Sunday, 8 November 2026

T-66R ఊరకే వెదకనేల వున్నవి చదువనేల

 అన్నమాచార్యులు
66R. ఊరకే వెదకనేల వున్నవి చదువనేల

ఉపోద్ఘాతము: వెతుకుట, చదువుట అన్నవి మానవుని అత్యంత బలమైన ఆయుధములు. వీటి కారణముగా మానవుడు సాధించిన విజయములన్నీ, వీటికి ప్రత్యామ్నాయము లేదు అనే భావనను బలపరుస్తూ వచ్చాయి. అన్నమాచార్యులు ఆ భావననే ప్రశ్నిస్తున్నారు.

మానవ మేధాశక్తికి పరిమితులు విధిస్తున్నది దాని సహజ సామర్థ్యం కాదు; తనను తాను కాపాడుకోవడం, తన ఆధీనంలోనే సమస్తమును కొనసాగించాలనే మనస్సు యొక్క ధోరణి కావచ్చును.

కాబట్టి ఆచార్యులవారు ప్రశ్నిస్తున్నది మానవుని ప్రతిభను కాదు; ఆ అసామాన్యమైన శక్తికి కళ్లెం వేస్తున్న ధోరణిని. జాగ్రత్తగా పరిశీలిస్తే, మొదటి నుండి ఇప్పటి వరకు మానవుడు తన శక్తిని ఇతరులపై ఆధిపత్యం సంపాదించడానికి ఉపయోగించిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. ఇతరులకంటే తాను ఒక మెట్టు పైన ఉన్నాననే ఆధిక్య భావన, తనను తాను ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలనే తాపత్రయం మానవ ప్రవర్తనలో బలంగా కనిపిస్తాయి.

ఇదే ధోరణి మన అంతర్గత జీవితంలోనూ కొనసాగుతున్నదా? కోపాన్ని విడిచిపెట్టకుండా, దాని ఫలితాలను మాత్రమే సరిదిద్దుకోవాలని చూస్తాము. లోపల ఏమి జరుగుతున్నదో పట్టించుకోకుండా, బయటకు లోకానికి నచ్చినట్లు కనిపించాలనుకుంటాము. మనల్ని మనం తెలుసుకోవాలనే కోరికలో కూడా మనకు తెలియని ఒక స్వార్థం దాగి ఉండవచ్చునా? మనలో ఒక రూపం, ప్రపంచానికి మరొక రూపం చూపించుకుంటూ జీవిస్తున్నామా?

ఈ ప్రశ్నలన్నింటినీ అన్నమాచార్యులు ఒకే కీర్తనలో మన ముందుంచుతున్నారు. మనం వెదుకుతున్నది నిజంగా ఎక్కడ ఉంది? మనకు అత్యంత చేరువలో ఉన్నదానిని తెలుసుకోవడానికి కూడా మన వెతుకులాట, మన చదువులు, మన మాటలు అడ్డంకులుగా మారుతున్నాయా? మానవునిలో అపారమైన సామర్థ్యము ఉన్నదని, అందులో మనము వినియోగించుకుంటున్నది అతి స్వల్ప భాగమేనని గత వంద సంవత్సరములుగా జరుగుతున్న చర్చ కూడా గమనింపదగ్గది.

ఊరకే వెదకనేల వున్నవి చదువనేల — 
చేరువనె వున్నదిదె చెప్పరాని ఫలము.

 

అధ్యాత్మ కీర్తన
రేకు: 334-1 సంపుటము: 4-196
ఊరకే వెదకనేల వున్నవి చదువనేల
చేరువనె వున్నదిదె చెప్పరాని ఫలము              ॥పల్లవి॥

కోపము విడిచితేనె పాపము దానే పోవు
దీపింప సుజ్ఞానముతెరు విదివో
లోపల మనిలుఁడై లోకముమెచ్చుకొరకు
పైపైఁగడిగితేను పావనుఁడౌనా            ॥ఊర॥

ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు
కందువ నాస మానితే కైవల్యము
బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు
చిందు వందు చిత్తమైతే చేరునా వైకుంఠము    ॥ఊర॥

