Friday, 13 June 2025

T-229. గడ్డపార మింగితే నాఁకలి దీరీనా

 తాళ్లపాక అన్నమాచార్యులు

229. గడ్డపార మింగితే నాఁకలి దీరీనా

For English version press here

ఉపోద్ఘాతము

"చిలుకలకు తాళ్ళుకట్టి

ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుదాం అనుకుంటారా?"

ఒకవేళ ఎగిరినా అవి వశములో వుంటాయా?

మంటని మూటగట్టి ఇంట్లో దాచిపెడతారా?

ఇలాంటి మోటు ఉదాహరణల వెనుక

ఎంతో తత్వాన్ని దాస్తారు ఆచార్యులు.

 

అన్నమాచార్యుల మాటల్లో వినూత్న ఊహాశక్తి ఉంటుంది —

కానీ ఆ ఊహలన్నీ భూమ్మీదే నిలిచి ఉంటాయి

ఏ తత్వవేత్తా ఇంత నిశితముగా ప్రశ్నించడు.  ప్రశ్నించలేడు.

మన జీవితానికి అడుగుమట్టులైన నమ్మకాలనే తిరిగి పరిశీలించమంటాడు.

మన ఆలోచనలలో విద్యుద్వేగాన్ని పోస్తాడు.

శబ్దంలేని గర్జన, సంజ్ఞలలో విప్లవం, లోతులో శాశ్వతం.

 

స్వర్గం గురించీ, పరమపదాల గురించీ చెప్పి మోక్షాన్ని చాటడు —

కాని గడ్డపారను జీవితానికి అద్దంగా మార్చి,

మన జీవన శ్రమల అర్థహీనతే

సత్యానికి ద్వారమని చూపిస్తాడు.

 

అతనికి తత్వశాస్త్రాల అవసరం లేదు.

భారీ సిద్ధాంతాలెక్కడ? అతనికి ఇవన్నీ వ్యర్థం.

గడ్డపార, చిలుక, రాళ్లు, బూడిద, పాము — ఇవే అతడి సాధనాలు.

మనలో ఆత్మవిచారణను రేపడానికి ఇవే చాలు.

అధ్యాత్మ​ కీర్తన

రేకు: 29-2 సంపుటము: 1-177

గడ్డపార మింగితే నాఁకలి దీరీనా యీ
వొడ్డిన భవము దన్ను వొడ కమ్ముఁ గాక      ॥పల్లవి॥
 
చించుక మిన్నులఁ బారేచిలకలను బండిఁ గట్టి
వంచుకొనేమన్న నవి వసమయ్యీనా
యెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కు
పొంచి పొంచి వలపులు బొండఁబెట్టుఁ గాక ॥గడ్డపార॥
 
మంటమండే యగ్గి దెచ్చి మసిపాఁత మూఁట గట్టి
యింటిలోన దాఁచుకొన్న నితవయ్యీనా
దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు
బంటుఁ జేసి ఆసలనే పారఁదోసుఁ గాక      ॥గడ్డపార॥
 
పట్టరాని విషముల పాముఁ దెచ్చి తలకిందఁ
బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా
వెట్టసంసార మిది వేంకటేశుఁ గొలువని
వట్టిమనుజుల పెడవాడఁ బెట్టుఁ గాక         ॥గడ్డపార॥

 

Details and Explanations:

పల్లవి:

గడ్డపార మింగితే నాఁకలి దీరీనా యీ
వొడ్డిన భవము దన్ను వొడ కమ్ముఁ గాక ॥పల్లవి॥ 

గడ్డపార = పలుగు, గునపము; మింగితే = మింగితే, తింటే; నాఁకలి దీరీనా = ఆకలి తీరుతుందా?; యీ వొడ్డిన = ఈ మొదలుపెట్టిన;  భవము = పుట్టుక; దన్ను = ఆసరా, బలము, నిలుపుచోటు, తీగెలుపైకి పాకుటకు అండగా పెట్టిన పుల్లలు; వొడ కమ్ముఁ గాక = ఒడకి అమ్ము గాక =   ఇటుక తుంపుల బాణము గాక (= చిన్న చిన్న విడి విడి రాళ్ళు చెదురు మదురుగా పేర్చి సంధించిన బాణం గాక ).

