అన్నమాచార్యులు
191 వెదకవో చిత్తమా వివేకించి నీవు
వ్యాఖ్యానము: చామర్తి శంకర నాగ శ్రీనివాస్
ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల కీర్తనలు లోతైనవని విని యుందురు. ఈ అత్యంత రమణీయమైన
కీర్తన అటువంటి వానిలో అగ్రగణ్యమని భావించవచ్చును. కొంచెము పరికించిననూ, ఆచార్యులు మనందరి కోసము తెలిసిన ఈ ప్రపంచము
నుండి తెలియని, ఊహింపలేని, అసాధ్యమగు లోకమునకు బాటలు వేయుచున్నారని బోధపడును. కావున వీటిని వినియోజకుని వైఖరిలో (like a consumer) బాగున్నదనియో, బాగులేదనియో తీర్పు నిచ్చి, తృప్తిని పొంది, ఆ మీదట ఆవల పారవైచుటకు కాదని తెలియవలెను.
అధ్యాత్మ కీర్తన: రాగిరేకు: 272-4 సంపుటము: 3-415 |
వెదకవో చిత్తమా వివేకించి
నీవు
అదనఁ దదియ్యసేవ అంతకంటే మేలు
॥పల్లవి॥
చూపులెన్నైనాఁ గలవు సూర్యమండలముదాఁకా
చూపులు శ్రీహరిరూపు చూడ దొరకదు
గాని
తీపులెన్నైనాఁ గలవు తినఁ దిన
నాలికెకు
తీపు శ్రీహరిప్రసాదతీర్థమని
కోరదు ॥వెద॥ మాటలెన్నైనాఁ గలవు మరిగితే
లోకమందు
మాటలు శ్రీహరినామము మరపఁగ
వలె
తేటలెన్నైనాఁ గలవు తీరని చదువులందు
తేటగా రామానుజులు తేరిచె వేదములలో ॥వెద॥ చేఁతలెన్నైనాఁ గలవు సేసేమంటే
భూమి
చేఁతల శ్రీవేంకటేశు సేవ సేయవలెను
వ్రాఁతలెన్నైనాఁ గలవు వనజభవుని
ముద్ర-
వ్రాఁతలు చక్రాంకితాలె వహికెక్కే ముద్రలు ॥వెద॥
|
Details
and explanations:
వెదకవో చిత్తమా వివేకించి నీవు
అదనఁ దదియ్యసేవ అంతకంటే మేలు ॥పల్లవి॥
ముఖ్య
పదములకు అర్ధములు: అదన = అవకాశం; తదీయ
= తత్సంబంధమైనది
భావము: ఓ చిత్తమా వివేకించి వెతుకుము.
సరిగా ఎంచి చూచిన దైవ సేవ అంత కంటే మేలైనది కాదా?
వివరణము: ఇక్కడ అన్నమాచార్యులు దైవమును అసలు వెతుకుట
అనవసరము అనుచున్నారు. ఈ సందర్భముగా “వెదకినఁ దెలియదు వెనక ముందరలు / పదమున నిలుపవె పరమాత్మా ॥పల్లవి॥“ అను కీర్తనను కూడా మననము చేసుకుందాము.
ఈ రెండూ కీర్తనలలోనూ కేవలం
వెతకడం, శోధించడం, పరిశోధన, విశ్లేషణ, ఆలోచించడం వల్ల సత్యాన్ని గ్రహించడం సాధ్యం కాదు అన్నారు. అయన తరచూ ఈ
విషయాన్ని పునరావృతం చేశారు.
ఈ విషయమును రీని మాగ్రిట్ గారు (René Magritte) వేసిన La femme du maçon (= తాపీ మేస్త్రీ భార్య) అను పేరుగల అధివాస్తవిక చిత్రము ద్వారా విశదీకరించు కొందము.
క్రింది బొమ్మలో ఒక మహిళ ఒక ఆకును చూస్తున్నట్లు చూపించారు. మహిళ కన్నులు సౌష్టవముగా కాక తుల్యము తప్పినట్లు చూపారు. మొత్తానికి ఈ బొమ్మ మనలో జిజ్ఞాస, కుతూహలములను రేపుతోంది.
ఈ బొమ్మ ద్వారా మాగ్రిట్ గారి సందేశమేమిటో పరిశీలించుదాం. ఆకు పచ్చని ఆకు ఆ మహిళ మనసులోని కోరికలకు చిహ్నం. అసహజమైన పెద్ద పెద్ద కన్నులుండి కూడా అమెకు ఆకు తప్పించి వేరేమీ కనబడుటలేదన్నది స్పష్టము. ఆ రకముగా మానవులందరూ తాము కోరువానినే చూచు చున్నారు కానీ ఈ విశాల ప్రపంచమును వున్నది వున్నట్లుగా చూచుటలేదని తెలుస్తోంది.