కాంతల పొందొల్లకుంటే ఘనదుఃఖమే లేదు
అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుఁడు
అంతట మాటలె యాడి హరి శరణనకుంటే
దొంతినున్నభవములు తొలఁగునా వివేకికి         ॥ఊర॥
Details and Explanations:
పల్లవి
ఊరకే వెదకనేల వున్నవి చదువనేల
చేరువనె వున్నదిదె చెప్పరాని ఫలము    ॥పల్లవి॥ 
కీర్తన పాదము
భావము
ఊరకే వెదకనేల వున్నవి చదువనేల
ఊరకనే ఎక్కడెక్కడో వెతకడం ఎందుకు? ఇప్పటికే మనకు అందుబాటులో ఉన్నదానిని చదువనేల? ( ఆ ప్రయత్నమేల?)
చేరువనె వున్నదిదె చెప్పరాని ఫలము
అదిగో, మనకు ఎంతో చేరువలోనే ఉంది — మాటలతో వివరించలేని, నేరుగా అనుభవించి మాత్రమే తెలుసుకోగల ఫలము.

భావము: ఊరకనే శోధించడం, దైవముపై అధ్యయనము పరిశోధనల్లో కాలము వెళ్ళబుచ్చకండి. మీకు చాలా దగ్గరగానే వర్ణించలేని ఫలమున్నది.


గూఢార్థవివరణము:

ఊరకే వెదకనేల వున్నవి చదువనేల: వెదకుట, చదువుట అనునవి మనము ప్రయత్నపూర్వకంగా చేయు కార్యములు. కావున వీనికి ఒక మూలకారణము ఉంటుంది. అనేక విధములుగా ఆ కారణాన్ని పరిశీలిస్తే, అది మన చేతనలోని (అనుభవానికి వచ్చిన) విషయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ రెండవ విషయం, దీనికి సంబంధించనిది ఎంతో దూరంలో లేదని తెలిపారు.

ఎప్పటిలాగానే, అక్కడా ఇక్కడా వెతుకుతూ, పుస్తకాలు చదువుతూ సమయం వ్యర్థం చేసుకోవద్దన్నారు. సత్య దర్శనమునకు సిద్ధాంతాలతోను, మేధో అన్వేషణతోను పనిలేదని అన్నమాచార్యులు చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఈ పల్లవి ద్వారా అన్నమాచార్యులు మరొక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తున్నారు. వెదకడం వల్లగానీ, చదవడం వల్లగానీ మనం చేరవలసిన దానిని (సత్యమును) చేరుకోలేము. మన అవగాహనకు అందని ఏదో ఒకటి ఉందనే విషయాన్ని ఆయన నిరాకరించడం లేదు. అయితే, దానిని తెలుసుకోవడానికి మనం ఎప్పటినుంచో అలవాటు చేసుకున్న మార్గాలను ప్రశ్నిస్తున్నారు. ఒక భావనను రూపొందించుకుని, ఆ భావన ఆధారంగా సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కాకుండా, నేరుగా అర్థం చేసుకునే సామర్థ్యం మనకు లేదా?

ఈ ఉదాహరణ చూడండి: దీనిని పోతనామాత్యునికి, శ్రీనాథునికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథతో పోల్చి చూడవచ్చు. ఒకసారి భోజనానంతరం తమలపాకులు నములుతూ శ్రీనాథుడు పోతన రచించిన భాగవతాన్ని చదువుతున్నాడట. గజేంద్రమోక్షంలోని ఒక పద్యంలో, గజేంద్రుడిని రక్షించడానికి విష్ణువు శంఖచక్రాలు లేకుండానే ఆతురతతో పరుగెత్తి వచ్చినట్లుగా పోతన వర్ణించడాన్ని చూసి, శ్రీనాథుడు ఆశ్చర్యపోయాడట. భక్తుడిని రక్షించడానికి వస్తున్నప్పుడు ఆయుధాలు కూడా తీసుకురాకపోవడం ఏమిటని ప్రశ్నించాడట. పోతన దానికి సమాధానం చెప్పలేదు.

