Monday 15 August 2022

T-137 ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము

                                    తాళ్లపాక అన్నమాచార్యులు

137 ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము

  యతి, యత్నము


Those interested in English Version may press this link

 

ఉపోద్ఘాతము: క్రమబద్ధమైన సమర్పణలో మనలో ఉన్న దైవత్వాన్ని  వ్యక్తపచుటకు అన్నమాచార్యులు విశ్వప్రయత్నం  చేశారు. నేను ఎల్లప్పుడూ చెబుతున్నట్లుగా, ఆయన తత్వవేత్తా కారు. మాటలలో వ్యక్తీకరించలేని విషయమును, సత్యంతో ఏకత్వం పొందిన స్థితి నుండి వ్రాసిరి. ఆత్మబోధను వినుటకు సిద్ధంగా ఉంటే, వాస్తవముగా ఎవరైనా స్థితి చేరగలరని నమ్మిరి. 

ఒక వ్యక్తి అటునిటు చూడనవసరములేని విధముగా ఆయన సామాన్య పదములతో పామరులకు సైతం అర్ధమగు రీతిలో పెద్ద భాండాగారమునే నిర్మించాడు. దురభిమానము మరియు శిథిలములతో గూడుకట్టుకొన్న ప్రపంచానికి ఆవల​, 'జీవితము; 'జీవనము' అని పిలువబడే చిన్న విషయాలను అర్థం చేసుకోవాలనుకునేవారికి అతని స్వరం వినబడుతుంది. 

అన్నమాచార్యుల కీర్తనలలోని అంతర్గతమైన విలువలు భావ వ్యక్తీకరణ అంతరములతోనూ, క్రమేణ వచ్చు మార్పులతో కాలంచెల్లి అణగిపోనివి అనుటకు ఈ కీర్తనయే అత్యుత్తమ​ ఉదాహరణ​.

 

కీర్తన:

రాగిరేకు:  90-4  సంపుటము: 1-444

 

ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము
శ్రీతరుణీపతి మాయాధవుఁడు [1]సృష్టి యింతయును హరిమూలము ఆతనినే॥
 
కోరుదుమా దుఁఖములు కోర కేతెంచు తముఁ దామే
 రీతులనే సుఖములు యేతెంచు నందును విచారమంతేల
సారెకు దైవాధీనములివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి
కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుఁడే యింతకు మూలము ఆతనినే॥
 
కమ్మంటిమా ప్రపంచము గలిగీ స్వభావము [2]అందుకది
యిమ్ముల మోక్షము యీరీతులనే యీశ్వరుఁడిచ్చిన యిది గలుగు
కమ్మి అంతర్యామి కల్పితంబు లివి కాదన నవునన రాదెవ్వరికి
సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి [3]నిజదాస్యము ఆతనినే॥
 
సరి నెఱఁగుదుమా పోయిన జన్మము సారెకు నేమేమిచేసితిమో
యిరవుగ నట్లా మీదఁటి జన్మము యెఱుకలు మఱపులు యిఁకనేలా
నిరతమై శ్రీవేంకటేశుఁడు తన యిచ్చ నిర్మించిన దిది యీదేహము
గరిమెల నాతని కైంకర్యమెపో కలకాలము మాకు కాణాచి ఆతనినే॥

 

[1] ‘సిష్టి’ రేకు. [2] ‘దానికది’ అని అర్థము కావచ్చు. [3] నిజ = తనయొక్క (అతనియొక్క).

 

 

Details and Explanations: 

ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము
శ్రీతరుణీపతి మాయాధవుఁడు సృష్టి యింతయును హరిమూలము ఆతనినే॥ 

ముఖ్య పదాలకు అర్ధాలు: నందితిఁ బో = కైకొంటిని బో, గ్రహించితిని బో; మాయాధవుఁడు = మాయా+ధవుఁడు = మాయలకు పెనిమిటి/ రాజు/ భర్త​,

భావము: ఆతనినే కొలిచి నే  నిజమగు ఆనందము నందితిఁని.  శ్రీతరుణీపతి మాయలకు పెనిమిటి/ రాజు. సృష్టి అంతకూ హరియే మూలము