భావము, వ్యుత్పత్తి: 

భావము: గడ్డపార మింగితే ఆకలి తీరుతుందా? ఈ మొదలైన పుట్టుక చిన్న చిన్న విడి విడి రాళ్ళు చెదురు మదురుగా పేర్చినటు వంటిదే!


(1) భావము నుంచి

గడ్డపార మింగితే ఆకలి ఎలాగైతే తీరదో, అలాగే ఈ పుట్టుకను దన్నుగా తీసుకొని  జీవితమును తగినట్లుగా అమర్చుకుందామంటే ప్రయోజనములేదు. 


(2)  పైదాని నుంచి

గడ్డపార జీవనోపాధికి ఉపయోగపడినా, దానంతట అది ఆకలి తీర్చలేదు.  అలాగే ఈ జన్మము మోక్షమునకు ఉపయోగపడినా, దానంతట అది అక్కడకు చేర్చలేదు.


(3)  పైదాని నుంచి

అన్వయార్ధము: చేయరాని పనులుజేయకు.  జీవితమును అది వెళ్లినట్లు వెళ్ళనీయి. అన్నీ నీవనుకున్నట్లుగా ఉండాలనుకోకు.


(4)  పైదాని నుంచి

 “జీవితం దాని సహజ దారిలో సాగనివ్వాలే గాని, పనిలేని మంగలివాడు పిల్లి తల గొరిగినట్టు — దానిని బలవంతంగా మలచాలన్న తాపత్రయం వదలాలి.”

వ్యాఖ్యానము: 

ఈ పల్లవిలోని భావాన్ని ఆకళింపు చేసుకొని చేశారా అనిపించే ఈ కళాకృతిని చూడండి.  

"నీవు విలుకాడివి కావు.
నీవు బాణానివి మాత్రమే —
ఏదో మహత్తరమైన శక్తి
నీకు ఆకారమిచ్చింది,
అవకాశమిచ్చింది"

ఈ వొడ్డిన భవము దన్ను వొడ కమ్ముఁ గాక

అంటే, ఈ పుట్టుక అనే జీవితం ఒక సంపూర్ణమైన, శాశ్వతమైన ఆసరా కాదు. ఇది ఒడ కమ్ముఁ గాక – loosely arranged arrow of broken bricks — అంటే ఇటుక తుంపులనో, చెదురుమదురుగా పేర్చిన పదార్థాలనో కలిపి చేసిన బాణంలా ఉంది. 

ఇది సంధించిన బాణం లాంటిది. అది ముందుకు సాగుతూనే వుంటుంది.  బాహ్య వీక్షకుడికి అది కదులుతుంటే సమయము అన్న స్పృహ కలుగుతుంది.  బాణంతో పయనించు వానికి ఆ సమయము అన్న స్పృహ వుండదు. 

ఆ బాణానికి స్థిరత లేదు, దిశ స్పష్టత లేదు, బలమూ లేదు. మనం దీన్ని ఆశ్రయించదలిస్తే — అది మనకి వక్రీకృత దారిని చూపిస్తుంది. మనం పట్టుకున్నది జీవితం కాదు, దాని వక్రీకృత రూపమే. 


అసలు మెలిక​

జీవితానికి జీవించడానికి ఉన్న వ్యత్యాసం 

జీవితం (Life) అనేది ఒక గమ్యరహిత, కాలానుగతంగా కదులుతున్న శరీరానికి నిచ్చిన ప్రయాణం.

జీవించడమంటే (Living)ఆ కదలికలో మమేకమై దాని నుంచి వేరుపడకుండా ఉండటం. 

