Sunday, 18 February 2024

T-195 చూచే చూపొకటి సూటిగుఱి యొకటి

 అన్నమాచార్యులు

195 చూచే చూపొకటి సూటిగుఱి యొకటి

కీర్తన సారాంశం:

పల్లవి: సూటిగా చూచే చూపొకటియే దైవత్వమునకు దారి.

చరణం 1: ఏనుగును మదిలో తలచిన ఏనుగులాగాను, మానును తలచిన మానులాగాను, పెద్దకొండను తలచిన పెద్దకొండలాగాను గోచరించును ఈ  మనోగోచరుఁడగు దైవము. 

చరణం 2: దైవము లోన కాక బయట నున్నాడు అని తలచిన అటులనే అనిపింప చేయును. అటులనే సముద్రము (లోతైన వాడు, విశాలమైన వాడు) అనుకొన్న అటులనే కాన్పింప చేయును. దైవమును అందరిలో (పట్టణములో) చూడబోయిన బహురూపమై తోచును. ఏ రకముగా చూడబోతే మనోగోచరుఁడు దైవమే ఆ రకముగా తట్టును.

చరణం 3: మానవుడా నీవు శ్రీవేంకటాద్రిమీఁది శ్రీపతిని తలచిన శ్రీవేంకటాద్రీశుని బొమ్మ మాత్రము నీవు వూహించినట్లు కనబడును. కానీ  మనోగోచరుఁడగు పరమాత్మయే సమస్తమును ఆవరించియున్నాడు. ప్రత్యక్షముగా ఎదురుగా వున్నవాడు పరమాత్మ. జీవాత్మ కేవలము భావమే.

 

విపులాత్మక వివరణము

 

ఉపోద్ఘాతము: ఏ మతమైననూ నిర్మాల్యం లేని అంతరంగమునే బోధించుచున్నది. మనమందరమూ "ఆ దైవమేమీ?"  అను మీమాంసలో పడి జీవించుదుము. మన శక్తి కొలది మనకై మనము ఏర్పరచుకున్న ప్రమాణములను బట్టి మనము శుద్ధులమైతిమి అనుకుంటూ భగవంతుని వెదుక బోతాము. మన మేరలేమి? శాస్త్రములేమి? కొలతలేమి? కొలమానికలేమి? అని క్షణమైనా నిలువక ఆలోచింపక భగవంతునికై అర్రులు చాచెదము.. 

అతి విశిష్టమైనది అనదగు ఈ అన్నమాచార్యుల కీర్తనలో, మన మూలప్రమాణములను ప్రశ్నించుచున్నారు ఆచార్యులు. బహుళముగా దోచు ఈ ప్రపంచ మంతయును ఒకే కారణముచేత నడుచుచున్నదని తెలియుటకు మన వద్ద చెప్పుకోదగ్గ ఆధారములు లేవు. కానీ, నేను 'దైవము'ను కనుగొనగలను అను అహంభావముతో జీవించుదుము. "నేను కనుగొనగలను" అనునదియే అసత్యము. దీనిపై నిలిచి వున్న అన్ని వ్యవస్థలు నిరాధారములే.  

అన్నమాచార్యులు తాను ప్రత్యక్షముగా తెలుసుకున్నది, వాస్తవంగా అనుభూతి చెందిన సత్యములని ప్రకటించిరి.  వారు సంప్రదాయమునకు పెద్దపీట వేయక,  సామాన్యుడి మదిలో కదలాడు చిన్న చిన్న ఉదాహరణలు తీసుకొని కవిత్వం చెక్కినారు. 15వ శతాబ్దమునకు ఈ కీర్తన వారి యొక్క పరిశీలనా శక్తికి ఉదాహరణ.  

