Tuesday 30 August 2022

T-139 వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు

 తాళ్లపాక అన్నమాచార్యులు

139 వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు 

క్షీణత   

Those interested in English Version may press this link

 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు రచించిన గొప్ప కీర్తనలు పుంఖానుపుంఖములే కాక అబ్బురపరిచేవి, ఆశ్చర్యకరమైనవీనూ. కవిత్వం పట్ల ఆయన దాహం తీరనిది. సరళత​, స్పష్టత, సూటిగా హృదయమందే నాటుట ఆయన భావావేశంలోని కీలకాంశాలు.

ఆయన కీర్తనలలో కొన్నింటికి తెలుగు లేదా వ్యావహారిక భాషలలో నిజమైన అర్థాలు లేవని మనకు తెలుసు, కాని వాటి లయను నాట్యానికి ఉపయోగించవచ్చు. కానీ, సమకాలీన అధివాస్తవిక (సర్రియలిజమ్) చిత్రలేఖనాలను కూడా తన కవిత్వం ద్వారా చూడవచ్చని, వివరించవచ్చని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయన కళాదృష్టి దేశ, కాల, వ్యవహార పరిమితులను కూడా అధిగమించింది

అధివాస్తవిక మేధావి సాల్వడార్ డాలీ రచించిన “the persistence of time” ("సమయం యొక్క పట్టుదల") అను శీర్షికగల ప్రపంచ ప్రసిద్ధి గాంచిన  పెయింటింగ్ ద్వారా అందమైన పద్యాన్ని వివరించడానికి నేను ప్రయత్నించాను. భౌతికవాదనల  ఆలోచనల పరాకాష్టకు ప్రతీకగా నిలచిన చిత్రలేఖనమునకు మరియు ధ్యానమయ జీవితానికి సరికొత్త బాటలు వేయు అన్నమయ్య కీర్తనలకు  మధ్య పోలికలను పాఠకులు ఆస్వాదిస్తారని  ఆశిస్తున్నాను

కీర్తన:

రాగిరేకు:  30-3  సంపుటము: 1-184

 

వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు
బట్టబయలు యీసంసారంబని గుట్టు దెలియలేవు ప్రాణీ వట్టి॥
 
చాల నమ్మి యీ సంసారమునకు సోలి సోలి తిరిగేవు
బాలయవ్వనప్రౌఢల భ్రమఁబడి లోలుఁడవై తిరిగేవు
మేలుదెలియ కతికాముకుండవై మీఁదెఱఁగక తిరిగేవు
[1]మాలెమీఁద పరు వెందాఁకా నీ మచ్చిక విడువఁగ లేవు వట్టి॥
 
మానితముగ దురన్నపానముల మత్తుఁడవై వుండేవు
నానావిధముల [2]దుష్కర్మంబులు నానాటికి నాటించేవు
మేనిలోని యేగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవు
ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియఁగ లేవు వట్టి॥
 
[3]పామరివై దుర్వ్యాపారమునకు పలుమారునుఁ బొయ్యేవు
వేమరు దుర్జనసంగాతంబులు విశ్రామమనుచు నుండేవు
ప్రేమముతో హరిదాసులపై సంప్రీతి నిలుపఁగా లేవు
తామసమతివయి వేంకటనాథుని తత్వ మెఱఁగఁగా లేవు వట్టి॥

Details and Explanations: 

వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు
బట్టబయలు యీసంసారంబని గుట్టు దెలియలేవు ప్రాణీ వట్టి॥ 

భావము: గుట్టులేని యీ సంసారపు గుట్టును వెదుకబోయి తిరిగేవు. వట్టియాసలను విడిచి చూడవో ప్రాణీ!

వివరణము: మానవుడు దృశ్య ప్రపంచంలో ఏదో రహస్యం దాగుందని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. అందులోనే తన జీవితాన్ని వ్యర్ధంగా గడుపుతాడు. అన్నమాచార్యులు రహస్యమూ లేదని కొట్టిపారేశారు.   అందువలన, "రహస్యాన్ని వెతుకుటకు మనిషిని ప్రేరేపించు దానిని పూర్తిగా వదలివేయాలి" అనేది పల్లవి అర్థం.

