Sunday, 15 February 2026

T-305 ఎవ్వరివాఁడో యెఱఁగరాదు

 తాళ్లపాక అన్నమాచార్యులు
305 ఎవ్వరివాఁడో యెఱఁగరాదు
For English version press here

ఉపోద్ఘాతము

ఎవ్వరివాఁడో యెఱఁగరాదు —
ఈ జీవుడు ఎవ్వరివాఁడో ఇదమిత్థంగా యెఱఁగలేము
అన్నమాచార్యులు దీనిని ఒక వాస్తవ నిర్ధారణగా చూపుతున్నారు. 

కానీ మన మనసు అక్కడ ఆగదు.
యెఱఁగరాదన్న చోటనే యెఱుగుటకు ప్రయత్నం ముమ్మరం చేస్తుంది.
అదే అసలు తడబాటు. అదే మన నిజ ప్రవృత్తి.

ఈ కీర్తనలో అన్నమాచార్యులు
ఎవరివాడినో తెలుసుకోవమని పిలుపివ్వరు.
తెలుసుకోవాలనే ఆత్రుతనే ప్రశ్నిస్తారు.
జీవితాన్ని రెండు లోకాలుగా విడగొట్టే మన అలవాటును —
ఇహము, పరము;
ఇక్కడ, అక్కడ —
అన్న విభజనను ఆయన అంగీకరించరు.

ఇది రెండు లోకాల కథ కాదు.
ఇది ఒకటిగానే ఉన్న దానిలో కనిపించే వెలుగు–నీడల ఆట.
ఆ ఆటలో మనిషి తనను తాను ఒక పాత్రగా భావించి,
ఆ పాత్రకు యజమానిత్వం, అర్థం, గమ్యం కట్టబెట్టుకోవాలనుకుంటాడు.
అన్నమాచార్యులు ఆ ప్రయత్నాన్ని సూటిగా మన ముందుంచుతారు.

ఈ కీర్తనలో బోధ లేదు.
ఆశ్వాసము అంతకంటే లేదు.
మనిషి తనను తాను ఎక్కడ తప్పుగా అర్ధం చేసుకుంటున్నాడో
చూపించే నిశ్శబ్ద దర్శనం మాత్రమే. 

అధ్యాత్మ​ సంకీర్తన
రేకు: 95-2 సంపుటము: 1-472
ఎవ్వరివాఁడో యెఱఁగరాదు
అవ్వలివ్వలి జీవుఁ డాటలో పతిమే    ॥ఎవ్వరి॥

ధర జనించక తొలుత తనుఁ గానరాదు
మరణమందిన వెనక మఱి కానరాదు
వురువడి దేహముతో నుండినయన్నాళ్లే
మరలు జీవునిబదుకు మాయవో చూడ             ॥ఎవ్వరి॥

యిహములో భోగించు నిందుఁ గొన్నాళ్లు
మహిమ పరలోకమున మలయుఁ గొన్నాళ్లు
తహతహలఁ గర్మబంధములఁ దగిలినయపుడే
అహహ దేహికిఁ బడుచులాటవో బదుకు            ॥ఎవ్వరి॥

సంతానరూపమై సాగు ముందరికి
కొంత వెనకటిఫలము గుడువఁ దాఁ దిరుగు
యింతటికి శ్రీవేంకటేశుఁ డంతర్యామి
బంతి నితనిఁ గన్న బదుకువో బదుకు              ॥ఎవ్వరి॥
Details and Explanations:
పల్లవి:
ఎవ్వరివాఁడో యెఱఁగరాదు
అవ్వలివ్వలి జీవుఁ డాటలో పతిమే పల్లవి 
              Telugu Phrase
Meaning
ఎవ్వరివాఁడో యెఱఁగరాదు
ఈ జీవుడు ఎవరివాడో ఖచ్చితంగా తెలియదు
అవ్వలివ్వలి జీవుఁ డాటలో పతిమే
(అవ్వలివ్వలి = ఆవల – ఈవల; పరము – ఇహము; కనిపించేది – కనిపించనిది; ఆట = కదలిక, నృత్యము; పతిమే = ప్రతిమే )

సూటి భావము:

ఈ జీవుడు ఎవడో ఖచ్చితంగా తెలియదు. ఈ జీవము అను ఆటలో జీవుడు  ఒక  బొమ్మ మాత్రమే.


