Sunday, 23 April 2023

T-163 ఏమిసేతు దైవమా యెన్నఁడు గరుణించేవో

 అన్నమాచార్యులు

163 ఏమిసేతు దైవమా యెన్నఁడు గరుణించేవో

 

for EnglishVersion press here

 

సారాంశం: ఏకీకరణ అనేది జీవితం యొక్క ప్రాథమిక న్యాయము. మనం దానిని ప్రతిఘటించినప్పుడు, విచ్ఛిన్నం అనేది మన లోపల మరియు వెలుపల సహజ ఫలితం. కాబట్టి మనం సమైక్యత  ద్వారా సామరస్యం అనే భావనకు వస్తాము. నార్మన్ కజిన్స్ (Norman Cousins) 

కీర్తన సారాంశం:

పల్లవి: పెక్కు తలుగులు (ముళ్ళు) గల నిడివి తాడు వంటి సంసారములో విధి తట్టుటచేత కఱకుగా మారిన నన్ను (నా మనస్సును) మన్నించి యెన్నఁడు కరుణించేవో? అంత వరకు యేమి ఏమిసేతు దైవమా! అన్వయార్ధము:  కటువుగావించబడిన మనసుతో ఏమిచేయుటయో యెరగని నాకు చేయగల కార్యము సెలవీయవయ్యా స్వామి.

చరణం 1: ఇంద్రియాలు నన్నుఁబట్టి కక్కరిబిక్కరిచేసి పగ సాధించుచున్నవి. శ్వాసకు శ్వాసకు మధ్యనున్న కాలమంత వ్యవధి కూడా ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి జన్మలు పుట్టుకొస్తూ నాకు తగులుకుంటున్నాయి

చరణం 2: ఎన్నాళ్లనాటి పాపమో తెలియదు కానీ తీవ్రమైన కోపమనే ఆవిరిచే యెడతెగకుండా ఉడుకుతూనే వున్నాను. ఎవరో సూటిగా శాపమిచ్చినట్లు నేను కూడబెట్టిన జ్ఞానమంతా చివరి క్షణంలో వీగిపోయి పాలిపోయినట్లైంది.

చరణం 3: ఈ నా స్వభావమేమో తెలియదు కానీ రావిమాని జిగురులా కర్మములలో హెచ్చరిక లేకుండానే అతుక్కుపోవునట్లు చేయుచున్నది. శ్రీవేంకటేశుఁడ నీవే గతి అనవలసె కానీ నీవు నా చిత్తములోపల నుండి కావఁవుగదా!

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు మానవుని వేధించు సమస్యలను బహు కొలది మాటలలో నిక్షిప్తము చేశారు. వారు ముఖ్యముగా వెలుపల​, లోపల అని మనము గిరి గీసుకున్న ప్రమాణములను ప్రశ్నించిరి. (వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా#1) అను మునుపటి  కీర్తనలో బాహ్యము అంతరంగంగా మారడం చూశాం. ఇప్పుడు ఈ కవితలో అంతరంగము జ్ఞాపకంగా, జడ పదార్థంగా రూపాంతరం చెందడాన్ని చూస్తాం. అన్నమాచార్యులు మనము యేర్పరచుకున్న కొలమానములను, మేరలను, యెల్లలను రద్దు చేస్తూ మన ప్రయత్నములను వ్యర్ధమనిరి. 

ఏది బాహ్యమో, యేది అంతరంగమో తెలియని మనము దైవమును అజ్ఞానముకొలది నిలదీయబోతాము. అన్నమయ్య మన అంతరంగమున నిలచి ఈ పాట వ్రాసినారేమో!

