Wednesday, 30 November 2022

T-150 దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి

 తాళ్లపాక అన్నమాచార్యులు

150 దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి  

for EnglishVersion press here

 

కీర్తన:

రాగిరేకు:  169-6  సంపుటము: 2-338

దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి
పూఁచి నీ కీరితిరూపపుష్పము లివియయ్యా               పల్లవి॥
 
వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ
తక్కినవి భండారాన దాఁచివుండనీ
వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము
దిక్కై నన్నేలితివిఁక నవి తీరని నా ధనమయ్యా         దాఁచు॥
 
నా నాలికపైనుండి నానా సంకీర్తనలు
పూని నాచే నిన్నుఁ బొగడించితివి
వేనామాల వెన్నుఁడా వినుతించ నెంతవాఁడ
కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతేయయ్యా          దాఁచు॥
 
యీమాఁట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని
చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడఁ గాఁను
నేమానఁ బాడేవాఁడను నేరములెంచకుమీ
శ్రీమాధవ నే నీ దాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా         దాఁచు॥

 

క్లుప్తముగా: జరగబోవు పరిణామాలకు సూచనగా, ప్రజలలో సామరస్యమును పెంపొందించు ఒక్క కీర్తన ఐనా సరిపోతుందని; మిగిలిన వాటిని భండారాన దాఁచివుండనీమని ప్రార్థించిరి. 

 

పల్లవి: అయ్యా! నాకు తెలిసిన విధముగా చేసిన పూజలివి. ఇవి పూసి పరిమళించిన నీ కీర్తి పుష్పములయ్యా. దాఁచుకో నీపాదాలకుఁ నేఁ జేసిన పూజలివి!  

 

చరణం 1: మాలో  అంతర్గత సామరస్యాన్ని, సమభావమును పెంపొందించే  ఒకే ఒక్క కీర్తన చాలు కదా రక్షించుటకు. తక్కినవి భండారాన దాఁచివుండనీ. నీ నామము స్మరించుట సులభము. ఫలమధికము. నీవు నా హృదయమేలితివి. ఈ కవితలు నా తరగని నిధులయ్యా!

చరణం 2: నా నాలికపై నిలిచి వేలాది సంకీర్తనలు పనిగట్టుకొని నాచే నిన్నుఁ బొగడించుకొంటివి. వేయనామాల వెన్నుఁడా వినుతించ నేనెంతవాఁడ.  కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివి ఇంతేనయ్యా!

చరణం 3: ఈమాఁట గర్వముతో చెప్పినదికాదు. నీ మహిమలనే కొనియాడితిని గానీ స్వతంత్రించి నా భావనలను రుద్దిన/మర్దించిన వాడను కాదు. ఏదో నాకు తెలిసిన బాణీలలో పాడేవాడిని. మాధవుడా!  శ్రీవేంకటేశుఁడా! నా నేరములెంచకుమీ!

 

విపులాత్మక వివరణ

 

ఉపోద్ఘాతము: అరుదైన కీర్తనలో అన్నమాచార్యులు తాను పువ్వులతో స్వామిని సేవిస్తున్నాని,  ప్రతి కీర్తన ఒక పువ్వుగా పరిగణించమని వేడుకుంటారు. కీర్తనలోని ప్రతి పంక్తిలోనూ ఆయన వినయాన్ని అనుభూతి చెందవచ్చు. జరగబోవు పరిణామాలకు సూచనగా, ప్రజలలో సామరస్యమును పెంపొందించు ఒక్క కీర్తన ఐనా సరిపోతుందని; మిగిలిన వాటిని భండారాన దాఁచివుండనీమని ప్రార్థించిరి. 

ఆయన దైవములో విలీనమైన తరువాత, విలువైన సాహిత్యము దాదాపు 4౦౦ సంవత్సరాలు చలామణిలో లేదు.  1922 లో యాదృచ్ఛికంగా కనుగొనబడింది. అందుకనే శ్లోకాన్ని నా150వ కీర్తనగా  ఎంచుకున్నాను. 

