Friday, 2 February 2024

T-190 ఇదె చాలదా మమ్ము నీడేర్చను

                                అన్నమాచార్యులు

190 ఇదె చాలదా మమ్ము నీడేర్చను

కీర్తన సారాంశం:

పల్లవి: ఈ జన్మమునకు భగవంతునిపై భక్తి ఒక్కటీ సరిపోదా (మోక్షము) సిద్ధించుటకు?  తరువాతి పనుల నెవ్వఁ డెరుఁగు?  (ఎవ్వడూ ఎరుగడు!) అన్వయార్ధము: మానవుడా! "నీకున్న భక్తి ఒక్కటే మోక్షమును సిద్ధింపజేయును. ఆ తర్వాత ఏమౌతుందనే ఆసక్తి నీ మర్గమునకు అంతరాయము".

చరణం 1: పంచ సంస్కారాలు పొందితేనే సరిపోదు. వాస్తవముగా వానిని అనుసరించువారే మాకుఁ బ్రమాణము. నీ రూపనామములను కొలుచుచున్నప్పటికీ ఆధారములన్నిటికీ ఆధారమైనది నీ రూపనామములని తెలుసుకున్నవారు ఘనపుణ్యులు.

చరణం 2: వైష్ణవవేషభాషలు అనుసరించుచున్నను, వైష్ణవమునే దిక్కుగా వేరు వుపాయము లేక వుండువారే యోగ్యులు. ఆ దేవదేవుని దాసానుదాస్యము అంతరంగముగా కలిగివున్నవారే కర్మదూరులు.

చరణం 3: సంకీర్తనము తప్ప వేరేమీ ఎరుగని వార్లతోడ వుండుటయే పరమపదమను భాగ్యము.  వేదశాస్త్రము లివియే చక్కగా చెప్పుతున్నవి.  శ్రీవేంకటేశుడను పరమార్థము నిదే.

 

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల ఈ కీర్తనలో భక్తిలోని మర్మమును చక్కగా తెలిపిరి.  భక్తినే సర్వస్వముగా భావించి కొలుచు వారికి మోక్షముపై ఆసక్తి  నశించి భక్తిలోనే వుండుటకు ప్రాధాన్యమునిత్తురు. అట్టివారికి మాత్రమే మోక్షము కరతలామలకము.

 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు:  285-3 సంపుటము: 3-490

ఇదె చాలదా మమ్ము నీడేర్చను
అదన నెవ్వఁ డెరుఁగు నటమీఁది పనులు
పల్లవి

ఇట్టె పంచసంస్కారా లెచ్చోట నుండినాను
పట్టైనవారే మాకుఁ బ్రమాణము
మట్టుగ నీరూపనామము లెందు నుండినాను
కట్టఁగడవారైన ఘనపుణ్యులు ఇదె

పలుక వైష్ణవవేషభాష లెందు నుండినాను
వలనుగ మాకు సహవాసయోగ్యులే
తలకొన్న దాసానుదాస్య మెందు నుండినాను
అల కర్మదూరులైన నంతరంగులు ఇదె

యెక్కువ సంకీర్తన మెచ్చోట నుండినాను
అక్కడ పరమపద మది భాగ్యము
చక్కఁగ వేదశాస్త్రసమ్మతము నిదియే
పక్కన శ్రీవేంకటేశు పరమార్థము నిదే ఇదె

Details and explanations:

ఇదె చాలదా మమ్ము నీడేర్చను
అదన నెవ్వఁ డెరుఁగు నటమీఁది పనులు పల్లవి

ముఖ్య పదములకు అర్ధములు: అదన = అవకాశం; అటమీఁది పనులు = తరువాతి పనులు (= దైవమునకు భక్తితో తన్ను తాను సమర్పించుకున్న తర్వాత కలుగు పనులు)

భావము:  ఈ జన్మమునకు భగవంతునిపై భక్తి ఒక్కటీ సరిపోదా (మోక్షము) సిద్ధించుటకు?  తరువాతి పనుల నెవ్వఁ డెరుఁగు?  (ఎవ్వడూ ఎరుగడు!)

వివరణము: "అట మీది పనులు" అనగా నేమియో విచారింతము. మానవునికి ఆ లోకములో పని యేమి? ఎంత విచారించినను హేతుబద్ధమైన జవాబు కానరాదు. మహానుభావులు చెప్పిన బాటలో నడుచుకొను సామర్థ్యము సామాన్య ప్రజలకు లేదు. కారణజన్ములను గురించి కాదు, మనలాంటి వారిని ఉద్దేశించినారు అన్నమాచార్యులు తన కీర్తనలలో.