కొంతసేపటి తరువాత పోతన పరుగెత్తుకుంటూ వచ్చి, శ్రీనాథుని కుమారుడు బావిలో పడిపోయాడని చెప్పాడట. అది విన్న శ్రీనాథుడు ఆందోళనతో బావి దగ్గరకు పరుగెత్తి, ఏమి చేయాలో తోచక బావి చుట్టూ తిరగసాగాడట. అప్పుడు పోతన, నిచ్చెన తెచ్చి దిగడం గానీ, ఇతరుల సహాయం తీసుకోవడం గానీ చేయకుండా అలా ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నించాడట. తరువాత ప్రక్కనే దాచిన​ పిల్లవానిని సురక్షితంగా తీసుకువచ్చి చూపాడట. ఈ సంఘటన ద్వారా పోతన చెప్పదలచుకున్నది ఏమిటంటే, కుమారుడి మీద ఉన్న ప్రేమతో శ్రీనాథుడు ఆలోచించకుండా పరుగెత్తినట్లే, తన భక్తుడి మీద ఉన్న ప్రేమతో విష్ణువు కూడా ఆయుధాలు తీసుకురావాలనే ఆలోచన చేయకుండా పరుగెత్తి వచ్చాడని.

ఈ కథ ద్వారా మనం గమనించవలసినది ఏమిటంటే, ఒక విషయాన్ని దూరం నుంచి పరిశీలిస్తూ తర్కించడం వేరు; అదే విషయం మనకు ప్రత్యక్షంగా ఎదురైనప్పుడు స్పందించడం వేరు. మనలోని అనుబంధాలు, భావోద్వేగాలు మన సాధారణ వివేచనను పక్కకు నెట్టగలవు. శ్రీనాథునికి పోతన ఇచ్చిన సమాధానం మరొక వాదన కాదు. తాను ప్రశ్నించిన విషయాన్ని తన అనుభవం ద్వారానే అర్థం చేసుకునేలా చేశాడు.

మనం ఒక అందమైన బొమ్మను చూడగలం, అర్థం చేసుకోగలం.
ఒక భాషను చూడలేం, కానీ అర్థం చేసుకోగలం.
సముద్రాన్ని చూడగలం, కానీ బహుశా దాని గురించి కొంత మాత్రమే అర్థం చేసుకోగలం.
సత్యాన్ని మాత్రం ఒక వస్తువులా చూడలేము; మేధోపరంగా కూడా అర్థం చేసుకోలేము. బహుశా అది ప్రత్యక్ష అనుభవంలోనే తెలియగలదు.

మానవునికి తక్కిన జంతుజాలానికి గల ముఖ్యమైన భేదం ఏమిటి? బలం, వేగం, సూక్ష్మ గ్రహణశక్తి (శబ్దం, వాసన, ధ్వని, ఉష్ణోగ్రతలోని మార్పులు, చూపు మొదలైనవి) వంటి అనేక విషయాలలో తక్కిన జంతువులు మానవుని కంటే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ మానవుని మేధాశక్తి అమోఘమైనది. ఇక్కడ అన్నమాచార్యులు పేర్కొన్న వెదకుట, చదువుట అనేవి ఈ మేధాశక్తికి సంబంధించిన అంశాలే. అయితే, ఆచార్యులు “చేరువనె వున్నదిదె చెప్పరాని ఫలము” అని చెప్పడం ద్వారా ఆ మేధాశక్తికి ఉన్న పరిమితులను కూడా సూచించినట్లుగా భావించవచ్చు. ఆచార్యులు మేధాశక్తిని తిరస్కరించడం లేదు. అయితే, దాని పూర్తి సామర్థ్యాన్ని మనం ఇంకా గుర్తించకుండానే జీవితం గడుపుతున్నామేమో!

మానవ మేధాశక్తికి పరిమితులు విధిస్తున్నది దాని సహజ సామర్థ్యం కాదు; తనను తాను కాపాడుకోవడం, తన ఆధీనంలో ఉన్నవాటిని కొనసాగించుకోవడం అనే మనస్సు యొక్క ధోరణి కావచ్చు. మనకు అలవాటైన ఆలోచనలు, నమ్మకాలు, అనుభవాలు, మనల్ని మనం కాపాడుకోవడానికి ఏర్పరచుకున్న పద్ధతులు — ఇవన్నీ మనకు ఒక రకమైన భద్రతను ఇస్తాయి. కానీ అదే భద్రత, ఎదురుగా ఉన్న పరిస్థితిని ఉన్నదున్నట్లుగా చూడటానికి అడ్డుపడవచ్చు. మనకు తెలియని దానిని నేరుగా ఎదుర్కోవడం కంటే, దాని గురించి ఒక భావనను ఏర్పరచుకుని, దానిపై ఆధారపడటమే మనకు సురక్షితంగా అనిపిస్తుంది. బహుశా అందుకే ప్రత్యక్షంగా అర్థం చేసుకునే దిశగా మనం అడుగులు వేయలేకపోతున్నాము.

