Monday, 9 January 2023

T-156 హరిహరియని వెరగందుటఁ గాక

 అన్నమాచార్యులు

156 హరిహరియని వెరగందుటఁ గాక

 

for English Version press here

 

సారాంశం: దైవభీతితో దైవకార్యములు నెఱవేఱవు. మానవుడు తన బుద్ధిమాలిన తనమును సరిదిద్దుకో వలె  - అన్నమాచార్యులు.

Summary of this Poem:

పల్లవి: లక్ష్మీ వల్లభా! వేంకటేశా! భయపడటము తప్పించి మాకు జీవితమేమిటో తెలియదు. స్వామి మాకు బుద్ధి చెప్పు! అన్వయార్ధము:  మాకు జీవితమను బుద్ధినివ్వవయ్యా వేంకటేశా!

చరణం 1: శబ్ద స్పర్శ రస రూప గంధములను ఐదుగురు మహా పాపాత్ములు దశేంద్రియాలు అనే కర్తలను కావలివారుగా నియమించి నా శరీరము అను రాజ్యము యేలుచున్నారు. నా హృదయమను న్యాయపీఠముపై కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు  అజమాయిషీ చేయుచుండగా వేంకటేశ్వరా ఇక నీ కార్యములు (ధర్మములు) నేను ఎట్లు నిర్వర్తించుదునయ్యా? 

చరణం 2:  అనేక గుంతలతో ఎగుడుదిగుడుగా వున్న ఈ క్షేత్రమును (శరీరమును) దున్నుటకు సహకరించే ఎద్దు (మనస్సు) కుంటిది. వంకరటింకరగా నడుస్తుంటుంది. ఇట్టి నా కృషి బండ వ్యవసాయం (కష్టంతో కూడుకున్న వ్యవహారము) కాదా?  ఇక సత్వ రజస్తమోగుణాలను తలారులు (భావనలతో సంబంధము లేకుండా నిర్వికారముగా ఆయా గుణముల జాడను యథావిధిగా అనుసరించు వారు) ఈ శరీరంలో ఉన్నారు. వాళ్లతో తగువులాడే 56 తత్వాలు (1. ప్రకృతి, 2. పురుషుడు మొదలయినవి) ఉన్నాయి. వీటన్నింటి బాధతో అలిసిపోయి ఉన్న నాకు వీటిని నియంత్రించటానికి అవకాశమేదయ్యా! (నావల్ల కాదు వేంకటేశ్వరా! నువ్వే రక్షించాలని భావం)

చరణం 3:  గ్రామదేవతల దగ్గఱ పొంగళ్లు పెట్టుటకు వాడు చిన్న మట్టిపాత్రలాంటి స్వల్ప విలువగల శరీరములో కలుగు సుఖాల కష్టాల పంటలను చూసుకొని మురిసిపోతుంటాను.  అన్నీ తెలిసిన శ్రీ వేంకటేశా! యిన్నియు విచారించి, నా కున్నదంతా నీ చేతులలో నిలిపితిని. ఇక నేను చెప్పగలిగిన దేముంది?

Detailed Presentation

 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు అనేక తత్వాలు వ్రాసితిరన్నది మనకు ఎఱుకే. ఐతే ప్రతీ తత్వము యింత లోతుగాను, మానవుని శోధించు మూలద్రవ్యములను ఎత్తి చూపుతూ మధురమైన కవిత్వము వ్రాయుట ఇంకొక ఎత్తు.

దైవభీతితో దైవకార్యములు నెఱవేఱవు. మానవుడు తన బుద్ధిమాలినతనమును సరిదిద్దుకో వలసినదని సెలవిచ్చిరి.  ఏ ఆధునిక మనస్తత్వశాస్త్రవేత్త కూడా అన్నమాచార్యులకు సరిపోలరు.

