అన్నమాచార్యులు
194 కల దింతె మాఁట కంతుని యాఁట
ఈ అత్యద్భుతమైన కీర్తనలో ప్రణయము అనునది
మానవుని జీవితంలో కీలక పాత్ర వహించునని;
దాని ప్రభావం నుండి వెలువడుటకు
తక్షణమే శ్రీ వెంకటేశ్వరుని పాదాలు శరణాగతి చేయవలెనని ఉద్భోదించారు.
కవిత్వము వ్రాయు రీతికి
కొత్త పంథాలు ఏర్పరచి
సామాన్యులకు తమ కనుల ఎదుట జరుగుతున్న జగన్నాటకం
విడమరచి సులభముగ అర్థమగు రీతిలో
కవిత్వమునకు స్థాయిని ప్రయోజనమును కల్పించి
అద్దానిని నుడువుటకుఎటువంటి సామాజిక కట్టుబాట్లు సైతం
అడ్డు రావు అని నిరూపించారు
అన్నమాచార్యులు.
కీర్తన సారాంశం:
పల్లవి: మన ప్రపంచం అంతా మన్మధుని లీలయే. నీలో ఈ ఎడతెగని
కార్యకలాపాలను పూట పూటకు గమనించుటయే నీ విధి. నేర్చుకోవాల్సింది ఇది ఒక్కటే. అన్వయార్ధము: భీష్మించుకుని కూర్చున్నప్పటికీ, మన్మధుని ప్రేరణతో కలిగిన ఆలోచనలు మనలను
మనం ఉన్న స్థితి నుండి కూకటి వేళ్లతో సహా
పెకిలించి ప్రవాహం వెంబడి తీసుకు పోవుచున్న {“నీవు కూడా అందరి లాగానే కొట్టుకుపోతున్న”} సంగతి
గమనించగలవా ?
చరణం 1: ఓయీ మానవుడా మన్మధుని వాడియైన
బాణములనుండి తప్పించుకొనుటకు హరిని నీ అంతరంగమున నిలిపి; హృదయముపై కామదేవుని నాట్యము పట్ల స్పృహ
కలిగి ఉండి; హృదయంలో కరుణ పొంగఁగా తగిన చెలికాడు నేడే హరీని
చేకొనుము.
చరణం 2: (అన్నమాచార్యులు తననుతాను ‘అలమేలుమంగ’గా అనుభూతి చెందుతూ తనలో తాను ఇలా అనుకొంటున్నారు). తుమ్మెదలవంటి నల్లని కురులు కలదానా! పద్మమువంటిదానా! జగత్తునంతా వెలుతురుతో నింపిన
జగదేక విభుని రాణి! అదిగో నీపతి శ్రీ వెంకటేశ్వరుడు నిన్ను మెచ్చి
వచ్చెను. పక్కనున్న చిలుకలు (అనగా ప్రపంచంలోనివారు) నిన్ను తమ పలుకులతో అనేక వూహలు జనియించునట్లు చేయుదురు.
చరణం 3: (అన్నమాచార్యులు ‘అలమేలుమంగ’గా అనుభూతి చెందుతూనే) తెల్లని చంద్రబింబము వంటి ముఖము గలదానా! అలంకరణలతో
! నాలుగు విధములుగా కారణము లేకయే మానవుల మనసులలో దూరి వారి సంకల్పములను
మార్చివేయుదానా! సరి అయిన సమయము కొరకు ఆలోచనలలో సతమతమవ్వద్దు. హితముకోరు శ్రీ వెంకటేశ్వరుడు నిన్నేప్పుడో
కూడినాడు.
విపులాత్మక వివరణము
ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల కీర్తనలలో నిష్కాపట్యము, ఉన్నది ఉన్నట్లుగా చెప్పుట వారి
కవిత్వంలోని విశేషం. ఈ కీర్తనలోని మాటలు 20వ శతాబ్దంలో
మహామహులైన మనస్తత్వవేత్తలు చెప్పినదానితోటి సరిపోలుట అన్నమాచార్యుల దార్శినికతకు కేతనము.
