Saturday, 8 July 2023

T-171 కొత్తబంట పాఁతబంట కోరినాఁడు నేఁడు నీకు

                                            పెద​ తిరుమలాచార్యులు

171 కొత్తబంట పాఁతబంట కోరినాఁడు నేఁడు నీకు

 for EnglishVersion press here 

Synopsis: ఒకే ఒక్క సత్యం ఉందని, దానిని తన ఆధీనంలో ఉంచుకుంటాననే నమ్మకమే ప్రపంచంలోని అన్ని చెడులకు మూలం. - నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్ బోర్న్

 

Summary of this Poem:

పల్లవి: ఈ రక్తమాంసముల శరీరంతో చేసిన సేవలకు గురుతుగా కొత్తబంటు (అతడే నీ పాతబంటు కూడా) ఆస్వాంతమును నీ యిచ్చకు వదలినాడు. అన్వయార్ధము: దైవమా ఇప్పుడు 'నా ఆకారాలు మారుతున్నా, నేను మొదటినుండి ఒక్కడినేనని' నాకు అర్థమైంది. నా సంకల్పాలన్ని త్రోసివేసితిని. నీకు తోచినట్లు నా హృదయాన్ని పాలించు.

 

చరణము 1: నన్ను తికమక పెడుతున్న ఇరవై నాలుగు గుణములకు అధినాయకుడా! అరుదైన ఈ దేహమున వుండు శాశ్వతుడా! కనపడి కనబడక వెలుగు నీడలు పెనవేసికొన్నట్లు వుండు వాడా! బాసటగా నా మదిని పాలించ రాదా! అన్వయార్ధము: సర్వాధిపతి! మమ్మల్ని శాసించే రహస్యాలతో అయోమయానికి గురవుతాం. మా జీవితాలు అర్ధసత్యాల్లో చిక్కుకున్నాయి. నా హృదయాన్ని ఆక్రమించుకోమని నిన్ను వేడుకుంటున్నాను.  ఈ వ్యర్థమైన పనులలో అర్థాన్ని నింపండి.

చరణము 2: మన్మథుని ఆయుధముగా మాతో నిరంతరము సాము చేయించువాడా! మోహనాకారముతో మమ్ము మురిపించే కృష్ణ వర్ణుడా! అవివేకముగా  ఆరుగురితో కుస్తీ పడుతున్న యీ దేహమున వున్న నన్ను,  నా హృదయమును పాలించుకోవా  శ్రీహరీ. అన్వయార్ధముమీ బలహీనతలను అంగీకరించండి, ఎందుకంటే నిష్ఫలమైన పోరాటంలో పాల్గొనడం నిరాశను మాత్రమే కలిగిస్తుంది. మీ అపరిపూర్ణతలను మనస్పూర్తిగా స్వీకరించండి. ఈ రకంగా మీ శ్రమను  వ్యర్ధము కానీయక నీలి నీడలలో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికి తీయండి.

 

చరణము 3: అనేక లోకము లెక్కి దిగుతున్న వాడను. (అనవసరపు ప్రయాసపడు అజ్ఞానిని).  శ్రీ వేంకటేశ పరస్పరము విరుద్ధమైన విషయములతో కూడియున్న సంసారమునకు అతీతుడా, ఓటమిని అంగీకరింపక, వీడక, అలుపెరుగని సాహసముతో  నిన్ను వెంబడించితే, నీవొక్కడవే రాజు అను వాడవు అని గ్రహించితిని. శ్రీహరీ నేను ఇటు వుండగానే నా అంతరంగమును ఏలుకో. అన్వయార్ధము: నరుడా! ఈ జీవనమను ప్రయాణం లెక్కలేనన్ని లోకాల గుండా వుండవచ్చుగాక. అంతిమ సత్యం ఒక్కటే అని మరవక అలుపును విస్మరించి విభుని అన్వేషించు. ముళ్ళు, రాళ్ళు, గుట్టలు కొండలు, ఎగుడుదిగుళ్ళను లక్ష్యపెట్టవద్దు. కానీ గుర్తుంచుకోఅహమును విడిచి హృదయంలో సహజమును రాజ్యమేలనివ్వు.

 

విపులాత్మక వివరణము

ఉపోద్ఘాతము: పెద తిరుమలాచార్యుల కీర్తనను అర్థం చేసుకోవడం చాలా పెద్ద  చిక్కే. దాదాపు అగమ్యగోచరంగా వుండే ఈ కవిత లోని ముఖ్యోద్దేశం అగుపించడం మొదలు కాగానే అత్యంత గహనమైన భావము మనోఫలకముపై గోచరమౌతుంది. ఇంతటి అద్భుతమైన కీర్తనకు వ్యాఖ్యానం అందించడం నిజముగా అదృష్టమే.

