Saturday 16 July 2022

T-132 శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో

 అన్నమాచార్యులు

132 శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో 

చిక్కుముళ్ళ జీవితం

 Those interested in English Version may press this 

ఉపోద్ఘాతము:  ఈ సాటిలేని మేటి కీర్తనలో అన్నమాచార్యుడు మానవుని ఆంతరంగిక ప్రతిఘటనే అతడు పడుతున్న కష్టాలకు మూలకారణమని పేర్కొన్నాడు. చిన్నదైననూ కానీ చాలా సంక్లిష్టమైన ఈ కవితలో, అన్ని పంక్తులను మెరుగుపెట్టి నునుపుగా చేసేశారు. వాటి అర్థాన్ని పట్టుటకు వీలుచిక్కక అనేక అవస్థలు పడతాము. తీర్మానించిన తాత్పర్యము సరిపోతుందా లేదా అనే సంద్గిద్ధములోనే  ఉండిపోతాము. 

అన్నమాచార్యులు అత్యంత భక్తిశ్రద్ధలను కలిగినప్పటికీ, వారి రచనలను సాంప్రదాయిక కోణంలో చూడరాదు. జాగ్రత్తగా పరిశీలించితే, వారు సాధారణంగా ఆమోదించబడే సరళ పదాల పరదాల వెనుక విప్లవాత్మక భావనలను కప్పి వుంచారు అని తెలియును. ఈ కీర్తన అత్యున్నత కళాత్మతకు గీటురాయి. ఆయన కళ దైవ​ ప్రశంసల వైభవంలోనో, మెచ్చుకోలులోనో, మాటల్లోనో లేదు. వారి కూర్పు  ఆయా పదముల ఏర్పాటు ద్వారా, ఆ వర్ణనల ద్వారా కలిసి ఉంచబడని భావాలకు దారితీయడంలోనే కనిపిస్తుంది.  

భాషా పరిమితులను మరియు సూదంటు రాయిలా ఆకర్షించు భావాల సంకెళ్ళను విప్పదీసుకొని విహరించడానికి ఆయన రచనలు ఆహ్వానిస్తాయి. ప్రతి కీర్తనలోనూ ఆయన దేవుళ్ళ పేర్లను ఉచ్చరించినప్పటికీ, ప్రాపంచిక వ్యవహారాలు, వస్తుమయ జగత్తు, భావనలు మరియు దృక్పథాల పరిగణనలకు అతీతమైనదానిని సామాన్య పదములలో వ్యక్తపరిచారు.  అన్నమాచార్యులు గొప్ప సత్యాన్వేషి. మన నిశ్చల ప్రపంచం నుండి మరొకదానికి (పరమునకు) ప్రయాణము భావనాత్మకమైనది కాదని, వాస్తవమైనదని ఆయన ఎల్లప్పుడూ నొక్కి వక్కాణించారు. మానవుడు భౌతిక చింతనను మాత్రమే విస్తరిస్తూపోతుంటే ఆ ప్రయాణము సాధ్యం కాదని ఈ కవిత యొక్క అంతిమ సారాంశం. 

 

కీర్తన:

రాగిరేకు:  326-6  సంపుటము: 4-153

శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో
పూఁపల మాయలఁ బొరలఁగనేలా॥పల్లవి॥ 

కాయము సుఖదుఃఖములకు మూలము
పాయము యింద్రియపరవశము
ఆయము రెంటికి నన్నపానములు
మోయని మోఁపిది ములుగఁగనేలా॥శ్రీప॥ 

తలఁపు పుణ్యపాతకముల మూలము
కలిగిన పుట్టువు కర్మగతి
ఫల మిది రెంటికి బలుసంసారము
కలిగిన వెట్టికి కాదననేలా॥శ్రీప॥ 

జీవుఁ డింతటా సృష్టికి మూలము
భావము బ్రకృతికిఁ బ్రపంచము
చేవగ రెంటికి శ్రీవేంకటేశ్వర
నీ వంతరాత్మవు నెమకఁగనేలా॥శ్రీప॥

 

Details and Explanations: 

శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో
పూఁపల మాయలఁ బొరలఁగనేలా ॥పల్లవి॥ 

ముఖ్య పదాలకు అర్ధాలు: పూఁపల = అరిసె, అప్పము వంటి తీపి పిండివంట; బొరలఁగనేలా = పడి దొర్లటమెందుకు,  జంతువుల్లా (సం)భోగించటమెందుకు అను అర్ధములో ఉపయోగించారు. 