వారు సూచించిన అనేక సత్యములను ఈనాటి విజ్ఞానశాస్త్రం ఇంకను కొలవలేక
పోయింది.
అధ్యాత్మ కీర్తన: రాగిరేకు: 253-4 సంపుటము: 9-16 |
కల
దింతె మాఁట కంతుని యాఁట
తెలుసుకో
నీలోనిదియె పూఁటపూఁట ॥పల్లవి॥ అలమేలుమంగా
హరియంతరంగా
కలితనాట్యరంగ
కరుణాపాంగ
చెలువుఁడు
వీఁడె చేకొను నేఁడె
వలరాజుతూపులివి
వాఁడిమీఁది వాఁడి ॥కల॥ అలినీలవేణి
యంబుజపాణి
వెలయంగ
జగదేకవిభునిరాణి
కలయు
నీ పతి వచ్చె గక్కన నిన్నిదె మెచ్చె
పలికీని
చిలుకలు పచ్చి మీఁదఁబచ్చి ॥కల॥ సితచంద్రవదనా
సింగారసదనా
చతురదాడిమబీజచయరదనా
యితవైన
శ్రీ వెంకటేశుఁడు నిన్నిదె కూడె
తతిఁ
దలపోఁతలు తలకూడెఁ గూడె ॥కల॥
|
Details and explanations:
ముఖ్య
పదములకు అర్ధములు: కంతుని యాఁట = మన్మధుని లీల;
భావము: మన ప్రపంచం అంతా మన్మధుని లీలయే. నీలో ఈ ఎడతెగని
కార్యకలాపాలను పూట పూటకు గమనించుటయే నీ విధి. నేర్చుకోవాల్సింది
ఇది ఒక్కటే.
వివరణము: ఈ పల్లవి మన మనసులను నిర్దేశించు
దానిని తెలుపుతున్నది దీనిని గమనించక మనం చేపట్టు కార్యములన్నియు అజ్ఞానంలోకి
వచ్చును అనునది స్పష్టము. “సెక్స్ (ప్రణయము) అనేది మనందరికీ ప్రధాన ప్రేరణ మరియు సార్వత్రిక హారము. అత్యంత వివేకంతో, స్వచ్ఛంగా కనిపించే వ్యక్తులు కూడా వారి
లైంగిక కోరికలకు మరియు వ్యక్తీకరణకు వ్యతిరేకంగా చాలా కష్టపడవచ్చు” అని విశ్వ
విఖ్యాతి నందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు అన్నారు.
మనము దేనితో చేయబడిన వారమో అదియే మనలను నిర్దేశించు చున్నది. ఈ రకంగా ప్రకృతికి ఒడబడి మానవుడు
కార్యములు చేపట్టును. దీనిపై రెనే మాగ్రిట్టే గారు వేసిన “ద
కల్టివేషన్ ఆఫ్ ఐడియాస్” అను పేరు గల 1928వ సంవత్సరపు
అధివాస్తవిక చిత్రము ద్వారా మరి కొంత విశదపరచుకుందాం.
ఆ కనపడుతున్న మానవుని ముందురి క్షేత్రము
నీలము ఆకు పచ్చ కలిగి ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో అస్పష్టంగానూ, రంగుల మిశ్రమంతో మారుతున్న క్రమముగా
మారుతున్న రంగుల మిశ్రమంతో పోను పోను అది గోధుమ రంగుల ఒక నదిలా అనిపిస్తుంది. ఆ బొమ్మ నుండి దూరంగా
పోతున్నకొద్దీ అది కణములు కణములుగా
(grainy flow) ఒక ప్రవాహంలాగా మారుతుండటం చూడవచ్చు. ఆ చెట్లను (ఆ మనిషిని) ఒక కృత్రిమమైన చదును నేలపై నిలబెట్టి; “ఆ నదిలో తాను తప్ప తక్కినవారందరూ కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తుంది”
అని సూచించారు.