క్రింద ఇవ్వబడిన “the persistence of time” ("సమయం యొక్క పట్టుదల") పేరుతో సాల్వడార్ డాలీ యొక్క ప్రసిద్ధ చిత్రలేఖనముతో  కవితకు ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు చూద్దాం. మొత్తం చిత్రాన్ని రెండు భాగాలుగా పరిగణించవచ్చు. ఎగువ భాగం బహిరంగ సముద్ర తీరాన్ని చూపుతుంది. కుడిచేతి వైపు కొండలు చిత్రకారుని స్పెయిన్‌లోని కాటలోనియా స్థానికతను గుర్తు చేస్తుంది. ప్రపంచంలో రహస్యాలు లేవని ఓపెన్ స్పేస్ ( బాహాటముగానున్న ఆకాశము) సూచిస్తుంది. బట్టబయలు యీసంసారంబని చెప్పకయే చెబుతోంది. అయితే, దిగువ భాగంలోని చీకటి భాగమే పెయింటింగ్ యొక్క ప్రధానాంశము. 



పెయింటింగ్ యొక్క దిగువ భాగంలో గుర్తించదగిన వస్తువులు బహిరంగ ప్రదేశం నుండి వచ్చే కాంతి కారణంగానే గుర్తించగలము. సాపేక్షంగా ఎక్కువ భాగంలో అలుముకొనియున్న చీకటి మన గురించి లేదా మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనకు చాలా తక్కువ తెలుసని సూచిస్తుంది. చీకటిని తామసమతివయితో (= మనసును అంధకారము అలముకోగా, 3వ చరణం నుండి) పోల్చి చూడండి. మానవుని జ్ఞానం  పాక్షికమని కీర్తన సారాంశమూనూ.  

ఇక్కడ​ తెల్లవారి నప్పుడెల్లాతెలిసితిననే గాని / కల్లయేదో నిజమేదోకాన నేను#1 (=తెల్లవారినప్పుడే తెలుకొంటిని గానీ, నాకై నేను కల్లయేదో, నిజమేదో తెలియకుంటిని) అన్న అన్నమాచార్యుని మాటలు కూడా ఉదాహరింపదగ్గవి. 

పై చిత్రం “the persistence of time” ("సమయం యొక్క పట్టుదల") మరియు పల్లవి బాహ్య ప్రపంచంలో రహస్యమూ దాగిలేదని నొక్కి చెబుతున్నాయి.  రహస్యం ఉన్నా అది మనిషిలోపలనే. చిత్రలేఖనంలోని వివిధ వస్తువులతో కీర్తన వివరణను మనం చరణములలో కొనసాగింతము. 

అన్వయార్ధము: మానవుడా! కళ్ళు తెఱిచి నిన్ను దారితప్పిస్తున్న వాటిని తెలియుము. 

చాల నమ్మి యీ సంసారమునకు సోలి సోలి తిరిగేవు
బాలయవ్వనప్రౌఢల భ్రమఁబడి లోలుఁడవై తిరిగేవు
మేలుదెలియ కతికాముకుండవై మీఁదెఱఁగక తిరిగేవు
మాలెమీఁద పరు వెందాఁకా నీ మచ్చిక విడువఁగ లేవు వట్టి॥ 

ముఖ్య పదాలకు అర్ధాలు: సోలి సోలి = మైమఱచి మైమఱచి,  అధిక తన్మయత్వము చెంది; బాలయవ్వనప్రౌఢల భ్రమఁబడి = బాల్యము, కౌమారము, యవ్వనము, ప్రౌఢ దశల పరిణతి నీ స్వంత సృష్టిగా భావించి; మీఁదెఱఁగక = పైనది క్రిందది తెలియక​, పగలు రాత్రి అని తేడా లేకుండా,  మాలెమీఁద = తేనె దీయునప్పుడు కొండచరుల నడుమ గట్టెడి చిన్నమంచె వంటిది, (స్పష్టంగా ఇరుకైన మరియు అస్థిరమైన ప్రదేశాలు);  పరు వెందాఁకా = పరుగు ఎంత దాకా?; మచ్చిక =  చనువు గల​, చెల్లుబడి గల; విడువఁగ లేవు = దూరముండుటకు శక్తిహీనుడివి, వెడలలేని అసమర్థుడివి.   