 

కీర్తన:
రాగిరేకు:  118-3 సంపుటము: 2-105
ఏమిసేతు దైవమా యెన్నఁడు గరుణించేవో
దామెన సంసారములోఁ దట్టువడీ మనసు ॥పల్లవి॥
 
యెక్కడి పగయొకో ఇంద్రియాలు నన్నుఁబట్టి
చక్కుముక్కు సేసి యెంచి సాధించీని
గుక్కక యేమిసేసిన కొలయొకో వెంటవెంట
వెక్కసపు పుట్టువులై వెనుతగిలీని ॥ఏమి॥
 
యెన్నాళ్లపాపమొకో యెడతెగక నాలోన
వున్నతపుఁ గోపమై వుమ్మగిలీని
తిన్ననై యెవ్వరిచేతితిట్టు దాఁకినవిధమో
విన్ననై విజ్ఞానమెల్లా వీటిఁబోయఁ దుదిని ॥ఏమి॥
 
యే వేళ గుణమో యెడతెగని కర్మాలు
రావిమాని జిగురై వూరక యంటీని
శ్రీవేంకటేశుఁడ నీవు చి త్తములోపల నుండి
కావఁగఁగదా నీవే గతి యనవలసె ॥ఏమి॥

Details and Explanations: 

ఏమిసేతు దైవమా యెన్నఁడు గరుణించేవో
దామెన సంసారములోఁ దట్టువడీ మనసు ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: దామెన = పెక్కు తలుగులు గల నిడివి తాడు; దట్టువడీ = తట్టుటచేత గట్టిపడినది (= కరకుగా మారినది). 

భావము: పెక్కు తలుగులు (ముళ్ళు) గల నిడివి తాడు వంటి సంసారములో విధి తట్టుటచేత కఱకుగా మారిన నన్ను (నా మనస్సును) మన్నించి యెన్నఁడు కరుణించేవో? అంత వరకు యేమి ఏమిసేతు దైవమా! 

వివరణము: దట్టువడీ మనసు = కఱకుగా మారిన మనస్సు అన్నది గమనింపదగ్గది. మార్దవములేని మనస్సుకు సద్గతిలేదు. కఱకుదనము ఎటుపడితే అటువంగని లక్షణమును సూచించుచున్నది. ఇంతకు మునుపు 'ప్రతిఘటన' లేని మనస్సు యొక్క ఆవశ్యకతను పలుమార్లు చర్చించుకొన్నాము. 

దామెన సంసారము: మనిషికి అనుభవముతో వచ్చు స్మృతులు జ్ఞాపకములు అతని ఎఱుకకు మితులు విధించి స్వేచ్ఛగా మనసు పారుటను అడ్దుకుంటుంన్నవని తెలిపిరి అనుకోవచ్చును. 

ముళ్ళబాట వంటి ఈ బ్రతుకు తోవలో గఱుకెక్కిన మనసుతో యేమి చేయుటయో పాలుపోక ఏమిసేతు దైవమా అని నిశ్చయింపలేని స్థితిని తెలుపుతూ యెన్నఁడు గరుణించేవో  అని అన్నమాచార్యులు మొరపెట్టుకొనుచున్నాడు.

అన్వయార్ధము:  కటువుగావించబడిన మనసుతో ఏమిచేయుటయో యెరగని నాకు చేయగల కార్యము సెలవీయవయ్యా స్వామి.

యెక్కడి పగయొకో ఇంద్రియాలు నన్నుఁబట్టి
చక్కుముక్కు సేసి యెంచి సాధించీని
గుక్కక యేమిసేసిన కొలయొకో వెంటవెంట
వెక్కసపు పుట్టువులై వెనుతగిలీని ॥ఏమి॥

ముఖ్య పదములకు అర్ధములు: చక్కుముక్కు సేసి = చిందరవందరచేయు, గుక్కక = శ్వాసకు శ్వాసకు మధ్యనున్న కాలమంత​ వ్యవధి కూడా ఇవ్వకుండా; వెక్కసపు = అధికము.

భావము: ఇంద్రియాలు నన్నుఁబట్టి కక్కరిబిక్కరిచేసి పగ సాధించుచున్నవి. శ్వాసకు శ్వాసకు మధ్యనున్న కాలమంత వ్యవధి కూడా ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి జన్మలు పుట్టుకొస్తూ నాకు తగులుకుంటున్నాయి. 

వివరణము: యెక్కడి పగయొకో ఇంద్రియాలు నన్నుఁబట్టి / చక్కుముక్కు సేసి యెంచి సాధించీని"లా-ఫోలీ-ఎల్మేయర్" అనే శీర్షికతో ఉన్న రెనే మాగ్రిట్ గారి పెయింటింగ్ను విమర్శనాత్మకంగా చూడండి. ఈ చిత్ర పటము అధారముగా మొత్తము కీర్తనను వివరించ ప్రయత్నిస్తాను. శిధిలమైన బురుజుకు చెట్టుకున్నట్లు వేళ్ళు చూపి క్రొత్త విధముగా ఆలోచించునట్లు చేసిరి మాగ్రిట్ గారు. జీవముతో నున్న వేళ్ళు ఇటుకలుగా మారడం సహజము.



