Tuesday, 24 March 2026

T-314 మనములోని విభుఁడు మఱవఁడే కాలంబు

తాళ్లపాక అన్నమాచార్యులు
314 మనములోని విభుఁడు మఱవఁడే కాలంబు
For English version press here

ఉపోద్ఘాతము

ఇది అపూర్వమైన కీర్తన అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. అన్నమాచార్యుల కీర్తనలను సందేశాత్మకముగా భావించరాదు. అవి ప్రతీ మానవునికి సూటిగా చెప్పిన అనుభవములు అని గుర్తించవలెను. ఈ కీర్తనను కాల ప్రవాహమును వెలుపల నుండి చూచి చెప్పిన వృత్తాంతముగా తెలియవలెను.
 
మన ఊహలన్నీ కాలమనే ప్రవాహమునకు ఈ దరి, ఆ దరి మధ్య పరుగెత్తు నదిలోని నీటిలా అనిపిస్తాయి—దాని ఆది అంతములు స్పష్టంగా తెలియవు; అయినప్పటికీ ఆ ప్రవాహములో ఏదో నిర్ణీత క్రమము ఉన్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ ఊహలతో పాటు మనకు తెలిసిన ప్రపంచములోని ప్రతి భావన, ప్రతి గ్రహింపూ కాలపు అంతర్భాగములే. ఈ ప్రవాహములోని ఈ వైపు నుండే ఆవల ఉన్న దాని నిజ స్వరూపాన్ని నిర్ణయించుటకు ప్రయత్నించుట తలపుచేసిన నిర్మాణమే—ఊహ పుట్టించిన అసంగతము, అవాంఛనీయము.

క్షణక్షణమునకు మార్పులకు లోనౌతున్న ఈ జీవితము నుండి మార్పులకు లోబడని దానిని నేరుగా తెలిసిన వారు అరుదు. ఈ కీర్తనకు వ్యాఖ్యానము వ్రాయుట సాహసమే అని చెప్పవలెను. కావున ఈ వివరణమును కేవలము ఆ విషయమును గుర్తించుటకు మాత్రమే అని గమనించండి. ఎవరికి వారు తమతమ అనుభవముద్వారా గుర్తించలేని దానిని గుర్తించుట ఎట్లు? అసాధ్యము. కావున ప్రయత్నములు ఆపి హృదయకంపనలతో ఈ కీర్తనను వినండి.

జిడ్డు కృష్ణమూర్తిగారు తరచుగా “నా మాటలను ఒక దర్పణములా గ్రహించి మిమ్మల్ని మీరు తెలుసుకొనుడి” అని చెప్పిన మాటలను ఇక్కడ గుర్తుకు తెచ్చుకొనవచ్చు. ఈ కీర్తనను కూడా అటువంటి దర్పణములా భావించి వినినచో, దాని అంతరార్థము ప్రతి ఒక్కరికీ స్వానుభవములోనే వ్యక్తమగును.

సాధారణంగా మనం ఏ తత్వాన్ని విన్నా “మనుషులుగా మనకు ఇంకా చాలా జన్మలు ఉన్నాయి; ఈ తత్వాలకు తొందరేముంది, నెమ్మదిగా నేర్చుకోవచ్చు” అనే భావం కలుగుతుంది. పైగా ఆ వచ్చే జన్మ ఏమిటో మనకెవరికీ తెలియదు. అటువంటి పరిస్థితిలో మానవజన్మకు అర్ధమున్నదా అన్న సందేహం కలగడం సహజమే. ఈ కోణంలో చూస్తే మానవజన్మ కొంత నిరాశాజనకముగా అనిపించవచ్చు. అటువంటి నిరాశామయ దృక్పధమును త్రుంచి వేయునదీ కీర్తన​.

ఎందుకంటే సత్యమును ప్రత్యక్షముగా స్పృశించిన మానవులు అతి కొద్దిమంది. అందులోనూ మనకు సూటిగా తెలియజేయగలవారు మరింత స్వల్పము. వారిలో అన్నమాచార్యులు ఒకరు. ఈ కీర్తన భగవత్తత్త్వాన్ని నిరూపించుటకై కాదు; మానవుని నిశితాగ్ర పరిశీలనకు ఒక పరాకాష్టగా నిలుస్తుంది.
 