మానవుడు ఎక్కడో ఉన్న తోకచుక్కలోని ఒక శకలం మీద అంతరిక్ష నౌకను దించగలడు. విచిత్రమేమిటంటే, తన పక్కనే ఏమి ఉందో మాత్రం అతనికి తెలియదు!

బాహ్య ప్రపంచాన్ని పరిశోధించడంలో మానవ మేధస్సు సామర్థ్యాన్ని మనం ఏమాత్రం సందేహించనవసరం లేదు. కానీ తనను తాను తెలుసుకునే అన్వేషణలో అదే నిజాయితీ, అదే పట్టుదల ఎందుకు కనిపించడం లేదు? బాహ్య ప్రపంచంలో తన మేధాశక్తితో ఎన్నో అద్భుతాలు సాధిస్తున్న మానవుడు, తనలోని భయాలు, అనుబంధాలు, స్వాధీన భావనలను పరిశీలించడంలో మాత్రం వెనుకబడుతున్నాడేమో! తన మేధాశక్తికి పరిమితులు విధిస్తున్నది దాని సహజ సామర్థ్యం కాక, తనను తాను కాపాడుకోవడం, తన ఆధీనంలో ఉన్నవాటిని కొనసాగించుకోవడం అనే మనస్సు ధోరణి కావచ్చు.

చేరువనె వున్నదిదె చెప్పరాని ఫలము: మొదటి పంక్తి మన అనుభవంలోని విషయాలను, రెండవ పంక్తి మన అనుభవానికి అందని విషయాన్ని సూచిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

ఇంకొక విషయం మనం గమనించాలి. చేరువగానే ఉంది అన్నప్పటికీ దానిలోకి మనకి మనముగా ప్రవేశించలేకున్నాము. ఇప్పుడు మనం కార్యకారణ వ్యవస్థలో చిక్కుకొని ఉన్నాము. స్పష్టంగా “చేరువనే వున్నది చెప్పరాని ఫలము” అని చెప్పారు. వేలాది పనుల్లో మునిగిపోతున్న మనకు చేరువనే ఉన్నది ఎందుకు కనిపించదు? ఇంకా దుర్భిణీలు, భూతద్దాలు పెట్టుకుని చూస్తున్నా ఎందుకు కనిపించదు? అన్నమాచార్యులు చెబుతున్నది ఈ వ్యవస్థను దాటుకుని ఉన్న విషయాన్ని గురించి కావచ్చు. 

మొదటి చరణం: 
కోపము విడిచితేనె పాపము దానే పోవు
దీపింప సుజ్ఞానముతెరు విదివో
లోపల మనిలుఁడై లోకముమెచ్చుకొరకు
పైపైఁగడిగితేను పావనుఁడౌనా        ॥ఊర॥  
కీర్తన పాదము
భావము
కోపము విడిచితేనె పాపము దానే పోవు
కోపము విడిచితేనె పాపము తనంతట తానే పోవు
దీపింప సుజ్ఞానముతెరు విదివో
సుజ్ఞానము దీపంలా ప్రకాశించుటకు తెరు ఇదిమాత్రమే
లోపల మనిలుఁడై లోకముమెచ్చుకొరకు
లోలోపల మురికిని  కూడబెడుతు లోకముమెచ్చుకొరకు
పైపైఁగడిగితేను పావనుఁడౌనా
మానవుడా పైపైన కడిగితే పావనుడగుదువా?
భావము: కోపాన్ని విడిచితేనె, పాపము తనంతట తానే పోతుంది (తెలియకుండానే). సుజ్ఞానము దీపంలా ప్రకాశించుటకు మార్గమదే.  పైపైకి శుభ్రంగా మరియు తాజాగా కనిపించినా; {మంచి మర్యాదలు నేర్చి (ప్రజలకు) ప్రదర్శించడంలో నిపుణులైనా} మీరు నిజంగా అంతర్గతంగా శుభ్రంగా ఉంటే తప్ప ఎటువంటి ప్రయోజనం చేకూరదు. 