సత్యమునకు ఇదమిద్ధమైన ఆకారము, నైజము, ఆస్తిత్వము లేవు కావున దానిని వాంఛించుట, దానికై వెతుకుట అవివేకము. ఇక "తదీయసేవ" తో అన్నమాచార్యులు ఏమి చెప్పదలిచారో? మానవుడు దైవమునకు చేయగల సేవ ఏమి? సర్వ పరిపూర్ణుడగు భగవంతుడు నరునిపై ఆధారపడడు. "తదీయసేవ" అనునది మనము నిర్ణయింప గలిగినది కాదని మాత్రము చెప్పగలము. దీనిని భగవద్గీతలోని క్రింది శ్లోకముతో అన్వయించి చూద్దాం.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ । స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 3-35 ।। చక్కగా పాటింపబడిన పరధర్మము కన్ననూ గుణము లేనిదైననూ స్వధర్మాచరణమే శ్రేయస్కరము. స్వధర్మాచరణమందు మరణము సంభవించిననూ మేలే, ఏలయనగా పరధర్మము భయంకరమైనది.
అనగా మన ఇప్పటి నైజముతో, ధర్మముతో సంతృప్తి చెంది (సరిపుచ్చుకొని) మనుటయే అత్యుత్తమ ధర్మము. అన్నమాచార్యులు అనేక మార్లు పునరావృత్తము చేసిన "తహతహలిన్నిటికి తానే మూలము గాన సహజాన నూరకున్న సంతతము సుఖము" అనునది గ్రహించుట అత్యావశ్యకము. కావున ‘తదీయసేవ’తో వారు చెప్పదలచుకున్నది మనము సాధారణముగా ఊహించు “సేవ” వంటిది కాదు.
అన్నమాచార్యుల ఆంతర్యము: కాబట్టి ‘తదీయసేవ’పై విచారించుటకు మనిషి తన సమయమును వెచ్చించవలెను. ఏదో జ్ఞానమును సంపాదించేద్దాం అన్న విచారణలో వుంటామే కానీ వున్న 'జ్ఞానము'ను వదిలేద్దాం అని అనుకోము. ఉన్న 'జ్ఞానము'ను వదిలించుకొనుట ఎట్లు? దానికి దారులు లేవే? ఇది తెలిసిన వారు అటువంటి లేని దారిని కనుగొందురు; పేర్కొన్న "తదీయసేవ" అనునది ఆ తెరువును కనుగొనుటలో నిమ్మగ్నమౌటను సూచించుచున్నది.
భావము: చూచుటకు సూర్యమండలము దాకా విస్తరించి యున్న ఈ ప్రపంచమున అనేకములు
కలవు. కానీ దుర్లభమగు శ్రీహరిరూపును చూపు చూపు అసలైన చూపు. (మిగిలినవి వ్యర్థములని
భావించవలెను). కానీ ఈ భూమిలోని రుచులను అస్వాదించుటకు
మరిగిన నాలికకు అసలు తీపియైన శ్రీహరిప్రసాదతీర్థమును
కోరదు.
వివరణము: ఈ చరణములో అన్నమాచార్యులు చూచిన వెలి చూపులను, మనస్సు మరిగిన తీపులను మరచినకానీ అసాధ్యమగు శ్రీహరి తత్వమును కనుగొనలేమని చెప్పుచున్నారు.
జ్ఞానము అనగా వినుట, చూచుట, తాకుట ద్వారా, వాసన పీల్చుటతోను, రుచులను గ్రహించుట ద్వారాను తెలుసుకున్న వానిని, అట్టి వానిలో మనసుకు హత్తుకున్న వానిని, బహు జాగ్రత్తగా భద్ర పరచుకున్న వానిని బహిర్గతము చేయుటయే. ఆ రకముగా లోని దానికి బయటి ప్రపంచానికి వ్యత్యాసం లేదని తెలియు వాడు జ్ఞాని. తనలోని దానిని బయట దానిని విడివిడిగా చూచుటను అజ్ఞానము అనుకోవచ్చును.
అందుకే, ఈనాడు మునుపెన్నడులేని విధముగా అనేకులు తమ స్వంత అభిప్రాయములను వెలిబుచ్చుచున్నారు. కానీ ఒకరి అభిప్రాయములను వేరొకరిపై రుద్దుట తాము తమకై కోరుకునే స్వేచ్ఛకు వ్యతిరేకమని తెలియలేరు.
ఈ రకముగా ఆలోచించిన తమలో ఏర్పరచుకున్న
ఇంగితములు, తలపులను మనచుట్టూ ఆవరించుకొని వున్న జీవ వాహిని (మనము శ్రీహరి అని పేరిడిన వాని) యందు కలిపివేయుటను
సత్యమార్గము అనుకోవచ్చును. అంతేకానీ తమ మనోనిశ్చయములను పరులపై బలవంతముగా మోదుట వివేకము
అనిపించుకోదు.