 

కీర్తన:

రాగిరేకు:  280-6  సంపుటము: 3-464

హరిహరియని వెరగందుటఁ గాక
సిరివర మాకు బుద్ధి చెప్పఁగదవయ్యా ॥పల్లవి॥
 
పాపపుకొంపలో వారు పంచమహాపాతకులు
కాపులకు పదుగురు కర్త లందుకు
తాపి కాండ్లారుగురు ధర్మాసనమువారు
చాపలమే పనులెట్టు జరగీనయ్యా ॥హరి॥
 
పలుకంతల చేను బండ వెవసాయము
బలిమిఁ దొక్కీఁ గుంటిపసురము
తలవరులు ముగురు తగువాదు లేఁబైయారు
సొలసి ఆనాజ్ఞ కిదుఁ జోటేదయ్యా ॥హరి॥
 
బూతాల పొంగటికే పొడమిన పంటలెల్లా
కోఁతవేఁత చూచుకొని కోరు కొటారు
యీతల శ్రీవేంకటేశ యిన్ని విచారించి నీ-
చేఁతే నిలిపితి విఁకఁ జెప్పేదేఁటిదయ్యా ॥హరి॥

 

Details and Explanations: 

హరిహరియని వెరగందుటఁ గాక
సిరివర మాకు బుద్ధి చెప్పఁగదవయ్యా ॥పల్లవి॥ 

భావము: లక్ష్మీ వల్లభా! వేంకటేశా! భయపడటము తప్పించి మాకు జీవితమేమిటో తెలియదు. స్వామి మాకు బుద్ధి చెప్పు!

వివరణము:  "చీకటికి భయపడే పిల్లవాడిని మనం సులభంగా క్షమించవచ్చు; మనుష్యులు వెలుగుకు భయపడినప్పుడే జీవితంలో నిజమైన విషాదం." అని ప్లేటో చేసిన ప్రసిద్ధ ప్రకటన మీకు విదితమే.  దురదృష్టవశాత్తు మానవుని చాలా చర్యలకు భయమే  కీలకం.  రెనే మాగ్రిట్ యొక్క 'లా కార్టే బ్లాంచె' (= ది వైట్ పేపర్ = తెల్లకాగితము మీద వ్రాసినంత సులభముగా హృదయములో నాటుకుపోవును అన్న అర్ధములో ) పేరిట ప్రపంచ ఖ్యాతినొందిన ఈ చిత్రము సహాయముతో మీకు విశద  పరచడానికి ప్రయత్నింతును.

 


చిత్రంలో మీరు అడవిలో గుర్రంపై సవారి చేస్తున్న ఒక మహిళను చూస్తారు. గుర్రపు రౌతు కొన్ని భాగాలు చెట్లను అడ్డంగా కత్తిరించు కుంటూ పోతూ వున్నందున చిత్రం సాధ్యం కాదని మీరు పరీక్షలో కనుగొంటారు. అయితే, అటువంటి ప్రతిపాదన అసాధ్యమని తార్కికంగా నమ్మినప్పటికీ, అక్కడ గుర్రం ఉందనే అభిప్రాయాన్ని మనసులోంచి తీసివేయుట దాదాపు అసాధ్యము. 

క్రింద ఇచ్చిన బొమ్మలో అక్కడ గుఱ్ఱము వున్నదని నమ్ముటకు ప్రేరిత అనుసంధానము అనునది ముఖ్యపాత్ర వహించుచున్నట్లు గ్రహించవచ్చు. అనగా ప్రేరిత అనుసంధానము చిన్న చిన్న ఆధారములను కూర్చి లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేయును. 



పిల్లలు తలిదండ్రులు కాసులకోసము కష్టపడుతుండడము గమనిస్తారు. టీవీలో చూపు హింస​, క్రౌర్యము, వార్తాపత్రికలలో చూపు దౌర్జన్యములను, స్కూళ్ళలోను, ఇండ్లలోనూ. కార్యాలయములలోనూ, బజార్లలోనూ, శాసన సభలలోనూ ఒకరిపై ఒకరు ఆధిపత్యము సాధించుటకు చేయు ప్రయత్నములు వారి హృదయములో చెరగని ముద్రను వేస్తాయని మీకు తెలియును.  