హైరోనిమస్ బాష్, చిరికో, సాల్వడార్ డాలీ, ఎమ్ సి ఎస్చెర్ మరియు రెనే మాగ్రిట్టే వంటి గొప్ప కళాకారులతో నేను చూపించిన అనేక పోలికలు యాదృచ్ఛికమైనవి కావు, అది ప్రపంచాన్ని ప్రబావితము చేసే ఆలోచనల మేఘాల అనూహ్య కదలిక.  అన్నమాచార్యులను ఈ ఋషిపుంగవుడు  ప్రపంచంలోని ఒక మూలన కూర్చొని, ఈ నాటి ఆధునిక పరికరములేవీ అందుబాటులో లేని కాలములో మానవుల మానసిక స్థితి, వ్యాసంగముల గురించి అత్యంత ఆధునిక అవగాహనను కూడా అబ్బురపరిచు వాస్తవముల నేకములను బహిర్గతము చేసిరి.   

విశ్వమును అనుసంధానం చేయు సత్యము దృగ్గోచరముకాక పూలదండలలోని అగుపడని దారం వలె ప్రపంచమును యేకత్రాటిపై బంధించు మూలకము. అటువంటి సత్యమును దర్శించిన  అన్నమాచార్యుల నుండి నేరుగా అటువంటి దివ్యమైన అవగాహనను పొందడం మన అదృష్టం. 

ఎంతో వినయంతో తత్వశాస్త్రానికి  ఆయన చేసిన బ్రహ్మాండమైన సేవ ప్రపంచంలో వ్యాప్తి చెందకుండానే వుండిపోయింది. వారి రచనలలో చాలా భాగము తెలుగు మాట్లాడు ప్రజలలోనే వ్యాప్తి కాలేదు. వారి రచనలలోని తాత్వికతను, సత్యాన్వేషణకు అడ్డుపడు విషయములను సులభమైన మాటలలోనే తెలియజెప్పుటయే ఈ వ్యాఖ్యానముల ప్రయత్నము.

 

Details and Explanations:

 

దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి
పూఁచి నీ కీరితిరూపపుష్పము లివియయ్యా               పల్లవి॥
 

భావము: అయ్యా! నాకు తెలిసిన విధముగా చేసిన పూజలివి. ఇవి పూసి పరిమళించిన నీ కీర్తి పుష్పములయ్యా. దాఁచుకో నీపాదాలకుఁ నేఁ జేసిన పూజలివి! 

వివరణము:  ఇక్కడ అన్నమాచార్యులు తన కవిత్వాన్ని భావితరాలకు భద్రముగా పంచివ్వమని భగవంతుడిని ఆశ్రయించాడు. మనమంతా అదృష్టవంతులం. వారి కృపను నేరుగా అందుకున్నాము.

అన్నమాచార్యులు సత్యాన్ని మానవులు ఏర్పరచుకున్న నీయమములలో ఇరికించలేమని సూచిస్తూ  ప్రామాణిక ఛందస్సుల వైపు పోలేదని నా అభిప్రాయం. అయినప్పటికీ, ఆయన కవిత్వంలోని ప్రాస​, లయ, తాళము, శ్రావ్యత​, నిరాడంబరత, లక్షలాది మందిని ఆకర్షిస్తూనే ఉంటాయి.

వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ
తక్కినవి భండారాన దాఁచివుండనీ
వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము
దిక్కై నన్నేలితివిఁక నవి తీరని నా ధనమయ్యా         దాఁచు॥

భావము: మాలో  అంతర్గత సామరస్యాన్ని, సమభావమును పెంపొందించే  ఒకే ఒక్క కీర్తన చాలు కదా రక్షించుటకు. తక్కినవి భండారాన దాఁచివుండనీ. నీ నామము స్మరించుట సులభము. ఫలమధికము. నీవు నా హృదయమేలితివి. కవితలు నా తరగని నిధులయ్యా!

