుచున్నది. దానిని మనిషి తన భుజాలపై మోసుకొనవలసిన అవసరము లేదు. (3వ చరణం వివరణ చూడండి)
వుర్విపై నీకార్యములు వుద్దరించక మానేవా
దేవా! ఈ భూమిపై నీ కార్యములను నీవు అసంపూర్తిగా వదిలివేస్తావా? (ఉద్ధరిస్తూనే ఉంటావు.​)
దేవా!  నీ కార్యములు అసంపూర్ణములు కావు. సమస్తమును సహజముగా నీలో చేర్చుకుందువు.
చర్వితచర్వణాల వేసరించేము గాకా
(చర్వితచర్వణము = చెప్పిన దానినే మరల చెప్పుట) నమిలినదానినే మళ్లీ నములుతున్నట్లు శ్రమపడుతుంటాము.  మాది వృత్త చలనము
మేము పాతవాటినే నెమరు వేస్తాము.  వాటిలోనే తిరుగుతుంటాము. కానీ మొదటికే వచ్చుచున్న సంగతి  తెలియము. మా ఇప్పటి భావములు కొత్తవని తలచి వేసారుతాము. జనన మరణ​ వృత్త చలనములలో  జీవించుచున్నాము అంతే.
గూఢార్థవివరణము: 

"చర్వితచర్వణాల వేసరించేము" దీనిని భగవద్గీత లోని మూడవ అధ్యాయము 42వ శ్లోకం తోటి అనుసంధానం చేసి చూద్దాం. దీన్ని ఒక బొమ్మ రూపంలో క్రింద పెట్టాను జాగ్రత్తగా పరిశీలించవలసినది.
 
మొత్తానికి చర్వితచర్వణము అన్నది అంటే ఇక్కడే ఈ భూమిపై మనం వర్తుల మార్గంలో ప్రయాణిస్తూనే ఉంటాము. దీని నుంచి  బయలుపడు మార్గమును అన్వేషించము. అంతే.

మూడవ చరణం:

నీవు లోకేశ్వరుఁడవు నేమెల్లా నీ బంట్లము
వలఁ గాచుటకు నీ కిదే పని
శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా
దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా ॥తల్లికి॥ 

భావము:

కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
నీవు లోకేశ్వరుఁడవు నేమెల్లా నీ బంట్లము
నీవు లోకాధిపతి. మేమంతా నీ సేవకులము.
ఈ జగత్తులో మనిషి యజమాని కాదు; సమస్త జీవనవ్యవస్థలో ఒక భాగము మాత్రమే.
యీవలఁ గాచుటకు నీ కిదే పని
మమ్ములను కాపాడుట నీ బాధ్యత.
జీవనమును నిలుపుట, పోషించుట, రక్షించుట అనే సహజ క్రమము ప్రకృతిదే. మనిషి తన వంతు పాత్ర నిర్వర్తించవలెను గాని, సమస్త బాధ్యతను తనదిగా భావించరాదు.
శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా
ఓ శ్రీవేంకటేశా! నీ శాఖలవంటి మాపై దయ చూపవా?
సమస్త జీవులు ఒకే జీవనవృక్షమునకు చెందిన కొమ్మలవంటివారు. మూలమునకు కొమ్మలను పోషించుట సహజము; దానిని గుర్తించినచో భయం తగ్గును.
దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా
నీవే దైవము. మేము ఆకాశం వైపు తలెత్తి ప్రార్థించుట మాత్రమే చేయుచున్నాము.
చివరికి మానవుని వశములో మిగిలేది కర్తృత్వము కాదు; వినయము. జీవితం యొక్క విశాల క్రమమును అంగీకరించి దానియందు విశ్వాసముతో నిలుచుట.

గూఢార్థవివరణము:
 
శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా: దేవా మేము నీ శాఖలం. (భగవద్గీత రెండవ అధ్యాయము 17వ శ్లోకం). మనమంతా కూడా ఆ అవ్యయమైన దానిలో భాగములమే. కావున తిరిగి ఈ చరణం లోని రెండవ పంక్తిని చూడండి.

నీ కిదే పని అని పెదతిరుమలాచార్యులు మూడు సార్లు ఎందుకు అన్నారో విచారింతము. మన అనుభవములోని ఒక చిన్న విషయం చూడండి. మన చెయ్యి మీద చిన్నగా గీరుకుందనుకోండీ. మనము దానిని అలావదలి వేస్తే కొన్నాళ్ళకు దాని మీద పెచ్చు కట్టి, పెచ్చు ఊడిపోయి మామూలుగా  అయిపోతుంది. ఈ రకంగా చూస్తే ప్రకృతి తనపని తాను చేసుకుంటూ పోతుంది. అదే మనము ఆ గీరును గోకుతూ ఉంటే, నయమగుటకు ఎక్కువ కాలం పడుతుంది. అలాగే ప్రకృతితో చేయబడిన మనము సహజముగా ఉంటే చాలు అన్న విషయం తెలుస్తుంది.

పైన చెప్పుకున్న భగవద్గీతలోని బొమ్మలో వర్తుల ప్రయాణం చూపబడినది. మనకు ప్రకృతి కంటే బాగుగా తెలుసుననే అహంకారము మనలను ఇక్కడే పట్టి ఉంచుతుంది. ఈ సందర్భంలో అన్నమాచార్యుల క్రింది చరణం స్మరణీయము. 
చెనకి పంచేంద్రియపు చెరువు లైదింటికి
మనసనెడి దొకటి మహా ప్రవాహము
దినముఁ బారుచునుండు దిగువకు వెళ్లలేదు
తనలోనే తానిగురు దైవమాయ      హరి
 
దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా”: దైవానివి. నీకు తెలుసు. కానీ ఆశగా ఆకాశం వైపు తలెత్తి చూస్తాం. ఆ దిశగా అడుగులు వేయం అంతే.

X-X-X THE END X-X-X

T-338 తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా

  తాళ్లపాక పెదతిరుమలాచార్యులు 338 తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా For English Version Press Here   పరిచయం   " తల్లికిఁ గలుగు మ...