భావము: చాల నమ్మి యీ సంసారమున మైమఱచి తిరిగేవు.  బాలయవ్వనప్రౌఢ దశలకు భ్రమలోబడి లోలుఁడవై తిరిగేవు.  మేలుదెలియక, అతికాముకుండవై పైనది క్రిందది (రాత్రింబవళ్ళు) తెలియక తిరిగేవు. తేనె దీయునప్పుడు కొండచరుల నడుమ గట్టెడి చిన్నమంచె వంటి (ఇరుకైన మరియు అస్థిరమైన) ప్రదేశాల్లో పరుగు ఎంత దాకా? (ఎంతో దూరం పరుగిడలేవు).   బలహీనుడా! చనువు గల వాటిని విడిచిపెట్టడానికి నీవు శక్తిహీనుడివి.

వివరణము: ఇప్పుడు మీరు చిత్రం మధ్యలో ఉన్న అస్పష్టమైన జీవిని గమనించే ఉంటారు. అనేక కంటి కనురెప్పలతో మూసుకుని ఉన్న కళ్ళు అది గాఢమైన నిద్రలో ఉన్నట్లు తెలుపును. ఇక్కడ సంసారమునకు సోలి సోలి తిరిగేవు (=సంసారమున ఆదమఱచి తిరిగేవు) అని అన్నమయ్య చెప్పినది చక్కగా అతుకుతుంది.

జీవి రూపవికృతి, మన గురించి మనకు ఉన్న వక్రీకృత చిత్రాన్ని సూచిస్తుంది.  ఇప్పుడు వికారమునొందించు దాని ఆకృతిని గురించి ఆలోచించండి. ఇక్కడ బాలయవ్వనప్రౌఢల భ్రమిఁబడి లోలుఁడవై తిరిగేవు = ఎంతో విస్త్రృతమైన జీవితాన్ని హ్రస్వదృష్టితో చూచు మానవుని కంటే రోఁతపుట్టించునాదా అని అన్నమయ్య అన్నది సరిగ్గా సరిపోతుంది.

చిత్రంలోని అనేక వాచీల యొక్క ప్రాముఖ్యతను పరిశీలిద్దాం. అవి మనిషికి ఉన్న పరిమిత అవకాశాన్ని సూచిస్తాయి. ఎండిపోయిన ఆలీవ్ చెట్టు కొమ్మ మీద పూర్తిగా మడిచి యుంచిన వాచీ, అప్పటికే గడిపిన ఒక కాల వ్యవధిని చూపిస్తో౦ది - అది ము౦దు జన్మ అయినా ఉ౦డవచ్చు, లేదా ఏదైనా ఊచకోతకు సాక్ష్యమైనా కావచ్చు. అందువల్ల ఇది కేంద్రం నుండి దూరంగా ఉంచబడింది.

టేబుల్ మీద ఉన్న గడియారం జీవి నిద్రకు ఉపక్రమించిన సమయాన్ని చూపిస్తుంది. వత్తిన చపాతీలాగ సాగుతున్న టైమ్ పీస్ మనిషి సమయం మరియు స్పేస్'లలో స్థిరంగా ఉండాలని కోరుకుంటాడని సూచిస్తుంది.  'నిశ్చల నిశ్చితాలు మీవి' అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు కూడా స్మరణీయం. మనిషి స్థిరమైన ఆలోచనల నుండి తన జీవితాన్ని నడపాలను కుంటాడు. మానవుడు గడచిపోయిన కాలమందలి జ్ఞానంతో పని చేస్తుంటే, సమయం మరియు సత్యము ముందుకు కదులుతాయి. అందువలన, కరిగే గడియారం మనిషి సమయాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తాడని సూచిస్తుంది. ప్రక్రియలో తనను తాను వక్రీకరించుకుంటాడు మరియు గతంలోకి వెడతాడు. కీర్తన పరోక్ష అర్థం కూడా అదే.