నా నాలికపైనుండి నానా సంకీర్తనలు
పూని నాచే నిన్నుఁ బొగడించితివి
వేనామాల వెన్నుఁడా వినుతించ నెంతవాఁడ
కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతేయయ్యా          దాఁచు॥
 

భావము: నా నాలికపై నిలిచి వేలాది సంకీర్తనలు పనిగట్టుకొని నాచే నిన్నుఁ బొగడించుకొంటివి. వేయనామాల వెన్నుఁడా వినుతించ నేనెంతవాఁడ.  కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివి ఇంతేనయ్యా!

వివరణము: అన్నమాచార్యులు ఎప్పుడూ తనను నడిపిస్తున్నది సత్యమేనని అంటుండేవారు. “పూని నాచే నిన్నుఁ బొగడించితి" అని  ఆయన తన శక్తికి మూలం భగవంతుడేనని సూచించారు.

యీమాఁట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని
చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడఁ గాఁను
నేమానఁ బాడేవాఁడను నేరములెంచకుమీ
శ్రీమాధవ నే నీ దాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా         దాఁచు॥

 

భావము: ఈమాఁట గర్వముతో చెప్పినదికాదు. నీ మహిమలనే కొనియాడితిని గానీ స్వతంత్రించి నా భావనలను రుద్దిన/మర్దించిన వాడను కాదు. ఏదో నాకు తెలిసిన బాణీలలో పాడేవాడిని. మాధవుడా!  శ్రీవేంకటేశుఁడా! నా నేరములెంచకుమీ!

 

వివరణము: మునుపటి అనేక వ్యాఖ్యానములలో పేర్కొన్నట్లుగా, అన్నమాచార్యులు కీర్తనలలో చాలావరకు దివ్య (ఉత్కృష్టమైన అస్తిత్వ) స్థితి నుండి వ్రాశారు. ఘన స్థితిలో, వారు అనుభవించిన దానిని మాత్రమే ప్రతిబింబిస్తున్నానని, తన వ్యక్తిగత అవగాహనను కాదని తెలుపుటకుచేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడఁ గాఁను” అని అన్నారు.

 

-X-The End-X-

1 comment:

  1. *నొక్క సంకీర్తనే చాలు వొద్ధికై మమ్ము రక్షించగ*
    చరణం లోని ఈ పాదానికి ఎంతటి ఉన్నతమైన భావనకు అక్షరరూపం యిచ్చాడో అన్నమయ్య!!!
    ప్రజలలో సమభావం, సామరస్యం పెంపొందించే ఇటువంటి ఒక్క కీర్తన చాలు రక్షించుటకు, తక్కినవి భండాగారంలో భద్రపరచినా ఉంచినా
    పర్వాలేదని చెప్పటం ఈ కీర్తన యొక్క
    గొప్పతనమును చెప్పకనే చెప్తున్నది.

    అద్భుతమైన ఈ కీర్తనను తన 150వ కీర్తనగా యెంచుకొన్న శ్రీనివాస్ గారు
    అభినందనీయులు.

    150 కీర్తనలకు ప్రతిపదార్థ, భావాన్వయములతో బాటు, వాటికీ భగవద్గీత, భారతములోని శ్లోకాలను, పద్యాలను అనుసంధానం చేస్తూ, వేమన పద్యాలను ఉటంకిస్తూ, తత్త్వవేత్తలైన జిడ్డు కృష్ణమూర్తి గారి పలుకులను జోడిస్తూ, చక్కని వ్యాఖ్యానాన్ని నిబద్దత, అకుంఠిత దీక్షలతో అందిస్తున్న శ్రీ చామర్తి శ్రీనివాస్ గారి కృషికిపట్టుదలకు అభినందనపూర్వక నమస్సుమాంజలులు.

    వారిట్లే అనేక కీర్తనలకు సుభోధమైన
    వ్యాఖ్యానాన్ని అందిస్తూ అందరినీ రంజింజేస్తారని ఆశిస్తున్నాను.

    శ్రీనివాసుని అనుగ్రహవర్షం వారిపై, వారి కుటుంబంపై మెండుగా కురియాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...