నిద్ర నుండి మెలుకువలోనికి వచ్చుచూ, అతడు పూర్తిగా స్పృహలో లేనప్పుడు ఒక
వ్యక్తి అనుభూతి చెందగల వాతావరణాన్ని చిత్రం చూపిస్తుంది. ఒక రకమైన మంత్రముగ్ధతను, చెప్పలేని అనుభూతిని మన మనసులలో వుంచుతుంది
డ; కలలలో
తనను సమ్మోహనము (హిప్నోటైజ్) గావించిన దృశ్యమును తిరిగి పునర్నిర్మాణము చేయునటు వంటి
అనుభవమునకు కొంత దగ్గరగా అనిపింప చేస్తుంది.
కలల ద్వారా
సమ్మోహనము చేయబడి చేయబడినటువంటి ఒక భ్రమను కలిగిస్తుంది, ఈ అద్భుతమైన చిత్రంతో రెనే మాగ్రిట్టే
మనలో చెలరేగు వూహలు ఆలోచనలు మనకు తెలియకనే
జీవులన్నింటినీ (మనుషులను) ఆవరించియున్న అలోచనా
తరంగములతో ఏర్పడిన నదివంటి దానిలో భాగమైపోతాము అని చెప్పారు. ఎవరికి వారికి తాను
తప్ప మిగిలిన వారందరూ బ్రాంతికి గురి అవుతున్నారు అనిపిస్తుంది.
ఈ రకముగా మానవుల అందరి ఆలోచనా విధానములు ఒక
సార్వజనిక తరంగములతో
కలుపబడి దానికి అనుగుణముగా ప్రవర్తించుటకు ఉద్యమిస్తాడు ప్రపంచమంతటినీ
చుట్టిముట్టి ఉన్న ఈ ఆలోచన తరంగములు ముఖ్యముగా కామ ప్రధానములై ఉండును.
రెనే మాగ్రిట్టే గారు అన్నమాచార్యులు గారు విషయాన్ని
చెబుతున్నారు అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ విధముగా పైపైకి మనం స్వతంత్రముగాఁ యోచనలు
చేయుచున్నట్లు కనపడినాను అంతర్గతముగా మనము స్వతంత్రులము కాము. అందుకే
అన్నమాచార్యులవారు “తెలుసుకో నీలోనిదియె పూఁటపూఁట” అని
హెచ్చరించారు. అనగా
మన జీవితమంతా వీని పట్ల అప్రమత్తతతో ఉండవలెను అని సూచన.
అన్వయార్ధము: భీష్మించుకుని కూర్చున్నప్పటికీ, మన్మధుని ప్రేరణతో కలిగిన ఆలోచనలు మనలను
మనం ఉన్న స్థితి నుండి కూకటి వేళ్లతో సహా
పెకిలించి ప్రవాహం వెంబడి తీసుకు పోవుచున్న {“నీవు కూడా అందరి లాగానే కొట్టుకుపోతున్న”} సంగతి
గమనించగలవా ?
అన్నమాచార్యుల ఆంతర్యము: అన్నమాచార్యులు మానవులందరూ ప్రణయము లేదా కామము అను వానిలో
కొట్టుకొనిపోవుచున్నారని; ఎవరు దానికి మినహాయింపు కాదని; ఈ సత్యం తమలో తాము గ్రహించు వారికి సత్యం వైపు నడుచుటకు అవకాశం కలదని
చెబుతున్నారు.
ముఖ్య పదములకు అర్ధములు: కలిత
= తెలుసుకొనబడినది; లెక్కింపబడినది; పొందబడినది; కలితనాట్యరంగ=
being conscious of such dance of cupid, అలాంటి మన్మథుడి నృత్యం పట్ల
స్పృహ కలిగి ఉండి; కరుణాపాంగ
= కరుణ పొంగగా (let the compassion overwhelm); చెలువుఁడు వీఁడె = తగిన చెలికాడు వీఁడె; వలరాజు
= మన్మథుని; తూపులివి = బాణములివి.