మాటల తూటాలను గుండెల్లో గుచ్చి వాస్తవాన్ని ఎదురుగా నిలబెట్టే కవులు ఉన్నారు,    మృదువుగా లాలిపాట పాడి ఊహా లోకాలలో వివరింప చేసే కవులు ఉన్నారు.  భగ్న  హృదయలలో ఆశలు చిగురింప చేసే కవులు ఉన్నారు. హృదయలలో  ప్రవేశించి పేరుకుపోయిన మాలిన్యమును వదలగొట్టే  వారు చాలా అరుదు. పరివర్తన తీసుకురాలేకపోతే కళలకు సార్ధకత ఏది? అన్నమాచార్యుల వంశం ఆ అరుదైన కోవకే చెందుతుంది.

అన్నమాచార్యులు, పెద తిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యులు ఈ ముగ్గురు మహానుభావుల​ కీర్తనలను ఎంత ఎక్కువ మంది విని, చదివితే అంత సమాజమునకు వుపయోగము, శ్రేయస్కరము.  ఈ మహాత్ముల​కు అర్పించగల  నివాళి అదే. కవిత్వానికి  సహజమైన పరిమళాన్ని అందించు  వారి భావ వ్యక్తీకరణ ముందు తరాలకు మార్గనిర్దేశం చేయగలదు. వారి కవితా రచనలపై విభిన్న దృక్కోణాలను అందించడానికి మరింత కృషి చేయాలని నేను గట్టిగా నమ్ముతాను.

కాఫీ టేబుల్ పుస్తకాలను ప్రోత్సహించడం వల్ల పాఠకులకు వారి పట్ల మరింత అవగాహనను పెంపొందించడంలో దోహదం చేస్తుంది. వారు ప్రసాదించిన అపారమైన కవితా సంపుటిని ముమ్మరంగా ప్రచారం చేయాలి. ఈ ప్రయత్నాన్ని కొనసాగించడానికి యువతరం భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. 

కీర్తన:
రాగిరేకు:  8-2 సంపుటము: 10-44
కొత్తబంట పాఁతబంట కోరినాఁడు నేఁడు నీకు
యిత్తల జీతము సేసే యేలుకోవే శ్రీహరీ ॥పల్లవి॥
 
యిరువదినలుగురి కిటునే గమికాఁడ
అరిదిదేహపుటూరి అమరగాఁడా
నరయక నరసేటి నల్ల తెల్లజల్లివాఁడ
యిరవై జీతము సేసి యేలుకోవే శ్రీహరీ ॥కొత్త॥
 
కామునిగరిడిలోని కటారిసామువాఁడ
లేమచూపుల పగలు దివ్వెలవాఁడా
గోమున నేకాంగి నారుగురితో నొఱటువాఁడ
యీమేటినైన నన్ను నేలుకో శ్రీహరీ ॥కొత్త॥
 
యేడునేడు లోకముల యెక్కి దిగినట్టివాఁడ
మేడెపు సంసారమున మించినవాఁడ
వోడక వెదకితి నీ వొక్కఁడవే రాజ విఁక
యీడనే శ్రీ వేంకటేశ యేలుకోవే శ్రీహరీ ॥కొత్త॥ 

 

Details and Explanations: 

కొత్తబంట పాఁతబంట కోరినాఁడు నేఁడు నీకు
యిత్తల జీతము సేసే యేలుకోవే శ్రీహరీ ॥పల్లవి॥ 

Word to word meaning: యిత్తల = ఇటువైపు, ఈ రక్తమాంసముల శరీరంతోటి; జీతము సేసే = సేవ చేసె. 

భావము: ఈ రక్తమాంసముల శరీరంతో చేసిన సేవలకు గురుతుగా కొత్తబంటు (అతడే నీ పాతబంటు కూడా) ఆస్వాంతమును నీ యిచ్చకు వదలినాడు.

వివరణము:   పల్లవిని కొరకరాని కొయ్యల కోవకు చెందుతుందనడంలో సందేహం లేదు.   "పర్వి శ్రీవేంకటపతి నీ దాసుల పూర్వమనియెడి బుద్ధి నీ పూజ" (జీవము ప్రారంభము నుండి మేము నీకు దాసులము అను గ్రహింపు కలిగి వుండటమే నిజమైన తపస్సు) అను అన్నమాచార్యుల వారి చరణము నుండి, పాఁతబంట అనునది ఋజువు చూపలేని  మునుపటి స్థితిని సూచించును. 