వేళ్ళు, వాటి నుంచి చెట్టు మొదలు అక్కడినుండే బెరడుతో సహా వేళ్ళు ఇటుకలుగానూ రూపాంతరము చెందడం గమనించవచ్చు. వేళ్ళ నుంచి పైకి పోతున్నకొలదీ ఇటుకల మధ్య  బీటులను కూడా చూడవచ్చు. అన్నింటి కంటే పైన వున్న ఇటుకలు పాతవన్నమాట​. వాటిలోనే పగుళ్ళు జాస్తి.

శిధిలమైన బురుజు అనుభవాన్ని జ్ఞాపకంగా మార్చడాన్ని సూచిస్తుంది. టవర్లో పగుళ్లు జ్ఞాపకశక్తిలోని అంతరాలను సూచిస్తాయి. అనేక మూలాలు (వేళ్ళు) మనం సమాచారాన్ని గ్రహించే అనేక వనరులను సూచిస్తాయి. ఒక విషయము ఫలానా దగ్గరనుంచి వచ్చినదని నిరూపించలేక పోతాము. ఒక్కొక్క ఇటుక పాక్షికమైన అనుభవాన్ని నిల్వచేస్తుందని సులభంగా తెలియవచ్చు. అనేక ఇటుకలు కలిపి ఒక అనుభవాన్ని జమచేసి చూపునని కూడా తెలియును.

విడివిడి ఇటుకలు కేవలము గిడ్డంగి లాగా పనిచేయునని కూడా భావించవచ్చును. పగుళ్ళు అనుభవము మరుగునపడి పోవుటకు దారితీయును.  ఇటుకలను కలిపివుంచిన పదార్ధము వాటిలోని సమాచారమును అనుసంధించుటకు ఉపయోగ పడును.  గుండ్రటి గోపురం అనుభవాలలో కొంత భాగం కనిపించని వైపు ఉందని సూచిస్తుంది.

ఇక క్రింది భాగములోని వేళ్ళు అన్ని దిక్కులలోను వ్యాపించి వుంటాయని మనకు తెలుసు. మానవుని లోపలకు చొచ్చుకొని వచ్చు అనేకానేక విషయములు ప్రత్యక్ష సంబంధము లేకనే (స్పృశించకనే) ప్రవేశించునని సూచించుతూ ఆ బురుజును గాలిలోపలికి ఎత్తి చూపించారు. క్రింద చూపిన వేళ్ళు మొత్తము శరీరమంతా వ్యాపించి యున్న అనేకానేక నాడులనుఇంద్రియములనుమనస్సునుమనుజుని ఆవరించుకొనియున్న వాతావరణమును సూచించును. చెట్లు భూగర్భములోని నీటిని చిటారు కొమ్మలవరకు చేర్చునట్లేఅందుకున్న అనుభవములన్నీ వేరులద్వారా ఉపరితలమునకు వచ్చి అటుపై ఇటుకలుగాను మారుతున్నవి.

దామెన సంసారములోఁ దట్టువడీ మనసు' తో అనుభవములు  ఙ్ఞాపకములుగా మారుటను సూచించిరి. అనుభవము అనునది జీవముతో కూడినదైతే, ఙ్ఞాపకములు జడ పదార్థమునకు ప్రతీక. అందుచేత, అన్నమాచార్యులు గట్టి పడిన జడముతో జీవమును తెలుపు అనువమును పోల్చరాదని చెప్పిరనుకో  వచ్చును.