కీర్తనలోని ముఖ్యస్వరం: "నీ కేలె వెఱవ"
పల్లవి: దేనికి భయముదేనికి సంకోచం?
మొదటి చరణం: (అనునయంగా) ఈ చిన్న దానికెందుకు వెఱపు?
రెండవ చరణం:  (ఇంకా మృదువుగా) చిత్తశుద్ధి వుంటే వెఱపు ఎందుకు?
మూడవ చరణం: (అవ్యక్త స్వరం) ఇంకా సందేహమెందుకే? యోగులకు అభయహస్తము

శృంగార సంకీర్తన
రేకు: 51-3 సంపుటము: 6-57
మనములోని విభుఁడు మఱవఁడే కాలంబు
నినుఁ గలయనున్నాఁడు నీకేలె వెఱవ పల్లవి॥

నెలనాళ్లవాఁ డొకఁడు నిర్మలంబైన రె
న్నెలలవాఁ డొకఁడు మూన్నెలలవాఁ డొకఁడు
నెలలు పండ్రెండైన నిజబాలుఁ డొక్కండ
నెలఁత యింతటి పనికె నీకేలె వెఱవ మన॥

ప్రొద్దుపొడుపుల దొకటి ప్రొద్దు గ్రుంకుల దొకటి
ప్రొద్దువ్రొద్దులకు రహిపొయ్యేటి దొకటి
పొద్దెఱింగిన దొకటి పొద్దెఱుంగని దొకటి
నిద్దంపుఁ బువ్వులకు నీకేలె వెఱవ మన॥

నిండుఁ జంచల మొకటి నిమిషమాత్రము దొకటి
వుండి నట్లనె వుండి వుడి వోపునొకటి
కొండలలో నెలకొన్న కోనేటిరాయండు నీ
నిండుఁ గౌఁగిటఁ గూడె నీ కేలె వెఱవ మన॥
Details and Explanations:
పల్లవి:
మనములోని విభుఁడు మఱవఁడే కాలంబు
నినుఁ గలయనున్నాఁడు నీకేలె వెఱవ ॥పల్లవి॥
పదబంధం
అర్థం
మనములోని విభుఁడు మఱవఁడే కాలంబు
మనసులోని విభుడు మఱవఁడు ఏ కాలంలోను
నినుఁ గలయనున్నాఁడు నీకేలె వెఱవ
నిన్ను కలియుటకు ఉన్నాడు. నీకేమే సందేహము? తటపాయింపు?

సూటి భావము:
ఒక తెలియని స్వరం: చెలీ! మనసులోని విభుడు ఏ కాలంలోను మఱవఁడు. నిన్ను కలియుటకు ఉన్నాడు. నీకేమే సందేహము? తటపాయింపు?”

గూఢార్థవివరణము:
మనములోని విభుఁడు” అని చెప్పడం ద్వారా మనకు తెలిసిన తలపు-మనస్సులతో ముడిపడని లోతైనదేదో మనలో ఉందని అన్నమాచార్యులు సూచిస్తున్నారు. అది ఎంత లోతైనదంటే దానిని పట్టుకోవడానికి ఎటువంటి పట్టు దొరకదు. అట్లని అది తలపు లోని విషయమూ కాదు. మనకు సాధారణంగా ఉన్న ఒకే సాధనం తలపు. కానీ మనములోని విభుఁని గ్రహించుటకు మాత్రము తలపు సాధనము కాదు.

మఱవఁడే కాలంబు: ఇది ముఖ్యమైన సూచన. కవి కాలము యొక్క విస్తృతిని సూచిస్తూ ఈ మాటను వాడుతున్నారు. మనకు తెలిసిన కాలము అనేది మనం అనుభవించుచున్న ఈ చిన్న జీవితకాలము మాత్రమే. కానీ కాలము ఆది నుండి అనాది వరకు విస్తరించి యున్న విశాలమైన ప్రవాహము.

మఱవఁడే కాలంబు” అని చెప్పుట ద్వారా, ఆ విభుడు కాలమంతటినీ ఆవరించి యుండి ఎప్పటికీ మరువడు అని సూచన. ఈ భావం మానవుని పుట్టుక యాదృచ్ఛికమేమీ కాదని, ఒక అంతర్లీన ఉద్దేశంతోనే ఈ జీవితం ప్రస్ఫుటించిందని సూచించే చిహ్నముగా కూడా గ్రహించవచ్చు.

