Saturday, 13 December 2025

T-290 నీవే నన్ను దయఁ గావు నీవు స్వతంత్రుఁడవు

                                               తాళ్లపాక అన్నమాచార్యులు
               290 నీవే నన్ను దయఁ గావు నీవు స్వతంత్రుఁడవు
                                     For English version press here 

స్వతంత్రత పరతంత్రము నుండి రాదు

ఉపోద్ఘాతము
ఈ కీర్తనలో అన్నమాచార్యులు
అతి సూక్ష్మమైన కానీ గాఢమైన సత్యాన్ని స్పష్టంగా ఉంచుతున్నారు.
స్వతంత్రత పరతంత్రము నుండి రాదు.”
మన మనసు,
మన జన్మ,
మన ఆలోచనలు,
మన శరీరం —
ఇవన్నీ ఈ ప్రపంచం నుండే పుట్టినవి.
ఇవి పదార్థ సమ్మేళనములు.
మార్పుకు లోబడునవి.
పునరావృత స్వభావములు గలవి.
కాబట్టి అనిత్యములు.
అటువంటి అనిత్య సాధనముల నుంచి
నిత్యుడైన భగవంతునికి
దారి సహజంగా దుస్సాధ్యమే.


అధ్యాత్మ​ కీర్తన
రేకు: 293-6 సంపుటము: 3-541
నీవే నన్ను దయఁ గావు నీవు స్వతంత్రుఁడవు
జీవుఁడ నింతే నేను శ్రీమన్నారాయణా ॥పల్లవి

నిను నామనసుఁ గొని నేఁ దలఁచేనంటినా
మన ప్రకృతిఁ బుట్టె మరి నిన్నెట్టు దలఁచీ
తనువుఁ గొని నీసేవ తగిలి సేసేనంటినా
తనువు కర్మాధీనము తగిలీనా నిన్నును ॥నీవే

గరిమ నర్థమిచ్చి నీగతి గనేనంటినా
హిరణ్య మజ్ఞానమూల మెట్టు నీకు నియ్యనిచ్చీ
సిరుల నాజన్మము నీసెలవు సేసేనంటినా
సరిఁ బుట్టుగు సంసారసాధ్యము నిన్నంటీనా ॥నీవే

యిలఁ బుణ్యఫలము నీకిచ్చి మెప్పించేనంటినా
ఫలము బంధమూల మేర్పడనియ్యనిచ్చీనా
నిలిచి శ్రీవేంకటేశ నే నీశరణు చొచ్చితి
యెలమి నీకరుణ నన్నెడయనిచ్చీనా ॥నీవే
Details and Explanations:
పల్లవి
నీవే నన్ను దయఁ గావు నీవు స్వతంత్రుఁడవు
జీవుఁడ నింతే నేను శ్రీమన్నారాయణా ॥పల్లవి॥ 
              Telugu Phrase
Meaning
నీవే నన్ను దయఁ గావు నీవు స్వతంత్రుఁడవు
నీవే నన్ను దయఁ గావు నీవు స్వతంత్రుఁడవు
జీవుఁడ నింతే నేను శ్రీమన్నారాయణా
జీవుఁడ నింతే నేను శ్రీమన్నారాయణా

 భావము:
శ్రీమన్నారాయణా! నీవు స్వతంత్రుడివి.
నేను సామాన్య జీవుణ్ణి.
నా వశములో ఏది లేదు.
నన్ను దయతో గావుము నీవే.

గూఢార్థవివరణము:

స్వతంత్రం లేని మనుషులు
ఎల్లవేళలా స్థితి కల్పించు కపటాలకు లోనై,
ప్రతిస్పందనల పాలై
జీవితం బరువై
ఆశల నిలయమై
కాలము గాలమై
నెట్టుకొని మనుచుందురు

బద్ధులైన వారు తమంతట తాము బంధములు విడదీయలేరు.
కట్టు, కట్టినది, కట్టబడినది — అన్నీ ఒకే చెట్టు పనిముట్లు.
ఎంత పెనగులాడినా ప్రయోజనం శూన్యం.
పెనగులాటయే కృషి.
మానితేనే ఋషి.