వివరణము: సాపేక్షతలపై (పోలికలపై) ఆధారపడి జీవిస్తాము. జాగ్రత్తగా పరిశీలి౦చినప్పుడు, పోలికలంటూ మొదలుపెడితే తక్షణము సౌఖ్యాన్ని కోల్పోతామని అందరూ గమనించే ఉంటారు. సుఖమును ఎట్లు గుర్తించుదురు? గడచిన​​ (మునుపటి) అనుభవములు మిగిల్చిన జ్ఞాపకములను ఊతములపై నిలిచిచూచు మానవునికి సుఖదుఃఖములు తప్పవేమో. లేని యెడల దుఃఖమును ఎట్లు తెలియుదువు? సత్యమే లక్ష్యముగా కలిగిన జీవికి అనుబంధ ఉపకరణములగు జ్ఞాపకములను నిర్మాణముల ఊతములేమిటికి? ఆలోచించండి.

గొప్ప దార్శనికులు, యోగులు ప్రపంచం మనందరిలో ప్రతిబింబిస్తుంది అన్నారు. వార్తల ద్వారా, లోక౦ ఒక సమస్య ను౦డి మరో సమస్యకు పయనిస్తోందని మన౦ స్పష్టంగా గమని౦చవచ్చు. నిజ౦గా మన౦ వార్తలను చూడడ౦ ద్వారా లేదా చదవడ౦ ద్వారా దేనినీ మార్చలేము. కానీ అది మనకు "నేను ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నాను" అనే కల్పిత భద్రతా భావనను అందిస్తుంది. మనకు సౌఖ్యం లేదా శాంతి అంటే ప్రాథమికంగా యుద్ధం లేకపోవడమే.

అందువల్ల, మన ప్రపంచంలో (అంతర్గతమైనదో, బాహ్యమైనదో, ఎదైనా కావచ్చు), ఒక సమస్యల సమూహం క్రమముగానూ మరియు నిరంతరముగానూ మరొక సమూహాలతో భర్తీ చేయబడుతుంది. ఆవతార్ (AVTAR) సీరీస్ సినిమాల​ నుండి దిగువ చిత్రాన్ని చూడండి. ఏ సమయంలోనైనా చిత్రములోని వ్యక్తులపై ఏదైనా నెత్తిన పడవచ్చని గమనించండి.  జీవితాంతం ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. మనము రెండు వ్యతిరేక స్థితుల మధ్య (వాస్తవము మరియు మనం కోరుకున్న స్థితుల మధ్య) నలిగిపోతాము ఇది మిమ్మల్ని భయాందోళనలకు గురిచేసే జోస్యం కాదు. వాస్తవమును కాదనలేము కదా.



జార్జ్ ఆర్వెల్ రాసిన '1984' అన్న పేరుగల నవలలో నిరంకుశ పాలకులు కృత్రిమముగా కొరత సృష్టించునట్లు; ఎల్లప్పుడూ ఏదో ఒక దానిని మనం కోల్పోయినట్లు భావింపజేసి, తద్వారా మన దృష్టి   'సత్యం' నుండి, భగవంతుడు అని పిలువబడే పరీక్షాధికారి ద్వారా మళ్ళించబడుతుంది. మామూలు మానవులము మరింత ఓదార్పునిచ్చే పరిస్థితి కోసం వెంపర్లాడతాము.  ఐతే, అన్నమాచార్యులు సందేహాలను పక్కన పెట్టి, పరిష్కారం కోసం భగవంతుడిని సమీపించాడని పల్లవి చెబుతుంది. మనము కోల్పోయిన చోట వెతకడం న్యాయమైనదే కదా! ​ 

ఈ విధంగా అయ్యలారా, ఈ సాపేక్ష భ్రమల ప్రపంచముతో ముడిపడని నిజమైన శాంతి ఉంది, దీనినే అన్నమాచార్యులు ఇక్కడ ప్రస్తావించారు. ఇది వస్తుమార్పిడి మార్గము ద్వారా లభ్యము కాదు, ('ఎవరైనా తమ ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలరు?' అన్న మాథ్యూ 16-26 మాటలు గుర్తుంచుకోండి).   

