తాళ్లపాక అన్నమాచార్యులు
337 విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా
పరిచయం
వెన్నెలబొమ్మ
మనిషి ఈ ప్రపంచములోనికి ప్రవేశించినపుడు అతని మనస్సు సహజముగా స్వేచ్ఛాయుతముగా
ఉంటుంది. కానీ జీవితం అతని ముందుంచునది ఒకటో రెండు ఆకర్షణలు కాదు; అంతులేని రంగుల ప్రపంచం. అది ఒకేసారి దాడి చేయదు.
ఒక్కొక్కటిగా, మొక్కలకు కాండము, దాని నుండి
కొమ్మలు, వాటి నుండి ఆకులు పుట్టినట్లు నెమ్మదిగా విస్తరిస్తుంది.
అందుచేత బంధనములు మనకు కృత్రిమముగా అనిపించవు. మనమే వాటిలో భాగమౌతాము; వాటిని ఆనందిస్తాము; చివరకు వాటితోనే మన అస్తిత్వాన్ని
నిర్మించుకుంటాము.
కాలక్రమేణా ఆశలు, భయాలు, విజయాలు, అపజయాలు,
సంబంధాలు, గుర్తింపులు, స్మృతులు
కలిసి ఒక మానసిక ప్రపంచముగా రూపుదిద్దుకొంటాయి. అయితే గమనించవలసినది ఆకర్షణల కంటే వాటివలన
మనలో పుట్టే కదలికలు. ఒక రూపము, ఒక మాట, ఒక చూపు, ఒక స్పర్శ, ఒక స్మృతి
— ఇవన్నీ మనలో స్పందనలను కలిగిస్తాయి. ప్రతి స్పందన ఒక కదలిక. ప్రతి కదలిక ఒక కొత్త
కొమ్మవలె విస్తరించును. ఈ విధముగా సంసారవృక్షము పెరుగుచుండును.
“సావధానానఁ బెరిగీ సంసారవృక్షము” అని అన్నమాచార్యులు
మరొక కీర్తనలో చెప్పిన మాట ఇక్కడ స్మరణీయము. ఉత్సాహముతోనూ, ఆసక్తితోనూ,
అనురక్తితోనూ, స్మరణతోనూ, గమనికతోనూ మనస్సు విషయములను తాకినచో వాటి నుండి కొత్త కదలికలు పుట్టుకొస్తాయి.
మనకు ప్రత్యక్షముగా కనబడునవి ఆ కదలికలే గాని, వాటికి మూలమైన ప్రక్రియ
కాదు. ఈ విధముగా మనము కొమ్మలను, ఆకులను, పుష్పములను గమనిస్తాము; కానీ వృక్షమునకు ఆధారమైన మూలము
మాత్రం మరుగుననే నిలిచిపోతుంది.
“విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా” అను ఈ కీర్తనలో అన్నమాచార్యులు
ఈ అత్యంత సూక్ష్మమైన మానవ పరిస్థితిని శృంగార చిత్రాల ద్వారా మన ముందుంచుతున్నారు.
ఇక్కడ ప్రపంచము నిందింపబడదు. కోరికలు శపింపబడవు. ఆకర్షణలు అడ్డగోడలుగా చూపబడవు. బదులుగా
ప్రకృతి జీవిని ఆకర్షణీయునిగా చేయు అనేక గుణములను, వాటి వలన పుట్టే
కదలికలను, ఆ కదలికలలో భాగస్వామ్యమగు సమస్త జీవన వాతావరణాన్ని
కవి సజీవముగా చిత్రిస్తారు.
ఈ కీర్తనలో యోగి ప్రపంచానికి వెలుపల నిలబడి పరిశీలించువాడు కాదు.
అదే కదలికల మధ్య జీవించుచూ, వాటిచే తాకబడుచూ, వాటిలో పూర్తిగా మునిగిపోక, అట్లని వాటి నుండి పారిపోక,
జీవన స్రవంతిలో భాగమై గమనించువాడు. అందుచేత ఈ కీర్తనలోని “వెన్నెలబొమ్మ”
ఒక సిద్ధాంతము కాదు; ఇంకా పూర్తిగా మాటలలో బంధింపబడని ఒక మృదువైన
అవగాహనకు ప్రతీక.
ఈ కీర్తన చివరికి ఒక అపూర్వమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. జీవితమంతా
ఈ కదలికలతో నిండి ఉన్నపుడు, వాటి ప్రతి ఒక్కటి కొత్త కొమ్మలను విస్తరింపజేయుచున్నపుడు,
వాటిని నిరాకరించక, వాటిలో చిక్కుకోక, వాటి మూలాన్ని గమనించుట సాధ్యమేనా? కవి సమాధానము చెప్పరు.