{ అదనపు గమనిక: సందర్బముగా 138 కీర్తన లోని చరణం తప్పక గుర్తుతెచ్చుకోదగ్గది. కన్నుమూయఁ బొద్దులేదు, కాలు చాఁచ నిమ్ములేదు, / మన్ను దవ్వి కిందనైన మనికి లేదు, / మున్నిటివలెనే గోరు మోపనైనఁ జోటు లేదు, / యిన్నిటా నిట్లానైతి వేమి సేతువయ్యా.#2 =ఓ మానవుడా! నీకు కాలము కానీ, భూమ్యాకాశములు కానీ మరియు మరణము కానీ ఆశ్రయములు కానేరవు. నీకు దారేది? }

ఇప్పుడు జీవి నాలుక 'బయటకు తెచ్చి ఉంచడం' కామోద్దీపనలోతో అది కుతకుతా ఉడుకుతోందని సూచన​. 'అతికాముకుండవై మీఁదెఱఁగక తిరిగేవు' (= "మీరు లైంగిక వాంఛలచే గుడ్డివారై పగలురాత్రి తెలియక  తిరుగుదురు) అని కూడా అన్నమయ్య అన్నారు.

జీవి చుట్టూ చుట్టుకున్న  గడియారం ఏదో ఒక సమయంలో అది ఆగిపోతుంది. అందువలన, మనిషి యొక్క ప్రస్తుత స్థితి తాత్కాలికమైనది అని చెబుతుంది. దీనిని "మాలెమీఁద పరు వెందాఁకా"తో (= ఇరుకైన మరియు అస్థిరమైన ప్రదేశాల్లో మీరు ఎంతసేపు పరిగెత్తగలరు?) పోల్చండి:

పటములోని పైన కుడి మూలలో ఉన్నస్పెయిన్ లోని కాటాలోనియన్ కొండలు చిత్రకారుడికి సుపరిచితమైనవి.  అన్నమాచార్యులునీ మచ్చిక విడువఁగ లేవు’ (= అలవాటైన మరియు సుపరిచితమైన ప్రదేశాలను విడిచిపెట్టడానికి శక్తిహీనుడవు​) అన్నారు. ఐదు శతాబ్దాల క్రితం రాసిన అన్నమయ్య కీర్తనల లోతు   ప్రశంశార్హమని నా నమ్మకము. 

అన్వయార్ధము: మానవుడా! అయోమయానికి ఆలవాలమవు; భ్రమఁలకు లోలుఁడవు ; అశ్లీలానికి అర్రులు చాచుదువు; మేలు తెలియవు; అస్థిరుడవు; మచ్చిక విడువఁగ లేవు;  ఇంకా ఇన్ని సుగుణాలతో  ప్రపంచాన్ని స్పష్టమైన కళ్ళతో చూస్తున్నావని నమ్ముతున్నావా? 

మానితముగ దురన్నపానముల మత్తుఁడవై వుండేవు
నానావిధముల దుష్కర్మంబులు నానాటికి నాటించేవు
మేనిలోని యేగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవు
ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియఁగ లేవు వట్టి॥

ముఖ్య పదాలకు అర్ధాలు: మానితముగ = కొనియాడబడునట్లుగా సన్మానితముగా (అపహాస్యం చేసే అర్థంలో ఉపయోగించబడినది); యేగురు = అయిదుగురు, నార్గురును =  ఆరుగురు శత్రువులు (కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు)

