Friday, 6 March 2026

T-310 బయలు మొరంగగు పరమమాయ ఇది

 తాళ్లపాక అన్నమాచార్యులు
310 బయలు మొరంగగు పరమమాయ ఇది
For English version press here

ఉపోద్ఘాతము
అన్నమాచార్యుల అధ్యాత్మ సంకీర్తనలలో బయలు మొరంగగు పరమమాయ ఇది” ఒక విశిష్టమైన మనస్తత్వ విశ్లేషణ. ఈ కీర్తనలో అన్నమాచార్యులు మాయ అనే విషయాన్ని ఒక అసాధారణమైన కోణంలో పరిశీలిస్తారు. సాధారణంగా “మాయ” అంటే మన కళ్ళకు కనిపించనిది, ఎక్కడో దాగి ఉండేది అని మనం అనుకుంటాము. కానీ అన్నమయ్య ఈ కీర్తనలో మాయ యొక్క ఒక విరుద్ధ స్వభావాన్ని (Paradox) ఆవిష్కరిస్తున్నారు. మాయ అనేది ఎక్కడో దాగి ఉన్నది కాదు; అది మన కళ్ళ ముందే అత్యంత స్పష్టంగా — బయలు”గా ఉన్న సత్యమే. 

ఈ కీర్తనను సరిగ్గా అర్థం చేసుకోవడానికి షెర్లాక్ హోమ్స్ తన మిత్రుడు వాట్సన్‌తో అన్న ఒక ప్రసిద్ధ మాటను గుర్తుచేసుకోవచ్చు:నువ్వు నేను చూసేది ఒకటే; కానీ చూసిన దానిని నేను అభ్యాసంతో గమనించడానికి ప్రయత్నిస్తాను.” మన సమస్య “చూడటంలో” (Seeing) లేదు; చూసిన దానిని గమనించటంలో” (Observing / Noticing) ఉంది.

మనిషి ప్రపంచాన్ని నేరుగా చూడడు. తనకు ముందుగా తెలిసిన జ్ఞాపకాలు, అభిప్రాయాలు, ఆశలు, భయాలు — ఇవన్నీ కలిసి వాస్తవాన్ని వడపోసి చూపిస్తాయి. అందువల్ల మనం చూస్తున్నది నిజమైన ప్రపంచం కాదు; మనస్సు నిర్మించిన రూపమే.

సత్యం మన కళ్ళ ముందే ఉన్నా, మనకు తెలిసిన పాత జ్ఞాపకాలు, అరువు తెచ్చుకున్న జ్ఞానం, మరియు అంతులేని భోగాసక్తి అనే పొరల వల్ల ఆ సత్యాన్ని మనం గమనించలేకపోతాము. చివరికి అన్నమాచార్యులు చెప్పినట్లుగా — మనము దానిలో “నయమున లోనై మరతుము.”

మనిషికి దైవముపై ఉన్న అపనమ్మకము, లేదా తనపై ఉన్న అతి విశ్వాసమే మాయ. ఆ రెండూ లేని నాడు మాయకు స్థానం ఉండదు. 


అధ్యాత్మ​ సంకీర్తన
రేకు: 197-6 సంపుటము: 2-501
బయలు మొరంగగు పరమమాయ ఇది
నయమున లోనై వగతురు గాని          ॥పల్లవి॥

కలఁడు హరి యొకఁడు కావ జగములకు
కలిగినతఁడు లేక మానఁడు
తెలిసి ఇందరికిఁ దేరిన యర్థమే
మలసి యప్పటి మరతురు గాని         ॥బయ॥

పుట్టినదెల్లా భోగముకొరకే
పుట్టిన భోగము పో దెపుడు
పట్టి యీమాఁటలే పలుకుదు రిందరు
మట్టులేక ఇది మరతురు గాని            ॥బయ॥

కర్మము శ్రీవేంకటపతి కార్యము
కర్మము దేహికిఁ గాణాచి
ధర్మ మీదేవుని దాస్యం బందురు
మర్మము లోకులు మరతురు గాని      ॥బయ॥
Details and Explanations:
పల్లవి:
బయలు మొరంగగు పరమమాయ ఇది
నయమున లోనై వగతురు గాని   ॥పల్లవి॥ 
పదబంధం
అర్థం