ఈ పల్లవి అసందర్భముగా, ముందువెనుకలు ఎంచకుండా మధ్యలో నుంచి చెప్పినట్లు అనిపింప చేసి  పాఠకులను, వినువారిని ఆలోచింపజేస్తాయి. వారి యీ ప్రక్రియ నూతనమూ అసాధారణమూ అనిపిస్తుంది

 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు:  134-5  సంపుటము: 2-141

చూచే చూపొకటి సూటిగుఱి యొకటి
తాచి రెండు నొకటైతే దైవమే సుండీ           ॥పల్లవి॥
 
యేనుగఁ దలఁచితే యేనుగై పొడచూపు
మాను దలఁచిన నట్టే మానై పొడచూపు
పూని పెద్దకొండ దలపోయఁ గొండై పొడచూపు
తానే మనోగోచరుఁడు దైవమే సుండీ           ॥చూచే॥
 
బట్టబయలు దలఁచ బయలై పొడచూపు
అట్టె యంబుధి దలఁచ నంబుధియై పొడచూపు
పట్టణము దలఁచిన పట్టణమై పొడచూపు
తట్టి మనోగోచరుఁడు దైవమే సుండీ            ॥చూచే॥
 
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీపతి దలఁచితేను
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీపతై పొడచూపు
భావమే జీవాత్మ ప్రత్యక్షము పరమాత్మ
తావు మనోగోచరుఁడు దైవమే సుండీ           ॥చూచే॥

 

Details and explanations: 

చూచే చూపొకటి సూటిగుఱి యొకటి
తాచి రెండు నొకటైతే దైవమే సుండీ     ॥పల్లవి॥

ముఖ్య పదములకు అర్ధములు: తాచు = తాకజేయు;

భావము:  సూటిగా చూచే చూపొకటియే దైవత్వమునకు దారి.

వివరణము: మనము చూచిన దానిని గురుతుపట్టవలెనన్న ఒక కిరణము చూచిన వస్తువు నుండి; ఇంకొక సంకేతం (కిరణము)  మది (లేక స్మృతి) అను గ్రంథాలయము (లైబ్రరి) నుండి కలువ వలెను. ఈ రెంటిలో రెండవది మనను బాధించు చున్నది. కాబట్టి చూచు వస్తువును కాదు, చూచే చూపును మార్చుకొనవలెను. అంటే మన చూపులు ఊహలు; గత స్మృతులను ప్రేతముల మీదుగా పయనిస్తూ వచ్చి మనకు సూటిగా కాకుండా వక్రముగా చూపిస్తాయి.  అన్నమాచార్యులు చెబుతున్నదిదే.

కానీ మన చూపులది వర్తుల మార్గము. క్రిందటి కీర్తన కల దింతె మాఁట కంతుని యాఁటనుండి మనలో మన ఊహలు జనించునది ఒక మేఘావృతమైన అలల నుండి అని తెలుస్తుంది. అనగా మన స్మృతి నుండి కలిగిన ప్రతిక్రియలు అన్నమాట. అలాగా అనేక విధములుగా పరావర్తనం చెంది ఆ వస్తువు; ఆ ఆకారం; ఆ శబ్దము; ఆ వాసన; ఆ స్పర్శ,  ఆ కంపనము, ఆ రుచి మనము ఇది వరకే దాచి ఉంచిన దానితో సరిపోల్చుకొని దానికి తగు సమాధానమును తయారు చేసుకుంటాం.  అనగా మనము ఒక వస్తువును గుర్తించు చర్యల్లో భాగంగా మనకు తెలియకుండానే మన లోపల ఈ కార్యక్రమం అంతా జరుగుతుందన్నమాట.

ఇక్కడ అన్నమాచార్యులు "సూటిగుఱి"తో దేనిని సూచించ దలచిరో విచారింతము. ముందుగా అనేక విధములుగా పరావర్తనం చెందని సూటి గ్రహణమును సూచించారు. అనగా వస్తువుల నుండి; దృశ్యముల నుండి వచ్చు కిరణములు ఎటువంటి వికారము, వక్రత నొందకుండా సూటిగా మతిలోనికి చొచ్చుకొనిపోవునో వానిని ప్రస్తావించారు.

అనగా మన ఇప్పటి దృక్కోణం లోపభూయిష్టమైనదని దాని మూలమున మనం సత్యం గ్రహించలేకున్నామని తెలియుచున్నది. కానీ అన్నమాచార్యులు పేర్కొన్న సూటి గురి నిజంగా సాధ్యమేనా విచారింతము. మత గ్రంథములన్నియు స్వచ్ఛమైన అంతరంగం ప్రతిపాదించుచున్నవి. అన్నగా ఏమాత్రం ముందస్తు అభిప్రాయం లేక ఉన్నదానిని ఉన్నట్టు గ్రహించుట సూచించబడింది. మన ఇందరి అనుభవముల నుండి అటువంటి పరిశుద్ధమైన అంతరంగము అసాధారణము. దాదాపు అసాధ్యము అని తెలియును.