ఆ విధంగా, "పాంతబంటతో" స్పృహ యొక్క పూర్వపు రూపాన్ని సూచించి రనవచ్చు. పెద తిరుమలాచార్యులు ఉటంకించిన​ కొత్తబంట, పాఁతబంట లెవరు? పాఁతబంటను కనుగొనడానికి మనకు గల సాధన మెద్ది? ఇంతకు మునుపు మనం చెప్పుకున్నట్లుగా మనం పర్యావరణం, భాష, ఆహారం మరియు అలవాటుతో సహా అనేక విషయాల ద్వారా కండిషన్కు లోనౌతాము (= ఆశ్రయణం / స్థితివ్యాజం = స్థితి కల్పించు భ్రమలతోప్రభావితులౌతాము). 

ఇవన్నీ సత్యాన్ని మరుగున​ పెడుతున్నప్పుడు, మన ప్రస్తుత వైఖరితో, ఈ విషయాలను లోతుగా పరిశోధించడానికి మనకు చాలా తక్కువ అవకాశం ఉంది. అందువల్ల, పెద తిరుమలాచార్యులు యిత్తల జీతము సేసే = మహాప్రభో! కొత్తబంట, పాఁతబంటలను గుర్తించు సామర్ధ్యము నాకు లేదు. నేను చేయ గలిగినదంతా నన్ను నీకు సమర్పించుకోవడమే అన్నారనుకోవచ్చును. 

జిడ్డు కృష్ణమూర్తి కూడా అలాగే భావించాడు మరియు అతను ఇలా వ్రాశాడు: “ఈ ఆగస్టు 20 తర్వాత నేను ఏమి చేయాలనుకుంటున్నానో, నా జీవన కార్యమేమిటో బోధపడింది.....నేను మైత్రేయుడికి  గురువులకు మరింత సన్నిహితంగా చేరాను; వారికి సేవ చేయడం తప్ప నాకు ఈ ప్రపంచంలో వేరే పని లేదు.” (పేజి 118, ఇయర్స్ ఆఫ్ అవేకనింగ్, మేరీ లుటియన్స్).

జరిగిన ఘటనతో  తీవ్రంగా ప్రభావితమైన జిడ్డు నిత్య, అనీ బెసెంట్‌తో మాట్లాడుతూ, 'ఇవి జరిగినప్పటి నుండి ప్రపంచం మొత్తం నా కోసం చాలా మారిపోయింది. నేను అకస్మాత్తుగా దృఢంగా మారిన బుడగలా భావిస్తున్నాను.....నేను ఇంతకు ముందు ఎప్పుడూ జీవించనట్లుగా భావిస్తున్నాను, మరియు ఇప్పుడు నేను ప్రభువును సేవించుట తప్ప వేరే యే విధముగాను జీవించుటకు మనసొప్పుటలేదు.’ (పేజీ 10, ఇయర్స్ ఆఫ్ ఫుల్'ఫిల్'మెంట్, మేరీ లుటియన్స్).

కాబట్టి, అలాంటి దశకు చేరుకున్న వ్యక్తులందరూ ‘సేవ​’ అనే పదాన్ని మన ఊహకు అందని అర్థంలో ఉపయోగించారని తెలుస్తుంది. అయినప్పటికీ, దైవమును సేవించడం అంటే ఏమిటో పరిశీలిద్దాం. సర్వస్వతంత్రడైన స్వామికి మానవుడు ఏమి సమర్పించగలడు? (ఏమీ లేదు). సహజంగానే, మనిషి భగవంతుడికి ఎలాంటి సేవ చేయలేనప్పటికీ, తాను సత్యంవైపు నిలబడుటకు ఎన్నుకోవచ్చును. ఇంతకు ముందు చాలాసార్లు సూచించినట్లుగా, సత్యమేమిటో గుర్తించలేని మానవుడు సత్యము వైపు ఎటుల నిలబడగలడు? 

అటుల సత్యంతో వుండడం మనకు నచ్చినట్లుగా అక్కడికి వెళ్లడం, రావడం లాంటి పార్ట్‌టైమ్ వ్యాపారము కాదు. ఇది శాశ్వత మార్పు మరియు ఏక పక్ష మార్గము. దురదృష్టవశాత్తు, ఈ పేరులేని ప్రయాణానికి నిర్దిష్ట మార్గం మరియు గుర్తించుటకు ఆనవాళ్ళు కూడా అందుబాటులో లేవు. భగవద్గీత (15-4) కూడా ఆ మార్గాన్ని కనుగొనే బాధ్యత ఉపాసకునికే వదిలివేస్తుంది. తత: పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్గతా న నివర్తంతి భూయ: అని చెప్పడం ద్వారా ఉద్దేశ్యం: (అజ్ఞానపు తెరలు తొలగించుతూ సాధకుడు తెలుసుకోవలసిన ముఖ్యమైనది ఏమిటో గుర్తించాలి). అప్పుడు ఆ తిరిగి రాని మార్గాన్ని కనుగవలెను. అటువంటి వానికి సత్య దర్శనము కాగలదు.