బయలు మొరంగగు

తెరిచి ఉన్నా దాగి వుండే
పరమమాయ ఇది
ఇదే పరమమైన మాయ
నయమున లోనై
ఇది సులభమని, మంచిదని భావించి
వగతురు గాని
దానిలో పడిపోయి తరువాత పశ్చాత్తాపపడుతారు

సూటి భావము:
తెఱచియున్నాను దాగి వుండే పరమ మాయ ఇదే. సులభమని చులకనగా చూచి అందులో ఇరుక్కొని తరువాత విచారించుదురు.

గూఢార్థవివరణము:
ఈ పల్లవిలో అన్నమాచార్యులు ఒక గొప్ప విరుద్ధ భావాన్ని చూపుతున్నారు. బయలు మొరంగగు”బయట ఉన్నది, కాని దాగి ఉన్నది. అంటే మాయ ఎక్కడో దూరంలో లేదు. మన ముందే మన అనుభవ ప్రపంచమే అది. అయినా దాని స్వభావం అడుగు అడుక్కి మనకు స్పష్టం కాదు. ఇది ఎందుకు జరుగుతుంది? 

మనము ప్రపంచాన్ని నేరుగా చూడము. మనస్సు ముందుగా చూసిన అనుభవాలు, జ్ఞాపకాలు, అభిప్రాయాలతో పోల్చటం ద్వారా కనుల ఎదుటి వాస్తవంపై ఒక నిర్ధారణకు వస్తుంది. అందువల్ల మనం చూస్తున్నది వాస్తవం కాదు — మన జ్ఞాపకాల పొరల ద్వారా వడపోసిన రూపం మాత్రమే.

 ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి నిశిత నిశీధి (“The Meaning of Night”) అను పేరుగల రెనే మాగ్రిట్ గారి ఒక అధివాస్తవిక చిత్రాన్ని ఉదాహరణగా చూడవచ్చు — పైచిత్రంలో  సంధ్యా సమయం తర్వాత సముద్రతీరంలో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకరు కళ్ళు మూసుకొని మనవైపు, ఇంకొకరు సముద్రం వైపు తిరిగి వున్నారు. నేలపై మేఘాల్లాంటివి అక్కడక్కడ విసిరేసినట్లుగా కనబడుతుంది. అస్పష్టంగా గాలిలో ఒక మహిళ శరీర భాగాలు తేలుతున్నట్లు ఉంటుంది. 

ఈ దృశ్యంలో కొన్ని భాగాలు, మనుషులు, సముద్రం స్పష్టంగా ఉన్నా, కళ్ళుమూసుకున్న ఆ వ్యక్తి, భూమి  సముద్రం కలిసే చోటు కృత్రిమంగాను, గాలిలో తేలుతున్న మహిళ దేహం అస్పష్టంగాను ఉంటాయి. ఇలాంటి చిత్రాన్ని చూస్తునే మనస్సు మనకు అర్థమైన విధంగా  సాధారణంగా తెలిసిన వానితో ఏమైనా పోలికలు వున్నాయా అని వెతికి ఒక కథను లేదా దృశ్యాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. అలా చేయటంలో కొన్ని అర్థం కాని భాగాలను గమనించకుండా వదిలివేయడమో లేదా పొరపాటు అని భావించి ప్రక్కకు నెట్టివేయడమో జరుగుతుంది. అలా మనం చిత్రాన్ని పూర్తిగా చూడకుండా, మనకు అర్థమయ్యే భాగాలనే మాత్రమే గుర్తిస్తాము.

మాగ్రిట్ ఈ చిత్రంతో సూచిస్తున్నది ఇదే — మనం చూస్తున్నదాన్ని నిజంగా చూడము. మనకు తెలిసిన 'జ్ఞానం'తో దానిని వెంటనే సరి పోల్చుకోవాలని ప్రయత్నిస్తాము. ఆ ప్రయత్నంలో అసలు దృశ్యం మన మనోఫలకము నుండి జారిపోతుంది.