గూఢార్థవివరణము:

ఎవ్వరివాఁడో యెఱఁగరాదు”
ఇది మనసు అంగీకరించలేని ఒక వాస్తవం.
ప్రతి దానిని ఖచ్చితంగా నిర్ణయించు అలవాటు ఇక్కడ పనిచేయదు.
ఈ జీవితం ఎవరిది? — ఎవరికీ తెలియదు.

స్వీయ రక్షణ ప్రధానంగా ఏర్పడిన మనసుకు ఇది ఒక అఘాతము.
నిర్ణయాధికారాన్ని ఒక పట్టాన విడువదు మనసు.
అదే దాని ప్రధాన కదలిక.
అదే మానవుని ప్రధాన సమస్య.


పతిమే”
బొమ్మ మాత్రమే.
అతనికంటూ స్వతంత్ర పాత్ర లేదు.
కర్తృత్వం లేదు.
యజమానిత్వం లేదు.


అవ్వలివ్వలి”
ఇక్కడ–అక్కడ, ఇహము–పరము, జననము–మరణము అని మనం చేసే విభజన
మనసే సృష్టించిన కొలమానం.

అవ్వలివ్వలి జీవుఁ డాటలో ప్రతిమే
వెలుగు–నీడల ఆటలో ఒక రూపం మాత్రమే.
మనసే ఆ ప్రతిమకు కథను జోడిస్తుంది.
గతమని ఒక భాగం, భవిష్యత్తని ఇంకో భాగం కట్టి
మధ్యలో ఉన్న వర్తమానాన్ని తన కథతో ముసుగు వేస్తుంది.


జీవము అనంతము. జీవుడు ఒక ఆ జీవములో ఒక దశ మాత్రమే. జీవము యొక్క చైతన్యమును అనుభవిస్తున్నవాడు​​ ఈ జీవుడు. ఈ  చైతన్యము తాత్కాలికము. అదే మొదటి చరణములో చెప్పినారు.

అన్నమాచార్యులు ఈ నిర్మాణాన్ని కూలగొట్టరు.
దానిని మన ముందుంచి చూడమంటారు.

ఈ పల్లవిలో ఉపదేశం లేదు.
నిరాకరణ లేదు.
ఒక స్పష్టమైన నిలుపు మాత్రమే ఉంది:
నీవు ఎవరివాడివి?” అని నిర్ధారించాలనే ఆత్రుతే
జీవితమనే ఆటలో భాగమా?
అక్కడే ఈ కీర్తన ప్రారంభమవుతుంది.


మొదటి చరణం:

ధర జనించక తొలుత తనుఁ గానరాదు
మరణమందిన వెనక మఱి కానరాదు
వురువడి దేహముతో నుండినయన్నాళ్లే
మరలు జీవుని బదుకు మాయవో చూడ ॥ఎవ్వరి॥

Telugu Phrase
Meaning
ధర జనించక తొలుత తనుఁ గానరాదు
పుట్టకముందు భువిపై ఈ దేహం కనిపించదు
మరణమందిన వెనక మఱి కానరాదు
చనిపోయిన తరువాత కూడా కనిపించదు
వురువడి దేహముతో నుండినయన్నాళ్లే
(వురువడి= హింస, ఉగ్రత్వము, బలము, వేగము Violence, impetuosity, speed, haste) ఈ వేగం, మొండితనము, ఉత్సుకత, ఆవేశంతో నడిచే దేహముతో ఉన్నంతకాలమే
మరలు జీవునిబదుకు మాయవో చూడ
సరి చూచితే —ఆ తరువాత వెనుకకు మరలు ఈ జీవుని బతుకు మాయ కాదా