-x-x-x- 

'కొత్తబంట పాతబంట' అనే పదబంధాన్ని అర్థం చేసుకుందాం: యోగియైనవాడు చైతన్యం ఆరంభం నుంచి జీవనము గురించి బాగా యెరిగిన స్థితికి చేరుకుంటాడని పెద తిరుమలాచార్యుల అభిమతము. ఇంతకు ముందే పవిత్రమైన హృదయము ముఖ్యమని గుర్తించాం. దానికి సరియైనది భూమండలమున కానరాదు. క్రింద హిల్మా అఫ్ క్లింట్ రచించిన 23వ హంస బొమ్మను విమర్శనాత్మకంగా చూడండి. దీనిని బొమ్మ అనడం కంటే రేఖాచిత్రం అనడమే న్యాయము.



ఇక్కడ హిల్మా ఆఫ్ క్లింట్ 'ట్రీ ఆఫ్ నాలెడ్జ్ సిరీస్'లో చూపినట్లుగా మూడు స్థాయిల ఉనికిని సూచిస్తుంది. ఇప్పుడు అతీంద్రియ మూలకములతో కూడిన  భౌతిక సమతలం, దాని సూక్ష్మస్థాయి మరియు మానసిక స్థాయిలను వేర్వేరు తలములుగా చూపించింది. ఒక స్థాయిలోని రంగులు వేరొక స్థాయిలోని రంగుల కంటే విరళీకృతముగానో గాఢముగానో మారుతున్నవి తప్ప వున్నదివున్నట్లు తెలియలేమని ఈ హంస ద్వారా  తెలియజేసారు. కావున సంకల్పము యెటువంటిదైనా అది మనము చూచు చూపును ప్రభావితము చేసి వున్నది లేనిదిగా చూపును. అందుకే పరిపూర్ణ విశ్వాసమును  తెలుపు రంగు వలె ఉంటుందనే నమ్మకము సార్వత్రికమైంది. 

అప్పుడు 'సరిగ్గా చూడటం అంటే ఏమిటి' అనే ప్రశ్నకు దారితీస్తుంది. "సరిగ్గా చూడటం" అనేదానికి నిర్ణేత చూచువాడే కాని ఇతరులు కాజాలరు.  "సరిగ్గా చూడటాన్ని" ప్రభావితము చేయుచున్నది స్వీయము నుండి వ్యుత్పత్తియైనదే కాని బాహ్యమునుండి వచ్చి చేరినది కాదు. 

బాహ్యముగా నున్నది అనూహ్యంగా  అంతరంగముగా మారుటను రెనే మాగ్రిట్‌చే "రెడ్ మోడల్" (= రక్తమాంస పరివర్తనము) అనే పెయింటింగ్ ద్వారాను; "లా-ఫోలీ-ఎల్మేయర్" అనే శీర్షికతో ఉన్న పెయింటింగ్’ ద్వారా అనుభవములు  ఙ్ఞాపకములుగా మారుటను మునుపటి వివరణములలో నేర్చితిమి.  అనుభవము అనునది జీవనముతో కూడినదైతే, ఙ్ఞాపకములు జడ పదార్థమునకు ప్రతీక. 

ఈ విధముగా పుట్టిన మరుక్షణము నుండి బయటది లోపలకు; లోపలిది మెమొరిగానూ (ఙ్ఞప్తిగానూ) అనుక్షణము మారుతున్నవి. అలా వచ్చి చేరిన అనుభవములు మిగుల్చు మెమొరితో (ఙ్ఞప్తితో) జీవనము సాగింతుము. మనలోని భావనలన్నీ ఆ మెమొరి  ఆధారితముగానే ఉత్పన్నమైనవని  సులభముగా తెలియవచ్చు. జడమును తెలుపు అనుభవములు, జీవనమును తెలుపు అనుభవములతో జడలోని అల్లికవలె కలసి యుండుటచేత పోల్చుకొనుట అత్యంత కఠినము.  