దీనిని మరింత విశదముగా అర్ధం చేసుకోడానికి On the Threshold of Liberty (స్వేచ్ఛానుభవము  హద్దువద్ద​) అను పేరు గల సర్రియల్ చిత్రము ద్వారా తెలుసుకుందాము. ఈ బొమ్మలో ఎనిమిది పలకలు పేర్చి ఒక గది తయారు చేసినట్లు కనబడు కనపడుతుంది. ఈ పలకలను చూస్తే ఒక దాంట్లో అడవి, ఒక దాంట్లో ఆకాశము, ఇంకో దాంట్లో ఆకాశహర్మ్యముకు గవాక్షములు, చెక్కబల్లలు, చెక్కిన రాతి కట్టడం ఇలా కనపడుతూ ఉంటాయి. ఆ గదిలో నేలమీద ఒక ఫిరంగి పేల్చడానికి సిద్ధంగా ఉన్నట్లు కనబడుతోంది. అది కుడి చేతి వైపు నుండి ఎడమ చేతిపై వైపున ఉన్న పలకకు గురి పెట్టి దానిని కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ రకంగా​ ఆ బల్లలు మనిషికి స్వేచ్ఛకి మధ్య అడ్డుగోడగా నిలబడినట్లు; ఆ ఫిరంగి స్వేచ్ఛ కొరకు మానవుని ఉబలాటము సూచిస్తుంది.



ఈ చిత్రము ద్వారా మనిషి స్వేచ్ఛ అనుకున్నది ఉత్కంఠను; తహతహను విడుదల చేయుటకు మాత్రమే అని తెలుస్తుంది అంతేకానీ స్వేచ్ఛ కోసం మనిషి గురి పెట్టి తన మనస్సులో చెలరేగు తున్న భావనలను పట్టిన వాటిలో ఏదో ఒకదానివైపు తన దృష్టిని సారిస్తాడు. కానీ తనకు స్వేచ్ఛకు మద్య అడ్డుగోడలుగా నిలబడిన అన్ని పలకలు కలిపి సమూలంగా తొలగించిన కానీ తనకు స్వేచ్ఛ లభించదని గ్రహించడు. ఏదో ఒక దాని మీద విప్లవం ప్రకటించినను అది స్వేచ్ఛకు దారి తీస్తుందన్న హామీ వుండదు.

ఇక్కడ ఫిరంగి మానవుని తహతహలోని భాగమగు చర్యకు గురుతు. అది పెళుసు మాట కావచ్చు; తూటా అవ్వచ్చు; ముఖవళికలు కావచ్చు; విష ప్రయోగము అవ్వచ్చు; ఏదైనా విచ్ఛిన్న చర్యయే. మానవుడు తానెదుర్కోటున్న  సమస్తమును కలిపి ఒక్క సారి చూడలేడు. విడివిడిగా చూచుటకు; ఒకదాని తరువాత మరియొకటి సాధించుటకు ప్రయత్నము చేయును. ఒక దానిని స్వాధీనంలోకి తెచ్చు ప్రయత్నములో మిగిలినవి మరింత బలోపేతమయ్యి సమస్య జటిలమగును. కావున ఇది (మనిషి మానవునిగా రూపాంతరము చెందు క్రియ​) క్రమక్రమముగా సాధించతగినది కాదు.

కావున మనిషి వద్ద నిజముగాఁ చేయుటకు యుక్తులు కానీ; అందుకు తగిన సామర్థ్యము కానీ లేవు. ఈ రకంగా మనిషి తనలోతాను ఇటువంటి గ్రహింపుకు వచ్చినప్పుడు సహజంగా ఫిరంగి ఎత్తి పెట్టుటకు సాహసించడు. అనగా తనలోతాను పూర్తిగా నిశబ్దంలో మునిగి ఉంటాడు. ఆ స్థితిలో అతనికి; తాను చూచుచున్నదానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడును. ఇందులో మనసు ప్రమేయం ఉండదు. ‘తాచి రెండు నొకటైతే దైవమే సుండీ అన్న దాని అర్థం కూడా ఇదే.