మునుపటి కీర్తనలో బాహ్యం అంతరంగంగా మారడం చూశాం. ఇప్పుడు ఈ కవితలో అంతరంగం జ్ఞాపకంగా, జడ పదార్థంగా రూపాంతరం చెందడాన్ని గమనించవచ్చు. బాహ్యము అంతరంగము జడ పదార్థం ఒకదానిలోకొకటి రూపాంతరము చెందడము సులభముగా అంగీకరించ లేనిదైనప్పటికీ వాస్తవమును కాదనలేముగా. భగవద్గీతలోని 7-4వ శ్లోకము ఇక్కడ ఉదాహరింపతగ్గది భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ।। = అర్జునా, ఈ విశ్వంలో ఉన్నదంతా నా భౌతిక శక్తి యొక్క స్వరూపమే.’ కేవలం ఈ ఒక్క ప్రకృతి శక్తి యే ఇన్ని వివిధ రకాల ఆకారములు, స్వరూపములు, మరియు పదార్థములుగా రూపాంతరం చెందింది".

ఈ విధంగా మనిషి రెండు విధాలుగానూ ప్రభావితమవుతాడు. అంతరంగాన్ని గానీ, బాహ్యాన్ని గానీ మనం కచ్చితంగా సత్యమని తీసుకోలేం. (= ఇంద్రియాలు నన్ను కక్కరిబిక్కరి సేసేనే.) అందువలన, అన్నమాచార్యులు ఎల్లప్పుడూ లోపలి మరియు బాహ్య రెండింటినీ విసర్జించమని చెప్పారు. (ఆలోచన, జ్ఞాపకశక్తి - బాహ్య ప్రతిస్పందనలే) బాహ్యం అనేది పర్యావరణం అంతర్గతంగా రూపాంతరం చెందుతుంది. వీటిని ఎలాగ వీడనాడ వలెనో కనుక్కోవడమే మనిషి ముందున్న సవాలు. దీనికి స్పష్టమైన సమాధానాలు లేవు.

ఇవి ఎదో ఒకసారి వచ్చి వుండిపోయేవికావు. నిరంతరము, ఇరవైనాలుగ్గంటలూ కొల్లలు కొల్లులుగా వచ్చి చెరుతున్న సమాచారముతో మనిషి తబ్బిబ్బౌతాడు (చక్కుముక్కు సేసి). మానవుడు బురుజును కాదు పెద్ద కోటనే తలపై నిర్మిస్తాడు. ఆ  కోటలో నివసిస్తూ అగపడు ప్రతీ విషయముపై, వ్యక్తులపై, సమాజముపై అభిప్రాయములు యేర్పరచుకుని అదే సత్యమని భావిస్తూ జీవిస్తాడు. 

యెన్నాళ్లపాపమొకో యెడతెగక నాలోన
వున్నతపుఁ గోపమై వుమ్మగిలీని
తిన్ననై యెవ్వరిచేతితిట్టు దాఁకినవిధమో
విన్ననై విజ్ఞానమెల్లా వీటిఁబోయఁ దుదిని ॥ఏమి॥

ముఖ్య పదములకు అర్ధములు: వుమ్మగిలీని = ఉడుకు నట్లు చేసినది; విన్ననై = పాలిపోయిన, తెల్లబోయిన, వివర్ణమైన​; వీటిఁబోయఁ = వీడి పోయినది; 

భావము: ఎన్నాళ్లనాటి పాపమో తెలియదు కానీ తీవ్రమైన కోపమనే ఆవిరిచే యెడతెగకుండా ఉడుకుతూనే వున్నాను. ఎవరో సూటిగా శాపమిచ్చినట్లు నేను కూడబెట్టిన జ్ఞానమంతా చివరి క్షణంలో వీగిపోయి పాలిపోయినట్లైంది. 

వివరణము: విన్ననై విజ్ఞానమెల్లా వీటిఁబోయఁ దుదిని: జీవితంలోని సవాళ్ళను ఎదుర్కోవడానికి చదువులని, కళలని, ధనమని, బంధువులని యేర్పరచుకుంటాం.  ప్రకృతికి ఒక క్రమమమును కట్టబెట్టి ఆ రకముగా సంసిద్ధత వుండేటట్టు చూసుకుంటాం. కానీ వాస్తవం మన సన్నాహాలకు సంబంధము లేక వుంటుంది. అనూహ్యమైన దానిని వూహించబోవుట విజ్ఞతతో కూడిన పనియేనా? “కోరి నిద్రించ బరచు – కొన నుద్యోగింతు గాని / సారె లేతునో లేవనో – జాడ తెలియ నేను”#2 (=రేపు లేతునో లేవనో తెలియకనే రాగల వుదయముకై సన్నాహాలు ప్రారంభిస్తాను) అన్న కీర్తనను ఇక్కడ మననము చేసుకోవడము ఉచితమని భావిస్తున్నాను. 

