Friday, 2 February 2024

T-193 వెలినుండి లోనుండి వెలితిగాకుండి

                                                           అన్నమాచార్యులు 

వెలినుండి లోనుండి వెలితిగాకుండి

వ్యాఖ్యానము: చామర్తి శంకర నాగ శ్రీనివాస్

 

ఉపోద్ఘాతము: ఈ  కీర్తనలో అన్నమాచార్యులు బయటనుండి లోపల నుండి విషయములను గ్రహించు మనసును గురించి చెప్పారు. అదే సమయంలో గాలి అంటూ కానరాని దైవమును కూడా సూచించారు.

 

ఈ  కీర్తన క్రింది భగవద్గీత శ్లోకమును వివరముగా తెలుపుచున్నది​ సర్వతః పాణిపాదం తత్సర్వతోఽక్షిశిరోముఖమ్ సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ।। 13-14 ।। (భావము: సర్వత్రా దైవము చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు, మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు.)

 

అలాగే​ మానవునికి సత్యమునకు మధ్య ఏర్పడిన అంతరమును గాలి అని కూడా సూచించారు. ఇక్కడ గాలి అనునది అగోచరత్వమునకు చిహ్నము.

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు:  70-4 సంపుటము: 5-232

వెలినుండి లోనుండి వెలితిగాకుండి
వెలి లోను పలుమారు వెదకేవె గాలి ॥పల్లవి॥
 
పండువెన్నెలలకునుఁ బ్రాణమగు గాలి
నిండుఁగొలఁకులలోన నెలకొన్న గాలి
బొండుమల్లె లతావిఁ బొడవైన గాలి
యెండమావులఁ బోలితేలయ్య గాలి ॥వెలి॥
 
కొమ్మావిచవికెలోఁ గొలువుండు గాలి
తమ్మికుడుకులఁ దేనె దాగేటి గాలి
యిమ్మయిన చలువలకిరవైన గాలి
కుమ్మరింపుచు వేఁడి గురిసేవె గాలి ॥వెలి॥
 
తిరువేంకటాదిపైఁ దిరమైన గాలి
సురతాంతముల జనులఁ జొక్కించు గాలి
తొరలి పయ్యదలలోఁ దూరేటి గాలి
విరహాతురులనింత వేఁచకువె గాలి ॥వెలి॥



Details and explanations:

                                            వెలినుండి లోనుండి వెలితిగాకుండి
                                            వెలి లోను పలుమారు వెదకేవె గాలి       ॥పల్లవి॥

ముఖ్య పదములకు అర్ధములు: వెలినుండి = బయటనుండి; వెలితిగాకుండి = ఏ మాత్రము తక్కువ గాక వుండి (= నిండుగా వుండి)  

భావముమానవుడా! బయటలోను లోపలలోను వెలితి లేకుండా నిండి వున్న  ఆ దైవమును తిరిగి తిరిగి బయట వెదకేవు దేనికని

వివరణము: భగవద్గీతలో చెప్పినట్టు బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ  దైవం విశ్వమంతా నిండి ఉన్నదని అన్నమాచార్యులు కూడా తెలుపుతున్నారు.

దైవమును మూలమూలలా వాడవాడలా కొండలలో కోనలలో వెతుకుతూ ఉంటాం కానీ ఎవరికీ దైవము కనపడిన దాఖలాలు లేవు. దీని మూలమున సమయం వృధా అవుతున్నదే కాని మానవుడు దైవమును తెలియలేడు. సత్యమును స్పృశించలేడుఅన్నదానిని తెలుపుతున్నారు అన్నమాచార్యులు. కాబట్టి మన ఇప్పటి పద్ధతులకు భిన్నంగా సరికొత్త పంథాను ఎంచుకొన వలెను.

సర్వవ్యాపి అయిన భగవంతుని వెదుక నవసరం లేదు అన్న విషయాన్ని నొక్కి చెబుతున్నారు అన్నమాచార్యులు. “భగవంతుడు లేనిదెక్కడ?” అంటే మనం చూచు చూపులలో భేదమున్నది. అనగా మన దృక్కోణం మార్చుకోవలెను; అంతే గానీ భగవంతుని చూచుటకు ఆసక్తి చూపిన కనబడడు.

అన్నమాచార్యులు ప్రజల లో తాను చూచిన సత్యమును తెలుపుటకు సర్వవిధముల ప్రయత్నించిరిఅని  ఘంటాపథంగా చెప్పవచ్చు. కానీ తెరలు కప్పి ఉన్న మన హృదయములకు వానిని గ్రహించు శక్తి లేదు. భగవంతునికై మనం వెచ్చించే సమయం అతి స్వల్పం. ఇటువంటి అరా కోరా ప్రయత్నములను, పూర్తి  విశ్వాసం లేని మన అవివేకమును అన్నమాచార్యులు విమర్శించిరి.

భగవంతుడు ఎందుకు కనపడడు: ఈ విషయం మనం ఇంతకు ముందు చర్చించుకున్నప్పటికీ ముఖ్యంగా గమనించాల్సింది భగవద్గీతలో చెప్పిన అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే” (13-13) విధముగా భగవంతుడు ఉన్నాడని కానీ లేదని కానీ నిర్ధారించలేం. ఉదాహరణకు దీనిని రీని మాగ్రిట్ గారు వేసిన “The Seducer” (మరులుకొలుపు వాఁడు) అధివాస్తవిక చిత్రము ద్వారా విశద పరచుకుందాం.