భావము: మూర్ఖుడా!  పొగడదగునట్లుగా (కోప్పడదగునట్లుగా అని చదవండి) దురన్నపానముల మత్తుఁడవై వుండేవు. నానాటికి నానావిధముల దుష్కర్మంబులు  మదిలో నాటేవు. మేనిలోని ఐదు జ్ఞానేంద్రియాలను మరియు మరో ఆరుగురిని (అవి: కోరిక, కోపం, మోహం, దురాశ, అహంకారం మరియు అసూయ) గాఢ స్నేహితులని దృఢంగా నమ్ముతావు. ఈ స్నేహితుల స౦తోషభరితమైన సహవాస౦లో, వారే హానికరమగు చర్యలకు అధిపతులని  గమని౦చడ౦లో విఫలమవుతావు.

వివరణము: ఇప్పుడు చిత్రంలోని ఈగను మరియు చీమలను గమనించండి. అవి క్షీణతను సూచిస్తాయి. ముఖ్యంగా పాకెట్ వాచ్ మీద ఉండే చీమలు మనిషి యొక్క స్వంత చర్యల ద్వారా హెచ్చిన (మానసిక) క్షీణతను సూచిస్తాయి. 

ఇప్పుడు దీనినిమానితముగ దురన్నపానముల మత్తుఁడవై వుండేవు / నానావిధముల దుష్కర్మంబులు నానాటికి నాటించేవు” అనే పదాలతో పోల్చండి (= నీవు కూడని ఆహారం మరియు పానీయాల యొక్క ఖండనీయమైన వినియోగపు మత్తులో నుండి, నానాటికి, కీడుకలిగించు కార్యములలో  శరీరాన్ని భౌతికముగాను మరియు మానసికముగాను  నాశనం చేస్తావు.) 

పామరివై దుర్వ్యాపారమునకు పలుమారునుఁ బొయ్యేవు
వేమరు దుర్జనసంగాతంబులు విశ్రామమనుచు నుండేవు
ప్రేమముతో హరిదాసులపై సంప్రీతి నిలుపఁగా లేవు
తామసమతివయి వేంకటనాథుని తత్వ మెఱఁగఁగా లేవు వట్టి॥ 

ముఖ్య పదాలకు అర్ధాలు: విశ్రామమనుచు = విశ్రాంతి అనుకొంటూ, ఊఱట అనుకొంటూ; తామసమతివయి = మందబుద్ధివై,

భావము: అజ్ఞానివై తరచుగా దుర్వ్యవసాయమున నుందువు. నీతిదూరుల సహవాసం నుండి ఓదార్పును పొందచూతువు. ప్రేమతో హరిదాసులపై సంప్రీతిని చూపలేకపోతావు. మందబుద్ధివై వేంకటనాథుని తెలియగ లేవు.

వివరణము: అన్నమాచార్యులు "మానవుడు నిస్తేజమైన ఉనికి నుండి దైవమును తెలుసుకోలేడు" అనే ముఖ్యమైన విషయం చెప్పారు. గమ్యము 'ఏమీ చేయలేని స్థితి కాదు', 'ఏమీ చేయని స్థితి' అని తెలుపుతున్నారు. ప్రార్థనలు పునరావృతం చేయడం ద్వారా మొద్దుబారిన బుర్రతో ఆ స్థితికి చేరడం అసాధ్యము. అన్నమాచార్యులు పరోక్షముగా మనకు తెలిసిన ఇప్పటి పద్ధతులను కానీ, ఏ మార్గమును కానీ సూచించుట లేదు. అందువల్ల, ఈ మచ్చిక ప్రపంచనకు వేరుగా స్వయంచలితము, స్వీయోత్తేజితము అగు దానిని ఉటంకించారు. ఈ విషయమై మతములు, మత గ్రంధాలు కార్య ప్రగతికి అవరోధములే.