తలపు సహజంగా కాలపరిమితిలోనిది. తలపులు మనస్సులోనే పుడతాయి. అయినప్పటికీ విభుఁడు మనములోనే ఉన్నాడని అన్నమాచార్యులు ప్రత్యేకంగా చెబుతున్నారు. పైగా అతడు "నినుఁ గలయనున్నాఁడు" అని కూడా చెప్పారు. దీని అర్ధం విభుఁడు దూరంలో లేడు; మనిషివైపు నుండే జాప్యము. ఇది కొంచెం వివరంగా చూస్తే నీలోనే వున్నాడు. కలయనున్నాఁడు. కానీ ఎప్పుడు? అందుకే వెనువెంటనే "నీకేలె వెఱవ" అన్నారు. భయం, సందేహం, తటపాయింపులు లేనప్పుడు. ఇవి మనస్సులో చెలరేగుతున్నంత వరకు విభుఁని కలియుట సాధ్యం కాదు. 

"నినుఁ గలయనున్నాఁడు" "నీకేలె వెఱవ" రెండూ ఒకే పంక్తిలో పక్కపక్కన చూపివాటి ఒకదానికొకటి 'వర్జనము' అని తెలియుచున్నది. ఈ రకమైన ప్రక్రియ ద్వారా 'వెఱవ' పనిజేయునంత కాలము 'నినుఁ గలయనున్నాఁడు' అనునది భవిష్యత్తు కార్యక్రమమును - అనగా కాలములో చిక్కుకున్న మనసు సంగతి తెలియజేయుచున్నారు. 'వెఱవ' స్థంబించిన నాడు అది కప్పుకొన్న కాలపు పొరలు మరుగున పడిపోవును.

ఇంకొక పరిశీలన:
మనములోని విభుఁడు” అనే పదబంధం వ్యక్తిగతము కాదు. అట్లని సామూహికము కాదు. మునుపటి కీర్తనలో చెప్పుకున్నట్లు "యేఁటికే నాపేరు". ఆ అవ్యక్త స్వరమును నిర్ధారించ పనిలేదు. కేవలో అటువంటిది ఒకటున్నదని ప్రత్యక్షంగా తెలియుటే ముఖ్యము. దానిపై ఊహాగనములతో ప్రయోజనము లేదు.
 
మనములోని విభుఁడు” అనే పదబంధాన్ని “మన అందరిలోని విభుఁడు” అనే భావంలో కూడ గ్రహించవచ్చును. అట్లయితే ఆ విభుని ప్రత్యక్షముగా గ్రహించినవాడు తనకే కాక మనందరికీ హితమును కోరువాడని సూచనగా కూడా ఈ మాటలను చూడవచ్చు. ఈ భావన ద్వారా వ్యక్తిగత అనుభూతి సామూహిక మంగళానికి దారి తీస్తుందనే సూచన కూడా ఇక్కడ అంతర్లీనమై ఉండవచ్చును.

మొదటి చరణం:
నెలనాళ్లవాఁ డొకఁడు నిర్మలంబైన రె
న్నెలలవాఁ డొకఁడు మూన్నెలలవాఁ డొకఁడు
నెలలు పండ్రెండైన నిజబాలుఁ డొక్కండు
నెలఁత యింతటి పనికె నీకేలె వెఱవ మన॥

Telugu Phrase
Meaning
నెలనాళ్లవాఁ డొకఁడు నిర్మలంబైన రె
ఒకనెల బాలుడొకడు. నిర్మలమైన రెండు
న్నెలలవాఁ డొకఁడు మూన్నెలలవాఁ డొకఁడు
నెలల వాడొకడు. మూడు నెలల వాడొకడు.
నెలలు పండ్రెండైన నిజబాలుఁ డొక్కండు
పండ్రెండు నెలలు నిండిన నిజమైన బాలుడొకడు.
నెలఁత యింతటి పనికె నీకేలె వెఱవ మన॥
ఓ వనితా! ఇంత చిన్న పనికేల నీకు వెరపు