అన్నమాచార్యుల ఆంతర్యము:   మనిషి చేయు అన్నిపనుల పైనా మనసు తనదైన ముద్రను వేస్తూ మానవుని బాధించుచున్నది. దానికి ఎటువంటి మందులు లేవు. మానవుడు తనను చుట్టిముట్టి ఉన్న  సర్వ సమస్యలను ఏక పాటున  ఒకే తాటిపై తీసుకువచ్చి తన వద్ద నిజముగా చేపట్టగల చర్యలు లేవని గ్రహించినప్పుడు అతనిని సహజముగా నిశబ్దము నిష్క్రియాత్మకత (సన్యాసము) ఆవరించును. అట్టి స్థితిలో మనసు జోక్యము లేకనే పరిసరములతో ప్రత్యక్ష సంబంధమును ఏర్పరచుకుంటాడు. అనగా మన ఇప్పటి స్థితిలో మనకు, ఈ ప్రపంచమునకు గల పరోక్ష సంబంధముతో మనము సత్యమును గ్రహింప లేకున్నాము. అందుకే చూచే చూపొకటి సూటిగుఱి యొకటి / తాచి రెండు నొకటైతే దైవమే సుండీ అన్నారు.

యేనుగఁ దలఁచితే యేనుగై పొడచూపు
మాను దలఁచిన నట్టే మానై పొడచూపు
పూని పెద్దకొండ దలపోయఁ గొండై పొడచూపు
తానే మనోగోచరుఁడు దైవమే సుండీ      ॥చూచే॥


భావము:  ఏనుగును మదిలో తలచిన ఏనుగులాగాను, మానును తలచిన మానులాగాను, పెద్దకొండ తలచిన పెద్దకొండలాగాను గోచరించును ఈ  మనోగోచరుఁడగు దైవము.

వివరణము:  “We are our choices.” said Jean-Paul Sartre. "మనమే మన ఎంపికలు." అన్నారు  జీన్-పాల్ సార్త్రే. అనగా మన అంతరంగము ఒక అద్దము వంటిది. అది మనము తలపోయు దానినే ప్రతిబింబించును.  అనగా మదిలో ఏది దాగి ఉన్నాను అది మన చూపులను సవరించు చున్నది. 

కాబట్టి ఎటువంటి నిర్మాల్యం లేని అంతరంగం అత్యంత ఆవశ్యకం.  ఏ రకముగా చూచినను అన్నమాచార్యులు మనసు మూల మూలలకు వెళ్లి వెతికి తీసిన సత్యములు కాదనలేని వాస్తవములు.  ఇక్కడ అన్నమాచార్యులు జీన్-పాల్ సార్త్రే గారు వ్యక్తపరిచినది ఒకటే అన్నది నిర్వివాదాంశం.  అనేక దృష్టాంతములలో అన్నమాచార్యులు వ్యక్తపరచినది, 20వ శతాబ్దపు మాహామహులు చెప్పిన వాటితో పోలిక వుండుటలో ఆశ్చర్యం లేదు.

 

బట్టబయలు దలఁచ బయలై పొడచూపు
అట్టె యంబుధి దలఁచ నంబుధియై పొడచూపు
పట్టణము దలఁచిన పట్టణమై పొడచూపు
తట్టి మనోగోచరుఁడు దైవమే సుండీ       ॥చూచే॥ 

భావము:  దైవము లోన కాక బయట నున్నాడు అని తలచిన అటులనే అనిపింప చేయును. అటులనే సముద్రము (లోతైన వాడు, విశాలమైన వాడు) అనుకొన్న అటులనే కాన్పింప చేయును. దైవమును అందరిలో (పట్టణములో) చూడబోయిన బహురూపమై తోచును. ఏ రకముగా చూడబోతే మనోగోచరుఁడు దైవమే ఆ రకముగా తట్టును.

వివరణము: Freedom is what we do with what is done to us.” said Jean-Paul Sartre "మనకు ఏది జరిగినా అదే స్వేచ్ఛ" లేదా మన మనసు, మన శరీరములపై యేది జరుగుతున్నదో, దానిపై ప్రతిస్పందన మనకు గల స్వేచ్ఛ   అన్నారు  జీన్-పాల్ సార్త్రే. 