సూటి భావము:
పుట్టకముందు దేహం భువిపై కనిపించదు. మరణానంతరం కూడా కనిపించదు. ఈ ఆవేశభరిత, వేగముతో నడిచే దేహముతో ఉన్నంతకాలమే ఈ జీవితం కనిపిస్తుంది. సరి చూచితే —ఆ తరువాత వెనుకకు మరలు ఈ జీవుని బతుకు మాయ కాదా?

గూఢార్థవివరణము:
ఈ చరణంలో అన్నమాచార్యులు ఒక నిర్దాక్షిణ్యమైన పరిశీలన చేస్తారు.
 
"వురువడి దేహము" అన్నది కీలకము
గమనించవలసినది మన జీవితం ఒక నిశ్చల సాక్షిత్వ స్థితి కాదు.
ఇది ఒక నిరంతర ఆవేశపు కదలిక:
         కోరికల కుప్ప​
         భయాల వేగం
         ఆత్మరక్షణకై హింస
         గుర్తింపు కోసం పోరాటం
         నిరంతర తహతహ
వీని ప్రవాహంలోనే “జీవితం” అనిపించేది కనిపిస్తుంది.

మధ్యలో, ఈ ఆవేశపు కదలికలో మాత్రమే కనిపించే జీవితం —
అదిశాశ్వత సత్యమా?
అందుకే ఆయన తీర్పు ఇవ్వరు.
ఒక సంకేతము మాత్రము ఇచ్చారు.
నాలుగవ పంక్తి
మరలు జీవునిబదుకు మాయవో చూడ     
(=సరి చూచితే —ఆ తరువాత వెనుకకు మరలు ఈ జీవుని బతుకు మాయ కాదా)
అదే గమనించమని ఆహ్వానం.
ఈ ఆవేశపు కదలిక కొంత సమయము మాత్రమే. 

రెండవ​ చరణం:
యిహములో భోగించు నిందుఁ గొన్నాళ్లు
మహిమ పరలోకమున మలయుఁ గొన్నాళ్లు
తహతహలఁ గర్మబంధములఁ దగిలినయపుడే
అహహ దేహికిఁ బడుచులాటవో బదుకు ॥ఎవ్వరి॥ 
Telugu Phrase
Meaning
యిహములో భోగించు నిందుఁ గొన్నాళ్లు
ఇహలోకంలో అనుభవించే సుఖాలు కొంతకాలమే
మహిమ పరలోకమున మలయుఁ గొన్నాళ్లు
పరలోక మహిమలు కూడా కొంతకాలమే
తహతహలఁ గర్మబంధములఁ దగిలినయపుడే
తహతహలతో కర్మబంధములకు చిక్కినపుడే
అహహ దేహికిఁ బడుచులాటవో బదుకు
అయ్యయ్యో! దేహికికి జీవితం పిల్లల ఆటలాంటిదా?

సూటి భావము:
ఇహలోక సుఖాలు కొంతకాలమే. పరలోక మహిమలు కూడా అంతే. తహతహలతో కర్మబంధాలకు చిక్కినపుడే ఈ దేహి జీవితం పిల్లల ఆటలా మారుతోందా?

గూఢార్థవివరణము:
యిహములో భోగించు నిందుఁ గొన్నాళ్లు
మహిమ పరలోకమున మలయుఁ గొన్నాళ్లు

అన్నమాచార్యుల దృష్టిలో ఇహము–పరము అనే విభజనకు ప్రత్యేక ప్రాముఖ్యత లేదు.
ఆ రెండు వేరు లోకములు కాదు — ఒకే ప్రవాహంలోని రెండు దశలు మాత్రమే.