భావము: మానవుడా! తీయని ఇచ్చరేపు మాయలలో పడి దొర్లటమెందుకు?  శ్రీపతి! ఆజ్ఞను సేయుము ఇప్పుడే.

వివరణము: దైవము నిర్లిప్తుడు. ఆజ్ఞలు ఇవ్వడు. పల్లవి అర్థం ఏమిటి? భ్రాంతిని ఆహ్వానించడంలో మూర్ఖత్వాన్ని గుర్తించడం మాత్రమే మనిషి చేయగలిగే ఏకైక పని అని ఇది సూచిస్తుంది.

అన్వయార్ధము: దైవాజ్ఞలకై ఎదురుచూచు అవివేకమును వదలుము.

అదనపు వివరణము: అన్నమాచార్యులు సమర్ధవంతంగా శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో  అని చొప్పించి దేవుని ఆశీర్వాదం కోరుతున్నట్లు అనిపింప చేసారు. వాస్తవానికి, మనిషి తన సొంత కాళ్లపై నిలబడకపోతే అంటే స్వతంత్రుడు కాని యెడల​, దైవికమైన ఆజ్ఞలను గ్రహించు అవకాశం లేదు. అందువలన, మనలాంటి వ్యక్తులకు భ్రమను నివారించటమొక్కటే మిగిలింది.


అ౦తేకాకు౦డా, మునుపటి వివరణలలో తెలిపినట్లుగా, ఈ భ్రమలను తప్పి౦చుకోవడ౦ ఒకేదఫాలో ఉ౦డాలి తప్ప ఇది దశలవారీ రేఖీయ ప్రక్రియ కాదు. మీరు దేనినైనా మరచిపోయినప్పుడు, గుర్తు చేసుకునే ప్రక్రియ కూడా రేఖీయంగా ఉండదని గమనించి ఉంటారు. రెండు స్థితులు మాత్రమే. గుర్తు ఉన్న స్థితి. లేని స్థితి. అంతే. 

అన్నమాచార్యులు జీవితం ఒక మిధ్య అని చెప్పినప్పుడు, అది ఊహాత్మకముకాదు. వాస్తవమైనది. మన ప్రస్తుత స్థితి నుండి చైతన్య వంతమగు స్థితికి ఎలా వెళ్ళాలి? మన ఇప్పటి మానసిక స్థితి క్రింద జతపరచిన​ ఎమ్ సి యెశ్చరు గారు  వేసిన "మరొక ప్రపంచం (Another World)" అనే చిత్రాన్ని పోలి ఉంటుంది.

 


దీనిలో ఐదు వైపులా ఇటుకతో నిండిన ఓపెన్ ఆర్చిలు ఉన్నాయి. అట్టడుగు ఆర్చి భూమి నుంచి పైకి చూస్తున్నట్లుంటుంది.  అడుగు ప్రాంతం దాదాపు 3D (త్రిమితీయ) వీక్షణంగా  కనిపిస్తుంది. 

ప్రతి దృక్కోణంలో మనం మానవ ముఖం కలిగిన పక్షి వంటి జీవిని  లేదా గొలుసుల నుండి వేలాడుతున్న కొమ్ములను చూస్తాము. చిత్రము చూపరులను శ్లేషలోను నిశ్చలములేని ఆలోచనలలోనూ పడవేయును. క్రిందనుండి పైకి చూస్తున్నామా? పైనుండి క్రిందకా?  ఇంద్రియాల యొక్క అస్థిరత్వాన్ని ఎత్తి చూపుతుంది. అందువలన, పేర్కొన్న అన్వయ భావము పల్లవి అంతరార్ధానికి దగ్గరగా ఉందనుకోవచ్చు. 