ఈచిత్రంలో సముద్రం మీద పోతున్న ఓడ దాని వెనుక మబ్బులతో కూడి ఉన్న నీలి ఆకాశం కనపడుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆ ఓడ కూడా సముద్రపు నీటితోనే చేసినట్లు తెలుస్తోంది తెలుస్తుంది. అనగా మనము చూచు ప్రపంచము ఏ పదార్థంతో తయారు చేయబడినదు అదే పదార్థంతో మనం కూడా చేయబడ్డాం.  

కాబట్టి. ఆ పదార్థమునకు తాను నీరు అన్న స్పృహ ఉండదు అనగా ఆ పదార్థం తనను తాను తెలియలేదు.  ఇక్కడ మనము గమనించవలసినది ఓడ యొక్క ఆకారం మాత్రమే విడిగా ఉన్నది. దాని ఆస్తిత్వం ఆ నీటికి సంబంధించినది.  కావున ఆ ఓడకు తనకుతానుగా ఆస్తిత్వం ఉండదు ఈ రకంగా చూచిన మానవుడు తననుతాను ఎప్పటికీ తెలియలేడు. కాబట్టి మానవునికి చేయవలసిన పని దైవము వెతుకుట కాదు తనను ఆవరించి ఉన్న అజ్ఞానపు తెరలు గమనించి ఊరకుండుట. అదియే భగవద్గీతలో చెప్పిన సమత్వము.

                                పండువెన్నెలలకునుఁ బ్రాణమగు గాలి
                                నిండుఁగొలఁకులలోన నెలకొన్న గాలి
                                బొండుమల్లె లతావిఁ బొడవైన గాలి
                                యెండమావులఁ బోలితేలయ్య గాలి     ॥వెలి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: కొలఁకువు = కొలను, తటాకము; బోలితేలయ్య = పోలితేలయ్య = పోలి తేలయ్య = పోలి తేలిపోయె (=అన్వయము: కనబడనట్టి) 

భావముపండువెన్నెలలకు ప్రాణమిచ్చునది ఈ గాలి. నిండు కొలనులకు ప్రాణమీ గాలి. బొండు మల్లెల పరిమళము ఎంతో దూరం వ్యాపింప చేయునదీ గాలి. ఐనా, దాని వెంటపడుట ఎండమావులలో నీరు వెతుకునట్టే.

వివరణము:  అన్నమాచార్యులు చెబుతున్నది మనం ఉన్నటువంటి ఈ ప్రపంచం ఒక అలౌకిక సమ్మేళనము. ఇందు జీవ జడ పదార్థము లకు భేదము లేదు#1.  పండువెన్నెలలకు, నిండు కొలనులకు, బొండుమల్లెలకు, ఎండమావులకు ఆధారం ఒకటే. చివరి చరణము కూడా చూడండి.

                            కొమ్మావిచవికెలోఁ గొలువుండు గాలి
                            తమ్మికుడుకులఁ దేనె దాగేటి గాలి
                            యిమ్మయిన చలువలకిరవైన గాలి
                            కుమ్మరింపుచు వేఁడి గురిసేవె గాలి      ॥వెలి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: చవికె = కూటము, మండపము; తమ్మి = మోహము, తమకము; తమ్మికుడుకులఁ దేనె = మోహము, తమకముల ఉడుకులలో సంభవించు తేనె; 

భావముమామిడి చెట్ల కొమ్మలనే మేడల్లో కొలువు ఉంటుందిట ఈ గాలి మోహము, తమకముల ఉడుకులలో సంభవించు తేనెల వెనక దాగి ఉంటుందిట ఈ గాలి. చల్లని చలువను కలిగిస్తుందిట ఈ గాలి. అలాగే అప్పుడప్పుడు వేడిగాలి కూడా కుమ్మరిస్తుందట ఈ గాలి.

వివరణము: చివరి చరణము చూడండి.

                            తిరువేంకటాదిపైఁ దిరమైన గాలి
                            సురతాంతముల జనులఁ జొక్కించు గాలి
                            తొరలి పయ్యదలలోఁ దూరేటి గాలి
                            విరహాతురులనింత వేఁచకువె గాలి      ॥వెలి॥


ముఖ్య పదములకు అర్ధములు: సురతాంతముల = స్త్రీపురుషుల కలిసి విడిపోవుటలు; చొక్కించు = పరవశతను పొందించు, మత్తుకమ్మేటట్టు చేయు; తొరలి = ఆర్చు, ౘల్లార్చు, allay, quench;  పయ్యదలలోఁ = పైటలలో;

భావముస్థిరముగా తిరువేంకటాద్రి మీద తిరుగునట ఈ గాలి. స్త్రీపురుషుల కలిసి విడిపోవుటలను మత్తును కమ్మేటట్టు చేయునట ఈ గాలి. స్త్రీల పైటలలో దూరి విరహాతురులను వేధిస్తుందట ఈ గాలి.

వివరణము: ఈ రకముగా అన్నమాచార్యులు  మానవునికి ప్రకృతి సవాలు విసురుతుందని; తమకములోను విరహములోను, స్త్రీల పైటలలోను దూరి విరహాతురులను వేధిస్తుందని సెలవిచ్చారు.

దీనికి ప్రతిగా మానవుడు స్పందించి ఈ భూమండలమున తన జాతి సంఖ్యను పెంచుకునేను కానీ సత్యం వైపు అడుగులు వేయలేడు. దీనినే మనము ఈరోజు చూడగలుగుతున్నాం.

అనగా సత్యం వైపు ప్రయాణం మానవుడు చేయగలడు అతడు చేయగలిగినదంతా తననుతాను అర్పించుకొనుట. తక్కిన కార్యక్రమములు, చేష్టలు సత్యం వైపు ప్రయాణం కావు; కావున పనికిరానివే.

No comments:

Post a Comment

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...