"అట మీది పనులు" అనగా ఈ జన్మము తరువాతి పనులు. మహా పురుషులకు అట మీది పనులు తెలిసి వుండవచ్చునని ప్రజల నమ్మకము. ఇక్కడ అన్నమాచార్యులు "అట మీది పనులు" ఎవరికి తెలియదని ఖండితముగా చెప్పుచున్నారు. ఈ రకముగా నిర్ద్వంద్వంగా వారు అట్టి ఊహాగానాలకు తావు లేదని కుండ బద్దలు చేసి చెప్పారు.

ఇప్పుడు "ఇదె చాలదా మమ్మీడేర్చను" అనగా, మానవుడా! నీకు ఒక అద్భుత అవకాశం అనదగిన మానవ జన్మ కలిగినది. ఇంత కంటే మరేమి కావలెను? నీ పుట్టుకను సార్ధకము చేసుకొంటూ చేయగల కార్యమును తెలియుము అంటూ ఉద్భోధ చేశారు.

ఇందులో ఈ అవకాశం అందరికి, అంటే వివిధ చేష్టలలో మునిగి యున్న ప్రపంచ వాసులందరినీ కలుపుకొని ఈ మాట అన్నారు. కేవలము దైవ భక్తులకు, జీవ కారుణ్య చేతసులకు, ప్రజోపకారులకుమతాధికారులకు మాత్రమే పరిమితం కాదు. అనగా, ఇప్పటి మనకు అందుబాటులో వున్న భక్తి ఒకటియే సరి పోవునని, మరి వేరు దానిని కోరు (లేదా వెతుకు) అవసరం లేదని సూచించున్నారు.

మానవుని ప్రవృత్తి: అయితే, మానవులు దీనిని ఎందుకు సాకారం చేసుకొన లేకున్నారో ఆలోచింతము. ఇప్పుడు మనము రీని మాగ్రిట్ గారు (René Magritte) వేసిన Le Monde poétique (=కవిత్వ ప్రపంచం) అను పేరుగల అధివాస్తవిక చిత్రము ద్వారా తెలియుటకు ప్రయత్నము చేయుదము.


అక్కడ మనకు , ఒక బల్ల మీద కొన్ని స్తూపాల వంటి వాటి మధ్య ఒక కన్ను వంటి వస్తువు కనబడును. ఆ కన్ను వెనుక గొట్టం వంటిది (లేదా మానవుని ప్రేవులు లాంటిది) బల్ల వెనుకగా ఎక్కడకు వెడుతున్నది తెలియదు. అటు ఇటు వున్న తెరలు కొన్ని స్తూపాలను మరుగు పరిచి వుంచాయి.

ఈ బొమ్మల ద్వారా మాగ్రిట్ గారు ఏమి చెప్ప దలచుకున్నారో విశదపరచు కుందాం. ఆ కన్ను మానవుని 'వెతుకుట' అను ప్రయాసమును తెలుపును. ఆ కన్ను చూచువానిదా లేక వేరే ఎవరిదోనా అన్నది స్పష్టముగా లేదు. ఎక్కడ వెతుకుతున్నాడు? ఆ పిరమిడ్ లాంటి వాని దగ్గర. ఆ స్తూపాలు మనము భద్రముగా కట్టుకున్న అనేకానేక కలలకు, సేకరించి నమ్మిన సిద్ధాంతములకు, అభిప్రాయములకు, స్మృతులకు, జ్ఞాపకములకు చిహ్నములు.

ఈ రకంగా మానవుడు మానసికంగా పాత  స్మృతులపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ కన్ను దానిని కలిపిన ప్రేవులు వంటి గొట్టంతో అతని జ్ఞానము, లెక్కలు, సమాచారం, భోగట్టా, ప్రమాణములు పరోక్ష మైనవని సూచించారు.తెరలు కప్పి వున్న స్తుపాలతో మరుగున పడివున్న సమాచారం, భోగట్టాలను చెప్పిరి. నేపథ్యంలోని లేత నీలి రంగు మీద నల్లని చారలు వీటన్నిటిని ప్రశ్నిస్తున్నట్లుంది.