ఇది బాణంపై, బాణంతో పాటు స్వారీ అనుకోవడం కాదు ఎందుకంటే మనం ఎక్కబోయిన తక్షణం  బాణం ఆకృతిని వికృతి చేయడమో, దిశ మార్చడమో జరుగుతుంది. మన ప్రయత్నము భగ్నమౌతుంది. అంటే మనం దానిలో కలిసి పోవాలి — దాని దిశలో పరివర్తన లేకుండా. 

ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలోని మలుపు క్లిష్టమైనదే కాదు, దాదాపు అసంభవము కూడా. అపూర్వమైన జయమందుటకు అలౌకికమైన శ్రమ తప్పదు కదా!


గడ్డపార మింగితే ఆకలి తీరుతుందా?

అన్నమాచార్యులు ఇలా అంటున్నారు —
“కాని నీవు మింగేది గడ్డపార అయితే,
దాని వల్ల నీవు తలపెట్టిన 
"దైవమును చేరుట" అను కార్యము
సాధ్యం కాదు.”
 
ఇది మన ప్రయత్నాలతో జీవితం సరిచేయాలన్న
భ్రమ మనకు ఆసరా, బలము ఇచ్చి
వ్యతిరేక దిశలో పనిచేస్తుంది.
 
మానవ ప్రయత్నంతో మనము చేయగలిగినది
మౌనముగా వేచి వుండడమే.
కానీ ఆ మౌనమే మనిషికి సవాలు.

మొదటి చరణం:

చించుక మిన్నులఁ బారేచిలకలను బండిఁ గట్టి
వంచుకొనేమన్న నవి వసమయ్యీనా
యెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కు
పొంచి పొంచి వలపులు బొండఁబెట్టుఁ గాక      ॥గడ్డపార॥ 

చించుక= గాలిని చించుకుంటూ, రివ్వున ఎగురు;  మిన్నులఁ = ఆకాశంలో; బారేచిలకలను = వెళ్ళు చిలకలను; బండిఁ గట్టి బండి లాగా కట్టి;  వంచుకొనేమన్న = దారికి  తెచ్చుకొందామంటే; నవి వసమయ్యీనా = అవి వశమౌతాయా; యెంచరాని = ఊహించలేని;  యింద్రియము లెవ్వరికి  నేల చిక్కు =ఇంద్రియాలు ఎవరికైనా ఎలా చిక్కుతాయి? (చిక్కవు).; పొంచి పొంచి = చూసి చూసి; వలపులు = కోరికల్లో; బొండఁ =తప్పుచేసిన వారి కాలు సేతులకు తగిలించు కొయ్య. ద్రుపదము. (బొండ కొయ్య) బొండఁబెట్టుఁ గాక     =  కాళ్ళు చేతులు ఆడకుండా చేయు. 


భావము:

గాలిని చించుకుంటూ, రివ్వున ఎగురు ఆకాశంలో వెళ్ళు చిలకలను బండి లాగా కట్టి బండి లాగా కట్టి దారికి  తెచ్చుకొందామంటే అవి వశమౌతాయా? (కావు). ఊహించలేని ఇంద్రియాలు ఎవరికైనా ఎలా చిక్కుతాయి? (చిక్కవు). చూసి చూసి కోరికల్లో ముంచి కాళ్ళు చేతులు ఆడకుండా చేయు గాక.


వ్యాఖ్యానము: 

రిత్త ప్రతిమ:

ఈ చరణం లో ఒక ప్రతీకాత్మక బింబం ఉంది —
ఆకాశములోకి దూసుకెళ్తున్న రంగుల చిలకలు,
ఇచ్చవచ్చినట్లు ఎగురుతూ నియంత్రణకి దూరం.
 
అలాంటి చిలకలను బండిలా కట్టి,
వాటిని ఏదైనా దారిలో నడిపించాలనుకోవడం —
అర్థరహితం మాత్రమే కాదు, అసాధ్యమూ కావచ్చు. 