అతిచిన్న మలినాలు కూడా లోనికి ప్రవేశించు కాంతి కిరణములను వ్యాప్తి చెందడానికి మూలకమౌతాయి. కాబట్టి ఎటువంటి వక్రీకరణ జరగని హృదయ స్వచ్ఛత ప్రాధమికమైనది. అందుకనే జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడూ ఆ ధ్యానంలో తనకున్న శక్తినంతా ధారపోయాలని చెబుతుంటారు.  ఇకపోతే భగవద్గీత, బైబిల్ రెండూ హృదయశుద్ధి గురించి మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. 

ఒక వ్యక్తి అటువంటి దశకు చేరుకున్నప్పుడు, అతను ఇకపై తన అనుభవమును ఙ్ఞప్తిగా నమోదు చేయడు, ఐనప్పటికీ తన సంపూర్ణ గతం గురించి స్పష్టంగా స్పృహ కలిగి ఉంటాడు. పెద తిరుమలాచార్యులు తన గతం, వర్తమాన స్వరూపం ఒకటేనని గుర్తించిరి. అందువలన, వారు కొత్తబంట పాతబంట అనే పదబంధాన్ని ఉపయోగించారు. దీనిపై తదుపరి వివరణను మొదటి, రెండవ చరణాలలో చూడండి.

అన్వయార్ధము: దైవమా ఇప్పుడు 'నా ఆకారాలు మారుతున్నా, నేను మొదటినుండి ఒక్కడినేనని' నాకు అర్థమైంది. నా సంకల్పాలన్ని త్రోసివేసితిని. నీకు తోచినట్లు నా హృదయాన్ని పాలించు. 

యిరువదినలుగురి కిటునే గమికాఁడ
అరిదిదేహపుటూరి అమరగాఁడా
నరయక నరసేటి నల్ల తెల్లజల్లివాఁడ
యిరవై జీతము సేసి యేలుకోవే శ్రీహరీ ॥కొత్త॥ 

ముఖ్య పదములకు అర్ధములు: గమికాఁడ = అధిపతి; అమరగాఁడా = శాశ్వతుడా

అరయక= విచారణ చేయక​; నల్ల తెల్లజల్లివాఁడ = అల్లిన జడలాగ నలుపు తెలుపులా పెనవేసుకుపోయినవాడా. 

ఇరవై నాలుగు గుణములు

పంచభూతములు

5

1 భూమి, 2 జలము, 3 అగ్ని, 4 వాయువు, 5 ఆకాశము

పంచఙ్ఞానేంద్రియములు

5

1 శ్రోత్రము(చెవి), 2 త్వక్కు(చర్మము), 3 చక్షుస్సు(కన్ను), 4జిహ్వ(నాలుక), 5 ఘ్రాణము(ముక్కు)

పంచకర్మేంద్రియములు

5

1 వాక్కు(నోరు), 2 పాణి(చేయి), 3పాద(కాలు), 4 పాయువు (గుదము), 5 గుహ్యము(రహస్యేంద్రియము)

విషయపంచకము

5

1 శబ్దము(చప్పుడు), 2 స్పర్శము, 3 రూపము(ఆకృతి), 4రసము (రుచి), 5 గంధము(వాసన)

అహంకార త్రయము

3

1 అహంకారము, 2 బుద్ధి, 3 మహత్తు (అవ్యక్తము)

మనస్సు

1

మొత్తము

24

భావము: నన్ను తికమక పెడుతున్న ఇరవై నాలుగు గుణములకు అధినాయకుడా! అరుదైన ఈ దేహమున వుండు శాశ్వతుడా! కనపడి కనబడక వెలుగు నీడలు పెనవేసికొన్నట్లు వుండు వాడా! బాసటగా నా మదిని పాలించ రాదా!


వివరణము: ఈ లోకాన్ని చూసి మనం అవాక్కవుతున్నామని పెద తిరుమలాచార్యులు సూటిగా చెబుతున్నారు. తైల సంస్కారములేని అందవిహీనంగా కనిపించే యోగి  చెప్పిన స్పష్టమైన సత్యాని కంటే  ఒక అందమైన యువతి చెప్పే అబద్ధాన్ని మనం ఎక్కువగా నమ్ముబోతాము. 

ఈ "నరయక నరసేటి నల్ల తెల్లజల్లివాఁడ"  పదబంధాన్ని అర్థం చేసుకుందాం:  వెలుగునీడల దోబూచులాటలో, విభేదాలను విస్మరింపజేస్తూ, సార్వజనీనతను స్ఫురింప జేయుచూ సత్యం దాక్కొని నివసిస్తుంది. ఈ ప్రకటన ఇప్పటికీ గందరగోళంగానే అనిపిస్తుంది.  దీనిని. M C ఎస్చెర్ గీసిన "ది ఎన్కౌంటర్" (తారసిల్లుట​) అనే అందమైన లిథోగ్రాఫ్ ద్వారా విశదపరచుకుందాం. 