అన్నమాచార్యులు చెప్పిన “బయలు మొరంగగు పరమమాయ” అనేది కూడా ఇదే విషయాన్ని సూచిస్తుంది. మాయ ఎదుటే ఉంది. ఇది ఎంత కష్టం? నాకు ఐన్‌స్టీన్ సూత్రాలే తెలుసు కదా!” అనే భావంతో దానిని సులభమని తీసుకుంటాం. ఈ ప్రయత్నమే అసలు తంటా. అందువల్ల మనం దానిని స్పష్టంగా చూడలేం. ​“నయమున లోనై వగతురు గాని” అన్నది అత్యంత నిశితమైన పరిశీలన​. వాస్తవము.
 
సత్యం ఇక్కడే, నీ కళ్ళ ముందే ఉంది; కానీ నీ స్వంత ఊహల్లో ఎంత నిమగ్నమైపోయావంటే, నీ ఎదురుగా ఉన్న వాస్తవాన్ని గమనించే స్పృహ కూడా నీకు లేకుండా పోయింది."

అందువల్ల కవి చెప్పదలచినది ఏమిటంటే — మాయ ఎక్కడో దాగి ఉన్న శక్తి కాదు. మనం ప్రపంచాన్ని చూసే విధానమే దానికి కారణం. మనస్సు జ్ఞాపకాలతో, అభిప్రాయాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించినంత కాలం, వాస్తవం మనకు పూర్తిగా కనిపించదు. అదే బయలు మొరంగగు పరమమాయ.”

మొదటి చరణం:
కలఁడు హరి యొకఁడు కావ జగములకు
కలిగినతఁడు లేక మానఁడు
తెలిసి ఇందరికిఁ దేరిన యర్థమే
మలసి యప్పటి మరతురు గాని  ॥బయ॥

Telugu Phrase
Meaning
కలఁడు హరి యొకఁడు కావ జగములకు
హరి ఉన్నాడు — జగత్తును కాపాడువాడు.
కలిగినతఁడు లేక మానఁడు
ఉన్నవానిని లేదన్నా ఉండక మానడు
తెలిసి ఇందరికిఁ దేరిన యర్థమే
తెలిసినది అంతా (కలిపి) తెప్పరిల్లి, తేరుకొని చెప్పుకున్నదే (అంతా ఏకీభవించినదే) = ఇది అందరికీ తెలిసి, సాధారణ బుద్ధిలో స్థిరపడిన అర్థమే

మలసి యప్పటి మరతురు గాని

ఆ సమయానికి తూలి మర్చిపోతారు కానీ

సూటి భావము:
జగత్తును కాపాడువాడైన హరి ఉన్నాడు. ఉన్న వానిని ఎవరు కాదన్నా ఉండక మానడు. ఈ విషయము అందరికీ తెలిసినదే; సాధారణ బుద్ధిలో స్థిరపడిన అర్థమే. అయినప్పటికీ ఆచరణ సమయానికి మనుషులు తూలి దానిని మర్చిపోతారు.

గూఢార్థవివరణము:
ఈ చరణంలో అన్నమాచార్యులు ఒక ముఖ్యమైన మానసిక విరుద్ధతను సూచిస్తున్నారు. తెలిసి ఇందరికిఁ దేరిన యర్థమే”కొన్ని విషయాలు లోతైన తాత్విక పరిశోధన ఫలితాలు కావు. అవి మానవుల అనుభవములో కాలక్రమంగా స్థిరపడిన సాధారణ బుద్ధి లోకజ్ఞానం. ఏది స్థిరమైనది, ఏది క్షణికమైనది ఎవరికీ ప్రత్యేకముగా తెలుపవలసిన రహస్యాలు కాదు; సమాజ జీవనంలో ఏర్పడిన సామూహిక అవగాహన. 