అన్నమాచార్యుడు సూటిగా చెబుతారు:
శ్రీమన్నారాయణా!
ఇది నా చేత అసాధ్యం.
నీ కృప లేక తెగదు దాస్యం.”


మొదటి చరణం:
నిను నామనసుఁ గొని నేఁ దలఁచేనంటినా
మన ప్రకృతిఁ బుట్టె మరి నిన్నెట్టు దలఁచీ
తనువుఁ గొని నీసేవ తగిలి సేసేనంటినా
తనువు కర్మాధీనము తగిలీనా నిన్నును ॥నీవే
Telugu Phrase
Meaning
నిను నామనసుఁ గొని నేఁ దలఁచేనంటినా
నిన్నుమనసులో తలచె​దనంటే
మన ప్రకృతిఁ బుట్టె మరి నిన్నెట్టు దలఁచీ
ఈ మనస్సు పుట్టినదే క్షణక్షణము మారుతున్న ప్రకృతి నుండి.
తనువుఁ గొని నీసేవ తగిలి సేసేనంటినా
ఈ శరీరముతో నీకు సేవ చేద్దామని అనుకున్నా
తనువు కర్మాధీనము తగిలీనా నిన్నును ॥నీవే
ఈ శరీరము కర్మలలో చిక్కి వున్నది. ఇది నిన్నెట్లు తగులుకొనును?​

భావము: 
నేను నా మనసుతో నిన్ను ధ్యానించానని అనుకున్నా —
ఈ మనస్సు పుట్టినదే క్షణక్షణము మారుతున్న ప్రకృతి నుండి.
ఈ అనిత్యమైన స్థితి నుండి నిత్యుడవైన నిన్నెట్లు మదిలో నిలుపగలను?"
మాటిమాటికి ఈ శరీరముతో నీకు సేవ చేద్దామని అనుకున్నా
ఈ శరీరము కర్మలలో చిక్కి వున్నది. ఇది నిన్నెట్లు తగులుకొనును?

గూఢార్థవివరణము: 
నిను నామనసుఁ గొని నేఁ దలఁచేనంటినా
దైవము అన్నది మనలాంటి సామాన్యులకు పరోక్ష జ్ఞానము.
మారుతూ, రూపాంతరము చెందుతూ వున్న​
స్థితినుండి చేయు సర్వకార్యములు పునరావృత్తిలోనివే.
అటువంటి పూజ ఇక్కడే ఈ భూమ్మీదే చక్రంలా తిరుగుతోంది.
కాబట్టి నేను దైవానికి పూజ చేశాను అని అనుకోవడం అవివేకం.

తనువుఁ గొని నీసేవ తగిలి సేసేనంటినా
మరియొక జన్మ ఎత్తినా నీ సేవకే జీవిస్తాను”
అని అనుకున్నా కూడా
ఈ శరీరం తన పదార్థ తత్వానికి,​ స్వరూపానికే వశము.
ఇది సుఖానికే పరిగెడుతుంది.
మనసు మరో దారి, దేహం మరో దారి.
అందువల్ల “నీ సేవలో తగిలేను”
అని నేను నమ్మకంగా చెప్పలేను
అని అన్నమయ్య సూటిగా చెబుతున్నాడు.

అన్నమాచార్యులు ఈ చరణంలో
అయ్యా శ్రీమన్నారాయణ నా అంతట నేను నీ దగ్గరికి రాలేను
కాబట్టి నువ్వే నా దగ్గరికి రావయ్య అంటున్నాడు.
భక్తి ఒక ఆర్భాటం కాదు —
మానవుడు తన పరిమితులను
నిజాయితీగా అంగీకరించడం.