 ఎమ్.సి. ఎస్చెర్ వేసిన "ఎన్కౌంటర్" ఒక ఆకర్షణీయమైన కళాఖండం. ఇది ఒకే బొమ్మకు రెండు ప్రతిబింబాలను చిత్రిస్తుంది. ప్రతి ఒక్కటి సంక్లిష్టమైన రేఖాగణిత నమూనాలతో కూడి ఉంటుంది. మనిషిని పోలిన ఈ బొమ్మలు చదునైన తెరవంటి ఉపరితలం నుంచి బయటకు వస్తున్నట్లు కనిపించే విధంగా అమర్చారు. అవి ఒకదానితో వొకటి చేతులు చాచి సమతుల్యంగా అమర్చబడి ఉంటాయి. 

ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్టమైన ఆకారముగల టైల్స్ (పెంకులు), వాటికి పరస్పర పూరకములగు పెంకులను అమర్చుటలో  ఎండమావుల మాదిరి దృశ్యభ్రమల పట్ల ఎస్చెర్ యొక్క ఆకర్షణను ప్రదర్శిస్తుంది. వివరాలపై సునిశిత శ్రద్ధ మరియు మాదిరిబొమ్మల అచ్చుల ఖచ్చితమైన అమలు దృశ్యాదృశ్యముల ఎత్తుగడలతో మరియు సంక్లిష్ట భావాన్ని సృష్టిస్తుంది. ఈ ఒండొకరులనిపించు  పరస్పరము విరుద్ధ భావనల కలయికను లేదా అవి ఒకదానికొకటి ప్రతిబింబములనే వాదనను సూచిస్తుంది. 

ఎం.సి. ఎస్చెర్ తన కళాకృతులను సృష్టించుటలో ఎంతగానో మునిగిపోయి బాహ్య ప్రపంచాన్ని మరచిపోయాడు. అతడు మనలా సామాజిక జీవితం గడపలేదు. ఒక యోగిలా జీవించాడు. ఎస్చెర్ యొక్క పని తరచుగా ద్వంద్వత్వం, సౌష్టవం మరియు గణిత ఖచ్చితత్వం యొక్క ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. దృశ్యపరంగా అద్భుతమైన మరియు మేధోపరంగా ఉత్తేజపరిచే కూర్పులను సృష్టించడంలో అతని నైపుణ్యానికి "ఎన్కౌంటర్" ఒక ప్రధాన ఉదాహరణ. 

ఇది సృష్టిలోని సౌష్టవం మరియు మానవుడు వువ్విళ్ళూరు ప్రత్యేక గుర్తింపుల మధ్య సంబంధాన్ని; పరస్పరము పూరకములగు చర్యలను;  మరియు అనుకరణము, నిర్మాణక్రమము, విన్యాసము, ప్రతిరూపముల అవగాహనను పునరాలోచించడానికి వీక్షకులను ఆహ్వానిస్తుంది. 

ఈ లిథోగ్రాఫ్ నరయక నరసేటి నల్ల తెల్లజల్లివాడ అను పదబంధానికి దాదాపుగా ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్పవచ్చును. సత్యం నలుపు మరియు తెలుపులను సమానంగా అల్లిన జలతారు గుడ్డవలె అనిపింపచేసి కళ్ళముందే తెలియకుండానే మటుమాయమౌతుంది. పై  చిత్రంలో తెలుపు యొక్క మూలాలు నలుపులో మరియు నలుపువానివి తెలుపులోనూ వున్నాయని గమనించే వుంటారు. ప్రత్యేకంగా భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సత్యాసత్యములు వెలుగునీడల వలె మెలిపడి వుంటాయని అనేక మంది తత్వవేత్తలు, మేధావులు అభిప్రాయపడిరి. 

అన్వయార్ధము: సర్వాధిపతి! మమ్మల్ని శాసించే రహస్యాలతో అయోమయానికి గురవుతాం. మా జీవితాలు అర్ధసత్యాల్లో చిక్కుకున్నాయి. నా హృదయాన్ని ఆక్రమించుకోమని నిన్ను వేడుకుంటున్నాను.  ఈ వ్యర్థమైన పనులలో అర్థాన్ని నింపండి. 

కామునిగరిడిలోని కటారిసామువాఁడ
లేమచూపుల పగలు దివ్వెలవాఁడా
గోమున నేకాంగి నారుగురితో నొఱటువాఁడ
యీమేటినైన నన్ను నేలుకో శ్రీహరీ ॥కొత్త॥ 

ముఖ్య పదములకు అర్ధములు: కటారిసామువాఁడ = కత్తితో సాము చేసే వాడా; ఏకాంగి = ఒంటరి మానవుడు; ఒఱటువాఁడు = మూర్ఖుఁడు. 