ఇప్పుడు మళ్ళీ డాలీగారి చిత్రాన్ని చూడండి. నిలువు అక్షంపై సంవర్గమాన (లాగరిథ్మిక్) ప్రమాణాలను ఊహించండి. చీకటి భాగం సుమారు డెబ్బది శాతం ఆక్రమించినప్పటికీ, బహిరంగ ప్రదేశాలతో కప్పబడిన దానితో పోలిస్తే సాపేక్షంగా తక్కువ సమయాన్ని సూచిస్తుంది.  అనగా తేజస్సుయే జగతికి మూలమని, అంధకారము పరిమితమని సూచించిరి.  అలాగే చీకటి భాగంలో అస్పష్టమైన జీవి పరిమాణములను పోల్చుకుంటే మనిషికి తన గురించి చాలా తక్కువ తెలుసని సూచిస్తుంది, ఐతే ఆ వింత జీవిని కొంత కాంతితో నింపి ఆశలను నిలిపి వుంచారు. 

జీవిని కప్పి వుంచిన గడియారం మనిషి అనంతం కొరకు చేసే ప్రయత్నాన్ని సూచిస్తుంది. స్పష్టంగా, శరీరం క్షీణిస్తుంది కానీ మానసిక క్షీణత ఎ౦దుకు? అంతుచిక్కని యీ విషయం కోసం ప్రపంచవ్యాప్తంగా అన్వేషణకు ఇదే ఆధారం.   అనంతంతో ఏకత్వంలో ఉండటం మాత్రమే మానవునికి గల  అవకాశం. ఈ అనంతాన్ని అనుభవించడం సమూహిక కార్యకలాపం కాదు. 

ధ్యానము నందున్న మనిషి పరిస్థితి కూడా అదే. అన్నీ ఒకేలా కనిపిస్తాయి. ఒక వ్యక్తి ధ్యానంలో ఉన్నాడా లేదా నటిస్తున్నాడా అని నిర్ధారించ లేము. రుజువు లేని దానితో మనిషికి ఆర్ధిక​, సామాజిక ప్రయోజనమూ ఉండదు. రుజువులున్నవన్నీ ఇప్పటి మన పరిస్థితికి ప్రతీకలే. 

అందువల్ల, వర్ణించబడిన జీవి చేతన స్థితిలో ఉందా లేదా గాఢనిద్రలో ఉందా అని చెప్పడం కష్టం. అన్నమాచార్యుల సంక్లిష్టమైన కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి డాలీ గారి చిత్రలేఖనం మనకు సహాయపడుతుంది అనడంలో సందేహం లేదు. అయితే అన్నమాచార్యులు మరో అడుగు ముందుకేసి. విశ్వమంతటా నిండియున్న భగవంతుని ప్రేమను అనుభూతి చెందమని మనిషిని అడుగుతున్నాడు.  

ఈ ప్రాపంచిక, భౌతిక వివరణలన్నిటికీ అతీతంగా ప్రపంచాన్ని బంధించే దేవుని కరుణ, వాత్సల్యము ఉన్నవి. ఈ సందర్భంగా ఆదిశంకరులు మనీషాపంచకంలో “యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ / సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞా పి యస్యాస్తిచేత్” (= విధియయిన బ్రహ్మ మొదలు అతి చిన్నదయిన చీమ వరకూ అన్ని జీవాలలో, అన్ని వస్తువులలో, అన్నిఁటా ప్రతిధ్వనించే, కనపడని, అందరినీ గమనించే ఆ పరమాత్మ) అని పేర్కొన్నది గుర్తు చేసుకుందాం.  ఈ చరణంలో అన్నమాచార్యులు కొంతవరకు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

 

References and Recommendations for further reading:

#1 6. వెనకేదో ముందరేదో (venakEdO muMdarEdO)

#2 138 పెక్కు లంపటాల మనసు పేదవైతివి నీకు (pekku laMpaTAla manasu pEdavaitivi nIku)

 

 

కీర్తన సంగ్రహ సారం:

పల్లవి: గుట్టులేని యీ సంసారపు గుట్టును వెదుకబోయి తిరిగేవు. వట్టియాసలను విడిచి చూడవో ప్రాణీ! అన్వయార్ధము: మానవుడా! కళ్ళు తెఱిచి నిన్ను దారితప్పిస్తున్న వాటిని తెలియుము.