ముఖ్య
పదములకు అర్ధములు: తేటలు = విధములు,
మార్గములు
భావము: చక్కని, జ్ఞానమును ప్రకాశింప చేయు
వాక్యములెన్నియో కలవు ఈ లోకమున. వానిలో శ్రీహరి నామమును కూడా తనలో యిముడ్చుకున్న నిశ్శబ్ద మును తెలియుము. మార్గములు ఎన్నో కలవు గాని, రామానుజులు చూపిన వేద మార్గమును
కనుగొనుము,
వివరణము: అన్నమాచార్యులు పేజీలను నింపుటకు కవిత్వం వ్రాయట లేదు. అతి క్లుప్తంగా నిశ్శబ్దము నకు మార్గము
కనుగొనుము అంటున్నారు. మన మనస్సు అను
ఈ అకటవికట ప్రపంచము నుండి ఆశలు రేపు మాటల అలలు తాకని దానిని తెలియ మంటున్నారు .
మౌనము నందు దాగి యున్న
మార్గము చేతన స్థితి నుండి చేరగలిగినది కాదు. మన ఇప్పటి క్రియ ప్రతిక్రియల యందు ఊగిసలాడు
ప్రవృత్తితో సాధ్యము కాదు.
ముఖ్య పదములకు అర్ధములు: యెక్కువ
సంకీర్తనము = సంకీర్తనము తప్ప వేరేమీ ఎరుగని;
భావము: ఈ లోకమున ఎన్నో పనులు వున్నప్పటికి
‘శ్రీవేంకటేశుని
సేవ’ను మించిన పనులు లేవు. శ్రీవేంకటేశుని సేవ చేసి అప్పుడు గదా
ఆ విష్ణుని ముద్రలు మోయుటకు అర్హత కలుగునది? అదికాక కదా మానవులకు
గణింప తగినదేమి?
వివరణము: ఇక్కడ తదీయసేవ’ శ్రీవేంకటేశు సేవ ఒకే అర్థములో తీసికొనవలె. ఈ రకముగా
అన్నమాచార్యుల వారు, దైవమును సేవించు మని, ఆ సేవ ఏమియో తెలిసి, తదేక దీక్షతో నెరవేర్చి తరించమని బోధించారు.
కీర్తన సారాంశం:
పల్లవి: ఓ చిత్తమా వివేకించి వెతుకుము. సరిగా ఎంచి చూచిన దైవ సేవ అంత
కంటే మేలైనది కాదా?
చరణం 1: చూచుటకు సూర్యమండలము దాకా విస్తరించి
యున్న ఈ ప్రపంచమున అనేకములు కలవు. కానీ దుర్లభమగు శ్రీహరిరూపును చూపు చూపు అసలైన చూపు.
(మిగిలినవి వ్యర్థములని భావించవలెను). కానీ
ఈ భూమిలోని రుచులను అస్వాదించుటకు మరిగిన నాలికకు అసలు తీపియైన శ్రీహరిప్రసాదతీర్థమును కోరదు.
చరణం 2: చక్కని, జ్ఞానమును ప్రకాశింప చేయు వాక్యములెన్నియో కలవు ఈ లోకమున.
వానిలో శ్రీహరి నామమును కూడా తనలో యిముడ్చుకున్న నిశ్శబ్ద మును తెలియుము. మార్గములు ఎన్నో కలవు గాని, రామానుజులు చూపిన వేద మార్గమును
కనుగొనుము,
చరణం 3: ఈ లోకమున ఎన్నో పనులు వున్నప్పటికి శ్రీవేంకటేశుని సేవ ను మించిన
పనులు లేవు. శ్రీవేంకటేశుని సేవ చేసి అప్పుడు
గదా ఆ విష్ణుని ముద్రలు మోయుటకు అర్హత కలుగునది? అదికాక కదా మానవులకు
గణింప తగినదేమి?
-x-సమాప్తము-x-
ఈ కీర్తనలో . వెదకవో చిత్తమా వివేకించి నీవు...ఆధ్యాత్మికతతో కూడిన ఈ పల్లవి అత్యంత ప్రధానమైనది.చరణములు మూడు ఈ భావనలోని అంశములే.
ReplyDeleteకమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము...
అన్న పోతన గారి పద్యం గుర్తుకు వచ్చినది.
పల్లవికి మాగ్రెట్టి గారి చిత్రం పల్లవిని ప్రతిబింబిస్తున్నది.
వ్యాఖ్యానము బాగున్నది శ్రీనివాస్ గారు.
👌👌💐💐🙏🏻🙏🏻