సూటి భావము:
(ఇక్కడ కవి తానున్న స్థితిని నిర్ధారించలేరు అట్లని పూర్తిగా తెలీక పోవుట లేదు. ఒకటి మాత్రము నిశ్చయము వారేమీ చూస్తున్నారో వానిని ఇదమిత్థంగా చెప్పలేకున్నారు. ప్రపంచమంతా వివిధ దశలలోనున్న బాలురతో నిండినట్లు వారికి అనిపించింది. అదే సమయంలో వారికి అక్కడ ఒక స్త్రీ ఏమి చేయాలో పాలు పోక నిలబడి ఉన్నట్లు అనిపించింది. వారు ఆమెతో ఇలా అంటున్నారు.) ఈ భూప్రపంచమున ఏ కాలమందు చూచినా అప్పుడే పుట్టిన బిడ్డ నుండి పరిపక్వ వయస్సువరకు అనేక దశలలోనున్న మనుషులు కనబడుతారు. ఆ దశలన్నీ ప్రకృతి సహజము. ఒకదాని వెంబడి మరొకటి క్రమముగా గాని, కొన్నిసార్లు ఊహించలేని మార్పులతో గాని కొనసాగుతూ ఉంటాయి. ఓ వనితా! నీవును ఈ సహజ క్రమములోని దానవు. ఈ విధముగా కాలప్రవాహములో సహజముగా జరుగుచున్న కార్యమునకు — ఈ నీ తనువును కూడా చేర్చి ఆ ప్రవాహములో అంతర్భాగమైయ్యే చిన్న విషయమునకు — నీకు వెరపు ఏలా?

గూఢార్థవివరణము:
ఈ చరణములో అన్నమాచార్యులు కాలప్రవాహములో జరుగుచున్న సహజ పరిణామములను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు — అలా కాలక్రమములో శిశువు పెరుగుచు పండ్రెండు నెలలకు నిజమైన బాలుడిగా అవతరిస్తాడు. ఈ దశలన్నీ ప్రకృతి ధర్మములే. వాటిలో ఆందోళన గాని, భయం గాని ఉండవు; అవి సహజముగా సంభవిస్తాయి.
 
ఈ ఉదాహరణ ద్వారా కవి సూచించేది ఏమనగా, జీవితం కూడా ఇలాగే కాలప్రవాహములో అనేక మార్పులతో కొనసాగుచుంటుంది. మనము గుర్తించని అనేక ప్రక్రియలు మనలోనే జరుగుతూనే ఉంటాయి. ఈ తనువు, దాని పరిణామములు అన్నీ కాలప్రవాహములోని భాగాలే.

ఇక్కడ “నిజబాలుఁడు” అనే పదం ప్రత్యేకంగా గమనించదగినది. అది ప్రత్యేకమైన గొప్పతనాన్ని సూచించుటకన్నా సహజత్వాన్ని సూచించేదిగా భావించవచ్చు. కాలప్రవాహములో ఏర్పడిన దశలన్నీ పూర్తై సహజస్థితిలో నిలిచిన బాలుడిని కవి సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. అటువంటి సహజస్థితి మనిషిలోనూ సంభవించగలదని కవి సంకేతమిచ్చి, ఆ మార్పును స్వీకరించుటలో వెరపు అవసరమేమిటి అని ప్రశ్నిస్తున్నారు.

అందుచేతనే కవి చివరగా “నెలఁత యింతటి పనికె నీకేలె వెఱవ” అని ప్రశ్నిస్తున్నారు. కాలధర్మముగా జరిగే ఈ సహజ ప్రక్రియను చూసి ఎందుకు భయపడవలెను? ఈ మార్పులు అన్నీ ప్రకృతి ధర్మములే; వాటిని గమనించుట మాత్రమే మన చేతిలో ఉన్నది. భయం తొలగినచో మనస్సు సహజముగా నిశ్చలమగును.

పై చరణంలో కవి తనలోనే జరుగుచున్న విచిత్రమైన బహురూప స్థితిని వీక్షించుచున్నారు. ఆ స్థితిలో తాను చూపించు దృశ్యములో తానూ భాగమై యుండుటచేత, అక్కడ ఎవరు వీక్షించువారు, ఎవరు వీక్షింపబడువారు అన్నది స్పష్టముగా భేదింపబడుటలేదు. ఇంకొక కీర్తనలో ఈ విషయమును మరింత స్పష్టముగా చెప్పారు:

పాడితో నా పట్టుగులే బహురూపాలై యుండఁగ
వేడుకయ్యీ బహురూపవిద్యలు చూడఁగను

ఈ విధముగా కూడి క్రోడీకరించుకుంటే ప్రపంచమంతా తనలోనే వీక్షించగలిగిన స్థితిని కవి సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఒక విధంగా Jiddu Krishnamurti చెప్పిన “You are the world (నీవే ప్రపంచము)” అనే భావనను స్మరింపజేస్తుంది. అన్నమాచార్యులు ఆ మాటను సూటిగా చెప్పకపోయినా, ఇటువంటి దృశ్యరూపములో అదే భావాన్ని చిత్రీకరించినట్లు మనకు అనిపిస్తుంది.