 

చరణం 1: చాల నమ్మి యీ సంసారమున మైమఱచి తిరిగేవు.  బాలయవ్వనప్రౌఢ దశలకు​ భ్రమలోబడి లోలుఁడవై తిరిగేవు.  మేలుదెలియక, అతికాముకుండవై పైనది క్రిందది (రాత్రింబవళ్ళు) తెలియక తిరిగేవు. తేనె దీయునప్పుడు కొండచరుల నడుమ గట్టెడి చిన్నమంచె వంటి (ఇరుకైన మరియు అస్థిరమైన) ప్రదేశాల్లో పరుగు ఎంత దాకా? (ఎంతో దూరం పరుగిడలేవు).   ఓ బలహీనుడా! చనువు గల వాటిని విడిచిపెట్టడానికి నీవు శక్తిహీనుడివి. అన్వయార్ధము: మానవుడా! అయోమయానికి ఆలవాలమవు; భ్రమఁలకు లోలుఁడవు ; అశ్లీలానికి అర్రులు చాచుదువు; మేలు తెలియవు; అస్థిరుడవు; మచ్చిక విడువఁగ లేవు;  ఇంకా ఇన్ని సుగుణాలతో  ప్రపంచాన్ని స్పష్టమైన కళ్ళతో చూస్తున్నావని నమ్ముతున్నావా?

 

చరణం 2: మూర్ఖుడా!  పొగడదగునట్లుగా (కోప్పడదగునట్లుగా అని చదవండి) దురన్నపానముల మత్తుఁడవై వుండేవు. నానాటికి నానావిధముల దుష్కర్మంబులు  మదిలో నాటేవు. మేనిలోని ఐదు జ్ఞానేంద్రియాలను మరియు మరో ఆరుగురిని (అవి: కోరిక, కోపం, మోహం, దురాశ, అహంకారం మరియు అసూయ) గాఢ స్నేహితులని దృఢంగా నమ్ముతావు. ఈ స్నేహితుల స౦తోషభరితమైన సహవాస౦లో, వారే హానికరమగు చర్యలకు అధిపతులని  గమని౦చడ౦లో విఫలమవుతావు.

 

 

చరణం 3: అజ్ఞానివై తరచుగా దుర్వ్యవసాయమున నుందువు. నీతిదూరుల సహవాసం నుండి ఓదార్పును పొందచూతువు. ప్రేమతో హరిదాసులపై సంప్రీతిని చూపలేకపోతావు. మందబుద్ధివై వేంకటనాథుని తెలియగ లేవు.


 

5 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ఎంత వివరముగా ఒక్కొక్క కీర్తన భావామృతాన్ని అందిస్తున్నారో !🙏

    ఎంతో సంతోషముగా ఉన్నది చదువుతుంటే ! 😊

    మీ శ్రమ , మీ నిబద్ధత బహు ప్రశంసనీయము ! 💐

    ముందు తరాలకు ఇవి చక్కటి references అవుతాయి both for telugu and non telugu speaking people ! 👌

    May the lord give you more strength to your pen sir ! 🙏

    My humble pranaamams to you !🙏🙏

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయినాథాయనమః

    సమయము కొలమానంగా తీసుకోవడమే మన పెద్ద భ్రమ అని అద్భుతముగా వివరించబడినది. కానీ సమయం అనేది కూడా మానవుని దృష్ట్యా కొలమానం అయినా గీత సారము వలన ఇది కూడా భగవంతున్నాయి మాయలో ఒక పరికరము సుమా!.

