Wednesday, 30 November 2022

T-150 దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి

 తాళ్లపాక అన్నమాచార్యులు

150 దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి  

for EnglishVersion press here

 

కీర్తన:

రాగిరేకు:  169-6  సంపుటము: 2-338

దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి
పూఁచి నీ కీరితిరూపపుష్పము లివియయ్యా               పల్లవి॥
 
వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ
తక్కినవి భండారాన దాఁచివుండనీ
వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము
దిక్కై నన్నేలితివిఁక నవి తీరని నా ధనమయ్యా         దాఁచు॥
 
నా నాలికపైనుండి నానా సంకీర్తనలు
పూని నాచే నిన్నుఁ బొగడించితివి
వేనామాల వెన్నుఁడా వినుతించ నెంతవాఁడ
కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతేయయ్యా          దాఁచు॥
 
యీమాఁట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని
చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడఁ గాఁను
నేమానఁ బాడేవాఁడను నేరములెంచకుమీ
శ్రీమాధవ నే నీ దాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా         దాఁచు॥

 

క్లుప్తముగా: జరగబోవు పరిణామాలకు సూచనగా, ప్రజలలో సామరస్యమును పెంపొందించు ఒక్క కీర్తన ఐనా సరిపోతుందని; మిగిలిన వాటిని భండారాన దాఁచివుండనీమని ప్రార్థించిరి. 

 

పల్లవి: అయ్యా! నాకు తెలిసిన విధముగా చేసిన పూజలివి. ఇవి పూసి పరిమళించిన నీ కీర్తి పుష్పములయ్యా. దాఁచుకో నీపాదాలకుఁ నేఁ జేసిన పూజలివి!  

 

చరణం 1: మాలో  అంతర్గత సామరస్యాన్ని, సమభావమును పెంపొందించే  ఒకే ఒక్క కీర్తన చాలు కదా రక్షించుటకు. తక్కినవి భండారాన దాఁచివుండనీ. నీ నామము స్మరించుట సులభము. ఫలమధికము. నీవు నా హృదయమేలితివి. ఈ కవితలు నా తరగని నిధులయ్యా!

చరణం 2: నా నాలికపై నిలిచి వేలాది సంకీర్తనలు పనిగట్టుకొని నాచే నిన్నుఁ బొగడించుకొంటివి. వేయనామాల వెన్నుఁడా వినుతించ నేనెంతవాఁడ.  కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివి ఇంతేనయ్యా!

చరణం 3: ఈమాఁట గర్వముతో చెప్పినదికాదు. నీ మహిమలనే కొనియాడితిని గానీ స్వతంత్రించి నా భావనలను రుద్దిన/మర్దించిన వాడను కాదు. ఏదో నాకు తెలిసిన బాణీలలో పాడేవాడిని. మాధవుడా!  శ్రీవేంకటేశుఁడా! నా నేరములెంచకుమీ!

 

విపులాత్మక వివరణ

 

ఉపోద్ఘాతము: అరుదైన కీర్తనలో అన్నమాచార్యులు తాను పువ్వులతో స్వామిని సేవిస్తున్నాని,  ప్రతి కీర్తన ఒక పువ్వుగా పరిగణించమని వేడుకుంటారు. కీర్తనలోని ప్రతి పంక్తిలోనూ ఆయన వినయాన్ని అనుభూతి చెందవచ్చు. జరగబోవు పరిణామాలకు సూచనగా, ప్రజలలో సామరస్యమును పెంపొందించు ఒక్క కీర్తన ఐనా సరిపోతుందని; మిగిలిన వాటిని భండారాన దాఁచివుండనీమని ప్రార్థించిరి. 

ఆయన దైవములో విలీనమైన తరువాత, విలువైన సాహిత్యము దాదాపు 4౦౦ సంవత్సరాలు చలామణిలో లేదు.  1922 లో యాదృచ్ఛికంగా కనుగొనబడింది. అందుకనే శ్లోకాన్ని నా150వ కీర్తనగా  ఎంచుకున్నాను. 

హైరోనిమస్ బాష్, చిరికో, సాల్వడార్ డాలీ, ఎమ్ సి ఎస్చెర్ మరియు రెనే మాగ్రిట్టే వంటి గొప్ప కళాకారులతో నేను చూపించిన అనేక పోలికలు యాదృచ్ఛికమైనవి కావు, అది ప్రపంచాన్ని ప్రబావితము చేసే ఆలోచనల మేఘాల అనూహ్య కదలిక.  అన్నమాచార్యులను ఈ ఋషిపుంగవుడు  ప్రపంచంలోని ఒక మూలన కూర్చొని, ఈ నాటి ఆధునిక పరికరములేవీ అందుబాటులో లేని కాలములో మానవుల మానసిక స్థితి, వ్యాసంగముల గురించి అత్యంత ఆధునిక అవగాహనను కూడా అబ్బురపరిచు వాస్తవముల నేకములను బహిర్గతము చేసిరి.   