అందువల్ల జ్ఞానములో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే ప్రశ్నకు ఇక్కడ స్థానం లేదు. లోకజ్ఞానాన్ని పాటించకపోవడమే మానవ సమస్యలకు మూలము. అభ్యాసముతో సంపాదించిన విద్య, అభిప్రాయాలు, తనకు తెలుసుననే భావన —సాధారణంగా అంగీకరించు దానికి వ్యతిరేకమైన దాన్ని ఒప్పుటకు సిద్ధపడదు. పైగా సమాజము, అందులో తన అంతస్తు, తనపై తనకున్న అభిప్రాయములకు హాని జరుగుతుందనే జంకు సత్యాన్ని వెనక్కి నెడతాయి.

అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. తెలిసిన విషయాన్ని గుర్తించుటకు మనకు లభ్యమయ్యే సమయము చాలా స్వల్పము. ఆ క్షణములో స్పష్టంగా చూడగలిగితే చాలు. కానీ సాధారణమైన దానితో సరిపెట్టుకోవడం మరింత సులభం. కానీ మనస్సు అక్కడే ఎంపికలో పొరపడుతుంది.

ఈ విషయాన్ని ఒక ప్రసిద్ధ కథలోని సంభాషణ ద్వారా సులభంగా గ్రహించవచ్చు. ఆర్థర్ కానన్ డోయిల్ రచించిన ఒక కథలో షెర్లాక్ హోమ్స్ తన మిత్రుడు వాట్సన్‌తో ఇలా అంటాడు: వాట్సన్, నీవు చూడలేదనుకోవద్దు. నీవు అన్నింటిని చూస్తున్నావు. కానీ చూసిన దానిని గమనించుటలో లోపం ఉంది. నీవు చూసిన దాని కంటే నేను ఎక్కువగా చూడలేను; కానీ చూసిన దానిని గమనించుటకు నన్ను నేనే క్రమశిక్షణతో అభ్యాస పరచుకున్నాను.” 

ఈ స్థితినే అన్నమాచార్యులు ఒకే వాక్యంతో చెప్పారు:మలసి యప్పటి మరతురు గాని.” అనగా — ఆ సమయానికి మనస్సు తూలి, ముందే తెలిసిన విషయాన్నే మర్చిపోతుంది.

రెండవ​ చరణం:
పుట్టినదెల్లా భోగముకొరకే
పుట్టిన భోగము పో దెపుడు
పట్టి యీమాఁటలే పలుకుదు రిందరు
మట్టులేక ఇది మరతురు గాని     ॥బయ॥
Telugu Phrase
Meaning
పుట్టినదెల్లా భోగముకొరకే

పుట్టినవన్నీ అనుభవించుటకే అనిపించును.

పుట్టిన భోగము పో దెపుడు

ఆ పుట్టిన భావములు తొలగవెపుడూ (ఒకసారి పుట్టిన భోగాసక్తి సులభంగా తొలగిపోదు.)

పట్టి యీమాఁటలే పలుకుదు రిందరు

జనులు పట్టిపట్టి ఈ మాఁటలే పెదవులతో పలుకుదురు గానీ

మట్టులేక ఇది మరతురు గాని

అంతులేని భోగములలో కూరుకుని ఇది మరతురు గాని (అంతులేని భోగప్రవాహంలో మునిగి ఈ సత్యాన్ని మర్చిపోతారు.)


సూటి భావము:
మనస్సులో  పుట్టినవన్నీ అనుభవించుటకే అనిపించును. ఒకసారి పుట్టిన భోగాసక్తి సులభంగా తొలగిపోదు. అయినప్పటికీ మాటలలో మాత్రం అందరు ఈ సూక్తులను గుర్తించి చిలక పలుకులు పలుకుతారు. కానీ వారే అనుభవాల అనంత ప్రవాహంలో మునిగి ఆ సత్యాన్ని మళ్లీ మర్చిపోతారు.

గూఢార్థవివరణము:
ఈ చరణంలో అన్నమాచార్యులు మానవ జీవనంలోని మరొక సాధారణమైన కానీ గమనించని విషయాన్ని సూచిస్తున్నారు.