ఇది దేహమనే ఇంద్రియాల వాహనాన్ని
కట్టుదిట్టం చేయు యత్నం.
మన అనుభవాలను నియంత్రించాలన్న తపన —
ఆ అప్రతిహత శక్తిని ఆపగలనన్న మాయ —
 
చిలకలలా గగనంలోకి ఎగిరే మన భావజాలం
ఎప్పటికీ పంజరంలోకి రావనే సత్యం
తేటతెల్లం. 

ఇంద్రియ తృష్ణ

“పొంచి పొంచి” — అదనుకోసం ఎదురుచూస్తూ —
 
“బొండఁబెట్టుఁ గాక” —
అంటే శిక్ష.
తప్పుచేసిన వారి కాలు సేతులు
కొయ్యకు తగిలించి అవి ఆడకుండా చేయడం.
ఇది ఒక ఆధ్యాత్మిక స్థంభన.
 
కారణం —
కోరిక, నియంత్రణ, సాదించాలన్న
తాపత్రయం అనే
అంతర్గత భారం.

మూల సందేశం:

జీవితం బండిలా నడిపించలేము.
ఇంద్రియాలు — పరతంత్రం.
పట్టుబడని — ఆకాశంలో విహరించే గాలి వంటివి.

రెండవ చరణం: 

మంటమండే యగ్గి దెచ్చి మసిపాఁత మూఁట గట్టి
యింటిలోన దాఁచుకొన్న నితవయ్యీనా
దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు
బంటుఁ జేసి ఆసలనే పారఁదోసుఁ గాక  ॥గడ్డపార॥ 

మంటమండే = మంటలుమండే; యగ్గి =అగ్ని; దెచ్చి = తీసుకొచ్చి; మసిపాఁత మూఁట గట్టి = పాత గుడ్డలలో మూటగట్టి; యింటిలోన దాఁచుకొన్న = ఇంటిలోపల దాచుకొన్న; నితవయ్యీనా = హితవయ్యీనా = మంచిదౌతుందా?; దంట = యుక్తి,తో చాతుర్యంతో; మమకార మిట్టే = మమకారము ఇట్టే; తన్నునేల సాగనిచ్చు = అనుకున్నట్లు సాగనిస్తుందా? (సాగనివ్వదు). బంటుఁ జేసి= దాని బంటుగా చేసుకొని; ఆసలనే = ఆశలనే; పారఁదోసుఁ గాక = మనమీదకు తోస్తుంది గాని.


భావము:

మంటలుమండే అగ్ని తీసుకొచ్చి పాత గుడ్డలలో మూటగట్టి పాత గుడ్డలలో మూటగట్టి ఇంటిలోపల దాచుకొన్న మంచిదౌతుందా? (కాదే!). యుక్తి,తో చాతుర్యంతో మమకారము ఇట్టే వశములో వుంచుకుంటానంటే అనుకున్నట్లు సాగనిస్తుందా? (సాగనివ్వదు). అది దాని బంటుగా చేసుకొని ఆశలనే మనమీదకు తోస్తుంది గాని.


వ్యాఖ్యానం:వ్యాఖ్యానం:

ఈ చరణం ఒక కవితాత్మక విస్ఫోటనం —
దృశ్య పరంగాను, తాత్త్వికంగాను ప్రకంపనల భావ చిత్రం. 

హితవయ్యీనా 

మొదటిది  విస్మయకరమైన వ్యంగ్యం.
ఎగిసిపడుతున్న మంటను తెచ్చి,
పాత మురికిపట్టిన బట్టలో చుట్టి,
ఇంట్లో దాచిపెట్టటం —
అదీ అదుపులో ఉంచుతానని అనుకోవడం!
ఇది మూర్ఖత్వమే కాదు —
అత్యంత ప్రమాదకరం కూడా.

 

తన్నునేల సాగనిచ్చు

రెండవది: పనికిరాని పని చెయ్యాడమే కాదు
ఆ మంటను (మమకారాన్ని) నియంత్రణలో పెట్టేందుకు
మేధస్సుకు పదునుపెడతాం.