పిల్లల మనస్సులలో ఇది తీవ్ర పరిణామములు చూపి, వారిలో భయభ్రాంతులను రేపును. మొండివారిగానూ, రక్షణ కొరకు వెతుకువారిగానూ మార్చును. ఇది చిన్నతనములో తలిదండ్రులను, కొంతకాలము తరువాత స్కూలును, ఉపాధ్యాయులను, పిదప జీవితపు సహచరులను, చివరిలో దైవమును రక్షణ కవచముగా భావింపజేయును. 

పైన పేర్కొన్న విడి విడి సంఘటనలు మనస్సులో గాలిలో చిన్న చిన్న ధూళికణములు తేలియాడునట్లు నిలుచును. సాయంకాలము పూట సూర్యకిరణములను మాలిన్యములు చెదరఁగొట్టి ఎరుపు రంగును భావింప చేసినట్లు, రక్షణ కవచము కొరకు ఉసికొల్పునవి జీవితములోని చిన్న చిన్న సంఘటనలే. అవి పైన బొమ్మలోచూపిన విధముగా ప్రేరిత అనుసంధానము కలిగించి అనేక సంబంధములేని విషయములను కలుపుతూ లేని భయమును రేకేక్తించును. 

ఈ రకంగా ఏర్పడిన భయము సత్యము కాకపోయిననూ, ఎంత సైద్ధాంతికంగా తెలుసుకొన్ననూ మనిషిని ఉసిగొల్పి భద్రత వైపు అడుగులు వేయించును. వీటి మాదిరిగనే సుఖము అనునది ప్రతివారూ తమకు తాము నిర్మించుకున్న ఊహలతో ఏర్పాటు చేసుకున్నదే. 

అనగా అన్నమాచార్యులు దైవమును రక్షణ కవచముగా భావించుట, దైవభీతిని కలిగియుండుట​ బుద్ధి గల పనికాదన్నారని తెలియుచున్నది. 

అన్వయార్ధము:  మాకు జీవితమను బుద్ధినివ్వవయ్యా వేంకటేశా!

పాపపుకొంపలో వారు పంచమహాపాతకులు
కాపులకు పదుగురు కర్త లందుకు
తాపి కాండ్లారుగురు ధర్మాసనమువారు
చాపలమే పనులెట్టు జరగీనయ్యా ॥హరి॥

ముఖ్య పదములకు అర్ధములు:

పాపపుకొంప  = శరీరము

పంచమహాపాతకులు=శబ్ద స్పర్శ రస రూప గంధము లను ఐదుగురు మహా పాపాత్ములు;

కాపులకు = కావలివారు;

పదుగురు కర్తలు = దశేంద్రియాలు అనే కర్తలు ఉన్నారు. (05 జ్ఞానేంద్రియములు 1. శ్రోత్రము, 2. చర్మము, 3. చక్షుస్సు, 4. జిహ్వ, 5. నాసిక. 05 కర్మేంద్రియములు 1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ.)

తాపి కాండ్లారుగురు = ఆరుగురు తాపి కాండ్లు = అనుసంధానము చేయువారు = కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు.

ధర్మాసనము వారు= న్యాయపీఠముపై వారు;

చాపలమే = చాపల్యమే

పనులెట్టు జరగీనయ్యా = నీ కార్యములు (ధర్మములు) రకంగా జరుగునయ్యా.

భావము: శబ్ద స్పర్శ రస రూప గంధము లను ఐదుగురు మహా పాపాత్ములు దశేంద్రియాలు అనే కర్తలను కావలివారుగా నియమించి నా శరీరము అను రాజ్యము యేలుచున్నారు. నా హృదయమను న్యాయపీఠముపై కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు  అజమాయిషీ చేయుచుండగా వేంకటేశ్వరా ఇక నీ కార్యములు (ధర్మములు) నేను ఎట్లు నిర్వర్తించుదునయ్యా? 

వివరణము: మనిషి ఎదుర్కొను జీవనము అను పరీక్షను వివరిస్తున్నారు అన్నమాచార్యులు. మానవుడు  తనపై, ఇతరులపై   న్యాయనిర్ణేతగా వ్యవహరించ బోవుటను అన్నమాచార్యులు  తీవ్రముగా  విమర్శించిరి. నిరాధారమైన అట్టి న్యాయనిర్ణయం అసంపూర్ణ మని వారి భావన. తనలో తాను ఎంత బలవత్తరముగా విశ్వసించిననూ, ముఖ్యంగా ఇతరులపై అటువంటి తీర్మానము ధర్మ విరుద్ధంగా తీసుకొనవలె. అందుకే 'ఇతరుల దూరనేలా'#1 అన్నారు అన్నమాచార్యులు.