కాయము సుఖదుఃఖములకు మూలము
పాయము యింద్రియపరవశము
ఆయము రెంటికి నన్నపానములు
మోయని మోఁపిది ములుగఁగనేలా
॥శ్రీప॥ 

ముఖ్య పదాలకు అర్ధాలు: కాయము = శరీరము; పాయము = వయసు, ప్రాయము; ఆయము = ఆయువుపట్టు, మర్మస్థానము, రహస్యము: 

భావము: శరీరము సుఖదుఃఖములకు మూలము.  ప్రాయము యింద్రియపరవశమై తెలియనీకున్నది. అన్నపానములు రెంటికి (శరీరము, ప్రాయములకు) ఆయువుపట్టు లేదా మర్మస్థానము.  మోయరాని మోఁపు ఇది. చేయరానివి చేస్తూ ములుగఁగనేలా?

వివరణము: శరీరము మరియు మనస్సు ఆహారం ద్వారా పోషించబడినప్పటికీ, అవి కూడా దాని వాసనలకు, రుచికి బానిసలైపోతాయి. అందువలన, మనిషి జీవించడానికి ఆహారంపై ఆధారపడాలి, కానీ దానిని పట్టుకొని ఉండరాదు.  ఆహారం మరియు శరీర అవసరాల మధ్య సున్నితమైన సమతుల్యతను సాధించే పని అన్నమాచార్యులు ప్రవేశపెట్టిన మొదటి చిక్కుముడి (పారడాక్స్). 

ఇప్పుడు జలాలుద్దీన్ రూమీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాం: కలిగి ఉండడము, వదలివేయడముల మధ్య సమతుల్యత సాధించడమే జీవితం. ఆహార నిరాకరణ శరీరము నుండి తీవ్రమైన ప్రతిఘటనకు లోనౌను. దీనిని వివరణల ద్వారా మైమరపించలేము. మానవుడు యీ సంక్లిష్టమైన సమత్వమును సాధించాలి. మోయని మోఁపిది అని చెప్పి అన్నమాచార్యులు ఈ తుల్యము సాధించుటకు సహించవలసిన పాట్లను తెలిపిరి. ఏదేమైనా, తత్వవేత్తలు మనిషి అనవసరంగా భారీ భారాన్ని మోస్తున్నాడని వర్ణిస్తూనే ఉన్నారు.

అన్వయార్ధము: ఓ దేహి! సణుగ కుండా ములగ  కుండా  శరీరానికి, ఆహారానికి మధ్య సమతుల్యతను సాధించే అసాధ్యమైన పనికి మీరు సిద్ధంగా ఉన్నారా? 

తలఁపు పుణ్యపాతకముల మూలము
కలిగిన పుట్టువు కర్మగతి
ఫల మిది రెంటికి బలుసంసారము
కలిగిన వెట్టికి కాదననేలా
॥శ్రీప॥ 

ముఖ్య పదాలకు అర్ధాలు: బలుసంసారము = బలముగా ఆకర్షించు సంసారము,

భావము: చిన్నవాడా! పాపపుణ్యములలో నీ ఆలోచనలు చిక్కుకున్నాయే. పుట్టిన తరువాత  కర్మగతి  తప్పుతుందా! బలముగా ఆకర్షించు ఈ సంసారమే కదా పై రెంటికి మూలము. కలిగిన వెట్టిని చిరునవ్వుతో సహించు.  కాదన్నా పోతుందా?