భావము: మన్మథుని ఆయుధముగా మాతో నిరంతరము సాము చేయించువాడా! మోహనాకారముతో మమ్ము మురిపించే కృష్ణ వర్ణుడా! అవివేకముగా  ఆరుగురితో కుస్తీ పడుతున్న యీ దేహమున వున్న నన్ను,  నా హృదయమును పాలించుకోవా  శ్రీహరీ.

వివరణము: గెలువమని తెలిసీ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే ఆరు ప్రత్యర్థులపై అలుపెరగని యుద్ధంలో మనమంతా మూర్ఖంగా పాల్గొంటామన్నారు పెద తిరుమలాచార్యులు. ప్రత్యామ్నాయములను లోతుగా యోచించి ఎంచుకోకపోవడమే, గొర్రె మాదిరి దాటు తత్వమే అధికాధికులు ఈ మార్గమున విఫలులవడానికి కారణమని ఈ చరణం సారాంశం. 

దురదృష్టవశాత్తూ, తరచూ ఈ విషయంలో మనలో మనమే పరస్పరము  విభేదించు కార్యములలో ఒకదానిని ఎంచుకుంటాం. మనం  కోరికలకు వెంటనే లొంగిపోతామే కానీ వాటి ఆవిర్భావం, ప్రభావము మరియు అవి కలిగించే హానిని మనం గమనించక విస్మరిస్తాము. కోరిక యొక్క కదలికలతొ జీవితమును రూపొందించుకుంటాం. "నేను" అను ప్రత్యేక గుర్తింపు, విలక్షణతలను నేపథ్యముగా నిర్మించిన సౌధము మానవుడు. దీని నిర్మాణమును లోతుగా పాతుకుపోయి, గుర్తించుటకు సాధ్యముకాని అనేకానేక సాకులు, నెపములు, కపటములు వూతమిచ్చి నిలబెడుతవి.  అందువలన, ఈ సమస్య ఉపరితలమున కాదు, కానీ మనలో లోతుగా వేళ్ళూనినది. 

పైన పేర్కొన్న వివరణల ప్రాతిపదికగా, దైవమును ఆశ్రయించుటొకటే  ఆచరణీయమైన ఎంపికగా కనిపిస్తుంది. ఈ భావనను దాదాపు అన్ని మతాలు నొక్కిచెప్పాయి. అయినప్పటికీ, ఆచరణలో మానవజాతి నిరంతరం దారి తప్పుతూనేవుంది. మన సమిష్టి చర్యలకు నిదర్శనమే ఈనాటి సమాజము. ఇది వేగంగా క్షీణిస్తున్నదని మనమందరమూ గమనించే వుంటాము. అందువల్ల, సమూలమైన మార్పు అనివార్యమవుతుంది.  

ఇప్పుడు మన దృష్టిని మన దృష్టిని "యీమేటినైన నన్ను నేలుకో శ్రీహరీ" అను పదబంధం వైపు మళ్ళిద్దాం:  ఇది తమ బలహీనతలను మరియు బాధలను అంగీకరిస్తూ నిజాయితీగా లొంగిపోవడాన్ని సూచిస్తుంది. ఇది చాలా సరళమైన, ఆచరణ యుక్తమైన ఎంపికగా కనిపిస్తుంది.

అయినప్పటికీ, మనం దేవుడి కన్నుకప్ప​గలమని అనుకునేంత మూర్ఖులము. అన్నమాచార్యులు ఇంతకు ముందు భగవంతుడిని ఇంటి బేహారి అని (=అంతరంగము లోపలి పరిశీలకుడిగా)  చిత్రీకరించాడు. మనలోని నిజాయితీ లోపాన్ని దేవుడు ఇట్టే గుర్తిస్తాడు. అందువలన, దైవమునకు మానవుడు తనకున్నదంతా పణంగా పెట్టి శరణనవలెను అని ఈ చరణం యొక్క సారాంశం.

అన్వయార్ధము:  మీ బలహీనతలను అంగీకరించండి, ఎందుకంటే నిష్ఫలమైన పోరాటంలో పాల్గొనడం నిరాశను మాత్రమే కలిగిస్తుంది. మీ అపరిపూర్ణతలను మనస్పూర్తిగా స్వీకరించండి. ఈ రకంగా మీ శ్రమను  వ్యర్ధము కానీయక నీలి నీడలలో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికి తీయండి.