అట్లు, క్షణక్షణము, నిరంతరము తీర్మానములను ప్రకటించు బుల్లి మానవునికి ఎంతటి శ్రమ తప్పును!! కానీ, పొద్దస్తమాను తలమునకలు చేయు యీ వ్యాసంగములేక ప్రొద్దు పోవుటెట్లు? కాలము గడుచుటెట్లు? ధర్మ రక్షణకొరకు నేను నిలబడవలదా? ధర్మ రక్షణను మానవుడు తన చేతులలో తీసికొనుటకు ఆధారమెద్ది? అటువంటి చర్యలకు ఉసిగొల్పునది మౌఢ్యమా లేక వివేకమా?

పలుకంతల చేను బండ వెవసాయము
బలిమిఁ దొక్కీఁ గుంటిపసురము
తలవరులు ముగురు తగువాదు లేఁబైయారు
సొలసి ఆనాజ్ఞ కిదుఁ జోటేదయ్యా ॥హరి॥

 

ముఖ్య పదములకు అర్ధములు:

పలుకంతల చేను = శరీరము అనేక రంధ్రములున్న చేను. (నవద్వారాలు: రెండు కన్నులు, రెండుచెవులు రెండు నాసారంధ్రములు నోరు, మూత్రద్వారము, మలద్వారము).

బండ వెవసాయము = చాలా శ్రమతో కూడిన పని; పనికిరాని పని అని భావము;

బలిమిఁ దొక్కీఁ = బలవంతముగా నొక్కి పెట్టి;

గుంటిపసురము = కుంటి పశువు = తనకు తానుగా నిలబడ లేని మనస్సు;
తలవరులు ముగురు= తలారులు(ఉరితీసేవారు)సత్వ రజస్తమోగుణాలు = మానవుని ఉద్దేశము లతో నిమిత్తము లేకుండాఆయా గుణముల ప్రకారము నిర్వికారముగా నడుచుకొను వారు;

తగువాదు లేఁబైయారు=తగువాదులు ఏబైయారు = తమలోతాము విరుద్ధంగా పనిచేయు 56 తత్వాలు (1. ప్రకృతి, 2. పురుషుడు మొదలయినవి) ఉన్నాయి;

సొలసి = అలసిపోయి;

ఆనాజ్ఞ = ఆజ్ఞ అను అర్థమును తెలుపు జంటపదము, నా నియంత్రణకు;

కిదుఁ జోటేదయ్య = ఇందు చోటు లేదయ్యా;

భావము: అనేక గుంతలతో ఎగుడుదిగుడుగా వున్న ఈ క్షేత్రమును (శరీరమును) దున్నుటకు సహకరించే ఎద్దు (మనస్సు) కుంటిది. వంకరటింకరగా నడుస్తుంటుంది. ఇట్టి నా కృషి బండ వ్యవసాయం (కష్టంతో కూడుకున్న వ్యవహారము) కాదా?  ఇక సత్వ రజస్తమోగుణాలను తలారులు (భావనలతో సంబంధము లేకుండా నిర్వికారముగా ఆయా గుణముల జాడను యథావిధిగా అనుసరించు వారు) ఈ శరీరంలో ఉన్నారు. వాళ్లతో తగువులాడే 56 తత్వాలు (1. ప్రకృతి, 2. పురుషుడు మొదలయినవి) ఉన్నాయి. వీటన్నింటి బాధతో అలిసిపోయి ఉన్న నాకు వీటిని నియంత్రించటానికి అవకాశమేదయ్యా! (నావల్ల కాదు వేంకటేశ్వరా! నువ్వే రక్షించాలని భావం)

వివరణము: ఇక్కడ 'బండ వెవసాయము'తో అనవసరపు శ్రమను సూచించిరి. సందర్భంగా భగవద్గీత (13-30) లోని "అకర్తారం సపశ్యతి" (= ఇవియన్నియు గుర్తించి ఏమీ చేయక వూరకుండువాడు ద్రష్ట) అన్న సూక్తిని గుర్తుకు తెచ్చుకుందాము. మానవుడు దైవమును పొందుటకు పడు శ్రమమును వృథా అనిరి. దీనిని బలిమిఁ దొక్కీఁ (= బలవంతముగా నొక్కి పెట్టి) తో బలపరిచిరి. 

“తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము#2 / బొమ్మిరెడ్డి కప్పగించి పోది సేసెఁ బొలము” అన్న అన్నమాచార్యుల కీర్తనను గుర్తుకు తెచ్చుకొనుట ఉచితము. ఈ పల్లవి యొక్క అంతర్లీన భావం “మనిషి ప్రత్యక్షముగా దైవముతో సంబంధము ఏర్పరుచుకొనుటకు బదులు దానిని ప్రకృతి అనబడు మనస్సుకు కౌలుకు అప్పగించి చేతులు దులుపుకొంటాడు” అని.  ఇక్కడ మనస్సును కుంటిదానిగా వర్ణించడము గమనార్హము. 

 

‘కుంటి పసురము’ = కుంటి పశువు = తనకు తానుగా నిలబడ లేని పశువు అనగా ఏదో ఒక ఆధారముగొరు మనస్సు యొక్క తత్వమును ఉటంకించి ఈ మార్గము దుర్గమమని హెచ్చరించిరి.


‘తగువాదు లేఁబైయారు’ = తమలోతాము విరుద్ధంగా పనిచేయు 56 తత్వాలతో ఎటు వూగిసలాడిననూ ధర్మ విరుద్ధమౌనని, నిశ్చలత్వమును ప్రతిపాదించారు. 

బూతాల పొంగటికే పొడమిన పంటలెల్లా
కోఁతవేఁత చూచుకొని కోరు కొటారు
యీతల శ్రీవేంకటేశ యిన్ని విచారించి నీ-
చేఁతే నిలిపితి విఁకఁ జెప్పేదేఁటిదయ్యా ॥హరి॥

ముఖ్య పదములకు అర్ధములు:

బూతాల= భూతముల (in the sense of elements of nature);

పొంగటికే =పొంగటికుండ = గ్రామదేవతల దగ్గఱ పొంగళ్లు పెట్టుటకు వాడు చిన్న మట్టిపాత్ర = పెద్దగా విలువలేని;

పొడమిన పంటలెల్లా కోఁతవేఁత చూచుకొని కోరు= పుట్టిన సుఖాల కష్టాల హెచ్చుతగ్గులను పంటలను చూసుకోవాలి అని కోరుకునే;

కొటారు = ధాన్యాదిరాసులుండెడి చోటు = ఇక్కడ శరీరము అని తీసుకోవలె;

యీతల శ్రీవేంకటేశ: భూతలమందలి శ్రీవేంకటేశ;

 

భావము: గ్రామదేవతల దగ్గఱ పొంగళ్లు పెట్టుటకు వాడు చిన్న మట్టిపాత్రలాంటి స్వల్ప విలువగల శరీరములో కలుగు సుఖాల కష్టాల పంటలను చూసుకొని మురిసిపోతుంటాను.  అన్నీ తెలిసిన శ్రీ వేంకటేశా! యిన్నియు విచారించి, నా కున్నదంతా నీ చేతులలో నిలిపితిని. ఇక నేను చెప్పగలిగిన దేముంది? 

వివరణము:నీచేఁతే నిలిపితి విఁకఁ జెప్పేదేఁటిదయ్యా: సంపూర్ణ సమర్పణమును చూపుచున్నది. అన్నమాచార్యులెప్పుడూ రెండు స్థితులు మాత్రమే వున్నవని చెబుతుంటారు. ఒకటి మనముండు దశ​​. రెండవది భక్తిలో పూర్తిగా మునిగి యుండు స్థితి. ఇవికాక మోక్షమనునది  ఒక వూహ మత్రమేనని; అన్నమాచార్యులు తానువున్న స్థితిని గుర్తించ లేకున్నాడని సూచించుటకు "ఇక నేను చెప్పగలిగినదేమీ లేదు"తో అన్వయించిరి.