వివరణము: చరణంలో, అన్నమాచార్యులు పల్లవి యొక్క ఆనుబంధముగా రెండవ చిక్కుముడి (పారడాక్స్) రూపంలో విశదీకరిస్తున్నాడు: మనిషికి పుట్టుకతోనే ఉన్న స్వభావ సిద్ధముగా ద్వారా, అతను కార్యకలాపాలను చేయకుండా క్షణమైనా ఉండలేడు. (గాలిపీల్చుటయు కర్మయే, తినుట కర్మయే, నడచుట కర్మయే, మాట్లాడుట కర్మయే.) ప్రతి చర్యా నిర్దిష్ట ఫలితాన్ని ఇస్తుంది. ఇది అతను మోస్తున్న సంచీని బరువెక్కిస్తుంది.  ప్రపంచంలో భాగమైనంత కాలం, ఇది కాదనలేని వాస్తవం. సంచీ బరువెక్కరాదంటే అతను ప్రపంచానికి చెందకూడదు. ఉపకరణాలను వదలివేయడం ప్రాపంచిక చర్యలో భాగం.  అందువల్ల, ఇతర / మరో ప్రపంచానికి ప్రయాణము అసాధ్యం.

కలిగిన వెట్టికి కాదననేలా? ఇతర ప్రపంచాన్ని విధంగానూ చేరుకోలేము అన్నది పైన తెలుసుకున్నాము. అది దైవానుగ్రహమున కానీ పొందలేము. తెలియవలసినది దైవానుగ్రహము లేక మనుగడ లేదు.  అందువలన ఎటువంటి   హామీ లేకు౦డానే మొదటగా మనుష్యుడు విమోచనకు ఉపక్రమించవలసి ఉండును. పైని యెశ్చర్ గారి చిత్రములో మాదిరి మనుష్యుడు ఎటుపోవుటయో నిర్ణయించలేడు. దారిని నిశ్చయించలేని తన అసమర్ధతను తనకు తానుగా మానవుడు కనుగొన్న క్షణమున ఏమీ చేయని పరిస్థితికి చేరుతాడు.  అంతవరకు ఎవ్వరినీ నిందించక జీవితమను వెట్టిచాకిరిని సహి౦చాల్సి ఉ౦టు౦ది.

జీవిత పోరాటం డబ్బు గురించి కాదు. ప్రేమ గురించి కాదు. అందం మీద గానీ, భగవంతుడి మీద గానీ కాదు. మనిషి కష్టపడి పనిచేయడానికి వెనుకాడాడు, లేదా నరకం లాంటి మానసిక శిక్షలకు భయపడడు.   మనకు మనపై కొన్ని అంచనాలు, కొన్ని ఊహలు ఉంటాయి.  అంచనాలు తారుమారై నప్పుడు, అంతర్గత ప్రతిఘటన ఆచరణలోకి వస్తుంది. ప్రతిఘటన ఒక సంఘర్షణ. మనలోనే మనకున్న పోరాటము. అంచనాలకు, ఆకాంక్షలకు కారణమయ్యే మానసిక సౌధము ఒక కృత్రిమ నిర్మాణము, ఒక ప్రాథమిక సమస్య.

అన్వయార్ధము: ఓ వెట్టిపని వాడా! పాపపుణ్యములలో ఇరుక్కోమని నిన్నెవరు బలవంతం చేశారు?

జీవుఁ డింతటా సృష్టికి మూలము
భావము బ్రకృతికిఁ బ్రపంచము
చేవగ రెంటికి శ్రీవేంకటేశ్వర
నీ వంతరాత్మవు నెమకఁగనేలా
॥శ్రీప॥ 

ముఖ్య పదాలకు అర్ధాలు: మూలము = మొదలు, ప్రధానమైన; చేవగ = సారము, ధైర్యము, సత్తువ; నెమకఁగనేలా= వెదకగనేలా. 

భావము: జీవుడు సృష్టికి మూలము. భావములే అతని  ప్రకృతికిఁ బ్రపంచము. శ్రీవేంకటేశ్వరుడే రెంటికి సారము, ధైర్యము మరియు సత్తువ. సాక్షాత్తూ  శ్రీవేంకటేశ్వరుడే అంతరాత్ముడై వుండాగా ఎక్కడో వెదకగనేలా?