భావము: ఓయీ మానవుడా మన్మధుని వాడియైన బాణములనుండి తప్పించుకొనుటకు
హరిని నీ అంతరంగమున నిలిపి; హృదయముపై కామదేవుని నాట్యము పట్ల స్పృహ కలిగి ఉండి;
హృదయంలో కరుణ పొంగఁగా తగిన చెలికాడు నేడే హరీని చేకొనుము.
వివరణము: అలమేలుమంగా అను సంబోధనతో అన్నమాచార్యులు
తననుతాను ‘స్త్రీ’గా సూచించుకొనుచున్నారు. అనేకానేక శృంగార కీర్తనలలో వారిని వారు అలమేలుమంగ అని చెప్పుకున్నారు.
ఈ కీర్తనలో కాముని తీక్షణమైన బాణముల నుండి
తప్పించుకొనుటకు ఒకే ఒక మార్గం కలదు అని చెప్పుతున్నారు. “నేడే” అనగా సమయం సమయాతీతం కాకుండా శీఘ్రమే ఆ బాటను చేపట్టమని ఆచార్యులు సెలవిస్తున్నారు.
అనేకమంది మహానుభావులు తమను తాము తెలియ
ప్రయత్నములో వారీ మదిలో కరుణ ఉప్పొంగి ప్రజలకు నిస్వార్ధంగా సేవచేయుటను మనం
గమనిస్తూనే ఉంటాం ఇక్కడ ‘కరుణాపాంగా’ అని వ్రాయడం దీనిని సూచించుటకే.
ముఖ్య
పదములకు అర్ధములు: అలి = తుమ్మెద; నీలవేణి = నల్లని కురులు; అలినీలవేణి = తుమ్మెదలవంటి నల్లని కురులు కలదానా; చిలుకలు = పరులు;
భావము: (అన్నమాచార్యులు తననుతాను ‘అలమేలుమంగ’గా అనుభూతి చెందుతూ తనలో తాను ఇలా
అనుకొంటున్నారు). తుమ్మెదలవంటి నల్లని కురులు కలదానా! పద్మమువంటిదానా! జగత్తునంతా వెలుతురుతో నింపిన జగదేక విభుని రాణి!
అదిగో నీపతి శ్రీ వెంకటేశ్వరుడు నిన్ను మెచ్చి వచ్చెను. పక్కనున్న చిలుకలు (అనగా ప్రపంచంలోనివారు) నిన్ను తమ పలుకులతో అనేక వూహలు
జనియించునట్లు చేయుదురు.
వివరణము: ఇక్కడ అన్నమాచార్యులు భగవంతుని ఏకదీక్షతో వెంబడించ వలెనని; పరుల
పలుకులను లక్ష్య పెట్టిన స్వామి సాన్నిధ్యము సాధ్యం కాదని చెబుతున్నారు.
అన్నమాచార్యుల ఆంతర్యము: భగవంతుని సమీపించు క్షణములలో బహూ ఆలోచనలు అటు ఇటు లాగుచుండగా మన మనసు ఆ పచ్చిపచ్చి విషయములపై పారును అని అన్నమాచార్యులు సెలవిచ్చారు. మన మనసు ఏదో ఒక దానిని పట్టి నిలిచినదే కానీ దానికి స్వయంప్రతిపత్తి లేదు. మనిషి తాను అన్నీ తెంచుటకు సిద్ధంగా ఉన్నప్పుడు మనసు ఏదోఒక దానిని ఆధారముగా చేసుకొనుటకు చేయు ప్రయత్నమును పచ్చి మీఁదఁబచ్చి అని సూచించారు.