మనకు గుర్తించగల సామర్థ్యం మాత్రమే ఉన్నది. ఈ చరణములో చెప్పినట్టు మనకు కనబడునది మన భావములో ఉన్నది మాత్రమే. కనుక మనకు గోచరించుచున్నది మన మనస్సులోని భావములే. ఈ రకముగా చూచినా మన ప్రతిక్రియలన్నీ వ్యర్థములే. 

పై రెండు పేరాలను కలిపి చూచిన,  ఏమీ చేయక వుండుటయే, నిజమైన స్వేచ్ఛ​.  భగవద్గీతలో పేర్కొన్న​ యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి (= ఎవడు ఆత్మను కర్తగానివానిగా తెలియునో అతడే నిజమైన ద్రష్ట) ​ కూడా ఇదియే బోధించుచున్నది. 

శ్రీవేంకటాద్రిమీఁది శ్రీపతి దలఁచితేను
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీపతై పొడచూపు
భావమే జీవాత్మ ప్రత్యక్షము పరమాత్మ
తావు మనోగోచరుఁడు దైవమే సుండీ      ॥చూచే॥ 

ముఖ్య పదములకు అర్ధములు:  తావు = స్థానము, చోటు, గృహము

భావము:  మానవుడా నీవు శ్రీవేంకటాద్రిమీఁది శ్రీపతిని తలచిన శ్రీవేంకటాద్రీశుని బొమ్మ మాత్రము నీవు వూహించినట్లు కనబడును. కానీ  మనోగోచరుఁడగు పరమాత్మయే సమస్తమును ఆవరించియున్నాడు. ప్రత్యక్షముగా ఎదురుగా వున్నవాడు పరమాత్మ. జీవాత్మ కేవలము భావమే.

వివరణము: ఇక్కడ అన్నమాచార్యులు వెంకటేశ్వరస్వామి మదిలో తలచుట  కంటెను సత్యమును, భావనలు వేరు వేరని గుర్తించుటకు ప్రాధాన్యతనిచ్చిరి. భగవద్గీత 2-48లో పేర్కొన్న సమబుద్ధి ఇదియే సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే (= కార్యము సిద్ధించినను సిద్ధించక పోయినను మనమున సమత్వమునతో నుండుట యోగమని భగవద్గీత పేర్కొన్నది). 

ఇప్పుడు క్రింది హిల్మా యాఫ్ క్లింట్ వేసిన ఎనిమిదవ హంస అను పేరు గల ఈ చిత్రమును చూడండి. వివిధ సంస్కృతులలో, హంస పరివర్తన, స్వచ్ఛత మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి చిహ్నంగా ఉంది. 'స్వానెన్-8', హిల్మా ఆఫ్ క్లింట్ తెలియజేయాలనుకున్న లోతైన ఇతివృత్తాలకు ఒక సబ్జెక్ట్‌గా మరియు ప్రతీకగా పనిచేస్తూ, హంస బహుళ పరిమాణాత్మక  (multi dimensional) పాత్రను పోషిస్తుంది. 



ఈ కళాకృతి కేవలం స్థిర (Static) చిత్రం కాదు; ఇందులో క్లింట్ గారు "అటు" "ఇటు"లను తారతమ్యములను చేధీంచుచూ ప్రపంచమునకు దైవమునకు మధ్య​  చలనశీల, క్రియాశీలలను ఆపాదిస్తూ, హుషారులను మేళవిస్తూ లీనమయ్యే అనుభవమును పట్టి వుంచారు. ఇందులో వీక్షకులు ఆధునికత, ఆధ్యాత్మికత మరియు భూలోకసంబంధమైన మరియు దైవికమైన వాటి మధ్య సంక్లిష్టమైన నృత్యం యొక్క ఛాయలను అన్వేషించవచ్చు. 