యే వేళ గుణమో యెడతెగని కర్మాలు
రావిమాని జిగురై వూరక యంటీని
శ్రీవేంకటేశుఁడ నీవు చి త్తములోపల నుండి
కావఁగఁగదా నీవే గతి యనవలసె ॥ఏమి॥

భావము: ఈ నా స్వభావమేమో తెలియదు కానీ రావిమాని జిగురులా కర్మములలో హెచ్చరిక లేకుండానే అతుక్కుపోవునట్లు చేయుచున్నది. శ్రీవేంకటేశుఁడ నీవే గతి అనవలసె కానీ నీవు నా చి త్తములోపల నుండి కావఁవుగదా

వివరణము: యే వేళ గుణమో యెడతెగని కర్మాలు / రావిమాని జిగురై వూరక యంటీని”: "లా-ఫోలీ-ఎల్మేయర్" అనే పెయింటింగ్’ను తిరిగి చూద్దాం. అన్నమాచార్యులు చెబుతున్నజ్ఞానమను బాటలో ఆకలిని పట్టించుకోక​, రక్షణలేమిని విస్మరిస్తూ, అనామకునిగా యాత్ర సాగించ వలసివచ్చును. సినిమా పాటలో లాగ "మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా ..నిరుపేదను వలచావెందుకే" అని పాడుకొంటూ నిజముగా జీవనము సాగించలేము. ఆకలి, రక్షణ, గుర్తింపులేనితనము (అనామకత​) అను మూడూ మనిషిని భయపెట్టి గూడులోకి తిరిగేటట్టు చేస్తాయి. ఇవే మనిషికి సవాళ్ళు విసిరేవి. ఇలాంటి చర్యలనే రావిమాని జిగురుగా అన్నమయ్య వర్ణించారు.  

మనిషికి నిజమైన ప్రతిబంధకము బాహ్యము నుంచి కాదు. తనను తాను సమగ్రముగా తెలియలేక పోవుటయే. తన గురించి పూర్తిగా, సూదిమోపినంత చోటు కూడా విడవకుండా తెలుసుకొనుటకు తననుండి తాను విడివడి చూడగలగాలి. ఇది సాధ్యమేనా?

ఇప్పటి 360 డిగ్రీల కోణము నుంచి చూపు యుక్తులు, ఉపాయములు కూడా యేదోవొక ప్రతిపాదన లేదా నమ్మకముపై అధారపడి తెలుపునవియే. అవి వూరటనిచ్చును కానీ సత్యమును తెలుపునా? సత్యమును తెలియుటకు మనిషి తననుండి తాను బయటకువచ్చి చూచుట ఒక్కటియే మార్గము.ఏ వుపాయములు యెక్కడి కెక్కను శ్రీవల్లభ నీ సేవే ఘనము అని అన్నమాచార్యులన్న మాటలు గమనింపదగ్గవి.

మహానుభావులైన వారు, కారణజన్ములు తమ దేహముపై ఎఱుకను కోలుపోయి తమనుండి తాము విడివడి తమనితాము ఎఱుగుట జిడ్డు కృష్ణమూర్తి జీవిత చరిత్ర నుండి, ఇతిహాసముల నుండి తెలియవచ్చు. అట్లని, కాషాయ వస్త్రాలు కట్టుకొన్న ప్రతీవారు అట్టి ఎరుకకు అర్హులు కానేరరు. జాగ్రత్తగా గమనించిన కాషాయ వస్త్రాలు కూడా అనుకరణకు ప్రతీకలు కావున వాటిధారణ ఆత్మ తప్తినిచ్చిననూ అగత్యమైనది కాదు. మానవ యత్నమున యిది సాధ్యముకాదని అన్నమాచార్యులు దైవముపై అచంచలమైన భక్తిని ప్రతిపాదించిరి.

వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన” (భగవద్గీత 2-41) భావము:  వివేకవంతమైన మార్గమొక్కటియే కలదు. (తక్కినవన్నీ అవివేకములు). ఈ విధంగా, అన్నమాచార్యులు మనం నిర్ణయించుకున్న ఆ ఒక్క యత్నమే మనసున నుండవలెననిరి.

References and Recommendations for further reading:

 

-x-x-x-

1 comment:

  1. పెక్కు ముళ్ళు గల ఈ సంసారజీవితములో అనుభవజన్యమైన ఆలోచనలతో, స్మృతులతో మనస్సు మృదుత్వమును కోల్పోయి కటువుగా మారిపోయి, స్వతఃస్వేచ్ఛతో మెలగే స్థితిని పోగుట్టుకున్నది.నీ అనుగ్రహమును ప్రసరింపజేసి నా చిత్తమును స్థిరపఱచి నన్ను ఆదుకోవయ్యా అన్న
    ఆవేదనను వ్యక్తపరచుచున్నాడు అన్నమయ్య కీర్తన యొక్క పల్లవియందు.

    దశేంద్రియములు నాపై ఆధిపత్యం వహించి మనస్సును ఆస్థిరపరుస్తున్నవి. విషయసుఖములలో చిక్కుకున్న మనస్సు,బుద్ధి నాచే పాపపుణ్య కర్మల నాచరింపజేసి పునర్జన్మకు హేతువగుచున్నవి.జననమరణ చక్రంలో నన్ను బందీని చేసి ముక్తికి కడు దూరముగా ఉంచుతున్నవి.
    ఆదిశంకర ప్రణీతమైన భజగోవిందం లోని ఈ శ్లోకం ఈ సందర్బంగా ఉటంకించటం సముచితముగా ఉంటుంది::

    *పునరపి జననం పునరపి మరణం*
    *పునరపి జననీ జఠరే శయనం|*
    *ఇహ సంసారే బహుదుస్తారే*
    *కృపయా పారే పాహి మురారే||*

    "పుడుతూ, మరణిస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూ, పుడుతూ దుస్తరమైన ఈ సంసారాన్ని దాటటం సాధ్యం కాకున్నది. మురారీ దయతో నన్ను రక్షించు."

    ఇంద్రియముల వలన కలిగిన అనుభవములు మనస్సున కటువుగా, కరకుగా మారటం అనునది
    రినే మాగ్రిట్టే చిత్రంలో చూడవచ్చును. ఈ చిత్రంలో గల చెట్టులోని క్రింది భాగం వ్రేళ్ల ద్వారా నీరు, పోషకములు కాండము, శాఖలలో ప్రసరించునట్లు,
    వాటి ద్వారా కలిగిన అనుభవములన్నియు పైభాగమునకు వచ్చి కరుడు గట్టి ఇటుకలుగా మారిపోవటం చూడవచ్చును.

    జన్మాంతర పాపకర్మల ఫలమేమో గాని, కామక్రోధాది అరిషడ్వర్గముచే ఆనవరతము శాపగ్రస్తుని వలె బాధింపబడి, ఇంతవరకు సముపార్జించిన, సంచితమైన జ్ఞానసంపద యంతా చివరకు నశించిపోయింది.

    సంచితప్రారబ్ధఫలమేమో గాని జ్ఞానసాధనకు ప్రతిబంధకములైన కర్మల యందు రావిమ్రాను జిగురు వలె వదలక,చిక్కుకొని, చిత్తము నందే అంటే హృదయమునందే స్థితమై యున్న శ్రీవెంకటేశ్వరుని కానక, గ్రహించలేక, జీవిత పరమావధి అయిన ముక్తిని బడయకున్నాను.నీవే శరణు, నీవే గతి-నన్ను బ్రోవుమయ్యా యని అన్నమయ్య ఆ లక్ష్మీపతిని ఆర్తితో, ఆర్ద్రతతో వేడుకొంటున్నాడు చివరగా ఈ చరణంలో.

    శ్రీ చామర్తి వారి వ్యాఖ్యలు, వివరణలు అద్భుతంగా ఉన్నాయి. కీర్తన యొక్క గంభీరమైన భావాన్ని సులభముగా అర్థం చేసికొనుటలో వారి వ్యాఖ్యానం దోహదపడింది. వారికి హృదయపూర్వక అభినందనలు, నతులు.

    ఓం తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻

    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...