యేడునేడు లోకముల యెక్కి దిగినట్టివాఁడ
మేడెపు సంసారమున మించినవాఁడ
వోడక వెదకితి నీ వొక్కఁడవే రాజ విఁక
యీడనే శ్రీ వేంకటేశ యేలుకోవే శ్రీహరీ ॥కొత్త॥ 

ముఖ్య పదములకు అర్ధములు: యేడునేడు = అనేకము, పెక్కు ; యెక్కి దిగినట్టివాఁడ = ఎక్కుతూ, దిగుతూ కాలము గడుపుతున్నవాడా; మేడెపు = యుద్ధపు, కలహపు, గుంపుకు, సమాజపు; మేడెపు సంసారము =వ్యతిరేకములతో కూడిన సంసారము.   మించినవాఁడ = అధికమైనవాడ; వోడక = ఓటమిని అంగీకరించక ప్రయత్నము మానని, అలుపెరగని.

భావము: అనేక లోకము లెక్కి దిగుతున్న వాడను. (అనవసరపు ప్రయాసపడు అజ్ఞానిని).  శ్రీ వేంకటేశ పరస్పరము విరుద్ధమైన విషయములతో కూడియున్న సంసారమునకు అతీతుడా, ఓటమిని అంగీకరింపక, వీడక, అలుపెరుగని సాహసముతో  నిన్ను వెంబడించితే, నీవొక్కడవే రాజు అను వాడవు అని గ్రహించితిని. శ్రీహరీ నేను ఇటు వుండగానే నా అంతరంగమును ఏలుకో.

వివరణము: 'యేడునేడు లోకముల యెక్కి దిగినట్టివాఁడ' అనునది మానవుడు 'నేను' అను హద్దును దాటి, తన పాత జీవితము తోటి సంబంధములను త్రుంచి వైచినప్పుడు కలుగు హద్దులే లేని కల్పనా చాతుర్య స్థితికి చేరుకున్నప్పుడు మానవుడు మొదటి నుండి ఇప్పటి వరకు జరిపిన  జీవన ప్రయాణము బోధ పడును. స్ఫురణకు వచ్చును. (ఇది మానవుల సామూహిక చైతన్యమే కానీ ఏ ఒక్కరి వ్యక్తిగతము కాదు).  ఇది జడ చైతన్యమూ కాదు.

అటువంటి స్థితికి చేరువగా వచ్చినప్పుడు మానవులలో అమిత సృజనాత్మక శక్తి వచ్చి చేరును. లక్షలాది మంది సంగీతము, కళలు, విజ్ఞాన, సామాజిక, వైద్య, మరియు సాంకేతిక రంగములలో, శాస్త్రములలో  కనీవినీ యెరుగని అత్యద్భుతమైన కళాఖండములను, అంతకు మునుపెప్పుడును లేని క్రొంగొత్త విషయములను ఆవిష్కరించారు. మహోన్నతులై వెలుగులను వెదజల్లిరి.

ఐతే, ఈ కార్యములకు మించిన కల్పనా చాతుర్యము సత్యము వైపునకు నిలిచి యుండుట. ఆ చైతన్య స్థితిలో సత్యమున సమ్మిళిత మగుటయే మానవుడు పొందగల ఏకైక బహుమతి. మిగిలిన వన్నియు మనలను మనము మోసగించు కుంటూ చేయు లావాదేవీలు మాత్రమే.

"ఐతే ఈ బహుమతి పొందగలమే కానీ కోరలేము. అదియే జ్ఞానము.  తక్కిన వాటిని ప్రస్తావించనక్కరలేదు. ఈ పేర్కొన్న జ్ఞానము జనన మరణముల వలయము లోనిది కాదు. మరణము చైతన్యమునకు మార్గము కాజాలదు. మానవుడా జీవించి యున్నప్పుడే మరణమునకు దారి ఏర్పరచుకోకు" అన్నదే పెద తిరుమలాచార్యుల సందేశం. 

అన్వయార్ధము: నరుడా! ఈ జీవనమను ప్రయాణం లెక్కలేనన్ని లోకాల గుండా వుండవచ్చుగాక. అంతిమ సత్యం ఒక్కటే అని మరవక అలుపును విస్మరించి విభుని అన్వేషించు. ముళ్ళు, రాళ్ళు, గుట్టలు కొండల, ఎగుడుదిగుళ్ళను లక్ష్యపెట్టవద్దు. కానీ గుర్తుంచుకో,  అహమును విడిచి హృదయంలో సహజమును రాజ్యమేలనివ్వు.

 

-x-x-x-


T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...