ముఖ్య పదములకు అర్ధములు: సితచంద్రవదనా
= తెల్లని చంద్రబింబము వంటి ముఖము గలదానా; సింగారసదనా = అలంకరణలతో నిర్మించబడినదానా = (మానవుల వూహలలో జీవము పోసుకున్న
దానా); అబీజచయరదనా = {అబీజ = విత్తులు లేని; చయ
= సమూహము, పోగు చేయబడ్డది; రదన
= పల్లు, దీనితో నములుదురు} కారణము
లేకయే మానవుల మనసులలో దూరి వారి సంకల్పములను మార్చివేయుదానా; చతురదాడిమబీజచయరదనా = నాలుగు
విధములుగా కారణము లేకయే మానవుల మనసులలో దూరి వారిపై దాడి చేయుదానా; తతిఁ = అదను, సమయము;
భావము: (అన్నమాచార్యులు ‘అలమేలుమంగ’గా అనుభూతి చెందుతూనే) తెల్లని చంద్రబింబము వంటి
ముఖము గలదానా! అలంకరణలతో ! నాలుగు
విధములుగా కారణము లేకయే మానవుల మనసులలో దూరి వారి సంకల్పములను మార్చివేయుదానా!
సరి అయిన సమయము కొరకు ఆలోచనలలో సతమతమవ్వద్దు. హితముకోరు శ్రీ వెంకటేశ్వరుడు నిన్నేప్పుడో కూడినాడు.
వివరణము: ఇక్కడ అన్నమాచార్యులు కొంచం ఉల్టాగా వ్రాశారు.
వెంకటేశ్వరుడు ఎప్పుడో మానవుని కూడినప్పటికీ, అతడు ఆలోచనా పరంపరలలో
చిక్కుకొన రాదు అన్నది స్పురింపజేసారు. ఒక్క ఆలోచన కూడా వేరొక
దానికి, దాని నుండి మరొక
దానికి దారి తీస్తూ అధోగతికి మార్గము వేయును.
మానవులు తగిన కారణము లేకనే
తమ ఆలోచనలను మార్చుకుంటూ జీవించడము సూచించారు. ఇక్కడ ‘సింగారసదనా’తో మానవులందరి చైతన్యము అలంకరణలతోను ఊహలతోను ఉత్ప్రేరణలతోను నిర్మించబడినదని
తెలుపుచున్నారు.
తతిఁ దలపోఁతలు తలకూడెఁ
గూడె: ఇక్కడ 'తతిఁ తలపోతలు' అనునది మానవులందరూ
సమయము అను దాని కోసం వేచి చూస్తూ ఉంటారు అని
సూచిస్తున్నది. ఇది సరైన సమయం అని చెప్పుటకు అవకాశం ఇవ్వక భగవంతుని ఉన్నపళంగా
ఆశ్రయించాలని ఉద్భోధ చేయుచున్నారు.
-x-సమాప్తము-x-
మాయా జగత్తు భ్రమలో పడవేసి మనలో మనమే యేర్పరచుకొన్న ఆలోచనా తరంగములే మనలను మన సహజస్థితి నుంచి వెలుపలకు నెట్టివేస్తున్నవి.మన్మథుని ఈ లీల పట్ల అప్రమత్తులమై ఇంద్రియముల కార్యకలాపములను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటిపై స్పృహ కలిగియుండి, హరిని అంతరంగమున నిలిపి, సత్యమార్గంలో ప్రయాణించక పోతే సత్యమును కనుగొనలేమని అంటున్నారు అన్నమయ్య.
ReplyDeleteరినే మాగ్రిట్టే గారి చిత్రంలో చెట్టు వలె కనిపించే మానవుని మస్తీష్కములో ఏర్పడే అస్పష్టమైన భావనలు,తాను తప్ప అన్యులదంరూ కామప్రచోదిత ఆలోచనా తరంగముల ప్రవాహంలో కొట్టుకొని పోవుచున్నట్లు గోచరిస్తున్నది.
బాహ్యముగా మనం స్వతంత్రుల మని అనిపించినా అంతర్గతంగా ఆస్వతంత్రులమే.ఈ విషయాన్ని గమనించు మానవుడా యని అన్నమయ్య ఈ కీర్తనలో అంటున్నారు.
ఓమ్ తత్ సత్
కృష్ణ మోహన్
🙏🏻🙏🏻🙏🏻