ఈలాగున మనమందరము, ఎంత అధునాతన సాంకేతికతను వుపయోగించు చున్నప్పటికీ మన చైతన్య దశలోని సంపర్కం  మాగ్రిట్ గారి బొమ్మలో చూపినట్లు గతము ఊతముగా కట్టుకొన్న ఆలోచనల పైననే. అట్టి నిశ్చయములు క్షణక్షణ మునకు పరివర్తనం చెందుతున్న  వర్తమానములోని సత్యముతో సారూప్యత కలిగి వుండవు.
ఆలాగున, మానవులకు సత్యమునకు మధ్య పూరించ లేని అంతరము ఏర్పడినది. ఈ అగాథమును పూరించు ప్రయత్నములన్నీ చైతన్య స్థితిలోని భాగములే కావున దాటుట అసంభవం.

అన్వయార్ధము: నీకున్న భక్తి ఒక్కటే మోక్షమును సిద్ధింపజేయును. ఆ తర్వాత ఏమౌతుందనే ఆసక్తి నీ మర్గమునకు అంతరాయము.

అన్నమాచార్యుల ఆంతర్యము: అన్నమాచార్యులు దాదాపు అన్ని కీర్తనలలోను భక్తితో బాహ్యస్పృహలేక సహజ స్థితిని నిమగ్నమగుటను తెలుపదలచిరి. కావున సత్యమార్గమున ప్రయాణించు మానవుడు స్పృహ లోని విషయములన్నిటిని నిరభ్యంతరముగా వీడి పయనించ వలెను. అనగా అతడు ప్రపంచములోని ఏ సిద్ధాంతమును చేపట్టక తనకు తాను బాటలు వేసి కొనును. అందుచేత, ఈ ఏకాకి ప్రయాణము అత్యంత సాహసోపేతము, నిర్గమమునై వున్నది.

ఇట్టె పంచసంస్కారా లెచ్చోట నుండినాను
పట్టైనవారే మాకుఁ బ్రమాణము
మట్టుగ నీరూపనామము లెందు నుండినాను
కట్టఁగడవారైన ఘనపుణ్యులు ఇదె


ముఖ్య పదములకు అర్ధములు: పంచసంస్కారాలు: పంచ సంస్కారములు లేదా సమాశ్రయణములు పొందినవారు శ్రీవైష్ణవునిగా పరిగణింపబడతారు. క్రింది ఐదు క్రియలు పంచ సంస్కార సమయమున జరుపబడతాయి. 1. తాపసంస్కారము, 2. పుండ్రసంస్కారము, 3. నామసంస్కారము, 4. మంత్రసంస్కారము, 5. వైష్ణవేష్టి; పట్టైనవారే = వాస్తవముగా దానిని అనుసరించువారే; మట్టుగ = ఆధారముగా, స్థావరముగా; కట్టఁగడవారు = ఆధారములన్నిటికీ ఆధారమైనది తెలుసుకున్నవారు.

భావముపంచ సంస్కారాలు పొందితేనే సరిపోదు. వాస్తవముగా వానిని అనుసరించువారే మాకుఁ బ్రమాణము. నీ రూపనామములను కొలుచుచున్నప్పటికీ ఆధారములన్నిటికీ ఆధారమైనది నీ రూపనామములని తెలుసుకున్నవారు ఘనపుణ్యులు.

వివరణము:

పలుక వైష్ణవవేషభాష లెందు నుండినాను
వలనుగ మాకు సహవాసయోగ్యులే
తలకొన్న దాసానుదాస్య మెందు నుండినాను
అల కర్మదూరులైన నంతరంగులు ఇదె

ముఖ్య పదములకు అర్ధములు: వలను = దిక్కు, ఉపాయము, నేర్పు, యుక్తము; తలకొను = తాల్చు, వహించు, కలుగు;

భావమువైష్ణవవేషభాషలు అనుసరించుచున్నను, వైష్ణవమునే దిక్కుగా వేరు వుపాయము లేక వుండువారే యోగ్యులు. ఆ దేవదేవుని దాసానుదాస్యము అంతరంగముగా కలిగివున్నవారే కర్మదూరులు.

వివరణము: తలకొన్న దాసానుదాస్యము: మానవుడు తనకు ఈ ప్రపంచమను మిథ్యను చేధించు సామర్థ్యము తనకు లేదని గ్రహించి, చేష్టలుడిగి, దైవము తప్ప తనకు వేరెవరూ లేరని అంతరంగమున తెలిసి, తనపై బడుచున్న కార్యములకు ప్రతిస్పందించక మిన్నకుండుట.  ఇది భయముతో కాదు, అత్యంత ధైర్యముతో తీసికొను నిర్ణయము.