ఆ రకంగా, అన్నమాచార్యుడు మనల్ని 'నిన్న’ అని పిలువబడె ఆధారమే లేని సత్యదూర​ వృత్తి నుండి వేరే ప్రపంచానికి తీసుకువెళుతున్నాడు. ఆయన ఈ సాంప్రదాయ వేదుఱు మాటల చాటున లోతైన అర్థాలను దాచిపెట్టాడు.

 

అన్వయార్ధము: ప్రప౦చమంతా వ్యాపించి యున్న మాయకు సమిధి కాకుండా, పోగొట్టుకున్న ప్రదేశంలోనే వెతకిన నిజమగు ఆనందము పొందవచ్చు. 

కోరుదుమా దుఁఖములు కోర కేతెంచు తముఁ దామే
ఆ రీతులనే సుఖములు యేతెంచు నందును విచారమంతేల
సారెకు దైవాధీనములివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి
కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుఁడే యింతకు మూలము ఆతనినే॥ 

ముఖ్య పదాలకు అర్ధాలు: సారెకు = మాటిమాటికి,

భావము: మానవులారా కోరుదుమా దుఁఖములు కోర కేతెంచు తముఁ దామే రీతులనే సుఖములు యేతెంచును. ఇవి దైవాధీనములే గాని స్వయత్నములుగా వెవ్వరికి. కోరగలిగే దొక్కటే హరిశరణాగతి. గోవిందుఁడే యింతకు మూలము.

 

వివరణము: ఫిబ్రవరి 1950లో M C ఎస్చెర్ ORDER and CHAOS ను (‘క్రమాక్రమములులేదావ్యవస్థావ్యవస్థలు’  లేదాక్రమము మరియు గందరగోళం’)​ నిర్మించాడు. శీర్షిక స్వీయ-వివరణాత్మకమైనది.   ముద్రణలో ఒక సంపూర్ణ సౌష్టవ ప్రాదేశిక దాదాపు పారదర్శక స్టెల్లెటెడ్ డోడెకాహెడ్రాన్ గాజు గోళంతో విలీనం చేయబడినట్లు  కేంద్రములో చూపిరి. దాని చుట్టూ విరిగిన మరియు ఇతరత్రా అస్తవ్యస్తంగా ఉన్న వస్తువులను కలగూరగంపలా అమర్చిరి. 



స్ఫటికం సృష్టిలోని రహస్య క్రమము మరియు క్రమశిక్షణకు ప్రాతినిధ్యం వహిస్తుంది, అయితే దాని చుట్టూ ఉన్న వస్తువులు గందరగోళాన్ని సూచిస్తాయి. ఎస్చెర్ ముద్రణ చేసినప్పుడు ఏదో గ్రహించినట్లు అనిపిస్తుంది. 1950 లలో ఎస్చెర్ కీర్తి పెరగడం ప్రారంభమైంది. దానితో పాటు వచ్చు గందరగోళమును తన ప్రశాంత జీవితమునందు చూపు ప్రభావమును ముందస్తు అంచనా వేసినారేమో. ఆ విధ౦గా, ఎస్చెర్ మనస్సులోని ఆ గొప్ప క్రమమును గుర్తించిరని భావి౦చవచ్చు.  (జిడ్డు కృష్ణమూర్తి అంతర్లీనక్రమమును గురించి చాలా తరచుగా మాట్లాడేవాడు). అత్యద్భుతమైన సంపూర్ణ సౌష్టవము మనలోని అంతరంగమునకు చెందినది. అట్టి విలువైన దానిని మానవుడు చెత్త చెదారములను చేర్చి వ్యర్ధపరచుచున్నాడని కళాకృతి సందేశము. వాస్తవానికి మన ప్రస్తుత జీవిత కార్యకలాపాలకు ప్రాతినిధ్యం వహించే గందరగోళము అస్తవ్యస్త స్థితులు  బయటి నుండి లోనికి చొచ్చుకొని వచ్చినవే అని ఎస్చెర్ గారి అభిప్రాయమూనూ. 