 

 

References and Recommendations for further reading:

#1 49 ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు (itarula dUranEla yevvarU nEmi sEturu)

#2 69. తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము (timmireDDi mAkunichche dishTamainapolamu)

 

 

-X-The End-X-

1 comment:

  1. అద్భుతమైన తత్త్వంతో కూడిన అన్నమయ్య కీర్తన యిది.
    ప్రేరిత అనుసంధానం వలన జీవితంలో అనేక విషయాలు మనలో భయాన్ని రేకేత్తిస్తున్నాయి.బుద్ధిమాలినతనం వలన దైవాన్ని తెలిసికొనలేక పోవుచున్నాము.దైవభీతి యున్నంత మాత్రాన జీవితగమ్యమైన సత్యాన్ని కనుగొనలేమని, సరిదిద్దుకొనే బుద్ధినీయవయ్యా యని అన్నమయ్య పల్లవిలో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు.

    రెనే మాగ్రిట్ యొక్క రెండు చిత్రాలను పరిశీలిస్తే మొదటి చిత్రంలో గుర్రంపై సవారీ సాధ్యం కాదని, అయితే రెండవ చిత్రంలో మాత్రం ప్రేరిత అనుసంధానం వలన అక్కడ రౌతు గుర్రమును స్వారీ చేస్తున్నట్లు చూస్తాము. ఈవిధంగా ప్రేరిత అనుసంధానం వలన సంబంధం లేని అనేక విషయాల పట్ల భయాన్ని అనుభూతి చెందుతున్నాము. దీనికి కారణం మన బుద్ధిమాలినతనమే. అందుకే జీవిత పరమార్థం వైపు గొనిపోయే బుద్ధిని మాకు ప్రసాదించవయ్యా అని అన్నమయ్య ప్రార్తిస్తున్నాడు.
    శరీరం పాపపంకిలము.పంచ తన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే ఐదుగురు పాపాత్ములచే పంకిలమైన ఈ శరీరానికి పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు వెరసి దశేంద్రియములను కాపలాదారులుగా నియమించి ఈ ఐదుగురు తన్మాత్రలు శరీరాన్ని యేలుచున్నారు.కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము లనే అరిషడ్వర్గాలు అంతఃశత్రువులై దీనిమీద అజమాయిషీ చేస్తున్నారు.ఇటువంటి స్థితిలోనున్న నేను ధార్మికమైన కార్యములను యెట్లు చేయగలను? అని దైవంతో మొరపెట్టుకుంటున్నాడు అన్నమయ్య.

    నవద్వారములు కలిగిన శరీరరమనే ఈ క్షేత్రాన్ని చంచల స్వభావము కలిగిన మనసు అనే ఎద్దు దున్నుతున్నది. త్రిగుణాలైన సత్వరజస్తమోగుణాలు తలారులై యున్నారు.అటులనే ఏబదియారు తత్వసమ్మిళితమైన ఈ శరీరమును నియంత్రించటం సాధ్యమయ్యే పని కాదు.నీవే అనుగ్రహించి నన్ను బ్రోవుమయా యని అన్నమాచార్యులవారు ఆర్ద్రతతో వెంకటేశ్వరుడిని ప్రార్థిస్తున్నాడు.

    స్వల్ప కష్టసుఖాల నిచ్చే ఈ శరీరాన్ని చూసి మురిసిపోయేవాడను.నీకు శరణాగతి నైతిని.అన్నీ విచారించి నన్ననుగ్రహించి నీ తత్త్వమును తెలిసికొని, సత్యాన్ని గుర్తించేటట్లు చేసి నన్ను బ్రోవవయ్యా అని శ్రీనివాసుడిని అన్నమయ్య వేడుకొంటున్నాడు.

    శ్రీ చామర్తి శ్రీనివాస్ గారి సవిస్తరమైన వ్యాఖ్యానం సులభగ్రాహ్యం. వారికి నమస్సులు.

    ఓం తత్ సత్. 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...