అన్నమాచార్యులు “పట్టి యీమాఁటలే పలుకుదు రిందరు” అని ఎందుకన్నారో ఆలోచింతము. పట్టి అనే పదముతో ప్రజలు వినికిడితోనో, పెద్దలు చెప్పినవానిలోని సారముగానో పట్టి గుర్తుపెట్టుకొన్నదానిని సూచించారు. ప్రజలకు తెలియక కాదు. కానీ అవి బయట నుండి అరువుగా కొని తెచ్చుకున్న మాటలు. ముఖ్యంగా ఇది తనలోనించి వచ్చినది కాదు. తమకై తాము తెలిసి పలికినవి కాదు. .  అవి పైపై పూతలవలె విషయ ప్రవాహములో  కడిగివేయ బడును. తుడిచివేయ బడును. 

తుడిచివేయలేని అంతర్గత సాక్ష్యమునకు ప్రత్యక్షమే ప్రమాణము. ఈ పెట్టుడు మాటలు వేరు. బాహ్యంగా ప్రత్యక్షంగా మాయ (అనగా బయలు మొరంగగు పరమమాయ) కనబడుతుంటే వీటిలో ఇరుక్కోరు కదా! పలుకు మాటలకు చేయుటకు మధ్య వ్యత్యాసం. ఆ రెండు ఒకే త్రాటిపై నిలబెట్టము. ఆచరణలో చేయునదే వాస్తవము. మనిషి అనుభవిస్తున్న సంఘర్షణకు మూలము చిత్తశుద్ధిలేక పోవుటయే.

మట్టులేక ఇది మరతురు గాని.” కానీ జీవన ప్రవాహంలో పరిస్థితి వేరుగా ఉంటుంది. వాస్తవముగా ఒక విషయాన్ని ఎదుర్కోటున్నప్పడు 'పట్టి"న నీతులు గుర్తుకువచ్చినా ఈ "ఒకసారికి పోనిలే' అను ఉదాసీనత​, తనపై తనకే వున్న జాలి చేరి, ఈ ఒక్క అతిక్రమణతో నేను సత్యానికి హాని చేయుటలేదను సరిపుచ్చుకొను స్వభావమును తెలుపుచున్నది. అనగా — అంతులేని అనుభవాల ప్రవాహంలో మునిగి, ముందే తెలిసిన సత్యాన్ని ఆ సమయానికి మర్చిపోతారు.

మామాగ్రిట్ చిత్రంలోని ఆ వ్యక్తి మన వైపు తిరిగి ఉన్నా కళ్ళు మూసుకున్నట్లే ఇది. ఎదురుగా ఉన్న "బయలు" సత్యాన్ని చూడటం కంటే, తనకు నచ్చిన భోగ ప్రవాహంలో మునిగిపోవడమే మనిషికి "నయము" (సులభము) అనిపిస్తుంది.

మూడవ​​ చరణం:
కర్మము శ్రీవేంకటపతి కార్యము
కర్మము దేహికిఁ గాణాచి
ధర్మ మీదేవుని దాస్యం బందురు
మర్మము లోకులు మరతురు గాని              ॥బయ॥
Telugu Phrase
Meaning
కర్మము శ్రీవేంకటపతి కార్యము
ఈ సృష్టిలో జరుగుతున్న కర్మలన్నీ శ్రీవేంకటపతి నిర్వహణలోనున్న కార్యములే
కర్మము దేహికిఁ గాణాచి
సహజమైన కర్మము దేహికిఁ చిరకాలవాసస్థానము
ధర్మ మీదేవుని దాస్యం బందురు
ధర్మము (సత్యము) పాటించుటయే ఈ దేవునికి దాస్యమని చెబుతారు.
మర్మము లోకులు మరతురు గాని
ఈ మర్మము లోకులు మరతురు గాని
సూటి భావము:
ఈ సృష్టిలో జరుగుతున్న కర్మలన్నీ శ్రీవేంకటపతి నిర్వహణలోనున్న కార్యములే. సహజమైన కర్మము దేహికిఁ చిరకాలవాసస్థానము. ధర్మము (సత్యము) పాటించుటయే ఈ దేవునికి దాస్యమని చెబుతారు. ఈ మర్మము లోకులు మరతురు గాని.