ఆయన ఒకదానిని నిరాకరించి మరొకదానిని ప్రతిష్ఠించరు.
రెండింటినీ ఒకే పదంతో పరిమితం చేస్తారు — కొన్నాళ్లు.”

అంటే —
రెండూ కాల పరిమితి లోనివే.


ఇక్కడ ప్రధాన పదము — తహతహ.”
ఇది సాధారణ కోరిక కాదు.
ఇది ఆతురత.
అసహనం.
లోపలి దహనం.
ఈ తహతహే కర్మబంధములకు కారణం.
బంధములు బయట నుండివచ్చేవి కావు —
ఆతురత వల్ల గట్టిపడిన ముడులు.

దగిలినయపుడే” —
తనకు తానే ఇరుక్కోవడం, చిక్కుకోవడం.

అప్పుడు —
అహహ దేహికిఁ బడుచులాటవో బదుకు.”
 
ఇక్కడ “అహహ” కీలకం.
ఇది తీర్పు కాదు.
ఇది విమర్శ కాదు.
ఇది నిస్సహాయస్థితిని ఆర్ద్రతతో చూపుతారు. 

పిల్లల ఆటలో ఏముంటుంది? క్షణిక ఉత్సాహం. దానిలోనే తీవ్ర భావోద్వేగం. వెనువెంటనే మర్చిపోవడం. ఇంకో ఆటలోనో, మరియొక దానిలోనో మునిగిపోవడం.
 
తహతహతో కట్టుకున్న జీవితం —దేహంతో తనను తాను సమీకరించుకున్న వానికి తాను చేయుచున్నది గంభీరముగా కనిపించునేమో!

ఆటలో ఉన్నవానికి ఆట ముఖ్యం. దూరం నుండిచూస్తే — ఆట మాత్రమే.

అన్నమాచార్యులు అవమానించరు. కేవలం నిర్మాణాన్ని చూపిస్తారు.

మూడవ​​ చరణం:
సంతానరూపమై సాగు ముందరికి
కొంత వెనకటిఫలము గుడువఁ దాఁ దిరుగు
యింతటికి శ్రీవేంకటేశుఁ డంతర్యామి
బంతి నితనిఁ గన్న బదుకువో బదుకు              ॥ఎవ్వరి॥
Telugu Phrase
Meaning
సంతానరూపమై సాగు ముందరికి
ఒక వైపు సంతాన రూపంలో ముందుకు సాగుచున్నది
కొంత వెనకటిఫలము గుడువఁ దాఁ దిరుగు
కొంత గతకర్మ ఫలములను అనుభవించుటకు వెనుకకు తిరుగుచున్నది
యింతటికి శ్రీవేంకటేశుఁ డంతర్యామి
ఈ సమస్తాన్ని కలుపుచున్న అంతర్యామి శ్రీవేంకటేశుడు
బంతి నితనిఁ గన్న బదుకువో బదుకు
(బంతి అనగా పంక్తి)  ఆ అవ్వలివ్వలి ఆటలో (వెలుగు నీడల పంక్తిలో)  ప్రతిమలా  నిలిచి, ఆ అంతర్యామిని గన్న బదుకువో బదుకు
సూటి భావము:
ఒక వైపు సంతాన రూపంలో ముందుకు సాగుచున్నది. కొంత గతకర్మ ఫలములను అనుభవించుటకు వెనుకకు తిరుగుచున్నది. మనవుని భవిష్యత్తుకు ఒకటి, గతమువైపు ఇంకొకటి లాగుతున్నవి. ఈ రెండునూ వర్తమానము నందు నిలువనివ్వక పరీక్షించుచున్నవి. ఈ సమస్తాన్ని కలుపుచున్న అంతర్యామి శ్రీవేంకటేశుడు. ఆ అవ్వలివ్వలి ఆటలో (వెలుగు నీడల పంక్తిలో)  ప్రతిమలా  నిలిచి, ఆ అంతర్యామిని గన్న బదుకువో అసలు బదుకు.