గూఢార్థవివరణము: కోపము మనిషి జీవితంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. కోపము దాని వెనుక కారణములు కోరికలు, ఆశలు, నిరాశలు వంటివి శతవిధములుగ పెల్లుబికి వస్తుంటే కోపము విడుచుట సమస్య అవుతుంది. భగవద్గీతలోని 3.37వ శ్లోకంలో భగవానుడు కామము, క్రోధము కలిపి మనిషిని పాపములకు పురికొల్పుతున్న వానిగా అభివర్ణిస్తాడు.

మన జీవితంలో కపటత్వం కూడా ఒక భాగమైపోయింది. వేదాలు చదవడం, శాస్త్రాలు నేర్చుకోవడం, మంచి మాటలు మాట్లాడడం — ఇవన్నీ ఉన్నప్పటికీ, అంతర్గతంగా మనం ఎలా ఉన్నామన్నది మరచిపోతుంటాము. వేమన కూడా ఇదే విషయాన్ని తనదైన శైలిలో చెబుతాడు:
వేషభాషలెరిగి కాషాయవస్త్రముల్
గట్టగానే ముక్తి గలుగబోదు
తలలు బోడులైన తలపులు బోడులా
విశ్వదాభిరామ వినుర వేమ

ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినది అంతరంగ పావనత. మరి అంతరంగాన్ని ఎవరు పరిశీలించలేరు కదా కాబట్టి మానవుడు తనకు తానే అంతరంగాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏది పరిశుభ్రం? ఇక్కడే మనం సాపేక్ష స్థితికి వస్తున్నాం. అంటే ప్రతివారు తమను తాము పవిత్రుల కింద జమ కట్టుకోవచ్చు. ఎవరిని నమ్మవచ్చు? ఎవరిని నమ్మకూడదు? ఈ మీమాంసలో కొట్టుకొనిపోవుట అసలు గందరగోళం.

దైవము ఒక్కడే అయినప్పుడు ఈ గందరగోళములెందుకు? క్రిందటి కీర్తనలో "పన్నినకూఁకటివేరై పారి నీవు వుండఁగాను వున్నతిఁ గొనలకు నీ రొగ్గి నేఁ బోసితిని" (రహస్యముగా నీవు ప్రధానమైన వేరు అయివుండగాను పైన ఎక్కడో వున్న కొమ్మల కొనలకు నీరు పోసితిని). అన్నది గుర్తుకు తెచ్చుకొనవలెను. తాముగా నిర్ణయించలేని చర్యలను చేపట్టుట ఏల​?

రెండవ చరణం: 
ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు
కందువ నాస మానితే కైవల్యము
బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు
చిందు వందు చిత్తమైతే చేరునా వైకుంఠము    ॥ఊర॥         
కీర్తన పాదము
భావము
ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు
మన ముందరి (భవిష్యత్తు అను) కోరికలు సమసిపోతే, మనలను ముంచివుంచుతున్న బంధాలు వీడిపోవును
కందువ నాస మానితే కైవల్యము
(కందువ = ౙాడ, సంకేతస్థలము, ఏకాంతము; ఇక్కడ కందువ నాస = ౙాడ తెలుసుకునే ఆశ​)
నువ్వెవరో తెలుసుకోవాలనే ఆశ మానితే కైవల్యము
బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు
ఈ శరీరములోన ఒకటి ఈ భూమిపైన (ఇతరులకు చూపుటకు) మరొకటి
చిందు వందు చిత్తమైతే చేరునా వైకుంఠము
వెదజల్లబడ్డ, చెదిరిన చిత్తముతో చేరునా వైకుంఠము?

భావము: మన ముందరి (భవిష్యత్తు అను) కోరికలు సమసిపోతే, మనలను ముంచివుంచుతున్న బంధాలు తమంతట తామే వీడిపోవును. తానెవరో తెలుసుకోవాలనే ఆశ మానితే అదే కైవల్యము. ఈ శరీరములోన ఒకటి ఈ భూమిపైన (ఇతరులకు చూపుటకు) మరొకటిగా చిత్తమైతే చెల్లాచెదరిన మనసుతో చేరునా వైకుంఠము?