రెండవ​ చరణం:
గరిమ నర్థమిచ్చి నీగతి గనేనంటినా
హిరణ్య మజ్ఞానమూల మెట్టు నీకు నియ్యనిచ్చీ
సిరుల నాజన్మము నీసెలవు సేసేనంటినా
సరిఁ బుట్టుగు సంసారసాధ్యము నిన్నంటీనా ॥నీవే
Telugu Phrase
Meaning
గరిమ నర్థమిచ్చి నీగతి గనేనంటినా
ఎక్కువ ధనమిచ్చి నీవే  గతి అంటినా
హిరణ్య మజ్ఞానమూల మెట్టు నీకు నియ్యనిచ్చీ
ఆ బంగారము, ఆ ధనము అజ్ఞానమునకు మూలము. వాటితో అయ్యే పనేనా?
సిరుల నాజన్మము నీసెలవు సేసేనంటినా
నా యీ పదార్థ సమ్మిళితమగు జన్మను నీకు ఉపయోగించ ఇచ్చెదనంటే,
సరిఁ బుట్టుగు సంసారసాధ్యము నిన్నంటీనా
పుట్టుకకు ఋజువు సంసారముతోనే సాధ్యము.  దానితో నీ వద్దకు చేరగలనా? (లేను)
సూటి భావము:
ఎక్కువ ధనమిచ్చి నీవే  గతి అంటినా, ఆ బంగారము, ఆ ధనము అజ్ఞానమునకు మూలము. వాటితో అయ్యే పనేనా?  నా యీ పదార్థ సమ్మిళితమగు జన్మను నీకు ఉపయోగించ ఇచ్చెదనంటే, పుట్టుకకు ఋజువు సంసారముతోనే సాధ్యము.  దానితో నీ వద్దకు చేరగలనా? (లేను).

గూఢార్థవివరణము:
సరిఁ బుట్టుగు సంసారసాధ్యము నిన్నంటీనా
అయ్యా వెంకటేశ్వర! నిన్ను వడ్డికాసులవాడు అని అంటారు కానీ
నీకు ధనమునిచ్చి బంగారం ఇచ్చి నీ వద్దకు చేరగలనా?
పదార్థ సమ్మిళితమగు జన్మలో జనియించు ఆలోచనలన్నీఅనిత్యములే.
వానిని ఆసరాగా తీసుకొని భగవంతుని చేరలేను.

మూడవ​ ​ చరణం:
యిలఁ బుణ్యఫలము నీకిచ్చి మెప్పించేనంటినా
ఫలము బంధమూల మేర్పడనియ్యనిచ్చీనా
నిలిచి శ్రీవేంకటేశ నే నీశరణు చొచ్చితి
యెలమి నీకరుణ నన్నెడయనిచ్చీనా ॥నీవే
Telugu Phrase
Meaning
యిలఁ బుణ్యఫలము నీకిచ్చి మెప్పించేనంటినా
ఈ ప్రపంచములో పుణ్యఫలములను నికిచ్చి మెప్పించ చూసినా
ఫలము బంధమూల మేర్పడనియ్యనిచ్చీనా
ఆ ఫలములు బంధములకు మూలములు. కావున అవి నీకిచ్చు మార్గమును ఏర్పరచలేవు.
నిలిచి శ్రీవేంకటేశ నే నీశరణు చొచ్చితి
శ్రీవేంకటేశ, నేను ఏమి చేయాలో పాలుపోక నీశరణు చొచ్చితిని.
యెలమి నీకరుణ నన్నెడయనిచ్చీనా
అవధులులేని నీకరుణ నన్ను దూరము జరుపుతుందా? (జరపదు)
సూటి భావము:
ఈ ప్రపంచములో పుణ్యఫలములను నీకిచ్చి మెప్పించ చూసినా ఆ ఫలములు బంధములకు మూలములు. కావున అవి నీకిచ్చు మార్గమును ఏర్పరచలేవు. ఇవి తెలిసి శ్రీవేంకటేశ, నేను ఏమి చేయాలో పాలుపోక నీశరణు చొచ్చితిని. అవధులులేని నీకరుణ నన్ను దూరము జరుపుతుందా? (జరపదు)

గూఢార్థవివరణము:
ఫలము బంధమూల మేర్పడనియ్యనిచ్చీనా
అన్నమాచార్యులవారు ముఖ్యమైన సందేశం తెలుపుతున్నారు.
ఈ లోకములో పాపములు పుణ్యములు అని వేర్వేరుగా చూచు కార్యములకు
నిజమైన అస్తిత్వము లేదు
ఆయా ఫలములను గైకొనుటతోనే మానవునికి ఈ లోకము కలుగుచున్నది
కార్యములు కొనసాగుచూ వర్ధిల్లుతున్నవి.