వివరణము: మానవుని అంతరంగం భావాలు, స్వభావాలు, ఉద్దేశాలు మరియు కోరికలను పదార్ధములతో నిర్మితమై ఉంటుంది. అధిక శాతమవి స్వంత సృజనలె. 

మనం ప్రపంచం నుండి వేరుగా ఉన్నామనే భావన మూడవ చిక్కు ప్రశ్న (పారడాక్స్​). ప్రతి వ్యక్తికి తాను కాక ప్రపంచం ఉందనుకోండి. దాని నుండి, ఎంత మంది వ్యక్తులుంటే అన్ని ప్రపంచాలున్నట్లు. దీన్నిబట్టి, గణితపరంగా మనం వ్యక్తుల కంటే రెండు రెట్లు ప్రపంచాలున్నట్లు తెలుస్తుంది, ఇది అసంబద్ధం. కాబట్టి, అసాధ్యమైనప్పటికీ, ప్రతి మనిషి ఈ ప్రపంచంలోని భాగమే కావాలి, బాహ్యుడు కాదు.  అందువల్ల మనం ప్రపంచం నుండి వేరుగా ఉన్నామనే భావన ఒక భ్రమ. 

ఈ కనబడుతున్న ప్రపంచం నిజంగా ఉందా? లేక ఇది స్వంత భావనలను మానవుడు ఊహించి, పొడిగించి చూచుచున్నదా? లోకానికి, వ్యక్తికి కూడా వేంకటేశ్వరుని నుంచే సారము, ధైర్యము, బలము లభిస్తుందని అన్నమాచార్యులు ఇక్కడ ఉద్ఘాటించటము గమనార్హము. 

శ్రీవేంకటేశ్వర నీ వంతరాత్మవు నెమకఁగనేలా మానవుడు వాస్తవానికి తనకీ, లోకానికీ మధ్య భేదాన్ని గమనించి కూడా అది యేమి? నేనేమి? అను మీమాంసను వదలి - తాను చర్య తీసుకోగలిగినదేదీ లేదని అర్థం చేసుకున్నప్పుడు - నిశ్చలము, ప్రశాంతము, అలలు లేని మనస్సుకు దారినిస్తుంది. అటనుండి ముక్తికి అవకాశం ఉందని సూచిస్తుంది.

ఇప్పుడు దిగువ చిత్రాలను పరీక్షగా చూడండి. పక్షి 'పొట్టూ'ను పరిసరాల్లో కలసిపోయి ఎదుటే ఉన్నా దాక్కున్నట్లే. ఇది పరిసరాల్లో యిమిడిపోవుటలో (Master of camouflage) అత్యంత ప్రావీణ్యము కలదని ప్రతీతి 

ఒక సాధారణ పక్షి యొక్క సామర్థ్యమే ఇలా వుంటే

వాటిని సృజించినవాని మాటేమిటి?

మనలోనే దాగివున్న భగవంతుని గుర్తించుటకెంత ఏకాగ్రత కావాలో?

అన్వయార్ధము: 'నేను'గా అనుభూతిని కలిగించే కేంద్రాన్ని కనుగొనడమే జీవితపు గమ్యము. అది కనుగొనబడినప్పుడు, ఏ ప్రశ్న కూడా ఉదయించదు. 

References and Recommendations for further reading:

#1 66. ఊరకే వెదకనేల వున్నవి చదువనేల (UrakE vedakanEla vunnavi chaduvanEla)

 

#2 Jiddu Krishnamurti Often said, these things are work of nature. They better be endured rather than avoided.

#3 69. తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము (timmireDDi mAkunichche dishTamainapolamu)

 

 

కీర్తన సంగ్రహ సారం:

పల్లవి: మానవుడా! తీయని ఇచ్చరేపు మాయలలో పడి దొర్లటమెందుకు?  శ్రీపతి! ఆజ్ఞను సేయుము ఇప్పుడే. అన్వయార్ధము: దైవాజ్ఞలకై ఎదురుచూచు అవివేకమును వదలుము.