Top of Form

Bottom of Form


రెండవ​ చరణం:
ప్రొద్దుపొడుపుల దొకటి ప్రొద్దు గ్రుంకుల దొకటి
ప్రొద్దువ్రొద్దులకు రహిపొయ్యేటి దొకటి
పొద్దెఱింగిన దొకటి పొద్దెఱుంగని దొకటి
నిద్దంపుఁ బువ్వులకు నీకేలె వెఱవ మన॥
Telugu Phrase
Meaning
ప్రొద్దుపొడుపుల దొకటి
ఒక ఉదయం (ఒక జీవితం) మొదలైంది.
ప్రొద్దు గ్రుంకుల దొకటి
ఒక సూర్యాస్తమైంది (ఒక జీవితం అంతరించింది)
ప్రొద్దువ్రొద్దులకు రహిపొయ్యేటి దొకటి
(రహి = ఆనందము; సొంపు, సొగసు; కాంతి; ఆశ, రక్తి, ప్రియము; ఆసక్తి; తెలివి; బాగు) రహిపొయ్యేటి దొకటి = ఉండి పొయ్యేటి దొకటి (సామన్య అర్ధము). ఇక్కడ సొగసైనది, కాంతి గలది, ప్రియమైనది, తెలివి అనునది, మనుష్యులకు మేలు కలిగించునది అని తీసుకొనవలెను. అదీ ఎప్పటికీ ఉండి పొయ్యేది.

సొగసైనది, కాంతి గలది, ప్రియమైనది ఈ ఉదయాస్తమయాలతో సంబంధం లేకుండా నిలిచి ఉండేది ఇంకొకటి
పొద్దెఱింగిన దొకటి
వెలుగును (జ్ఞానమును) తెలిసినదొకటి.
పొద్దెఱుంగని దొకటి
వెలుగును తెలియనిదొకటి (అజ్ఞానము మరొకటి).
నిద్దంపుఁ బువ్వులకు నీకేలె వెఱవ
ఇద్దంపు బువ్వులకు. (ఇద్దము= సంస్కృత విశేషణము 1. పరిశుద్ధము. 2. కాంతిమంతము. 3. కాల్పబడినది. 4. అడ్డులేనిది. విశేష్యము 1. ఎండ. 2. ప్రకాశము. 3. ఆశ్చర్యము; బువ్వులకు = సుకుమారమైనవానికి).

ఏ అడ్డులేని, ఏదీ అడ్డుకోలేని సుకుమారమైన ఆ స్థితి గురించి నీకు వెరపు ఎందుకు?

సూటి భావము:
{అన్నమాచార్యులు తానున్న స్థితి, తన చుట్టూ జరుగుచున్న ఘటనలతో తనకు ఉన్న సంబంధం పూర్తిగా నిర్ధారించలేని ఒక అంతర్ముఖ స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది. అందువలన ఆయన తనను తాను మూడవ వ్యక్తిలా—ఒక యువతిని సంబోధించినట్లుగా—వీక్షిస్తూ, తనకు గోచరమైన విషయాలను చెప్పుతున్నారు.}
ఒక ఉదయం (ఒక జీవితం) ప్రారంభమవుతుంది. మరొక సూర్యాస్తమయం (ఒక జీవితం) ముగుస్తుంది. ఈ ఉదయాస్తమయాల చలనంతో సంబంధం లేకుండా అందమైనది, సొగసైనది ఎప్పటికీ నిలిచి ఉండేది ఇంకొకటి ఉంది. ఒకటి వెలుగును (జ్ఞానమును) గ్రహిస్తుంది; మరొకటి వెలుగును గ్రహించదు (అజ్ఞానము). ఈ మార్పులన్నిటి మధ్య అడ్డులేని, సుకుమారమైన ఆ స్థితి గురించి నీకు వెరపు ఎందుకు? అని కవి ప్రశ్నిస్తున్నారు.