    Best examples: In Tadpatri there is a Chinatalarayani temple ( built in 1200 AD time frame where there two slits on the front door and the sun rays on Vaikuntha Ekadasi, first sun rays fall at the feet of god.
    Coincidentally in Mayan Ruins in Mexico ( almost 1000 year old i guess) has similar technology for equinox day where sunrays pass thru the two slits.
    My point is the technology and knowledge always existed in some form irrespective of the time frame. We all think that we are doing something new which is always our illusion.
    only one thing we can do better is to improve our faith in the god we believe in, in every form with time scale provided to us.
    Ohm Sree Sai Nathayanamaha


    ReplyDelete
  4. షడ్వికారయుక్తమైన జీవితంలో, అరిషడ్వర్గముల ప్రభావముచే మాయాజనితమైన ఈ దృశ్యప్రపంచం యొక్క భ్రమలో పడి మానవుడు సర్వకాల సర్వావస్థలలో యిదే సుఖము, శాశ్వతమని నమ్మి అలసి, సొలసి తిరుగాడుచున్నాడు.అరిషడ్వర్గములనే (కామ, క్రోధ, లోభ, మోహ, మద,మత్సరములనే ఆరు అంతశ్శత్రువులతో చెలిమి చేసి,వారే స్నేహితులని మూర్ఖంగా నమ్మి, పంచేంద్రియములతో విషయవాసనలకు లోబడి స్వతః స్వచ్చంగా, నిర్మలంగా యుండే మనస్సును నిరంతరం మనోవాక్కాయ కర్మలచే కల్మషము గావించుకొని వాటిని విడువజాలకున్నాడు.అజ్ఞానము చేత దుర్జనసాంగత్యం, దుష్కర్మలు చేస్తూ హరిభక్తిని కలిగి, శ్రేయోమార్గాన్ని అనుసరించలేక హరిని కనుగొనజాల కున్నాడు.
    *అంతా రామమయం.*
    *ఈ జగమంతా రామమయం*
    అని గ్రహింపజాలక,సంసారమనే భ్రమలో పడి విషయములందు చిక్కుకొని, వాటిని వదలలేక జీవితాన్ని వ్యర్థం చేసికొంటున్నాడు మానవుడు.
    *సర్వం ఖల్విదం బ్రహ్మ* అనే సత్యాన్ని తెలుసుకోలేక దుర్లభమైన మానవజన్మను నిరర్థకం చేసుకొంటున్నాడు.

    ఇక అన్నమయ్య యొక్క యీ అద్భుతమైన కీర్తనను సాల్వడార్ డాలీ గారి చిత్రలేఖనముతో వివరించటంలో శ్రీనివాస్ గారు కృతకృత్యులయ్యారనే చెప్పవచ్చును.

    *బట్టబయలు యీ సంసారంబు*
    దీనికి చిత్రంలోని సముద్రం, పర్వతములు,అవధులు లేని, అంతములేని ఆకాశమే దీనికి నిదర్శనం.
    *సంసారమునకు సోలి సోలి తిరిగేవు*
    చిత్రంలో స్పష్టంగా లేని జీవికి అనేక కనురెప్పలతో మూతబడి యున్న కళ్ళు సంసారంలో ఆదమరచి తిరుగుటను సూచిస్తున్నాయి.
    అలాగే
    *బాలయవ్వనప్రౌఢల భ్రమపడి లోలుడవై తిరిగేవు*
    చిత్రంలోని జీవి యొక్క వక్రీకృత రూపు, వక్రీకృత జీవనయానమును సూచిస్తున్నది.
    అటులనే
    *అతికాముకుండవై మీదెఱగక తిరిగేవు*
    చిత్రంలోని జీవి తన నాలుకను బయటకు చాచి ఉంచటం కాముకత్వానికి ప్రతీకయే కదా.

    అలాగే "మాలెమీద పరు వెందాకా",
    "నీ మచ్చిక విడువగ లేవు" అన్న అన్నమయ్య వాక్యాలకు ఈ చిత్రం అద్దం పడుతోంది.
    ఓం తత్ సత్🙏
    కృష్ణ మోహన్

    ReplyDelete
  5. Surprising but great as usual. Normally Annamacharya concludes with a positive note. Here he laments the state of the Jeeva.

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...