కానీ ఆ ప్రశ్నను మన హృదయంలో మేల్కొలిపి వెళతారు.
|
శృంగార సంకీర్తన
|
|
రాగి రేకు: 59-2 సంపుటము - సంకీర్తన: 6-104
|
|
విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా మచ్చిక మరుని ఢాక మగువ నీ రాక ॥పల్లవి॥ పంచల పసిండి నిగ్గు వచ్చిదేరే సిగ్గు వంచన వలపు తీపు వాలుక చూపు కంచపుంబాలకూడు కాఁకలనీవాడు మంచపు నీ తలఁబ్రాలు మట్టెల పాదాలు ॥విచ్చే॥ కోవిల కొసరుఁబాట కొమ్మరో నీ మాట తావులచెంగావి నీ తళుకు మోవి గోవ జవ్వాదికరంగు గుబ్బల నీ మెఱుంగు భావజు దాడి రొదలు పాదపు నీ కదలు ॥విచ్చే॥ ముద్దుల నీ నగవు చిమ్ముల రతి బిగువు అద్దలింపుఁ గసరు మోహంపుఁ గొసరు గద్దరి నీ యలపు వెంకటపతి తలఁపు అద్దపునీమోము మోహనరతిసాము ॥విచ్చే॥
|
Details
and Explanations:
పల్లవి:
విచ్చేయవమ్మా
వెన్నెలబొమ్మా
మచ్చిక మరుని
ఢాక మగువ నీ రాక ॥పల్లవి॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా
|
ఓ వెన్నెలబొమ్మా! స్వాగతం.
|
ఓ సుకుమారమైన, పట్టుబడని
చైతన్యమా! జీవనం యొక్క సమస్త సంబంధములు ఒక్కసారిగా ప్రకాశించిన మౌన సౌందర్యమా!
ఆదరముతో ఆహ్వానము.
|
|
మచ్చిక మరుని ఢాక మగువ నీ రాక
|
మన్మథునికి ఢంకా మ్రోగించు సుందరీ! నీ రాకకై ఎదురుచూపులు.
|
మా అంతరంగములలో దాగి ఉన్న జీవిత సౌరభం, అందము, విలాసము,
ఉప్పొంగే ఉత్సాహం, సమున్నతి, సమస్తమునకు ఒకే సూత్రమైన పురోగామి — ఇవన్నీ నీ సన్నిధిలో పొంగి
పొరలుచున్నవి.
|
గూఢార్థవివరణము:
అన్నమాచార్యులువారు
అతి సున్నితమైన స్థితిలో, ప్రకృతితో మమేకమై, తనలోను, కనబడుచున్న ప్రపంచంలోను విస్తరించి, వ్యక్తిగతంకాని, అట్లని సామూహికం కాని, సమస్తమును నడుపు చైతన్యమును స్పృశించినపుడు అప్రయత్నంగా చేసిన వాక్కులివి.
వీటిని కేవలం శృంగార వర్ణనలుగా కొట్టివేయరాదు. మానవ జన్మ యొక్క ఉత్తిష్ఠతను,
జీవితం తనను తాను ఒక్క క్షణం వెలుగులోనికి తెచ్చుకొనిన అరుదైన
దర్శనాన్ని సూచించు పంక్తులు ఇవి.
విద్యుత్తు
ప్రవహించినపుడు తంతి ఒక్కసారిగా వెలిగినట్లు, జీవితం యొక్క అంతఃసంబంధములు కూడా
ఒకే క్షణంలో స్పష్టమగును. ఆ స్పష్టత మాటలలో, భావములలో
పూర్తిగా బంధింపబడదు. దానిని సిద్ధాంతముగా చూపబోతే, వెంటనే
విద్యుత్తు ఆగిపోయినట్లు తన సౌందర్యమును కోల్పోతుంది. "వెన్నెలబొమ్మ"
అటువంటి సజీవ స్పష్టతకు కవితాత్మక రూపము.