గూఢార్థవివరణము:
నిద్దంపుఁ బువ్వులకు” అన్న పదబంధము ఈ చరణములో అత్యంత సున్నితమైనది. కాలప్రవాహములో కనిపించే ప్రారంభం–అంతం, జ్ఞానం–అజ్ఞానం, తెలుసు–తెలియదు వంటి మార్పులన్నింటికీ అతీతముగా అడ్డులేని, పరిశుద్ధమైన ఒక స్థితి నిలిచి ఉన్నదని కవి సూచిస్తున్నారు.
 
ఆ స్థితి బాహ్యమైనది కాదు. ఆ వనితయే ఆ సున్నితమైన, మార్పులకు లోబడని తత్వమని సాంత్వనగా తెలియజేస్తూ—“నీకేలె వెఱవ” అని ప్రశ్నిస్తున్నారు.

నీకేలె వెఱవ” అనే మాటలో మరో సూచన ఉంది. ఈ స్థితి దేహముపై మమకారము ఉన్నంత వరకు ప్రత్యక్షమగదు. అందుచేత మమకారము విడుచుటకు తటపాయిస్తున్న మనందరినీ ఉద్దేశించి ఈ మాట చెప్పినట్లుగా భావించవచ్చు.

దీనిని సులభముగా అర్థం చేసుకుందుకు భగవద్గీతలోని క్రింది శ్లోకం చెప్పుకోవచ్చు. సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ।। 13-28 ।। భావము: సమస్త ప్రాణులలోసమముగా ఉన్నట్టి పరమాత్మను ఆయా ప్రాణుల దేహాదులు నశించినప్పటికీ నశించు శరీరములలో శాశ్వతమైన వానిని చూసినవాడే, నిజముగా చూసినట్టు. (విజ్ఞుడు అనవచ్చును)​

చరణంలో మొదటి రెండు పంక్తులు ఒకే వ్యక్తిలో అనేక ఘటనలు ఒకేసారి జరుగుతుండగా అన్నమాచార్యులు గమనించగలుగుతున్నారు. అనగా వారు బాహ్య ప్రపంచపు స్పృహ పూర్తిగా కోల్పోయి తనలోని వివిధ ఘటనలు ఘటించుటను పరికించగలిగారు.

మూడవ పంక్తి తనలోనే ఉన్న కొంత సవ్యమైన గ్రహింపు, కొంత అపసవ్యమైన గ్రహింపులను సూచించుచున్నది. అందుకనే అన్నమాచార్యులవారు "తెలిసినవాఁడాఁ గాను తెలియనివాఁడాఁ గాను"  అని చెప్పుకున్నారు.

మొత్తం మీద ఈ చరణం బాహ్యమునందు కలుగు సమస్త ఘటనలు మనిషి తన లోపలలోను గ్రహించవచ్చు అంటున్నారనుకోవచ్చును. అటువంటి వేదిక మనందరిలోను నిక్షిప్తమై ఉందని భావము.

మూడవ​​ చరణం:
నిండుఁ జంచల మొకటి నిమిషమాత్రము దొకటి
వుండి నట్లనె వుండి వుడి వోపునొకటి
కొండలలో నెలకొన్న కోనేటిరాయండు నీ
నిండుఁ గౌఁగిటఁ గూడె నీ కేలె వెఱవ మన॥
Telugu Phrase
Meaning
నిండుఁ జంచల మొకటి నిమిషమాత్రము దొకటి
అతి చంచలమైన దొకటి (బ్రతుకపై తీపి, మనస్సు). స్వల్ప కాలము దొకటి (జీవితం)
వుండి నట్లనె వుండి వుడి వోపునొకటి
(వుడి వోపు =తొలఁగు); వుండి నట్లనె కనబడున దొకటి (శాశ్వతమైనది). హెచ్చరిక లేక తొలగునదొకటి (దేహము)
కొండలలో నెలకొన్న కోనేటిరాయండు నీ
కొండలలో నెలకొన్న కోనేటిరాయండు ఆ వనితను
నిండుఁ గౌఁగిటఁ గూడె నీ కేలె వెఱవ
కూడుకొనెను. (అవ్యక్త స్వరం) ఇంకా సందేహమెందుకే.