ఈ పటము రెండు భాగములుగా విభజించ బడియున్నది. పైభాగం నల్లని కణముల (క్రిస్టల్స్‌) తోను కిందిభాగం తెల్లని కణముల తోనూ ఉన్నాయి. ఒకటి సత్యము ఒకటి మన భావన. ఏది సత్యమో ఏది భావనయో తెలియుట కఠినము. భావమే జీవాత్మ ప్రత్యక్షము పరమాత్మ / తావు మనోగోచరుఁడు దైవమే సుండీ. అను పదముల అర్థము ఇదే. పరస్పరము విరుద్ధములగు వానిని ఒకే చోట చేర్చి సత్యమును గ్రహించుట అత్యంత సాహసోపేతమైన విషయము. దాదాపు అసాధ్యమైనటువంటి ఈ కార్యము నిర్వర్తించుటకు దైవసహాయం అత్యవశ్యకము. 

అన్నమాచార్యులు చెప్పిన దానిని, హిల్మా యాఫ్ క్లింట్ వేసిన ఎనిమిదవ హంసను దగ్గరగా పరిశీలించి చూచిన అది Coincidentia oppositorum అనిపించును. Coincidentia oppositorum అనేది "వ్యతిరేకతల కాకతాళీయం" అని అనువదించే లాటిన్ పదబంధం. ఇది నియోప్లాటోనిక్ పదం, ఇది వ్యతిరేకతలు ఒకదానికొకటి వ్యతిరేకించని స్థితిని (ఏకత్వమును లేదా యూనియన్‌) వివరిస్తుంది. 15వ శతాబ్దానికి చెందిన కార్డినల్, గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఆధ్యాత్మికవేత్త అయిన నికోలస్ కుసానస్ ప్రతిపాదించిన​ కాకతాళీయమైన ఒపోసిటోరమ్ (‘Coincidentia oppositorum”) అనేది దేవునికి " నిమ్న స్థాయి సూచకము (పేరు)

 

-x-సమాప్తము-x-

2 comments:

  1. In software and firmware technology this is called" looking London talking Tokyo " means aiming for one goal and distracted to the other. Only thru Sadguru one can align the human ideas to the nature or creators ideology..
    The other way around our Agnana is the one that drives one in opposite direction.
    Coincidentally this is what written Namavali today.
    యదార్ధయోగినోస్ఫటికోభావాయా శ్రీసాయినాధాయనమః స్ఫటికముతన సహజగుణములనెట్లు ప్రదర్శించునో నటులే మనుజుడు తనలోదాగిన గుణములను యోగులుయను ఙ్ఞానముద్వారా వెలికితీయుమని నేర్పిన సద్గురువునకు ప్రణామములు.

    సందర్భము: జన్మసంసారబంధఘ్నంస్వరూపానందదాయకమ్ (=జన్మయందలి కర్మానుసారము బంధములేర్పడునని భక్తియను నౌకలో యన్నియు పరమాత్ముని లీలలగును.)


    Yadardha yoginosphatiko bhavaya
    SreeSainathayanamaha

    Yadardha = reality;
    Spatko = quartz or crystal clearor alum;
    Bhavaya = views;

    Meaning#9
    Salutations to Sadguru for teaching me that "just like sphatika(crystals) everyone has natural qualities that are exposed and put to use with the help Yogis or true teachers"

    Reference :
    In Gurugeeta it says " Janma Samsara bandhagnam swaroopanada dayakaha"(= everything in this world is attached to us thru Karma cycle to bring at most joy thru devotion)"
    🙏🙏🙏

    ReplyDelete
  2. మనం చూసే చూపులు గతస్మృతులను స్పృశిస్తూ వచ్చిన కారణంగా వక్రదృష్టితోనే చూస్తున్నాము కాని సూటిగా చూడలేకున్నాము.మన యొక్క దృక్కోణం లోపములతో కూడియుండిన కారణాన మనం సత్యాన్ని చూడలేకున్నామని పల్లవిలో అన్నమయ్య సత్యగ్రహణంలో నున్న లోపాలనెత్తి చూపుతున్నారు.

    చరణము లన్నీ కూడా యిదే కారణంగా యిదే భావమును తెలియజేస్తున్నాయి.

    సర్రియల్ చిత్రం అద్భుతంగా పల్లవి భావాన్ని ప్రతిఫలించింది.
    శ్రీనివాస్ గారి వ్యాఖ్యనం అద్భుతం.
    ఓం తత్ సత్
    🙏🏻🙏🏻🙏🏻

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...