విశ్వమును అనుసంధానం చేయు సత్యము దృగ్గోచరముకాక పూలదండలలోని అగుపడని దారం వలె ప్రపంచమును యేకత్రాటిపై బంధించు మూలకము. అటువంటి సత్యమును దర్శించిన  అన్నమాచార్యుల నుండి నేరుగా అటువంటి దివ్యమైన అవగాహనను పొందడం మన అదృష్టం. 

ఎంతో వినయంతో తత్వశాస్త్రానికి  ఆయన చేసిన బ్రహ్మాండమైన సేవ ప్రపంచంలో వ్యాప్తి చెందకుండానే వుండిపోయింది. వారి రచనలలో చాలా భాగము తెలుగు మాట్లాడు ప్రజలలోనే వ్యాప్తి కాలేదు. వారి రచనలలోని తాత్వికతను, సత్యాన్వేషణకు అడ్డుపడు విషయములను సులభమైన మాటలలోనే తెలియజెప్పుటయే ఈ వ్యాఖ్యానముల ప్రయత్నము.

 

Details and Explanations:

 

దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి
పూఁచి నీ కీరితిరూపపుష్పము లివియయ్యా               పల్లవి॥
 

భావము: అయ్యా! నాకు తెలిసిన విధముగా చేసిన పూజలివి. ఇవి పూసి పరిమళించిన నీ కీర్తి పుష్పములయ్యా. దాఁచుకో నీపాదాలకుఁ నేఁ జేసిన పూజలివి! 

వివరణము:  ఇక్కడ అన్నమాచార్యులు తన కవిత్వాన్ని భావితరాలకు భద్రముగా పంచివ్వమని భగవంతుడిని ఆశ్రయించాడు. మనమంతా అదృష్టవంతులం. వారి కృపను నేరుగా అందుకున్నాము.

అన్నమాచార్యులు సత్యాన్ని మానవులు ఏర్పరచుకున్న నీయమములలో ఇరికించలేమని సూచిస్తూ  ప్రామాణిక ఛందస్సుల వైపు పోలేదని నా అభిప్రాయం. అయినప్పటికీ, ఆయన కవిత్వంలోని ప్రాస​, లయ, తాళము, శ్రావ్యత​, నిరాడంబరత, లక్షలాది మందిని ఆకర్షిస్తూనే ఉంటాయి.

వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ
తక్కినవి భండారాన దాఁచివుండనీ
వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము
దిక్కై నన్నేలితివిఁక నవి తీరని నా ధనమయ్యా         దాఁచు॥

భావము: మాలో  అంతర్గత సామరస్యాన్ని, సమభావమును పెంపొందించే  ఒకే ఒక్క కీర్తన చాలు కదా రక్షించుటకు. తక్కినవి భండారాన దాఁచివుండనీ. నీ నామము స్మరించుట సులభము. ఫలమధికము. నీవు నా హృదయమేలితివి. కవితలు నా తరగని నిధులయ్యా!

నా నాలికపైనుండి నానా సంకీర్తనలు
పూని నాచే నిన్నుఁ బొగడించితివి
వేనామాల వెన్నుఁడా వినుతించ నెంతవాఁడ
కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతేయయ్యా          దాఁచు॥
 

భావము: నా నాలికపై నిలిచి వేలాది సంకీర్తనలు పనిగట్టుకొని నాచే నిన్నుఁ బొగడించుకొంటివి. వేయనామాల వెన్నుఁడా వినుతించ నేనెంతవాఁడ.  కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివి ఇంతేనయ్యా!

వివరణము: అన్నమాచార్యులు ఎప్పుడూ తనను నడిపిస్తున్నది సత్యమేనని అంటుండేవారు. “పూని నాచే నిన్నుఁ బొగడించితి" అని  ఆయన తన శక్తికి మూలం భగవంతుడేనని సూచించారు.

యీమాఁట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని
చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడఁ గాఁను
నేమానఁ బాడేవాఁడను నేరములెంచకుమీ
శ్రీమాధవ నే నీ దాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా         దాఁచు॥

 

భావము: ఈమాఁట గర్వముతో చెప్పినదికాదు. నీ మహిమలనే కొనియాడితిని గానీ స్వతంత్రించి నా భావనలను రుద్దిన/మర్దించిన వాడను కాదు. ఏదో నాకు తెలిసిన బాణీలలో పాడేవాడిని. మాధవుడా!  శ్రీవేంకటేశుఁడా! నా నేరములెంచకుమీ!

 

వివరణము: మునుపటి అనేక వ్యాఖ్యానములలో పేర్కొన్నట్లుగా, అన్నమాచార్యులు కీర్తనలలో చాలావరకు దివ్య (ఉత్కృష్టమైన అస్తిత్వ) స్థితి నుండి వ్రాశారు. ఘన స్థితిలో, వారు అనుభవించిన దానిని మాత్రమే ప్రతిబింబిస్తున్నానని, తన వ్యక్తిగత అవగాహనను కాదని తెలుపుటకుచేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడఁ గాఁను” అని అన్నారు.

 

-X-The End-X-

212. ETi pariNAmamu mammEla yaDigErayya (ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య)

  ANNAMACHARYA 212. ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య ETi pariNAmamu mammEla yaDigErayya Introduction: In this seemingly unassuming comp...