గూఢార్థవివరణము:
ఈ చరణంలో అన్నమాచార్యులు కర్మము, ధర్మము, మరియు స్వేచ్ఛల మధ్య గల ఒక బలమైన సంబంధాన్ని సూచిస్తున్నారు. సమస్త కార్యములు సందేహము లేకుండా దైవ నిర్వహణలోనే జరుగుతున్నవి.

ఈ కార్యప్రవాహాన్ని మనిషి పూర్తిగా నియంత్రించలేడు. జననం, మరణం, కాలగతి, అనేక పరిణామాలు మన చేతిలో లేవు. అయితే మనిషి ఈ కార్యప్రవాహాన్ని నియంత్రించలేకపోయినా,  తాను ఎలా వర్తించాలి అనేది మాత్రం అతని చేతిలో ఉంది. సమాజపు ఒత్తిళ్ళకు, శరీరాభిలాషలకు, మరియు సంకల్పములకు, వ్యక్తిగత ప్రణాళికలకు అతీతంగా కార్య నిర్వాహణ. అదే సహజమైన కర్మ. ​ అదే ప్రసిద్ధమైన భగవద్గీత శ్లోకము "కర్మణ్యేవాధికారస్తే..."భావము

ఈ విషయాన్నే కవి “కర్మము దేహికిఁ గాణాచి (సహజమైన కర్మము దేహికిఁ చిరకాలవాసస్థానము)” అనే మాటతో సూచిస్తారు. కవి కాణాచి అని ఒక మౌనమైన ఎరను ముందుంచుతున్నారు. దేహమును కర్మను వేరు చేయలేము. కానీ మనము దేహమును కర్మను విడివిడిగా చూచెదము.కావున దేహములో జనియించిన వ్యక్తిత్వం, ఆశలు, ఫలములు నిరంతరం కొనసాగాలని ఆశిస్తాము. ఈ రకముగా చూస్తే నడమంత్రపు సిరి లాంటి వ్యక్తిత్వం, ఆశలు, ఫలములు (మన ఇప్పటి స్పృహలోని విషయములు) మన మనోఫలకములో వున్నంత కాలము మనము సహజమైన కర్మమునకు దూరంగా వున్నట్లే.

ఇంకా ఒక ఆసక్తికరమైన విరుద్ధత ఇక్కడ కనిపిస్తుంది. మాటలలో మాత్రం జనులు “ధర్మము మీదేవుని దాస్యం” అని చెప్పడానికి వెనుకాడరు. సత్యాన్ని పాటించుటే దేవునికి సేవ అని వారు అంగీకరిస్తారు. కానీ ఆచరణలో అదే విషయమును నిలబెట్టట లేకపోతారు. ఇదే కారణంగా అన్నమాచార్యులు చివరికి ఒక చిన్న కానీ కఠినమైన వాక్యంతో ముగిస్తారు —

మర్మము లోకులు మరతురు గాని.” అనగా —సత్యం తెలిసి కూడా ఆచరణలో దానిని నిలబెట్టలేకపోవడం మానవుని సహజ స్థితిగా మారిపోతుంది. ఈ చరణం ద్వారా కవి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు: కర్మల ప్రవాహం దైవాధీనమే కావచ్చు; కానీ ఆ కర్మల మధ్య మనిషి ఎలా నిలబడతాడు అనేది మాత్రం అతని జాగ్రత్తపై ఆధారపడుతుంది. అదే ధర్మం. అదే ఈ కీర్తన యొక్క మర్మం.

X-X-The END-X-X

No comments:

Post a Comment

T-310 బయలు మొరంగగు పరమమాయ ఇది

  తాళ్లపాక అన్నమాచార్యులు 310 బయలు మొరంగగు పరమమాయ ఇది For English version press here ఉపోద్ఘాతము అన్నమాచార్యుల అధ్యాత్మ సంకీర్తనలలో “ బయలు ...