గూఢార్థవివరణము: 
సంతానరూపమై సాగు ముందరికి
ఏదోవొక విధముగా కొనసాగు భవిష్యత్తుకు ప్రణాళిక​
ఇది కేవలం శారీరక సంతానం రూపంలో మాత్రమే కాదు —
భావాలు, కర్మలు, సంస్కారాలు, ఆలోచనలు —
రూపాంతరం చెంది ముందుకు సాగుచున్న ప్రవాహం.

 కొంత వెనకటిఫలము గుడువఁ దాఁ దిరుగు
గతం పూర్తిగా ముగియదు. అది ఫలరూపంలో తిరిగి ప్రత్యక్షమవుతుంది.
మనము కాలములో ముందుకు సాగుతున్నట్టు కనిపించినా,
పాత గుణాలు, ప్రభావాలు, ముడులు, ఆలోచనలు
 వర్తమానమును అణచి భవిష్యత్తులోకి లాగ బడుచున్నవి.

యింతటికి శ్రీవేంకటేశుఁ డంతర్యామి

ఇక్కడ అంతర్యామి అనేది సిద్ధాంతం కాదు.
మార్పుల మధ్య మారని దానిని సూచించే మాట.
ముందుకు–వెనుకకు లాగులు కాలానికి చెందినవి.
కాని వాటిని గమనించగల స్పృహ —
కాలానికి చెందనిది.

అది నిర్మించాల్సినది కాదు.
అది ఊహించాల్సినది కాదు.
అది తత్త్వంగా నిర్ణయించాల్సినది కాదు.
ఆ లాగుల (pulls) మధ్య ఉన్న నిశ్శబ్ద ఆధారం.


బంతి నితనిఁ గన్న బదుకువో బదుకు
ఆ మార్పుల పంక్తిలోనే నిలిచి
ఆ మార్పుల మధ్య నిశ్శబ్దంగా ఉన్నదాన్ని గమనించుట
అదే జీవితం యొక్క లోతైన అంతర దృష్టి.

బంతి” — వరుస, పంక్తి.
వెలుగు–నీడల వరుస.
గతము–భవిష్యత్తుల వరుస.
ఆ వరుసలో కలిసిపోకుండా,
ప్రతిమలా నిలిచి గమనించుట.

ఇక్కడ “గన్న” అంటే సాధించిన వాడు కాదు.
మార్పు చెందిన వాడు కాదు.
ప్రత్యేక స్థితి పొందిన వాడు కాదు.

ఒత్తిళ్ళను అంగీకరించి
వాటిని సరిచేయాలనే ప్రయత్నం చేయకుండా
అవి ఎలా కదులుతున్నాయో చూడగల స్పష్టత.

కీర్తన​ సారము

మొదటి చరణం —
జనన–మరణాల మధ్య జీవితం మాయవో చూడ.

రెండవ చరణం —
తహతహలతో కట్టుకున్న జీవితం పిల్లల ఆటవో చూడ.

మూడవ చరణం —
గత–భవిష్యత్తుల ఒత్తిళ్ళ మధ్య నిలిచి చూడమంటుంది.

మూడు చరణాలు ఒకే దిశ చూపిస్తున్నాయి:

పరివర్తన కాదు.
విముక్తి సిద్ధాంతం కాదు.
నిరాకరణ కాదు.
నిలిచి చూడగల సామర్థ్యం.
అదే అసలు బదుకు.

Bottom of Form


X-X-The END-X-X

No comments:

Post a Comment

T-305 ఎవ్వరివాఁడో యెఱఁగరాదు

  తాళ్లపాక అన్నమాచార్యులు 305 ఎవ్వరివాఁడో యెఱఁగరాదు For English version press here ఉపోద్ఘాతము ఎవ్వరివాఁడో యెఱఁగరాదు — ఈ జీవుడు ఎవ్వరివాఁడో ఇ...