ఈ సందర్భముగా 'సరవి దెలియ కేమో చదివేము నేము'#1{ఈ విశ్వం యొక్క ఈ ప్రాథమిక క్రమాన్ని మెచ్చక, మనము "ఏదో ఒక విషయం" అధ్యయనం చేయడానికి, పరిశీలించడానికి సాహసం చేస్తాము.} వావిరిఁ గొలిచిన వైకుంఠము’#2{ఈ ప్రపంచం యొక్క అంతర్లీనమైన దైవికమైన క్రమాన్ని అర్థం చేసుకోండి.}  అన్న అన్నమాచార్యుల మాటలు గమనార్హములు. 

ఈ చరణంలో అన్నమాచార్యులు  సుఖదుఃఖములపై  మానవునికి నియంత్రణ లేదని అన్నారు. భవిష్యత్తులో తాను  ఎలా తప్పించుకోవాలన్న ప్రణళికలో నిమగ్నం కావద్దని, తనలోని మాలిన్యమును విడిచిపెట్టుటపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. ఈ బాహ్య విషయాలు (సుఖదుఃఖములు) మన మనస్సులోకి ప్రవేశిస్తాయి, మన స్వంత చేతల ద్వారానే గానీ యాదృచ్ఛికంగా అయితే‍ కాదు. దైవము వీటి సృష్టికర్త కాదని  “న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః” : అని భగవద్గీతలోనూ (5-14) తెలిపారు. 

కోరేటి దొకటే హరిశరణాగతి’ అనేది పదములు దేవుని సహాయంతో గందరగోళమను నరకమును దాటుమని సూచన. దేవుడు వచ్చి సహాయ౦ చేస్తాడని మన౦ ఆశి౦చరాదు. ఐతే మలినములను విసర్జి౦చడ౦ ద్వారా హృదయాన్ని పరిశుభ్ర౦గా ఉ౦చుకు౦టే జ్ఞాన ముదయించవచ్చు. 

అన్వయార్ధము: ఓ మానవుడా, మనం చేయగలిన యత్నము ఏమీ లేదు. అయితే,  దైవము పక్షాన ఉ౦డుటకు ఆస్కారము కలదు. 

కమ్మంటిమా ప్రపంచము గలిగీ స్వభావము అందుకది
యిమ్ముల మోక్షము యీరీతులనే యీశ్వరుఁడిచ్చిన యిది గలుగు
కమ్మి అంతర్యామి కల్పితంబు లివి కాదన నవునన రాదెవ్వరికి
సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి నిజదాస్యము ఆతనినే॥

ముఖ్య పదాలకు అర్ధాలు: కమ్మంటిమా = క్రమ్ము+అంటిమా= వ్యాపించు, ప్రసరించు, పైబడు, పుట్టు + అంటిమా, కమ్మి (kammi) = తక్కువ, కొరత, చవక, కడమ ( however, I believe it is used more like క్రమ్ము= వ్యాపించు, ప్రసరించు,)   

భావము: మనము ఈ ప్రపంచాన్ని సృష్టించామా (లేదా విస్తరించామా). ఇది దాని  ప్రకృతి స్వభావం ద్వారా జరుగుతోంది. అదే విధంగా, భగవంతుడు ప్రసాదిస్తే మోక్షం సంభవించవచ్చు కూడా.  తిరస్కరించడానికి లేదా ఆహ్వానించడానికి మనకు ఎంపికే లేదు.  అతడి ప్రతిపాదనలను తప్పక అంగీకరించాలి. అయితే సర్వలోకపతి నిజదాస్యములో ఉండాలని కోరుకోవచ్చు. 