 

మమకారం ప్రతిదాడి చేస్తుంది. కొత్త రూపాల్లో ఎదురవుతుంది.
అది మన వశం అనుకుంటాం —
నిజానికి ఈ  అదుపు అనే ఆరాటంలో పడి
కాలం గడుపుతూ
దానిని నియంత్రించాలన్న భ్రమలో —
దాని బానిసగా మారుతూ,
దాని యెదురుదిశలో నడిచిపోతాం.

 

సారాంశం:

పల్లవితో ప్రబలమైన అనుబంధం

జీవితాన్ని మలచలేము,
మంటను పాత బట్టలతో కప్పి దాచలేం.
చూసీచూడనట్లు వదిలేయాలి.
అంతే —
జోక్యం కూడదు.


మూడవ చరణం:

పట్టరాని విషముల పాముఁ దెచ్చి తలకిందఁ
బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా
వెట్ట సంసార మిది వేంకటేశుఁ గొలువని
వట్టిమనుజుల పెడవాడఁ బెట్టుఁ  గాక   ॥గడ్డపార॥ 

పట్టరాని విషముల = అదుపులోపెట్టలేని విషములుగల; పాముఁ దెచ్చి = పామును తెచ్చి; తలకిందఁ = తలకింద (దిండులా); బెట్టుకొన్నా = పెట్టుకొన్నా అది; మందపిలి వుండీనా =  ముద్దలా పడి వుంటుందా? (ఉండదు); వెట్ట =వెచ్చని; వెట్ట సంసార మిది = నులివెచ్చని అనుభూతి కలిగించే సంసార మిది; వేంకటేశుఁ గొలువని = శ్రీవేంకటేశుని కొలువని; వట్టిమనుజుల =  అప్రయోజకులు, నిరర్థకులు, నిస్సారులు అగు మనుషుల; పెడవాడఁ బెట్టుఁ  = బహిష్కరించు; 


భావము

అదుపులోపెట్టలేని విషములుగల పామును తెచ్చి తలకింద (దిండులా) పెట్టుకొన్నా అది ముద్దలా పడి వుంటుందా? (ఉండదు). శ్రీవేంకటేశుని కొలువని అప్రయోజకులు, నిరర్థకులు, నిస్సారులు అగు మనుషులను బహిష్కరించునే కానీ ఆదరించడు.


వ్యాఖ్యానము:

జీవితం మనం ఊహించ గలిగినది కాదు.
అది మంచిది కాదు, చెడ్డదీ కాదు,
అందమైనది కాదు, అసహ్యమైనది కాదు. ​
ఇవన్ని మన అభిప్రాయాలు —
గత జ్ఞాపకాలు, ఆశయాలు, ఆశల వల్ల వచ్చిన వక్రీకరణలు.
 
జీవితాన్ని మనం ఉన్నదాన్ని వున్నట్లు చూచినపుడు —
దానికి పేర్లు పెట్టకుండా, దాన్ని మార్చాలని చూసకుండా —
అది యథాతథంగా ఉంటుంది.
 
ఆ యథార్థంలోనే —
కొత్తదనం ఉంది, జీవ ప్రవాహం ఉంది, జ్ఞానం ఉంది.
ఏ ఘర్షణ లేదు. ఏ వక్రీకరణ లేదు.
కేవలం జీవించడమే ఉంటుంది. 

X-X-The End-X-X



Supplementary

పల్లవిపై మరిన్ని విశేషాలు


పల్లవిలో దాగిన లోతైన పరామర్శ 

మనకు జన్మ ఇచ్చిన ఈ లోకము —
ఈ జీవంఈ ప్రవాహం —
మననుంచి వేరైనది కాదు.
మనం జీవితం లోపలికి ప్రవేశపెట్టబడ్డవారము కాదూ.
మనమే జీవితం.
అది పుట్టినపుడే మనమూ పుడతాం.
 