 

చరణం 1: శరీరము సుఖదుఃఖములకు మూలము.  ప్రాయము యింద్రియపరవశమై తెలియనీకున్నది. అన్నపానములు రెంటికి (శరీరము, ప్రాయములకు) ఆయువుపట్టు లేదా మర్మస్థానము.  మోయరాని మోఁపు ఇది. చేయరానివి చేస్తూ ములుగఁగనేలా? అన్వయార్ధము: ఓ దేహి! సణుగ కుండా ములగ  కుండా  శరీరానికి, ఆహారానికి మధ్య సమతుల్యతను సాధించే అసాధ్యమైన పనికి మీరు సిద్ధంగా ఉన్నారా?

 

చరణం 2: చిన్నవాడా! పాపపుణ్యములలో నీ ఆలోచనలు చిక్కుకున్నాయే. పుట్టిన తరువాత  కర్మగతి  తప్పుతుందా! బలముగా ఆకర్షించు ఈ సంసారమే కదా పై రెంటికి మూలము. కలిగిన వెట్టిని చిరునవ్వుతో సహించు.  కాదన్నా పోతుందా? అన్వయార్ధము: ఓ వెట్టిపని వాడా! పాపపుణ్యములలో ఇరుక్కోమని నిన్నెవరు బలవంతం చేశారు?

 

చరణం 3: జీవుడు సృష్టికి మూలము. భావములే అతని  ప్రకృతికిఁ బ్రపంచము. శ్రీవేంకటేశ్వరుడే రెంటికి సారము, ధైర్యము మరియు సత్తువ. సాక్షాత్తూ  శ్రీవేంకటేశ్వరుడే అంతరాత్ముడై వుండాగా ఎక్కడో వెదకగనేలా? అన్వయార్ధము: 'నేను'గా అనుభూతిని కలిగించే కేంద్రాన్ని కనుగొనడమే జీవితపు గమ్యము. అది కనుగొనబడినప్పుడు, ఏ ప్రశ్న కూడా ఉదయించదు.

3 comments:

  1. Excellent!
    Explained in simple words!!
    Very soothing to the mind!!

    ReplyDelete
  2. జగత్తు యొక్క మాయలోపడి కోరికలకు, ఇంద్రియభోగములకు వశమై తిరుగాడే మనిషిని యీ కీర్తన ద్వారా అన్నమయ్య సున్నితంగా హెచ్చరిస్తున్నాడు.
    పాపపుణ్య కార్యములలో చిక్కుకున్న మనిషి ఆలోచనా పరంపరలు వానిని సుఖదుఃఖములకు లోను చేస్తున్నాయి.కర్మబంధనమునకు హేతువులు చేస్తున్నాయి.
    అడుసు తొక్కనేల? కాలు కడుగనేల? సంసారపంకిలము నుంచి విముక్తి పొందుటకు దేవుని ఆజ్ఞకై యెదురుచూచుట మూర్ఖత్వమే అవుతుంది.అది అజ్ఞానము, భ్రమయే కాని వివేకము కాదు.

    ఒక్కసారి అంతర్ముఖుడవై అంతరాత్మయై వెలసిన పరమాత్మను దర్శించుటకై ప్రయత్నశీలుడవై, జీవితగమ్యము, పరమానందకారకము అయిన ఈశ్వర సాక్షాత్కారము నొందుమని అన్నమయ్య ఉపదేశిస్తున్నాడు. పరమేశ్వరానుభూతిని అనుభవించిన వానికి యెటువంటి సంశయములు,కోరికలు ఉండవు.నేను అనే భావన నశిస్తుంది. *అహం బ్రహ్మాస్మి* యనే భావనయే మిగులుతుంది.
    *బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి*
    బ్రహ్మను తెలిసికొన్నవాడు బ్రహ్మయే అవుతాడు.

    ఓం తత్ సత్
    కృష్ణ మోహన్

    ReplyDelete
  3. కీర్తన భావాన్ని, అన్నమయ్య ఆంతర్యాన్ని సులభశైలిలో చక్కటి
    వివరణతో విపులీకరించిన శ్రీనివాస్ గారికి నతులు.
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...