వివరణము: మహాభారతంలోని రెండు సంఘటనలను ప్రస్తావిస్తాను: పరీక్షిత్తు పాండవుల వారసుడు. ఒక దురదృష్టకరమైన క్షణంలో, అతడు చనిపోయిన పామును తపస్సులో ఉన్నశమీక ముని మెడలో వేస్తాడు. మూర్ఖపు చర్యను చూసి, శమీకుని కొడుకు శృంగి ఒక వారం రోజుల్లో పాము కాటుతో చనిపోతాడని శాపం పెడతాడు. పరీక్షిత్తు యొక్క శ్రేయోభిలాషులు అతనిని రక్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. వారు అతన్ని ఒంటి స్తంబపు మేడలో ఉంచుతారు. కానీ చివరికి  తక్షకుడు అనే సర్పం  ఒక పండు లోపల ఒక చిన్న కీటకం రూపంలో ప్రవేశిస్తాడు. అతని ప్రాణాలను ఎవరూ కాపాడలేకపోతారు. 



అప్పుడు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు సర్పయాగమును నిర్వహించబోతాడుమహాయజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు, పండితులు ఇంతకు మునుపు యజ్ఞం ఎవరూ చేయలేదని, అది ప్రారంభమైనా, అది పూర్తి కాకపోవచ్చుననే శకునాలు ఉన్నాయని ఆయనను ముందుగానే హెచ్చరించారు. అయినా తన ప్రణాళికతో ముందుకు వెళ్తాడు జనమేజయుడు. చివరికి అస్తిక మహా ముని సూచన మేరకు సర్పయాగమును సగములోనే నిలిపివేస్తాడు 

కాదన నవునన రాదెవ్వరికి:  దైవికమైన క్రమాన్ని ఉల్లంఘించలేము. ఇది అగ్ని వంటిది. మీరు తెలిసో తెలియకో దాన్ని తాకితే కాలుతుంది. ఎరుకతో దూరముగా ఉండటానికి దైవము మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ మానవుడు, తన అజ్ఞానంలో ములిగిపోయి తగిన చర్యను గుర్తించడంలో విఫలమవుతాడు. మన ఇతిహాసాలు వినోదాన్ని అందించడానికి వ్రాయబడలేదు. అవి మానవాళికి దైనందిక మార్గదర్శక సూత్రాలు. 

ఆసపడియెడి దొకటే: అ౦దుకే, దేవుని చిత్తమును సమ్మతించి అ౦గీకరి౦చడ౦ తప్ప, అందలి న్యాయాన్యాయములను విచారించు అర్హత మానవునికి లేదు. ఈ సందర్భముగా బైబిల్ నందలి మత్తయి 7:2 వాక్యములను శ్రద్ధగా పరికించండి. ‘మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.’ 

‘సర్వలోకపతి నిజదాస్యము’  అని చెప్పి కేవలము హృదయములోలేని మాటల ద్వారా పెదవులు చేయు సేవను గర్హిస్తున్నాడు. తిరిగి బైబిల్ నందలి వాక్యమును మననము చేసుకుందాం. మత్తయి 7:21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. 

అన్వయార్ధము: ఓ మనుష్యుడా, దివ్యము అసమానము అగు ప్రకృతి క్రమాన్ని అర్థం చేసుకొని, భగవంతుని సేవలో నిమగ్నం అవ్వు. 

సరి నెఱఁగుదుమా పోయిన జన్మము సారెకు నేమేమిచేసితిమో
యిరవుగ నట్లా మీదఁటి జన్మము యెఱుకలు మఱపులు యిఁకనేలా
నిరతమై శ్రీవేంకటేశుఁడు తన యిచ్చ నిర్మించిన దిది యీదేహము
గరిమెల నాతని కైంకర్యమెపో కలకాలము మాకు కాణాచి ఆతనినే॥ 

ముఖ్య పదాలకు అర్ధాలు: సారెకు = మాటిమాటికి; యిరవుగ = కదలనిది, స్థిరము; నిరతమై = ఎల్లప్పుడు, సదా, గరిమెల గౌరవంతో, ఆత్మగౌరవంతో; మాకు కాణాచి = మాకు చిరకాల వాసస్థానము, మాకు పారంపర్యముగా వచ్చుసొత్తు, మాకు కష్టపడకుండా వచ్చు జీతం (మాకు చిరకాలము శ్రమలేని జీవితము).