భగవద్గీతలో (5-14)  చెప్పినట్లు "న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే"
భౌతిక ప్రకృతియే ఆ కర్తృత్వమును కలుగజేయుచున్నది.
దీనికి భగవంతుడు కారణము కాడు.

నిలిచి
ఈ పదంతో అన్నమాచార్యులవారు
తాను చేయు ప్రయత్నాలు యే మాత్రము దైవమునకు మార్గము కావని నిలిపి,
చేష్టలుడిగి, ఏమి చేయాలో పాలుపోని స్థితిలో
 శ్రీ వెంకటేశ్వరని శరణు జొచ్చారు.

నిలిచి శ్రీవేంకటేశ నే నీశరణు చొచ్చితి
పైన చెప్పిన విషయములను మనం మేధోపరంగా ఒప్పు కొనవచ్చును.
అయితే ఆచార్యుల మాదిరి  శరణు చేయు సాహసం మాత్రం చేయబోము.
జీవితానికి గమ్యం లేదంటామే కానీ, వాస్తవానికి అసలైన గమ్యం గురించి అలోచించము.

యెలమి నీకరుణ నన్నెడయనిచ్చీనా
ముఖ్యంగా మనకి భగవంతుని మీద నమ్మకం పాక్షికం మాత్రమే
కాబట్టి మన జీవితాలు అలాగే నడుస్తున్నాయి.

శరణాగతి అంటే ఏమిటి?
అన్నమాచార్యులు చెప్తున్న శరణాగతి అంటే ఏమిటి ఆలోచించండి.
ఈ కీర్తనలోని మొదటి 12 పంక్తులు
మానవుడు ఏ కార్యములు చేపట్టినను అవి సంపూర్ణముగా ఫలించవన్నారు.
ఈ అసంపూర్ణత బయటి ప్రపంచంలోనిది కాదు.
 మనలోనే  ఉన్నది.

దీన్ని వాస్తవముగా గ్రహించినవాడు కార్యములకు బదులు
తనలోని ఈ అసంపూర్ణతను వీడుటకు ఏదైనా  ఒడ్డును (ప్రాణములతో సహా). 
ఆ కార్యమునకు కావలసిన ఏకాగ్రత
తన అసంపూర్ణతను  బట్టబయలు చేయడంలోనే ఉన్నది.
దీనికి ముఖ్యంగా అడ్డుపడునది మనమే కట్టుకున్న నేను అనే భావన.
దీనిని అధిగమించుటకు అడ్డుపడునది
ప్రపంచపు కట్టుబాట్లు, సంస్కృతి
ఎల్లలు లేని స్వీయ జాలి.
"స్వీయజాలి" అంటే జీవితం ఎలాగైనా కొనసాగించి వలెనను భావన.

అందుకనే అన్నమాచార్యులు ఇలా  అన్నారు.
లెండో లెండో మాటాలించరో మీరు
కొండలరాయనినే పేర్కొన్నదిదె జాలి
(లెండి.నిద్దుర లెండి. మీరు నా మాట ఆలకించండి. కొండలరాయని మీచే స్తుతింపచేయుచున్నది ఈ క్లేశములుఖేదములే

జీవితం పై ఆశతో మనిన కలుగునది ఈ ప్రపంచం
జీవితం ఏమైనా ఫర్వాలేదు అన్న తెలియునది దైవం.

బుద్ధుడు చెప్పిన ప్రతీత్య సముత్పాదనం అర్ధం కూడా ఇదే ‌

బైబిలులోని క్రింది వాక్యము అర్ధం కూడా ఇదే .

  అప్పుడు యేసు తన శిష్యులను చూచి 
“ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల
తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. 
తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును
నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించు కొనును.”
 (ముత్తయి 16:24-26). ‌

అభిప్రాయాలు వదిలి బాధలను లక్ష్య పెట్టని వారు పుణ్యులు
అభిప్రాయాలు మార్చుకుని సుఖాలు కామించిన కలుగునది ప్రపంచం.

No comments:

Post a Comment

T-290 నీవే నన్ను దయఁ గావు నీవు స్వతంత్రుఁడవు

                                                తాళ్లపాక అన్నమాచార్యులు                 290 నీవే నన్ను దయఁ గావు నీవు స్వతంత్రుఁడవు          ...