ప్రకృతివ్యక్తి —
ఇవి రెండూ కలిసే నడుస్తాయి.
కానీ బిగుసుకొని కాదువదులుగా —
పేర్చిన రాళ్లలాగా,
గగనంలో తిరిగే పక్షుల గుంపులాగా.
 
ఒప్పందంతో కాదు,
కానీ లోపల ఉన్న అవినాభావ సంబంధంతో కలసి కదులుతాయి.
 
జీవితాన్ని “ఆకారమివ్వాలి” అనుకున్నప్పుడు —
దాన్ని కట్టుదిట్టంగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నంలో —
ఆ సహజ సంబంధాన్ని మనం వక్రీకరిస్తాం. 

జీవప్రవాహానికి గదుల గోడలు వేసినట్టు అవుతుంది.
శ్వాసను యంత్రంగా మలుస్తాం.
సజీవశిల్పాన్ని నిర్జీవ శిలగా మార్చేస్తాం.

 

ఈ వక్రత తప్పే కాదు —
అదే కారణంగా మనిషి ఈ లోకంతో తన సంబంధాన్ని కోల్పోతాడు.
తనకు తెలియని దూరాన్ని అనుభూతి చెందుతాడు.
అదే అతనికి అన్యుడనని అనిపిస్తుంది. చెప్పరాని వ్యథను మిగులుస్తుంది.

అందుకే ఈ వక్రతను గుర్తించడం ఎంతో అవసరం. 

సత్యం ఏకం 

జిడ్డు కృష్ణమూర్తి టిప్పని:

"ఏదో ఒకదాని క్రింద మారాలనుకునే తక్షణం
నీలో ఘర్షణ మొదలతుంది.”
ఏ వక్రీకరణా లేకుండా చూడడమే —
అసలైన వివేకము”
 
తావో తే చింగ్ ఆలోచనలు:
ప్రపంచాన్ని అది ఉన్నట్టే అంగీకరిస్తూనే —
దానిని ప్రేమించగలవా?”

 

అన్నమాచార్యులు:
ఆకాశ పాకాశ మరుదైన కూటంబు /
లోకరంజకము తమలోనిసమ్మతము:

ఈ అస్తవ్యస్తముగా కనబడు లోకము ఊహింపలేని కూటమి.
లోకరంజకము "తమలోనిసమ్మతము".

 

భగవద్గీత​:
యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః (12-15)
"ప్రపంచాన్ని కలతపెట్టని వాడు,
ప్రపంచపు కలతలతో ఆందోళన చెందని వాడు

 

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ”(7-7)
"ఈ విశ్వమంతా మణుల దండ వలె గుచ్చబడి ఉన్నది.
కలిసి లేవు. కలిపి వుంచబడ్డాయి".

 

సత్యం ఏకం
ఈ నాలుగు వాక్యాల్లోనూ ఒకే మూల సందేశం దాగి ఉంది:
ప్రపంచాన్ని మార్చాలన్న తపనలో కాకుండా —
మనము దానిని చూసే కోణం మారితే చాలు,
శాంతిప్రేమజ్ఞానం అన్నీ అదే క్షణంలో వెల్లివిరుస్తాయి.

భగవద్గీత వాక్య విశ్లేషణ:

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ”(7-7).
ఈ విశ్వమంతా మణుల దండ వలె గుచ్చబడి ఉన్నది. 
కలిసి లేవు. కలిపి వుంచబడ్డాయి.
 
ఈ విశ్వం అనేక విభిన్న వస్తువులజీవుల సమాహారమే. 
అవి ఒకే సూత్రంలో గుచ్చబడ్డాయి గాని — కలిసిపోయినవి కావు. 
కావున వాటిలో అనుసంధానం కనిపిస్తుంది గానిమమేకత్వం లేదు.
 
ఆయా వస్తువులుజీవులు కాదు, 
వాటిని కలిపి వుంచిన — సూత్రమే సత్యం.”
X-X--X-X

 


 

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...