భావము: పోయిన జన్మములలో మాటిమాటికి నేమేమిచేసితిమో సరి నెఱఁగుదుమా? అలాగే అటువంటివే యగు తరువాతి జన్మములలో యెఱుకలు మఱపులు యిఁకనేలా? నిరతరముగా శ్రీవేంకటేశుఁడు తన యిచ్చ నిర్మించినది ఈ దేహము. గౌరవం మరియు హుందాతనంతో ఆతని కైంకర్యమెపో కలకాలము మాకు శాశ్వత నివాసం. 

వివరణము: యెఱుకలు మఱపులు యిఁకనేలా?: మనల్ని మనము భూతకాలములోనూ అర్థం చేసుకోలేనప్పుడు, భవిష్యత్తులో కూడా స్పష్టం కానప్పుడు (అర్థం చేసుకోలేమని తెలిసినప్పుడు), 'అహము'ను మనిషి  మూర్ఖంగా ఎందుకు పట్టుకోని వేలాడనుకుంటున్నాడు? అనేది అన్నమాచార్యులు లేవనెత్తిన ప్రశ్న. మన అజ్ఞాన౦ ప్రస్పుటమైనా​, "నా మనసును నియ౦త్రి౦చేందుకు దేవుడెవడు?" అనే పనికిమాలిన ధైర్య౦ మనిషికి ఉ౦టు౦ది. 

మనలో నిక్షిప్తమై ఉన్న గత జన్మల యొక్క అనేక పొరల గురించి అన్నమాచార్యులకు తెలుసునని గమనించండి. ఐతే, క్షణమునకు, ఈ జీవనమునకు, సత్యానికి అనుగుణ౦గా ఉ౦డడమే ముఖ్యమైన వృత్తి అని నొక్కిచెప్పడానికి ఆయన వాటిని దాటవేస్తాడు. 

కలకాలము’  = చాలా దీర్ఘకాలము. వాస్తవానికి, అతను శాశ్వతత్వంను సూచించ దలిచాడు. దీని గురించి వేరే కీర్తనలలో చర్చిద్దాం. “నాతని కైంకర్యమెపో”  తాను దైవిక సేవ కోసం మాత్రమే = మానవుడు భగవంతుని సేవకు హృదయపూర్వకంగా అర్పించుకోవాలి. గత౦లో దేవునిపై మనకున్న పాక్షిక విశ్వాస౦ గురి౦చి మనము తగిన౦తగా చర్చి౦చా౦. ('ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు'ను#1 చూడమని పాఠకులకు  సూచించడమైనది). 

ఈ చరణంలో ప్రస్తావించిన కీలకమైన విషయం ఏమిటంటే, 'మాకు కాణాచి' = మా శాశ్వత నివాసం,  (= మేము ఎప్పటికీ అప్రయత్నంగా జీవిస్తాము). అనేక వివరణలలో నేను ‘ప్రయత్నం’ గురించి ప్రస్తావించాను. అసలు ప్రయత్నమే సత్య నిరాకరణకు సూచిక. 'కలకాలము మాకు కాణాచి' అంటే అటువంటి స్థితిలో ఉండటం అనేది పూర్తిగా మానసిక యత్నము లేనిది. అందువల్ల, శాశ్వతత్వానికి అవకాశం ఉంటుంది. 

శరీరాన్ని నిర్వహించడానికి కొంత శారీరక శక్తి అవసరం. ఎమ్ సి ఎస్చెర్ చే చిత్రీకరించబడిన ఆ "క్రమబద్ధమైన ప్రపంచం"లోకి మనిషి వెళ్ళవచ్చు. జిడ్డు కృష్ణమూర్తి దానిని ‘అనంతమైన శక్తి’ అన్నారు. అన్నమాచార్యుడు అది ‘దేవుడ’ని చెప్పాడు. మానవుడు అలా౦టి స్థితికి చేరుకోగలడ౦ సాధ్యమేనని అన్ని మతాలు చెప్పినప్పటికీ, అవి పద్ధతులు, లాంఛనాలతో ఆట౦క౦ కలిగిస్తాయి. జిడ్డు కృష్ణమూర్తి, అన్నమాచార్యులు వంటి వారు ఆ సంకెళ్లను తెగ్గొట్టి తమను తాము విముక్తం చేసుకున్నారు. 