ఇక్కడ  "నీ కేలె వెఱవ" భగవంతునికై తపించు యోగులకు అభయహస్తము.
సూటి భావము:
అతి చంచలమైన దొకటి (బ్రతుకుపై తీపి, మనస్సు). స్వల్ప కాలము దొకటి (జీవితం). వుండి నట్లనె కనబడున దొకటి (శాశ్వతమైనది). హెచ్చరిక లేక తొలగునదొకటి (దేహము. పై నాలుగు భావములను ఏక కాలంలో అనుభవిస్తున్నారు. అది సంతోషమో, దుఃఖమో, కనుగొన్నదో, కనబడినదో చెప్పలేకపోతున్నారు. అలా నిర్ణయించలేని స్థితిలో నిలిచి వుండగా కొండలలో నెలకొన్న కోనేటిరాయండు ఆ వనితను కూడుకొనెను. (అవ్యక్త స్వరం) ఇంకా సందేహమెందుకే? (ఇక్కడ “నీ కేలె వెఱవ" భగవంతునికై తపించు యోగులకు అభయహస్తము).

గూఢార్థవివరణము:
మనిషి తన హృదయాంతరాళమును స్పృశించు దశలో పరస్పర విరుద్ధమైన భావనలు పోటీగా నిలిచి అతని స్థైర్యాన్ని పరీక్షకు పెడతాయి. ఆ పరీక్షలో ఎటువైపు మొగ్గని సమత్వమే ఆచరణీయం. మనిషికి నిశ్చితానికి బదులు అనిశ్చితము ఎంచు కొనుట దుస్సాధ్యము.
 
మనిషికి నిశ్చితానికి బదులు అనిశ్చితము ఎంచు కొనుట దుస్సాధ్యము. మనము ఈ నిముష మాత్రపు జీవితంలో నిశ్చితమునకు దాసులము. ఇది "నీ కేలె వెఱవ" సమీక్ష​. వెఱపులో వున్న పని చేయునది "అజ్ఞానము". వెఱపు ఆవలిది "జ్ఞానము". ఇదే అన్నమాచార్యులు విసిరిన సవాలు.
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు           ॥పల్లవి॥

వ్యాఖ్యానంతర సమీక్ష
అన్నమాచార్యులు ఏదో ఒక సిద్ధాంతాన్ని నిరూపించుటకు, రూఢి చేయుటకు, రుజువు చూపుటకు కీర్తనలు రచించలేదు. వారు మానవులు సాధారణంగా చేరలేని ఒక సున్నితమైన స్థితిని అనుభవించి, ఆ స్థితిలో తాను గమనించిన దానిని సహజముగా వ్యక్తపరిచారు.
 
అన్నమాచార్యుల కీర్తనలు వాదప్రతివాదముల కొరకు రాయబడినవి కావు. ఆయన ఎదురుగా కనిపించిన జీవ చలనములను నిశ్శబ్దముగా గమనించి, వాటిని కీర్తనల రూపంలో వ్యక్తపరిచినవారు. అందుచేత వీటిని దైవము ఉన్నాడని నిరూపించుటకు చూపిన ఉదాహరణలుగా కాక, ఒక సున్నితమైన మానసిక స్థితిలో గమనించిన అనుభవ ప్రకటనలుగా గ్రహించుట సముచితము.

ఈ కీర్తనలో పేర్కొన్న విషయాలు మనకు ప్రత్యక్ష దర్శనములుగా అనిపించకపోవచ్చు; అవి ఎక్కువగా పరోక్ష అనుభవములుగానే కనిపించవచ్చు. అయినప్పటికీ ఇటువంటి కీర్తనల ద్వారా ప్రతి మనిషికీ ఆ స్వానుభవము సాధ్యమేనని అన్నమాచార్యులు సూచించినట్లు భావించవచ్చు.

అందుకే ఈ కీర్తనలను చదువుట, వినుట అనేవి వాదముల కొరకు కాదు. అవి మన జీవితములో జరుగుచున్న చలనములను గమనించుటకు ఒక ఆహ్వానముగా నిలుస్తాయి. ఆ గమనములోనే భక్తి యొక్క సారము నిగూఢముగా వ్యక్తమవుతుంది.

X-X-The END-X-X


No comments:

Post a Comment

T-314 మనములోని విభుఁడు మఱవఁడే కాలంబు

తాళ్లపాక అన్నమాచార్యులు 314 మనములోని విభుఁడు మఱవఁడే కాలంబు For English version press here ఉపోద్ఘాతము ఇది అపూర్వమైన కీర్తన అని చెప్పడాని...