మొదటి చరణం:
పంచల పసిండి
నిగ్గు వచ్చిదేరే సిగ్గు
వంచన వలపు
తీపు వాలుక చూపు
కంచపుంబాలకూడు
కాఁకలనీవాడు
మంచపు నీ
తలఁబ్రాలు మట్టెల పాదాలు ॥విచ్చే॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
పంచల పసిండి నిగ్గు వచ్చిదేరే
సిగ్గు
|
బంగారపు మెరుపువంటి సిగ్గు వచ్చి చేరింది.
|
జీవనములో సున్నితత్వము, మర్యాద, స్పందన మొదలైన సూక్ష్మ చలనములు సహజముగా
వ్యక్తమగుచున్నవి.
|
|
వంచన వలపు తీపు వాలుక చూపు
|
వలపు, తీపి, వాలుచూపులు
మోహపరచుచున్నవి.
|
పరస్పర ఆకర్షణలు, అనుబంధములు, సమీపింపులు తమ సహజ క్రమములో
వికసించుచున్నవి.
|
|
కంచపుంబాలకూడు కాఁకల నీవాడు
|
పాలవలె మృదువైన యౌవన సౌందర్యము కలుగుతున్నది
|
జీవనశక్తి, ఉత్సాహము,
వికాసము, సృజనాత్మక ప్రవాహము
రూపుదిద్దుకొనుచున్నది.
|
|
మంచపు నీ తలఁబ్రాలు మట్టెల
పాదాలు
|
శయ్యపై అలరారుచున్న సౌందర్యరూపము.
|
జీవనములోని సమస్త చలనములు ఒక సమన్వయ స్థితిలో పరస్పర
సంబంధములను ఏర్పరచుకొనుచున్నవి.
|
గూఢార్థవివరణము:
ఈ
చరణములో అన్నమాచార్యులు ఒక వ్యక్తి యొక్క సౌందర్యమును వర్ణిస్తున్నట్లు
కనిపించినప్పటికీ, మరింత లోతుగా గమనించినచో జీవనములో
సహజముగా వ్యక్తమగు సున్నితమైన ప్రేరణలను చిత్రించుచున్నట్లు అనిపించును.
పల్లవిలో
"వెన్నెలబొమ్మ"గా సూచించిన ఆ సుకుమారమైన చైతన్య స్పర్శ, ఇక్కడ సిగ్గు, వలపు, వాలుచూపు,
యౌవనము మొదలైన రూపాలలో వ్యక్తమగుచున్నది. ఇవి వ్యక్తిగత గుణములు
కావు; జీవితం తనను తాను వికసించుకొనుచున్న విధానములు. ఇక్కడ
పని అంతా చాప క్రింద నీరులా సిగ్గు వలపు ఆకర్షణలుగా, వాలుచూపులుగా
వ్యాపిస్తున్నవి.
సిగ్గు
తన పని తాను చేసుకొనుచున్నది. వలపు తన పని తాను చేసుకొనుచున్నది. ఆకర్షణ, స్పందన, సమీపత, మాధుర్యము తమ
తమ దిశలలో ప్రవహించుచున్నవి. ఈ ప్రపంచమంతయు ఒక బృహత్తర ప్రేరణావస్థ వలె
ఒకదానిని మరొకటి మేల్కొల్పుచున్నది. ఆ మేల్కొలుపుల సమిష్టి కదలికయే జీవనము.
అందుచేత
ఈ చరణములో ప్రశంసించవలసిన వ్యక్తి లేడు; నిందించవలసిన వ్యక్తి లేడు. జీవితం
తన సహజ స్వభావములో వికసించుచున్న ఒక అరుదైన దృశ్యము మాత్రమే ఉన్నది.
రెండవ చరణం:
కోవిల కొసరుఁబాట
కొమ్మరో నీ మాట
తావులచెంగావి
నీ తళుకు మోవి
గోవ జవ్వాదికరంగు
గుబ్బల నీ మెఱుంగు
భావజు దాడి
రొదలు పాదపు నీ కదలు ॥విచ్చే॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
కోవిల కొసరుఁబాట కొమ్మరో నీ
మాట
|
కోయిల కూతలవలె మధురమైన నీ మాటలు.
|
ఒక జీవి నుండి మరొక జీవికి చేరే స్పందనలు, సంకేతాలు, ఆహ్వానాలు
సహజముగా ప్రవహించుచున్నవి.
|
|
తావుల చెంగావి నీ తళుకు మోవి
|
ఎర్రటి చెంగావి పుష్పమువలె ప్రకాశించు నీ పెదవులు.
|
రూపము, రంగు, ప్రకాశము
వంటి బాహ్య ప్రేరణలు జీవులలో స్పందనలను మేల్కొల్పుచున్నవి.