గూఢార్థవివరణము: 
ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు: ఇప్పుడు ఈ చరణాన్ని పల్లవి తోటి అనుసంధానించి చూడండి. "ఊరకే వెదకనేల వున్నవి చదువనేల?" మానవులను నడుపుతున్నది  ఇన్ని విజయాలకు కారణమైనది కుతూహలమే అయినా, దైవము సత్యము ధర్మము అను విషయములలో   అది తప్పుదారి పట్టించుటకు కూడా అనుకూలించుచున్నదని తెలియుచున్నది. 

కందువ నాస మానితే కైవల్యము: తనను తాను తెలుసుకోవాలనే ఆశను కూడా అన్నమాచార్యులు ప్రశ్నిస్తున్నారు. తెలియవలసినది వున్నది అను భావన ఉన్నంత వరకు తెలియవలసినది ఉంటూనే ఉంటుంది. కానీ తెలుసుకోవాలనే ఆ తపన వెనుక ఉన్నది ఏమిటి? మన భావనలన్ని క్షణికములు. కావున మన ప్రస్తుత స్థితిలో స్థిరమైనదేదో నిర్ణయించడానికి తగిన ప్రమాణం లేదు. స్థిరమైన సమాధానాన్ని సంపాదించుకోవాలనే తాపత్రయం కూడా మరొక అన్వేషణా? లేక నిశ్చితత్వానికి చేరుకోవడానికి సంకేతమా?

బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు: ఆత్మవంచన మనకు వెన్నతోఁబెట్టిన విద్య​. ఆరుద్ర గారి క్రింది కూనలమ్మ పదాన్ని చూడండి. 
ఆత్మవంచన వల్ల
ఆడు కల్లల వల్ల
అగును హృదయము డొల్ల
ఓ కూనలమ్మ

ఎరిక్ ఆంబ్లర్ తన The Mask of Dimitrios నవలలో ఒక ముఖ్యమైన పరిశీలన చేస్తాడు: మనలోని కుటిలత్వాన్ని గ్రహించనంత వరకు ఇతరులలోని ద్వంద్వత్వము మనకు అసహ్యాన్ని కలిగిస్తుంది ("The duplicity of others must always be shocking when one is unconscious of one's own.")
ఇతరులలో కనిపించే ద్వంద్వ స్వభావాన్ని గమనించే మనకు, మనలోని ద్వంద్వాన్ని చూసే చూపు ఎందుకు ఉండదు?

మూడవ చరణం: 
కాంతల పొందొల్లకుంటే ఘనదుఃఖమే లేదు
అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుఁడు
అంతట మాటలె యాడి హరి శరణనకుంటే
దొంతినున్నభవములు తొలఁగునా వివేకికి         ॥ఊర॥ 
కీర్తన పాదము
భావము
కాంతల పొందొల్లకుంటే ఘనదుఃఖమే లేదు
స్త్రీలపై మోహము (బంధుప్రీతి) కంటే దుఃఖమే లేదు
అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుఁడు
మానవులందరికి అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుఁడే కదా
అంతట మాటలె యాడి హరి శరణనకుంటే
అంతటా ఆ మాటలె ఆడినా, హరిని శరణనకుంటే
దొంతినున్నభవములు తొలఁగునా వివేకికి
(లేకున్న​) ఒకదానిమీద ఒకటి పేర్చియున్న ఈ భవములు తొలఁగునా వివేకులకు

భావము: స్త్రీలపై మోహము (బంధుప్రీతి) కంటే గొప్ప దుఃఖం మరొకటి లేదు. మానవులందరికి అంతరంగ నివాసి వెంకటేశ్వరుడు. ఓ తెలివైన ప్రజలారా !! మీరు శ్రీవేంకటేశుని మాటలు పలకడం కాదు, శరణనకుంటే తప్ప, పునర్జన్మల నుండి తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు.


గూఢార్థవివరణము: 
కాంతల పొందొల్లకుంటే ఘనదుఃఖమే లేదు: అన్నమాచార్యుల దృష్టిలో పురుషుడు ఒక్కడే పరమాత్మ; తక్కిన వారందరూ స్త్రీలు అని చెప్పే భావనను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇది మానవులందరూ పరమాత్మపై ఆధారపడినవారనే భావనను వ్యక్తపరచే రూపకం.

అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుఁడు: మొదటి రెండు పంక్తులను కలిపి చూస్తే, మానవులందరూ శ్రీ వేంకటాద్రీశుని ద్వారా అనుసంధానించబడి ఉన్నారనే భావం కనిపిస్తుంది. భగవద్గీతలోని 2.17, 2.18 శ్లోకాలు కూడా నశించని అంతర్గత వాస్తవానికి, నశించే శరీరాలకు మధ్య ఉన్న భేదాన్ని సూచిస్తాయి. మనిషికి అసలు బంధుత్వము దైవంతోనే. మానవులు తమలో తాము ఏర్పరచుకున్న బంధుత్వాలు మోహజనితమైనవనే సంగతిని అన్నమాచార్యులు ఇక్కడ చూపిస్తున్నారు.

సుఖము, దుఃఖము అనునవి విడివిడిగా స్వతంత్రంగా ఉండే భావాలు కావు. ఒకటి లోపించినప్పుడు మరొకటి ఉద్దీపన చెందడం వల్ల సుఖదుఃఖాలనే అశాశ్వత భావాలు ఏర్పడుతున్నాయి. ఆ రెండింటిలో దేనికీ స్థిరత్వం లేదు. భగవద్గీత రెండవ అధ్యాయంలోని 62&63 శ్లోకాలలో కూడా ఈ భావోద్వేగాల పరస్పర సంబంధాన్ని గమనించవచ్చు.

కావున అన్నమాచార్యులు ఈ సుఖదుఃఖాలతో ముడిపడిన బంధుత్వాలకు అతీతంగా, అసలు బంధుత్వాన్ని గుర్తించమని సవాలు విసురుతున్నట్లుగా అనిపిస్తుంది.

అంతట మాటలె యాడి హరి శరణనకుంటే: మాటలతో చింతకాయలు రాలతాయా? ఒక పనికి తగిన కార్యాచరణ ఉంటేనే దాని ఫలితం కనిపిస్తుంది. హరి గురించి ఎక్కడైనా మాట్లాడటం, ఆయన నామాన్ని పలకడం, ఆయనను స్తుతించడం ఒకటి; నిజంగా ఆయన శరణు పొందడం మరొకటి.

పైపైకి ఎన్ని భజనలు, నమస్కారాలు, ప్రార్థనలు, తపస్సులు చేసినా, అవి నిజమైన శరణాగతిని సూచించకపోతే ప్రయోజనమేమిటి? మాటలకు, మనం నిజంగా ఉన్న స్థితికి మధ్య ఉన్న అంతరాన్ని అన్నమాచార్యులు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు.

దొంతినున్నభవములు తొలఁగునా వివేకికి: ఒకదానిపై మరొకటి పేర్చినట్లుగా పేరుకుపోయిన భవములు తొలగుతాయా అని కవి ప్రశ్నిస్తున్నారు. అయితే అవి తొలగుతాయా లేదా అన్నదానికంటే, మనిషి నిజంగా ఏ స్థితిలో ఉన్నాడన్నదే ఇక్కడ ముఖ్యమైన విషయం.

అన్నమాచార్యులు సూచిస్తున్న శరణాగతి ఒక్కసారి మొక్కుకొని, ఆ తరువాత మామూలు జీవితంలోకి వెళ్లిపోవడం కాదు. అది నిరంతరంగా కొనసాగే ఒక స్థితి — విశ్వాసం, అంతర్గత నిశ్చలత, మరొక విషయంపై ఆసక్తి లేని నిమగ్నత, తన్మయత్వం. ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి తాను ఏ స్థితిలో ఉన్నాడనే లెక్క కూడా ఉండదు.

కాబట్టి ఒకదానిపై మరొకటి పేర్చుకున్న భవములు తొలగుతాయా లేదా అన్నది ప్రధానమైన ప్రశ్న కాదు. మనిషి నిజంగా శరణాగతి స్థితిలో ఉన్నాడా అన్నదే ముఖ్యం. 