అన్వయార్ధము: ఓ మనుష్యుడా, తడబడకుండా, 'పర'లోకములో ప్రవేశించడానికి ఇష్టపూర్వకంగా ప్రభువుకు నిన్ను నీవు కైంకర్యము చేసుకో.

వివరణము: ఇక్కడ 'పర'లోకము అంటే మరో ప్రపంచం కాదు. అది నిజంగా శాశ్వతంగా నుండు ప్రపంచం. మనకు తెలిసిన ప్రపంచం తాత్కాలికమైనది.

 

References and Recommendations for further reading:

#1 105. కనినవాఁడాఁ గాను కాననివాఁడాఁ గాను (kaninavADA gAnu kAnanivADA gAnu)

#2 89. తలఁపులోననే దైవము వీఁడిగో (talapulOnanE daivamu vIDigO)

#3 97. ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు? (ODaviDichi vadara vUrakEla paTTEvu?)

 

 

కీర్తన సంగ్రహ సారం:

పల్లవి: ఆతనినే కొలిచి నే  నిజమగు ఆనందము నందితిఁని.  శ్రీతరుణీపతి మాయలకు పెనిమిటి/ రాజు. సృష్టి అంతకూ హరియే మూలము. అన్వయార్ధము: ప్రప౦చమంతా వ్యాపించి యున్న మాయకు సమిధి కాకుండా, పోగొట్టుకున్న ప్రదేశంలోనే వెతకిన నిజమగు ఆనందము పొందవచ్చు. 

 

చరణం 1: మానవులారా కోరుదుమా దుఁఖములు కోర కేతెంచు తముఁ దామే ఆ రీతులనే సుఖములు యేతెంచును. ఇవి దైవాధీనములే గాని స్వయత్నములుగా వెవ్వరికి. కోరగలిగే దొక్కటే హరిశరణాగతి. గోవిందుఁడే యింతకు మూలము. అన్వయార్ధము: ఓ మానవుడా, మనం చేయగలిన యత్నము ఏమీ లేదు. అయితే,  దైవము పక్షాన ఉ౦డుటకు ఆస్కారము కలదు. 

 

చరణం 2: మనము ఈ ప్రపంచాన్ని సృష్టించామా (లేదా విస్తరించామా). ఇది దాని  ప్రకృతి స్వభావం ద్వారా జరుగుతోంది. అదే విధంగా, భగవంతుడు ప్రసాదిస్తే మోక్షం సంభవించవచ్చు కూడా.  తిరస్కరించడానికి లేదా ఆహ్వానించడానికి మనకు ఎంపికే లేదు.  అతడి ప్రతిపాదనలను తప్పక అంగీకరించాలి. అయితే సర్వలోకపతి నిజదాస్యములో ఉండాలని కోరుకోవచ్చు.  అన్వయార్ధము: ఓ మనుష్యుడా, దివ్యము అసమానము అగు ప్రకృతి క్రమాన్ని అర్థం చేసుకొని, భగవంతుని సేవలో నిమగ్నం అవ్వు.

 

 

చరణం 3: పోయిన జన్మములలో మాటిమాటికి నేమేమిచేసితిమో సరి నెఱఁగుదుమా? అలాగే అటువంటివే యగు తరువాతి జన్మములలో యెఱుకలు మఱపులు యిఁకనేలా? నిరతరముగా శ్రీవేంకటేశుఁడు తన యిచ్చ నిర్మించినది ఈ దేహము. గౌరవం మరియు హుందాతనంతో ఆతని కైంకర్యమెపో కలకాలము మాకు శాశ్వత నివాసం. అన్వయార్ధము: ఓ మనుష్యుడా, తడబడకుండా, 'పర'లోకములో ప్రవేశించడానికి ఇష్టపూర్వకంగా ప్రభువుకు నిన్ను నీవు కైంకర్యము చేసుకో.

1 comment:

  1. చక్కగా విశదీకరించారు

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...