|
|
గోవ జవ్వాది కరంగు గుబ్బల నీ
మెఱుంగు
|
జవ్వాది సుగంధమువలె పరిమళించు నీ సౌందర్యము.
|
పరిమళము, స్పర్శ,
రూపము, ధ్వని మొదలైన అనుభూతులు పరస్పర
సంబంధములను నిర్మించుచున్నవి.
|
|
భావజు దాడి రొదలు పాదపు నీ
కదలు
|
మన్మథుని దాడివలె చలించు నీ నడక.
|
జీవనములోని వివిధ ప్రేరణలు కలసి భావములు, కోరికలు, అనుబంధములు,
కదలికలు సృష్టించుచున్నవి.
|
గూఢార్థవివరణము:
మొదటి
చరణములో సౌందర్యము, వలపు, సిగ్గు
మొదలైనవి రూపుదిద్దుకొనినట్లు చూచితిమి. ఈ ప్రపంచమంతయు ఒక బృహత్తర సహకారమందించు
ఉత్తేజిత వ్యవస్థ వలె కనబడినచో, ఒకదానిని మరొకటి
మేల్కొల్పుచున్నది. ఆ మేల్కొలుపుల ఉమ్మడి కదలికయే జీవనము. ఈ చరణములో అవి ఒంటరిగా
లేవు.
ఇక్కడ
మాట, రంగు, పరిమళము, కదలిక — ఇవన్నీ కలిసి పనిచేయుచున్నవి. మాటకు తన స్వంత భావన లేదు. రంగుకు
తన స్వంత ఉద్దేశము లేదు. పరిమళమునకు తన స్వంత అభిప్రాయము లేదు. అయినప్పటికీ జీవి
వాటిని అనుభవించి, వాటికి అనుకూలము–ప్రతికూలము అనే అర్థములను
కల్పించును.
ఈ
విధముగా వ్యక్తిగత స్పందనలు ఒకదానిపై మరొకటి పేరుకొని భావములుగా, భావములు వ్యక్తిత్వములుగా, వ్యక్తిత్వములు సమాజముగా,
నిబంధనలుగా, హక్కులుగా రూపుదిద్దుకొనును. ఆ
తరువాత జీవి తానే నిర్మించుకున్న ఆ రక్షణ వలయములో చిక్కుకొనును.
అందుకే ఈ చరణం పైకి చూస్తే స్త్రీ సౌందర్యం, ఆకర్షణల వర్ణనగా కనిపించినప్పటికీ, నిశితంగా గమనించినప్పుడు మరింత లోతైనదిగా మారుతుంది: జీవితంలో ఒక స్పందన తరువాత మరొకటి అలా ఎలా అల్లుకుంటూ పోతుందో చూపించే వీక్షణము. ప్రతి స్పందన తనదైన జాడను విడిచివెళుతుంది. ఒక జాడను ఒక పొరగా తీసుకుంటే, ఒక పొర మరొక పొరను బలపరుస్తూ పోతుంది. అసంఖ్యాకమైన ప్రతిస్పందనల తరువాత, ఆ పొరలనే మనం జీవితం అని పొరబడటం మొదలుపెడతాము.
మూడవ చరణం:
ముద్దుల
నీ నగవు చిమ్ముల రతి బిగువు
అద్దలింపుఁ
గసరు మోహంపుఁ గొసరు
గద్దరి నీ
యలపు వెంకటపతి తలఁపు
అద్దపునీమోము
మోహనరతిసాము ॥విచ్చే॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
ముద్దుల నీ నగవు చిమ్ముల రతి
బిగువు
|
ముద్దులు చిందించు నీ నవ్వు, అనురాగ బంధములను మరింత బిగించుచున్నది.
|
జీవుల మధ్య ఏర్పడిన అనుబంధములు, సాన్నిహిత్యములు, పరస్పర స్పందనలు మరింత లోతుగా
స్థిరపడుచున్నవి.
|
|
అద్దలింపుఁ గసరు మోహంపుఁ
గొసరు
|
మోహము రెచ్చగొట్టుచున్నది, ఆకర్షణను పెంపొందించుచున్నది.
|
అనుభవములు, జ్ఞాపకములు,
ఆశలు పరస్పరమును పోషించుకొని వ్యక్తిత్వ నిర్మాణమును
బలపరచుచున్నవి.
|
|
గద్దరి నీ యలపు వెంకటపతి
తలఁపు
|
ఓ వెంకటపతీ! మోసగాడివలె మమ్ములను నీ చుట్టూ అలుపు వచ్చునట్లు
తిప్పించుచున్నావు.