 కీర్తనలోని భావ పురోగతి:
కీర్తన పాదము
భావము
భావ పురోగతి
పల్లవి

 

 

ఊరకే వెదకనేల వున్నవి చదువనేల

ఇప్పటికే అందుబాటులో ఉన్నదానిని వదిలి, ఎందుకు వెదకడం? ఎందుకు చదువుతూ కాలం గడపడం?

ప్రయత్నం కాదు. ప్రయత్నించునదేమి?
చేరువనె వున్నదిదె చెప్పరాని ఫలము
చేరువలోనే ఉన్నది మాటలతో, చూపులతో, వినికిడితో, మనోగ్రహింపుతో కానీ వివరించలేని ఫలము.
చేరువనె వున్నా చెప్పరాని ఫలమేమి?
మొదటి చరణం

 

 

కోపము విడిచితేనె పాపము దానే పోవు
కోపము విడిచినప్పుడు పాపము తనంతట తానే తొలగిపోతుంది.
కోపములో చిక్కుకొనునదేమి?
దీపింప సుజ్ఞానముతెరు విదివో
సుజ్ఞానము ప్రకాశించడానికి ఇదే మార్గమేమో!
సుజ్ఞానము నేర్వ వలసిన మరొక విషయము కాదు. అజ్ఞానము తొలగిన స్థితి
లోపల మనిలుఁడై లోకముమెచ్చుకొరకు పైపైఁగడిగితేను పావనుఁడౌనా
లోపల మలినమును కలిగి ఉండి, లోకము మెచ్చుకోవడానికి పైపైన శుభ్రపడితే పవిత్రుడవుతాడా?
బయటకు కాదు, లోలోపల ఎంత పరిశుద్ధుడవు?
రెండవ చరణం

 

 

ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు
భవిష్యత్తు గురించిన కోరికలు సమసిపోతే, ముంచివుంచుతున్న బంధాలు వీడిపోతాయి.
భవిష్యత్తును కల్పించునదేమి?
కందువ నాస మానితే కైవల్యము
తనను తాను తెలుసుకోవాలనే ఆశను విడిచిపెడితే అదే కైవల్యము.
తెలియవలెను అను ఆశ తెలియుటకు మార్గమా?
బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు
శరీరంలో ఒకటి, భూమిపై ఇతరులకు చూపించేది మరొకటి.
జీవించుటకొకటి, పరమమును తెలియునదొకటి.  అవి వేరు వేరు అస్తిత్వములా?
చిందు వందు చిత్తమైతే చేరునా వైకుంఠము?
చెదురుమదురైన, విభజితమైన చిత్తంతో వైకుంఠాన్ని చేరగలమా?
చెదురుమదురైన చిత్తము చేరు గమ్యమేమి?  వైకుంఠమా?
మూడవ చరణం

 

 

కాంతల పొందొల్లకుంటే ఘనదుఃఖమే లేదు
మానవులు ఏర్పరచుకున్న బంధుత్వాలు మోహజనితమైనవి; వాటి పట్ల మోహమే గొప్ప దుఃఖానికి కారణమవుతుంది.
ఒకటి లోపించినప్పుడు మరొకటి ఉద్దీపన చెందడం వల్ల సుఖదుఃఖాలనే అశాశ్వత భావాలు ఏర్పడుతున్నాయి.
అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుఁడు
మానవులందరి అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుడే.
మనము ప్రత్యక్షముగా శ్రీవేంకటాద్రీశునితో కలుపబడి ఉన్నాము. తక్కినవి పరోక్షములు.
అంతట మాటలె యాడి హరి శరణనకుంటే దొంతినున్నభవములు తొలఁగునా వివేకికి?
ఎక్కడైనా హరి గురించి మాటలు పలుకుతూ, ఆయన శరణు పొందకపోతే, ఒకదానిపై మరొకటి పేర్చిన భవములు తొలగుతాయా?
మాటలతోనే శరణాగతి కలుగునా?

x-x-x The End x-x-x

 

66R ūrakē vedakanēla vunnavi caduvanēla (ఊరకే వెదకనేల వున్నవి చదువనేల)

  ANNAMACHARYA 66R. ఊరకే వెదకనేల వున్నవి చదువనేల (ūrakē vedakanēla vunnavi caduvanēla) తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. Introduction ...