జ్ఞానము అనునది విడిగాలేదు. అజ్ఞానము లేకుండుటయే జ్ఞానము. కావున వున్న అజ్ఞానమును విడిపించుకొనుటెట్లుమనము చేయు ఏ ప్రయత్నములు కూడా సముపార్జనకే  (ఉన్న దానికి కూడుటకే) వుపయోగించును. తీసివేయు విధము లేదు. కావున​ నిరుపయోగములగు యత్నములను వదలి, ఏకాగ్రతతో భక్తిని చేపట్టమని అన్నమాచార్యుల హృదయము.

ఈ సందర్భంగా భగవద్గీతలోని ఈ శ్లోకమును పరిశీలిద్దాము. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే / తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః 2-46 ॥  భావము: పెద్ద సరస్సులలోను, చిన్న చెలమల​లోను ఉన్న నీరు మనిషికి ఒకే రకముగా ఉపయోగపడినట్లువేదాలలో చెప్పిన సమస్త కర్మలవలననూ పొందబడే శాంతి(ఆనందము) ఏదైతే ఉందో, యోగియైన వాడికి తన జ్ఞానం లోనే ఆ శాంతి(ఆనందము)  సమస్తమూ  ఇమిడి ఉంటుంది. అనగా యోగియైనవాడు తన జ్ఞాన స్థాయి, తన అర్హత, ఆ  జ్ఞానము లభించునో లభించదో అన్న సంశయములకు తావివ్వక​ ఆ మార్గమును చేపట్టును.

జ్ఞాన మార్గము అంతర్గతముగా జ్ఞాపకములను వూహించుకున్న వానిని లయము చేయు ప్రక్రియ. అందుచే  ప్రస్తుత మన ప్రజ్ఞల స్థాయిలకు, యోగ్యతలకు ఇందులో ప్రమేయముండదు. పైన పేర్కొన్న శ్లోకముయొక్క అంతరార్ధము కూడా ఇదియే. 

ఆ రకముగా చూచిన "తలకొన్న దాసానుదాస్యము" "కర్మదూరులైన నంతరంగులు" దాదాపు సమాన అర్ధములే.  అన్నమాచార్యులు, వారు పునరుద్ఘాటించుట దాని ప్రాముఖ్యతను తెలియ పరచుట కనుకోవచ్చును.

అన్నమాచార్యులు ముఖ్యముగా ఆచరించుటకు పెద్ద పీటను వేసిరి. ఇక్కడ​ క్రింది వేమన పద్యం మననము చేసికొన్న సరిపోతుంది.

వేషభాషలెరిగి కాషాయవస్త్రముల్

గట్టగానే ముక్తి గలుగబోదు
తలలు బోడులైన తలపులు బోడులా

విశ్వదాభిరామ వినుర వేమ


యెక్కువ సంకీర్తన మెచ్చోట నుండినాను
అక్కడ పరమపద మది భాగ్యము
చక్కఁగ వేదశాస్త్రసమ్మతము నిదియే
పక్కన శ్రీవేంకటేశు పరమార్థము నిదే ఇదె


ముఖ్య పదములకు అర్ధములు: యెక్కువ సంకీర్తనము = సంకీర్తనము తప్ప వేరేమీ ఎరుగని;

భావముసంకీర్తనము తప్ప వేరేమీ ఎరుగని వార్లతోడ వుండుటయే పరమపదమను భాగ్యము.  వేదశాస్త్రము లివియే చక్కగా చెప్పుతున్నవి.  శ్రీవేంకటేశుడను పరమార్థము నిదే.

వివరణము: అన్ని మతములలోను దైవమును పొగడుట ఒక విధిగా నిర్ణయించిరి. కానీ మనవులు పాక్షిక విశ్వాసముతో, కొంత నమ్మి, కొంత నమ్మక అయోమయములో పడిపోవుచున్నారుమానవులంతా పరిపూర్ణ విశ్వాసములేక ఈ సంసారమను కార్యక్రమములో మునిగి పోవుచున్నారు అని అన్నమాచార్యుల అభిమతము.  

నారదుడు, సనకసనందనాదుల మాదిరి సంకీర్తనమునే జీవముగా స్వీకరించినవారు పరమపదమును అనగా ఇప్పటి ఉపరితలమునకే పరిమితమైన చైతన్యావస్థను ఛేదించుకొని అనంతమగు  జీవవాహినిలో చేరుదురని వారు చెప్పిరి. అట్లు భక్తినే వూతముగా పరమ పదమును చేరిన అన్నమాచార్యులు దైవ సమానులు. 

-x-సమాప్తము-x-



1 comment:

  1. పల్లవి వివరణ చాలా బాగుంది.
    వైష్ణవు లాచరించే పంచ సంస్కారములేవియో బాగా వివరించారు.
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...