|
వెంకటపతీ! ఈ మాయ యొక్క స్వభావమును గ్రహించక, దానిలోనే తిరుగుచూ జీవి అలసిపోవుచున్నాడు.
|
|
అద్దపు నీ మోము మోహనరతిసాము
|
మోహనమగు అనురాగక్రీడలలో నీ ముఖము తేటతెల్లముగా
ప్రకాశించుచున్నది.
|
అద్దమువలె స్పష్టమైన ఆ ముఖమును ఒక్కసారి దర్శించినచో, మోహనమగు ఆ సమగ్ర సౌందర్యమునకు ఎదురుగా
రతిసాములు, ఆకర్షణలు, అనురాగ క్రీడలు
ఎంత చిన్నవో తేటతెల్లమగును.
|
గూఢార్థవివరణము:
మొదటి
రెండు చరణాలలో సిగ్గు, అనురాగం, ఆకర్షణ,
ప్రతిస్పందన, పరస్పర ప్రేరణ వంటివి జీవితంలో
క్రమంగా ఎలా రూపం దాల్చుతాయో చూశాము. ఈ మూడవ చరణంలో ఆ కదలికలన్నీ ఒక తుది తీవ్రతకు
చేరుకున్నట్లు కనిపిస్తాయి. అయితే అన్నమయ్య వాటిని ఖండించడమూ లేదు; ప్రశంసించుటలేదు.
ఆకర్షణ, మోహం, అనుబంధం, అనుభవం—అవి తమ
పని అవి చేసుకుంటూ పోతున్నాయి. అవి జీవనములోని సమగ్ర భాగము. కానీ, జీవి వాటి ఆకర్షణలలో చిక్కుకుని, వాటినే జీవితము అని
భావిస్తుంది. “గద్దరి నీ యలపు” (మోసగాడివలె మమ్ములను నీ చుట్టూ అలుపు వచ్చునట్లు) అన్న మాట ద్వారా కవి సున్నితంగా చూపించేది ఇదే పరిస్థితి. ఇక్కడ ‘గద్దరి’ అనేది నింద కాదు. మోహము అనే కదలికలోని
విచిత్ర స్వభావాన్ని చూపించే కవితా ప్రయోగం.
అయితే
చరణం చివరి పాదానికి వచ్చేసరికి, చూసే దిశ ఒక్కసారిగా మారిపోతుంది. “అద్దపు నీ మోము” ఈ కీర్తనలో అత్యంత కీలకమైన
పాదం. ఇంతసేపూ అన్నింటినీ కప్పివేసిన మోహాన్ని గమనించిన కవి, ఒక్కసారిగా “అద్దపు నీ మోము”—చూస్తున్నదే తన ప్రతిబింబము—ఆ చూపులో తనను తానే చూస్తున్న సంగతిని
గ్రహిస్తాడు.
ఇంతవరకు
కనిపించిన సిగ్గు, అనురాగం, ఆకర్షణ,
యౌవనం, సాన్నిహిత్యం—అన్నీ ఒక్క క్షణంలో
స్పష్టంగా, అద్దంలో కనిపించినట్లుగా, సందేహానికి
తావులేకుండా తెలిసివస్తాయి. ఆ స్పష్టతలోనే కవికి “వెన్నెలబొమ్మ” స్పురిస్తుంది.
విద్యుత్తు
ప్రవహించగానే బల్బు ఒక్కసారిగా వెలిగినట్లుగా, జీవితంలోని
అంతర్గత సంబంధాలు కూడా ఆ ఒక్క క్షణంలో స్పష్టమవుతాయి. ఆ స్పష్టత వచ్చినప్పుడు మోహములు,
ఆకర్షణలు, రతిసాములు ప్రత్యేక ప్రాధాన్యతను
కోల్పోతాయి. వాటిని ఖండించవలసిన అవసరమూ లేదు. ఆ స్పష్టత ఉన్నచోట అవి వాటి వాటి
స్థానాలలో వాటంతట అవే కుదురుకుంటాయి.
అందువల్ల
ఈ చరణం కేవలం శృంగార సౌందర్య వర్ణనతో ముగియదు. “అద్దపు నీ
మోము” కనిపించడంతో ముగుస్తుంది—చూస్తున్నవాడు తన
స్పష్టమైన ప్రతిబింబంతో నిలుస్తాడు. అక్కడే ఈ కీర్తన అంతటా జరుగుతున్న కదలిక
ఒక్కసారిగా మనకు కనిపిస్తుంది.